టీడీపీ ఫ్లెక్సీలతో ఎమ్మెల్యేలు, ఎంపీల హడావిడి
వీసీని విడిచిపెట్టేది లేదన్న ఎంపీ సీఎం రమేష్
సాక్షి, విశాఖపట్నం: ఐదేళ్ల కాలంలో.. దేశంలోనే నంబర్–3 విశ్వవిద్యాలయంగా పరిఢవిల్లిన ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది. రాజకీయాలకు దూరంగా.. విద్యార్థుల అభివృద్ధికి, యూనివర్సిటీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చేందుకు వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అడుగులు వేయగా.. టీడీపీ ప్రభుత్వం మాత్రం రాజకీయ కేంద్రంగా మార్చేసింది. టీడీపీ ఆధ్వర్యంలో ఏయూ వీసీ ప్రాంగణం వద్ద శనివారం నిర్వహించిన కార్యక్రమం ఏయూ చరిత్రలో మాయనిమచ్చగా నిలిచిపోతుంది. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ , ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, వెలగపూడి రామకృష్ణబాబు, వంశీకృష్ణ శ్రీనివాస్ ఏయూని సందర్శించారు.
టీడీపీ నేతలు, కార్యకర్తలు పెద్దఎత్తున విశ్వవిద్యాలయం వద్దకు చేరుకుని రాజకీయ కార్యాలయంగా మార్చేస్తూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. గుంపులుగా దూసుకొస్తూ.. రాజకీయ నినాదాలు చేస్తూ.. మాజీ వీసీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. టీడీపీ, జనసేన శ్రేణుల చర్యలతో యూనివర్సిటీ విద్యార్థులు, సిబ్బంది భయాందోళనలకు గురయ్యారు. ఏయూ వీసీ చాంబర్‌పైకెక్కి హడావిడి చేశారు. పోలీసులు నిలువరించినా పట్టించుకోకుండా యూనివర్సిటీలో ఆందోళనకర వాతావరణాన్ని సృష్టించారు.
ఈ సందర్భంగా ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ.. ఏయూ వీసీ వ్యవహారంపై విచారణ చేసి శిక్షించాలని గవర్నర్‌కు విజ్ఞప్తి చేశామన్నారు. రాజీనామా చేసినంత మాత్రాన ప్రసాదరెడ్డితో పాటు ఆయన అరాచకాల్లో భాగస్వామ్యులైన వారెవరినీ వదిలిపెట్టే సమస్యే లేదని వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, విద్యాశాఖ మంత్రి లోకేశ్ నేతృత్వంలో ఏయూలో విద్యా ప్రమాణాలు మెరుగుపరిచి పూర్వ వైభవం తీసుకొస్తామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment