southern railways
-
2,000 ఐడీలను బ్లాక్ చేసిన రైల్వేశాఖ
రైల్వే టికెట్ల బుకింగ్‌లో అక్రమాలను అరికట్టేందుకు రైల్వేశాఖ చర్యలు చేపట్టింది. టికెట్ బుకింగ్(Ticket Booking) సమయంలో అక్రమ సాఫ్ట్వేర్ల వినియోగాన్ని అరికట్టడానికి దక్షిణ రైల్వే 2,000 వ్యక్తిగత, ఐఆర్సీటీసీ(IRCTC) యూజర్ ఐడీలతోపాటు 119 ఏజెంట్ ఐడీలను బ్లాక్ చేసింది. ప్రయాణీకులందరికీ టిక్కెట్లు అందుబాటులో ఉంచేందుకు చర్యలు చేపట్టింది. నిబంధనలకు విరుద్ధంగా, అనైతికంగా బుకింగ్స్ చేస్తున్న మోసగాళ్లు వ్యవస్థను దుర్వినియోగం చేయకుండా నిరోధించడానికి విస్తృత ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిపింది.సమస్య ఏమిటంటే..పండగ సీజన్లు, అధిక డిమాండ్ ఉన్న సమయాల్లో దళారులు, ఏజెంట్లు అక్రమ సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించి బల్క్‌గా టికెట్లు బుక్ చేస్తున్నట్లు దక్షిణ రైల్వేశాఖ గుర్తించింది. రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (RPF) తరుచూ అరెస్టులు, టికెట్లు స్వాధీనం చేసుకున్నప్పటికీ ఈ సమస్య కొనసాగుతూనే ఉందని తెలిపింది. తత్కాల్ బుకింగ్స్ సమయంలో ఐఆర్సీటీసీ పోర్టల్‌పై ట్రాఫిక్ ఎక్కువ ఉండడంతో క్రాష్ అవుతుంది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కావాలనే కొందరు మోసగాళ్లు అక్రమ సాఫ్ట్వేర్లను ఉపయోగించి ట్రాఫిక్‌ను క్రియేట్ చేస్తూ తత్కాల్ పోర్టల్ సరిగా పనిచేయకుండా చేస్తున్నారు. దాంతో సాధారణ ప్రయాణికులకు టికెట్లు అందుబాటులో ఉండడంలేదు. దాంతో ఏజెంట్ల నుంచి అధిక ధరలకు విక్రయిస్తున్నారని రైల్వేశాఖ తెలిపింది.రైల్వేశాఖ చర్యలుఈ సవాళ్లను పరిష్కరించడానికి దక్షిణ రైల్వే అనేక చర్యలను అమలు చేస్తోంది.119 ఏజెంట్ ఐడీలతో పాటు 2,003 వ్యక్తిగత, ఐఆర్సీటీసీ యూజర్ ఐడీలను బ్లాక్ చేశారు.బల్క్, తత్కాల్ టికెట్ బుకింగ్‌లకు ఉపయోగించే పది వేర్వేరు అక్రమ సాఫ్ట్వేర్ టూల్స్‌ను నిలిపేశారు.ఒకే ఐపీ అడ్రస్ నుంచి లేదా వీపీఎన్ల ద్వారా ఎక్కువ బుకింగ్‌లు చేసే వారిని, రియల్ టైమ్‌లో అనుమానాస్పద లావాదేవీలను గుర్తించడానికి, వాటిని బ్లాక్ చేయడానికి ఏఐ టెక్నాలజీని అమలు చేస్తున్నారు.యూజర్ ఐడీలపై రోజువారీ తనిఖీలు నిర్వహిస్తూ అవకతవకలకు పాల్పడిన వారిని డీయాక్టివేట్ చేస్తున్నారు.ఇదీ చదవండి: ట్రంప్ మద్దతు ఉన్న ‘స్టార్గేట్’పై మస్క్ విమర్శలుప్రయాణికులపై ప్రభావం..రైల్వేశాఖ తీసుకుంటున్న ఈ చర్యలు ప్రయాణీకులకు మరిన్ని టికెట్లు అందుబాటులో ఉండేలా చేస్తాయని అభిప్రాయపడుతున్నారు. ప్రయాణికులు అనుకున్న ధరలకే టికెట్ లభ్యమవుతుందని, దళారులు, ఏజెంట్ల ప్రభావాన్ని తగ్గిస్తుందని భావిస్తున్నారు. దక్షిణ రైల్వే గత ఏడాది 391 కేసులు నమోదు చేయగా, 404 మంది దళారులను అరెస్టు చేయడంతో పాటు రూ.1.2 కోట్ల విలువైన 7,506 టికెట్లను స్వాధీనం చేసుకుంది. -
సికింద్రాబాద్ నుంచి గజ్వేల్‌కు రైలు కూత
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని హైదరాబాద్ నుంచి గజ్వేల్‌కు త్వరలోనే రైల్వే సదుపాయం అందుబాటులోకి రానుంది. మనోహరాబాద్–గజ్వేల్ మధ్య చేపట్టిన రైల్వే నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ ఏడాది చివరి నాటికి పనులు పూర్తి చేసి రైళ్లను పట్టాలెక్కించే దిశగా దక్షిణమధ్య రైల్వే కార్యాచరణ చేపట్టింది. దీంతో ఇప్పటి వరకు కేవలం రోడ్డు సదుపాయం మాత్రమే ఉన్న గజ్వేల్ ప్రజలకు త్వరలోనే రైలు కూత వినిపించనుంది. హైదరాబాద్ నుంచి గజ్వేల్ మధ్య ప్రతిరోజు రాకపోకలు సాగించే వేలాది మందికి ఇది ఎంతో ప్రయోజనకరం కానుంది. ఈ మార్గంలో ప్యాసింజర్ రైళ్లను కూడా నడపనున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న 151 కిలోమీటర్ల పొడవైన మనోహరాబాద్–కొత్తపల్లి రైల్వేలైన్ నిర్మాణంలో మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు 32 కిలోమీటర్లను మొదటి దశ కింద చేపట్టారు. ఇందుకోసం కావలసిన భూమిని, ఇతర మౌలిక సదుపాయాలను రాష్ట్రప్రభుత్వం అందజేసింది. దీంతో పనుల్లో వేగం పెరిగింది. ఎట్టి పరిస్థితుల్లోనూ డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని దక్షిణమధ్య రైల్వే లక్ష్యంగా పెట్టుకుంది. ప్రస్తుతం సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల నుంచి మనోహరాబాద్ వరకు డెమూ, మెమూ ప్యాసింజర్ రైళ్లు నడుస్తున్నాయి. మనోహరాబాద్ నుంచి గజ్వేల్ వరకు లైన్లు పూర్తయితే ఈ రైళ్లను అక్కడి వరకు పొడిగిస్తారు. జనవరి నుంచి మార్చి మధ్యలో అన్ని భద్రతా పరీక్షలను పూర్తి చేసుకొని గజ్వేల్ వరకు రైళ్లను నడపనున్నారు. అలాగే ఈ మార్గంలో ఎంఎంటీఎస్ రైళ్ల రాకపోకలకు కూడా మార్గం సుగమం కానుంది. నాలుగు దశల్లో కొత్తపల్లి వరకు రైల్వేలైన్లు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి కరీంనగర్ వరకు నేరుగా రైల్వే సదుపాయం లేదు. ఈ క్రమంలో రాష్ట్రప్రభుత్వం మనోహరాబాద్–కొత్తపల్లి లైన్లను ప్రతిపాదించింది. దీనికి రైల్వేశాఖ నుంచి ఆమోదం లభించింది. మొత్తం రూ.1,160 కోట్ల అంచనాలతో చేపట్టిన ఈ ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం భూమి, మౌలిక వసతులను ఉచితంగా అందజేయడంతో పాటు నిర్మాణ వ్యయంలో మూడో వంతు నిధులను అందజేస్తోంది. ఇప్పటి వరకు రెండు విడుతలుగా రూ.500 కోట్లను రాష్ట్రం విడుదల చేసింది. ఈ ప్రాజెక్టును మొత్తం 4 దశల్లో పూర్తి చేసేందుకు ప్రణాళికలను రూపొందించారు. మొదటి దశలో మనోహరాబాద్–గజ్వేల్ (32 కిలోమీటర్లు), రెండో దశలో గజ్వేల్– దుద్దెడ (33 కిలోమీటర్లు), మూడో దశ కింద దుద్దెడ–సిరిసిల్ల (48 కిలోమీటర్లు), నాలుగోదశలో సిరిసిల్ల– కొత్తపల్లి (38 కిలోమీటర్లు) మధ్య పనులను పూర్తి చేస్తారు. వచ్చే ఐదేళ్లలో ఈ ప్రాజెక్టును పూర్తి చేయనున్నారు. కొత్తగా రెండు రైల్వేస్టేషన్లు అటు రైల్వేశాఖ, ఇటు రాష్ట్రప్రభుత్వం సమన్వయంతో చేపట్టిన ఈ ప్రాజెక్టులో భాగంగా మనోహరాబాద్–గజ్వేల్ మధ్య నాచారం, ఈరానగర్లలో రెండు కొత్త రైల్వేస్టేషన్లను నిర్మిస్తున్నారు. ఇప్పటికే ట్రాక్ నిర్మాణ పనులు తుది దశకు చేరుకున్నాయి. 4 భారీ బ్రిడ్జీలు, మరో 43 చిన్న బ్రిడ్జీలను నిర్మిస్తున్నారు. మరో 2 అతి పెద్ద రోడ్డు ఓవర్ బ్రిడ్జీలు, 6 చిన్న ఆర్వోబీలను ఈ ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్నారు. -
రైల్ టికెట్ హాంఫట్
సాక్షి, సిటీబ్యూరో: దక్షిణమధ్య రైల్వేలో దళారుల దందా కొనసాగుతోంది. ప్రత్యేక రైళ్లనూ వదిలిపెట్టకుండా ‘టికెట్లు’ కొల్లగొట్టేస్తున్నారు. రిజర్వేషన్ కౌం టర్లలో పనిచేసే కొంతమంది సిబ్బం దితో కుమ్మక్కై సాగిస్తున్న ఈ అక్రమ దందాలో సామాన్య ప్రయాణికులు దగా పడుతున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు బుకింగ్ గంటల వ్యవధిలో ‘క్లోజ్’ అయిపోగా, తాజాగా ప్రకటించిన 128 శబరిమలై ప్రత్యేక రైళ్లలోనూ అదే పరిస్థితి నెల కొంది. శబరి వెళ్లే భక్తుల కోసం డిసెం బర్, జనవరిలో నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వీటికి బుకింగ్ ప్రారంభమైన గంటలోనే మొత్తం రిజర్వేషన్ కేటగిరీల్లోని సీట్లను దళారులు ఎగరేసుకుపోయారు. దీంతో సోమవారం ఒక్కరోజే వెయిటింగ్ లిస్ట్ చాంతాడులా పెరిగింది. తెల్లవారుజాము నుంచే టికెట్ల కోసం పడిగాపులు కాసిన అయ్యప్ప భక్తులు ఉస్సూరుమంటూ వెనుదిరిగారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో దళారులు సాగిస్తున్న అక్రమ దందా ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ప్రత్యేక రైళ్లే కాదు.. రెగ్యులర్ రైళ్లలోనూ వీరి దందా కొనసాగుతోంది. వీరి నియంత్రణకు ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డు నిబంధన అపహాస్యమవుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లలో దళారుల ఆట కట్టించేందుకు ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఇదీ దళారుల ‘వరుస’.. సంక్రాంతి, శబరిమలై, దసరా, దీపావళి, వేసవి సెలవులు, ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇవి బయల్దేరతాయి. రద్దీని ముందే అంచనా వేసే ఏజెంట్లు, దళారులు.. ప్రయాణికులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో టికెట్లు దక్కవని, రైల్వే అధికారులతో తమకున్న సంబంధాల దృష్ట్యా తేలిగ్గా రిజర్వేషన్లు లభిస్తాయంటూ నమ్మించి బేరం కుదుర్చుకుంటున్నారు.రిజర్వేషన్ బుకింగ్ కష్టాలను చవిచూసే ప్రయాణికులు సహజంగానే వీరి మాటల్ని నమ్మేస్తున్నారు. దీంతో ముందస్తుగానే ప్రయాణికుల గుర్తింపు కార్డులను సేకరించి తమ దగ్గర పనిచేసే వ్యక్తులను బుకింగ్ కార్యాలయాల వద్ద వరుసలో నిల్చోబెడుతున్నారు. ప్రయాణికుల ‘క్యూ’ కంటే దళారులు, ఏజెంట్లకు చెందిన వారే ముందు వరుసలో నిల్చుని మొత్తం రిజర్వేషన్లను ఎగురేసుకెళ్తున్నారు. బుకింగ్ కార్యాలయాల్లో సిబ్బందికి, ఏజెంట్లతో ముందే కుదిరిన ఒప్పందం మేరకు ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది. రెట్టింపు వసూళ్లు... రైళ్ల కొరత, రద్దీని చూపి దళారులు అసలు చార్జీలపై 50 నుంచి 70 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేక దళారులు అడిగినంతా ప్రయాణికులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలై వెళ్లే అవకాశం ఉంది. దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన 128 రైళ్లలో 46 మాత్రమే హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. మిగతావన్నీ రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరుతాయి. దళారుల చేతివాటం కారణంగా అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ జాబితా 300 నుంచి 400కు పెరిగింది. ఒకవైపు ప్రైవేట్ బస్సుల కొరత, మరోవైపు తగినన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడుతున్నారు. కానీ ఇప్పటికే ప్రకటించిన రైళ్లు నిండిపోయాయి. మరిన్ని రైళ్లు వేస్తారో, లేదో తెలియని స్థితిలో స్వాములు ఆందోళన చెందుతున్నారు. త్వరలో సంక్రాంతి... ఈ పరిస్థితి ఇలా ఉంటే త్వరలో క్రిస్టమస్, సంక్రాంతి వేడుకలు రానున్నాయి. ఇప్పటికే సంక్రాంతి నాటికి అన్ని రెగ్యులర్ రైళ్లలో బెర్తులు బుక్ అయ్యాయి. ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేదు. సాధారణంగా రోజూ లక్షన్నర నుంచి 2 లక్షల మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుండగా, సంక్రాంతికి ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. 2.5 లక్షల మందికి రైళ్లే ఆధారం. క్రిస్టమస్, సంక్రాంతి రోజుల్లో పిల్లలకు ఎక్కువ రోజులు సెలవులు ఉండడం వల్ల నగరవాసులు ఇప్పట్నుంచే ప్రయాణానికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇటీవల సీమాం ధ్రలో సమ్మె కారణంగా దసరా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న ప్రజలు ఈసారి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. కానీ రైళ్లలో దళారుల బెడద వీరిని బెంబేలెత్తిస్తోంది. ఆర్పీఎఫ్ పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా సైతం దళారుల పన్నాగాల ముందు వెలవెలబోతున్నాయి.