Ministry of Railways
-
Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ ఇకపై 60 రోజులే
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనలను భారతీయ రైల్వే మార్చింది. ప్రస్తుతం నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. దీన్ని 60 రోజులకు కుదించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని 60 రోజులకు తగ్గిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకు ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 120 రోజులు కాగా, ఇప్పుడు అది 60 రోజులకు తగ్గింది. ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి బుక్ చేసుకొనే టికెట్లపై అమలుకానుంది. ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి షార్ట్ రూట్ రైళ్లకు ఈ నిర్ణయం వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో విదేశీ పర్యాటకులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. రిజర్వు టికెట్లు అధికంగా రద్దు అవుతుండటం, ప్రయాణికులు రాక సీట్లు, బెర్తులు ఖాళీగా ఉండిపోతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ కాలపరిమితిని తగ్గించామని రైల్వే పేర్కొంది. ప్రస్తుతం కాన్సిలేషన్స్ 21 శాతం ఉంటున్నాయని, 4–5 శాతం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నా.. ప్రయాణం చేయడం లేదని వివరించింది. దీనివల్ల దళారులు సీట్లను అమ్ముకుంటున్నారని, రైల్వే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికే అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితిని 120 నుంచి 60 రోజులకు కుదించామని తెలిపింది. -
రక్షణకు రూ.6.21లక్షల కోట్లు
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం 2024–25 బడ్జెట్లో రక్షణ శాఖకు కేటాయింపులను గత ఏడాది కంటే స్వల్పంగా పెంచింది. 2023–24 బడ్జెట్లో రూ.5.94 లక్షల కోట్లు కేటాయించగా ఇప్పుడు రూ.6.21 లక్షల కోట్లు కేటాయించారు. మిలిటరీ కేపిటల్ వ్యయం కింద పెద్ద ఎత్తున కొత్త ఆయుధాలు, విమానాలు, యుద్ధ ఓడల కొనుగోలు కోసం రక్షణ శాఖకు రూ. 1.72 లక్షల కోట్లు కేటాయించారు. ఈ కేటాయింపు గత ఏడాది 1.62 లక్షల కోట్లుగా ఉంది. మిలిటరీ అవసరాల కోసం అత్యాధునిక సాంకేతికను సమకూర్చుకునేందుకు ‘ఆత్మ నిర్భరత’ను వేగవంతం చేయనున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో ప్రకటించారు. మొత్తం రెవెన్యూ వ్యయం రూ.4,39,300 కోట్లు కాగా, ఇందులో రక్షణ శాఖ పింఛన్లకు 1,41,205 కోట్లు, రక్షణ సర్విసులకు 2,82,772 కోట్లు, రక్షణ మంత్రిత్వ శాఖ (సివిల్)కు రూ.15,322 కోట్లు కేటాయించారు. విమానాలు, ఏరో ఇంజిన్ల కోసం రూ. 40,777 కోట్లు, ఇతర పరికరాల కోసం 62,343 కోట్లను కేటాయించారు. నేవీ వాహనాల కోసం రూ.23,800 కోట్లు, డాక్‌యార్డ్ ప్రాజెక్టుల కోసం రూ.6,830 కోట్లు కేటాయించారు. రెవెన్యూ వ్యయం కోసం ఆర్మికి రూ.1,92,680 కోట్లు, నేవీకి రూ.32,778 కోట్లు, భారత వాయుసేనకు రూ. 46,223 కోట్లు కేటాయించారు. మొత్తమ్మీద రక్షణ శాఖకు ఈసారి కేటాయింపులు స్వల్పంగానే పెరిగాయని, ఇది మిలిటరీపై ప్రభుత్వ ప్రాధాన్యతను తెలియజేస్తుందని జాతీయ భద్రత అధ్యయన కేంద్రంలోని అసోసియేట్ ప్రొఫెసర్డాక్టర్ లక్ష్మణ్ కుమార్ బెహెరా చెప్పారు.కేపిటల్ వ్యయం కోసం రూ.10వేలకోట్లను పెంచడాన్ని ఆరోగ్యకరసంకేతంగానే భావించాలన్నారు. హోంశాఖ 2 లక్షల కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖకు 2024–25 మధ్యంతర బడ్జెట్లో అంతర్గత, సరిహద్దు భద్రతకు ప్రాధాన్యమిస్తూ రూ. 2,02,868.70 కోట్లు కేటాయించారు. అమిత్‌షా నేతృత్వంలోని ఈ శాఖకు 2023–24లో రూ.1,96,034.91 కోట్లను కేటాయించారు. ఈసారి బడ్జెట్లో అత్యధిక నిధులను కేంద్ర బలగాలైన సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్కు ఇచ్చారు. పారామిలిటరీ బలగాల కిందకు వచ్చే పోలీసులకు రూ. 1,32,345.47 కోట్లను, కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూకశ్మీర్‌కు 37,277.74 కోట్లను కేటాయించారు. లద్దాఖ్‌కు రూ.5,958 కోట్లు, అండమాన్ నికోబార్ దీవులకు రూ. 5,866.37 కోట్లు, చండీగఢ్‌కు రూ. 5,862.62 కోట్లు, పుదుచ్చేరికి 3269 కోట్లు, దాద్రా నగర్ హవేలి–డామన్ డయ్యూకు 2,648.97 కోట్లు, లక్షదీ్వప్కు 1,490.10 కోట్లు, ఢిల్లీకి 1,168.01 కోట్లు కేటాయించారు. మంత్రిమండలి, కేబినెట్ సెక్రటేరియట్, పీఎంఓ ఖర్చుల కోసం 1,248.91 కోట్లు ఇచ్చారు. 2023–24 బడ్జెట్లో పారామిలిటరీ బలగాలైన సీఆర్పీఎఫ్కు 32,809.65 కోట్లు కేటాయించగా, సవరించిన అంచనాల మేరకు 31,389.04 కోట్లు ఇచ్చారు.ఇంటెలిజెన్స్ బ్యూరోకు రూ.3,195.09 కోట్లు (2023–24లో 3,268.94 కోట్లు), వామపక్ష ప్రభావిత ప్రాంతాలకు ప్రత్యేక మౌలిక సదుపాయాల పథకం కింద 3,199.62 కోట్లు, సరిహద్దు ప్రాంత అభివృద్ధి కార్యక్రమాల కోసం 335 కోట్లు, సేఫ్ సిటీ ప్రాజెక్టుల కోసం 214.44 కోట్లు, ల్యాండ్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాకు రూ.330 కోట్లు కేటాయించారు. రైల్వే కారిడార్లకు గ్రీన్ లైట్ 2.52లక్షల కోట్ల రూపాయలతో రైలు బడ్జెట్ కూత ♦ 3 మల్టీ మోడల్ ఆర్థిక కారిడార్లతో కొత్తగా 40,000 కి.మీ.ట్రాక్‌ల నిర్మాణం ♦ దూసుకెళ్లనున్న సరుకు రవాణా ♦ తీరనున్న టికెట్ వెయిటింగ్ కష్టాలు.. ♦ ప్రయాణికులకు ఊరట వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా 40 వేల సాధారణ బోగీల మార్పు న్యూఢిల్లీ: సరుకు రవాణాను సులభతరం చేస్తూ బడ్జెట్లో ప్రకటించిన మూడు మల్టీ మోడల్ ఆర్థిక కారిడార్ల నిర్మాణంతో రైలు ప్రయాణికుల టికెట్ వెయిటింగ్ లిస్ట్ కష్టాలు తీరనున్నట్లు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ చెప్పారు. రైల్వేల సరుకు రవాణా సామర్థ్యాన్ని మెరుగుపరచి జీడీపీ వృద్ధి రేటును పరుగులు తీయించేందుకు ప్రత్యేకంగా మూడు ఆర్థిక కారిడార్లను నెలకొల్పనున్నట్లు బడ్జెట్లో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇంధనం, ఖనిజాలు, సిమెంట్ కారిడార్లు, పోర్టు కనెక్టివిటీ కారిడార్లు, అధిక రద్దీ సాంద్రత కారిడార్లు ఇందులో ఉంటాయి. ఈ ఏడాది బడ్జెట్లో రైల్వే శాఖకు రూ.2.52 లక్షల కోట్లు కేటాయించారు. బడ్జెట్ కేటాయింపులపై రైల్వే మంత్రి అశ్వని కుమార్ గురువారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ ఆర్థిక కారిడార్లలో భాగంగా కొత్తగా 40,000 కి.మీ. మేర రైల్వే ట్రాక్‌ల నిర్మాణాన్ని చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇది నెట్వర్క్ సామర్థ్యాన్ని పెంచడంతోపాటు 2030–31 నాటికి ప్రయాణికులకు టికెట్ వెయిటింగ్ ఇబ్బందులను తొలగిస్తుందన్నారు. మూడు కారిడార్లపై బడ్జెట్లో ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లు చెప్పారు. ఇవి కేవలం సరుకు రవాణా కోసం మాత్రమే కాకుండా మల్టీ మోడల్ కారిడార్ల మాదిరిగా పని చేస్తాయన్నారు. ప్రత్యేక కారిడార్లలో భాగంగా 434 ప్రాజెక్టులను సుమారు రూ.11 లక్షల కోట్ల వ్యయంతో చేపడుతున్నట్లు తెలిపారు. 40 వేల బోగీలు ఇక ‘వందే భారత్’ దేశంలో 40,000 సాధారణ రైలు బోగీలను వందే భారత్ ప్రమాణాలకు అనుగుణంగా ఆధునీకరించనున్నట్లు బడ్జెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ప్రయాణికుల భద్రత, సదుపాయాలు, సౌకర్యాలను పెంపొందించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు. వందే భారత్, అమృత్ భారత్ రైళ్లు విజయవంతం కావడం ఇతర బోగీలను సైతం ఆధునీకరించాల్సిన అవసరాన్ని వెల్లడించిందని రైల్వే మంత్రి అశ్వనీ కుమార్ పేర్కొన్నారు. ‘మన వద్ద దాదాపు 40,000 సంప్రదాయ బోగీలున్నాయి. వీటిని ఆధునీకరించవచ్చు. రైల్వేల సామర్థ్యాన్ని పెంపొందించడంపై ప్రభుత్వం దృష్టి సారించింది. గతేడాది రైల్వేలు 5,200 కి.మీ. మేర నూతన మార్గాన్ని అందుబాటులోకి తెచ్చాయి. ఇది మొత్తం స్విట్జర్లాండ్ నెట్వర్క్ పరిమాణంతో సమానం. ఈ ఏడాది మరో 5,500 కి.మీ. నిర్మాణం జరుగుతుంది. 2014లో రోజుకు కేవలం నాలుగు కి.మీ. నుంచి ఇప్పుడు 15 కి.మీ. మేర కొత్త ట్రాక్‌లను నిర్మిస్తున్నాం. నెట్వర్క్ ఏర్పాటులో ఇది గణనీయమైన పురోభివృద్ధి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో జనవరి నాటికి మూలధన వ్యయంలో రైల్వేలు 82 శాతం ఆర్జించాయి’ అని అశ్వనీ కుమార్ తెలిపారు. అమృత చతుర్భుజం.. ‘ప్రధానంగా ఇంధనం, లోహాలు, సిమెంట్ కారిడార్లు రహదారులపై కాలుష్యాన్ని తగ్గిస్తాయి. సరుకు రవాణా చౌకగా జరుగుతుంది. ఓడ రేవులతో రైలు మార్గం అనుసంధానం కూడా అవుతుంది’ అని రైల్వే మంత్రి చెప్పారు. మూడో కారిడార్‌ను అమృత చతుర్భుజంగా అభివర్ణించారు. ‘రైల్వే ట్రాఫిక్ సాంద్రత అధికంగా ఉండే రూట్లలో అమృత చతుర్భుజం ఏర్పాటవుతుంది. రానున్న 6 నుంచి 8 సంవత్సరాలలో మూడు కారిడార్ల ద్వారా మొత్తంగా దాదాపు 40 వేల కి.మీ. మేర కొత్తగా రైల్వే ట్రాక్‌లను నిర్మిస్తాం. దీనిద్వారా రైల్వేల సామర్థ్యం గణనీయంగా పెరుగుతుంది. మన ఆర్థిక వ్యవస్థలో ఇది విప్లవాత్మక మార్పు తెస్తుంది. అంతేకాకుండా ఇది 90 శాతం కర్బన ఉద్గారాలను తగ్గిస్తుంది. రైల్వేలు అత్యంత కాలుష్య రహిత రవాణా మార్గాలు. ఇతర మార్గాలతో పోలిస్తే రైలు రవాణా 40 – 50 శాతం చౌక’ అని అశ్వనీ కుమార్ తెలిపారు. విదేశాంగ శాఖకురూ. 22,154 కోట్లు న్యూఢిల్లీ: కేంద్ర మధ్యంతర బడ్జెట్లో విదేశాంగ శాఖకు రూ. 22,154 కోట్లు కేటాయించారు. గతేడాది 18,050 కోట్లు ఇవ్వగా.. 2024–25 బడ్జెట్లో రూ. 4,104 కోట్లు పెంచి ఇచ్చారు. ఇక పొరుగుకు మొదట (నైబర్‌హుడ్ ఫస్ట్) పాలసీకింద ఎక్కువ సాయాన్ని భూటాన్ అందుకోనుంది. ఈ దేశానికి ఈ బడ్జెట్లో రూ. 2,068 కోట్లు సాయాన్ని ప్రతిపాదించారు. గతేడాది బడ్జెట్లో ఈ హిమాలయ దేశానికి రూ. 2,400 కోట్లు ఇచ్చారు. ఇరాన్‌తో సంబంధాలు కొనసాగించడానికి గాను ఆ దేశంలోని చబహర్ పోర్టుకు రూ. 100 కోట్లు కేటాయించారు. ఇక మాల్దీవులకు అభివృద్ధి సాయంలో గతేడాది కంటే రూ. 170 కోట్లు తగ్గించి ఈ బడ్జెట్లో రూ. 600 కోట్లు కేటాయించారు. అఫ్గానిస్తాన్‌కు రూ. 200 కోట్లు, బంగ్లాదేశ్‌కు రూ. 120 కోట్లు, నేపాల్‌కు రూ. 700 కోట్లు, శ్రీలంకకు రూ. 75 కోట్లు, మారిషస్‌కు రూ. 370 కోట్లు, మయన్మార్‌కు రూ. 250 కోట్లు అభివృద్ధి సాయం ప్రతిపాదించారు. ఆఫ్రికా దేశాల కోసం ప్రత్యేకంగా రూ. 200 కోట్లు ప్రకటించారు. లాటిన్ అమెరికా, యురేసియా ప్రాంతాల్లోని దేశాలకు అభివృద్ధి సాయంగా రూ. 4,883 కోట్లు బడ్జెట్లో కేటాయించారు. ఐఎంఈసీ ఓ గేమ్ చేంజర్ బడ్జెట్ సందర్భంగా నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ.. వ్యూహాత్మంగా, ఆర్థిక పరంగా భారత్ ఇతర దేశాలకు ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ) ఓ గేమ్ చేంజర్ అని చెప్పారు. ప్రపంచ వాణిజ్యానికి ఈ కారిడార్ వందల ఏళ్ల పాటు ఆధారభూతంగా ఉంటుందని అన్నారు. భారత నేలపై నుంచి ఈ కారిడార్ ప్రారంభమైందనే విషయం చరిత్ర గుర్తుపెట్టుకుంటుందని చెప్పారు. జనగణన, ఎన్పీఆర్కు రూ. 1,277 కోట్లు న్యూఢిల్లీ: 2024–25 మధ్యంతర బడ్జెట్లో జనాభా గణన, ఎన్పీఆర్ కోసం రూ.1,277.80 కోట్లు కేటాయించారు. దీంతో ఈ ఏడాది కూడా జనాభా లెక్కించే అవకాశం లేదని సంకేతాన్నిచ్చినట్లైంది. జనాభా లెక్కలు, ఎన్పీఆర్ల కోసం ప్రభుత్వానికి రూ.12,000 కోట్లకు పైగా ఖర్చు అయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. డిసెంబర్ 24, 2019న జరిగిన కేంద్ర మంత్రివర్గం సమావేశం రూ.8,754.23 కోట్ల వ్యయంతో జనాభా గణన–2021, రూ.3,941.35 కోట్ల వ్యయంతో జాతీయ జనాభా రిజిస్టర్ (ఎన్పీఆర్) ప్రతిపాదనను ఆమోదించింది. 2020, ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2020 వరకు దేశవ్యాప్తంగా జనాభా గణన, ఎన్పీఆర్ను అప్డేట్ చేయడానికి సంబంధించిన హౌస్ లిస్టింగ్ దశ షెడ్యూల్ చేసింది. అయితే కోవిడ్–19 వ్యాప్తి కారణంగా దీన్ని వాయిదా వేశారు. ఈ ఏడాది సార్వత్రిక ఎన్నికల జరిగే నేపథ్యంలో 2024లో జనాభా గణన చేపట్టే అవకాశం లేదని అధికారులు వెల్లడించారు. ప్రభుత్వ ఎన్యుమరేటర్ల ద్వారా కాకుండా సొంతంగా జనాభా గణన ఫారమ్‌ను పూరించే హక్కును వినియోగించుకోవాలనుకునే పౌరులకు ఎన్పీఆర్ను తప్పనిసరి చేశారు. ఇందుకు సెన్సస్ అథారిటీ స్వీయ గణన పోర్టల్‌ను రూపొందించగా.. అది ఇంకా ప్రారంభం కాలేదు. స్వీయ–గణన సమయంలో, ఆధార్ లేదా మొబైల్ నంబర్ తప్పనిసరిగా సేకరిస్తారు. తెలంగాణకురూ. 5,071 కోట్లు సాక్షి, న్యూఢిల్లీ: రైల్వేల అభివృద్ధి నిమిత్తం తాజా బడ్జెట్లో తెలంగాణకు రూ.5,071 కోట్లు కేటాయిచినట్లు రైల్వే మంత్రి అశ్వనీ వైష్ణవ్ తెలిపారు. 2009–14 కాలంతో పోలిస్తే 2023–24 నాటికి పదేళ్లలో కేటాయింపులు పది రెట్లు పెరిగాయన్నారు. రాష్ట్రంలో రైల్వేల్లో పెట్టుబడులు కూడా గణనీయంగా పెరిగినట్లు చెప్పారు.. ఆంధ్రప్రదేశ్‌కు రూ.9,138 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. 2009–14 కాలంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కు రూ.889 కోట్లు కేటాయించినట్లు వివరించారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీకి ప్రధాని మోదీ శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తుచేసిన కేంద్రమంత్రి.. పనులు సాగుతున్నాయన్నారు. గురువారం పార్లమెంటులో కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 2024–25 మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత రైల్ భవన్లో అశ్విని వైష్ణవ్ మీడియాతో మాట్లాడారు. నూతన ట్రాక్ నిర్మాణం 2009–14 మధ్య సగటున ఏడాదికి 17 కి.మీ. మేర జరిగితే, 2014–24 మధ్య 69 కి.మీ. మేర జరిగిందన్నారు. 2024–25లో 142 కి.మీ. ట్రాక్ నిర్మాణం లక్ష్యంగా పెట్టుకున్నట్లు వెల్లడించారు. 2009–14 కాలంలో సగటున ఏడాదికి 41 కి.మీ. మేర విద్యుదీకరణ జరిగితే 2014–24 మధ్య 116 కి.మీ. చేసినట్లు తెలిపారు. 2023–24లో 100% విద్యుదీకరణ పూర్తయిందని అశ్విని వైష్ణవ్ చెప్పారు. రూ.31,221 కోట్ల విలువతో 2,338 కి.మీ. మేర 14 ప్రాజెక్టుల (నూతన ట్రాక్)కు సంబంధించి పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. రైల్వే స్టేషన్లలో ప్రయాణికుల సౌకర్యార్ధం 40 ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, 53 లిఫ్టులు, 27 ఎస్కలేటర్లు ఏర్పాటు చేశామన్నారు. రాష్ట్రంలో 40 స్టేషన్లను అమృత్ స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్లు అశ్విని వైష్ణవ్ వివరించారు. సీబీఐకి రూ.928.46 కోట్లు న్యూఢిల్లీ: 2024–25 కేంద్ర మధ్యంతర బడ్జెట్లో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కి రూ.928.46 కోట్లు కేటాయించినట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. ఇది గతేడాది కంటే రూ.40.4 కోట్లు తక్కువ. సీబీఐ శిక్షణా కేంద్రాల ఆధునీకరణ, టెక్నికల్, ఫోరెన్సిక్ సపోర్ట్ యూనిట్ల ఏర్పాటు, సమగ్ర ఆధునీకరణ, భూమి కొనుగోలు, ఏజెన్సీకి కార్యాలయాలు, నివాస భవనాల నిర్మాణం వంటి పలు ప్రాజెక్టులకు కేటాయింపులు కూడా ఉన్నాయని పేర్కొన్నారు. దేశంలోని ప్రధాన దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ.. బ్యాంకురుణ మోసాలు, విదేశాల్లోని కోర్టులలో కొనసాగుతున్న ఉన్నత స్థాయి కేసులతో పాటు కృత్రిమ మేధస్సు, క్రిప్టోకరెన్సీ, డార్క్నెట్ల ఆధిపత్యంతో అభివృద్ధిచెందుతున్న నేరాలను పరిష్కరిస్తుంది.ఇది పలు రాష్ట్రాలు, హైకోర్టులు,సుప్రీంకోర్టు అప్పగించిన క్రిమినల్ కేసులను కూడా డీల్ చేస్తుంది. ‘ఈ–కోర్టు’కు 825 కోట్లు న్యూఢిల్లీ: దిగువ న్యాయవ్యవస్థలోమౌలిక సదుపాయాలను ఆధునీకరించేందుకు, కేసుల వివరాలను కంప్యూటర్లో డిజిటల్ రూపంలో పొందుపరిచేందుకు రూపొందిస్తోన్న ప్రతిష్టాత్మక ఈ–కోర్ట్ ప్రాజెక్ట్ 3వ దశకోసం బడ్జెట్లో ఈ ఆర్థిక సంవత్సరం రూ. 825 కోట్లు కేటాయించారు. అలాగే వచ్చే ఆర్థిక సంవత్సరానికి రూ. 1,500 కోట్లు పెంచాలని ప్రతిపాదించారు. గత ఏడాది సెపె్టంబర్లో ఈ ప్రాజెక్టు రూ.7,210 కోట్ల ఆర్థిక వ్యయంతో కేబినెట్ ఆమోదం పొందిన విషయంతెలిసిందే. 2024–25 బడ్జెట్లో ఈప్రాజెక్టుకు రూ.1,500 కోట్లు కేటాయించాలని కూడా తాజా అంచనాలురూపొందించారు. 4 సంవత్సరాలలోపూర్తవుతుందని భావిస్తున్న ఈ ప్రాజెక్టులో కోర్టు రికార్డులు, వారసత్వ కేసులు,పెండింగ్ కేసులు అన్నింటినీ డిజిటల్ రూపంలో చేస్తారు. 3,108 కోట్లపత్రాలను డిజిటలైజ్ చేసేందుకు రూ. 2,038.40 కోట్లు అవుతుందని అంచనా. 25 పెటా బైట్ల స్టోరేజీతో క్లౌడ్ టెక్నాలజీ సాంకేతికతను ఈ వ్యవస్థకోసం ఉపయోగించడం గొప్ప అడుగుగా ప్రభుత్వం అభివర్ణించింది. దీనికి సంబంధించిన హార్డ్ వేర్‌ను రాష్ట్రాలకు కేంద్రమే అందిస్తుంది. కేంద్రం, రాష్ట్రాలు, 25 రాష్ట్రాల హైకోర్టులతో ఒక త్రైపాక్షిక ఒప్పందంజరుగుతుంది. -
రబ్రీ దేవికి ఢిల్లీ కోర్టు నోటీసులు
న్యూఢిల్లీ: రైల్వేశాఖలో ల్యాండ్ ఫర్ జాబ్స్ కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై ఢిల్లీ కోర్టు బిహార్ మాజీ సీఎం రబ్రీ దేవి, ఆమె కూతుళ్లు మిసా భారతి, హేమా యాదవ్‌లకు సమన్లు జారీ చేసింది. ఫిబ్రవరి 9వ తేదీన కోర్టులో విచారణకు రావాలంటూ స్పెషల్ కోర్టు జడ్జి విశాల్ శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) వేసిన చార్జిషీటులో ఆరోపణలకు తగు ఆధారాలున్నాయని భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కేసుకు సంబంధించి గత ఏడాది నవంబర్ నుంచి జ్యుడీషియల్ కస్టడీలో ఉన్న వ్యాపారవేత్త అమిత్ కట్యాల్‌ను సైతం తమ ముందు హాజరుపరచాలని ఆదేశించారు. -
ఏపీలో వన్ స్టేషన్.. వన్ ప్రొడక్ట్
రైల్వేస్టేషన్ (విజయవాడపశ్చిమ): స్థానిక ఉత్పత్తులను ప్రోత్సహించే లక్ష్యంతో రైల్వే మంత్రిత్వశాఖ వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ పథకాన్ని ప్రవేశపెట్టింది. అందులో భాగంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 35 రైల్వే స్టేషన్లలో 37 వన్ స్టేషన్–వన్ ప్రొడక్ట్ అవుట్లెట్లు ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. రాష్ట్రంలో విజయవాడ స్టేషన్‌తో పాటుగా నెల్లూరు, రాజమండ్రి, ఏలూరు, ఒంగోలు, గుడివాడ తదితర ప్రధాన స్టేషన్లలో ఏర్పాటు చేసిన అవుట్లెట్ స్టాల్స్ ద్వారా స్థానిక చేతి వృత్తుల వారి జీవనోపాధి, సంక్షేమానికి ప్రధాన ప్రోత్సాహం క ల్పించారు. సంప్రదాయ కలంకారి చీరలు, జనపనార ఉత్పత్తులు, అనుకరణ ఆభరణాలు, చెక్క హస్తకళలు, గిరిజన ఉత్పత్తులు, ఊరగాయలు, మసాలా పొడులు, అప్పడాలు వంటి స్థానిక వంటకాలు, షేల్ పెయింటింగ్స్, రైస్ ఆర్ట్స్ తదితర ఉత్పత్తులకు ప్రయాణికుల నుంచి విశేష స్పందన లభిస్తుందన్నారు. దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించేందుకు రైల్వే స్టేషన్లు అనుకూలమైన స్థలమని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ తెలిపారు. -
ప్రైవేటు చేతికి ‘భారత్ గౌరవ్’
సాక్షి, హైదరాబాద్: రైల్వే మంత్రిత్వ శాఖ మార్గదర్శకాలకు అనుగుణంగా ‘భారత్ గౌరవ్’ పేరిట ఇతివృత్త ఆధారిత పర్యాటక సర్క్యూట్ రైళ్లను ప్రవేశపెట్టాలని దక్షిణ మధ్య రైల్వే (ఎస్సీఆర్) నిర్ణయించిం ది. ఈ రైళ్లను నడిపించే అవకాశాన్ని ప్రైవేట్ సంస్థ లకు అప్పగించనుంది. భారత దేశ సాంస్క్రతిక, వారసత్వ సంపదగా చెప్పుకొనే చారిత్రక ప్రదేశాలు, ముఖ్యమైన యాత్ర స్థలాల ప్రాధాన్యతను ప్రపంచానికి తెలియజేయాలనే లక్ష్యంతో ఈ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఎస్సీఆర్ వర్గాలు తెలిపాయి. అదే సమయంలో రైలు ప్రయాణికులకు చారిత్రక ప్రదేశాల సందర్శనకు అవకాశం కల్పించడంతో పాటు దేశ పర్యాటక రంగం అభివృద్ధికి కూడా తోడ్పాటును అందించినట్లవుతుందని పేర్కొన్నాయి. కాగా ‘భారత్ గౌరవ్’ రైళ్ల నిర్వహణలో ప్రైవేట్ సంస్థలకు దర్శనీయ స్థలాల ఎంపిక, చార్జీల నిర్ణయం వంటి అంశాలపై పూర్తి స్వేచ్ఛ ఇవ్వనున్నట్లు రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ సర్క్యూట్ రైళ్లు నడిపేందుకు ఆసక్తిగలవారు ఆన్లైన్లో దరఖాస్తు కోసం నమోదు చేసుకోవలసి ఉంటుంది. వచ్చే 10 పని దినాలలో ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది. కనీసం 14, గరిష్టంగా 20 కోచ్‌లు నమోదు చేసుకున్న సర్వీసు ప్రొవైడర్లు వారికి కావాల్సిన విధంగా రేక్ (రైలు బోగీ) కూర్పు (కనీసం 14 కోచ్‌లు, గరిష్టంగా 20 కోచ్‌లు)ను ఎంపిక చేసుకునే అవకాశముంది. రైల్వే వారి మౌలిక సదుపాయాలను, రోలింగ్ స్టాక్ (రైల్వే వాహనాలు)ను వినియోగించుకునేందుకు నిబంధనల ప్రకారం ‘రైట్ టు యూజ్’ చార్జీలు, స్థిర, చర వాణిజ్య సరుకు రవాణా (ఫిక్స్డ్, వేరియబుల్ హాలేజ్) చార్జీలు, స్టాబ్లింగ్ (సరుకు నిల్వ) చార్జీలు వంటివి విధిస్తామని రైల్వే వర్గాలు తెలిపాయి. ఈ రైళ్లను మెయిల్/ఎక్స్‌ప్రెస్ రైళ్లతో సమానంగా పరిగణిస్తారని పేర్కొన్నారు. ఆసక్తిగల సర్వీసు ప్రొవైడర్లు దీనికి సంబంధించిన ఇతర వివరాల కోసం రైల్ నిలయం కార్యాలయంలో దక్షిణ మధ్య రైల్వే చీఫ్ కమర్షియల్ మేనేజర్ (ప్రయాణికుల సేవలు) ఆర్.సుదర్శన్‌ను సంప్రదించవచ్చునని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్య తెలిపారు. -
గుడ్ న్యూస్ : మరో 40 స్పెషల్ రైళ్లు
సాక్షి, న్యూఢిల్లీ: కరోనా వైరస్ కారణంగా రైలు ప్రయాణాలకు భారీ డిమాండ్, ఎదురవుతున్న ఇబ్బందుల నేపథ్యంలో రైల్వేశాఖ ప్రయాణికులకు మరో శుభవార్త చెప్పింది. అన్‌లాక్-4 మార్గదర్శకాలతో ప్రత్యేక రైలు సర్వీసులను నిర్వహిస్తున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంగళవారం (నిన్న) ప్రకటించింది. 'క్లోన్ రైళ్లు' పథకం కింద 40 ప్రత్యేక రైళ్లను (20 జతల రైళ్ల సర్వీసులను) సెప్టెంబరు 21 నుంచి నడుపుతున్నట్టు వెల్లడించింది. తద్వారా వెయిటింగ్ లిస్ట్ ప్రయాణీకులకు, సాధారణ రైళ్లలో రిజర్వేషన్లు పొందలేని వారికి ప్రయోజనం కలుగుతుందని ప్రకటించింది. అయితే ఈ స్పెషల్ రైళ్లు భారీ డిమాండ్ ఉన్న నిర్దిష్ట మార్గాల్లోనే నడపబోతున్నట్టు తెలిపింది. క్లోన్ రైళ్లన్నీ రిజర్వ్డ్.. కావున ప్రయాణికులు ముందుగానే టికెట్లు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. 10 రోజుల ముందు నుంచి టికెట్లు బుక్ చేసుకోవచ్చని, అలాగే ఇవి కొన్ని స్టేషన్లల్లోనే మాత్రమే ఆగుతాయని రైల్వే తెలిపింది. గమనించాల్సిన ముఖ్యాంశాలు : ఈ రైళ్లు ఇప్పటికే సర్వీసులో ఉన్న310 ప్రత్యేక రైళ్లకు అదనం క్లోన్ రైళ్లు ప్రధానంగా 3 ఏసీ రైళ్లు ,ఇప్పటికే నడుస్తున్న ప్రత్యేక రైళ్ల కంటే ముందు నడుస్తాయి. ప్రస్తుతం ఉన్న ప్రత్యేక రైలు కంటే క్లోన్ రైలు వేగం ఎక్కువ. ఈ రైళ్లకు రిజర్వేషన్ సెప్టెంబర్ 19 నుంచి ప్రారంభం ఈ రైళ్లకు ముందస్తు రిజర్వేషన్ వ్యవధి 10 రోజులు సికింద్రాబాద్ - దానాపూర్ (రైలు నెంబర్ 02787/02788) బెంగళూరు -దానపూర్ (రైలు నెంబర్ 06509/06510) యశ్వంత్‌పూర్ -నిజాముద్దీన్ (రైలు నం. 06523/06524) తదితర రైళ్లు ఇందులో ఉన్నాయి. Considering the huge demand for travel on specific routes, Ministry of Railways has decided to run 20 pairs of Clone Special trains from 21.09.2020. These Clone trains will run on notified timings. ARP for these trains will be 10 days.https://t.co/wTHauZw2IB pic.twitter.com/TlUrSmtCdW — Ministry of Railways (@RailMinIndia) September 15, 2020 -
క్షణాల్లో కాపాడారు.. లేకపోతే
-
క్షణాల్లో కాపాడారు.. తృటిలో బయటపడ్డాడు
పట్నా : కదులుతున్న రైలును ఎక్కబోయి ప్రమాదవశాత్తు కిందపడిపోయిన ఓ 60 ఏళ్ల వృద్ధుడు తృటిలో ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేశాఖ అందించిన సమాచారం ప్రకారం.. బిహార్‌లోని గయా రైల్వే స్టేషన్లో ఫ్లాట్‌ఫామ్‌పై బండి ఆగి ఉంది. దీంతో ఓ వృద్ధుడు ఫ్లాట్ఫాంపైకి దిగాడు. కొద్ది సమయంలోని ఆ రైలు తిరిగి బయలుదేరింది. అయితే కదులుతున్న సమయంలో ట్రైన్ ఎక్కబోయిన ఆ వృద్ధుడు ఒక్కసారిగా కిందపడిపోయాడు. ఫ్లాట్‌ఫామ్‌కి, రైలుకి మధ్య సందులో ఇరుక్కుపోయాడు. దీంతో అక్కడే ఉన్న రైల్వే సిబ్బంది (ఆర్పీఎఫ్) క్షణాల్లో అతన్ని గమనించి వెంటనే వెనక్కి లాగా కాపాడింది. దీంతో అతను ప్రాణాలతో బయటపడ్డాడు. రైల్వేగార్డ్ సహాయంతో ట్రైన్ ఆపి అతన్ని లోపలకి ఎక్కించారు. దీనికి సంబందించిన వీడియోను రైల్వేమంత్రిత్వ శాఖ ట్విటర్లో షేర్ చేసింది. ప్రయాణ సమయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. ఆర్పీఎఫ్ సిబ్బందికి అభినందనలు తెలిపింది. -
వైరల్ : ఈ కుక్క మాములుది కాదండోయ్
చెన్నై : సాధారణంగా కుక్కలు విశ్వాసానికి మారుపేరుగా ఉంటాయన్న సంగతి మనకు తెలిసిందే. తాజాగా ఒక కుక్క చెన్నైలోని పార్క్ టైన్ రైల్వే స్టేషన్లో నిబంధనలకు వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రయాణికులపై అరుస్తూ పోలీసులను అప్రమత్తం చేస్తుంది. దీనికి సంబంధించిన వీడియోను రైల్వే శాఖ తమ ట్విటర్లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ప్రయాణికులను అప్రమత్తం చేస్తున్న ఈ కుక్క పోలీసులకు చెందిన జాగిలం అనుకుంటున్నారా.. కానీ అక్కడే ఉంది అసలు విషయం. అదేంటంటే.. దీనిని పెంచుకున్న యజయాని కొన్నిరోజులు క్రితం రైల్వే స్టేషన్లో వదిలివెళ్లారు. అప్పటినుంచి ఈ పెంపుడు కుక్క స్టేషన్లో ప్రయాణికులు పెట్టే ఆహారం తింటూ .. ప్రమాదాల బారీ నుంచి అప్రమత్తం చేస్తుంది. ' ఈ కుక్క చాలా తెలివైనది. రైలు వస్తుండగా ట్రాక్ దాటాలని ప్రయత్నిస్తున్న వారిపై, కదులుతున్న రైలు నుంచి దిగడం లేదా ఎక్కేవారిపై , ఫుట్‌బోర్డు మీద నిలబడి ప్రయాణం చేసేవారిపై అరుస్తూ ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తుందని ' ప్రయాణికుడొకరు తెలిపారు. ఇన్ని రోజలుగా రైల్వే స్టేషన్లో ఉంటున్నఈ పెంపుడు కుక్క ఎవరికి ఏ హానీ తలపెట్టలేదని రైల్వే ప్రోటెక్షన్ ఫోర్స్ సిబ్బంది తెలిపింది. అయితే వీడియో చూసిన పలువురు నెటిజన్లు కుక్క చేస్తున్న పనికి మెచ్చుకుంటున్నారు. అయితే ప్రయాణికులను అప్రమత్తం చేయబోయి సదరు కుక్క ప్రమాదం బారీన పడుతుందేమోనని మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు. -
ప్రధాని మోదీ బొమ్మలపై ఈసీ కన్నెర్ర
సాక్షి, న్యూఢిల్లీ : కేంద్ర ఎన్నికల సంఘం రైల్వే మంత్రిత్వ శాఖ, పౌర విమానయాన శాఖలకు షాక్ ఇచ్చింది. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో..ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చినా సదరు టికెట్లపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చిత్రాలను తొలగించకపోవడంపై వివరణ కోరుతూ బుధవారం లేఖలు రాసింది. రైలు టికెట్లు, ఎయిర్ ఇండియా బోర్డింగ్ పాస్‌లపై ప్రధాని మోదీ చిత్రాలను ఎందుకు తొలగించలేదని ఎన్నికల సంఘం ఈ రెండు ప్రభుత్వ శాఖలను ఈసీ ప్రశ్నించింది. ఈ అంశాలపై మూడు రోజుల్లోగా వివరణ ఇవ్వాలని మంత్రిత్వ శాఖలను ఎన్నికల సంఘం ఆదేశించింది. కాగా కేంద్ర ఎన్నికల సంఘం 2019 లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన అనంతరం మార్చి 10వ తేదీనుంచి ఎన్నికల నియమావళి అమల్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ ప్రవర్తనా నియమావళి ప్రకారం, రాజకీయ నాయకుల ఫోటోలు, వారి పేర్లు, పార్టీ చిహ్నాలను ప్రభుత్వ ఖజానా ఖర్చుతో ప్రచారం చేయకూడదు. -
ఎదురుచూపులే !
సాక్షి, కొత్తగూడెం : సింగరేణి గనులు భారీగా విస్తరించి ఉన్న భద్రాద్రి జిల్లా నుంచి బొగ్గు రవాణా ద్వారా దక్షిణ మధ్య రైల్వే రోజూ రూ.2 కోట్ల ఆదాయం ఆర్జిస్తోంది. ఏడాదికి రూ.700 కోట్లకు పైమాటే. అయితే జిల్లా వాసులకు అందించే సేవలు మాత్రం అంతంతగానే ఉన్నాయి. దీంతో మరిన్ని రైల్వే సేవల కోసం జిల్లా వాసులు కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కొత్తగా ఎలాంటి రైల్వే లైన్లు వేయకుండానే మంచి సేవలు అందించే అవకాశం ఉన్నప్పటికీ ఆ దిశగా రైల్వే శాఖ తగిన చర్యలు చేపట్టడం లేదని ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతమైనప్పటికీ జిల్లా పారిశ్రామికంగా అభివృద్ధిలో ముందంజలో ఉంది. ఇల్లెందు, కొత్తగూడెం, మణుగూరుల్లో బొగ్గు గనులు, పాల్వంచలో కేటీపీఎస్, అశ్వాపురంలో కేంద్ర అణుశక్తి విభాగానికి చెందిన భారజల కర్మాగారం, సారపాకలో ఐటీసీ పేపర్ బోర్డు, అశ్వారావుపేటలో వ్యవసాయ కళాశాల, పామాయిల్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. ఇక మణుగూరు వద్ద కొత్తగా భద్రాద్రి థర్మల్ వపర్ స్టేషన్ నిర్మాణంలో ఉంది. అదనంగా దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం, ఆ సమీపంలోనే పర్ణశాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. భద్రాద్రి జిల్లాగా ఆవిర్భవించకముందు నుంచే కొత్తగూడెంలో సింగరేణి కేంద్ర కార్యాలయం ఉంది. జిల్లాలో ఉన్న ఐదు నియోజకవర్గాల్లోనూ అత్యంత ప్రాధాన్యమైన పారిశ్రామిక, వ్యవసాయ, ఆధ్యాత్మిక కేంద్రాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో అన్ని వర్గాల వారు పెద్ద సంఖ్యలో ప్రతిరోజూ రాకపోకలు సాగిస్తున్నారు. రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌కు అన్ని జిల్లాల కంటే దూరంగా ఉన్న జిల్లా కూడా భద్రాద్రే కా>వడం గమనార్హం. ఈ నేపథ్యంలో అందరికీ ఆమోదయోగ్యమైన రైలు రవాణాకు ఎక్కువ ప్రాధాన్యత ఉంది. పొడిగింపునకు అవకాశమున్నా పట్టింపు లేదు.. ప్రస్తుతం ఉన్న లైన్ల ద్వారా కొత్తగా మరిన్ని రైళ్లు నడిపే అవకాశం ఉన్నప్పటికీ ఆ శాఖ పట్టించుకోవడం లేదు. అనేక సంవత్సరాలుగా జిల్లా వాసులు కోరుతున్నప్పటికీ సంబంధిత అధికారుల్లో నిర్లక్ష్యం వీడడం లేదు. ప్రస్తుతం జిల్లా నుంచి ఏడు రైళ్లు నడుస్తున్నాయి. మణుగూరు నుంచి హైదరాబాద్‌కు మూడు, మణుగూరు నుంచి కాజీపేటకు ఒకటి, కొత్తగూడెం నుంచి డోర్నకల్‌కు ఒకటి, కొత్తగూడెం నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ఒక ప్యాసింజర్, కొత్తగూడెం నుంచి విజయవాడ వరకు మరో ప్యాసింజరు రైలు రాకపోకలు సాగిస్తున్నాయి. వీటి ద్వారా ప్రతిరోజూ సుమారు 5 వేల మంది ప్రయాణిస్తున్నారు. వివిధ బస్సు సర్వీసుల ద్వారా రోజుకు సుమారు 30 వేల మంది ప్రయాణిస్తున్నారు. దీంతో కొత్తగూడెం నుంచి విజయవాడ వరకు నడుస్తున్న రైలును ఎగువన తిరుపతి వరకు, దిగువన మణుగూరు వరకు పొడిగించాలనే ప్రతిపాదన ఎప్పటి నుంచో ఉంది. కనీసం వారానికి రెండుసార్లైనా తిరుపతికి రైలు నడపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. అలాగే హైదరాబాద్‌కు ఉన్న రద్దీ నేపథ్యంలో ఉదయం పూట ప్రత్యేకంగా ఒక ‘ఇంటర్సిటీ’ రైలు సర్వీసు నడపాలని ప్రతిపాదనలు ఉన్నాయి. మణుగూరు నుంచి ఖమ్మం వరకు ‘పుష్పుల్’ రైలు కావాలనే డిమాండ్ ఉంది. కాగా కొత్తగూడెం నుంచి బల్హార్షా, పుణే మీదుగా ముంబయ్ వరకు రైలు నడిపే అవకాశం ఉంది. అయితే ఇందుకు ప్రయాణికుల నుంచి వినతులు వస్తే పరిశీలించే అవకాశం ఉందని రైల్వే వర్గాల సమాచారం. కొత్త లైన్ల ప్రతిపాదన జాడే లేదు.. ప్రస్తుతం ఉన్న లైన్లపై రైళ్ల పొడిగింపు సంగతి ఇలా ఉంటే.. కొత్త లైన్ల ప్రతిపాదనల జాడే లేకుండా పోయింది. కొత్తగూడెం నుంచి కొవ్వూరు లైన్‌కు 1965లో ప్రతిపాదనలు చేసినప్పటికీ ముందుకు సాగడం లేదు. దీని కోసం కొత్తగూడేనికి చెందిన కొదమసింహం పాండురంగాచార్యులు ఆధ్వర్యంలో సుదీర్ఘ ఉద్యమాలు సైతం జరిగాయి. అయితే కొత్తగూడెం నుంచి సత్తుపల్లి వరకు మాత్రం రూ.704 కోట్ల అంచనా వ్యయంలో రూ.600 కోట్లు భరించేందుకు సింగరేణి సంస్థ ముందుకు రావడంతో ఆ ప్రక్రియ మొదలైంది. ఇక 2004 నుంచి ప్రతిపాదనల్లో ఉన్న మణుగూరు – రామగుండం లైను సైతం ఊసే లేదు. 1984 నుంచి ఊరిస్తూ వస్తున్న 15.5 కిలోమీటర్ల పాండురంగాపురం – సారపాక లైను విషయంలోనూ రైల్వే శాఖ నిర్లక్ష్యంగానే వ్యవహరిస్తోంది. -
లంచ్‌కు రూ.50.. బ్రేక్‌ఫాస్ట్‌కు రూ.30
న్యూఢిల్లీ: రైళ్లలో సరఫరా చేస్తున్న ఆహార పదార్థాల ధరల పట్టికను రైల్వే శాఖ విడుదలచేసింది. ఆహారం, పానీయాలు వంటి వాటికి అధిక ధరలు వసూలుచేస్తున్నా నాసిరకం పదార్థాలు వడ్డిస్తున్నారని ప్రయాణికుల నంచి ఫిర్యాదులు వెల్లువెత్తిన నేపథ్యంలో కేటరింగ్ సేవల ధరల కార్డును ప్రకటించింది. దీనిలో... అల్పాహారం–రూ.30, నాన్‌వెజ్ అల్పాహారం–రూ.35, లంచ్, డిన్నర్(వెజ్)–రూ.50, నాన్‌వెజ్ లంచ్, డిన్నర్–రూ.55,ప్యాకెజ్డ్ డ్రింకింగ్ వాటర్(1లీ.)–రూ.15, కాఫీ,టీ– రూ.7గా నిర్ణయించారు. జాబితాలో పేర్కొన్న ధరల కన్నా అమ్మకందారులు అధికంగా అడిగితే తమకు ఫిర్యాదు చేయాలని ప్రయాణికులకు రైల్వే శాఖ సూచించింది. మంగళవారం ఆహార పరిశ్రమ ప్రతినిధులు, ప్రభుత్వ ఏజెన్సీలు, స్వయం సహాయక బృందాలు, రైల్వే అధికారులతో జరిగిన రౌండ్‌టేబుల్ సమావేశం తరువాత ఆహార పదార్థాల ధరలను తెలియజేసే ఒక వీడియోను కూడా విడుదల చేశారు. -
అవినీతి పెండింగ్ కేసుల్లో ‘రైల్వే’ టాప్!
న్యూఢిల్లీ: ప్రభుత్వ విభాగాల్లో పెండింగ్‌లో ఉన్న అవినీతి కేసుల్లో రైల్వే శాఖ మొదటిస్థానంలో ఉన్నట్లు కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) శుక్రవారం తెలిపింది. రైల్వే శాఖలో మొత్తం 730 పెండింగ్ కేసులుండగా వీటిలో 350 కేసులు సీనియర్ అధికారులపైనే ఉన్నాయి. తర్వాతి స్థానాల్లో 526 పెండింగ్ కేసులతో భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(బీఎస్ఎన్ఎల్), 268 కేసులతో ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ ఉన్నాయి. 193 కేసులు ఢిల్లీ ప్రభుత్వాధికారులపై ఉన్నాయి. ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్బీఐలో 164 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్రల్లో వరుసగా 128, 82 అవినీతి కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్‌లో 100 కేసులు పెండింగ్‌లో ఉన్నాయి. -
ఎంఎంటీఎస్ రెండో దశకు అడ్డంకులు తొలగించాలి
- నిలిచిన సనత్‌నగర్-మౌలాలి రైల్వే లైను డబ్లింగ్ పనులు - పెండింగ్ ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక సాక్షి, న్యూఢిల్లీ: హైదరాబాద్‌లో మల్టీ మోడల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ (ఎంఎంటీఎస్) రెండో దశ అమలులో జాప్యంపై రైల్వే మంత్రిత్వ శాఖకు చెందిన పార్లమెంటరీ స్థాయీ సంఘం తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. 2012-13 లో చేపట్టిన ఈ ప్రాజెక్ట్ పూర్తి చేయడానికి అడ్డంకిగా ఉన్న సమస్యలను పరిష్కరించడానికి ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగాన్ని రైల్వే మంత్రిత్వ శాఖ క్రియాశీలకం చేయాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. దేశవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న రైల్వే ప్రాజెక్ట్‌లపై పార్లమెంటరీ స్థాయీ సంఘం ఇటీవల లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌కు నివేదిక సమర్పించింది. 2012-13లో రూ.272 కోట్ల అంచనా వ్యయంతో ఎంఎంటీఎస్ రెండో దశను ప్రారంభించగా గత మార్చి నెలాఖరు వరకూ రూ. 58.30 కోట్ల మేరకు వ్యయం చేశారు. అయితే ఎంఎంటీఎస్ రెండో దశలో భాగంగా ఉన్న సనత్‌నగర్-మౌలాలి మధ్య 21.5 కిలోమీటర్ల రైల్వే లైను డబ్లింగ్ పనులు నవంబర్ 2014 నుంచి నిలిచిపోయాయి. రక్షణ మంత్రిత్వ శాఖ అధీనంలో ఉన్న ఒకప్పటి రైఫిల్ రేంజ్లో ఉన్న 4 కిలోమీటర్ల మేరకు పనులను రక్షణ శాఖ అధికారులు నిలిపివేశారు. ఈ ప్రాజెక్ట్ అమలుకు అనువుగా ప్రత్యామ్నాయంగా రైఫిల్ రేంజ్ ఏర్పాటు కోసం రూ.1.18 కోట్ల మొత్తాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి 1979 లోనే రైల్వే మంత్రిత్వ శాఖ అందించింది. అయితే 1990 లో 37 ఎకరాల 32 కుంటల భూమిని రెవెన్యూ అధికారులు సేకరించారని, అందుకు రక్షణ మంత్రిత్వ శాఖ అధికారులు అంగీకరించ లేదని.. అంతేకాకుండా గత 35 సంవత్సరాలుగా రైఫిల్ రేంజ్ వాడుకలో లేదని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిందని పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదికలో పేర్కొంది. ఈ సమస్యపై గత జూలై 15 వ తేదీన రక్షణ శాఖ మంత్రితో రైల్వే శాఖ మంత్రి చర్చించారని, నిలిచిపోయిన పనులను ప్రారంభించడానికి అనుమతించాలని ఒక లేఖ కూడా రాశారని రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ సమస్య పరిష్కారమయ్యే వరకూ ఎంఎంటీఎస్ రెండో దశ ఎప్పటికల్లా పూర్తవుతుందో తెలియని పరిస్థితి ఏర్పడిందని రైల్వే అధికారులు అందించిన సమాచారం వల్ల అర్థమవుతోందని స్థాయీ సంఘం అభిప్రాయపడింది. ఈ సమస్య పరిష్కారానికి ఉన్నత స్థాయి చర్చలు జరిగాయని, అందువల్ల ప్రాజెక్ట్‌ల అమలు, పర్యవేక్షణ విభాగం చొరవ తీసుకొని ప్రాజెక్ట్ త్వరితగతిన పూర్తయ్యే విధంగా ప్రతిబంధకాలు తొలగించాలని పార్లమెంటరీ స్థాయీ సంఘం సూచించింది. -
ప్రభు స్పందించాడు! 20 నిమిషాల్లోనే సాయం!!
న్యూఢిల్లీ: రైల్వే మంత్రిత్వశాఖ, రైల్వేమంత్రి సురేశ్ ప్రభు మరోసారి వార్తల్లో నిలిచారు. విపత్కర పరిస్థితుల్లో ఉన్న తన కొడుకును ఆదుకోవాలంటూ ఓ తండ్రి ట్విట్టర్లో చేసిన విజ్ఞప్తికి.. 20 నిమిషాల్లోనే స్పందించి, సాయమందించి మరోసారి ప్రయాణికుల నుంచి ప్రశంసలందుకున్నారు. @sureshpprabhu @RailMinIndia need medical attention..One of the child 6yrs old fell off upper seat..cut back of the head — Bibhuti (@goneinseconds) 31 March 2016 మార్చి 31న న్యూఢిల్లీ నుంచి వైష్ణో దేవీ ఆలయానికి తన కుటుంబంతోపాటు బిభూతి రైల్లో బయలుదేరి వెళ్లారు. అయితే, ప్రయాణిస్తుండగా అప్పర్ బెర్తు నుంచి తన ఆరేళ్ల కొడుకు కిందపడి.. తల వెనుకభాగంలో తెగిన గాయమైంది. ఈ విషయాన్ని ట్విట్టర్లో సురేశ్ ప్రభు, రైల్వే మంత్రిత్వశాఖలకు ట్యాగ్ చేస్తూ వెంటనే ట్వీట్ చేశారు బిభూతి. తన కొడుకుకు రక్తస్రావం జరుగుతోందని, వెంటనే సాయమందించాలని వేడుకున్నాడు. కనీసం బ్యాండేజ్ అయినా అందించాలని ప్రార్థించాడు. కేవలం 20 నిమిషాల్లోనే ఆయన ట్వీట్‌కు స్పందన లభించింది. రైల్వేమంత్రిత్వశాఖ బిభూతికి సాయమందించేందుకు ముందుకొచ్చింది. ఆయన ఫోన్ నంబర్ ఇవ్వాల్సిందిగా కోరింది. తదుపరి స్టేషన్ లుధియానాలో ఆ బాలుడికి వైద్య సహాయం అందిస్తామని హామీ ఇచ్చింది. ఆ తర్వాత కొంతసేపటికి తన బిడ్డకు సత్వరమే వైద్యసాయమందినందుకు బిభూతి రైల్వే మినిస్ట్రీకి ట్విట్టర్లో ధన్యవాదాలు తెలిపాడు. @sureshpprabhu @RailMinIndia it's bleeding..pls help..atleast bandage — Bibhuti (@goneinseconds) 31 March 2016 @sureshpprabhu @RailMinIndia I am thankful to all of you for providing medical facility to my son in quickest possible time. Awesome support — Bibhuti (@goneinseconds) 31 March 2016 నిజానికి గోయింగ్ ఇన్ సెకండ్స్ పేరిట ట్విట్టర్లో ఖాతా కలిగిన బిభూతి అంతకుముందు రైల్వేమంత్రిత్వశాఖను ఉద్దేశించి ఓ ట్వీట్ చేశాడు. తాము ప్రయాణిస్తున్న రైల్లో టాయ్‌లెట్ సరిగ్గా లేదని, దోమలు కుడుతున్నాయని ట్వీట్ చేశాడు. ఈ ట్వీట్‌కు కూడా రైల్వేశాఖ వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించింది. ఇటీవల ట్విట్టర్లో ప్రయాణికులు చేస్తున్న విజ్ఞప్తులకు రైల్వేశాఖ వెంటనే స్పందిస్తున్నది. గత ఫిబ్రవరిలో ఓ జంట తమ బిడ్డ రైల్లో తప్పిపోయిందని ఫిర్యాదు చేయగా.. వారి బిడ్డను తిరిగి వారికి చేర్చడంలో సాయపడింది. అలాగే ఇతన విజ్ఞప్తుల విషయంలోనూ రైల్వేశాఖ సహకారమందిస్తుండటంతో రైల్వేమంత్రి సురేశ్ ప్రభు ప్రయాణికుల మన్ననలు అందుకుంటున్నారు. -
పుణే-ముంబై ‘బులెట్’ మరింత జాప్యం
పింప్రి, న్యూస్‌లైన్: పుణే-ముంబై మహానగరాల మధ్య తలపెట్టిన బులెట్ రైలు ఇప్పట్లో కదిలే పరిస్థితులు కనిపించడం లేదు. పుణే-ముంబై-అహ్మదాబాద్ మధ్య బులెట్ రైలును నడపాలని తొలుత ప్రతిపాదించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య ప్రాజెక్టుకే రైల్వే విభాగం పచ్చజెండా ఊపింది. దీంతో ఇప్పట్లో పుణేకు బులెట్ రైలు వచ్చే అవకాశాలు సన్నగిల్లాయి. పుణేకి చెందిన పార్లమెంట్ సభ్యులు, ఎమ్మెల్యేలంతా బీజేపీకి చెందిన వారే. కేంద్రంతోపాటు రాష్ట్రంలోనూ బీజేపీ ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయి. దీంతో తమ బులెట్‌రైలు కల నెరవేరుతుందనుకున్న నగరవాసుల ఆశలు ఆవిరయ్యాయి. దేశంలోని వాణిజ్య, పర్యాటక హబ్‌లు, పుణ్యక్షేత్రాలను కలిపేందుకు 10 సంవత్సరాల క్రితం భారతీయ రైల్వే ఆరు కారిడార్లను నిర్మించాలని ప్రతిపాదించింది. ఇందులో భాగంగానే ఈ బులెట్ రైలును ప్రస్తావించింది. 2006లో పుణే-ముంబై-అహ్మదాబాద్ రైలు మార్గంపై సర్వే నిర్వహించారు. ఈ మార్గంలో ఈ బులెట్ రైలును నడపడం లాభదాయకంగా ఉంటుందని సర్వే నిర్వహించిన సంస్థ రైల్వే మంత్రిత్వ శాఖకు నివేదించింది. 2009లో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి రూ. 55,800 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అంచనా వేశారు. ప్రతి సంవత్సరం దాదాపు రెండు కోట్ల 60 లక్షల మంది ఈ రైలులో ప్రయాణించవచ్చని అంచనా. ఇదిలాఉంచితే కేంద్ర ప్రభుత్వం పుణే ప్రజల ఆశలపై నీళ్లు చల్లుతూ కేవలం ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య బులెట్‌కు పచ్చ జెండా ఊపింది. మధ్య రైల్వే పుణే జనసంపర్క్ అధికారి వై.కే. సింగ్ మాట్లాడుతూ పుణే-ముంబై-అహ్మదాబాద్‌ల మధ్య పూర్తి సర్వే జరగలేదని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం దీనిపై శ్రద్ధ పెట్టాల్సి ఉందని అన్నారు. గుజరాత్ రాష్ట్రం ముంబై-అహ్మదాబాద్‌ల రైలు విషయమై ప్రత్యేక శ్రద్ధను కనబరచడంతో ఈ రైలుకు అనుమతి లభించిందని చెప్పారు. ఈ రైలు ప్రస్తుతం పశ్చిమ రైల్వే అహ్మదాబాద్ డివిజన్ పరిధిలో ఉందన్నారు. ఇదే విషయమై పుణే-ముంబై ప్రయాణికుల గ్రూపు సంఘం అధ్యక్షుడు హర్ష మాట్లాడుతూ ప్రజాప్రతినిధులు ఈ రైలు కోసం తీవ్రంగా కృషి చేయాల్సి ఉందన్నారు.