సయోధ్యకే సర్కారు మొగ్గు
ఎగువ రాష్ట్రాలతో సాగునీటి పేచీలను సామరస్యంగా పరిష్కరించుకోవాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం
పెండింగ్ ప్రాజెక్టులపై చర్చలకు సుముఖం
నేడు మహారాష్ర్ట సర్కారుతో భేటీ కానున్న హరీశ్, జోగురామన్న
పలు అంశాల్లో పరస్పర సహకారంపై ఆశలు
హైదరాబాద్: సాగునీటి వ్యవహారాలకు సంబంధించి ఎగువ రాష్ట్రాలతో తెలంగాణ ప్రభుత్వం సయోధ్యను కోరుకుంటోంది. ఈ దిశగా ప్రయత్నాలు కూడా మొదలుపెట్టింది. పరస్పర చర్చల ద్వారా పరిష్కారమయ్యే చిన్న విషయాలపైనా ఎగువ రాష్ట్రాలతో ఘర్షణాత్మక వైఖరి సరికాదని రాష్ర్ట ప్రభుత్వం భావిస్తోంది. చిన్న సమస్యలపై ఇచ్చిపుచ్చుకునే ధోరణితో వ్యవహరిస్తే.. ప్రాజెక్టులకు కేంద్ర అనుమతులు, నదీ జలాల పంపిణీ వంటి క్లిష్ట సమస్యల విషయంలో ఆ రాష్ట్రాల సహకారాన్ని పొందవచ్చని విశ్వసిస్తోంది. ప్రస్తుతం జూరాల కేంద్రంగా రాష్ర్టం ప్రతిపాదిస్తున్న జూరాల-పాకాల, పాలమూరు ఎత్తిపోతల వంటి ప్రాజెక్టులకు కర్ణాటక సహకారం, అలాగే జాతీయ ప్రాజెక్టుగా చేపట్టాలని కోరుతున్న ప్రాణహిత-చేవెళ్లకు మహారాష్ట్ర సహకారం అవసరం. ఈ ప్రాజెక్టు విషయంలో తలెత్తే ముంపు సమస్య విషయంలో మహారాష్ర్ట నుంచి, కృష్ణా ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులకు సంబంధించి కర్ణాటక నుంచి సానుకూల ధోరణిని తెలంగాణ ప్రభుత్వం ఆశిస్తోంది. ఈ నేపథ్యంలో.. నీటి విడుదల, బాబ్లీ వంటి అక్రమ ప్రాజెక్టులు, నదీ జలాల కేటాయింపులు, పాత ట్రిబ్యునళ్ల అవార్డులపై అభ్యంతరాలు వంటి చిక్కులను పక్కనబెడితే... మిగతా చిన్న చిన్న పేచీల విషయంలో మాత్రం ఎగువ రాష్ట్రాలతో సామరస్యంగా మెలిగి వాటిని పరిష్కరించుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించారు.
మహారాష్ట్రతో చర్చలు!
మహారాష్ట్రతో కలిసి అంతర్రాష్ట్ర ప్రాజెక్టుగా ముద్కేడ్ ప్రాం తంలో చేపట్టే లెండి ప్రాజెక్టు ద్వారా 6.36 టీఎంసీల నీటిని వాడుకోవచ్చు. ఇందులో 2.34 టీఎంసీలను తెలంగాణ వాడుకోవాలి. దీని అంచనా వ్యయం రూ. 800 కోట్లు దాటుతోంది. నీటి వాటాను బట్టి ఇరు రాష్ట్రాలూ నిధులు వెచ్చిం చాల్సి ఉంటుంది. దీని ప్రగతిపై సమీక్షతోపాటు ఇతర అంశాలపై మహారాష్ర్ట ప్రభుత్వంతో చర్చించేందుకు తెలంగాణ సర్కారు సిద్ధమైంది. ముఖ్యంగా 5.11టీఎంసీలు వాడుకునే వీలున్న పెన్‌గంగ ప్రాజెక్టు విషయంలో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి లేదు. దీనికి అడ్డంకిగా మారిన అంశాలపై ఎగువ రాష్ర్టంతో చర్చించాలని భావిస్తోంది. అలాగే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు వల్ల మహారాష్ట్రలో ముంపునకు గురయ్యే ప్రాంతాల్లో ఆ రాష్ర్ట ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించి కేంద్రానికి నివేదిక పంపిం చాల్సి ఉంది. దీన్ని కేంద్రమే చేపట్టే పక్షంలో పునర్నిర్మాణం, పునరావాసం పెద్దగా ప్రతిబంధకం కాబోదని, ఈ విషయంలో తామూ ఉదారంగా వ్యవహరిస్తామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఈ విషయాన్ని కూడా మహారాష్ర్టతో చర్చించడానికి అంతర్రాష్ట్ర వివాదాల విభాగం ఉన్నతాధికారులతోపాటు సాగునీటి మంత్రి హరీశ్‌రావు, అటవీ మంత్రి జోగురామన్న బుధవారం మహారాష్ట్రకు వెళ్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ఆ రాష్ట్ర సాగునీటి శాఖ మంత్రి హసన్ మిశ్రీతో సమావేశం కానున్నారు. పలు అటవీ అనుమతులపై చర్చిం చడానికి ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎంతోనూ భేటీకి అపాయింట్‌మెంట్ కోసం ప్రయత్నిస్తున్నట్లు తెలిసింది. కాగా, వివాదాస్పద బాబ్లీ ప్రాజెక్టు విషయంలో మాత్రం ప్రస్తుతానికి రాష్ర్ట ప్రభుత్వం మౌనాన్నే ఆశ్రయిస్తోంది.
కర్ణాటకతోనూ సఖ్యత: ఇటు రాజోలిబండ డైవర్షన్ (ఆర్‌డీఎస్) పనులకు సంబంధించి ఆరేడేళ్ల క్రితమే అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కర్ణాటకకు డబ్బు చెల్లించింది. కానీ ఆ పనుల వల్ల తమ ప్రాంతానికి రావల్సిన నీరు త గ్గిపోతుందంటూ కర్నూలు ప్రాంత రైతులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రాంత రైతులేమో పనుల కోసం ఒత్తిడి తీసుకొస్తున్నారు. ఈ పనులపై తాత్సారం పనికిరాదని, పోలీసు రక్షణలో పనులు చేపట్టాలని, తమ ప్రభుత్వం కూడా ఈ పనులకు సహకరిస్తుందని కర్ణాటక ప్రభుత్వానికి ఇటీవలే తెలంగాణ సర్కారు లేఖ రాసింది. దీంతో ఆ రాష్ర్ట ప్రభుత్వం పోలీసులను కూడా నియమించింది. అయితే కర్నూలు రైతుల నుంచి ప్రతిఘటన తగ్గడం లేదు. దీంతో ఈ వ్యవహారం తెలంగాణ, ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాల నడుమ వివాదంగా మారుతోంది. అయితే కర్ణాటక స్పందనతో తెలంగాణ ప్రభుత్వం సంతృప్తి వ్యక్తం చేస్తోంది. ఆ రాష్ర్టంతోనూ సఖ్యతగా ఉండేందుకు ప్రయత్నిస్తోంది. 264 మెగావాట్ల జూరాల జల విద్యుత్ కేంద్రంలో చెరిసగం వాటాలను పంచుకునేలా రాష్ట్ర విభ జన ప్రక్రియ సమయంలోనే కర్ణాటకతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. అయితే తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక దాన్ని తిరగదోడే ప్రయత్నం చేయకపోవడం గమనార్హం.