Railway tickets
-
Indian Railways: అడ్వాన్స్ బుకింగ్ ఇకపై 60 రోజులే
సాక్షి, న్యూఢిల్లీ: రైళ్లలో అడ్వాన్స్ టికెట్ బుకింగ్ నిబంధనలను భారతీయ రైల్వే మార్చింది. ప్రస్తుతం నాలుగు నెలల ముందుగానే టికెట్లు బుక్ చేసుకునే అవకాశం ఉండగా.. దీన్ని 60 రోజులకు కుదించింది. అడ్వాన్స్ రిజర్వేషన్ కాల పరిమితిని 60 రోజులకు తగ్గిస్తూ కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ నోటిఫికేషన్ జారీ చేసింది. ఇంతకు ముందు అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితి 120 రోజులు కాగా, ఇప్పుడు అది 60 రోజులకు తగ్గింది. ఈ నిర్ణయం నవంబర్ 1వ తేదీ నుంచి బుక్ చేసుకొనే టికెట్లపై అమలుకానుంది. ఐఆర్సీటీసీ యాప్ లేదా వెబ్సైట్ ద్వారా టికెట్‌ను ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు. లేదా రైల్వే టికెట్ కౌంటర్ నుంచి టికెట్‌ను కొనుగోలు చేసుకోవచ్చు. మరోవైపు తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమతి ఎక్స్‌ప్రెస్ వంటి షార్ట్ రూట్ రైళ్లకు ఈ నిర్ణయం వర్తించదని రైల్వే శాఖ తెలిపింది. అదే సమయంలో విదేశీ పర్యాటకులకు 365 రోజుల అడ్వాన్స్ బుకింగ్ నిబంధనలో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. రిజర్వు టికెట్లు అధికంగా రద్దు అవుతుండటం, ప్రయాణికులు రాక సీట్లు, బెర్తులు ఖాళీగా ఉండిపోతుండటాన్ని దృష్టిలో పెట్టుకొని అడ్వాన్స్ టికెట్ల బుకింగ్ కాలపరిమితిని తగ్గించామని రైల్వే పేర్కొంది. ప్రస్తుతం కాన్సిలేషన్స్ 21 శాతం ఉంటున్నాయని, 4–5 శాతం ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నా.. ప్రయాణం చేయడం లేదని వివరించింది. దీనివల్ల దళారులు సీట్లను అమ్ముకుంటున్నారని, రైల్వే సిబ్బంది అవినీతికి పాల్పడుతున్నారని పేర్కొంది. వీటన్నింటికీ అడ్డుకట్ట వేయడానికే అడ్వాన్స్ రిజర్వేషన్ కాలపరిమితిని 120 నుంచి 60 రోజులకు కుదించామని తెలిపింది. -
పలాసలో బుక్‌చేస్తే.. ఢిల్లీలో గుర్తించారు
సాక్షి, శ్రీకాకుళం: లాక్డౌన్ వేళ రైల్వే టికెట్లను క్యాష్ చేసుకోవాలని అడ్డదారిలో వెళ్లిన ఓ వ్యక్తి కటకటాలపాలైన సంఘటన పలాసలో చోటుచేసుకుంది. నిబంధనలకు విరుద్ధంగా ఈ–టికెట్లు విక్రయిస్తున్న సెల్‌ఫోన్ విక్రయదారుడ్ని రైల్వే పోలీసులు అరెస్టు చేసి షాపును సీజ్ చేశారు. పలాస ఆర్పీఎఫ్ ఓసీ కె.కె.సాహు గురువారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. రైల్వే మార్కెట్ పాత జాతీయ రహదారి రోడ్డులో చందన కమ్యూనికేషన్ పేరుతో సకలాబత్తుల గిరీష్‌కుమార్ అనే వ్యక్తి సెల్‌రీచార్జ్‌తో పాటు రైల్వే టికెట్లు ఆన్లైన్లో విక్రయిస్తుంటాడు. ప్రస్తుతం కోవిడ్–19 సందర్భంగా రైల్వేశాఖ శ్రామిక రైళ్లను నడుపుతోంది. ప్రధాన రైల్వే స్టేషన్ల నుంచి ప్రత్యేక రైళ్లు నడుస్తున్న నేపథ్యంలో గిరీష్‌కుమార్ ఈ–టికెట్లను నిబంధనలకు విరుద్ధంగా అమ్ముతున్నట్లు రైల్వేశాఖ గుర్తించింది. మొత్తం 13 టికెట్లును ఆన్లైన్లో తీసుకున్నట్లు రైల్వేశాఖ ఐఆర్సీటీసీ అధికారులు ఢిల్లీలో గుర్తించి ఖుర్దారోడ్ డివిజన్ రైల్వే అధికారులకు సమాచారం అందించారు. వెంటనే ఓసీ కె.కె.సాహు తన సిబ్బందితో సహా రంగంలోకి దిగి గురువారం షాపును తనిఖీ చేయగా వాస్తవమని తేలింది. చదవండి: చేతులేత్తి మొక్కుతా.. వదిలేయండి: ఎంపీ మాధవ్ రైల్వే నిబంధనల ప్రకారం ఇతరులు రైల్వే టిక్కెట్లు అమ్మకూడదు. ఒక వ్యక్తి తన పాస్వర్డ్ వినియోగించి తన అవసరాలకు మాత్రమే టికెట్లు కొనుగోలు చేసుకోవాల్సి ఉంది. పెద్ద నగరాల్లో రైల్వేశాఖ అనుమతులతో నిబంధనలకు లోబడి టిక్కెట్లు విక్రయించుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ మాత్రం ఒకే పాస్‌వర్డ్‌తో టికెట్లు కొనుగోలు చేసి అడ్డంగా దొరికిపోయాడు. గత ఏడాది ఆగస్టులో ఇదే సెంటరుపై రైల్వేశాఖ దాడి చేసి కేసును నమోదు చేసింది. మళ్లీ అదే సంఘటన పునరావృతం కావడంతో రైల్వే అధికారులు సీరియస్‌గా పరిగణించారు. ఆయన్ను అరెస్టు చేయడంతో పాటు షాపును సైతం సీజ్ చేశారు. కార్యక్రమంలో ఆర్పీఎఫ్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. చదవండి: దొంగ చేతివాటం: ఏకంగా ఆర్టీసీ బస్సునే.. -
రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిక!
సాక్షి, హైదరాబాద్: రైల్వే జనరల్ టికెట్లు మరింత తేలిగ్గా లభించనున్నాయి. యూటీఎస్ మొబైల్ యాప్‌లో క్యూఆర్ కోడ్ ఆధారంగా వేగంగా టికెట్లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం యూటీఎస్ యాప్ నుంచి జనరల్ టికెట్లను బుక్ చేసుకొనే వెసులుబాటు ఉన్నప్పటికీ బుకింగ్ కోసం ఎక్కువ సమయం వెచ్చించవలసి వస్తోంది. దీంతో ప్రయాణికులు ఈ యాప్ వినియోగంపై ఆసక్తి చూపడంలేదు. దీన్ని దృష్టిలో ఉం చుకొని వేగంగా టికెట్లను బుక్ చేసుకునేందుకు క్విక్ రెస్పాన్స్ కోడ్‌ను ప్రవేశపెట్టారు. ఇది సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ, హైటెక్ సిటీ, బేగంపేట్ తదితర అన్ని ప్రధాన స్టేషన్ల్లో అందుబాటులో ఉంటుంది. హైదరాబాద్‌తో పాటు వరంగల్, విజయవాడ, గుంటూరు, తిరుపతి తదితర 18 రైల్వేస్టేషన్లలో యూటీఎస్ క్యూఆర్ కోడ్ ద్వారా జనరల్ టిక్కెట్లను పొందే సదుపాయాన్ని దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టింది. దశలవారీగా అన్ని రైల్వేస్టేషన్లలోనూ క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేయనున్నారు. దీనివల్ల క్యూలైన్లలో పడిగాపులు కాయాల్సిన ఇబ్బం ది ఉండదని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ గజానన్ మాల్యా తెలిపారు. క్షణాల్లో టిక్కెట్..: ప్రస్తుతం దక్షిణమధ్య రైల్వే పరిధిలో రోజూ 8.5 లక్షల నుం చి 9 లక్షల మంది రిజర్వ్డ్, అన్ రిజర్వ్డ్ ప్రయాణికులు రాకపోకలు సాగిస్తు న్నారు. ఏసీ, నాన్ ఏసీ రిజర్వేషన్ బుకింగ్ కోసం ఐఆర్సీటీసీతో పాటు రిజర్వేషన్ కార్యాలయాల్లో బుకింగ్ సదుపాయం ఉంది. కానీ అప్పటికప్పుడు బయలుదేరే జనరల్ టికెట్ల కోసం ప్రయాణికులు రైల్వేస్టేషన్‌ల్లో కౌంటర్ల వద్ద పడిగాపు లు కాయాల్సిందే. పండుగలు, వరుస సెలవులు, వేసవి రోజుల్లో రద్దీ ఎక్కువగా ఉంటోంది. దీంతో తరచుగా రైళ్లు బయలుదేరే సమయం వరకు కూడా ప్రయాణికులు టికెట్లను తీసుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో మూడేళ్ల క్రితం దక్షిణ మధ్య రైల్వే యూటీఎస్ మొబైల్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. కానీ బుకింగ్ సమయంలో ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ వరకు అనే వివరాలతో పాటు, అనేక అంశాలను భర్తీ చేయవలసి వస్తోంది. దీంతో జాప్యం చోటుచేసుకుంటుంది. యూటీఎస్‌ను వినియోగించాలని ఉన్నప్పటికీ వివరాలను భర్తీ చేయడంపై ప్రయాణికులు నిరాసక్తతను ప్రదర్శిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. సుమారు లక్ష మందికి పైగా ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్నప్పటికీ వినియోగించే వారి సంఖ్య 40 వేల నుంచి 50 వేల వరకు ఉంది. తాజాగా క్యూఆర్ కోడ్‌ను ప్రవేశపెట్టడం వల్ల ప్రయాణికులు స్టేషన్‌కు ఒక కిలోమీటర్ దూరం నుంచి స్టేషన్ వర కు ఎక్కడైనా సరే క్షణాల్లో టికెట్ పొందవచ్చు. అన్ని ప్రధాన స్టేషన్లలో ప్లాట్‌ఫామ్‌లు, ఏటీవీఎం సెంటర్లు, ప్రధాన ప్రాంగణాల్లో క్యూఆర్ కోడ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో యూటీఎస్ వినియోగదారుల సంఖ్య పెరుగుతుందని అంచనా. అన్ని రకాల టికెట్లు తీసుకోవచ్చు..: యూటీఎస్–క్యూఆర్ సదుపాయంతో స్లీపర్, థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, ఫస్ట్ ఏసీ వంటి రిజర్వ్డ్ టికెట్లు, వివిధ రకాల రా యితీ టికెట్లు మినహాయించి అన్ని రకాల జనరల్ టికెట్లను తీసుకోవచ్చు. ఎం ఎంటీఎస్, ప్లాట్‌ఫామ్ టికెట్లు పొందవచ్చు. వివిధ ప్రాంతాల మధ్య రెగ్యులర్ గా ప్రయాణం చేసేవారు నెలవారీ పాస్‌లను పొందవచ్చు. ఈ మొబైల్ యాప్ ద్వారా దేశంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా జనరల్ టికెట్లను బుక్ చేసుకోవచ్చు. -
బెంబేలెత్తుతున్న రైల్వే ప్రయాణికులు..
సాక్షి, రాజమహేద్రవరం: దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని రైల్వేప్లాట్ ఫామ్ టిక్కెట్ ధరను అమాంతం రెండింతలు పెంచుతూ రైల్వేశాఖ బాదుడు షురూ చేసింది. దక్షిణమధ్య రైల్వేలో ప్రధాన నగరాలైన విజయవాడ, నెల్లూరు, రాజమహేంద్రవరాల్లో ఆదివారం నుంచి అక్టోబర్ 10వ తేదీ వరకూ ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర పెంచుతూ ఉత్తర్వులు విడుదల చేసింది. ఇప్పటి వరకూ 10 రూపాయలు ఉన్న ఈ ధర ఆదివారం నుంచి రెండితలు పెరిగి రూ.30 అయింది. దీంతో ప్రస్తుత రేటుకు రూ.20 అదనంగా భారం పడనుంది. బెంబేలెత్తుతున్న ప్రయాణికులు ప్రతి ఏటా ఇలా పెంచడంతో ప్రయాణికులు బెంబేలెత్తుతున్నారు. రైల్వేస్టేషన్ ఆవరణలోకి వెళ్లే వారు ప్లాట్‌ఫామ్ టిక్కెట్ కొనుగోలు చేయాలంటే రూ.30లు చెల్లించాల్సిందే. అదే ప్లాట్పామ్ పైకి వెళ్లాల్సిన వ్యక్తి పక్కనే ఉన్న ద్వారపూడి రైల్వేస్టేషన్, కొవ్వూరు రైల్వేస్టేషన్ కో ప్యాసింజరు టిక్కెట్ కొనుగోలు చేస్తే దాని ధర రూ.10లే. ప్యాసింజరు టిక్కెట్ ధరలో మార్పు లేకుండా ఇలా ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధరను అమాంతం పెంచడంతో రాజమహేంద్రవరం రైల్వే స్టేషన్‌కు వెళ్లే వారిపై భారం పడనుంది. ప్లాట్‌ఫామ్ టిక్కెట్‌కు రెండు గంటలు చెల్లుబాటు పరిమితిని విధించారు. రూ.10లతో ప్యాసింజరు టిక్కెట్ కొనుగోలు చేసి ప్లాట్‌ఫామ్‌పైకి వెళితే 3 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుంది. ఇదేం చిత్రమో తెలియదు గానీ ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లడానికి రూ.30లు పెట్టి టికెట్ కొనుగోలు చేస్తే కేవలం 2 గంటలపాటు చెల్లుబాటులో ఉంటుందట. ప్రతి రోజూ ప్లాట్‌ఫామ్ టికెట్లు 2,500 విక్రయిస్తుండగా...పండుగ రోజుల్లో 5000 వరకు విక్రయిస్తుంటారు. అంటే ఐదు వేల మంది ప్రయాణికులపై ఈ భారం పడనుంది. గోదావరి రైల్వే స్టేషన్లో పాత ధరే... దసరా పేరుతో రాజమహేంద్రవరం ప్రధాన రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ బాదుడు అమలు జరుగుతుండగా గోదావరి రైల్వే స్టేషన్లో మాత్రం ప్లాట్‌ఫామ్ టిక్కెట్ ధర మాత్రం రూ.10లు మాత్రమే ఉంటుందని రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ కల్యాణ్ తెలిపారు. -
ఐఆర్సీటీసీ ప్రైవేటుపరం కానుందా ?!
సాక్షి, న్యూఢిల్లీ : ప్రపంచంలోనే అతిపెద్ద రైల్వే నెట్వర్క్ కలిగిన వ్యవస్థ భారతీయ రైల్వేది. 20 వేలకు పైగా రైళ్లు ఏటా 811.6 కోట్ల మంది ప్రయాణికులను మోసుకెళుతున్నాయి. 110.6 కోట్ల టన్నుల సరకులను తరలిస్తున్నాయి. మొత్తానికి భారతీయ రైల్వే లాభాల్లో కాకుండా నష్టాల్లో నడుస్తుండడంతో రైల్వేను ప్రైవేటీకరించాలన్న మాట అప్పుడప్పుడు వినిపిస్తోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో రైళ్లను ప్రవేటీకరిస్తారంటూ జూన్ 26వ తేదీన ఓ ఆంగ్ల పత్రికలో ఓ వార్త వచ్చింది. ఆ తర్వాత రెండు రోజులకు అలాంటి ఆలోచన లేదని కేంద్ర రైల్వే మంత్రి పార్లమెంట్లో స్పష్టం చేశారు. అయినప్పటికీ దేశంలోని ఐదు రైళ్ల ఉత్పత్తి కేంద్రాలను మోదీ ప్రభుత్వం ప్రైవేటీకరిస్తోందని, మొత్తం రైల్వేను ప్రైవేటీకరించాలనే ఆలోచనలో ఇది భాగమంటూ మంగళవారం లోక్‌సభలో సోనియాగాంధీ ఆరోపించారు. అలాంటిదేమీ లేదంటూ ఆమె ఆరోపణలను రైల్వే మంత్రి కొట్టిపారేశారు. ప్రయోగాత్మకంగా క్యాటరింగ్ సర్వీసును, రైల్వే టిక్కెటింగ్ కార్పొరేషన్‌ను ప్రైవేటీకరించాలనుకుంటున్నారన్న విషయాన్ని మాత్రం ఆయన కొట్టివేయ లేదు. ఐఆర్సీటీసీగా వ్యవహరించే ‘ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్)’ ఆన్లైన్ ద్వారా రైల్వే టిక్కెట్లను విక్రయించడం కూడా చేపట్టి అందులో విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చింది. ఐఆర్సీటీసీ ఆన్లైన్ టిక్కెట్ అమ్మకాల విధానాన్ని ప్రారంభించడానికి ముందు ప్రయాణికులు టిక్కెట్ల కోసం కౌంటర్ల ముందు బారులు తీరి నిలబడాల్సి వచ్చేది. ఏజెంట్లకు భారీగా కమీషన్లు ఇవ్వాల్సి వచ్చేది. ‘ఢిల్లీ నుంచి చెన్నైకి రైళ్లో వెళ్లేందుకు ఆన్లైన్లో టిక్కెట్ బుక్ చేసుకోవడం అన్నది ఒకప్పుడు ఊహకు కూడా అందని ఆలోచన’ అని 2001 నుంచి 2006 వరకు రైల్వే ఐటీ సర్వీసుల జనరల్ మేనేజర్‌గా పనిచేసిన అమితాబ్ పాండే వ్యాఖ్యానించారు. క్యాటరింగ్, టూరిజం సేవలు ఐఆర్సీటీసీ పేరుకు తగ్గట్టుగానే టిక్కెట్ల అమ్మకం కన్న క్యాటరింగ్, టూరిజం సేవలను ఎక్కువ అందిస్తోంది. రైళ్లలో ఆహారాన్ని సరఫరా చేయడంతోపాటు రైల్లే స్టేషన్లలో ఫుడ్ కోర్టులను నిర్వహిస్తోంది. రైల్వేకున్న ఖాళీ స్థలాల్లో బడ్జెట్ హోటళ్లను కూడా నడుపుతోంది. కేవలం క్యాటరింగ్ సర్వీసుల కోసమే ఐఆర్సీటీసీని 1999లో ఏర్పాటు చేసినట్లు అమితాబ్ పాండే తెలిపారు. భారతీయ రైల్వేలో డేటా నిక్షిప్తం కోసం కంప్యూటర్లను వాడడం 1980 దశకంలోనే ప్రారంభమైందని, ఆన్లైన్లో టిక్కెట్ల అమ్మకాలను ఐఆసీటీసీ 2002లో ప్రారంభించిందని పాండే తెలిపారు. మొదట్లో ఆన్లైన్లో టిక్కెట్లు బుక్ చేసినవారికి ఎలా టిక్కెట్ అందజేయాలో తెలిసేది కాదని, అప్పటికి సెల్ఫోన్లలో ఎస్ఎంఎస్ సర్వీసు ప్రారంభం కాలేదని, దాంతో టిక్కెట్లను ప్రింట్చేసి వాటిని ప్రయాణికులకు అందజేయడానికి కొరియర్లను నియమించుకన్నామని పాండే తెలిపారు. కొరియర్లు ఒకటి, రెండు రోజుల్లో ప్రయాణికులకు టిక్కెట్లను అందజేసే వారిని వివరించారు. ఐఆర్సీటీసీ లాభాల్లో ఉందా? 2017–18 వార్షిక నివేదిక ప్రకారం ఐఆర్సీటీసీ టర్నోవర్ 1468.1 కోట్ల రూపాయలుకాగా, 693 కోట్ల రూపాయలు నష్టం వచ్చింది. కేంద్ర ప్రభుత్వం టిక్కెట్ బుకింగ్‌లపై సర్వీసు చార్జీలను 2016, నవంబర్ నుంచి తొలగించడం వల్ల నష్టం వచ్చినట్లు తెలుస్తోంది. అప్పటి వరకు ప్రతి ఏసీ బుకింగ్ టిక్కెట్‌పై 40 రూపాయలు, నాన్ఏసీ టిక్కెట్‌పై 20 రూపాయల చొప్పున సర్వీసు చార్జీలు వసూలు చేసేవారు. 2016–17లో టిక్కెట్ల అమ్మకం ద్వారా 24,485 కోట్ల రూపాయలు రాగా సర్వీసు చార్జీల ద్వారా 416 కోట్ల రూపాయలు వచ్చాయి. ఆ ఏడాది యాభై శాతం రెవెన్యూను రైల్వే మంత్రిత్వ శాఖతో పంచుకున్నప్పటికీ సంస్థకు 211 కోట్ల రూపాయల లాభం వచ్చింది. సర్వీసు చార్జీలను రద్దు చేసనప్పటి నుంచి ఇప్పటి వరకు ఐఆర్సీటీసీకి లాభాలు రాలేదు. 2016లో పెద్ద నోట్లను రద్దు చేసిన నేపథ్యంలో దేశంలో డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం నాడు సర్వీసు చార్జీలను రద్దు చేసింది. క్యాటరింగ్ ద్వారానే ఎక్కువ లాభం సంస్థకు వచ్చే రెవెన్యూలో టిక్కెట్ల అమ్మకం ద్వారా వచ్చేది చాలా తక్కువ. యాభై శాతం రెవెన్యూ క్యాటరింగ్ ద్వారానే వస్తోంది. 2017–18 సంవత్సరానికి 48.2 శాతం రెవెన్యూ క్యాటరింగ్ ద్వారానే వచ్చింది. లాభం కూడా ఎక్కువగానే ఉండేది. 2005లో రైళ్లలో క్యాటరింగ్ సర్వీసుల నిర్వహణను ప్రైవేటు సంస్థలకు కాంట్రాక్టులకు ఇచ్చారు. లాభాలకు ఆశపడిన ప్రైవేటు సంస్థలు నాసిరకం ఆహారాన్ని సరఫరా చే స్తూ అధిక డబ్బులు వసూలు చే స్తున్నాయన్న ఆరోపణలు రావడంతో 2009లో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి మమతా బెనర్జీ తిరిగి క్యాటరింగ్ పూర్తి బాధ్యతలను తిరిగి ఐఆర్‌సీటీసీకే అప్పగించారు. ఆ తర్వాత కూడా ఎన్నో మార్పులు జరిగాక ఫుడ్ కోర్టులు, ఫ్లాజాలు, ఫాస్ట్‌ఫుడ్ యూనిట్లకు పరిమితం చేసిన ఐఆర్‌సీటీసీకే రైల్వే క్యాటరింగ్ బాధ్యతలు మళ్లీ అప్పగించారు. రైల్వే క్యాటరింగ్, టూరిజం రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకరావడం కోసం ప్రయోగాత్మకంగా ప్రభుత్వ–ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త కార్పొరేట్ సంస్థను ఏర్పాటు చేసి దానికి అప్పగిస్తారని ఐఆర్సీటీసీ వెబ్సైట్ తెలియజేస్తోంది. అదే జరిగితే లాభాల మాట ఏమిటోగానీ వినియోగదారుల జేబుకు చిల్లు పడడం ఖాయం. -
అన్ రిజర్వ్డ్ టికెట్లు కూడా అన్లైన్లో..
న్యూఢిల్లీ: రైల్వే ప్రయాణికులకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయల్ తీపి కబురు తెలిపారు. ఇకపై రైళ్లలో అన్ రిజర్వ్డ్ టికెట్లను ఆన్లైన్ ద్వారా పొందే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు ట్విటర్ ద్వారా వెల్లడించారు. ప్రస్తుతం రైళ్లలో అన్ రిజర్వ్డ్ టికెట్లు కొనుగోలు చేయాలంటే.. ప్రయాణికులు టికెట్ కౌంటర్లను ఆశ్రయించాల్సిన సంగతి తెలిసిందే. రద్దీ సమయాల్లో అన్ రిజర్వ్డ్ టికెట్ల కోసం ప్రయాణికులు గంటల తరబడి క్యూ లైన్లలో వేచిచూడాల్సిన పరిస్థితి నెలకొంది. దీంతో అన్లైన్లో కూడా టికెట్లను విక్రయించడం ద్వారా ఈ సమస్యను కొంతవరకు పరిష్కరించవచ్చని రైల్వేశాఖ భావిస్తోంది. అందులో భాగంగా యూటీఎస్ యాప్ ద్వారా టికెట్లను విక్రయించే విధానాన్ని నవంబర్ 1 నుంచి అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్‌ను విండోస్, ఆండ్రాయిడ్ మొబైల్ వినియోగదారులు డౌన్లోడ్ చేసుకోవచ్చు. తద్వారా అన్ రిజర్వ్డ్ రైల్వే టికెట్లను నేరుగా అన్లైన్లోనే కొనుగోలు చేయవచ్చు. ఇప్పటికే ఈ విధానాన్ని 15 జోన్లలో రైల్వే శాఖ ప్రవేశపెట్టింది. కాగా, నవంబర్ 1 నుంచి దేశావ్యాప్తంగా ఈ విధానాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ యాప్ ద్వారా టికెట్ కొనుగోలు చేసేవారు రైల్వే ట్రాక్ నుంచి కనీసం 25 మీటర్ల దూరంలో ఉండాలి. యూటీఎస్ యాప్ ద్వారా కేవలం అన్ రిజర్వ్డ్ టికెట్లు మాత్రమే కాకుండా, ప్లాట్‌ఫామ్ టికెట్లు, రైల్వే పాస్‌లను కూడా కొనుగోలు చేయవచ్చు. యాప్‌లో డెబిట్, క్రెడిట్ కార్డులు, నెట్ బ్యాకింగ్‌తో ఇతర ఎలక్ట్రానిక్ పద్దతుల ద్వారా కూడా చెల్లింపులు జరపవచ్చు. నాలుగేళ్ల క్రితం కూడా ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినప్పటికీ అంతగా స్పందన రాలేదు. -
ఐఆర్సీటీసీ కొత్త విధానంలో రైల్వే ఆన్లైన్ టికెట్లు
సాక్షి, అమరావతి: రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ఆన్లైన్ వినియోగదారులు ఇక కొత్త చెల్లింపుల విధానంలో తమ టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘ఐఆర్సీటీసీ–ఐ పే’ విధానంలో టికెట్ల బుకింగ్, రద్దు చేసుకునే అవకాశాన్ని అన్ని బ్యాంకు కార్డుల ద్వారా కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఆగస్టు 18 నుంచి www.irctc.co.in ద్వారా ఐఆర్సీటీసీ–ఐ పే విధానం అమల్లోకి రానుందని ఐఆర్సీటీసీ అధికారి ఒకరు వెల్లడించారు. టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణం రద్దు చేసుకుంటే డబ్బు వాపసు సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదన్నారు. 25 సెకన్లలోనే బుక్ చేసుకోవాలి ఆన్లైన్లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి కొత్త నిబంధనలు విధించారు. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే నెలకు ఒక గుర్తింపు కార్డుపై 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. 120 రోజులు ముందుగా టికెట్లను పొందే విధానంలో మార్పులు లేవు. టికెట్లను బుక్ చేసుకు నే గడువును కుదించారు. కేవలం 25 సెకన్ల వ్యవధిలోనే రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసు ఇచ్చే విధానంలో నిబంధనలు మార్చారు. నిర్ణీత వేళలకు రైలు రాకున్నా.. 3 గంటలకు పైగా ప్రయాణీకుడు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో రద్దు చేసుకోవాలనుకుంటే.. ప్రయాణికుడికి మొత్తం చార్జీ సొమ్ము వాపసు వస్తుంది. -
ట్రైన్ టిక్కెట్ల బుకింగ్‌కు సరికొత్త విధానం
ఐఆర్సీటీసీ ట్రైన్ టిక్కెట్ల బుకింగ్‌ను ఎప్పడికప్పుడు సులభతరం చేస్తోంది. తాజాగా తత్కాల్ లాంటి ఈ-టిక్కెట్ల బుకింగ్‌కు సరికొత్త చెల్లింపు విధానాన్ని తీసుకొచ్చింది. ఐఆర్సీటీసీ రైల్ కనెక్ట్ పేరుతో మొబైల్ యాప్‌ను ప్రవేశపెట్టింది. ఈ యాప్‌తో తత్కాల్ కోటా కింద టిక్కెట్లతో పాటు ఈ-టిక్కెట్లను ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ యూజర్లు బుక్ చేసుకోవచ్చని మైక్రోబ్లాగింగ్ సైట్ ట్విటర్లో పేర్కొంది. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ అనేది పేమెంట్ విధానం. యూజర్లు ముందస్తుగా దీనిలో నగదును డిపాజిట్ చేసి, ఈ-టిక్కెట్లు బుక్ చేసుకునేటప్పుడు వాడుకోవచ్చు. అనుకోకుండా ప్రయాణం చేయవలసి వచ్చినపుడు అప్పటికప్పుడు రైలు టిక్కెట్ రిజర్వేషన్ చేసుకోవడం కోసం తత్కాల్ విధానాన్ని తీసుకొచ్చారు. ప్రయాణం చేయడానికి ఒక్క రోజు ముందు ఏసీ క్లాస్ తత్కాల్ టిక్కెట్లను ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ క్లాస్ టిక్కెట్లను 11 గంటలకు బుక్ చేసుకోవాల్సి ఉంటుంది. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో తప్ప తత్కాల్ స్కీమ్ కింద బుక్ చేసుకున్న టిక్కెట్లను క్యాన్సిల్ చేసుకుంటే, నగదును రీఫండ్ చేయరు. ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ ద్వారా ఈ-టిక్కెట్ల బుకింగ్ తొలుత కస్టమర్లు ఐఆర్సీటీసీ వెబ్సైట్లో రిజిస్టర్ అవ్వాలి గరిష్టంగా యూజర్లు ఆరు బ్యాంకులను తమ ప్రాధాన్య జాబితాలో ఇవ్వాలి మై ప్రొఫైల్ సెక్షన్లో బ్యాంకు ప్రాధాన్యతలను ఎప్పడికప్పుడు మేనేజ్ చేసుకోవచ్చు ఐఆర్సీటీసీ ఈ-వాలెట్ సర్వీసును ఎంపిక చేసుకుని ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు ఇతర డిజిటల్ వాలెట్లను ద్వారా కూడా టిక్కెట్లను బుక్ చేసుకునే ఆప్షన్‌ను ఐఆర్సీటీసీ కస్టమర్లకు ఉంది తత్కాల్ బుకింగ్ సిస్టమ్‌లో దుర్వినియోగాన్ని అరికట్టడానికి రైల్వే పలు చర్యలను తీసుకుంటోంది. ఒక్క యూజర్ ఐడీ మీద కేవలం రెండు తత్కాల్ టిక్కెట్లను మాత్రమే బుక్ చేసుకునే సౌకర్యముంటుంది. Now #IRCTC e-wallet users can book #rail e-tickets including of #Tatkal quota through IRCTC Rail Connect Android App. Download now! Just log on to https://t.co/s3mX8VqAiN pic.twitter.com/3h4F3Id7WX — IRCTC (@IRCTCofficial) May 1, 2018 -
రైల్వే టిక్కెట్ల బుకింగ్‌పై రివార్డ్స్
నగదు రహిత మాధ్యమాల ద్వారా రైల్వే టిక్కెట్లు బుక్ చేసుకునే ప్రయాణికులకు దేశీయ రైల్వే ప్రోత్సాహకాలు ప్రకటించేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే నెలవారీ ట్రావెల్ పాస్‌పై 0.5 శాతం డిస్కౌంట్‌ను ఆఫర్ చేస్తోంది. డెబిట్, క్రెడిట్ కార్డుల ద్వారా పేమెంట్లు చేసేవారికి ఈ ఆఫర్‌ను అందిస్తోంది. ప్రస్తుతం ఇదే మాదిరి సౌకర్యాన్ని అన్రిజర్వ్డ్ కేటగిరీలకు విస్తరిస్తోంది. నగదు రహితంగా టిక్కెట్లను కొనుగోలు చేసే వారికి ఉచితంగా ప్యాసెంజర్ ఇన్సూరెన్స్‌ను కూడా రైల్వే అందించనుంది. నగదు లావాదేవీలను తగ్గించడానికి తమవంతు సహకరిస్తున్నామని, ఇప్పటికే ప్రయాణికులకు పలు ప్రోత్సాహకాలను ప్రారంభించినట్టు రైల్వే బోర్డు మెంబర్-ట్రాఫిక్ మహ్మద్ జంషెడ్ చెప్పారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ ద్వారా టిక్కెట్లను కొనుగోలు చేసే ప్రయాణికులకు సర్వీసు ఛార్జీలను రద్దు చేయడంతో, దేశీయ రైల్వే ఇప్పటికే రూ.400 కోట్లను కోల్పోయింది. ప్రస్తుతం 60 శాతం లావాదేవీలు నగదురహితంగానే జరుగుతున్నట్టు తెలిసింది. పెద్ద నోట్ల రద్దు నుంచి 20 శాతం మాత్రమే పెరిగాయి. 2016 నవంబర్‌కు ముందు వరకు చాలా డిజిటల్ లావాదేవీలు ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా జరిగేవి. డిమానిటైజేషన్ తర్వాత రైల్వే పాయింట్ ఆఫ్ సేల్ మిషన్లను టిక్కెట్ కౌంటర్ల వద్ద అందించింది. అంతేకాక డిజిటల్ వాలెట్ల ద్వారా కూడా చెల్లింపులను అంగీకరిస్తోంది. 15వేల టిక్కెట్ కౌంటర్లలో పీఓఎస్ మిషన్లను రైల్వే అందించింది. మొత్తం చెల్లింపుల్లో 85-90 శాతం నగదురహితంగా జరగాలని దేశీయ రైల్వే టార్గెట్‌గా పెట్టుకుంది. -
నో వెయిటింగ్..కన్ఫర్మేషనేనా!
న్యూఢిల్లీ: బుక్ చేసుకున్న రైల్వే టికెట్లు కన్ఫర్మ్ అయ్యే అవకాశాలు రెట్టింపయ్యాయని రైల్ యాత్రి అనే ఓ ట్రావెల్ వెబ్సైట్ తాజా అధ్యయనంలో వెల్లడైంది. 2015 దీపావళి పండుగ రోజు 25.5 శాతం వెయిటింగ్ లిస్ట్ టికెట్లు రద్దు కాగా, ఇది 2016 నాటికి 18 శాతానికి తగ్గిపోయింది. ఈ ఏడాది దీపావళి నాటికి ఇదే పరిస్థితి కొనసాగిందని దీనిబట్టి చూస్తే వెయిటింగ్ లిస్ట్ టికెట్లు కన్ఫర్మ్ అయినట్లేనని పోర్టల్ తెలిపింది. డెహ్రడూన్–హౌరా డూన్ ఎక్స్‌ప్రెస్‌కు కన్ఫర్మేషన్ రేటు 20 శాతం మేర పెరిగింది. పుణె–జమ్మూ తావి జీలం ఎక్స్‌ప్రెస్ కు 12 శాతం, గయా మీదుగా వెళ్లే ముంబై సీఎస్టీ –హౌరా సూపర్ ఫాస్ట్ మెయిల్‌కు 11 శాతం కన్ఫర్మేషన్ రేటు పెరిగినట్లు వివరించింది. ఆయా మార్గాల్లో ప్రత్యేక రైళ్లను రైల్వేశాఖ ప్రవేశపెట్టడమే కారణమని తెలిపింది. -
ఆధార్ లింక్ చేస్తే అదనంగా రైల్వే టిక్కెట్లు
న్యూఢిల్లీ : ఆధార్ వాడకాన్ని పెంచుతూ వెళ్తున్న ప్రభుత్వం, దీనికోసం పలు చర్యలను తీసుకుంటూ వస్తోంది. ఆధార్ ధృవీకరించిన ప్రయాణికులకు ఐఆర్సీటీసీ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే టిక్కెట్ల నెలవారీ సంఖ్యను 6 నుంచి 12కు పెంచింది. అక్టోబర్ 26 నుంచి దీన్ని అమలుచేస్తోంది. ఐఆర్సీటీసీపై తమ ఆన్లైన్ బుకింగ్ అకౌంట్స్‌కు ఆధార్ నెంబర్లను జత చేసుకునేలా ప్రయాణికులను ప్రోత్సహించడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులు లేకుండా నెలకు ఆరు టిక్కెట్లను ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఆరుకు మించితే ఐఆర్సీటీసీ పోర్టల్‌పై ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్‌ను అప్డేట్ చేసుకోవాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు. 'మై ప్రొఫైల్' కేటగిరీ కింద ఆధార్ కేవైసీను క్లిక్ చేయాలని, అనంతరం ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్‌ను అప్డేట్ చేయాలని తెలిపారు. ఆధార్ లింక్ చేసి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటపీ వస్తుందని, దాన్ని ధృవీకరణ కోసం నమోదుచేయాలని చెప్పారు. అంతేకాక, ప్రయాణీకుల్లో ఏ ఒక్క వ్యక్తి ఆధార్ నంబర్ కూడా మాస్టర్ జాబితాలో అప్డేట్ చేయాలి. ఇది కూడా ఓటీపీ ద్వారా ధృవీకరిస్తారు. వినియోగదారులు 'మాస్టర్ జాబితా' తో పాటుగా ధృవీకరించిన ప్రయాణికుల పేర్లను స్టోర్ చేయవచ్చు. అనంతరం ఇక నెలకు ఆరుకు మించి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. -
రైల్వే టిక్కెట్ ధరలు తగ్గబోతున్నాయ్!
సాక్షి, న్యూఢిల్లీ : ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకునే రైల్వే టిక్కెట్ల ఛార్జీలు త్వరలోనే తగ్గబోతున్నాయి. ఈ-టిక్కెట్లపై విధించే మర్చంట్ డిస్కౌంట్ రేట్ల(ఎండీఆర్)ను ప్రభుత్వం తీసివేయాలని ప్లాన్ చేస్తోంది. ఐఆర్సీటీసీ వెబ్సైట్ ద్వారా ప్రయాణికులు ఆన్‌లైన్‌గా టిక్కెట్లను బుక్ చేసుకుంటే, ఎండీఆర్ ఛార్జీలు వర్తిస్తాయి. బ్యాంకులు తాము అందించే డెబిట్, క్రెడిట్ కార్డు సర్వీసులకు ఈ ఛార్జీలను విధిస్తున్నాయి. ఎండీఆర్ ఛార్జీలను పరిష్కరించడానికి బ్యాంకులతో సంప్రదింపులు జరుపుతున్నట్టు రైల్వే మంత్రిత్వ శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. ఒక్కసారి ఎండీఆర్ ఛార్జీలు కనుక ప్రభుత్వం తీసివేస్తే, ఆన్లైన్ పోర్టల్ ద్వారా బుకింగ్ చేసుకునే ప్రయాణికులకు టిక్కెట్ ధరలు ఆటోమేటిక్‌గా పడిపోనున్నాయి. వరల్డ్ ఎకానమిక్ ఫోరమ్‌లో ఇండియా ఎకానమిక్ సమిట్‌లో మాట్లాడిన గోయల్ ఈ విషయాన్ని తెలిపారు. రైల్వే వ్యవస్థలో 12 నెలల వ్యవధిలోనే మిలియన్ కొద్ది ఉద్యోగాలను సృష్టించనున్నట్టు కూడా పేర్కొన్నారు. టెక్నాలజీని ఎక్కువగా వినియోగించుకుని వృద్ధి పథాన్ని కూడా మార్చనున్నట్టు తెలిపారు. -
రైల్వే టికెట్.. ‘డెబిట్’తో కష్టం!!
న్యూఢిల్లీ: డెబిట్ కార్డుల ద్వారా ఆన్లైన్లో రైల్వే టికెట్ల బుకింగ్‌ను కఠినతరం చేస్తూ పలు బ్యాంకులను తమ డెబిట్ కార్డ్ పేమెంట్ గేట్‌వే నుంచి ఐఆర్సీటీసీ తొలగించింది. ఈ లిస్టులో ప్రభుత్వ రంగ దిగ్గజం ఎస్బీఐ, ప్రైవేట్ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంకులతో పాటు ఇతరత్రా పలు బ్యాంకులున్నాయి. ఆయా బ్యాంకులు కస్టమర్ల దగ్గర్నుంచి వసూలు చేసే కన్వీనియన్స్ ఫీజులో ఐఆర్సీటీసీకి వాటా ఇచ్చేందు కు నిరాకరించడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. రైల్వే ప్రయాణికులు టికెట్ల బుకింగ్ కోసం ఆన్లైన్ మాధ్యమంపై ఆధారపడటం గణనీయంగా పెరిగింది. దీంతో ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) పోర్టల్ చాలా బిజీ పోర్టల్స్‌లో ఒకటిగా ఉంటోంది. సాధారణంగా ఆన్లైన్లో టికెట్ బుకింగ్ సదుపాయం కల్పించినందుకు గాను ఐఆర్సీటీసీ రూ.20 మేర కన్వీనియన్స్ ఫీజు వసూలు చేసేది. అయితే, పెద్ద నోట్ల రద్దు తరవాత ఈ ఫీజు తీసుకోవటం లేదు. అయినప్పటికీ, బ్యాంకులు వసూలు చేస్తున్న కన్వీనియన్స్ ఫీజులో తమకూ కొంత వాటా దక్కుతుందని భావించింది. ఓవైపు ఈ అంశంపై ఇండియన్ బ్యాంక్స్ అసోసియేషన్‌తో(ఐబీఏ) ఐఆర్సీటీసీ, ఇండియన్ రైల్వేస్ ఇంకా చర్చలు జరుపుతూనే ఉన్నాయి. ఇంతలోనే తమ పేమెంట్ గేట్‌వేలో పలు బ్యాంకుల డెబిట్ కార్డుల వాడకాన్ని ఐఆర్సీటీసీ నిలిపివేసింది. కన్వీనియన్స్ ఫీజులో వాటా ఇవ్వడానికి ఆయా బ్యాంకులు నిరాకరించడమే ఇందుకు కారణమని తెలియవచ్చింది. ప్రస్తుతం గేట్‌వేలో ఉన్న బ్యాంకులివీ.. ప్రస్తుతం ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, యునైటెడ్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, యాక్సిస్ బ్యాంకుల కార్డు హోల్డర్లు మాత్రమే ఐఆర్సీటీసీ పోర్టల్‌లో డెబిట్ కార్డుల ద్వారా చెల్లింపులు జరిపే వీలుంటోంది. రైల్వే టికెటింగ్‌తో పాటు ప్రయాణికులు పొందే ఇతరత్రా సర్వీసుల లావాదేవీలపై చార్జీలకు సంబంధించి ఆర్బీఐ మార్గదర్శకాల ప్రకారం.. రూ. 1 నుంచి 1,000 దాకా విలువుండే ప్రతి లావాదేవీపై రూ. 5 మేర, రూ. 1,001 నుంచి రూ. 2,000 దాకా విలువ చేసే వాటిపై రూ. 10 మేర ఫీజు ఉంటుంది. అదే, రూ. 2,000 దాటితే లావాదేవీపై 0.5 శాతం ఎండీఆర్ (గరిష్ట పరిమితి రూ. 250)గా ఉంది. ప్రస్తుతం కన్వీనియన్స్ ఫీజుల బాదరబందీ లేని ఈ–వాలెట్స్ ద్వారా కూడా టికెట్లకు చెల్లింపులు జరిపే వీలుంది. కాగా, ఫీజుల్లో వాటాలు ఇవ్వాలంటూ ఐఆర్సీటీసీ డిమాండ్ చేయడం నిబంధనలకు విరుద్ధమని ఆయా బ్యాంకులు వాదిస్తున్నాయి. -
రైల్వే తత్కాల్ ప్రయాణీకులకు భారీ ఊరట!
న్యూఢిల్లీ: తత్కాల్ టికెట్ల బుకింగ్ సమయంలో ఇబ్బందులు పడుతున్న రైల్వే ప్రయాణికులకు రైల్వే శాఖ భారీ ఊరట నిచ్చింది. ముఖ్యంగా అత్యవసరంగా ప్రయాణించాలనుకునే ప్రయాణీకులు టికెట్‌ను ఆన్లైన్లో తక్షణం బుక్ చేసుకుని, పేమెంట్ తరువాత చేసే వెసులుబాటును అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంటివద్ద చెల్లించే (పే ఆన్ డెలీవరీ) సౌలభ్యాన్ని కల్పిస్తున్నట్టు బుధవారం ఐఆర్సీటీసీ ఓ ప్రకటనలో తెలిపింది. భారతీయ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్టీసీ) వెబ్ సైట్లో తత్కాల్ కోటా కింద బుక్ చేసుకున్న టిక్కెట్లకు డబ్బును తరువాత చెల్లించవచ్చని ఐఆర్సీటీసీ బుధవారం ప్రకటించింది. ఇంతవరకు, ఈ సేవ సాధారణ రిజర్వేషన్లకు మాత్రమే అందుబాటులో ఉంది. తాజా నిర్ణయం ద్వారా తత్కాల్ బుకింగ్‌ల కోసం ఆ సదుపాయం అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందుకోసం వినియోగదారులు irctc.payondelivery.co.in తో నమోదు చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ సమయంలో ఆధార్ లేదా పాన్ వివరాలు జతచేయాలి. అలాగే టికెట్ బుకింగ్ చేస్తున్నప్పుడు పే-ఆన్ డెలివరీ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. డిజిటల్ డెలివరీ ఎస్ఎంఎస్ / ఇ-మెయిల్ ద్వారా తక్షణమే జరుగుతుంది. 24 గంటల లోపు పేమెంట్ స్వీకరణ జరుగుతుంది. ఒకవేళ టికెట్ల డెలివరీ లోపు క్యాన్సిల్ చేసుకుంటే చట్ట ప్రకారం భారీ జరిమానా తప్పదు. అంతేకాదు ఐఆర్సీటీసీ ఖాతా శాశ్వతంగా క్లోజ్ అవుతుంది. టికెట్లు తమ ఇంటి దగ్గర బట్వాటా చేయాలనుకుంటే, వినియోగదారులు నగదు, డెబిట్ కార్డు లేదా క్రెడిట్ కార్డు ద్వారా చెల్లించాల్సి ఉంటుందని ఐఆర్సీటీసీ చెల్లింపు ప్రొడ్యూసర్ ఆండూరిల్ టెక్నాలజీస్ తెలిపింది. ఈ పే డెలివరీ ఫీచర్ ద్వారా వినియోగదారులు కొన్ని సెకండ్లలో తత్కాల్ టికెట్లు బుక్ చేసుకునే అవకాశం కలుగుతుందని ఆండూరిల్ టెక్నాలజీస్ సీఈవో అనురాగ్ బాజ్‌పాయ్ తెలిపారు. తద్వారా ఇది లక్షలాది మంది ప్రయాణీకులకు ఎంతో ప్రయోజనకరంగా ఉంటుందన్నారు. తత్కాల్ బుకింగ్ సమయంలో తరచుగా డబ్బు డెబిట్ అయినా, టికెట్ బుక్ కాకపోవడం, అలాగే డబ్బులు తిరిగి మన ఖాతాలోకి చేరడానికి కనీసం 7 నుంచి 15 రోజుల సమయం పడుతుంది. ఈ కొత్త ఈ లావాదేవీల వైఫల్యాలను తొలగిస్తుందని ఆయన వివరించారు. కాగా ఐఆర్సీటీసీ రోజువారీ లక్షా 30వేల తత్కాల్ లావాదేవీలను నిర్వహిస్తుంది. అయితే ఈ టికెట్ల మెజారిటీ కోటా ప్రారంభపు నిమిషాల్లోనే ఖతం కావడం కూడా తెలిసిందే. -
బార్‌కోడింగ్ కార్డుల ద్వారా రైల్వే టికెట్లు
కరెంట్ బుకింగ్ కౌంటర్లపై పరిశీలిస్తున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: నగదు రహిత సేవల్లో భాగంగా ప్రీ పెయిడ్ కార్డుల ద్వారా టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రారంభించేందుకు రైల్వే శాఖ కసరత్తు చేస్తోంది. కార్డులపై ఉండే బార్ కోడింగ్ ద్వారా వేగంగా ప్రక్రియ పూర్తి అయ్యే అవకాశం ఉండటంతో ఆ వైపు మొగ్గు చూపుతోంది. ఇప్పటికే రిజర్వేషన్ కౌంటర్లలో పాయింట్ ఆఫ్ సేల్ (పీవోఎస్) యంత్రాలను సమకూర్చి స్వైపింగ్ ద్వారా టికెట్లు జారీ చేస్తున్నారు. ఇవే యంత్రాలను కరెంట్ బుకింగ్ కౌంటర్లలో కూడా అందుబాటులోకి తేవాలని ముందుగా నిర్ణయిం చారు. స్వైపింగ్‌కు ఎక్కువ సమయం పడుతుం డటంతో వాటితో ఇబ్బందులు తలెత్తుతాయని భావించి ప్రస్తుతానికి వాటిని అందుబాటులోకి తేవద్దని నిర్ణయించారు. రైలు ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చిన తర్వాత చాలామంది హడావుడిగా వచ్చి టికెట్లు కొంటుంటారు. ఆ సమయంలో స్వైపింగ్ యంత్రాలలో లావాదేవీలు చేయటం వల్ల జాప్యం జరిగి రైళ్లను మిస్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో కరెంట్ బుకింగ్ కౌంటర్లలో స్వైపింగ్ యంత్రాలు సరికాదని అధికారులు నిర్ణయించారు. వీటికి బదులు బార్‌కోడింగ్ ఉండే కార్డుల ద్వారా వేగంగా టికెట్లు జారీ చేయొచ్చని భావిస్తున్నారు. ఇందుకు ప్రజలకు బార్‌కోడింగ్ ఉండే ప్రీపెయిడ్ కార్డులను జారీ చేయాలని భావిస్తున్నారు. -
టికెట్ల రద్దు ప్రహసనమే
నగదు చెల్లించని రైల్వే అధికారులు పెద్ద ప్రక్రియ అనంతరం బ్యాంకు అకౌంట్లలోకి జమ అవస్థలు పడుతున్న ప్రయాణికులు రాజమహేంద్రవరం సిటీ : పెద్ద నోట్ల రద్దు రైల్వే ప్రయాణీకుల సమస్యగా మారింది. రైల్వే టిక్కెట్ రద్దు చేసుకోవాలంటే గంట పాటు ప్రయాస పడాల్సి వస్తోం. టికెట్ రద్దు తరువాత తిరిగి డబ్బులు ఇస్తున్నారా అంటే టికెట్ డిపోజిట్ రసీదు ఇచ్చి, దాన్ని సికింద్రాబాద్ రైల్ నిలయానికి పంపాలని సూచిస్తున్నారు. ఇలా ప్రయాణీకులు తమ టిక్కెట్లను రద్దు చేసుకోవాలంటే మొదటగా రిజర్వేష¯ŒS కౌంటర్లో టిక్కెట్ రద్దు చేసుకుని, తరువాత మొదటి ప్లాట్‌ఫామ్ పై ఉన్న చీఫ్ టిక్కెట్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సంప్రదించి బ్యాంక్, ఆధార్ వివరాలతో దరఖాస్తు చేసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఇంత తతంగం నడిచిన తరువాత కూడా మీ డబ్బులు మీ బ్యాంక్ ఖాతాలకు జమ అవుతాయని అంటుండడంతో ప్రయాణికులు ఆశ్చర్యపోతునారు. పెద్ద నోట్ల రద్దు అనంతరం ఇప్పటివరకూ రాజమహేంద్రవరం రైల్వేస్టేçÙ¯ŒSలో ఇప్పటివరకూ 641 మంది వారి తమ టికెట్లు రద్దు చేసుకున్నారు. వారికి రైల్వే శాఖ ప్రయాణీకులకు 4లక్షల 58 వేల335 రూపాయలు ఇవ్వాల్సి ఉంది. అలాగే ద్వారపూడి, పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరు ప్రాంతాల్లోని ప్రయాణికులు రాజమహేంద్రవరం రైల్వే స్టేష¯ŒSకు రావాల్సి ఉండడంతో వారు ఇబ్బందులు వర్ణనాతీతం. -
శబరి రైళ్లలో దళారుల ‘ప్రత్యేక’ దగా!
ఇప్పటికే నిండిపోయిన బెర్తులు తప్పని వెయిటింగ్ లిస్ట్ రెట్టింపు చార్జీలకు టిక్కెట్ల విక్రయం అయ్యప్ప భక్తులకు ప్రయాణ కష్టాలు సాక్షి, సిటీబ్యూరో: శబరి యాత్ర అయ్యప్ప భక్తులకు భారంగా మారుతోంది. ప్రత్యేక రైళ్ల కోసం ముందస్తుగానే పాగా వేసిన మధ్యవర్తులు టిక్కెట్లు కొల్లగొట్టుకొనిపోయారు. దీంతో దక్షిణ మధ్య రైల్వే ప్రకటించిన 132 ప్రత్యేక రైళ్లలో వెయిటింగ్ లిస్ట్ భక్తులను వెక్కిరిస్తోంది. మధ్యవర్తుల నుంచి టిక్కెట్లు కొనుక్కోవడానికి భక్తులు రెట్టింపు చార్జీలు చెల్లించక తప్పడం లేదు. అనధికార ఏజెంట్లు, వారికి సహకరించే కొందరు రైల్వే సిబ్బంది కారణంగా టిక్కెట్ చార్జీలకు రెక్కలొస్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రకటించిన ప్రత్యేక రైళ్లలో బెర్తులన్నీ బుక్ అయిపోవడంతో భక్తులు అనధికార ఏజెంట్లను ఆశ్రయించవలసి వస్తోంది.మరోవైపు గతంలో లేని విధంగా ఈ ఏడాది ప్రత్యేక రైళ్లకు 30 శాతం అదనపు చార్జీలు విధించారు. దీంతో రూ.550 ఉండే స్లీపర్ చార్జీ రూ.650 దాటింది. ఏజెంట్లకు భక్తులు ఒక్కో టిక్కెట్‌కు రూ.1250 వరకు చెల్లించవలసి వస్తోంది. డిమాండ్ కారణంగా ఏజెంట్ల వద్ద కూడా టిక్కెట్లు లభించడం లేదు. పాగా ఇలా.. ప్రత్యేక రైళ్లలో భక్తులకు టిక్కెట్లు దక్కకుండా అనధికార వ్యక్తులు తమ వాళ్లను రంగంలోకి దించుతారు. నగరంలోని అన్ని ప్రధాన రైల్వే స్టేషన్ బుకింగ్ కేంద్రాల వద్ద కౌంటర్లు తెరుచుకోవడానికి ముందే వారి అనుచరులు లైన్లలో మోహరించి ఉంటారు. దీంతో నిజమైన భక్తులకు టిక్కెట్లు లభించడం లేదు. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడతో పాటు ఎంఎంటీఎస్ స్టేషన్లు, ఇతర బుకింగ్ కేంద్రాల్లోనూ మధ్యవర్తులదే హవా. ఏటా సీజన్‌కు అనుగుణంగా పెద్ద మొత్తంలో టిక్కెట్లను హస్తగతం చేసుకొనే మధ్యవర్తులు అధిక ధరలకు వాటిని తిరిగి భక్తులకు విక్రయిస్తున్నారు. గతంలో ఉన్నట్లుగా టిక్కెట్ బుకింగ్ సమయంలో గుర్తింపు కార్డులు సమర్పించాలనే నిబంధన లేకపోవడంతో పెద్ద సంఖ్యలో ఏజెంట్ల చేతుల్లోకి వెళ్తున్నాయి. రెండు రోజుల క్రితం ప్రకటించిన 132 ప్రత్యేక రైళ్లలో బెర్తులన్నీ బుక్ అయిపోవడమే కాకుండా వెయిటింగ్ లిస్టు 100 నుంచి 150కి చేరుకోవ డమే దళారుల హవాకు నిదర్శనం. భారంగా రైలు ప్రయాణం రోడ్డు మార్గంలో ప్రైవేట్ వాహనాల్లో వెళ్లడం ఎంతో ప్రమాదకరంగా ఉంటుంది. పైగా ఫిట్నెస్ లేని డొక్కు వాహనాలను అప్పగిస్తారు. ఈ ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకొని రైళ్లను ఆశ్రయిస్తే మధ్యవర్తులు, ఏజెంట్లు పెద్ద సంఖ్యలో టిక్కెట్లు ఎగురేసుకెళ్తున్నారు. దీంతో రెట్టింపు చార్జీలు చెల్లించవలసి వస్తోందని అయ్యప్ప భక్తులు వాపోతున్నారు. ఏటా అరకొర రైళ్లే ప్రతి సంవత్సరం ఇదే పరిస్థితి. అరకొర రైళ్లు ప్రకటిస్తారు. ఒక్క హైదరాబాద్ నుంచే కనీసం ఐదారు లక్షల మంది భక్తులు శబరికి వెళ్తారు. కానీ రైళ్లు మాత్రం చాలా పరిమితంగా ఉంటాయి. కౌంటర్ల వద్ద ఏజెంట్ల ప్రభావమే కనిపిస్తుంది. ఒక్క కౌంటర్ల వద్దనే కాదు. రైళ్లలోనూ ఎలాంటి తనిఖీలు ఉండవు. టీసీలు అసలు పట్టించుకోవడం లేదు. బినామీ పేర్లపైన వచ్చే వాళ్లపైన ఎలాంటి నియంత్రణ ఉండదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
సులువుగా రైల్వే టికె ట్లు
దక్షిణమధ్య రైల్వే శ్రీకారం వికారాబాద్‌లో ఏటీవీఎం ప్రారంభం వికారాబాద్ : ప్రయాణికులకు సులువుగా రైల్వే టికెట్లు లభించేలా దక్షిణ మధ్య రైల్వే సికింద్రాబాద్ డివిజన్ శ్రీకారం చుట్టింది. గతంలో కేవలం నగరాల్లోని రైల్వే స్టేషన్లకే పరిమితమైన ఆటోమెటిక్ టికెట్ వెండింగ్ మిషన్(ఏటీవీఎం)ను సికింద్రాబాద్ రైల్వే శాఖ ఉన్నతాధికారులు నిబంధనలను సడలించి ప్రయాణికులతో అనునిత్యం రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో ఏర్పాటు చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నారు. ఈ నేపథ్యంలో ఈ నెల 2 నుంచి లింగంపల్లి, శంకర్పల్లి, వికారాబాద్, తాండూరు, బీదర్ తదితర రైల్వే స్టేషన్లలో ఎనీ టైం టికెట్లు వచ్చే మిషన్ ప్రయాణికులకు రైల్వే అధికారులు అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ మేరకు శనివారం వికారాబాద్ రైల్వే జంక్షన్లో సీబీఎస్ చీఫ్ బుకింగ్ సూపర్వైజర్ లక్ష్మణ్ ఏటీవీఎం మిషన్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికులకు అతి తక్కువ సమయంలో క్యూలేకుండా రైలు రూట్ ఆధారంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడుకొని ఉన్న ఏటీవీఎం మిషన్‌ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఆయన వెల్లడించారు. ఈ మిషన్‌లో రైలు రూట్ మ్యాప్‌తో పాటు స్టేషన్లను గుర్తించే విధంగా సాంకేతిక పరిజ్ఞానం కలిగి ఉన్నట్లు తెలిపారు. అంతేకాకుండా మిషన్‌లో తెలుగు, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో ప్రయాణికులు తమకు ఇష్టమొచ్చిన భాషను ఎంపిక చేసి టికెట్లు పొందే సౌకర్యం ఉందని పేర్కొన్నారు. టికెట్లు పొందాలంటే సంబంధిత ఏటీవీఎం ఉన్న స్టేషన్లలోని బుకింగ్ సెంటర్లలో కనీస రుసుం రూ.50 డిపాజిట్ చేసి ప్రయాణికులు పొందాలని సూచించారు. ఆ తరువాత వారు స్మార్టుకార్డులో ఎన్ని డబ్బులు రిచార్జీ చేసుకుంటే అంత డబ్బులు నిల్వ ఉంటాయని తెలిపారు. కనీసం రూ.100 రిచార్జి చేసుకుంటే 5 శాతం అదనపు ఆదాయం సమకూరుతుందని తెలిపారు. రూ.1000 రిచార్జి చేసుకుంటే రూ.50, రూ. 10 వేల రిచార్జి చేసుకుంటే రూ.500 అదనంగా ఆదాయం వస్తుందని తెలిపారు. ఈ స్మార్టు కార్డులను ప్రయాణికులు సద్వినియోగం చేసుకొని డబ్బు, సమయాన్ని ఆదా చేసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో స్రవంతి, సవిత తదితరులు పాల్గొన్నారు. -
రైల్వే బుకింగ్‌కి కార్డులు
ఆన్లైన్ ద్వారా రైల్వే టికెట్లను వేగంగా బుక్ చేసుకోవడానికి ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లిమిటెడ్ (ఐఆర్సీటీసీ) ప్రీపెయిడ్ కార్డులను ప్రవేశపెట్టింది. ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో కలిసి ఐఆర్సీటీసీ-యూబీఐ ప్రీపెయిడ్ కార్డులను అందుబాటులోకి తెచ్చింది. ఈ కార్డులను ఉపయోగిస్తే... త్వరితగతిన టికెట్లను బుకింగ్ చేసుకునే వెసులుబాటుతో పాటు రివార్డు పాయింట్లు, రూ. 2 లక్షల ఉచిత ప్రమాద బీమా రక్షణను కల్పిస్తోంది. వర్చువల్, ఫిజికల్ కార్డుల రూపంలో అందిస్తున్న ఈ ప్రీపెయిడ్ కార్డుల్లో గరిష్టంగా రూ. 10,000 నుంచి రూ. 50,000 వరకు నగదును నింపుకోవచ్చు. కార్డు తీసుకున్న మొదటి ఆరు నెలల్లో మొదటి ఐదు లావాదేవీలపై ఎటువంటి రుసుములు ఉండవు. -
రైలు టికెట్లు ఇక సెల్ఫోన్లో కొనొచ్చు
న్యూఢిల్లీ: రైలు టికెట్ కోసం ఇక గంటల తరబడి వేచిచూడాల్సిన అవసరం లేదు. సెల్ఫోన్లో అన్రిజర్వ్డ్ కేటగిరీ టికెట్ కొనుక్కుని రైల్లో ప్రయాణించవచ్చు. ఇందుకు సంబంధించిన మొబైల్ అప్లికేషన్‌ను భారతీయ రైల్వే బుధవారం ప్రారంభించనుంది. రైల్వే శాఖ అధికారి ఒకరు మంగళవారం ఈ విషయాలు తెలిపారు. ఎలా పనిచేస్తుంది? ఆండ్రాయిడ్ ఫోన్ ఉన్న వారు గూగుల్ యాప్ స్టోర్ నుంచి రైల్వే యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. రైల్వే ఈ-వాలెట్ సృష్టించడం కోసం యూజర్‌కు రిజిస్ట్రేషన్ ఐడీ నంబరు వస్తుంది. టికెట్ల కొనుగోలు సొమ్మును ఈ-వాలెట్ మొబైల్ పేమెంట్ సిస్టమ్ ద్వారా ఆన్లైన్లో చెల్లించవచ్చు. లేదంటే, ఏ రైల్వే స్టేషన్‌లోని టికెట్ కౌంటర్లోనైనా చెల్లించవచ్చు. టికెట్లు తనిఖీ చేసే వారికి ఫోన్లోని సాఫ్ట్ కాపీ చూపితే చాలు. ఏ రైల్వే స్టేషన్‌కైనా వెళ్లి ఈ-వాలెట్‌ను టాప్అప్ చేసుకోవచ్చు. డెబిట్, క్రెడిట్ కార్డుతో ఐఆర్సీటీసీ వెబ్సైట్లోనూ టాప్అప్ చేయించుకోవచ్చు. అంతేకాదు, సీజన్ టికెట్లనూ రెన్యువల్ చేసుకోవచ్చు. ముంబై సబర్బన్ సెక్టార్లో ఈ విధానాన్ని ప్రయోగాత్మకంగా పరిశీలించారు. విజయవంతం కావడంతో దేశమంతటా ప్రవేశపెడుతున్నారు. -
రైల్వే టికెట్ల విక్రయాల ముఠా గుట్టురట్టు
విశాఖపట్నం: రైల్వే టికెట్ల విక్రయాల ముఠా గుట్టును ఆర్పీఎఫ్ పోలీసులు ఆదివారం విశాఖపట్నంలో రట్టు చేశారు. నగరంలోని బీచ్ రోడ్డులో అనధికారికంగా టికెట్లు విక్రయిస్తున్నారని సమాచారం అందడంతో ఆర్పీఎఫ్ పోలీసులు దాడి చేశారు. ప్రధాన నిందితుడు శివబాలనాగేశ్వర్తోపాటు బీముడు అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి మూడు వేల టికెట్లు, రూ. 50 వేల నగదుతోపాటు కంప్యూటర్, స్కానర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని పోలీసు స్టేషన్‌కు తరలించి.. తమదైన శైలిలో పోలీసులు విచారిస్తున్నారు. -
వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు సీటింగ్
హైదరాబాద్: పూర్తిస్థాయిలో డబ్బులు చెల్లించి రైల్వే టిక్కెట్లు కొనుగోలు చేసినప్పటికీ బెర్తులు లభించని వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు ఇక నుంచి సీటింగ్ సదుపాయం లభించనుంది. ఇప్పటి వరకు ఎగువశ్రేణిలోని ఖాళీలను దిగువ శ్రేణి ప్రయాణికులతో భర్తీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఉదాహరణకు థర్డ్ ఏసీలో బెర్తులు భర్తీ కాకుండా మిగిలి ఉంటే స్లీపర్ క్లాస్‌లోని ప్రయాణికులకు థర్డ్ ఏసీలో అవకాశం కల్పిస్తారు. ఇందుకోసం అదనంగా చెల్లించవలసిన పని ఉండదు, అలాగే స్లీపర్‌లో ఖాళీ అయిన బెర్తులను వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు కేటాయిస్తారు. అయితే ఇప్పటి వరకు ఇది స్లీపింగ్ సదుపాయం ఉన్న బెర్తులకే పరిమితమైంది. ఇక నుంచి కూర్చొని ప్రయాణించే సీట్లు ఉన్న ట్రైన్లలో, ఏసీ చైర్ కార్,ఎగ్జిక్యూటీవ్ క్లాస్‌లలో సైతం ఖాళీల్లో వెయిటింగ్ లిస్ట్ ప్రయాణికులకు సీటింగ్ సదుపాయం కల్పించనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు ఒక ప్రకటనలో తెలిపారు. -
రైల్వే టికెట్లు బ్లాక్‌లో అమ్ముతున్న వ్యక్తుల అరెస్ట్
విజయవాడ (రైల్వేస్టేషన్), న్యూస్‌లైన్ : అధిక ధరలకు విక్రయించేందుకు రైల్వే రిజర్వేషన్ టికెట్లను బుక్ చేసిన నలుగురిని రైల్వే పోలీసులు అరెస్టు చేసి ఆదివారం ఇన్చార్జి కోర్టులో హాజరుపరిచారు. వివరాల ప్రకారం.. పాలకొల్లు మండలం లంకలకోడేరు గ్రామంలోని పోస్టాఫీస్‌లో రైల్వే రిజర్వేషన్ సదుపాయం ఉంది. అదే గ్రామానికి చెందిన వేండ్ర శ్రీనివాసరావు (48), అతని కుమారులు అకిల్ వర్మతేజ (19), ధనుష్ తేజ (20) టికెట్లను వేర్వేరు పేర్లతో రిజర్వు చేయించి అధిక ధరకు విక్రయిస్తున్నారు. వీరికి దనుకొండ వెంకటకృష్ణ (22) సహకరిస్తుంటాడు. వీరిపై ఆర్పీఎఫ్ క్రైం ఇంటెలిజెన్స్ సిబ్బందికి గతంలో సమాచారం అందింది. శనివారం ఉదయం అందిన పక్కా సమాచారంతో వారు లంకలకోడేరులోని పోస్టాఫీస్‌కు వెళ్లారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఈ నలుగురిని తనిఖీ చేసి, ఏడు రిజర్వేషన్ టికెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ. 9,730. వారిని అదుపులోకి తీసుకుని భీమవరం ఆర్పీఎఫ్ సిబ్బందికి అప్పగించారు. వేండ్ర శ్రీనివాసరావు నర్సపూర్‌లో రైల్వేస్టేషన్లో పార్సిల్ విభాగంలోని ప్రైవేట్ లీజుదారుల వద్ద పని చేస్తుంటాడు. ప్రయాణికుల అవసరాలను గుర్తించి టికెట్లను బుక్ చేస్తున్నట్టు వీరు విచారణలో తెలిపారు. ఈ మేరకు నమోదైన కేసులో నిందితులను అరెస్టు చేసి, ఆదివారం విజయవాడలోని ఇన్చార్జి కోర్టులో హాజరుపరిచారు. వీరికి రిమాండ్ విధించారు. -
అయ్యప్పలకు దారేది
సాక్షి, గుంటూరు : జిల్లా నుంచి ఏటా కార్తీక మాసంలో లక్ష మందికి పైగా భక్తులు శబరిమల యాత్రకు వెళుతుంటారు. కార్తీక మాసం ప్రవేశించక ముందు నుంచే మండల దీక్ష చేపట్టే భక్తులు నవంబరు రెండో వారం నుంచి ప్రయాణమవుతుంటారు. జనవరి 16 వరకు అయ్య ప్పల రాకపోకలు సాగుతూనే ఉంటాయి. జిల్లా నుంచి శబరిమల వెళ్లే భక్తులు కేరళలోని కొట్టాయం, చెంగనూరు, ఎర్నాకుళం రైల్వేస్టేషన్లలో దిగుతారు. జిల్లా భక్తులంతా ఆయా ప్రాంతాలకు వెళ్లేందుకు శబరి ఎక్స్‌ప్రెస్ ఒక్కటే దిక్కుగా మారింది. మాచర్ల, నడికుడి, పిడుగురాళ్ల, నరసరావుపేట, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, పొన్నూరు, రేపల్లె, మంగళగిరి ప్రాంతాలకు చెందిన ఎక్కువ మంది భక్తులు ఈ రైల్లోనే ప్రయాణం చేసేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో శబరి ఎక్స్‌ప్రెస్ (17230) కు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. నవంబరు, డిసెంబరు నెలల్లో ఈ రైల్లోని ఏ తరగతిలోనూ టికెట్లు లేవు. రిజర్వేషన్లు పూర్తయ్యాయి. జనవరి ఐదో తేదీ వరకు నో రూమ్ అనే సమాధానమే ఎదురవుతోంది. సికింద్రాబాద్, నల్లగొండ, మిర్యాలగూడ, ఒంగోలు, నెల్లూరు స్టేషన్ల నుంచి టికెట్ రిజర్వ్ చేసుకునే భక్తులకు వెయిటింగ్ లిస్టు రోజురోజుకు పెరుగుతోంది. విజయవాడ మీదుగా వెళ్లే రైళ్లలోనూ ప్రయత్నాలు ప్రారంభించారు. అక్క డి నుంచి కొచ్చిన్, త్రివేండ్రం వెళ్లే రైళ్లకు టికెట్లు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఇదిలావుండగా, శబరిమల వెళ్లే భక్తుల కోసం సరైన సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయడంలో దక్షిణ మధ్య రైల్వే అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. శబరి, కొచ్చిన్ ఎక్స్ప్రెస్ల్లో టికెట్లు పూర్తయి న నేపథ్యంలో ఎంతో మంది భక్తులు ఆర్టీసీ, ఫోర్‌వీలర్స్ వైపు మొగ్గు చూపుతున్నారు. బస్సుల్లో వెళ్లలేం... ఇంతకు ముందు ఎక్కువ మందితో కలిసి బృం దంగా బస్సులో శబరి మల వెళ్లాం. ఇప్పుడు వెళ్లే పరిస్థితి లేదు. రైలు ప్రయాణమే మంచిదని నిర్ణయించుకున్నాం. అయితే శబరి ఎక్స్‌ప్రెస్‌కు టికెట్లు లేవు. తత్కాల్ టికెట్లు తీసుకోవాలని నిర్ణయించుకున్నాం. అవి కూడా దొరుకుతాయో,లేదో. - అయ్యప్ప, గుంటూరు. ఏటా ఇదే పరిస్థితి... రిజర్వేషన్ ఓపెన్ అయిన అరగంటలోనే టికెట్లన్నీ అయిపోతున్నాయి. రెండు రోజుల వ్యవధిలోనే శబరిమలలోని అన్ని తరగతు ల్లోని టికెట్లు నిండుకున్నాయి. ఏం చేయాలో తెలియడం లేదు. విజయవాడ వెళ్లి అక్కడి నుంచి వెళ్లే రైళ్లకు టికెట్లు తీసుకోవాలనుకుంటున్నాం. రైల్వే అధికారులు త్వరగా ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి. - మైలా సాయి కిరణ్, గుంటూరు.