అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్(Donald Trump) మద్దతు ఉన్న స్టార్‌గేట్ ఏఐ(Stargate) ప్రాజెక్టును ఎలాన్ మస్క్ బహిరంగంగా విమర్శించారు. దాంతో ఓపెన్ఏఐ(OpenAI) సీఈఓ సామ్ ఆల్ట్‌మన్‌తో సామాజిక మాధ్యమాలు వేదికగా వాగ్వాదం చోటుచేసుకుంది. ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్‌ల జాయింట్ వెంచర్ అయిన స్టార్‌గేట్ ఏఐ ప్రాజెక్టు 100 బిలియన్ డాలర్ల ప్రారంభ పెట్టుబడితో ఏఐ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. క్రమంగా పెట్టుబడి పెంచుకుంటూ 500 బిలియన్ డాలర్ల వరకు ఇన్వెస్ట్ చేయాలని నిర్ణయించుకున్నారు. అధ్యక్షుడు ట్రంప్‌నకు సన్నిహితుడు, ప్రభుత్వ వ్యయ నియంత్రణ కార్యక్రమానికి అధిపతిగా ఉన్న మస్క్ స్టార్‌గేట్ ప్రాజెక్టు ఆర్థిక సాధ్యాసాధ్యాలను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది.
మస్క్ తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్‌లో తన సందేహాలను వ్యక్తం చేశారు. ‘వారి(ఓపెన్ఏఐ, ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్) వద్ద నిజంగా డబ్బు లేదు. సాఫ్ట్ బ్యాంక్ 10 బిలియన్ డాలర్ల వరకే వెచ్చించనుంది. నాకు దానిపై పూర్తి అవగాహన ఉంది’ అన్నారు. వెంటనే స్పందించిన ఆల్ట్‌మన్, మస్క్ వాదనలను ఖండిస్తూ టెక్సాస్‌లోని ప్రాజెక్ట్ తొలి నిర్మాణ స్థలాన్ని సందర్శించాలని ఆహ్వానించారు. ఆల్ట్‌మన్ ఈ ప్రాజెక్టు జాతీయ ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు ‘ఇది దేశానికి గొప్ప ప్రాజెక్ట్. దేశానికి ఉపయోగపడే ఏ ప్రాజెక్టైనా మీ కంపెనీలకు అనువైనది కాదని నాకు అర్థం అయింది. కానీ మీరు కొత్త స్థానంలో(డిపార్ట్‌మెంట్ ఆప్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ) అమెరికాను ముందు ఉంచుతారని ఆశిస్తున్నాను’ అని అన్నారు.
ఇద్దరి మధ్య వివాదం ఇప్పటిది కాదు..
ఓపెన్‌ఏఐ సహవ్యవస్థాపకుల్లో ఇలాన్‌మస్క్ ఒకరు. 2015 నుంచి 2018 వరకు తాను ఈ సంస్థలో ఉన్నారు. తర్వాత కొన్ని కారణాల వల్ల దీన్ని వీడారు. ఓపెన్ ఏఐ పూర్తిగా లాభాపేక్ష సంస్థగా మారకుండా నిరోధించడానికి మస్క్ గతంలో కాలిఫోర్నియాలోని నార్తర్న్ డిస్ట్రిక్ట్ కోర్టులో ప్రాథమిక నిషేధాన్ని దాఖలు చేశారు. ఓపెన్‌ఏఐ పోటీ వ్యతిరేక విధానాలను అనుసరిస్తుందని అందులో పేర్కొన్నారు. దానివల్ల తన సొంత ఏఐ కంపెనీ ‘ఎక్స్‌ఏఐ’ నిధులు కోల్పోతుందని ఆరోపించారు.
ఇదీ చదవండి: ఈస్పోర్ట్స్ అథ్లెట్ల సాధికారతకు ‘రైజింగ్ స్టార్’
స్టార్‌గేట్ ప్రాజెక్ట్
అధ్యక్షుడు ట్రంప్ స్టార్‌గేట్ ప్రాజెక్టును ప్రకటించిన సమయంలో ‘అమెరికా సామర్థ్యంపై విశ్వాసం కలిగించే గొప్ప ప్రకటన’గా అభివర్ణించారు. అధునాతన కృత్రిమ మేధ సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధికి అవసరమైన డేటా సెంటర్లు, విద్యుదుత్పత్తి సౌకర్యాలను నిర్మించాలని ఈ ప్రాజెక్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. అమెరికాలో ఇతర ప్రాంతాలకు విస్తరించే ప్రణాళికలతో ఈ ప్రాజెక్టు ఇప్పటికే టెక్సాస్‌లో నిర్మాణాన్ని ప్రారంభించింది.
సత్య నాదెళ్ల వద్ద 80 బిలియన్ డాలర్లు
సీఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో సత్య నాదెళ్లను స్టార్‌గేట్ ప్రాజెక్టుకు సంబంధించి మస్క్ వాదనలపై ప్రశ్నించగా..‘వారు ఏం ఇన్వెస్ట్ చేస్తున్నారో నాకు ప్రత్యేకంగా తెలియదు’ అని చెప్పారు. ఈ ప్రాజెక్టు కోసం డబ్బు లేదని ఎక్స్‌లో మస్క్ చేసిన పోస్టుల గురించి అడిగినప్పుడు ‘మా వద్ద ఉన్న 80 బిలియన్ డాలర్లతో మేము ఆర్థికంగా మెరుగ్గా ఉన్నాం’ అని చెప్పారు. నాదెళ్ల వ్యాఖ్యలపై స్పందించిన మస్క్ ‘సత్య దగ్గర కచ్చితంగా డబ్బుంది’ అని బదులిచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment