రైల్వే టికెట్ అడ్వాన్స్ బుకింగ్
నిబంధనల్లో కీలక మార్పు
నవంబర్ 1 నుంచి అమల్లోకి
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనలను భారతీయ రైల్వే మార్చింది. ప్రస్తుతం నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. దీన్ని 60 రోజులకు కుదించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని 60 రోజులకు తగ్గిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకు ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 120 రోజులు కాగా, ఇప్పుడు అది 60 రోజులకు తగ్గింది.
ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి బుక్ చేసుకొనే టికెట్లపై అమలుకానుంది. ఐఆర్‌సీటీసీ యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టికెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోవచ్చు. లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి షార్ట్ రూట్ రైళ్లకు ఈ నిర్ణయం వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో విదేశీ పర్యాటకులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది.
రిజర్వు టికెట్లు అధికంగా రద్దు అవుతుండటం, ప్రయాణికులు రాక సీట్లు, బెర్తులు ఖాళీగా ఉండిపోతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ కాలపరిమితిని తగ్గించామని రైల్వే పేర్కొంది. ప్రస్తుతం కాన్సిలేషన్స్ 21 శాతం ఉంటున్నాయని, 4–5 శాతం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నా.. ప్రయాణం చేయడం లేదని వివరించింది. దీనివల్ల దళారులు సీట్లను అమ్ముకుంటున్నారని, రైల్వే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికే అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితిని 120 నుంచి 60 రోజులకు కుదించామని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment