సాక్షి, ముంబై: కొంకణ్ ప్రయాణికులకు గణేష్ ఉత్సవాల సమయంలో డబుల్ డెక్కర్ ఏసీ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు నడపాలా... వద్దా... అనే దానిపై కొద్ది రోజులుగా సెంట్రల్ రైల్వే, చీఫ్ సేఫ్టీ కమిషనర్ల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో గణేశ్ ఉత్సవాల సమయంలో స్పెషల్ ట్రెయిన్‌గా నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతినిచ్చారు. వారానికి మూడు సార్లు మాత్రమే ఈ రైలు నడపనున్నారు. ఈ రైలు లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి బయలుదేరి కొంకణ్ రీజియన్‌లోని కర్మాళి వరకు పరుగులు తీయనుంది.
ప్రతీ బోగీలో 120 మంది వరకు కూర్చోవచ్చు. ఇందులో బెర్తులు ఉండవు. ఉదయం ఐదు గంటలకు కుర్లా టెర్మినస్ నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు కర్మాళి చేరుకుంటుంది. ఇదిలాఉండగా, ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలును కొంకణ్ రైల్వే మార్గంపై నడిపే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ ఏసీ రైలు భోపాల్-నవీ ఢిల్లీల మధ్య నడుస్తోంది. అందులోని 10 బోగీలను సెంట్రల్ రైల్వే తీసుకుంది. ఇందులో స్వల్ప మార్పులు చేసి కొంకణ్ రైల్వే మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు.
ఈ మార్గం అత్యధిక శాతం కొండ ప్రాంతం మీదుగా ఉంది. అనేక సొరంగాలు, ఎత్తై వంతెనలు చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ఇది సఫలీకృతం కావడంతో రైల్వే సేఫ్టీ కమిషనర్ జారీచేసే సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా, గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. అందుకు రైల్వే శాఖ అదనంగా రైళ్లు నడుపుతుంది. ఎమ్మెస్సార్టీసీ కూడా తమవంతుగా అదనపు బస్సులు నడుపుతుంది. అయినప్పటికీ అవి ఎటూ సరిపోవు.
ఉత్సవాల సమయంలో రెగ్యూలర్‌గా నడిచే రైళ్లతోపాటు స్పెషల్ ట్రెయిన్లకు కూడా రిజర్వేషన్ బుకింగ్ రెండు నెలల ముందే పూర్తయిపోయాయి. దీన్నిబట్టి ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్సవాల సమయంలో నడిపే ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు మంచి స్పందన లభిస్తుందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి ఆశాభావం వ్యక్తం చేశారు.
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ రైలు
Published Tue, Aug 12 2014 11:06 PM | Last Updated on Tue, Oct 2 2018 8:10 PM
Advertisement