railway ticket booking
-
‘చిన్నారుల టికెట్ల బుకింగ్‌లో మార్పుల్లేవ్’.. రైల్వే శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: చిన్నారులకు రైల్వే టికెట్ల బుకింగ్‌కు సంబంధించిన నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని రైల్వే శాఖ వెల్లడించింది. ఒకటి నుంచి నాలుగేళ్లలోపు పిల్లలకు సైతం పెద్దలకు అయ్యే చార్జీనే వసూలు చేస్తారంటూ మీడియాలో వార్తలు వచ్చిన నేపథ్యంలో బుధవారం ఈ మేరకు వివరణ ఇచ్చింది. ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చంటూ రైల్వే శాఖ 2020 మార్చి 6న ఒక సర్క్యులర్ జారీ చేసింది. అయితే, వారికి ప్రత్యేకంగా బెర్త్ గానీ, సీటు గానీ కేటాయించరు. ఒకవేళ బెర్త్ లేదా సీటు కావాలనుకుంటే పెద్దలకు అయ్యే రుసుమును చెల్లించి, టికెట్ కొనాల్సి ఉంటుంది. ఈ నిబంధనల్లో ఎలాంటి మార్పులు చేయలేదని, మీడియాలో వస్తున్న వార్తల్లో నిజం లేదని రైల్వేశాఖ స్పష్టం చేసింది. కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారంటూ ఆక్షేపించింది. బెర్త్ లేదా సీటు అవసరం లేదనుకుంటే ఐదేళ్లలోపు పిల్లలు రైళ్లలో ఉచితంగా ప్రయాణించవచ్చని తెలియజేసింది. ఇదీ చదవండి: జార్ఖండ్ ఎమ్మెల్యేలకు మధ్యంతర బెయిల్ -
రెడ్‌బస్ నుంచి రెడ్‌రైల్ యాప్
ముంబై: ఆన్లైన్ బస్ టికెటింగ్ ప్లాట్‌ఫాం రెడ్‌బస్ తాజాగా రైలు టికెట్ల బుకింగ్ కోసం ’రెడ్‌రైల్’ యాప్‌ను ఆవిష్కరించింది. వచ్చే 3–4 సంవత్సరాల్లో కంపెనీ స్థూల టికెటింగ్ ఆదాయాల్లో దీని వాటా 10–15 శాతంగా ఉం టుందని ఆశిస్తున్నట్లు రెడ్‌బస్ సీఈవో ప్రకాష్ సంగం తెలిపారు. రాబోయే రోజుల్లో 5–6 ప్రాంతీయ భాషల్లో కూడా యాప్‌ను అందుబాటులోకి తెచ్చే యోచన ఉన్నట్లు ఆయన వివరించారు. గత రెండేళ్లుగా ఇటు బస్సు, అటు రైలు టికెట్ల విభాగంలో డిజిటల్ మాధ్యమం వినియోగం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో రెడ్‌రైల్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం సరైన నిర్ణయంగా భావిస్తున్నట్లు ప్రకాష్ పేర్కొన్నారు. రోజూ దాదాపు పది లక్షలకు పైగా లావాదేవీలు జరిగే ఆన్లైన్ ట్రెయిన్ టికెట్ బుకింగ్ మార్కెట్లో భారీగా వ్యాపార అవకాశాలు ఉన్నాయని ఆయన తెలిపారు. మేక్మైట్రిప్ గ్రూప్‌లో రెడ్‌బస్ భాగంగా ఉంది. -
అనేకచోట్ల టికెట్ బుకింగ్ కౌంటర్లు
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న 1.7 లక్షల కామన్ సర్వీస్ సెంటర్లలో శుక్రవారం నుంచి రైలు టికెట్ల బుకింగ్ పునఃప్రారంభం కానుందని రైల్వే శాఖ మంత్రి పీయూష్ గోయెల్ ప్రకటించారు. ఇందులో భాగంగా కంప్యూటర్లు, ఇంటర్నెట్ సరిగ్గా అందుబాటులో లేని మారుమూల ప్రాంతాల్లోనూ కామన్ సర్వీస్ సెంటర్లు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయన్నారు. ప్రత్యేకంగా గుర్తించిన మరికొన్ని రైల్వే స్టేషన్లలోనూ రెండు, మూడు రోజుల్లో టికెట్ బుకింగ్ కౌంటర్లు ప్రారంభం కానున్నాయన్నారు. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కౌంటర్ల వద్ద జనం గుమికూడరాదన్నదే తమ లక్ష్యమని, ఇందుకు అవసరమైన మరిన్ని చర్యలు తీసుకుంటామని మంత్రి చెప్పారు. త్వరలోనే మరిన్ని రైళ్లను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. జూన్ 1వ తేదీ నుంచి నడిచే 200 ఏసీ, నాన్ ఏసీ రైళ్ల కోసం గురువారం బుకింగ్స్ ప్రారంభమైన రెండున్నర గంటల్లోనే 4 లక్షల మంది ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకున్నారన్నారు. ఈ నెల 1వ తేదీ నుంచి ఇప్పటి దాకా 2,050 శ్రామిక్ రైళ్ల ద్వారా 30 లక్షల మంది వలస కార్మికులను స్వస్థలాలకు తరలించినట్లు తెలిపారు. శ్రామిక్ రైళ్ల విషయంలో పశ్చిమబెంగాల్, జార్ఖండ్ ప్రభుత్వాలు సహకరించడం లేదని ఆరోపించారు. అన్ని రాష్ట్రాలు తమ కార్మికులు సొంతూళ్లకు చేరుకునేందుకు సహకరించాలన్నారు. రైల్వే శాఖ ఇప్పటిదాకా 225 స్టేషన్లలో ఉన్న 5 వేల బోగీలను కోవిడ్–19 కేర్ సెంటర్లుగా మార్చిందని తెలిపారు. -
10 రోజులు.. పది లక్షలు
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): ఇంటి వద్ద నుంచే సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌నకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన పది రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో జనరల్ బోగీల్లో పయనించేందుకు నేరుగా తమ మొబైల్ ఫోన్ నుంచే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పది రోజుల కాలంలో ఏకంగా 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ యాప్ ద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. మరో 60 వేల మంది ఎప్పుడైనా ప్రయాణం చేసేందుకు అనుగుణంగా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైల్వేస్టేషన్లలోని సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీ, పండుగలు, వరస సెలవుల కారణంగా సకాలంలో టిక్కెట్లు దొరక్క ప్రయాణాలను రద్దు చేసుకోవడం వంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ బుకింగ్ సదుపాయాన్ని యూటీఎస్ ద్వారా అన్ని రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీలకు విస్తరించారు. దీంతో అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లలోనూ ప్రయాణానికి 3 గంటలు ముందు స్మార్ట్ఫోన్లలో యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. యూటీఎస్ వెరీ యూస్ఫుల్... దక్షిణమధ్య రైల్వేలోని సుమారు 600 రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి రోజు 10.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 1.5 లక్షల మంది స్లీపర్, ఏసీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేస్తుండగా, 9 లక్షల మంది సాధారణ ప్రయాణికులే. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచే ప్రతి రోజు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, వరంగల్, కాజీపేట్, వంటి పెద్ద స్టేషన్లతో పాటు, చిన్న స్టేషన్ల నుంచి రోజువారీ అవసరాల కోసం సమీప స్టేషన్ల నుంచి ప్రధాన పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేవారూ లక్షల్లోనే ఉంటారు. వీరందరూ జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిందే. యూటీఎస్ యాప్‌తో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా, లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రయాణానికి 3 గంటల ముందు ఇంటి దగ్గర నుంచే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. 130 స్టేషన్లలో వినియోగం... దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లతో పాటు పొరుగు జోన్లకు రాకపోకలు సాగించే రైళ్లలో సైతం యూటీఎస్ ద్వారా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించారు. ఈ 10 రోజుల్లో 130 స్టేషన్ల నుంచి 50 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రయాణం చేసిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నగరంలోని లింగంపల్లి, హైటెక్‌సిటీ, తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లు, విజయవాడ, తిరుపతి, వరంగల్ వంటి పెద్ద స్టేషన్ల నుంచి కూడా యూటీఎస్ రాకపోకలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ప్రయాణికులు తాము బయలుదేరే రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉంటే చాలు. ఒకసారి టిక్కెట్ బుక్ చేసుకున్న తరువాత 3 గంటల పాటు అది చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఒక్క పరిమితిని దృష్టిలో ఉంచుకొని యూటీఎస్‌ను వినియోగించుకోవాలి. ఆర్–వాలెట్‌పై 5 శాతం బోనస్... ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్, ఇతర సదుపాయాల నుంచి యూటీఎస్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించవచ్చు. అయితే దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టిన ఆర్–వాలెట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే టిక్కెట్ చార్జీలపైన 5 శాతం బోనస్ లభిస్తుంది. -
2.5 గంటల పాటు రైలు టిక్కెట్ల బుకింగ్ రద్దు
న్యూఢిల్లీ : నగర ప్యాసెంజర్ రిజర్వేషన్ సిస్టమ్(పీఆర్ఎస్)లో రైల్వే సర్వీసులు రద్దు కానున్నాయి. రెండున్నర గంటల పాటు ఢిల్లీ పీఆర్ఎస్ రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. దీంతో 139 ఎంక్వైరీ సర్వీసులు, టిక్కెట్ల బుకింగ్ ఏమీ అందుబాటులో ఉండవని తెలిపింది. మే 18న రాత్రి 11.45 గంటల నుంచి మే 19 అర్థరాత్రి దాటిన తర్వాత 2.15 గంటల వరకు ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయనున్నామని, ఈ క్రమంలో రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. ఈ నెలలో ఇలా పీఆర్ఎస్ సర్వీసులను రద్దు చేయడం ఇది రెండో సారి. అంతకముందు ఉత్తర రైల్వే, ఉత్తర మధ్య రైల్వే, ఈశాన్య రైల్వే, వాయువ్య రైల్వేలు కూడా మే 5న ఇదే మాదిరి కొన్ని గంటల పాటు తమ సర్వీసులను రద్దు చేశాయి. మే 5న రాత్రి 10.30 గంటల నుంచి మే 6న అర్థరాత్రి 12.15 గంటల వరకు, మళ్లీ అదే రోజు ఉదయం 5.15 నుంచి 6.25 వరకు సర్వీసులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. సాధారణ విద్యుత్ నిర్వహణ కార్యకలాపాల కారణంగా తమ సర్వీసులను రద్దు చేసినట్టు పేర్కొన్నాయి. తాజాగా ఢిల్లీ కంప్యూటరైజ్డ్ పీఆర్ఎస్ను అప్‌గ్రేడ్ చేయడం కోసం రైల్వే సర్వీసులను రద్దు చేస్తున్నట్టు ఉత్తర రైల్వే పేర్కొంది. -
రైల్వే గుడ్‌న్యూస్ : అది తప్పనిసరి కాదు
సాక్షి, న్యూఢిల్లీ : రైల్వే టిక్కెట్ల బుకింగ్స్‌కు ఆధార్ నెంబర్ తప్పనిసరి కాదని భారతీయ రైల్వే బుధవారం ధృవీకరించింది. రైలు ప్రయాణం కోసం టిక్కెట్లను బుక్ చేసుకోవడానికి ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సినవసరం లేదని, కానీ స్వచ్ఛదంగా దీన్ని సమర్పించడాన్ని ప్రోత్సహిస్తున్నామని చెప్పింది. రైల్వేశాఖ సహాయమంత్రి రాజేన్ గోహైన్ ఈ విషయాన్ని లోక్‌సభలో తెలిపారు. టిక్కెట్ల బుకింగ్‌కు ఆధార్‌ను తప్పనిసరి చేసే ప్రతిపాదనేమీ తమ వద్ద లేదని తెలిపారు. సీనియర్ సిటిజన్లు రైల్వే టిక్కెట్ల బుకింగ్‌పై రాయితీని పొందడానికి ఆధార్ వెరిఫికేషన్ చేయించుకోవడాన్ని జనవరి 1 2017 నుంచి ప్రవేశపెట్టారు. ఇది కూడా స్వచ్ఛందంగానే చేపడుతున్నట్టు మంత్రి లోక్‌సభలో రాతపూర్వకంగా తెలిపారు. అయితే ఆధార్ ద్వారా బుకింగ్‌లను ప్రోత్సహించేందుకు రైల్వే ఇటీవలే ఆధార్ ఉంటే నెలలో 12 వరకూ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చని తెలిపినట్టు పేర్కొన్నారు. ఐఆర్సీటీసీలో యూజర్ ఐడీకి ఆధార్ లింక్ చేస్తే, రివార్డు స్కీమ్‌ను కూడా ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టినట్టు మంత్రి చెప్పారు. -
ఐఆర్సీటీసీ ఆఫర్ : వారికి ఫ్రీ ట్రావెల్
దేశీయ రైల్వే బంపర్ ఆఫర్ ప్రకటించింది. భీమ్ యాప్ లేదా యూపీఐ ద్వారా రైల్ టిక్కెట్లను బుక్ చేసుకునేందుకు ప్రజలను ప్రోత్సహించడానికి నెలవారీ లక్కీ డ్రా స్కీమ్‌ను ప్రారంభించింది. ఈ డ్రాలో గెలుపొందిన వారికి ఉచితంగా ప్రయాణం చేసే అవకాశాన్ని కల్పించనున్నట్టు పేర్కొంది. భీమ్ యాప్ లేదా యూపీఐ పేమెంట్ ఆప్షన్లను వాడే వారి కోసం గత నెలలోనే ఈ స్కీమ్‌ను దేశీయ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ లాంచ్ చేసింది. ఆరు నెలల కాలంలో ఈ స్కీమ్ అందుబాటులో ఉంటుంది. ప్రతి నెలా తొలి వారంలో ముందటి నెలలోని ఐదుగురు లక్కీ ప్రయాణికులను కంప్యూటరైజడ్ లక్కీ డ్రా ద్వారా ఎంపిక చేస్తారు. ఈ డ్రాలో గెలుపొందిన ఐదుగురికి మొత్తం రైల్వే టిక్కెట్ ధరను వెనక్కి ఇచ్చేస్తారు. భీమ్ లేదా యూపీఐ ఆప్షన్ల ద్వారా ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌పై ఈ-టిక్కెట్లను విజయవంతంగా బుక్ చేసుకున్న కస్టమర్లు మాత్రమే ఈ స్కీమ్‌కు అర్హులు అవుతారని ఐఆర్సీటీసీ ప్రకటించింది. టిక్కెట్లు రద్దు చేసుకున్న ప్రయాణికులకు, పీఎన్ఆర్లకు వ్యతిరేకంగా టీడీఆర్ ఫైల్ చేసిన వారు ఈ స్కీమ్‌కు అర్హులు కారని తెలిపింది. డిసెంబర్1 నుంచి భీమ్ యాప్ ద్వారా ప్రయాణికులు టిక్కెట్లను బుక్ చేసుకునే అనుమతిని రైల్వే అందిస్తోంది. -
రైల్వే టికెట్ బుకింగ్..ఓ గుడ్ న్యూస్
సాక్షి, న్యూఢిల్లీ: డిజిటల్లావాదేవాలకు ఊతమిచ్చే ఉద్దేశ్యంలో కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రైల్వే టికెట్లను భీమ్, యూపీఐ యాప్ ల ద్వారా బుక్ చేసుకునేలా చర్యలు తీసుకుంది. తద్వారామ లక్షలాది రైల్వే ప్రయాణీకులకు ఊరట నిచ్చింది. దేశంలోని అన్ని టికెట్ రిజర్వేషన్ కౌంటర్లలో శుక్రవారం నుంచి యుపిఐ (యూనిఫైడ్ చెల్లింపు ఇంటర్ఫేస్) చెల్లింపు వ్యవస్థను అమలు చేస్తున్నామని భారతీయ రైల్వేలు గురువారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దేశవ్యాప్తంగా అన్ని రిజర్వేషన్ కౌంటర్లలో యుపిఐ ఆధారిత చెల్లింపు వ్యవస్థను అమలు చేయబోతున్నామని రైల్వే బోర్డు సభ్యుడు (ట్రాఫిక్) మొహమ్మద్ జంషెడ్ చెప్పారు. ఇప్పుడిక ప్రయాణీకుడు తన క్రెడిట్ / డెబిట్ కార్డును కలిగి ఉండవలసిన అవసరం లేదు, ఎందుకంటే వారు మొబైల్ ఫోన్ లోని భీమ్ యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకోగలుగుతారని జంషెడ్ చెప్పారు. బుకింగ్ టిక్కెట్ల కోసం భారత్ క్యూఆర్ కోడ్ ఎంపికను అభివృద్ధి చేయడానికి రైల్వేలు కృషి చేస్తున్నాయన్నారు. ఇందుకు అదనంగా ఎలాంటి చార్జీ వసూలుచేయడంలేదని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా సుమారు 14వేల కౌంటర్లను ఏర్పాటు చేసినట్టు మొహమ్మద్ జంషెడ్ ప్రకటించారు. రోజువారీ 97 శాతం బుకింగ్‌లు పాసెంజర్ రిజర్వేషన్ సిస్టం(పీఆర్ఎస్) నగదు ద్వారా, రెండు, మూడు శాతం లావాదేవీలు డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల ద్వారా జరుగుతున్నాయని ఆయన చెప్పారు. రైల్వే అధికారుల ప్రకారం, రోజుకు సుమారు 7.5 లక్షల టిక్కెట్లు బుక్ అవుతున్నాయి. ఐదు లక్షల టిక్కెట్లు పీఆర్ఎస్ కౌంటర్లలో బుకింగ్‌లు జరుగుతున్నాయి. -
ఐసీఐసీఐబ్యాంక్ వెబ్సైట్లో రైల్వే టికెట్ల బుకింగ్
ముంబై: ప్రైవేట్ రంగ దిగ్గజం బ్యాంక్ ఐసీఐసీఐ తొలిసారిగా తన వె బ్సైట్ ద్వారా రైల్వే ఆన్లైన్ టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. దీనికోసం రైల్వే ఈ-టికెటింగ్ ప్లాట్‌ఫామ్ ఐఆర్సీటీసీతో ఒప్పందం కుదుర్చుకుంది. వినియోగదారులు ఐసీఐసీఐ వెబ్సైట్లో రైల్వే టికెట్లను బుకింగ్ చేసుకోవాలంటే ముందుగా ఐఆర్సీటీసీ వెబ్సైట్లో సభ్యత్వాన్ని తీసుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంక్ త్వరలోనే ప్రీ-పెయిడ్ డిజిటల్ వాలెట్, మొబైల్ బ్యాంకింగ్ యాప్ వినియోగదారులకూ రైల్వే టికెట్ బుకింగ్ సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. ఈ సౌక ర్యాన్ని తమ ఖాతాదారులే కాకుండా ఇతర బ్యాంకుల వినియోగదారులు కూడా వినియోగించుకోవచ్చని బ్యాంకు తెలిపింది. ఐసీఐసీఐ వెబ్సైట్లో ట్రైన్ల సమాచారం, పీఎన్ఆర్ స్టేటస్, టికెట్ బుకింగ్ తదితర వివరాలు తెలుసుకోవచ్చని పేర్కొంది. టికెట్ బుకింగ్ రుసుమును నెట్ బ్యాంకింగ్, డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డుల ద్వారా చెల్లించవచ్చని తెలిపింది.