2,000 ఐడీలను బ్లాక్‌ చేసిన రైల్వేశాఖ | Southern Railway blocked over 2,000 individual and IRCTC user IDs, along with 119 agent IDs | Sakshi
Sakshi News home page

2,000 ఐడీలను బ్లాక్‌ చేసిన రైల్వేశాఖ

Published Thu, Jan 23 2025 1:15 PM | Last Updated on Thu, Jan 23 2025 2:55 PM

Southern Railway blocked over 2,000 individual and IRCTC user IDs, along with 119 agent IDs

రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. టికెట్‌ బుకింగ్‌(Ticket Booking) సమయంలో అక్రమ సాఫ్ట్‌వేర్ల వినియోగాన్ని అరికట్టడానికి దక్షిణ రైల్వే 2,000 వ్యక్తిగత, ఐఆర్‌సీటీసీ(IRCTC) యూజర్ ఐడీలతోపాటు 119 ఏజెంట్ ఐడీలను బ్లాక్ చేసింది. ప్రయాణీకులందరికీ టిక్కెట్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనైతికంగా బుకింగ్స్‌ చేస్తున్న మోసగాళ్లు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.

సమస్య ఏమిటంటే..

పండగ సీజన్లు, అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో దళారులు, ఏజెంట్లు అక్రమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బల్క్‌గా టికెట్లు బుక్ చేస్తున్నట్లు దక్షిణ రైల్వేశాఖ గుర్తించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తరుచూ అరెస్టులు, టికెట్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ సమస్య కొనసాగుతూనే ఉందని తెలిపింది. తత్కాల్ బుకింగ్స్ సమయంలో ఐఆర్‌సీటీసీ పోర్టల్‌పై ట్రాఫిక్‌ ఎక్కువ ఉండడంతో క్రాష్ అవుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావాలనే కొందరు మోసగాళ్లు అక్రమ సాఫ్ట్‌వేర్లను ఉపయోగించి ట్రాఫిక్‌ను క్రియేట్‌ చేస్తూ తత్కాల్‌ పోర్టల్‌ సరిగా పనిచేయకుండా చేస్తున్నారు. దాంతో సాధారణ ప్రయాణికులకు టికెట్‌లు అందుబాటులో ఉండడంలేదు. దాంతో ఏజెంట్ల నుంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైల్వేశాఖ తెలిపింది.

రైల్వేశాఖ చర్యలు

ఈ సవాళ్లను పరిష్కరించడానికి దక్షిణ రైల్వే అనేక చర్యలను అమలు చేస్తోంది.

  • 119 ఏజెంట్ ఐడీలతో పాటు 2,003 వ్యక్తిగత, ఐఆర్‌సీటీసీ యూజర్ ఐడీలను బ్లాక్ చేశారు.

  • బల్క్, తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు ఉపయోగించే పది వేర్వేరు అక్రమ సాఫ్ట్‌వేర్‌ టూల్స్‌ను నిలిపేశారు.

  • ఒకే ఐపీ అడ్రస్ నుంచి లేదా వీపీఎన్‌ల ద్వారా ఎక్కువ బుకింగ్‌లు చేసే వారిని, రియల్ టైమ్‌లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి, వాటిని బ్లాక్ చేయడానికి ఏఐ టెక్నాలజీని అమలు చేస్తున్నారు.

  • యూజర్ ఐడీలపై రోజువారీ తనిఖీలు నిర్వహిస్తూ అవకతవకలకు పాల్పడిన వారిని డీయాక్టివేట్ చేస్తున్నారు.

ఇదీ చదవండి: ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్‌గేట్‌’పై మస్క్‌ విమర్శలు

ప్రయాణికులపై ప్రభావం..

రైల్వేశాఖ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రయాణీకులకు మరిన్ని టికెట్లు అందుబాటులో ఉండేలా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు అనుకున్న ధరలకే టికెట్‌ లభ్యమవుతుందని, దళారులు, ఏజెంట్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. దక్షిణ రైల్వే గత ఏడాది 391 కేసులు నమోదు చేయగా, 404 మంది దళారులను అరెస్టు చేయడంతో పాటు రూ.1.2 కోట్ల విలువైన 7,506 టికెట్లను స్వాధీనం చేసుకుంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement