సాక్షి, ముంబై: డబుల్ డెక్కర్ రైలు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కొంకణ్ వాసుల కల ఈ నెల 22 నుంచి సాకారం కానుంది. గణేష్ ఉత్సవాలకు కొంకణ్ దిశగా వెళ్లే ప్రయాణికులకు ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలు ఎంతో దోహదపడనుంది. రైలు రిజర్వేషన్ టికెట్లు కేవలం ఇంటర్నెట్ ద్వారా బుకింగ్ చేసుకునే సౌకర్యం రైల్వే యాజమాన్యం కల్పించింది. కొంకణ్ రైల్వే అధికారులు ఈ రైలుకు 02005 నంబర్ కేటాయించారు.
ఈ నెల 22,24,26,28,30, సెప్టెంబర్‌లో 1,3,5,7,9 తేదీల్లో ముంబైలోని లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ -కొంకణ్‌లోని కర్మాలి స్టేషన్ల మధ్య ఈ హాలిడే స్పెషల్ ట్రెయిన్‌ను నడపనున్నారు. కుర్లా టెర్మినస్ నుంచి ఈ రైలు ఉదయం 5.30 గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 4.30 గంటలకు కర్మాలి చేరుకుంటుంది. అదేవిధంగా తిరుగు ప్రయాణంలో 02006 నంబర్ కేటాయించారు.
ఈ నెల 23,25, 27,29,31 తేదీల్లో, సెప్టెంబర్‌లో 2,4,6,8,10 తేదీల్లో కర్మాలి నుంచి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. సాయంత్రం 5.30 గంటలకు కుర్లా టెర్మినస్‌కు చేరుకుంటుంది. ఇందులో ఒక ఏసీ క్యాంటిన్ బోగీ ఉండగా ఎనిమిది ఏసీ డబుల్ డెక్కర్ చెయిర్ కార్లు, రెండు జనరేటర్ బోగీలు, ఒక గార్డు బోగీ ఉంటుంది. డబుల్ డెక్కర్ రైలు అందుబాటులోకి రావడంవల్ల ఈ ఉత్సవాల్లో ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే కొంకణ్ వాసులకు కొంతమేర ఊరట లభించినట్లయిందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి అన్నారు.
22 నుంచి డబుల్ డెక్కర్
Published Thu, Aug 14 2014 11:07 PM | Last Updated on Sat, Sep 2 2017 11:52 AM
Advertisement