ఎంఎంటీఎస్ రెండో దశకు అడ్డంకులు తొలగించాలి
- నిలిచిన సనత్‌నగర్-మౌలాలి రైల్వే లైను డబ్లింగ్ పనులు
- పెండింగ్ ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక
సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్‌పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) రెండో దశ అమలులో జాప్యంపై రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2012-13 లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ క్రియాశీలకం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నివేదిక సమర్పించింది. 2012-13లో రూ.272 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించగా గత మార్చి నెలాఖరు వరకూ రూ. 58.30 కోట్ల మేరకు వ్యయం చేశారు.
అయితే ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉన్న సనత్‌నగర్-మౌలాలి మధ్య 21.5 కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్ పనులు నవంబర్ 2014 నుంచి నిలిచిపోయాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ఒకప్పటి రైఫిల్ రేంజ్‌లో ఉన్న 4 కిలోమీటర్ల మేరకు పనులను రక్షణ శాఖ అధికారులు నిలిపివేశారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు అనువుగా ప్రత్యామ్నాయంగా రైఫిల్ రేంజ్ ఏర్పాటు కోసం రూ.1.18 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 1979 లోనే రైల్వే మంత్రిత్వ శాఖ అందించింది. అయితే 1990 లో 37 ఎకరాల 32 కుంటల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారని, అందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అంగీకరించ లేదని.. అంతేకాకుండా గత 35 సంవత్సరాలుగా రైఫిల్ రేంజ్ వాడుకలో లేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది.
ఈ సమస్యపై గత జూలై 15 వ తేదీన రక్షణ శాఖ మంత్రితో రైల్వే శాఖ మంత్రి చర్చించారని, నిలిచిపోయిన పనులను ప్రారంభించడానికి అనుమతించాలని ఒక లేఖ కూడా రాశారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ ఎప్పటికల్లా పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు అందించిన సమాచారం వల్ల అర్థమవుతోందని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి చర్చలు జరిగాయని, అందువల్ల ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగం చొరవ తీసుకొని ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రతిబంధకాలు తొలగించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది.