సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): ఇంటి వద్ద నుంచే సాధారణ తరగతి రైల్వే టికెట్‌లను బుక్ చేసుకునేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యూటీఎస్ (అన్ రిజర్వ్‌డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌నకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన పది రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది డౌన్‌లోడ్ చేసుకున్నారు. అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో జనరల్ బోగీల్లో పయనించేందుకు నేరుగా తమ మొబైల్ ఫోన్ నుంచే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పది రోజుల కాలంలో ఏకంగా 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ యాప్ ద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. మరో 60 వేల మంది ఎప్పుడైనా ప్రయాణం చేసేందుకు అనుగుణంగా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా టిక్కెట్‌లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే.
రైల్వేస్టేషన్‌లలోని సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీ, పండుగలు, వరస సెలవుల కారణంగా సకాలంలో టిక్కెట్లు దొరక్క ప్రయాణాలను రద్దు చేసుకోవడం వంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ బుకింగ్ సదుపాయాన్ని యూటీఎస్ ద్వారా అన్ని రైళ్లలోని అన్‌రిజర్వ్‌డ్ బోగీలకు విస్తరించారు. దీంతో అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లలోనూ ప్రయాణానికి 3 గంటలు ముందు స్మార్ట్‌ఫోన్లలో యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్‌లు బుక్ చేసుకోవచ్చు.
యూటీఎస్ వెరీ యూస్‌ఫుల్...
దక్షిణమధ్య రైల్వేలోని సుమారు 600 రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి రోజు 10.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 1.5 లక్షల మంది స్లీపర్, ఏసీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేస్తుండగా, 9 లక్షల మంది సాధారణ ప్రయాణికులే. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్‌ల నుంచే ప్రతి రోజు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, వరంగల్, కాజీపేట్, వంటి పెద్ద స్టేషన్‌లతో పాటు, చిన్న స్టేషన్‌ల నుంచి రోజువారీ అవసరాల కోసం సమీప స్టేషన్‌ల నుంచి ప్రధాన పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేవారూ లక్షల్లోనే ఉంటారు. వీరందరూ జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిందే. యూటీఎస్ యాప్‌తో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా, లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రయాణానికి 3 గంటల ముందు ఇంటి దగ్గర నుంచే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు.
130 స్టేషన్లలో వినియోగం...
దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్‌లతో పాటు పొరుగు జోన్‌లకు రాకపోకలు సాగించే రైళ్లలో సైతం యూటీఎస్ ద్వారా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించారు. ఈ 10 రోజుల్లో 130 స్టేషన్‌ల నుంచి 50 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రయాణం చేసిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నగరంలోని లింగంపల్లి, హైటెక్‌సిటీ, తదితర ఎంఎంటీఎస్ స్టేషన్‌లు, విజయవాడ, తిరుపతి, వరంగల్ వంటి పెద్ద స్టేషన్‌ల నుంచి కూడా యూటీఎస్ రాకపోకలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ప్రయాణికులు తాము బయలుదేరే రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉంటే చాలు. ఒకసారి టిక్కెట్ బుక్ చేసుకున్న తరువాత 3 గంటల పాటు అది చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఒక్క పరిమితిని దృష్టిలో ఉంచుకొని యూటీఎస్‌ను వినియోగించుకోవాలి.
ఆర్–వాలెట్‌పై 5 శాతం బోనస్...
ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్, ఇతర సదుపాయాల నుంచి యూటీఎస్ మొబైల్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ఆన్‌లైన్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించవచ్చు. అయితే దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టిన ఆర్–వాలెట్ ద్వారా టిక్కెట్‌లు బుక్ చేసుకుంటే టిక్కెట్ చార్జీలపైన 5 శాతం బోనస్ లభిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment