
సాక్షి, అమరావతి: రైల్వే టికెట్లు బుక్ చేసుకునే ఆన్‌లైన్ వినియోగదారులు ఇక కొత్త చెల్లింపుల విధానంలో తమ టికెట్లు బుకింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. ‘ఐఆర్‌సీటీసీ–ఐ పే’ విధానంలో టికెట్ల బుకింగ్, రద్దు చేసుకునే అవకాశాన్ని అన్ని బ్యాంకు కార్డుల ద్వారా కల్పిస్తున్నట్లు రైల్వే శాఖ పేర్కొంది. ఆగస్టు 18 నుంచి www.irctc.co.in ద్వారా ఐఆర్‌సీటీసీ–ఐ పే విధానం అమల్లోకి రానుందని ఐఆర్‌సీటీసీ అధికారి ఒకరు వెల్లడించారు. టికెట్లు బుక్ చేసుకుని ప్రయాణం రద్దు చేసుకుంటే డబ్బు వాపసు సమస్యలు ఎదురయ్యే అవకాశం లేదన్నారు.
25 సెకన్లలోనే బుక్ చేసుకోవాలి
ఆన్‌లైన్‌లో రైల్వే టికెట్లు బుక్ చేసుకునేవారికి కొత్త నిబంధనలు విధించారు. ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేస్తే నెలకు ఒక గుర్తింపు కార్డుపై 12 టికెట్ల వరకు బుక్ చేసుకోవచ్చు. 120 రోజులు ముందుగా టికెట్లను పొందే విధానంలో మార్పులు లేవు. టికెట్లను బుక్ చేసుకు నే గడువును కుదించారు. కేవలం 25 సెకన్ల వ్యవధిలోనే రైల్వే టికెట్లు బుక్ చేసుకోవాలి. టికెట్ రద్దు చేసుకుంటే డబ్బు వాపసు ఇచ్చే విధానంలో నిబంధనలు మార్చారు. నిర్ణీత వేళలకు రైలు రాకున్నా.. 3 గంటలకు పైగా ప్రయాణీకుడు వేచి ఉండాల్సిన పరిస్థితుల్లో రద్దు చేసుకోవాలనుకుంటే.. ప్రయాణికుడికి మొత్తం చార్జీ సొమ్ము వాపసు వస్తుంది.