రైల్ టికెట్ హాంఫట్ | rail tickets prices are too high | Sakshi
Sakshi News home page

రైల్ టికెట్ హాంఫట్

Published Wed, Nov 27 2013 1:42 AM | Last Updated on Sat, Sep 2 2017 1:00 AM

rail tickets prices are too high

సాక్షి, సిటీబ్యూరో:
 దక్షిణమధ్య రైల్వేలో దళారుల దందా కొనసాగుతోంది. ప్రత్యేక రైళ్లనూ వదిలిపెట్టకుండా ‘టికెట్లు’ కొల్లగొట్టేస్తున్నారు. రిజర్వేషన్ కౌం టర్లలో పనిచేసే కొంతమంది సిబ్బం దితో కుమ్మక్కై సాగిస్తున్న ఈ అక్రమ దందాలో సామాన్య ప్రయాణికులు దగా పడుతున్నారు. మొన్నటికి మొన్న సంక్రాంతి ప్రత్యేక రైళ్లకు బుకింగ్ గంటల వ్యవధిలో ‘క్లోజ్’ అయిపోగా, తాజాగా ప్రకటించిన 128 శబరిమలై ప్రత్యేక రైళ్లలోనూ అదే పరిస్థితి నెల కొంది. శబరి వెళ్లే భక్తుల కోసం డిసెం బర్, జనవరిలో నడిపేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేసింది. వీటికి బుకింగ్ ప్రారంభమైన గంటలోనే మొత్తం రిజర్వేషన్ కేటగిరీల్లోని సీట్లను దళారులు ఎగరేసుకుపోయారు. దీంతో సోమవారం ఒక్కరోజే వెయిటింగ్ లిస్ట్ చాంతాడులా పెరిగింది. తెల్లవారుజాము నుంచే టికెట్ల కోసం పడిగాపులు కాసిన అయ్యప్ప భక్తులు ఉస్సూరుమంటూ వెనుదిరిగారు. ట్రావెల్ ఏజెంట్ల ముసుగులో దళారులు సాగిస్తున్న అక్రమ దందా ప్రయాణికుల పాలిట శాపంగా పరిణమిస్తోంది. ప్రత్యేక రైళ్లే కాదు.. రెగ్యులర్ రైళ్లలోనూ వీరి దందా కొనసాగుతోంది. వీరి నియంత్రణకు ప్రవేశపెట్టిన గుర్తింపు కార్డు నిబంధన అపహాస్యమవుతోంది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ ప్రధాన రైల్వేస్టేషన్లలో దళారుల ఆట కట్టించేందుకు ఏర్పాటు చేసిన నిఘా వ్యవస్థ నిర్వీర్యమవుతోంది.
 
 ఇదీ దళారుల ‘వరుస’..
 సంక్రాంతి, శబరిమలై, దసరా, దీపావళి, వేసవి సెలవులు, ప్రత్యేక రోజుల్లో ప్రయాణికుల డిమాండ్‌ను, అవసరాన్ని బట్టి అదనపు రైళ్లను ఏర్పాటు చేస్తారు. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఇవి బయల్దేరతాయి. రద్దీని ముందే అంచనా వేసే ఏజెంట్లు, దళారులు.. ప్రయాణికులతో ముందుగానే ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. సాధారణ పరిస్థితుల్లో టికెట్లు దక్కవని, రైల్వే అధికారులతో తమకున్న సంబంధాల దృష్ట్యా తేలిగ్గా రిజర్వేషన్లు లభిస్తాయంటూ నమ్మించి బేరం కుదుర్చుకుంటున్నారు.రిజర్వేషన్ బుకింగ్ కష్టాలను చవిచూసే ప్రయాణికులు సహజంగానే వీరి మాటల్ని నమ్మేస్తున్నారు. దీంతో ముందస్తుగానే ప్రయాణికుల గుర్తింపు కార్డులను సేకరించి తమ దగ్గర పనిచేసే వ్యక్తులను బుకింగ్ కార్యాలయాల వద్ద వరుసలో నిల్చోబెడుతున్నారు. ప్రయాణికుల ‘క్యూ’ కంటే దళారులు, ఏజెంట్లకు చెందిన వారే ముందు వరుసలో నిల్చుని మొత్తం రిజర్వేషన్లను ఎగురేసుకెళ్తున్నారు. బుకింగ్ కార్యాలయాల్లో సిబ్బందికి, ఏజెంట్లతో ముందే కుదిరిన ఒప్పందం మేరకు ఈ దందా యథేచ్ఛగా సాగుతోంది.
 
 రెట్టింపు వసూళ్లు...
 రైళ్ల కొరత, రద్దీని చూపి దళారులు అసలు చార్జీలపై 50 నుంచి 70 శాతం అదనంగా వసూలు చేస్తున్నారు. గత్యంతరం లేక దళారులు అడిగినంతా ప్రయాణికులు చెల్లించుకోవాల్సి వస్తుంది. ప్రస్తుతం హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల నుంచి 2 లక్షల మందికి పైగా భక్తులు శబరిమలై వెళ్లే అవకాశం ఉంది. దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన 128 రైళ్లలో 46 మాత్రమే హైదరాబాద్ నుంచి రాకపోకలు సాగిస్తాయి. మిగతావన్నీ రాష్ర్టంలోని వివిధ ప్రాంతాల నుంచి బయల్దేరుతాయి. దళారుల చేతివాటం కారణంగా అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ జాబితా 300 నుంచి 400కు పెరిగింది. ఒకవైపు ప్రైవేట్ బస్సుల కొరత, మరోవైపు తగినన్ని ఆర్టీసీ బస్సులు అందుబాటులో లేక ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు ప్రత్యేక రైళ్లపైనే ఆధారపడుతున్నారు. కానీ ఇప్పటికే ప్రకటించిన రైళ్లు నిండిపోయాయి. మరిన్ని రైళ్లు వేస్తారో, లేదో తెలియని స్థితిలో స్వాములు ఆందోళన చెందుతున్నారు.
 
 త్వరలో సంక్రాంతి...
 ఈ పరిస్థితి ఇలా ఉంటే త్వరలో క్రిస్టమస్, సంక్రాంతి వేడుకలు రానున్నాయి. ఇప్పటికే సంక్రాంతి నాటికి అన్ని రెగ్యులర్ రైళ్లలో బెర్తులు బుక్ అయ్యాయి. ప్రత్యేక రైళ్లు వేస్తే తప్ప ప్రయాణికులు సొంత ఊళ్లకు వెళ్లే అవకాశం లేదు. సాధారణంగా రోజూ లక్షన్నర నుంచి 2 లక్షల మంది రైళ్లలో రాకపోకలు సాగిస్తుండగా, సంక్రాంతికి ఈ సంఖ్య రెట్టింపయ్యే అవకాశం ఉంది. 2.5 లక్షల మందికి రైళ్లే ఆధారం. క్రిస్టమస్, సంక్రాంతి రోజుల్లో పిల్లలకు ఎక్కువ రోజులు సెలవులు ఉండడం వల్ల నగరవాసులు ఇప్పట్నుంచే ప్రయాణానికి ప్రణాళికలను రూపొందించుకుంటున్నారు. ఇటీవల సీమాం ధ్రలో సమ్మె కారణంగా దసరా ప్రయాణాన్ని వాయిదా వేసుకున్న ప్రజలు ఈసారి సంక్రాంతికి సొంతూళ్లకు వెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. కానీ రైళ్లలో దళారుల బెడద వీరిని బెంబేలెత్తిస్తోంది. ఆర్‌పీఎఫ్ పర్యవేక్షణ, సీసీ కెమెరాల నిఘా సైతం దళారుల పన్నాగాల ముందు వెలవెలబోతున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement