Train reservation
-
సంక్రాంతికి సొంతూరెళ్లాలంటే కష్టాలే!
సాక్షి, సిటీబ్యూరో: సంక్రాంతి పండగకు సొంతూరు వెళ్లేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేసుకుంటున్న నగరవాసులకు వెయిటింగ్ లిస్ట్ నిరాశకు గురి చేస్తోంది. సాధారణంగా రైళ్లలో మూడు నెలల ముందే రిజర్వేషన్ చేసుకొనే సదుపాయం ఉంటుంది. కానీ.. హైదరాబాద్ నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరే అన్ని ప్రధాన రైళ్లల్లో జనవరి నెలాఖరు వరకు ఇప్పటికే రిజర్వేషన్లు బుక్ అయ్యాయి. సికింద్రాబాద్ నుంచి విశాఖ, విజయవాడ తదితర ప్రాంతాలకు వెళ్లే రైళ్లలో 150 నుంచి 250 వరకు వెయిటింగ్ లిస్టు దర్శనమిస్తుండగా, కొన్ని రైళ్లు ‘రిగ్రేట్’ అంటూ చేతులెత్తేస్తున్నాయి. దీంతో సంక్రాంతికి సొంత ఊరుకు వెళ్లేందుకు ఈసారి ఇబ్బందులు తప్పేలాలేవు!. మరోవైపు జనవరి నెలలోనే ఎక్కువ మంది అయ్యప్ప భక్తులు శబరికి వెళ్లనున్నారు. దీంతో రైళ్ల కొరత సవాల్‌గా మారింది. డిమాండ్ మేరకు రైళ్లు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేట్ వాహనాలు, ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి నెలకొంది. భారీగా పెరిగిన ప్రయాణాలు.. కోవిడ్ అనంతరం ప్రయాణాలు భారీగా పెరిగాయి. అన్ని రైళ్లలో పర్యాటకుల రద్దీ గణనీయంగా పెరిగింది. రెండు, మూడేళ్ల పాటు ప్రయాణాలను వాయిదా వేసుకున్న నగరవాసులు ఈ ఏడాది విరివిగా రాకపోకలు సాగిస్తున్నారు. దీంతో సహజంగానే రైళ్లకు డిమాండ్ పెరిగింది. సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ స్టేషన్ల నుంచి సాధారణ రోజుల్లో సుమారు 2.2 లక్షల మంది రాకపోకలు సాగిస్తే వరుస సెలవులు, పండుగలు వంటి ప్రత్యేక సందర్భాల్లో 2.5 లక్షల మందికిపైగా బయలుదేరుతున్నారు. ఏపీతో పాటు ఉత్తరాది రైళ్లకు సైతం డిమాండ్ పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి ప్రతి రోజు 85కుపైగా ఎక్స్‌ప్రెస్ రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. మరో 100 ప్యాసింజర్ రైళ్లు అందుబాటులో ఉన్నాయి. ప్రయాణికుల రద్దీ మేరకు ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ వెయిటింగ్ లిస్ట్ మాత్రం తగ్గకపోవడం గమనార్హం. ప్రయాణం కష్టమే... సికింద్రాబాద్ నుంచి బయలుదేరే ఫలక్‌నుమా ఎక్స్‌ప్రెస్‌లో జనవరి వరకు అన్ని బెర్తులు బుక్ అయ్యాయి. థర్డ్ ఏసీలో బుకింగ్‌కు అవకాశం కూడా లేకుండా రిగ్రేట్ దర్శనమిస్తోంది. ఈస్ట్‌కోస్ట్, విశాఖ, గోదావరి, కోణార్క్, తదితర అన్ని రైళ్లలోనూ వెయిటింగ్ లిస్ట్ 150పైనే కనిపించడం గమనార్హం. ఉత్తరాది వైపు వెళ్లే దానాపూర్, పట్నా ఎక్స్‌ప్రెస్ రైళ్లలోనూ నిరీక్షణ జాబితా వందల్లోకి చేరింది. ఇదీ చదవండి: మునుగోడు.. 10 వేలకు పైగా ఓటరు దరఖాస్తుల తిరస్కరణ -
మేమింతే.. రైళ్లలో సీటు కుదరదంతే
సాక్షి, తిరుపతి : ‘మీరు టిక్కెట్ కొన్నారా..? ఆ టికెట్‌కు బెర్త్‌గానీ, సీటుగానీ దొరికిందా..? ఆర్ఏసీ ఉన్నా పర్వాలేదు. వెయిటింగ్ లిస్ట్‌లో ఉందని రిజర్వేషన్ బోగీల్లో ఎక్కితే కుదరదు. దిగి వేరే ట్రైన్లో వెళ్లాల్సిందే.’ అంటూ తిరుపతి రైల్వే అధికారులు, పోలీసులు తేల్చిచెబుతున్నారు. శనివారం వారు రైళ్లలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. రద్దీగా ఉండడంతో పలువురు ప్రయాణికులను దింపేశారు. రద్దీ ఉంటే నో జర్నీ అంటూ స్పష్టం చేశారు. ఖాళీగా ఉంటే వెళ్లాలని సూచించారు. పలువురు ప్రయాణికులు ‘సార్ మరో ట్రైన్‌కి వెళ్లాలంటూ ఆదేశాలిస్తున్నారు. రైల్లో నిలబడి ఉండే ప్రయాణికుల కోసం గాలిస్తున్న అధికారులు, పోలీసులు ఆ ట్రైన్‌లోనూ రద్దీ ఉంటే ఏమి చేయాలి’ అంటూ రైల్వే అధికారులను ప్రశ్నించారు. ఇలా ఉదయం వెళ్లాల్సిన ప్రయాణికులను రోజంతా తిరుపతి రైల్వే స్టేషన్లో ఉంచుకుని సాయంత్రం పంపడం న్యాయమా..? అంటూ ప్రశ్నించారు. సార్ మీరు రిజర్వేషన్ కోసం వచ్చే ప్రయాణికులకు బెర్త్ లేదా ఆర్ఏసీ టిక్కెట్ ఉంటే ఇవ్వండి.. అంతేతప్ప వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఇవ్వద్దూ అంటూ విన్నవించారు. వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్లు ఇవ్వకుంటే ప్రత్యామ్నాయంగా టిక్కెట్ తీసుకుని జనరల్ బోగీలో ప్రయాణం చేస్తాం.. లేదా ఆర్టీసీ బస్సులో వెళ్లిపోతాం. అంతేతప్ప రిజర్వేషన్ టిక్కెట్‌తో కూడిన మొత్తాన్ని వెయిటింగ్ లిస్ట్ టిక్కెట్‌కు చెల్లించాల్సిన పని ఉండదని వారు వివరించారు. అలా పలువురు ప్రయాణికులకు ఇక్కట్లు తప్పలేదు. -
చిటికెలో రైలు టికెట్
జనరల్ బోగీలో వెళ్లే ప్రయాణికులకు నిత్యం రైల్వే బుకింగ్ కౌంటర్ల వద్ద ఎదురౌతున్న పెద్ద సమస్య. ఈ సమస్యకు ఇక ఓ ప్రత్యేక యాప్‌తో చెక్ పెట్టింది రైల్వే శాఖ. ఇప్పటివరకూ రైల్వేలో ఆన్లైన్ టికెట్ విధానం రిజర్వేషన్ ప్రయాణానికి మాత్రమే పరిమితమయ్యింది. ఆన్లైన్లో టికెట్ బుక్ చేసుకునే విధానాన్ని ఇకపై జనరల్ టికెట్‌కు విస్తరించారు. ఇందుకోసం దక్షిణ మధ్య రైల్వే అధికారుల ఆధ్వర్యంలో అన్ రిజర్వ్డ్ టికెట్ సిస్టమ్ (యూటీఎస్) యాప్‌ను అందుబాటులో ఉంచారు. ఈ యాప్ ద్వారా జీపీఎస్ అనుసంధానం ఉన్న అన్ని మొబైల్స్ నుంచి ప్రతి ఒక్కరూ క్షణాల్లో జనరల్, ప్లాట్‌ఫాం, సీజన్, టికెట్లను పొందే వెసులుబాటును రైల్వే అధికారులు కల్పించారు. ఈ యాప్ వినియోగం టికెట్ పొందే విధానంలో కొన్ని నిబంధనలు/షరతులను మాత్రం ప్రయాణికులు తప్పక పాటించాల్సి ఉంది. – మెరకముడిదాం (చీపురుపల్లి) క్షణాల్లో జనరల్ టికెట్ ఈ యాప్ ఉపయోగించి పాసింజర్, ఫాస్ట్ పాసింజర్, ఎక్స్‌ప్రెస్, సూపర్‌ఫాస్ట్ తదితర రైళ్లలో క్షణాల్లో జనరల్ టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ పెద్దలకు ఎవరికైనా టికెట్ బుక్ చేస్తే వారి వద్ద సెల్‌ఫోన్ లేని పక్షంలో బుకింగ్ ఐడీ నంబరు, మొబైల్ నంబర్ చెబితే కౌంటర్ వద్ద పేపర్ టికెట్ పొందే అవకాశం ఉంది. యాప్ డౌన్లోడింగ్ ఇలా ► ఈయాప్‌ను ఆండ్రాయిడ్, విండోస్, ఐఫోన్లలో ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ► గూగుల్ ప్లే స్టోర్‌లోకి వెళ్లి యూటీఎస్ అనే ఆంగ్ల అక్షరాలను టైప్ చేసి యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవాలి. ► మొబైల్ నంబర్‌ను, ఓ పాస్వర్డును వ్యక్తిగత వివరాలలో ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటరు, డ్రైవింగ్ లైసెన్స్ పాన్, స్టూడెంట్ ఐడీ తదితర కార్డులు, కార్డుకు సంబంధించిన ఏదో ఒక నంబర్‌ను ఈ యాప్‌లో నమోదు చేసుకొని ఇన్స్టాల్ చేయాలి. యాప్ ద్వారా సౌకర్యాలు ► ఆర్–వాలెట్, పేటీఎం, నెట్‌బ్యాంకింగ్ ద్వారా కూడా టికెట్ బుక్ చేసుకోవచ్చు. ► రైల్వేకు సంబంధించిన ఆర్–వాలెట్ ద్వారా టికెట్ బుక్ చేసుకొంటే 5 శాతం రాయితీ లభిస్తుంది. ► అన్ని ప్రధాన రైల్వేస్టేషన్లలోనూ బుకింగ్ కార్యాలయంలో రూ.100 నుంచి రూ.10,000 వరకూ ఈవాలెట్ రీచార్జి చేసుకొనే సౌకర్యం ఉంది. ► తరచూ ప్రయాణించే వారు క్విక్ బుకింగ్ ఆప్షన్‌ను ఎంచుకొని టికెట్లను తొందరగా పొందవచ్చు. ప్రత్యేకతలు ► రైల్వే బుకింగ్ కౌంటర్ వద్ద చాంతాడంత క్యూలో నిల్చుని అవస్థలు పడే అవసరం ఇక లేకుండా ఇంటినుంచి బయల్దేరి రైల్వేస్టేషన్‌కు చేరేలోపే స్మార్ట్‌ఫోన్ ద్వారా యూటీఎస్ యాప్ నుంచి టికెట్‌ను పొందవచ్చు. ► ఈ యాప్ ద్వారా దక్షణ మధ్య రైల్వే పరిధిలోని ఏ యూటీఎస్ స్టేషన్ నుంచైనా సీజన్ ప్లాట్‌ఫాం, జనరల్ టెకెట్లను తీసుకోవచ్చు. ► ఒకేసారి నాలుగు టికెట్లను బుకింగ్ చేసుకొనే అవకాశం కల్పించారు. ► షో టికెట్ ఆప్షన్ ద్వారా టీటీఈకి వివరాలను చూపించి ప్రయాణం చేయవచ్చు. నిబంధనలు ► ప్రయాణం టికెట్లను రైలు ఎక్కేందుకు 3 గంటలు ముందుగా బుక్ చేసుకోవాలి.. అంటే టికెట్ బుక్ చేసిన 3 గంటల్లోపు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ముందుగా ఈ యాప్ పనిచేయదు. ► రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల దూరంలోపు మాత్రమే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ► స్టేషన్లో కాలుమోపాక, రైల్ ప్లాట్‌ఫాం, ట్రాక్‌ల వద్ద నుంచి టికెట్ల బుకింగ్ సాధ్యం కాదు. ► ప్లాట్‌ఫాం టికెట్ తీసుకోవాలంటే స్టేషన్‌కు 15 మీటర్ల దూరం నుంచి 2 కిలోమీటర్ల లోపున్న వారు అర్హులు. ► సీజన్ టెకెట్‌ను అయితే గడువు తేదీకి 10 రోజుల ముందే బుక్ చేసుకోవలసి ఉంటుంది. ► పేపర్ టికెట్ కావాలంటే బుకింగ్ కౌంటర్ వద్దకు వెళ్లి మొబైల్ నంబర్, బుకింగ్ ఐడీని చెప్పి పొందవచ్చు. ► రైలులో ప్రయాణించేటప్పుడు నెట్ సదుపాయం లేకున్నా, చేతిలో ప్రింటెడ్ టికెట్ లేకున్నా, చెకింగ్‌కు వచ్చే టీసీకి క్యూఆర్ కోడ్, కాల్ చెక్ ఆప్షన్‌లోకి వెళ్లి బుకింగ్ వివరాలను చూపవచ్చు. ► ఈ సమయంలో ప్రయాణికుడి ఐడీ కార్డు తప్పనిసరిగా టీసీకి చూపాల్సి ఉంటుంది. -
10 రోజులు.. పది లక్షలు
సాక్షి, హైదరాబాద్ (సిటీబ్యూరో): ఇంటి వద్ద నుంచే సాధారణ తరగతి రైల్వే టికెట్లను బుక్ చేసుకునేందుకు దక్షిణమధ్య రైల్వే ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన యూటీఎస్ (అన్ రిజర్వ్డ్ టిక్కెటింగ్ సిస్టమ్) మొబైల్ యాప్‌నకు ప్రయాణికుల నుంచి అనూహ్యమైన స్పందన లభిస్తోంది. ఈ యాప్‌ను అందుబాటులోకి తెచ్చిన పది రోజుల వ్యవధిలోనే 10 లక్షల మంది డౌన్లోడ్ చేసుకున్నారు. అన్ని ఎక్స్‌ప్రెస్, ప్యాసింజర్ రైళ్లలో జనరల్ బోగీల్లో పయనించేందుకు నేరుగా తమ మొబైల్ ఫోన్ నుంచే ప్రయాణికులు టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఈ పది రోజుల కాలంలో ఏకంగా 50 వేల మంది ప్రయాణికులు యూటీఎస్ యాప్ ద్వారా వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగించారు. మరో 60 వేల మంది ఎప్పుడైనా ప్రయాణం చేసేందుకు అనుగుణంగా తమ వివరాలను యాప్‌లో నమోదు చేసుకున్నారు. ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా ప్రయాణికులు ఈ యాప్ ద్వారా టిక్కెట్లను బుక్ చేసుకొనే సదుపాయాన్ని ఈ నెల 16 నుంచి ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. రైల్వేస్టేషన్లలోని సాధారణ బుకింగ్ కౌంటర్ల వద్ద ఉండే రద్దీ, పండుగలు, వరస సెలవుల కారణంగా సకాలంలో టిక్కెట్లు దొరక్క ప్రయాణాలను రద్దు చేసుకోవడం వంటి ఇబ్బందుల నుంచి ప్రయాణికులకు ఊరట కల్పించేందుకు ఈ మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చారు. గతంలో ఎంఎంటీఎస్, సబర్బన్ రైళ్లకు మాత్రమే పరిమితమైన మొబైల్ బుకింగ్ సదుపాయాన్ని యూటీఎస్ ద్వారా అన్ని రైళ్లలోని అన్రిజర్వ్డ్ బోగీలకు విస్తరించారు. దీంతో అన్ని మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లతో పాటు, ప్యాసింజర్ రైళ్లలోనూ ప్రయాణానికి 3 గంటలు ముందు స్మార్ట్ఫోన్లలో యూటీఎస్ యాప్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. యూటీఎస్ వెరీ యూస్ఫుల్... దక్షిణమధ్య రైల్వేలోని సుమారు 600 రైల్వేస్టేషన్ల నుంచి ప్రతి రోజు 10.5 లక్షల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తున్నారు. 1.5 లక్షల మంది స్లీపర్, ఏసీ రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణం చేస్తుండగా, 9 లక్షల మంది సాధారణ ప్రయాణికులే. నగరంలోని సికింద్రాబాద్, నాంపల్లి, కాచిగూడ రైల్వేస్టేషన్ల నుంచే ప్రతి రోజు 2.5 లక్షల మంది వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తారు. విజయవాడ, గుంటూరు, తిరుపతి, వరంగల్, కాజీపేట్, వంటి పెద్ద స్టేషన్లతో పాటు, చిన్న స్టేషన్ల నుంచి రోజువారీ అవసరాల కోసం సమీప స్టేషన్ల నుంచి ప్రధాన పట్టణాలు, నగరాలకు రాకపోకలు సాగించేవారూ లక్షల్లోనే ఉంటారు. వీరందరూ జనరల్ టిక్కెట్ బుకింగ్ కౌంటర్ల వద్ద టికెట్ల కోసం పడిగాపులు కాయాల్సిందే. యూటీఎస్ యాప్‌తో ఇలాంటి ఇబ్బందులను అధిగమించవచ్చు. ఎలాంటి గందరగోళం లేకుండా, లైన్లలో నిలబడాల్సిన అవసరం లేకుండా ప్రయాణానికి 3 గంటల ముందు ఇంటి దగ్గర నుంచే టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. 130 స్టేషన్లలో వినియోగం... దక్షిణమధ్య రైల్వే పరిధిలోని అన్ని రైల్వేస్టేషన్లతో పాటు పొరుగు జోన్లకు రాకపోకలు సాగించే రైళ్లలో సైతం యూటీఎస్ ద్వారా ప్రయాణం చేసే సదుపాయాన్ని కల్పించారు. ఈ 10 రోజుల్లో 130 స్టేషన్ల నుంచి 50 వేల మంది ప్రయాణం చేశారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నుంచి ప్రయాణం చేసిన వారే ఎక్కువగా ఉండటం గమనార్హం. నగరంలోని లింగంపల్లి, హైటెక్‌సిటీ, తదితర ఎంఎంటీఎస్ స్టేషన్లు, విజయవాడ, తిరుపతి, వరంగల్ వంటి పెద్ద స్టేషన్ల నుంచి కూడా యూటీఎస్ రాకపోకలు క్రమంగా పెరుగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ మొబైల్ యాప్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ప్రయాణికులు తాము బయలుదేరే రైల్వేస్టేషన్‌కు 15 మీటర్ల నుంచి 5 కిలోమీటర్ల జీపీఎస్ పరిధిలో ఉంటే చాలు. ఒకసారి టిక్కెట్ బుక్ చేసుకున్న తరువాత 3 గంటల పాటు అది చెల్లుబాటులో ఉంటుంది. ఈ ఒక్క పరిమితిని దృష్టిలో ఉంచుకొని యూటీఎస్‌ను వినియోగించుకోవాలి. ఆర్–వాలెట్‌పై 5 శాతం బోనస్... ప్రయాణికులు తమ స్మార్ట్ ఫోన్లలో గూగుల్ ప్లేస్టోర్, ఇతర సదుపాయాల నుంచి యూటీఎస్ మొబైల్ యాప్‌ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆ తరువాత తమ పూర్తి వివరాలను నమోదు చేసుకోవాలి. టిక్కెట్ బుక్ చేసుకొనేందుకు ఆన్లైన్ బ్యాంకింగ్, క్రెడిట్, డెబిట్ కార్డులను వినియోగించవచ్చు. అయితే దక్షిణమధ్య రైల్వే ప్రవేశపెట్టిన ఆర్–వాలెట్ ద్వారా టిక్కెట్లు బుక్ చేసుకుంటే టిక్కెట్ చార్జీలపైన 5 శాతం బోనస్ లభిస్తుంది. -
రిజర్వేషన్ చార్ట్ సిద్ధమైనా.. రైలు టికెట్!
సాక్షి, హైదరాబాద్: రైలు రిజర్వేషన్ చార్ట్ విడుదలయ్యాక కూడా టికెట్లు అమ్మే వెసులుబాటును రైల్వే ప్రారంభించింది. చార్ట్ విడుదలయ్యాక ఆ రైలులు బెర్తులు ఖాళీగా ఉంటే అంతమేర టికెట్లను జారీ చేస్తారు. ఇంతకాలం ఒకే చార్టు జారీ చేసే విధానం ఉండగా, ఇప్పుడు రెండు చార్టులు సిద్ధం చేసే విధానాన్ని ప్రారంభించింది. నష్టాల నివారణ కసరత్తులో భాగంగా ఇటీవల రైల్వే బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. నిజానికి ఇప్పటికే ఇది అమలులోకి వచ్చినప్పటికీ దీనిపై ప్రయాణికుల్లో అవగాహన లేకపోవటంతో ఖాళీ టికెట్లు అమ్ముడుకావటం లేదు. దీంతో దీనిపై ప్రయాణికులకు తెలిసేలా ప్రచారం చేయాలని నిర్ణయించింది. అరగంట ముందు వరకు అవకాశం... రైలు బయలుదేరటానికి కనీసం నాలుగు గంటల ముందు చార్టు విడుదలవుతోంది. ఆ రైలులో ప్రయాణించేందుకు ముందస్తు రిజర్వేషన్ చేసుకున్నవారి వివరాలను బెర్తుల నెంబరుతో ఇందులో ప్రకటిస్తారు. చార్టు విడుదలైన వెంటనే టికెట్ల రిజర్వేషన్ నిలిచిపోతుంది. కానీ అప్పటికీ రైలులో కొన్ని బెర్తులు ఖాళీగా ఉంటే.. అవి అలాగే మిగిలిపోతున్నాయి. దీంతో రైల్వేకు నష్టం వాటిల్లటమే కాకుండా, ప్రయాణికులు ప్రత్యామ్నాయాల కోసం ఇబ్బంది పడాల్సిన పరిస్థితి వస్తోంది. దీంతో కొత్త విధానాన్ని రైల్వే ప్రారంభించింది. నాలుగు గంటల ముందు చార్టు విడుదలయ్యే సమయానికి బెర్తులు ఖాళీగా ఉంటే... రైలు బయలుదేరటానికి అరగంట వరకు వాటి కి సంబంధించిన రిజర్వేషన్ టికెట్ కొనేందుకు వెసులుబాటు కల్పించింది. ఖాళీగా ఉన్న బెర్తుల వివరాలను ఐఆర్సీటీసీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయి. వాటిని చూసి ప్రయాణికులు ఆన్లైన్లో టికెట్లు రిజర్వ్ చేసుకోవచ్చు. ఇక కొన్ని రైళ్లలో కొన్ని స్టేషన్లు దాటిన తర్వాత బెర్తు ఖాళీ అవుతుంది. అలాంటి వాటి టికెట్లను ఆయా స్టేషన్లలోని కౌంటర్లలో కూడా విక్రయిస్తున్నారు. ఉదా.. హైదరాబాద్ నుంచి విజయవాడ మీదుగా నర్సాపూర్ వెళ్లే ఎక్స్‌ప్రెస్‌లో.. విజయవాడ వరకు ఓ బెర్తు రిజర్వు అయి ఉంటుంది. విజయవాడ తర్వాత అది ఖాళీ అవుతుంది. కొత్త విధానం అమలులోకి రాకముందు అలాంటి ఖాళీలు అలాగే ఉండిపోయేవి. ఇప్పుడు విజయవాడలో ఆ టికెట్‌ను రైలు బయలు దేరటానికి అరగంట ముందు వరకు విక్రయిస్తారు. ఎమర్జెన్సీ కోటా కింద టికెట్లు బుక్ చేసుకున్న సందర్భాల్లో కూడా.. కొన్ని స్టేషన్ల తర్వాత గాని కొన్ని స్టేషన్ల ముందు వరకు గాని ఆ బెర్తు ఖాళీగా ఉంటుంది. అలాంటివి కూడా బుక్ చేసుకోవచ్చు. ఉదా.. నర్సాపూర్ ఎక్స్‌ప్రెస్‌లో గుంటూరు నుంచి ఎమర్జెన్సీ కోటా కింద బెర్తు రిజర్వ్ అయితే,,, గుంటూరు వరకు ఆ బెర్తు ఖాళీగా ఉంటుంది. అలాంటి ఖాళీలను కూడా రైలు బయలుదేరటానికి అరగంట ముందు వరకు బుక్ చేసుకోవచ్చు. ఈ విషయంలో అవగాహన లేకపోవటంతో అలాంటి ఖాళీ బెర్తులతోనే రైళ్లు నడుస్తున్నాయి. అరగంట ముందు తుది జాబితా సిద్ధం చేసి దాన్ని నేరుగా టీసీలకు అందజేస్తారు. వాటిని బోగీ వెలుపల అతికించరు. -
120 రోజుల ముందే రిజర్వేషన్ చేసుకోవచ్చు!
న్యూఢిల్లీ: రైలు ప్రయాణికులు ఇక 120 రోజుల ముందేటికెట్లను రిజర్వేషను చేసుకోవచ్చు. ప్రస్తుతం 60 రోజులు ముందు మాత్రమే రిజర్వేషన్ చేసుకునే అవకాశం ఉంది. రైళ్లలో సీట్లు, బెర్తులు 120 రోజులు ముందు రిజర్వు చేసుకునే అవకాశం కొత్త ఆర్ధిక సంవత్సరం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుంది. తాజ్ ఎక్స్‌ప్రెస్, గోమితి ఎక్స్‌ప్రెస్, ప్రత్యేక రైళ్లు అడ్వాన్సు టికెట్ రిజర్వేషను విషయంలో ప్రస్తుతం ఉన్న విధంగానే (60 రోజులు) కొనసాగనుందని రైల్వే మంత్రిత్వశాఖ వెల్లడించింది. విదేశీ పర్యాటకులకు అడ్వాన్సు రిజర్వేషన్ టికెట్ బుకింగ్‌కు సంబంధించి 360 రోజుల గడువులో ఎలాంటి మార్పులేదని పేర్కొంది. సీనియర్ సిటిజన్లు, మహిళలు, గర్భిణిలకు బెర్తులో కోటా రైళ్లలో ప్రయాణించే సీనియర్సిటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్భిణిలకు బోగిలోని కింది బెర్తులను కోటా కింద కేటాయిస్తూ రైల్వే మంత్రిత్వశాఖ నిర్ణయం తీసుకుంది. 60 ఏళ్లు దాటిన సీనియర్ సీటిజన్లు, 45 ఏళ్లు దాటిన మహిళలు, గర్బిణీలకు రైల్వే టికెట్ బుకింగ్ సమయంలో స్లీపర్, 3 ఏసీ, 2 ఏసీల్లో కంప్యూటరైజ్డ్ ప్యాసింజర్ రిజర్వేషన్ విధానంలో ఆటోమెటిక్‌గా బెర్తులు కేటాయింపు జరుగుతుంది. సీనియర్ సిటిజన్లు, వికలాంగుల సహాయకులకు మధ్య, లేదా అప్పర్ బెర్తులు కేటాయిస్తారు. సుదూర ప్రయాణం సాగించే మెయిల్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఒక స్లీపర్ బోగీలో ఆరు బెర్తులను ఈ కోటా కింద కేటాయించనున్నారు. -
22 నుంచి డబుల్ డెక్కర్
సాక్షి, ముంబై: డబుల్ డెక్కర్ రైలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొంకణ్ వాసుల కల ఈ నెల 22 నుంచి సాకారం కానుంది. గణేష్ ఉత్సవాలకు కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులకు ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఎంతో దోహదపడనుంది. రైలు రిజర్వేషన్ టికెట్లు కేవలం ఇంటర్నెట్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం రైల్వే యాజమాన్యం కల్పించింది. కొంకణ్ రైల్వే అధికారులు ఈ రైలుకు 02005 నంబర్ కేటాయించారు. ఈ నెల 22,24,26,28,30, సెప్టెంబర్‌లో 1,3,5,7,9 తేదీల్లో ముంబైలోని లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ -కొంకణ్‌లోని కర్మాలి స్టేషన్ల మధ్య ఈ హాలిడే స్పెషల్ ట్రెయిన్‌ను నడపనున్నారు. కుర్లా టెర్మినస్ నుంచి ఈ రైలు ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30 గంటలకు కర్మాలి చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 02006 నంబర్ కేటాయించారు. ఈ నెల 23,25, 27,29,31 తేదీల్లో, సెప్టెంబర్‌లో 2,4,6,8,10 తేదీల్లో కర్మాలి నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు కుర్లా టెర్మినస్‌కు చేరుకుంటుంది. ఇందులో ఒక ఏసీ క్యాంటిన్ బోగీ ఉండగా ఎనిమిది ఏసీ డబుల్ డెక్కర్ చెయిర్ కార్లు, రెండు జనరేటర్ బోగీలు, ఒక గార్డు బోగీ ఉంటుంది. డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి రావడంవల్ల ఈ ఉత్సవాల్లో ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే కొంకణ్ వాసులకు కొంతమేర ఊరట లభించినట్లయిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి అన్నారు.