న్యూఢిల్లీ : ఆధార్ వాడకాన్ని పెంచుతూ వెళ్తున్న ప్రభుత్వం, దీనికోసం పలు చర్యలను తీసుకుంటూ వస్తోంది. ఆధార్ ధృవీకరించిన ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ పోర్టల్ ద్వారా బుక్ చేసుకునే టిక్కెట్ల నెలవారీ సంఖ్యను 6 నుంచి 12కు పెంచింది. అక్టోబర్ 26 నుంచి దీన్ని అమలుచేస్తోంది. ఐఆర్‌సీటీసీపై తమ ఆన్‌లైన్ బుకింగ్ అకౌంట్స్‌కు ఆధార్ నెంబర్లను జత చేసుకునేలా ప్రయాణికులను ప్రోత్సహించడానికి రైల్వే ఈ నిర్ణయం తీసుకుంది. ఆధార్ కార్డులు లేకుండా నెలకు ఆరు టిక్కెట్లను ప్రయాణికులు బుక్ చేసుకోవచ్చని, ఒకవేళ ఆరుకు మించితే ఐఆర్‌సీటీసీ పోర్టల్‌పై ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్‌ను అప్‌డేట్ చేసుకోవాలని రైల్వే అధికారులు పేర్కొన్నారు.
'మై ప్రొఫైల్' కేటగిరీ కింద ఆధార్ కేవైసీను క్లిక్ చేయాలని, అనంతరం ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్‌ను అప్‌డేట్ చేయాలని తెలిపారు. ఆధార్ లింక్ చేసి ఉన్న మొబైల్ నెంబర్‌కు ఓటపీ వస్తుందని, దాన్ని ధృవీకరణ కోసం నమోదుచేయాలని చెప్పారు. అంతేకాక, ప్రయాణీకుల్లో ఏ ఒక్క వ్యక్తి ఆధార్ నంబర్ కూడా మాస్టర్ జాబితాలో అప్‌డేట్ చేయాలి. ఇది కూడా ఓటీపీ ద్వారా ధృవీకరిస్తారు. వినియోగదారులు 'మాస్టర్ జాబితా' తో పాటుగా ధృవీకరించిన ప్రయాణికుల పేర్లను స్టోర్ చేయవచ్చు. అనంతరం ఇక నెలకు ఆరుకు మించి టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment