AC bus
-
ఏసీ బస్సుల్లో ‘స్నాక్స్’ బాదుడు!.. తప్పక చెల్లించాల్సిందే..
సాక్షి, హైదరాబాద్: ఏసీ బస్సుల టికెట్ ధరలను ఆర్టీసీ సవరించింది. ప్రయాణించే దూరంతో సంబంధం లేకుండా ప్రతి టికెట్‌పై రూ.30 చొప్పున పెంచింది. ఏసీ స్లీపర్ సర్వీసు లహరి, గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సుల్లో ఈ మార్పు చోటు చేసుకుంది. ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు తృణధాన్యాలతో చేసిన స్నాక్స్ ప్యాకెట్‌ను అందించటాన్ని ప్రారంభించిన ఆర్టీసీ, ఆ తినుబండారాల చార్జీ రూపంలో రూ.30 చొప్పున పెంచుతూ టికెట్ ధరలను సవరించింది. ఈ కొత్త ధరలను ఆదివారం అర్ధరాత్రి దాటిన తర్వాత నుంచి అమలులోకి తెచ్చింది. చిరు ధాన్యాలతో స్నాక్స్ రూపొందించే ట్రూ గుడ్ అన్న సంస్థతో ఇటీవలే ఆర్టీసీ ఒప్పందం కుదుర్చుకుంది. ఇప్పుడు ఆ సంస్థ వాటిని ప్రయాణికులకు సరఫరా చేస్తోంది. నో ఛాయిస్.. సాధారణంగా ఇలాంటి తినుబండారాలను అందించేటప్పుడు ప్రయాణికుల ఇష్టాయిష్టాలను పరిగణనలోకి తీసుకుంటారు. ఇటీవల సూపర్ లగ్జరీ బస్సుల్లో అరలీటరు మంచినీటి సీసాను అందించే నిర్ణయం తీసుకున్నప్పుడు రూ.10 చొçప్పున టికెట్ ధరను పెంచిన విషయం తెలిసిందే. ప్రయాణికుల ఇష్టాయిష్టాలతో సంబంధం లేకుండా, కచ్చితంగా పెంచిన ధరను చెల్లించేలా అమలులోకి తెచ్చింది. ఇప్పుడు కూడా, స్నాక్స్ ప్యాకెట్‌ను విధిగా తీసుకోవాల్సిందే. టికెట్లోనే దాని ధరను చేర్చినందున స్నాక్స్ ప్యాకెట్ రుసుమును కచ్చితంగా చెల్లించాల్సినట్టవుతుంది. ఏముంటాయంటే.. టికెట్ తీసుకోగానే ప్రయాణికుడికి ఓ ప్యాకెట్ ఇస్తారు. ట్రూ గుడ్–ఆర్టీసీ సంయుక్త వివరాలతో ఈ ప్యా కెట్లను రూపొందించారు. ఆ ప్యాకెట్లో చిరుధాన్యా లతో రూపొందించిన 25 గ్రాముల మురుకులు/కా రప్పూస, పప్పు చెక్క, సేగు (ఇవి ఒక్కో ప్యాకెట్లో ఒ క్కోరకం ఉంటుంది), 20 గ్రాముల మిల్లెట్ చిక్కీ, ఒక మిల్లెట్ రస్్కలతో కూడిన విడివిడి ప్యాకెట్లు ఉంటా యి. ఐక్యరాజ్య సమితి 2023వ సంవత్సరాన్ని అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంగా ప్రకటించిన నేపథ్యంలో, ఆరోగ్యాన్ని అందించే చిరుధాన్యాలతో రూపొందించిన చిరుతిండిని అందించాలని నిర్ణయిం చినట్టు గతంలో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. ‘స్నాక్స్’వల్ల పెరిగే ఆదాయం ఏమేరకు? ప్రస్తుతం ఆర్టీసీ ఏసీ బస్సుల్లో నిత్యం దాదాపు 16 వేల నుంచి 18 వేల మంది వరకు ప్రయాణిస్తున్నారు. ఒక్కో టికెట్‌పై రూ.30 చొప్పున అదనంగా వసూలు చేస్తున్నందున ఆర్టీసీకి నెలకు రూ.కోటిన్నర వరకు ఆదాయం పెరుగుతుంది. అయితే, తయారీ కంపెనీ నుంచి ఒక్కో ప్యాకెట్‌పై ఆర్టీసీ రూ.18 వరకు వెచ్చిస్తున్నట్టు సమాచారం. ఆ లెక్కన దీన్ని పెద్ద ఆదాయంగా పరగణించాల్సిన అవసరం ఉండదు. -
గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభం
హైదరాబాద్: హైదరాబాద్ రోడ్లపై ఇకనుంచి ఎలక్ట్రిక్ బస్సులు నడవనున్నాయి. గచ్చిబౌలిలో 25 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు నేడు ప్రారంభం అయ్యాయి. రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్, ఆర్టీసీ ఎండీ సజ్జనర్‌లు ఈ బస్సులను ప్రారంభించారు. వేవ్ రాక్, బాచుపల్లి, సికింద్రబాద్, కొండాపూర్, మియాపూర్, శంషాబాద్ ఎయిర్ పోర్ట్, జేబీఎస్, హైటెక్ సిటీ, ఎల్బీ నగర్ మధ్య ఈ బస్సులు నడవనున్నాయి. సీసీ కెమెరాలు, ప్రయాణికులకు ఛార్జింగ్ సదుపాయం వంటి అధునాతన సౌకర్యాలు ఇందులో ఉన్నాయి. 'రాబోయే తరాలకు పర్యావరణ కాలుష్యం లేకుండా సౌకర్యాలను అందించాలి. ఎంత కష్టాల్లో tsrtc ఉన్నా ప్రయాణికుల సంక్షేమమే మాకు ముఖ్యం. 550 బస్సులు హైదరాబాద్ లో నడపాలని నిర్ణయించాం. ముందుగా 50 బస్సులు వచ్చాయి. అందులో 25 ఇవాళ ప్రారంభిస్తున్నాం. వచ్చే కొన్ని ఏసీ లేని బస్సులు వస్తున్నాయి. వాటిని కూడా ఏసీగా మార్చి నడిపించాలనుకుంటున్నాం. మెట్రో వీటిన్నింటిని అనుసంధానం చేయాలి.' అని మంత్రి పువ్వాడ అజయ్ అన్నారు. 'కొత్త 25 ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొచ్చాం. కాలుష్య ప్రభావం కొంత తగ్గుతుంది. ఎయిర్ పోర్టుకు గతంలో నడిచేవి. అందుకే మరిన్ని కొత్త బస్సులను నడుపుతున్నాం. ప్రయాణికుల ఆదరణ పెరుగుతోంది. ఐటీ కారిడార్ తో పాటు, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు తిప్పుతున్నాం. 470 బస్సులు వచ్చే ఆరునెలల్లో నడుపుతాం. సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం.' అని ఆర్టీసి ఎండీ సజ్జనార్ అన్నారు. కేంద్రం నుంచి గతంలో సబ్సిడీ వచ్చేది కానీ ఇప్పుడు అదికూడా రాట్లేదని మంత్రి పువ్వాడ అన్నారు. ప్రస్తుతం ఇందులో 35 సీట్ల సామర్ధ్యం మాత్రమే ఉంది.. కానీ త్వరలో సీటింగ్ కెపాసిటీ కూడా పెంచేలా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం uv పాలసీ తీసుకొచ్చి ఎలక్ట్రికల్ వాహనాల వైపు మొగ్గు చూపుతుందని చెప్పారు. కోటి 52 లక్షల వాహనాలు తెలంగాణ లో ఉన్నాయి.. వీటన్నింటినీ ఎలక్ట్రిక్ దిశగా మార్చాలని అన్నారు. ఆర్టీసి ఉద్యోగుల ప్రధాన సమస్య తీరింది వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించామని పేర్కొన్న మంత్రి పువ్వాడ.. మరో నెలలో ఈ ప్రాసెస్ కూడా పూర్తవుతుందని చెప్పారు. ఇదీ చదవండి: యాదాద్రి జిల్లాలో విషాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. ఇద్దరు మృతి.. -
TSRTC: ఆర్టీసీ బస్సుల్లో సీటు బెల్టులు
సాక్షి, హైదరాబాద్: సాధారణంగా కార్లలో సీటు బెల్టులు వాడుతుంటారు. కానీ, తొలిసారి నగరంలో సీట్ బెల్టులుండే సిటీ బస్సులు అందుబాటులోకి రాబోతున్నాయి. విదేశాల్లో బస్సుల్లో కూడా సీటు బెల్టులు తప్పని సరి. వాస్తవానికి మన దగ్గర కూడా బస్సుల్లోనూ సీటు బెల్టులుండాలనే నిబంధ న ఉన్నా అది అమలుకావటం లేదు. తొలిసా రి ఆర్టీసీ సిటీ సర్విసుల్లో ఆ తరహా సీట్లను అందుబాటులోకి తెస్తోంది. నగరంలో మరో నెలన్నరలో అందుబాటులోకి రానున్న ఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో ఇవి కనిపించనున్నాయి. ఆ బస్సులు ఎలా ఉండనున్నాయో అధికారులు పరిశీలించేందుకు వీలుగా నమూనా బస్సును సోమవారం బస్‌భవన్‌కు తీసుకురాగా, ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పరిశీలించారు. హైదరాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం, ఐటీ కారిడార్ మార్గాల్లో తిరిగేందుకు వీలుగా ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను తిప్పాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ఇప్పటికే పుష్పక్ పేరుతో 40 ఎలక్ట్రిక్ బస్సులు విమానాశ్రయం మార్గంలో తిరుగుతున్న విషయం తెలిసిందే. అవన్నీ లాభాల్లో ఉండటం, రద్దీకి చాలినన్ని లేకపోవటంతో అదనంగా మరిన్ని బస్సులు తిప్పాలని నిర్ణయించారు. దానితోపాటు ఐటీ కారిడార్‌లో మెట్రో రైలు సేవలు అందుబాటులో లేని రూట్లలో కొన్ని తిప్పనున్నారు. ప్రస్తుతం విమానాశ్రయ మార్గంలో నడుస్తున్న ఎలక్ట్రిక్ బస్సులతో పోలిస్తే ఆధునిక వసతులు అదనంగా ఉన్న ఈ కొత్త బస్సులు ప్రయాణికులకు మెరుగైన రవాణా వసతిని అందించనున్నాయి. 500 బస్సులకు ఆర్డర్ 500 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను నగరంలో తిప్పాలని నిర్ణయించిన ఆరీ్టసీ, ఇప్పటికే ఆర్డర్ ఇచి్చన విషయం తెలిసిందే. సిటీ బస్సులుగా తిప్పే సర్విసులకు సంబంధించి తొలి విడతలో 50 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో 20 శంషాబాద్ విమానాశ్రయానికి, 30 ఐటీ కారిడార్‌లో తిరుగుతాయి. ఇందులో 25 బస్సులు నెలనెలన్నరలో రోడ్డెక్కుతాయని అధికారులు అంటున్నారు. గ్రాస్ కాస్ట్ కాంట్రాక్టు పద్దతిలో వీటిని ఆర్టీసీ అద్దెకు తీసుకుంటోంది. ఇవి కాకుండా మరో 800 ఎలక్ట్రిక్ బస్సులను దశలవారీగా సమకూర్చుకోవాలనేది ఆర్టీసీ ఆలోచన. వాటికి ఇంకా టెండర్లు పిలవలేదు. ఆకుపచ్చ, తెలుపు రంగుతో.. ఆకుపచ్చ, తెలుపు రంగుతో ఈ బస్సులుంటాయి. రంగుల మేళవింపుపై ఎండీ సంతృప్తి వ్యక్తం చేశారు. బస్సు ముందువైపు ఆర్టీసీ లోగో లేకపోవటాన్ని ప్రశ్నించిన ఆయన, ప్రయాణికులకు కనిపించేలా లోగో ఏర్పాటు చేయాలని సూచించారు. కొన్ని సీట్లకే బెల్టులుండటంతో, అన్ని సీట్లకు ఏర్పాటు చేయాలని సూచించారు. కార్యక్రమంలో సీఓఓ రవీందర్, సీఎంఈ రఘునాథరావు, సీఈఐటీ రాజశేఖర్, ఒలెక్ట్రా కంపెనీ ప్రతినిధులు వేణుగోపాలరావు, ఆనంద్, యతీశ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. 12 మీటర్ల పొడవు.. ఇప్పుడు కొత్తగా సమకూరే ఏసీ ఎలక్ట్రిక్ బస్సులు 12 మీటర్ల పొడవుతో ఉంటాయి. ఒక్కో బస్సులో 35 సీట్లుంటాయి.ప్రతి సీటు వద్ద మొబైల్ చార్జింగ్ సాకెట్ అందుబాటులో ఉంటుంది. బస్సుల్లో మూడు సీసీ టీవీ కెమెరాలు అమర్చి ఉంటాయి. అవి ఒక నెల రికార్డింగ్ బ్యాకప్‌తో ఉంటాయి. రివర్స్ చేసేప్పుడు డ్రైవర్‌కు వెనక భాగం కనిపించేలా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. ప్రయాణికులకు సూచనలు అందజేసేందుకు వీలుగా బస్సులో నాలుగు ఎల్ఈడీ డిస్ప్లే బోర్డులుంటాయి. అగ్నిప్రమాదాలను ముందుగానే గుర్తించేందుకు వీలుగా బస్సులో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం ఉంటుంది. వెహికిల్ ట్రాకింగ్ సిస్టం కూడా ఉంటుంది. ఒకసారి ఫుల్ చార్జి అయితే 225 కి.మీ. దూరం వరకు ప్రయాణిస్తాయి. ఫుల్ చార్జింగ్కు దాదాపు 3 గంటల సమయం పడుతుంది. -
పర్యాటక రంగాభివృద్ధికి కృషి
గన్‌ఫౌండ్రీ (హైదరాబాద్): తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పర్యాటక రంగం అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తోందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. తెలంగాణ రాష్ట్ర పర్యాటక శాఖ నూతనంగా కొనుగోలు చేసిన రెండు ఏసీ బస్సులు, ఒక మినీ వాహనాన్ని శుక్రవారం రవీంద్రభారతిలో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన ప్రారంభించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. గతంలో రెండు బస్సులను కొనుగోలు చేశామని, ప్రస్తుతం రూ.5 కోట్ల వ్యయంతో మరో రెండు బస్సులను కొనుగోలు చేసినట్లు వివరించారు. హైదరాబాద్ నుంచి తిరుపతి, షిరిడీలకు భద్రతతో కూడిన ప్రయాణ సౌకర్యం కల్పిస్తున్నట్టు తెలిపారు. కాళేశ్వరం, నాగార్జునసాగర్, సోమశిల, ఆదిలాబాద్, వరంగల్ ప్రాంతాలలో 5 పాయింట్లుగా ఈ పర్యాటక బస్సులను నడిపేందుకు త్వరలో ప్రత్యేకమైన విధానాన్ని తీసుకొస్తామన్నారు. కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పర్యాటక కార్పొరేషన్ చైర్మన్ గెల్లు శ్రీనివాస్ యాదవ్, గీత కార్మికుల సహకార సంస్థ చైర్మన్ పల్లె రవికుమార్ గౌడ్, పర్యాటక శాఖ ఎండీ మనోహర్‌రావు తదితరులు పాల్గొన్నారు. -
త్వరలో ఎలెక్ట్రిక్ డబుల్ డెక్కర్ బస్సులు
సాక్షి బెంగళూరు: బెంగళూరు నగర వాసులకు అతి త్వరలో డబుల్ డెక్కర్ బస్సుల్లో ప్రయాణించే అనుభవం రానుంది. ఇవన్నీ ఎలెక్ట్రిక్ బస్సులే కానున్నాయి. ఓ ప్రముఖ సంస్థతో బస్సుల కొనుగోలుకు బీఎంటీసీ ఒప్పందం చేసుకుంది. తొలుత ఐదు డబుల్ డెక్కర్ బస్సులకు రూ. 10 కోట్లు బీఎంటీసీ చెల్లించనుంది. తొలి బస్సు మార్చిలో, మరో నాలుగు బస్సులు ఏప్రిల్‌లో వస్తాయి. ఇందులో ఏసీ సహా పలు ఆధునిక వసతులు ఉంటాయని బీఎంటీసీ వర్గాలు తెలిపాయి. మొదటి ఏసీ డబుల్ డెక్కర్ బస్సు హెబ్బాల నుంచి సిల్క్ బోర్డు మార్గంలో ప్రయాణించనుంది. వోల్వో వజ్ర బస్సులో చెల్లించే టికెట్ చార్జీలే ఈ బస్సులోనూ ఉండనున్నాయి. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే సుమారు 250 కి.మీ. దూరం ప్రయాణిస్తుంది. ఈ బస్సుకు ముందు భాగం, వెనుక భాగంలో తలుపులు ఉంటాయి. 65 మంది ప్రయాణించవచ్చు. -
టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులు వచ్చేస్తున్నాయ్.. ప్రత్యేకతలివే..
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికులకు మెరుగైన, నాణ్యమైన సేవలను అందించేందుకు రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏసీ స్లీపర్ బస్సులను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) అందుబాటులోకి తీసుకువస్తోంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఇప్పటికే కొత్త సూపర్ లగ్జరీ, నాన్ ఏసీ స్లీపర్, సీటర్ కమ్ స్లీపర్ బస్సులను ప్రారంభించిన సంస్థ.. సుదూర ప్రాంతాలకు వెళ్లే వారికి మరింతగా చేరువ అయ్యేందుకు హైటెక్ హంగులతో ఏసీ స్లీపర్ బస్సులను రూపొందించింది. ప్రైవేట్ బస్సులకు ధీటుగా రూపొందించిన 16 కొత్త ఏసీ స్లీపర్ బస్సులు మార్చి నెలలో అందుబాటులోకి రాబోతున్నాయి. కర్ణాటకలోని బెంగళూరు, హుబ్లీ, ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం, తిరుపతి, తమిళనాడులోని చెన్నై మార్గాల్లో ఈ బస్సులను సంస్థ నడపనుంది. నాన్ ఏసీ స్లీపర్ బస్సుల మాదిరిగానే ఏసీ స్లీపర్ బస్సులకు లహరిగా సంస్థ నామకరణం చేసింది. హైదరాబాద్ లోని బస్ భవన్ ప్రాంగణంలో కొత్త ప్రోటో (నమూనా) ఏసీ స్లీపర్ బస్సును టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ పరిశీలించారు. బస్సులో ప్రయాణికులకు కల్పిస్తోన్న సౌకర్యాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా బస్సులను ప్రారంభించి.. ప్రయాణికులకు అందుబాటులో ఉంచేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తెలంగాణలో మొదటిసారిగా అందుబాటులోకి తీసుకువస్తోన్న టీఎస్ఆర్టీసీ ఏసీ స్లీపర్ బస్సులకు ప్రజల నుంచి మంచి ఆదరణ లభించగలదని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి. రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ఆపరేషన్స్) పీవీ ముని శేఖర్, చీఫ్ పర్సనల్ మేనేజర్ (సీపీఎం) కృష్ణ కాంత్, చీఫ్ మెకానికల్ ఇంజనీర్ (సీఎంఈ) రఘునాథ రావు, చీఫ్ ట్రాఫిక్ మేనేజర్(సీటీఎం) జీవన్ ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు. బస్సు ప్రత్యేకతలివే! 12 మీటర్ల పొడవు గల ఏసీ స్లీపర్ బస్సుల్లో లోయర్ 15, అప్పర్ 15తో 30 బెర్తుల సామర్థ్యం ఉంది. బెర్త్ ల వద్ద వాటర్ బాటిల్ పెట్టుకునే సదుపాయంతో పాటు మొబైల్ చార్జింగ్ సౌకర్యం ఉంటుంది. ప్రతి బెర్త్ వద్ద రీడిండ్ ల్యాంప్ లను ఏర్పాటు చేశారు. ప్రయాణికుల భద్రత దృష్ట్యా ఏసీ స్లీపర్ బస్సుల్లో వెహికిల్ ట్రాకింగ్ సిస్టంతో పాటు పానిక్ బటన్ సదుపాయం కల్పించారు. వాటిని టీఎస్ఆర్టీసీ కంట్రోల్ రూంనకు అనుసంధానం చేయడం జరుగుతుంది. ప్రయాణికుల సౌకర్యార్థం ఏసీ స్లీపర్ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని కల్పించారు. ప్రతి బస్సులోనూ రెండు సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అవి కేబిన్‌లో, బస్సు లోపల ఉన్నాయి. బస్సు రివర్స్ చేసేందుకు వీలుగా రివర్స్ పార్కింగ్ అసిస్టెన్స్ కెమెరా ఉంటుంది. బస్సుకు ముందు వెనక ఎల్ఈడీ బోర్డులుంటాయి. అందులో గమ్యస్థానాల వివరాలు కనిసిప్తాయి. అగ్ని ప్రమాదాలను ముందుగానే గుర్తించి నివారించేందుకు బస్సుల్లో ఫైర్ డిటెక్షన్ సప్రెషన్ సిస్టం(ఎఫ్డీఎస్ఎస్)ను ఏర్పాటు చేయడం జరిగింది. ప్రయాణికులకు సమాచారం చేరవేసేందుకు వీలుగా పబ్లిక్ అడ్రస్ సిస్టం బస్సుల్లో ఉంటుంది. చదవండి: అమ్మకానికి హెచ్ఎండీఏ భూములు.. ప్లాట్ల ఆన్లైన్ వేలం ఎప్పుడంటే? -
అంతర్రాష్ట్ర ఏసీ బస్సుల చార్జీ తగ్గింపు
సాక్షి, హైదరాబాద్: అంతర్రాష్ట్ర ఏసీ బస్సు చార్జీలను 10 శాతం తగ్గిస్తూ టీఎస్ఆర్టీసీ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం శుభకార్యాలకు ముహూర్తాలు లేకపోవటంతో బస్సు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉంది. ఏసీ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో కూడా బాగా పడిపోయింది. దీంతో ప్రయాణికులను ఆకట్టుకునే క్రమంలో టికెట్ ధరలను బేసిక్‌పై పది శాతం తగ్గించాలని ఆర్టీసీ నిర్ణయించింది. రెండు రోజుల క్రితం ఏపీఎస్ ఆర్టీసీ కూడా ఇదే కేటగిరీ బస్సుల్లో టికెట్ ధరలను తగ్గించుకుంది. దీంతో ఆంధ్ర ప్రాంతంవైపు వెళ్లే మార్గాల్లో, ప్రయాణికులు టీఎస్ ఆర్టీసీ ఏసీ బస్సుల కంటే ఏపీఎస్ఆర్టీసీ ఏసీ బస్సుల్లో ఎక్కేందుకే మొగ్గు చూపుతున్నారు. దీంతో తమ ఏసీ సర్వీసుల్లో కూడా టికెట్ చార్జీలను సవరించాలని తెలంగాణ ఆర్టీసీ నిర్ణయించింది. శనివారం నుంచి అమల్లోకి వచ్చే కొత్త చార్జీలు ఈ నెలాఖరు వరకు కొనసాగనున్నట్టు ఆర్టీసీ ఓ ప్రకటనలో తెలిపింది. హైదరాబాద్–విజయవాడ మధ్య నడిచే గరుడప్లస్, రాజధాని సర్వీసుల్లో శుక్ర, ఆదివారాలు మినహా మిగతా రోజుల్లో 10 శాతం తగ్గింపు వర్తిస్తుందని, బెంగుళూరు నుంచి హైదరాబాద్ వచ్చే సర్వీసుల్లో శుక్రవారం, హైదరాబాద్ నుంచి బెంగుళూరు వైపు వెళ్లే ఏసీ బస్సుల్లో ఆదివారం మినహా మిగతా రోజుల్లో ఈ తగ్గింపు వర్తిస్తుందని పేర్కొంది. -
AP: ప్రయాణీకులకు గుడ్ న్యూస్.. ఏసీ బస్సుల్లో ఛార్జీలు తగ్గింపు
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ప్రయాణీకులకు గుడ్ న్యూస్ అందించింది. బస్సులు ఛార్జీలు తగ్గిస్తున్నట్టు ఏపీఎస్ఆర్టీసీ శుక్రవారం ఓ ప్రకటనలో పేర్కొంది. ఏసీ బస్సుల్లో తాత్కాలికంగా చార్జీలను 20 శాతం వరకు తగ్గిస్తున్నట్టు తెలిపింది. ఈ నెల 30వరకూ చార్జీల తగ్గింపు అమలులో ఉండనున్నట్టు ఆదేశాల్లో పేర్కొంది. కాగా.. రూట్లు, చార్జీలు ఎంత తగ్గించాలనే నిర్ణయం ఆర్ఎంలకు అప్పగించినట్టు స్పష్టం చేసింది. బస్సుల్లో తగ్గించిన చార్జీలు ఇవే.. - అమరావతి, గరుడ, వెన్నెల బస్సు చార్జీల్లో 10 శాతం తగ్గింపు - విజయవాడ-విశాఖ డాల్ఫిన్ క్రూజ్ బస్సుల్లో 20 శాతం తగ్గింపు - హైదరాబాద్-విజయవాడ ఏసీ బస్సుల్లో 10 శాతం తగ్గింపు - విజయవాడ నుంచి చెన్నై, బెంగళూరు బస్సుల్లో 20 శాతం తగ్గింపు. -
దేశంలో తొలి ఎలక్ట్రిక్ డబుల్ డెక్కర్ ఏసీ బస్సు.. సింగిల్ ఛార్జ్‌తో 250 కి.మీ రయ్!
డబుల్ డెక్కర్ బస్సులు గుర్తున్నాయా. అవి మనం నేరుగా చూడకపోవచ్చు గానీ 90 దశకంలో కొన్ని సినిమాల్లో చూసుంటాం. ప్రస్తుత అవే కాలానికి అనుగుణంగా ఏసీ హంగులతో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్పు చెంది మళ్లీ రోడ్లపైకి వస్తున్నాయి. వీటిని హిందూజా గ్రూప్‌నకు చెందిని ప్రముఖ ఆటోమొబైల్ కంపెనీ అశోక్ లే ల్యాండ్ ఎలక్ట్రిక్ విభాగానికి చెందిన స్విచ్ మొబిలిటీ తయారు చేసింది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ఈ డబుల్ డెక్కర్ ఏసీ బస్సులను కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ముంబైలో ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. పట్టణ రవాణాను సంస్కరణలపై దృష్టి సారిస్తున్నామన్నారు. నగర రవాణాకు ఈ తరహా బస్సులు ఎంతో ఉపయోగకరమని తెలిపారు. ప్రస్తుతం యూకేలో ఈ బస్సులు వాడకంలో ఉండగా, త్వరలో భారత్ రోడ్లపైకి రానున్నాయి. తేలికపాటి అల్యూమినియం బాడీతో వీటిని నిర్మించారు. ముంబైలోని బృహన్ ముంబాయ్ ఎలక్ట్రిసిటీ సప్లయ్ అండ్ ట్రాన్స్పోర్ట్(BEST) 200 డబుల్ డెక్కర్ బస్సులను ఆర్డర్ చేసినట్లు స్విచ్ మొబిలిటీ భారత సీఓఓ అధికారి తెలిపారు. 231 kwh కెపాసిటీ కలిగిన ఈ బస్సు డ్యూయల్ గన్ చార్జింగ్ సిస్టమ్ కలిగి ఉంది. ఒకసారి ఛార్జ్ చేస్తే 250 కిలోమీటర్లు ప్రయాణించవచ్చ. First AC double decker bus by @switchEVglobal entering Mumbai this morning. The launch is tomorrow. (Credits to respective owner) pic.twitter.com/QrQKjUy3X4 — Rajendra B. Aklekar (@rajtoday) August 17, 2022 చదవండి: Tencent: పదేళ్లలో ఇదే తొలిసారి.. 5వేలకు పైగా ఉద్యోగులను తొలగించిన ప్రముఖ కంపెనీ -
ఆర్భాటంగా ఆరంభం.. రెండేళ్లు గడుస్తున్న అలంకారప్రాయం
సాక్షి, సిటీబ్యూరో: ఆర్భాటంగా ఆరంభించిన ఏసీ బస్షెల్టర్లు మౌలిక వసతులు కొరవడి వెలవెలబోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఇవి మేడిపండు చందంగా మారాయి. వీటిలో ఇప్పటి వరకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. రెండేళ్లుగా అలంకారప్రాయంగానే ఉన్నాయి. గ్రేటర్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్‌లతో పాటు ఇటీవల దిల్సుఖ్నగర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. మహిళా ప్రయాణికులకు పూర్తి భద్రత, 24 గంటల పాటు ఏసీ సదుపాయం. తాగునీటి వసతి, ఆధునిక టాయిలెట్లు, ఏటీఎం సదుపాయం, బస్‌పాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపై ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ అరకొర సదుపాయాలే తప్ప ఎక్కడా ప్రయాణికులకు ఇవి పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆ బోర్డులేవీ.. ► బస్సుల రాకపోకలను తెలిపే ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, శిల్పారామం మార్గాల్లో ప్రతి రోజు వేలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలిపే సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు బస్ షెల్టర్లలో వేచి ఉండలేకపోతున్నారు. బస్సుల కోసం ఎదురుచూస్తూ రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ► బస్సుల టైం టేబుల్, అనౌన్స్మెంట్ వ్యవస్థ అమలుకు నోచుకోలేదు. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారం డిస్ప్లే ఏర్పాటుపై అటు గ్రేటర్ ఆరీ్టసీ, ఇటు జీహెచ్ఎంసీ ఏ మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ‘ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలన్నింటినీ జీహెచ్ఎంసీకి అందజేశాం. వాటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ సంస్థపైనే ఉంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దాహమేస్తే దిక్కులేదు.. ► చక్కటి డిజైనింగ్, గ్లాస్ డోర్లు, చూడగానే ఇట్టే ఆకట్టుకొనే ఈ బస్òÙల్టర్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదు. వీటిని అందుబాటులోకి తెచ్చినప్పుడు సురక్షితమైన తాగునీళ్లు మాత్రమే కాదు. క్యాంటిన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీ, కాఫీ, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. కానీ ఇప్పటికీ తాగునీటి సదుపాయం కల్పించలేదు. ► ఏ ఒక్క బస్ షెల్టర్‌లో ఏసీ పని చేయడం లేదు. ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో బస్షెల్టర్లలో దుర్గంధం వ్యాపిస్తోందని, వేచి ఉండలేకపోతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కానీ వినియోగానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. కానీ అవి ఇప్పుడు అలంకారప్రాయంగానే ఉన్నాయి. నిర్వహణ కొరవడింది. -
ఏసీ బస్సా... మేమెక్కం!
సాక్షి, హైదరాబాద్: ఒక్క హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం మధ్యే కాదు... దూరప్రాంతాలకు వెళ్లే అన్ని ఏసీ బస్సుల పరిస్థితి ఇంచుమించు ఇదే. కోవిడ్ భయంతో ప్రయాణికులు ఏసీ బస్సుల్లో ప్రయాణమంటేనే భయపడుతున్నారు. ఏసీలో కోవిడ్ వ్యాప్తి ఉంటుందని జంకుతున్నారు. దీంతో ప్రయాణికులు లేక గరుడ, గరుడ ప్లస్, రాజధాని బస్సులు వెలవెలబోతున్నాయి. గరుడ, గరుడ ప్లస్ బస్సుల్లో ఆక్యుపెన్సీ రేషియో 18 నుంచి 23 శాతంగా ఉండగా, రాజధాని బస్సుల్లో ఇది 30– 33 శాతం ఉంటోంది. హైదరాబాద్ సహా రాష్ట్రంలోని వివిధ పట్టణాల నుంచి దూరప్రాంతాలకు తిరిగేందుకు ప్రత్యేకంగా ఆర్టీసీ ఏసీ బస్సులు తిప్పుతోంది. వీటిల్లో ప్రీమియం కేటగిరీగా గరుడ, గరుడ ప్లస్(మల్టీ యాక్సల్) బస్సులు తిరుగుతున్నాయి. దాదాపు వంద వరకు ఉన్న ఈ బస్సులకు గతంలో సగటున ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం నమోదయ్యేది. వీటిలో కొన్ని సర్వీసులకైతే టికెట్లు దొరకటం గగనంగా ఉండేది. వీటి టికెట్ ధర అధికంగా ఉన్నందున ఖర్చుపోను కొంత ఆదాయం మిగిలి ఇవి లాభాల్లో ఉండేవి. అలాంటిది ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సాధారణ బస్సుల కంటే ఎక్కువ నష్టాలు వీటితోనే నమోదవుతున్నాయి. ఉదాహరణకు బీహెచ్ఈఎల్, మియాపూర్ ప్రాంతాల నుంచి నిత్యం బెంగళూరుకు గరుడ ప్లస్ బస్సులు తిరుగుతున్నాయి. ఇప్పుడు వాటిల్లో ఆక్యుపెన్సీ రేషియో 22 శాతమే. దాంతో ఆ బస్సుల ద్వారా కిలోమీటరుకు వచ్చే ఆదాయం (ఈపీకే) రూ.20 నుంచి రూ.23గా నమోదవుతోంది. ఇదే ప్రాంతం నుంచి విజయవాడ వెళ్లే బస్సుల్లో ఈపీకే రూ.31 ఉంటుండగా.. ఆక్యుపెన్సీ రేషియో 32 శాతంగా సగటున నమోదవుతోంది. చదవండి: (రెండో దశలో కరోనా సునామీలా విజృంభించొచ్చు!) బెంగళూరు నుంచి తిరుపతి వెళ్లే గరుడ ప్లస్ బస్సుల ఈపీకే రూ.14 గా ఉంటోంది. అదే ఈ బస్సులను నడిపినందుకు సిబ్బంది జీతాలు సహా అన్ని రకాల ఖర్చులు కలిపితే కి.మీ.కు రూ.50 కంటే ఎక్కువే అవుతోంది. అంటే ఖర్చుతో పోలిస్తే ఆదాయం సగం కూడా ఉండటం లేదు. దీంతో దూరప్రాంతాలకు వెళ్లే ఏసీ బస్సులతో ప్రస్తుతం ఆర్టీసీకి తీవ్ర నష్టాలు నమోదవుతున్నాయి. చెన్నై, మైసూరులకు వెళ్లే బస్సుల్లో పరిస్థితి మరీ దారుణంగా ఉండటంతో ఆ సర్వీసులను ఆర్టీసీ రద్దు చేసుకోవటం గమనార్హం. బాగా పుంజుకున్న నాన్ఏసీ బస్సులు ఇటీవలే అంతరరాష్ట్ర సర్వీసుల ఒప్పందం కుదర టంతో ఆంధ్రప్రదేశ్– తెలంగాణ మధ్య బస్సు సర్వీసులు ప్రారంభమయ్యాయి. ఆంధ్రాకు వెళ్లే బస్సుల్లో నాన్ ఏసీ సర్వీసుల ఆక్యుపెన్సీ రేషియో సగటున 70 శాతాన్ని మించిపోయింది. కొన్ని రూట్లలో అంతకంటే ఎక్కువ రద్దీ కనిపిస్తోంది. ప్రైవేటులో ఏంటి? ప్రైవేటు ఆపరేటర్లు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ప్రైవేట్ ఏసీ బస్సుల్లో కూడా జనం పలుచగా కనిపిస్తున్నారు. ప్రయాణికులు లేక నష్టాలొస్తుండటంతో వాటి నిర్వాహకులు చాలా ఏసీ బస్సులను నాన్ఏసీ స్లీపర్ కోచ్‌లుగా మారుస్తున్నారు. వీటికి డిమాండ్ ఉండటంతో మిగతావారు ఇదే బాట పడుతున్నా రు. కానీ ఆర్టీసీ ఆ సాహసాన్ని చేయలేకపోతోంది. కనీస జాగ్రత్తలు పాటిస్తూ ఎక్కండి: ఆర్టీసీ ప్రయాణికులు ఏసీ బస్సులంటే భయపడాల్సిన అవసరం లేదని ఆర్టీసీ పేర్కొంటోంది. మాస్కు ధరించి బస్సులెక్కొచ్చని ఆర్టీసీ సిబ్బంది ప్రచారం చేస్తున్నారు. ఆన్లైన్లో సీట్లు బుక్ చేసుకున్నవారికి ఫోన్ చేసి ప్రత్యేకంగా ధన్యవాదా లు చెబుతూ ఆకట్టుకునే ప్రయ త్నం కూడా చేస్తున్నారు. కోవిడ్ సూచనలు పాటిస్తూ జాగ్రత్తలు తీసుకుంటే ఏసీ బస్సుల్లో ప్రయాణం వల్ల నష్టముండదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. -
ఏసీ బస్సులు రెడీ
సాక్షి, సిటీబ్యూరో: హైదరాబాద్‌అంతర్జాతీయ విమానాశ్రయానికి బస్సులు నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీ సన్నద్ధమైంది. దేశీయ విమాన సర్వీసులు ప్రారంభమైన దృష్ట్యా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టు వరకు ఏసీ బస్సులను నడిపేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వెంకటేశ్వర్లు తెలిపారు. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందిన వెంటనే బస్సులను రోడ్డెక్కించనున్నట్లు చెప్పారు. నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రతి రోజు సుమారు 53 ఏసీ బస్సులు విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నాయి. వీటిలో 40 ఎలక్ట్రికల్ ఏసీ వోల్వో బస్సులు అద్దె ప్రాతిపదికన నడుస్తున్నాయి. మరో 13 ఏసీ పుష్పక్ బస్సులను ఆర్టీసీ స్వయంగా నడుపుతోంది. లాక్డౌన్ కారణంగా అన్ని రకాల సర్వీసులతో పాటు ఈ బస్సులను కూడా నిలిపివేశారు. 2 నెలల తరువాత ఎయిర్‌పోర్టు కార్యకలాపాలు తిరిగి ప్రారంభం కావడంతో నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించే ప్రయాణికుల కోసం ఈ సర్వీసులన్నింటినీ పునరుద్ధరించనున్నట్లు అధికారులు తెలిపారు. సాధారణ రోజుల్లో సుమారు 7 వేల మందికి పైగా ప్రయాణికులు ఆర్టీసీ సేవలను వినియోగించుకున్నారు. ప్రస్తుతం కేవలం దేశీయ విమానాలే నడుస్తున్నాయి. క్రమంగా సర్వీసుల సంఖ్యను పెంచనున్నట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేష్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన ఎయిర్‌పోర్టును సందర్శించి కోవిడ్ నియంత్రణ ఏర్పాట్లను, విమానాల రాకపోకలు, ప్రయాణికుల సదుపాయాలను పరిశీలించిన అనంతరం సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే పెరుగనున్న విమాన సర్వీసులకు అనుగుణంగా ప్రయాణికుల రాకపోకల కోసం బస్సులను అందుబాటులోకి తేవాలని యోచిస్తున్నట్లు గ్రేటర్ ఈడీ పేర్కొన్నారు. 3 ప్రధాన మార్గాల్లోనే బస్సుల ఏర్పాటు విమానాశ్రయానికి రాకపోకలు సాగించేందుకు 3 ప్రధాన రూట్లలో బస్సులు అందుబాటులోకి రానున్నాయి. సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి సంగీత్ చౌరస్తా, తార్నాక, ఉప్పల్, చాంద్రాయణగుట్ట, బాలాపూర్, పహాడీషరీఫ్ రూట్లో ఎయిర్‌పోర్టుకు బస్సులు రాకపోకలు సాగిస్తాయి. మరికొన్ని బస్సులు జేఎన్టీయూ నుంచి అమీర్‌పేట్, బంజారాహిల్స్, మాసాబ్‌ట్యాంక్, పీవీ ఎక్స్‌ప్రెస్ హైవే రూట్లో ఎయిర్‌పోర్టుకు నడుస్తాయి. బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి, ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కొన్ని బస్సులను నడుపుతున్నారు. ఈ మూడు మార్గాలతో పాటు ఆల్విన్ కాలనీ నుంచి ఔటర్ రింగు రోడ్డు మీదుగా కొన్ని నడుస్తున్నాయి. కానీ ఈ రూట్లో పెద్దగా ఆదరణ లేకపోవడం వల్ల ప్రస్తుతం 3 రూట్లకే ఆర్టీసీ పరిమితం కానుంది. ఈ రూట్లలో చార్జీలు కనిష్టంగా రూ.50 నుంచి రూ.250 వరకు ఉంటుంది. ప్రస్తుతం ఢిల్లీ, జైపూర్ తదితర ఉత్తరాది రాష్ట్రాలకు, కర్ణాటకకు విమాన సర్వీసులు మొదలయ్యాయి. కొన్ని రాష్ట్రాలు అనుమతించకపోవడం వల్ల కొన్ని సర్వీసులు రద్దయ్యాయి. కానీ ఒకటి, రెండు రోజుల్లో విమాన సర్వీసుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇందుకనుగుణంగా నగరం నుంచి ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించేందుకు ఏసీ బస్సులు సదుపాయంగా ఉంటాయి. కోవిడ్ నిబంధనల మేరకు నిర్వహణ... ప్రభుత్వం అనుమతిస్తే కోవిడ్ నిబంధనల మేరకు ఎయిర్‌పోర్టు బస్సులను నడుపనున్నట్లు అధికారులు తెలిపారు. బస్సులను ప్రతి రోజు శానిటైజ్ చేయడంతో పాటు ప్రయాణికుల మధ్య భౌతిక దూరం పాటించేవిధంగా చర్యలు తీసుకోన్నట్లు పేర్కొన్నారు. విమాన ప్రయాణాలకు ప్రభుత్వం విధించిన నిబంధనలనే ఆర్టీసీ బస్సుల్లో అమలు చేయనున్నట్లు ఈడీ చెప్పారు. -
ఏసీ బస్సులతో ఆర్టీసీ ఖుషీ
సుఖంగా.. సౌఖ్యంగా ఉండే ప్రయాణం మజా ఇస్తుంది. ఆధునిక కాలంలో సౌకర్యవంతమైన ప్రయాణం కోసం ఖర్చు కొంత ఎక్కువైనా వెనుకాడే పరిస్థితి కనిపించడంలేదు. అందుకే ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో ప్రయాణికుల అభీష్టం మేరకు ఏసీ బస్సులను నడుపుతూ ప్రయాణికుల అభిమానాన్ని చూరగొంటోంది. ఆదాయపరంగానూ ఆర్టీసీ ఖుషీగా ఉంది. ఈ ఉత్సాహంతో మరిన్ని ఏసీ బస్సులను ప్రయాణికులకు అందుబాటులోకి తెచ్చేందుకు ఆర్టీసీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ)లో ఎయిర్ కండిషన్డ్ (ఏసీ) బస్సులకు డిమాండ్ అధికమవుతోంది. మునుపటికంటే ఏసీ బస్సుల్లో ప్రయాణించే వారి సంఖ్య పెరుగుతుండడంతో ఆర్టీసీ కృష్ణా రీజియన్ ఖుషీ అవుతోంది. ప్రయాణికుల ఆసక్తిని దృష్టిలో ఉంచుకుని ఆర్టీసీ విజయవాడ రీజియన్‌లో దూర ప్రాంతాలకు మరిన్ని ఏసీ బస్సు సర్వీసులను పెంచడానికి సన్నాహాలు చేస్తోంది. కృష్ణా రీజియన్‌లో 90 ఏసీ బస్సులు.. ఆర్టీసీ కృష్ణా రీజియన్‌లో 1429 బస్సులు ఉన్నాయి. వీటిలో 277 అద్దె బస్సులు. రీజియన్ నుంచి రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల్లోని వివిధ పట్టణాలు, నగరాలకు (దూరప్రాంతాలకు) 180 వరకు బస్సులు వెళ్తున్నాయి. వీటిలో 90 ఏసీ బస్సులు ఉన్నాయి. ఇటీవల కొత్తగా ఇంద్ర, నైట్‌రైడర్ వంటి సర్వీసులను ప్రారంభించారు. వీటిని విజయవాడ నుంచి విశాఖపట్నం, ఒంగోలు (ఇంద్ర), మచిలీపట్నం నుంచి హైదరాబాద్‌కు నైట్‌రైడర్–స్లీపర్/సీటర్, విశాఖపట్నం, చీరాల, భీమవరంకు ఇంద్ర బస్సులను నడుపుతున్నారు. ఈ ఏసీ సర్వీసులకు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) బాగుంటోంది. వాస్తవానికి ఆర్టీసీలో ఓఆర్ 65 శాతానికి మించితే దానిని లాభదాయక సర్వీసుగా పరిగణిస్తారు. కానీ సగటున ఈ రీజియన్‌లో ఏసీ సర్వీసుల ఓఆర్ 70 వరకు ఉండడంతో కొత్త ఏసీ సర్వీసుల పెంపుపై ఆర్టీసీ అధికారులు దృష్టి సారిస్తున్నారు. ఇందుకోసం ప్రతిపాదనలు రూపొందిస్తున్నారు. ఈ రీజియన్‌లో అదనంగా మరో 20 ఏసీ బస్సులను ప్రవేశపెట్టాలని యోచిస్తున్నారు. కొత్తగా సింగ్‌నగర్ నుంచి.. త్వరలో విజయవాడ శివారు సింగ్‌నగర్ నుంచి పైపుల రోడ్డు మీదుగా హైదరాబాద్‌కు ఏసీ బస్సు సర్వీసు ప్రారంభిస్తున్నారు. మరోవైపు ఆర్టీసీ విజయవాడ నగరంలో వేకువజాము సర్వీసులనూ కొత్తగా ప్రవేశపెట్టింది. విద్యుత్ బస్సులన్నీ ఏసీవే.. మరోవైపు త్వరలో ఈ రీజియన్‌కు రెండు దశల్లో 280 విద్యుత్ బస్సులు రానున్నాయి. వచ్చే ఈ విద్యుత్ బస్సులు కూడా ఏసీవే. ఇలా కృష్ణా రీజియన్‌లో ఏసీ బస్సు ల సంఖ్య రానున్న రోజుల్లో దాదాపు 390కి చేరువయ్యే అవకాశం ఉంది. వేకువజాము నుంచి.. ఆర్టీసీ కృష్ణా రీజియన్ కొత్తగా విజయవాడ నగరంలో వేకువజాము సర్వీసులను కూడా ప్రారంభించింది. కొన్ని రైళ్లు విజయవాడ స్టేషన్‌కు రాకుండా ఈ పరిధిలోని రాయనపాడులో ఆగుతున్నాయి. దీన్ని దృష్టిలో ఉంచుకుని అక్కడ దిగే ప్రయాణికుల కోసం ప్రతి రోజూ తెల్లవారుజామున 3.30 గంటల నుంచి సిటీ బస్ పోర్టుకు బస్సు సర్వీసులను నడుపుతున్నారు. ఏసీ బస్సులకు డిమాండ్.. కృష్ణా రీజియన్‌లో ఆర్టీసీ ఏసీ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ పెరుగుతోంది. వారి డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకుని ఏసీ బస్సుల పెంపు ఆవశ్యకత ఏర్పడింది. కొత్తగా ప్రవేశపెట్టబోయే ఏసీ సర్వీసులను దూర ప్రాంతాలకు నడుపుతాం. –జి.నాగేంద్రప్రసాద్, రీజనల్ మేనేజర్, కృష్ణా జిల్లా -
ఏసీ బస్సుల నిర్వహణలో ఏమిటీ నిర్లక్ష్యం?
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రెండు రోజుల క్రితం ఆకస్మాత్తుగా స్తంభించాయి. డ్రైవర్లు మెరుపు సమ్మెకు దిగడంతో ఈ పరిస్థితి తలెత్తింది. బయలుదేరే విమానాల సమయానికి అనుగుణంగా ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు ప్రణాళికలు రూపొందించుకున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అప్పటికప్పుడు ప్రత్యామ్నాయం చూసుకోవలసి వచ్చింది. అలాగే విమానాశ్రయం నుంచి నగరానికి చేరుకోవలసిన వాళ్లకు సైతం ఇబ్బందులు తప్పలేదు. అప్పటికప్పుడు ఆర్టీసీ మెట్రో లగ్జరీ బస్సులను ఏర్పాటు చేయాల్సి వచ్చింది. రెండు రోజుల క్రితమే కాదు. గతంలోనూ ఇలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన పర్యావరణ హితమైన 40 ఎలక్ట్రిక్ ఏసీ బస్సులు రోడ్డెక్కి ఆరు నెలలు కూడా గడవకుండానే తరచుగా సమస్యలు తలెత్తుతున్నాయి.బస్సుల నిర్వహణలో వివిధ సంస్థల మధ్య సమన్వయం లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు ఆర్టీసీ కార్మిక సంఘాలు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. గ్రేటర్ ఆర్టీసీ సొంతంగా బస్సులను కొనుగోలు చేయకుండా ప్రైవేట్సంస్థలపైన ఆధారపడి బస్సులను నడపడం వల్ల ప్రయాణికుల ఆదరణను కోల్పోవలసి వస్తుందని వివిధ సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఏసీ బస్సులపై పెద్దగా ఆదాయం రాకపోయినా ప్రైవేట్ సంస్థలకు మాత్రం ఒప్పందం ప్రకారం అద్దెలు చెల్లించాల్సి వస్తోంది. దీంతో ఈ బస్సుల నిర్వహణలో దారుణమైన నష్టాలను భరించాల్సి వస్తుందని ఆర్టీసీ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మూడు సంస్థల మధ్య సమన్వయం ఎలా. ఎలక్ట్రిక్ బస్సులపైన ఆర్టీసీకి ఒలెక్ట్రా సంస్థకు గత సంవత్సరం కుదిరిన ఒప్పందం ప్రకారం 40 బస్సులను ప్రవేశపెట్టారు. ఈ బస్సులు నడిపేందుకు డ్రైవర్లు మాత్రం భగీరథ అనే సంస్థకు చెందిన వారు. సుమారు 95 మంది డ్రైవర్లను భగీరథ సంస్థ ఒలెక్ట్రాకు ఔట్సోర్సింగ్ సిబ్బందిగా అందజేసింది. ప్రయాణికులకు రవాణా సదుపాయాన్ని అందజేసే సంస్థగా ఆర్టీసీ వ్యవహరిస్తుండగా, ఆర్టీసీకి కావలసిన బస్సులను ఒలెక్ట్రా అందజేస్తోంది. కానీ ఆ సంస్థకు సొంతంగా సిబ్బంది లేకపోవడంతో భగీరథ అనే మరో సంస్థ నుంచి డ్రైవర్లను తీసుకుంది. ఇలా మూడు సంస్థలు కలిసి 40 బస్సులను నడుపుతున్నాయి. దీంతో ఈ 3 సంస్థల మధ్య సమన్వయం కుదరడం లేదు. బస్సులు నడిపేందుకు అవసరమైన విద్యుత్ సదుపాయాన్ని, ఒక కిలోమీటర్‌కు రూ.33.12 చొప్పున అద్దెలను సైతం చెల్లిస్తున్న ఆర్టీసీకి వాటి నిర్వహణపైన మాత్రం పట్టు లేకుండాపోయింది. దీంతో సమస్యలు తలెత్తుతున్నాయి. తరచుగా బ్రేక్... ఎలక్ట్రిక్ బస్సులను నడిపే డ్రైవర్లు పూర్తిగా ఒక ప్రైవేట్ సంస్థ అయిన భగీరథకు చెందిన వారు. ఆర్టీసీ డ్రైవర్లతో పోల్చుకుంటే వాళ్లకు సరైన శిక్షణ ఉండకపోవచ్చు. దీంతో ఈ డ్రైవర్లలో కొందరు అదుపు తప్పి ప్రమాదాలకు పాల్పడ్డారు. ఎలాంటి నష్టం వాటిల్ల లేదు కానీ రాష్ డ్రైవింగ్ కారణంగా బస్సులను డివైడర్లపైకి ఎక్కించడం, ఆగి ఉన్న లారీని ఢీకొనడం, ప్రమాదకరమైన రీతిలో ఓవర్టేక్ చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. దీంతో ఒలెక్ట్రా సంస్థ ఐదుగురు డ్రైవర్లను విధుల నుంచి తప్పించింది. ఈ క్రమంలో డ్రైవర్లలో ఆందోళన మొదలైంది. కేవలం రూ.20 వేల జీతంతో రాత్రింబవళ్లు పనిచేస్తున్న తమలో కొందరిని విధుల నుంచి తప్పించడం పట్ల నిరసనకు దిగారు. ఈ సమస్య పరిష్కారానికి ఆర్టీసీ అప్పటికప్పుడు కొన్ని చర్యలు చేపట్టింది. ఒలెక్ట్రా, భగీరథ సంస్థలకు చెందిన ప్రతినిధులతో సంప్రదింపులు జరిపింది. తాత్కాలికంగా డ్రైవర్లు తమ ఆందోళన విరమించినప్పటికీ జీతభత్యాల పైన మాత్రం తీవ్ర అసంతృప్తిగానే ఉన్నారు. మరోవైపు ఆర్టీసీ డ్రైవర్లస్థాయి నైపుణ్యం, అనుభవం ఈ డ్రైవర్లకు లేకపోవడంతో తరచుగా ప్రమాదాలకు పాల్పడుతున్నారు. శిక్షణ లేకపోతే ఎలా... శంషాబాద్ విమానాశ్రయం నుంచి ప్రతి రోజు వేలాది మంది దేశవిదేశాలకు రాకపోకలు సాగిస్తారు. అలాంటి ప్రయాణికులకు ఎంతో మెరుగైన,నాణ్యమైన రవాణా సదుపాయాన్ని అందజేయవలసిన బాధ్యత ఆర్టీసీపైన ఉంది. కానీ బస్సులు నడిపే కీలకమైన విధి నిర్వహణను ఒక ప్రైవేట్ సంస్థ చేతుల్లో పెట్టి ప్రేక్షకపాత్ర వహించడం వల్ల ఆర్టీసీ ప్రతిష్టకు మరింత నష్టం వాటిల్లే అవకాశం ఉంది. -
చల్లని బండి.. ఉక్కపోతండి!
సాక్షి, సిటీబ్యూరో: సిటీ బస్సుల్లో ఏసీలు పని చేయడం లేదు. దీంతో బయటి ఉష్ణోగ్రతలకు ఏమాత్రం తీసిపోని విధంగా బస్సుల్లో వేడి ఉంటోంది. సకాలంలో మరమ్మతులు చేయకపోవడం, నిర్వహణ లోపం కారణంగా ఏసీ యంత్రాలు అలంకారప్రాయంగా మారాయి. దీంతో ప్రయాణికులు ఉక్కపోతతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఏసీ బస్సులు ఆర్డినరీ కంటే అధ్వానంగా ఉన్నాయని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని అన్ని మార్గాల్లోనూ ఏసీ బస్సుల పరిస్థితి ఇలాగే ఉంది. గతంలో ప్రవేశపెట్టిన టాటా కంపెనీకి చెందిన సుమారు 60 మార్కోపోలో టైప్ ఏసీ బస్సులను మొదటహైటెక్ సిటీతో పాటు వివిధ ప్రాంతాల్లో ‘సిటీ శీతల్’గా నడిపారు. ఆ తర్వాత శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ‘పుష్పక్’ బస్సులుగా నడిపారు. వీటి స్థానంలో మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు ప్రవేశపెట్టి.. ఆ తర్వాత ఆ బస్సులనే వివిధ ప్రాంతాల నుంచి ‘పుష్పక్’లుగా ఎయిర్‌పోర్టుకు నడిపారు. ఉప్పల్ నుంచి మెహిదీపట్నం వరకు నడిచే 300 రూట్లో ఈ సిటీ శీతల్ బస్సులు నడుస్తున్నాయి. కానీ ఏ ఒక్క బస్సులోనూ ఏసీ సరిగ్గా పని చేయడం లేదు. ‘బయటి గాలి లోపలికి వచ్చేందుకు అవకాశం లేకుండా అన్ని వైపులా గ్లాస్విండోస్ ఉంటాయి. అలాగని ఏసీ ఉండదు. దీంతో ఈ రూట్లో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామ’ని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ‘ఏసీ చార్జీలు చెల్లించి ఆర్డినరీ బస్సుల్లో పయనించినట్లుగా ఉంటోంద’ని బండ్లగూడ ప్రాంతానికి చెందిన ప్రయాణికుడు ఒకరు పేర్కొన్నారు. మరోవైపు సామర్థ్యం (ఫిట్నెస్) దృష్ట్యా బస్సులు బాగానే ఉన్నప్పటికీ సకాలంలో మరమ్మతులు చేయకపోవడంతో, ప్రత్యేకించి ఏసీలు రిపేర్ చేసే టెక్నీషియన్లు లేకపోవడంతో ఏసీలు పని చేయడం లేదని’ మెహిదీపట్నం డిపోకు చెందిన డ్రైవర్ ఒకరు చెప్పారు. ఒక్క 300 రూట్ బస్సులే కాకుండా ఒకప్పటి సిటీ శీతల్ బస్సులన్నీ ఇప్పుడు చాలా వరకు డొక్కు బస్సుల జాబితాలో చేరిపోయాయి. నిర్వహణ లోపం వల్లనే ఈ పరిస్థితి తలెత్తిందని ఆర్టీసీ అధికారి ఒకరు పేర్కొన్నారు. ‘మెట్రో లగ్జరీ’లోనూ... ఇక 2014లో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సుల్లోనూ ఏసీ అరకొరగానే ఉంటోందని ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. ‘బస్సులో వాతావరణం చల్లగా ఉండాలంటే కనీసం 25 డిగ్రీల లోపు టెంపరేచర్ ఉండాలి. కానీ 35 డిగ్రీలపైనే ఉంటోంది. ఏసీలు పని చేస్తున్నాయో లేదో తెలియదు. ఏసీల నుంచి చాలా తక్కువగా గాలి వస్తోంది. ఉక్కపోత తప్పడం లేదు’ అని ఎల్బీనగర్ నుంచి బీహెచ్ఈఎల్ మధ్య నడిచే 222 రూట్ బస్సు ప్రయాణికుడు సిద్ధేశ్వర్ తెలిపారు. ‘బీహెచ్ఈఎల్ నుంచి ఎల్బీనగర్ వరకు రూ.100 చార్జీ ఉంటుంది. కానీ ఏసీ మాత్రం ఉండదు’ అని విస్మయం వ్యక్తం చేశారు. మధ్యాహ్న సమయంలో ఏసీ బస్సుల్లో ప్రయాణించడం దుస్సాహసమేనని పేర్కొన్నారు. ఐదేళ్ల క్రితం 80 మెట్రో లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టారు. వివిధ ప్రాంతాల నుంచి హైటెక్ సిటీకి, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి వీటిని నడిపారు. ఇటీవల విమానాశ్రయానికి ఎలక్ట్రిక్ ఓల్వో బస్సులు వచ్చిన తరువాత ఇతర రూట్లలోకి వీటిని మళ్లించారు. కానీ బస్సుల నిర్వహణ మాత్రం కొరవడినట్లు ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఒకవైపు మెట్రో రైల్ రాకతో నిరాదరణకు గురవుతున్న ఏసీ బస్సులు నిర్వహణ లోపం కారణంగా మరింత ఘోరంగా తయారవుతున్నాయి. మెట్రో రైల్ దృష్ట్యా ఇప్పటికే పలు రూట్లలో ఏసీ బస్సులను ఉపసంహరించుకున్నారు. ప్రయాణికుల నిరాదరణ వల్ల మరిన్ని నష్టాలను చవిచూడాల్సి వస్తోంది. -
ఏసీకి ఏరీ?
సాక్షి, సిటీబ్యూరో: నిప్పులు కురిసే ఎండల్లోనూ చల్లటి ప్రయాణం. ఎలాంటి కుదుపులు లేకుండా సాగిపోయే సాఫీ జర్నీ. నాలుగు ప్రధాన మార్గాల్లో శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకునే సదుపాయం. పైగా 24 గంటలూ అందుబాటులో ఉండే బస్సులు. అయినా ప్రయాణికుల ఆదరణకు నోచుకోవడం లేదు. గతంలో ఎయిర్‌పోర్టుకు రాకపోకలు సాగించిన గ్రేటర్ ఆర్టీసీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల స్థానంలో రెండు నెలల క్రితం అత్యాధునికసాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. అద్దె ప్రాతిపదికన ఆర్టీసీ నడుపుతున్న ఈ బస్సులకు ప్రయాణికుల నుంచి ఆదరణ లభించడం లేదు. వీటిపై వచ్చే ఆదాయంవాటి అద్దె చెల్లింపులకు కూడా సరిపోవడం లేదని ఆర్టీసీ అధికారులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. గతంలో నడిచిన మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల కంటే కూడాఎలక్ట్రిక్ ఏసీ బస్సుల్లో తక్కువ మంది ప్రయాణం చేస్తున్నారు. పర్యావరణహిత రవాణాసదుపాయాన్ని ప్రయాణికులకు అందుబాటులోకితీసుకొచ్చే లక్ష్యంతో 40 ఎలక్ట్రిక్ బ్యాటరీబస్సులను గ్రేటర్ ఆర్టీసీ ఎయిర్‌పోర్టు మార్గంలో నడుపుతోంది. దశలవారీగా నగరంలోని మిగతా మార్గాల్లోనూ వీటిని నడపాలని ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కానీ ఎయిర్‌పోర్టు రూట్ బస్సుల్లో పెద్దగా ఆదాయం లభించకపోవడం, అది బస్సుల అద్దెలకు కూడా సరిపోకపోవడంతో ఆర్టీసీ అధికారులు వేచిచూసే ధోరణిని అనుసరిస్తున్నారు. ప్రయాణికుల ఆదరణను చూరగొనేందుకు ఎలాంటి విధానాలను అనుసరించాలనే అంశంపై దృష్టి సారించారు. గతంలో కంటే ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ ఎలక్ట్రిక్ ఏసీ బస్సులను వినియోగించుకునే ప్రయాణికుల సంఖ్య మాత్రం పెరగడం లేదు. ప్రయాణికులు పెరిగితే తప్ప ఆ బస్సులకు మనుగడ ఉండబోదు. ట్రిప్పులు పెరిగినా... బీహెచ్ఈఎల్ నుంచి గచ్చిబౌలి, ఔటర్ రింగ్‌రోడ్డు మీదుగా కొన్ని బస్సులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తుండగా, జేఎన్టీయూ నుంచి మెహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే నుంచి మరికొన్ని బస్సులు తిరుగుతున్నాయి. అలాగే సికింద్రాబాద్ జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి తార్నాక, ఉప్పల్ మీదుగా కొన్ని బస్సులు, సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, మెహిదీపట్నం, పీవీ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో మరికొన్ని బస్సులు ఎయిర్‌పోర్టుకు అందుబాటులో ఉన్నాయి. సికింద్రాబాద్, జేఎన్టీయూ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రూ.255 చొప్పున చార్జీ ఉంది. బీహెచ్ఈఎల్ నుంచి మాత్రం రూ.280 ఉంది. జేఎన్టీయూ, బీహెచ్ఈల్ రూట్లలో గతంలో 40 ట్రిప్పులు తిరిగితే ఇప్పుడు 55కు పెంచారు. సికింద్రాబాద్ రూట్లోనూ ట్రిప్పుల సంఖ్య గణనీయంగా పెరిగింది. కానీ ప్రయాణికులు మాత్రం తగ్గారు. గతంలో 60శాతం ఆక్యుపెన్సీతో తిరిగిన బస్సులు ఇప్పుడు 45 శాతానికి పడిపోయినట్లు ఆర్టీసీ అధికారి ఒకరు తెలిపారు. మరోవైపు ఒక కిలోమీటర్‌పై వచ్చే ఆదాయం కూడా గతంలో రూ.50 ఉంటే, ఇప్పుడు రూ.37కు పడిపోయింది. ఇందులో ఒక కిలోమీటర్‌కు రూ.33 చొప్పున అద్దె చెల్లిస్తున్నారు. ఇక విద్యుత్ చార్జీలు, సిబ్బంది జీతభత్యాలు, ఇతరత్రా ఆర్టీసీకి అదనపు భారమే. మెట్రో గండం... మరోవైపు ఎల్బీనగర్ నుంచి మియాపూర్ వరకు మరో 18 ఏసీ బస్సులు నడుపుతున్నారు. ఈసీఐఎల్ నుంచి హైటెక్ సిటీకి కొన్ని బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. మెట్రో రాకతో ఈ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సగానికి పైగా పడిపోయింది. లింగంపల్లి, ఆల్విన్‌కాలనీ, కొండాపూర్, శిల్పారామం, జూబ్లీహిల్స్, పంజగుట్ట, లక్డీకాపూల్, కోఠి, ఎల్బీనగర్ మార్గంలో రాకపోకలు సాగించే ఏసీ బస్సులు నిరాదరణకు గురవుతున్నాయి. ఒకప్పుడు సుమారు 65శాతం ఆక్యుపెన్సీతో నడిచిన ఈ బస్సుల్లో ఇప్పుడు పట్టుమని 30 మంది కూడా ప్రయాణం చేయడం లేదు. చాలా వరకు మెట్రో రైళ్లలోనే పయనిస్తున్నారు. అలాగే ఈసీఐఎల్ నుంచి సికింద్రాబాద్ మీదుగా హైటెక్ సిటీకి వెళ్లే బస్సుల్లోనూ ప్రయాణికుల సంఖ్య తగ్గిపోయింది. మెట్రో మార్గాలకు సమాంతరంగా నడిచే ఏసీ బస్సులను ఇతర మార్గాలకు మళ్లించే అంశంపై ఆర్టీసీ అధ్యయనం చేపట్టింది. మెట్రో అందుబాటులో లేని నగర శివారు రూట్లపైన అధికారులు దృష్టి సారించారు. -
తూచ్..ఏసీ!
సాక్షి, సిటీబ్యూరో: విశ్వనగరానికి వన్నె చిన్నెలు అద్దేలా...అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా..ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన అత్యాధునిక ఏసీ బస్సు షెల్టర్లు మేడిపండు చందంలా మారాయి. అందుబాటులోకి తెచ్చి ఎనిమిది నెలలు దాటినా వాటిల్లో కనీస సదుపాయాల్లేవు. ఒకవైపు వేసవి తరుముకొస్తోంది. ఇప్పటి వరకు ప్రయాణికులకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. ఆధునిక బస్సు స్టేషన్లను ప్రారంభించినప్పటి హామీలు అన్నీ అనతికాలంలోనే హుష్‌కాకిలా ఎగిరిపోయాయి. ఇప్పుడు అవి అలంకారప్రాయంగా మాత్రమే మిగిలాయి. నగరంలోని కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్‌లలోని ఆధునిక బస్షెల్టర్ల దుస్థితి ఇది. మరోవైపు ప్రయాణికులకు కనీస సదుపాయాలతో కూడిన మరిన్ని షెల్టర్లను కట్టించనున్నట్లు అప్పట్లో ప్రభుత్వం చెప్పింది. కానీ ఈ మూడు షెల్టర్లు మినహా కొత్తగా ఒక్కటీ కార్యరూపం దాల్చలేదు. బస్సులు ఆగే చోట షెల్టర్లు లేవు. షెల్టర్లు ఉన్న చోట బస్సులు ఆగవు. కొన్ని చోట్ల ట్రాఫిక్ నిబంధనలకు విరుద్ధంగా కేవలం వాణిజ్య ప్రకటనలో కోసమే ఏర్పాటు చేసినట్లుగా ఉన్నాయి. ప్రయాణికులకు పూర్తి భద్రత. 24 గంటల పాటు ఏసీ సదుపాయం. తాగునీటి వసతి. ఆధునిక టాయిలెట్లు. ఏటీఎం, బస్సుపాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపైన ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో బస్షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నారు. ఇప్పుడు అరకొర సదుపాయాలు తప్ప ఎక్కడా పూర్తిస్థాయిలో ప్రయాణికులకు ఈ బస్షెల్టర్లు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. ఎల్ఈడీ బోర్డులేవీ..... దేశంలోనే ఎక్కడా లేని విధంగా కట్టించిన శిల్పారామం, కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, ఖైరతాబాద్ బస్షెల్టర్లలో కనీసం బస్సుల రాకపోకలను తెలిపే ఎల్ఈడీ బోర్డులు లేవు. బీహెచ్ఈఎల్, పటాన్చెరు, కూకట్పల్లి రూట్లో ప్రతిరోజు వేలాది బస్సులు ఖైరతాబాద్ మీదుగా కోఠి, దిల్సుఖ్నగర్, ఉప్పల్, ఎల్బీనగర్ తదితర ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తాయి. అలాగే ఉప్పల్, కోఠీ, ఎల్బీనగర్, హయత్‌నగర్, తదితర ప్రాంతాల నుంచి కొండాపూర్ వెళ్లే బస్సులన్నీ శిల్పారామం మీదుగానే రాకపోకలు సాగిస్తాయి. ప్రయాణికుల రద్దీ, బస్సుల డిమాండ్ అధికంగా ఉండే ఈ రెండు మార్గాల్లో ఏర్పాటు చేసిన మూడు బస్షెల్టర్లలో ఎక్కడా బస్సుల రాకపోకలపైన ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. బస్సుల టైం టేబుల్ లేదు. అనౌన్స్మెంట్ వ్యవస్థ అమలుకు నోచుకోలేదు. ప్రయాణికులు గంటల తరబడి పడిగాపులు కాస్తారు. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలియదు. వచ్చినప్పుడు వెళ్లాల్సిందే. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారం డిస్ప్లే ఏర్పాటు పై అటు గ్రేటర్ ఆర్టీసీ, ఇటు జీహెచ్ఎంసీ సంస్థలు తమకు ఏ మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ‘‘ ఈ మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలన్నింటినీ జీహెచ్ఎంసీకి అందజేశాం. వాటిని ఏర్పాటు చేయవలసిన బాధ్యత ఆ సంస్థపైనే ఉంది.’’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’తో అభిప్రాయపడ్డారు. జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసిన షెల్టర్ల నుంచి ప్రయాణికులను తీసుకెళ్లడమే తమ విధి అని పేర్కొన్నారు. తాగునీళ్లు కరువే.... చక్కటి డిజైనింగ్, గ్లాస్ డోర్లు, చూడగానే ఇట్టే ఆకట్టుకొనే ఈ బస్షెల్టర్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదు. వీటిని అందుబాటులోకితెచ్చినప్పుడు సురక్షితమైన తాగునీళ్లు మాత్రమే కాదు. క్యాంటీన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీ,కాఫీ,స్నాక్స్ వంటివి ప్రయాణికులకు లభిస్తాయన్నారు. 8 నెలలు గడిచినా ఎక్కడా అలాంటి ఏర్పాట్లు లేవు. ఇప్పటి వరకు ఆర్టీసీ బస్‌పాస్ కౌంటర్లను ఏర్పాటు చేయలేదు. ఒక్కోషెల్టర్లో 3 నుంచి 4 గదులు ఏర్పాటు చేశారు. కానీ ఒక్క చోట కూడా మంచినీటి సదుపాయం లేదు. కొన్ని చోట్ల టాయిలెట్లు ఉన్నాయి.కానీ వాటికి నీటి సరఫరా లేదు. కొన్ని చోట్ల టాయిలెట్లు లేవు. సీసీటీవీలను ఏర్పాటు చేశారు. కానీ వాటి పనితీరు నామమాత్రమే. సీసీ కెమెరాల పర్యవేక్షణ, నిఘా అంతంతమాత్రంగానే ఉంది. ఏసీ అరకొర... 24 గంటల పాటు ఈ షెల్టర్లలో ఏసీ సదుపాయం ఉంటుందన్నారు. కానీ ఇప్పుడు షెల్టర్లలో ఏసీ లేకపోవడంతో ప్రయాణికులు ఉక్కపోతను భరించలేక బయటకొస్తున్నారు. షెల్టర్ల బయటే పడిగాపులు కాస్తున్నారు. కొన్ని షెల్టర్లలో ఏసీ ఉన్నప్పటికీ అది ఎంతసేపు ఉంటుందో, ఎప్పుడు ఆగిపోతుందో తెలియదని, ఉన్నా లేనట్లేనని ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 బస్షెల్టర్లను పీపీపీ పద్ధతిలో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ చేపట్టింది.ఈ మూడింటితో పాటు,దిల్సుఖ్నగర్, కోఠీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల వద్ద బస్షెల్టర్లను నిర్మించనున్నట్లు ప్రకటించారు.మొదటి కేటగిరీకి చెందిన వాటిని ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేస్తుండగా, మిగతా 2 కేటగిరీలకు చెందిన షెల్టర్లను నాన్ ఏసీ షెల్టర్లుగా నిర్మించాలని ప్రతిపాదించారు. -
ఏసీ బస్సుల్లో దోమల రాజ్యం
సాక్షి, సిటీబ్యూరో : సిటీ ఏసీ బస్సుల్లో ప్రయాణం చేస్తున్నారా...దోమలు ఉండవచ్చు తస్మాత్ జాగ్రత్త. సాధారణ దోమల సంగతి సరే సరి. పగటిపూట డెంగీ వంటి ప్రమాదకరమైన దోమలు కుట్టే అవకాశం లేకపోలేదు. రెండు రోజుల క్రితం ఎల్బీనగర్ నుంచి లింగంపల్లికి వెళ్లే (222 ఎల్) ఏసీ బస్సులో కొందరు ప్రయాణికులు ఇదే భయాందోళన వ్యక్తం చేశారు. ప్రతి రోజూ దోమల మధ్య ప్రయాణం చేయాల్సి వస్తుందంటూ సిబ్బందితో ఘర్షణకు దిగారు. పై అధికారులకు ఫిర్యాదు చేసేందుకు బస్సులో ఎలాంటి ఫిర్యాదు బాక్సు లేకపోవడం పట్ల ప్రయాణికులు విస్మయం వ్యక్తం చేశారు. ఒక్క ఎల్బీనగర్–లింగంపల్లి రూట్లోనే కాదు. ఏసీ బస్సులు రాకపోకలు సాగించే అన్ని రూట్లలో దోమల బెడద తీవ్రమైందంటూ ప్రయాణికుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. బస్సుల నిర్వహణ సరిగ్గా లేకపోవడం వల్ల, రోడ్లపైన ఉండే కాలుష్యకారకాల వల్ల బస్సుల్లోకి దోమలు చేరుకుంటున్నాయి. ప్రతి రోజు బస్సులను శుభ్రం చేయకపోవడం కూడా మరో కారణం. దీంతో ప్రయాణికులను దోమలు బెంబేలెత్తిస్తున్నాయి. ఒకవైపు మెట్రో రాకతో ఏసీ బస్సులకు ఆదరణ తగ్గుముఖం పట్టగా దోమల స్వైరవిహారం అందుకు మరింత ఆజ్యం పోస్తోంది. మెట్రో రైలు కంటే కూడా ఎక్కువ చార్జీలు చెల్లించి ఏసీ బస్సుల్లో ప్రయాణం చేసినప్పటికీ సరైన సదుపాయాలు ఉండడం లేదని ప్రయాణికులు ఫిర్యాదు చేస్తున్నారు. ముఖ్యంగా బస్సుల నిర్వహణ పైన ఆందోళన వ్యక్తమవుతోంది. మరోవైపు చాలా బస్సుల్లో ఏసీ సరఫరా కూడా సరిగ్గా ఉండడం లేదు. శుభ్రం చేయడం లేదు నగరంలోని మూడు ప్రధాన రూట్లలో 120 ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఉప్పల్ నుంచి మెహదీపట్నం, కొండాపూర్, హైటెక్‌సిటీ వైపు కొన్ని బస్సులు, ఎల్బీనగర్, దిల్సుఖ్నగర్ నుంచి లింగంపల్లి, హైటెక్‌సిటీ, బీహెచ్ఈఎల్, తదితర ప్రాంతాలకు మరి కొన్ని బస్సులు రాకపోకలు సాగిస్తుండగా సికింద్రాబాద్, బేగంపేట్, జేఎన్టీయూ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి మరి కొన్ని బస్సులు అందుబాటులో ఉన్నాయి. ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులు మినహా మిగతా బస్సుల నిర్వహణ అస్తవ్యవస్థంగా ఉంది. ఎప్పటికప్పుడు బస్సులను శుభ్రం చేయకపోవడం వల్ల చెత్త,చెదారం పేరుకుంటోంది. సీట్ల అడుగున ఏ మాత్రం శుభ్రం చేయడం లేదని, దీంతో దోమలు తిష్ట వేస్తున్నాయని ప్రయాణికులు వాపోతున్నారు. ఎయిర్ వ్యాక్యూమ్ క్లీనర్‌తో బస్సులోని అన్ని మూలల్లోనూ ప్రతి రోజు శుభ్రం చేయాల్సి ఉండగా ఆ పని సక్రమంగా జరగడం లేదు. మరోవైపు నెలకోసారి కెమికల్ వాషింగ్ చేస్తారు. కానీ కొన్ని డిపోల్లో 2 నెలలు దాటినా కెమికల్ క్లీనింగ్ చేయకపోవడం గమనార్హం. ఆర్టీసీలో బస్సుల శుభ్రతను ఔట్‌సోర్సింగ్‌కు అప్పగించారు. ఈ పనులను నిర్వహించే కాంట్రాక్టర్లు తక్కువ సిబ్బందితో బస్సులను నిర్వహిస్తున్నారు. దీనివల్ల నాణ్యత దెబ్బతింటుందనే విమర్శలు ఉన్నాయి. డెంగీ రావచ్చు... ‘‘ ఏసీ బస్సుల్లో విండోస్ మూసి ఉంటాయి. కానీ ఎప్పుడు ఎలా వస్తాయో తెలియదు. కానీ దోమలు అదే పనిగా కాళ్లకు కుట్టేస్తాయి. పగటి పూట డెంగ్యూ దోమలు తిరుగుతాయి కదా.అందుకే భయంగా ఉంది.’’ అంటూ ఎల్బీనగర్ నుంచి బంజారాహిల్స్‌కు బయలుదేరిన ఒక ప్రయాణికురాలు ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఎన్ని డబ్బులైనా ఫరవాలేదులే ప్రశాంతంగా వెళ్లొచ్చుననుకుంటే ఈ దోమల బెడద ఇబ్బందిగా ఉంది’. అంటూ వెంకటేశ్ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. ‘‘ ఎల్బీనగర్ నుంచి జీవీకే వరకు రూ.60 చార్జీ తీసుకుంటారు. కానీ ఏసీ సరిగ్గా రాదు. ఎక్కడ చూసినా చెత్త, దోమలు కనిపిస్తాయి. కండక్టర్,డ్రైవర్లు తమకు సంబంధం లేదంటారు. ఇలాగైతే ఎలా...’’ లక్ష్మణ్ అనే ప్రయాణికుడి ప్రశ్న ఇది. ఇలా ఉండగా, బస్సులను ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నామని, డిపో నుంచి బయటకు వచ్చిన తరువాత రోడ్లపైన ఉండే దోమలు బస్సుల్లోకి రావచ్చునని ఆర్టీసీ ఉన్నతాధికారి శ్రీధర్ ‘సాక్షి’తో చెప్పారు. త్వరలోనే అన్ని బస్సుల్లో ఆల్ అవుట్ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఫిర్యాదుల బాక్సు లేదు దోమల బెడదపైన ఆర్టీసీ అధికారులకు ఫిర్యాదు చేయాలనుకున్నాను. కానీ బస్సులో బాక్సు లేదు. కండక్టర్ ఒక అధికారి ఫోన్ నెంబర్ ఇచ్చాడు. ప్రతి రోజు ఫోన్ చేస్తున్నాను. కానీ అతడు ఫోన్ ఎత్తడం లేదు. అధికారుల నుంచి ఎలాంటి స్పందన లేదు. – జానయ్య, ఎల్బీనగర్ చాలా నిర్లక్ష్యం ఇది కచ్చితంగా అధికారుల నిర్లక్ష్యమే. పేరుకే ఏసీ బస్సులు. కానీ ఏ మాత్రం శుభ్రంగా ఉండడం లేదు. ఆ బస్సుల్లో వెళ్లడం కంటే ఆర్డినరీ బస్సులు నయమనిపిస్తుంది. – వెంకన్న గౌడ్. దిల్సుఖ్నగర్ -
ఆ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలు తగ్గాయ్!
న్యూఢిల్లీ : దేశీయ రైల్వే ప్రయాణికులకు మరో గుడ్‌న్యూస్. సామాన్యులు కూడా ఏసీ బోగీల్లో ప్రయాణించేలా... ఈ బోగీల టిక్కెట్ ధరలను భారతీయ రైల్వే తగ్గించింది. సౌత్ వెస్ట్ జోన్‌లోని ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్ల సర్వీస్‌ల్లోని ఏసీ బోగీలకు టికెట్ ధరను తగ్గిస్తున్నట్లు భారతీయ రైల్వే ప్రకటించింది. కర్ణాటకలోని బెంగళూరు, గదగ్, మైసూర్ ప్రాంతాల నుంచి ఈ ఐదు రైళ్ల సర్వీసులను నిర్వహిస్తున్నారు. తగ్గిన ఏసీ బోగీల ధరలు ఏ విధంగా ఉన్నాయో ఓ సారి చూడండి... గదగ్- ముంబయి ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగి ప్రయాణ ఛార్జీ ప్రస్తుతం రూ.495గా ఉంది. దాన్ని రూ.435కి తగ్గించారు. ఈ తగ్గింపు ధర నవంబరు 11 నుంచి అమల్లోకి వస్తుంది. మైసూర్-షిరిడి వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు ఏసీ బోగీ టికెట్ ధరను సౌత్ వెస్ట్రన్ రైల్వే 495 రూపాయల నుంచి 260 రూపాయలకి తగ్గించింది. ఈ తగ్గింపు ధర డిసెంబరు 3 నుంచి అమల్లోకి రానుంది. మైసూర్, బెంగళూరు మధ్యలో ఇది నడవనుంది. యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ రైలులో మూడు ఏసీ బోగీలు ఉన్నాయి. వాటి టిక్కెట్ ధరను 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించారు. నవంబరు 30 నుంచి ఈ ధరలు వర్తించనున్నాయి. యశ్వంత్‌పూర్- సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ రైలు టికెట్ ధర రూ.345 ఉండగా.. దాన్ని రూ.305కి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే. నవంబరు 22 నుంచి ఈ తగ్గింపు ధరలు అమల్లోకి వస్తాయి. యశ్వంత్‌పూర్-హుబ్లి వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్ టికెట్ ధరను కూడా 735 రూపాయల నుంచి 590 రూపాయలకి తగ్గించింది సౌత్ వెస్ట్రన్ రైల్వే. -
భారీగా తగ్గిన ఏసీ కోచ్ టికెట్ల ధరలు
సాక్షి, బెంగళూర్ : ప్రయాణీకులకు రైల్వేలు తీపికబురు అందించాయి. ఏసీ ట్రైన్లలో ఎక్కువ మంది ప్రయాణీకులను ఆకర్షించేలా ఐదు రైళ్లలో ఏసీ కోచ్ టికెట్ ధరలను రైల్వేలు ఇటీవల తగ్గించాయి. కర్నాటకలో బెంగళూర్, గడగ్, మైసూర్ నుంచి ఐదు ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్‌ల ధరలను నైరుతి రైల్వే ప్రకటించింది. బెంగళూర్ మీదుగా మైసూర్, చెన్నై శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ చైర్ కార్ ధర తగ్గించడంతో బస్సు, విమానాల కన్నా అధికంగా ప్రయాణీకులు ఈ ఎక్స్‌ప్రెస్ ద్వారా ప్రయాణిస్తున్నారని నైరుతి రైల్వే ప్రతినిధి వెల్లడించారు. శతాబ్ధి ఎక్స్‌ప్రెస్‌లో చార్జీల తగ్గింపుకు లభించిన స్పందనతో బెంగళూర్ నుంచి యశ్వంత్‌పూర్-హూబ్లీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ ఏసీ చైర్‌కార్ ధరలను రూ 735 నుంచి రూ 590కు తగ్గించామని తెలిపారు. గత వారం ఈ ఎక్స్‌ప్రెస్ ఏసీ చార్జీలను తొలిసారిగా తగ్గించడంతో స్పందన ప్రోత్సాహకరంగా ఉందని తెలిపారు. ఇక మైసూర్-షిర్డీ ఎక్స్‌ప్రెస్ వీక్లీ ఎక్స్‌ప్రెస్ చార్జీలను సైతం డిసెంబర్ 3 నుంచి రూ 495 నుంచి రూ 260కి తగ్గిస్తామని వెల్లడించారు. బెంగళూర్, హుబ్లీ మధ్య నడిచే యశ్వంత్‌పూర్-బికనీర్ ఎక్స్‌ప్రెస్ ఏసీ చార్జీలను నవంబర్ 30 నుంచి రూ 735 నుంచి రూ 590కి తగ్గిస్తామన్నారు. ఇక యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఏసీ ఫేర్‌ను నవంబర్ 22 నుంచి రూ 345 నుంచి రూ 305కు తగ్గించనున్నట్టు చెప్పారు. ప్రయాణీకులకు సుఖవంతమైన ప్రయాణం అందించేందుకు ఏసీ కోచ్‌లలో వులెన్ దుప్పట్ల స్ధానంలో మెరుగైన నాణ్యతతో కూడిన నైలాన్ బ్లాంకెట్స్ అందుబాటులోకి తేనున్నారు. -
ప్రయాణికులకు చుక్కలు చూపిన ఏసీ ట్రైన్
ముంబై : ముంబైలో ఓ లోకల్ ఏసీ సర్వీస్ రైలు శుక్రవారం ప్రయాణికులకు చుక్కలు చూపించింది. ట్రైన్‌లోని కొన్ని కోచ్‌లలో ఏసీలు పనిచేయకపోవడంతో ప్రయాణికులు ఊపిరాడక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ఉదయం బోరివాలి స్టేషన్ దాటక ట్రైన్లో ఒక్కసారిగా కొన్ని కోచ్‌లలో ఏసీలు ఆగిపోవడంతో.. ఉష్ణోగ్రత క్రమంగా 36 డిగ్రీలకు చేరుకుంది. ట్రైన్ డోర్లు మూసి ఉండేవి కావడంతో ఊపిరాడక, ఉక్కపోతతో ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఆగ్రహా, ఆవేశాలకు లోనైనా కొందరు ప్రయాణికులు చైన్ లాగి ట్రైన్‌ని అంధేరిలో నిలిపివేశారు. ట్రైన్‌ను పరిశీలించిన అధికారులు.. ఏసీ ఫెయిల్ కావడానికి కారణాలు తెలియకపోవడంతో దానిని షెడ్‌కు తరలించారు. ఈ సమస్యను ప్రయాణికులు ట్విటర్లో రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. రైల్వే శాఖ ఈ ఘటనపై క్షమాపణ తెలిపింది.3 కోచ్‌లలో ఈ సమస్య తలెత్తినట్టుగా పేర్కొంది. పశ్చిమ రైల్వే ముంబైలో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించడానికి గతేడాది డిసెంబర్లో 12 ఏసీ సర్వీస్‌లకు శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే. -
అయ్యయ్యో.. ఏసీ బోగీలు కనబడడం లేదు..!
రైళ్లలో ట్యూబ్‌లైట్లు, ఫ్యాన్లు, నల్లాలు, కొన్ని సందర్భాల్లో వాష్ బేసిన్లు సైతం చోరీకి గురికావడం, ఏసీ రైళ్లలోనైతే చేతి తువాళ్లు, బ్లాంకెట్లు వంటివి మాయమవుతున్న ఘటనలు ఇతర దేశాల్లోనైతే ఆశ్చర్యంగా చూస్తారు కాని... ఇక్కడైతే ఇదంతా మామూలే అన్నట్టుగా మనవాళ్లు పెద్దగా పట్టించుకోరు. రైళ్లలో ప్రవేశపెట్టిన ‘బయో టాయ్లెట్ల’లోని స్టెయిన్లెస్స్టీల్ డస్ట్బిన్లు కూడా దొంగతనానికి గురవుతున్న జాబితాలో చేరిపోయాయి. అయితే తాజాగా ఏకంగా రైలు బోగీలే అవీ కూడా ఏసీ కోచ్‌లు కొన్ని కనిపించకుండా పోయాయనే వార్తలు నోళ్లు వెళ్లబెట్టేలా చేస్తున్నాయి. వీటి ప్రకారం రాంచీ–న్యూఢిల్లీల మధ్య నడిచే రాజధాని, సంపర్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ రైళ్లకు సంబంధించిన కొన్ని కొత్త బోగీలు రాంచీ రైల్వే డివిజన్ యార్డు నుంచి మాయమై పోయాయి. ఈవిధంగా కొన్ని బోగీలకు బోగీలే కనబడకుండా పోవడం పెద్ద కలకలాన్నే సృష్టించింది. రాజధాని, సంపర్క్ క్రాంతి రైళ్లలో జతచేయాల్సిన ఈ బోగీలు మిస్ కావడంతో వాటి స్థానంలో పాత రైలు డబ్బాలతోనే రైల్వేశాఖ పని కానీచ్చేస్తోంది. ఇటీవల రాంఛీ నుంచి బయలుదేరాల్సిన రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మూడోబోగీలు కదలకుండా మొరాయించడంతో ప్రయాణీకులు పెట్టిన గగ్గోలు అంతా ఇంతా కాదు. అధునాతన సౌకర్యాలున్న రైళ్లుగా పరిగణిస్తున్న రాజధాని వంటి రైళ్ల కోసం తెప్పించిన కొత్త కోచ్‌లు ఏమయ్యయో తెలియక అక్కడి అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఈ రైలు డబ్బాలు కనిపించకుండా పోవడం వెనక పెద్ద ముఠాయే పనిచేస్తున్నట్టు ఉందని సందేహాలు వ్యక్తం చేస్తున్న వారూ ఉన్నారు. దీనిపై సంబంధిత అధికారులు ఫిర్యాదు కూడా చేసినట్టు చెబుతున్నారు. అంతకు ముందు కూడా ఒకటో రెండో ఇలాంటి ఘటనలు జరిగినా ఇప్పుడు ఏకంగా కొన్ని ఏసీ బోగీలే కనిపించకుండా పోవడం వారిని మరింత ఆందోళనకు గురిచేస్తోంది. అయితే ఏసీ బోగీలు కనబడకుండా పోయాయన్న వార్తలపై రాంచీ డివిజన్ అధికారి స్పందించినట్టు ఓ పత్రిక వెల్లడించింది. ‘తమ డివిజన్‌లోనే వీటిని ఉపయోగిస్తున్నట్టు మేము మార్క్ చేశాం. ఈ కోచ్‌లు ఉత్తరాది డివిజన్లో వినియోగంలో ఉన్నట్టుగా భావిస్తున్నాం. ఈ ఏసీ బోగీలను తిరిగి తమకు అప్పగించాలంటూ ఉత్తరాది రైల్వేకి ఆగ్నేయ రైల్వే లేఖ రాసింది. త్వరలోనే అవి వెనక్కు వస్తాయని ఆశిస్తున్నాం’ ఆ అధికారి పేర్కొన్నట్టు తెలిపింది. చిన్న చిన్న చోరీలు ఎక్కువే... 2016 నేషనల్ క్రైం రికార్డ్స్ బ్యూరో నివేదిక ప్రకారం...2015లో రైళ్లలో చోటుచేసుకున్న చోరీ కేసులు 9.42 లక్షలుండగా, 2016లో ఈ సంఖ్య11 లక్షలకు చేరుకుంది. వీటిలో 2 లక్షల కేసులతో మహారాష్ట్ర మొదటిస్థానంలో, 1.24 లక్షల కేసులతో ఉత్తరప్రదేశ్ రెండోస్థానంలో నిలిచాయి. 2016–17లో చత్తీస్‌గఢ్‌లోని బిలాస్పూర్ కోచింగ్ డిపో పరిధిలో 817 బయో టాయ్‌లెట్లున్నాయి. దీని పరిధిలో 3,601 స్టీల్ డస్ట్బిన్లు కనబడకుండా పోయినట్లు ఫిర్యాదు చేశారు. పశ్చిమబెంగాల్లోని సీయల్దా కోచింగ్ డిపో పరిధిలో 1,304 బయో టాయ్లెట్లుండగా 3,536 చోరీకి గురైనట్టు అధికారులు తెలిపారు. – సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
ఏసీ బస్ షెల్టర్స్ ప్రారంభించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్ : నగరంలో బీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తున్న అత్యాధునిక ఏసీ బస్ షెల్టర్స్ ఒక్కొక్కటి అందుబాటులోకి వస్తున్నాయి. నేడు ఖైరతాబాద్, కూకట్ పల్లిలో ఏర్పాటు చేసిన ఏసీ బస్టాప్‌లను మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రారంభించారు. ఈ ఆధునిక బస్ షెల్టర్లలో ఏసీ, వైఫై, ఏటీఎం, టీవీ, మొబైల్ చార్జింగ్ పాయింట్స్, ఫ్యాన్లు, టాయిలెట్, టికెట్ కౌంటర్లులతో పాటు ఎమర్జెన్సీ హారన్ వంటి సౌకర్యాలు కల్పించారు. గ్రేటర్ హైదరాబాద్‌లో అంతర్జాతీయ ప్రమాణాలతో ఏసీ బస్షెల్టర్ల నిర్మాణాలను జీహెచ్ఎంసీ చేపడుతుంది. గ్రేటర్లో మొత్తం 826 ఆధునిక బస్షెల్టర్లను జీహెచ్ఎంసీ ఏర్పాటు చేస్తుంది. పాశ్చత్య దేశాలలోని ప్రముఖ నగరాల్లో మాత్రమే ఈ విధమైన బస్ షెల్టర్లు ఉన్నాయి. ప్రస్తుతం శిల్పారామం, ఖైరతాబాద్ ఆర్టీసీ ఆఫీస్, కూకట్పల్లి హౌసింగ్ బోర్డులో ఏసీ బస్ షెల్టర్స్ అందుబాటులోకి వచ్చాయి. దేశంలో తొలిసారిగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేసిన ఘనతను జీహెచ్ఎంసీ సాధించింది. సోమాజిగూడలో నిర్మించిన అత్యాధునిక ఏసీ బస్టాప్‌లను మంత్రి కేటీఆర్, విద్యుత్ శాఖ మంత్రి జగదీష్‌రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి గురువారం ప్రారంభంచారు. జీహెచ్ఎంసీ, యూనియాడ్స్ సంయుక్త ఆధ్వర్యంలో రూ. 60 లక్షల వ్యయంతో ప్రయోగాత్మకంగా ఏసీ బస్టాప్‌ను ఏర్పాటు చేశారు. ఒక్కో బస్టాప్ దాదాపుగా 25మంది ప్రయాణికులకు చోటివ్వనుంది. ఈ సందర్భంగా యూనియాడ్స్ ప్రతినిథులు ప్రవీన్ రామారావు, ఎంఎన్ రాజులు మాట్లాడుతూ.. అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులు రెడ్ బటన్ ప్రేస్తే వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం చేరుతుందన్నారు. తొలుత రెండు ఏసీ, మరో రెండు నాన్ఏసీ బస్టాప్‌లు ఏర్పాటు చేయాలని నిర్ణయించినా, ప్రత్యేక కారణాలతో నాలుగు బస్ షెల్టర్లకు ఏసీలను అమర్చామని తెలిపారు. ఈ బస్టాప్‌లకు అధునాతన టఫ్పెల్ గ్లాస్‌లను అమర్చినట్లు వారు చెప్పారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ బొంతు రామ్మోహన్, జీహెచ్ఎంసీ కమిషనర్ డాక్టర్ జనార్దన్ రెడ్డి, ఆర్టీసీ చైర్మన్ సోమవరపు సత్యనారాయణ, ఆర్టీసీ ఈడీ రమణారావు, ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి, జోనల్ కమిషనర్ భారతి హోలికేరి, డిప్యూటీ కమిషనర్ అద్వైత్ కుమార్ సింగ్, డాక్టర్ భార్గవ్ నారాయణ, సర్కిల్ 18 డిప్యూటీ కమిషనర్ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
ఏసీ కోచ్‌లో నాగు పాము
భువనేశ్వర్: రైలు ప్రయాణం అడుగడుగునా ప్రమాదకరంగా మారిందంటే అతిశయోక్తి కాదు. నిన్న మొన్నటి వరకు రైలు బోగీల్లో బొద్దింకలు, ఎలుకలు వంటి సాధారణ కీటకాలు, చిరు జంతువులు ప్రత్యక్షం కావడంపట్ల ప్రయాణికులు అలవాటు పడ్డారు. తాజాగా రైలు ఎయిర్ కండిషన్ ద్వితీయ శ్రేణి బోగీలో నాగుపాము ప్రత్యక్షం కావడం సోషల్ మీడియాలో దుమారం రేపుతోంది. ఈ దుమారం కథనం ఇలా ప్రసారంలో ఉంది. ఈ సంఘటన పూర్వాపరాల్ని రైల్వే శాఖ పర్యవేక్షిస్తోంది.18507 విశాఖపట్నం–అమృతసర్ ఎక్స్‌ప్రెస్ రైలు ద్వితీయ శ్రేణి ఎయిర్ కండిషన్ బోగీలో నాగుపాము గలాటా సృష్టించింది. ఎ–1 బోగీ 32వ నంబరు బెర్తు కింద పాము తారసపడింది. ఈ బెర్తులో భువనేశ్వర్ నుంచి అంబాలా వెళ్లేందుకు ఓ యువతి బయల్దేరింది. రైలు ఢిల్లీ నుంచి బయల్దేరిన తర్వాత తనపైకి ఏదో పాకుతున్నట్లు అనిపించి చూడబోతే సాక్షాత్తు నాగు పాము కావడంతో పిడికిట్లో ప్రాణాలు పెట్టుకుని తనకి అందుబాటులో ఉన్న కంబళిని నాగుపాముపై రువ్వి హఠాత్తుగా బెర్తు నుంచి కిందకు దూకి మిగిలిన ప్రయాణం పూర్తి చేసింది. వేరే చోట తోటి ప్రయాణికులతో సర్దుకుని అంబాలా గమ్యం చేరింది. గమ్యం చేరిన భయంతో బిక్కచచ్చిన యువతి కిందకు దిగలేని పరిస్థితిలో డీలాపడినట్లు కుటుంబీకులు గుర్తించారు. ఆమెకి చేయూతనిచ్చి రైలునుంచి దించాల్సి వచ్చిందని యువతి తండ్రి సోషల్ మీడియాలో ఆదివారం ప్రసారం చేశాడు. -
ఏసీ..దోచేసి!
నగరంలోని బోరబండకు చెందిన చంద్రశేఖర్ తన కుటుంబ సభ్యులతో కలిసి అన్నవరంలోని బంధువుల పెళ్లికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సులో వెళ్లాలని భావించి టికెట్లు ఆన్లైన్లో బుక్ చేయాలనుకున్నాడు. గతంలో సిటీ నుంచి అన్నవరం వరకు ఏసీ టికెట్ ధర రూ.975 ఉంటే ఇప్పుడు రూ.2000కు చేరింది. అంటే నలుగురు సభ్యులు కలిసి అన్నవరం వెళ్లి రావాలంటే బస్సు చార్జీలకు ఏకంగా రూ.16,000 చెల్లించాలి. ఇది చంద్రశేఖర్ సమస్య మాత్రమే కాదు.. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేందుకు సీట్లు లభించక, రైళ్లలో బెర్తులు దొరక్క ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న ప్రతిప్రయాణికుడి వ్యధ. ఇలాంటి వారంతా ట్రావెల్స్ ఆపరేటర్ల దోపిడీకి గురవుతున్నారు. పైగా ఒక్కో ఏజెన్సీ ఒక్కోలా చార్జీ వసూలు చేస్తూ దోచుకుంటున్నాయి. సాక్షి, సిటీబ్యూరో: సగటు ప్రయాణికుడిని ప్రైవేట్ బస్సులు కూల్‌గా దోచేస్తున్నాయి. వేసవి రద్దీని సొమ్ము చేసుకొనేందుకు ధరలను అమాంతం పెంచేసి జేబులు లూఠీ చేస్తున్నాయి. సాధారణ చార్జీలను రెట్టింపు చేసి మరీ దోపిడీకి పాల్పడుతున్నాయి. ఒకవైపు వేసవి సెలవులు, మరోవైపు పెళ్లిళ్ల సీజన్ కావడంతో నగరం నుంచి ఇతర రాష్ట్రాలు, నగరాలకు వెళ్లే ప్రయాణికుల రద్దీ అనూహ్యంగా పెరిగింది. ఇందుకు అనుగుణంగా రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎలాంటి అదనపు బస్సులను ఏర్పాట్లు చేయలేదు. దక్షిణమధ్య రైల్వే 150కి పైగా ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినప్పటికీ అవి ప్రయాణికుల డిమాండ్‌ను భర్తీ చేయలేకపోతున్నాయి. దీంతో గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయిస్తున్న నగర ప్రయాణికులను ట్రావెల్స్ సంస్థలు దోచుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు ఏసీ స్లీపర్ క్లాస్ బస్సు చార్జీ గతంలో రూ.650 ఉంటే ప్రస్తుతం రూ.1574కు పెరిగింది. వైజాగ్‌కు ఏసీ బస్సు చార్జీ గతంలో రూ.950 ఉంటే ఇప్పుడు ఏకంగా రూ.1984కి పెంచారు. ప్రత్యామ్నాయ రవాణా సదుపాయం లేక, గత్యంతరం లేక తప్పనిసరి పరిస్థితుల్లో చార్జీల రూపేణా రూ.వేలల్లో సమర్పించుకోవలసి వస్తోందంటూ ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సగటు ప్రయాణికుడే బాధితుడు.. హైదరాబాద్ నుంచి విజయవాడ, విశాఖపట్టణం, గుంటూరు, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, చిత్తూరు, కర్నూలు, కడప, తిరుపతి, బెంగళూరు తదితర ప్రాంతాలకు ప్రతిరోజు 650 నుంచి 700 ప్రైవేట్ బస్సులు నడుస్తుంటాయి. నగరంలోని బీహెచ్ఈఎల్, మియాపూర్, కూకట్పల్లి, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట్, లకిడీకాపూల్, కాచిగూడ తదితర సెంటర్ల నుంచి ప్రయాణికుల పాయిట్లు ఉన్నాయి. రాష్ట్రస్థాయి కాంట్రాక్ట్ క్యారేజీలుగా గుర్తింపు పొందిన ట్రావెల్స్ బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతూ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. దోపిడీని నియంత్రించేదెవరు..? ప్రైవేట్ బస్సు చార్జీలపైన ఎలాంటి అధికారిక నియంత్రణ లేదు. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. మోటారు వాహన నిబంధనల ఉల్లంఘన నెపంతో అప్పుడప్పుడూ తనిఖీలు చేసి కేసులు నమోదు చేసే రవాణాశాఖ.. చార్జీల నియంత్రణ తమ పరిధి కాదని చేతులెత్తేస్తుంది. పర్మిట్లు లేకుండా తిరిగే బస్సులపైన, అదనపు సీట్లు ఏర్పాటు చేసే బస్సులపైనా కేసులు నమోదు చేస్తారు. సరుకు రవాణాకు పాల్పడినా తరచుగా కేసులు పెట్టి జరిమానాలు విధిస్తుంటారు. కానీ ఇలా వేసవి సెలవులు, పెళ్లిళ్ల సీజన్ వంటి ప్రత్యేక సందర్భాల్లో సాధారణ చార్జీలను రెండు రెట్లు పెంచినా రవాణా అధికారులు పట్టించుకోవడం లేదు. మరోవైపు ప్రైవేట్ బస్సుల చార్జీలను నియంత్రించే ఏ వ్యవస్థా ప్రభుత్వంలో లేకపోవడం గమనార్హం. ప్రైవేట్ బస్సుల చార్జీలతో పోలిస్తే కొన్ని సందర్భాల్లో విమాన చార్జీలే నయమనుకొనే పరిస్థితి నెలకొంది. వేసవి సెలవుల్లో టూర్లకు వెళ్లేవారు, తిరుపతి, షిరిడీ, బెంగళూరు వంటి ప్రాంతాలకు వెళ్లేందుకు కనీసం నెల రోజులు ముందుగా ఫ్లైట్ బుక్ చేసుకుంటే ప్రైవేట్ బస్సులకు వెచ్చించే రెట్టింపు చార్జీల ధరల్లోనే హాయిగా విమానయానం చేయవచ్చని అభిప్రాయపడుతున్నారు. -
రైల్వే మరో కీలక నిర్ణయం
న్యూఢిల్లీ : భారతీయ రైల్వే మరో కీలక నిర్ణయం తీసుకోబోతోంది. కొన్ని సెక్టార్లలో రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో కోచ్‌లను మార్చాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్, దురంతో రైళ్లలో ఉన్న అన్ని ఏసీ-2 టైర్ కోచ్‌లను ఏసీ-3 టైర్ కోచ్‌లుగా మార్చబోతోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ఈ ఏడాది అన్ని ఏసీ-2 టైర్ టైర్ కోచ్‌లను తీసేసి, 250 ఏసీ-3 టైర్ కోచ్‌లను ఇన్స్టాల్ చేయబోతోంది. సీనియర్ రైల్వే అధికారి ఈ విషయాన్ని ధృవీకరించారు. ప్రతి రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో రెండు ఏసీ-2 టైర్ కోచ్‌లు ఉంటాయి. వాటిని కొంతమంది ప్యాసెంజర్లు మాత్రమే బుక్ చేసుకుంటున్నారని, దీంతో రైల్వేకు రెవెన్యూ నష్టాలు వస్తున్నట్టు సీనియర్ రైల్వే అధికారి తెలిపారు. మరోవైపు ఏసీ-3 టైర్ కోచ్‌లకు రైళ్లలో భారీ ఎత్తున్న డిమాండ్ ఉంటుంది. బ్రేక్ ఈవెన్ మార్కును కూడా ఇవి చేధించి, లాభాలను ఆర్జిస్తున్నాయి. కోచ్‌ల మార్పుతో పాటు రాజధాని, దురంతో, శతాబ్ది ఎక్స్‌ప్రెస్‌ల ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను కూడా సమీక్షించాలని దేశీయ రైల్వే నిర్ణయించింది. దీని స్థానంలో రెంటల్ శ్లాబులను తీసుకురావాలని దేశీయ రైల్వే ప్లాన్ చేస్తోంది. ఈ శ్లాబులతో ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను మరింత సరళతరం చేయనుంది. ఫ్లెక్సి ఫేర్ స్కీమ్‌ను 2016 సెప్టెంబర్‌లో దేశీయ రైల్వే లాంచ్ చేసింది. -
విజయవాడకు షి‘కారు’
హైదరాబాద్ నుంచి విజయవాడ.. 250 కిలోమీటర్ల దూరం.. బస్సులో వెళ్తే 6 గంటల ప్రయాణం. అమరావతి, గరుడ ప్లస్ వంటి ఆర్టీసీ ఏసీ బస్సుల్లో అయితే ఐదు గంటల్లో గమ్యం చేరవచ్చు. వీటికి రూ.580 వరకు టికెట్ ధర భరించాల్సి ఉంటుంది. మరి అదే ఏసీ ప్రయాణం, కేవలం మూడున్నర గంటల్లోనే గమ్యం చేరే అవకాశం, ప్రయాణ ఖర్చు రూ.500 మాత్రమే అయితే..! సాక్షి, హైదరాబాద్: ప్రైవేటు బస్సులను మించిన ట్రావెల్ దందా మొదలైంది. కార్లు స్టేజీ క్యారియర్లుగా అవతారమెత్తాయి. హైదరాబాద్–విజయవాడ మధ్య ప్రయాణికులను తరలిస్తున్నాయి. గరు డ ప్లస్, అమరావతి వంటి ఏసీ బస్సుల కంటే వేగంగా గమ్యం చేరటంతోపాటు, తక్కువ ధర కావటంతో ప్రయాణికులు వాటికే ఎగబడుతున్నారు. దీంతో తవేరా, ఇన్నోవా, ఫార్చునర్ వంటి కార్లకు విపరీతమైన డిమాండ్ ఏర్పడింది. కొందరు వాహన యజమానులు సిండికేట్‌గా మారి సిబ్బందిని నియమించి ప్రయాణికులను వాటిలోకి ఎక్కేలా చేస్తున్నారు. నెల రోజులుగా ఈ తంతు జరుగుతున్నా రవాణా శాఖ కానీ ఆర్టీసీ కానీ దృష్టి సారించలేదు. మూడు గంటల్లోనే.. ఎంత తొందరగా ప్రయాణికులను గమ్యానికి చేరిస్తే.. ఆదరణ అంత ఎక్కువగా ఉంటుందన్న ఉద్దేశంతో కార్లలో ప్రయాణికులను ఎక్కించుకుని దూసుకుపోతున్నారు. అర్ధరాత్రి అయితే మూడు గంటల్లోనే గమ్యం చేరుస్తున్నా రు. దీంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉం దన్న ఆందోళన కలుగుతోంది. ఆర్టీసీ బస్సుల కు రావాల్సిన ప్రయాణికులు వీటికి మళ్లుతుండటంతో రవాణా శాఖ భారీగా నష్టపోతోంది. గతంలో ప్రైవేటు బస్సుల వల్ల నష్టం జరుగుతోందని గగ్గోలు పెట్టిన ఆర్టీసీకి ఇప్పుడు వీటి రూపంలో మరో ప్రమాదం ముంచుకొచ్చింది. ఉదయం అటు.. మధ్యాహ్నం ఇటు ఉదయం ఏడు గంటల నుంచి కార్ల హవా మొదలవుతోంది. ఉదయం వేళ ఎక్కువగా హైదరాబాద్ నుంచి విజయవాడకు వెళ్లే వాహనాలు, మధ్యాహ్నం తర్వాత తిరిగి విజయవాడ నుంచి బయలుదేరుతున్నాయి. మూడు వరసల సీట్లు ఉండే ఈ కార్లలో ఏడు నుంచి ఎనిమిది మందిని ఎక్కించుకుంటున్నారు. దిల్ సుఖ్‌నగర్, ఎల్బీ నగర్ల నుంచి ఇవి మొదలవుతున్నాయి. ముందస్తు సీటు రిజర్వు చేసుకునే అవసరం లేకపోవటం, రోడ్డు మీదకు రాగానే సిద్ధంగా ఉంటుండటంతో ప్రీమియం కేటగిరీ బస్సుల్లో ఎక్కే ప్రయాణికులు వీటివైపు మొగ్గు చూపుతున్నారు. ఉదయం విజయవాడకు వెళ్లి పని చూసుకుని తిరిగి సాయంత్రం హైదరాబాద్‌కు వచ్చేవారు ముందే వాహనంలో సీటు రిజర్వు చేసుకునే వెసులుబాటు కూడా వీటిలో కల్పిస్తున్నారు. గతంలో హైదరాబాద్‌లో ట్రావెల్స్‌లో తమ వాహనాన్ని ఉంచిన కొంతమంది సిండికేట్‌గా మారి ఈ దందా ప్రారంభించారు. దీంతో వారి మధ్య మంచి అవగాహన ఉంది. ఏ కారు ఎక్కడుందనే సమాచారం వారి మధ్య ఉంటోంది. ఉదయం తన కారులో వచ్చిన వారు తిరిగి విజయవాడలో బయలుదేరేప్పు డు ఏ కారులో వెళ్లవచ్చో ఆ డ్రైవరే చెబుతు న్నాడు. సంబంధిత కారు డ్రైవర్ ఫోన్ నంబర్ కూడా ఇస్తుండటంతో పని సులువవుతోంది. దృష్టి సారించని రవాణా శాఖ ఆర్టీసీ మినహా మిగతా ప్రైవేటు వాహనాలేవీ స్టేజీ క్యారియర్లుగా తిరగకూడదని పేర్కొనే రవాణా శాఖ అధికారులు ఇప్పటి వరకు వీటిపై దృష్టి సారించలేదు. నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న అరుణాచల్‌ప్రదేశ్ బస్సులను ఇటీవల నియంత్రించి చివరకు ప్రభుత్వ ఆదేశంతో వాటికి స్వేచ్ఛనివ్వటం తెలిసిందే. ఇప్పుడు వాటికి తోడుగా నిబంధనలకు విరుద్ధంగా తిరుగుతున్న కార్లు కొత్త సమస్యను తెచ్చిపెట్టాయి. వేగంగా దూసుకుపోతుండటంతో ప్రమాదాలు జరిగే అవకాశమే ఎక్కువ ఆందోళన కలిగిస్తోంది. వీటి వల్ల ఆర్టీసీ భారీగా నష్టపోతుందని, దీనిపై ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సిన అవసరం ఉందని ఓ డిపో మేనేజర్ వ్యాఖ్యానించారు. ‘నెల రోజులుగా ఈ కార్ల హవా పెరిగిందని సిబ్బంది నుంచి సమాచారం అం దింది. వాటిని నియంత్రించేందుకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు విన్నవిస్తున్నాం’ అని విజయవాడకు ఎక్కువగా ప్రీమియం కేటగిరీ బస్సులు తిప్పే డిపో మేనేజర్ తెలిపారు. గంటకు 12 నుంచి 15 కార్లు దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, అటు విజయవాడలోని ప్రధాన ప్రాంతాల్లో ఈ కార్లను వరుస ప్రకారం నియంత్రించేందుకు కొందరు సిబ్బందిని కూడా నియోగించారు. ఆ సిబ్బంది ముందు వచ్చిన కారులో ప్రయాణికులను ఎక్కించిన తర్వాత వెనక కారుకు మళ్లిస్తారు. బస్సు కోసం వేచి చూసే ప్రయాణికుల వద్దకు వెళ్లి ఏసీ కార్లు అందుబాటులో ఉన్నాయని, ఆర్టీసీ బస్ చార్జి కంటే తక్కువ ధరకే సిద్ధమని, గంటన్నర ముందే గమ్యం చేరుకోవచ్చంటూ ప్రయాణికులను మళ్లిస్తున్నారు. గంటకు 12 నుంచి 15 వరకు కార్లు వరస కడుతున్నాయి. -
గాల్లో తేలినట్టుందే..
సాక్షి, సిటీబ్యూరో: విమాన ప్రయాణం..అదో అద్భుత అనుభూతి..ఆకాశ మార్గంలో అతివేగంగా హాయిగా గమ్యం చేరుకోవచ్చు. అదీ ఎయిర్‌బస్ గొప్పతనం.. మరి అలాంటి వారు రోడ్డు మార్గంలో ప్రయాణించేటపుడు ఎటువంటి సౌకర్యాలు కోరుకుంటారు.. దాదాపు ఏరోప్లేన్‌లో వెళ్లేటపుడు ఉన్న సౌకర్యాలే ఉండాలనుకుంటారు.. అందుకు టీఎస్ ఆర్టీసీ అటువంటి వారి కోసం గాల్లో తేలిపోయే ప్రయాణ అనుభూతిని కల్పిస్తోంది. మెట్రో లగ్జరీ ఏసీ ఓల్వో బస్సుల్లో శంషాబాద్ విమానాశ్రయానికి నగరం నుంచి ప్రయాణికులను చేరవేస్తూ మనసు చూరగొంటూంది. పెరిగిన ప్రయాణికులు శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే జాతీయ, అంతర్జాతీయ విమానాల సంఖ్య పెరిగింది. ప్రతి రోజూ సుమారు 404 ఫ్లైట్ సర్వీసులు నడుస్తున్నాయి. సుమారు 40 వేల మంది ప్రయాణికులు ఎయిర్‌పోర్టు నుంచి వివిధ ప్రాంతాలకు బయలుదేరుతున్నారు. విమానసర్వీసుల సంఖ్య, ప్రయాణికుల రద్దీ పెరడంతో ఆర్టీసీ మెట్రో బస్సులకు సైతం ఆదరణ లభిస్తోంది. మరోవైపు గత సంవత్సరం వరకు ఎయిర్‌పోర్టు మార్గంలో నడిచిన పుష్పక్ బస్సుల స్థానంలో మొదట 29 మెట్రో లగ్జరీ ఏసీ బస్సులను ప్రవేశపెట్టారు. క్యాబ్‌లు, ట్రావెల్స్ వాహనాలు అందుబాటులో ఉన్నప్పటికీ అతి తక్కువ చార్జీలతో ఏసీ ప్రయాణం చేసే సదుపాయం లభించడం తో ప్రయాణికులు ఆర్టీసీ బస్సులకే అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. దీంతో ప్రయాణికుల డిమాండ్‌కు అనుగుణంగా మెట్రో లగ్జరీ బస్సుల సంఖ్యను తాజాగా 29 నుంచి 35 కు పెంచారు. దీంతో ప్రయాణికుల ఆదరణ అనూహ్యంగా పెరిగినట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. ఒకప్పుడు 35 నుంచి 40 శాతం వరకే ఉన్న ఆక్యుపెన్సీ రేషియో సైతం ప్రస్తుతం సుమారు 65 శాతానికి చేరింది. దీంతో ఎయిర్‌పోర్టు మార్గంలో మరిన్ని అధునాతన బస్సులను ప్రవేశపెట్టేందుకు గ్రేటర్ ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. నగరం నలువైపుల నుంచి సర్వీసులు.... నగరంలోని అన్ని ప్రధాన కారిడార్ల నుంచి ప్రయాణికులు ఎయిర్‌పోర్టుకు వెళ్లేవిధంగా ఈ బస్సులను ప్రవేశపెట్టారు. జేఎన్టీయూ, కూకట్పల్లి, హైటెక్‌సిటీ మార్గంలో, సికింద్రాబాద్ నుంచి బేగంపేట్, పంజగుట్ట,మాసాబ్‌ట్యాంక్, పీవీఎన్ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మార్గంలో జూబ్లీబస్‌స్టేషన్ నుంచి తార్నాక, ఉప్పల్, బండ్లగూడ మార్గంలో, సంగీత్ చౌరస్తా నుంచి తార్నాక మీదుగా మొత్తం 35 బస్సులు ప్రతి రోజూ 218 ట్రిప్పులు తిరుగుతున్నాయి. అన్ని మార్గాల్లోనూ సిటీ నుంచి ఎయిర్‌పోర్టు వరకు రూ.263 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. సాధారణంగా క్యాబ్‌లు, ట్రావెల్స్ కార్లు వంటి సర్వీసుల్లో జేఎన్టీయూ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు వెళ్లేందుకు రూ.500 పైనే ఖర్చవుతుంది. మరోవైపు ఉదయం 4 గంటల నుంచి రాత్రి 11.30 వరకు కూడా ప్రతి 45 నిమిషాలకు ఒక బస్సు చొప్పున అందుబాటులో ఉండడం కూడా ప్రయాణికుల ఆదరణకు అవకాశం కల్పించింది. శంషాబాద్ ఎయిర్‌పోర్టు నుంచి సిటీకి వచ్చే బస్సు ఉదయం 3.30 గంటలకు బయలుదేరుతుంది. పెరిగిన ఆదాయం.... శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే పుష్పక్ బస్సులు గతంలో తీవ్రమైన నష్టాలతో నడిచాయి. ఎలాంటి లాభనష్టాలు లేకుండా ఈ మార్గంలో బస్సులు తిప్పాలంటే ఒక కిలోమీటర్‌పైన కనీసం రూ.45 లు లభించాలి. కానీ పుష్పక్ బస్సులపైన రూ.33 నుంచి రూ.35 లు మాత్రమే లభించేవి. దీంతో ఒక కిలోమీటర్‌పైన సగటున రూ.10 ఆర్ధిక నష్టంతో, ప్రతి రోజు ఒక బస్సుపైన రూ.5000 నష్టాలతో పుష్పక్ బస్సులు నడిచాయి. ఈ బస్సులను ప్రవేశపెట్టినప్పటి నుంచి ఆర్టీసీ ఏటా కోట్లాది రూపాయల నష్టాలను చవిచూసింది. మెట్రోలగ్జరీ బస్సులను ప్రవేశపెట్టిన తరువాత ఈ నష్టాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి.‘ ఇంకా లాభాల బాటలోకి ప్రవేశించలేకపోయినప్పటికీ నష్టాలు మాత్రం తగ్గాయి. అది పెద్ద ఊరట’ అని ఈడీ పురుషోత్తమ్ చెప్పారు. త్వరలో 40 బ్యాటరీ బస్సులు.... ఎయిర్‌పోర్టు మార్గంలో మెట్రో లగ్జరీ బస్సులకు ప్రయాణికుల ఆదరణ పెరగడంతో త్వరలో విద్యుత్‌తో నడిచే 40 బ్యాటరీ బస్సులను ప్రవేశపెట్టేందుకు ఆర్టీసీ సన్నాహాలు చేపట్టింది. పూర్తిగా పర్యావరణహితంగా, ఏసీ సదుపాయంతో నడిచే ఈ అత్యాధునిక బస్సులను గతంలో ప్రయోగాత్మకంగా నడిపారు. ప్రయాణికుల నుంచి ఆదరణ లభించింది. దీంతో మరిన్ని బస్సులను అద్దె ప్రాతిపదికన నడిపేందుకు ఆర్టీసీ టెండర్లను ఆహ్వానించింది. -
ఏసీ బోగీలో పాము!
సాక్షి, అన్నానగర్: తమిళనాడులోని కోవై నుంచి చెన్నైకు వస్తున్న చేరన్ ఎక్స్‌ప్రెస్ రైల్లో పాము కనిపించడంతో ప్రయాణికులు హడలెత్తిపోయారు. చెన్నై సెంట్రల్-కోయంబత్తూరు మధ్య నడిచే చేరన్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్(12674) గురువారం రాత్రి కోవై నుంచి చెన్నైకు బయలుదేరింది. శుక్రవారం ఉదయం చెన్నై సెంట్రల్‌కు సమీపిస్తుండగా బి-3 ఏసీ బోగీలోని ఒక ప్రయాణికుడు తన లగేజీని తీసుకుంటుండగా బెర్త్ కింద పాము కనిపించింది. భయాందోళన చెందిన అతను కేకలు పెట్టాడు. అతడి అరుపులు విని ఇతర ప్రయాణికులు కూడా కేకలు పెడుతూ పరుగులు తీశారు. కొందరు పోలీసులకు సమాచారం అందించారు. ఇంతలో చెన్నై సెంట్రల్ స్టేషన్ రావడంతో బోగీలోని ప్రయాణికలు తమ లగేజీలు తీసుకుని దిగారు. కాగా, ఏసీ బోగీలో పాము ఉందని, దాన్ని తొలగించామని చెన్నై డివిజనల్ రైల్వే మేనేజర్ చెప్పారు. అయితే అది అక్కడకు ఎలా వచ్చిందో తెలియలేదని, విచారిస్తున్నట్టు తెలిపారు. అది పొడవైనదిగాను, విషపామువలే ఉందని ఆ బోగీలో ఉన్న భువన అనే ప్రయాణికురాలు తెలిపింది. -
సికింద్రాబాద్, చెన్నైల్లోను ఏసీ లోకల్ రైళ్లు
న్యూఢిల్లీ: త్వరలో కోల్‌కతా, చెన్నై, సికింద్రాబాద్ లోకల్ రైల్వే వ్యవస్థలో ఏసీ కోచ్‌లు, ఆటోమెటిక్ డోర్ సదుపాయాలు అందుబాటులోకి రానున్నాయి. కొద్ది రోజుల్లో ముంబై సబర్బన్ రైల్వే నెట్‌వర్క్‌లో 12 కోచ్‌లతో కూడిన ఏసీ రైలును నడిపేందుకు రైల్వే శాఖ సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో రైల్వే శాఖ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. ‘లోకల్ రైళ్లలో అనేక మార్పులు తీసుకొచ్చే ఆలోచనతో ఉన్నాం. 2019–20 మధ్యలో అన్ని కొత్త ఈఎంయూ రైళ్లలో ఏసీ, ఆటోమెటిక్ డోర్ సదుపాయాలు అందుబాటులో ఉంటాయి. ఆ రైళ్లను చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, సికింద్రాబాద్ నగరాల్లోను ప్రవేశపెట్టే ఆలోచనతో ఉన్నాం’ అని తెలిపారు. -
పక్క రాష్ట్రాల్లో పత్తాలాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పేకాట క్లబ్బులపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపడంతో నిర్వాహకులు రూట్ మార్చారు. ఇప్పటి వరకు రాష్ట్ర సరిహద్దుల్లో పేకాట క్లబ్బులు నిర్వహించిన వారు ఇప్పుడు మరింత అప్రమత్తతతో బెంగళూరు, ముంబై, గుంటూరును అడ్డాగా చేసుకున్నారు. రాష్ట్రంలో క్లబ్బులు నిర్వహించడం తప్పు గానీ, రాష్ట్రం బయట ఏం చేసుకున్నా తమను ఏంచేయాలేరంటూ హైదరాబాద్‌కు చెందిన ముగ్గురు నిర్వాహకులు కోట్ల రూపాయల్లో జూదరుల నుంచి దండుకుంటున్నారు. మూడు ప్రధాన కేంద్రాలు... గుంటూరు జిల్లాల్లోని దాచేపల్లిలో, కర్నాటక సరిహద్దు రాయ్‌చూర్‌లో... బోయినిపల్లికి చెందిన ఓ క్లబ్ నిర్వాహకుడు పేకాట కేంద్రాలను నిర్వహించేవాడు. అయితే రాయ్‌చూర్ స్థానిక వ్యాపారి ఆ క్లబ్‌ను కొనుగోలు చేయడం, ఈ నెల 16న గంజాయి స్మగ్లింగ్ పేరుతో దాచేపల్లి క్లబ్‌ను పోలీసులు మూసివేయించడంతో ఈసారి దందాకు బెంగళూరును ఎంచుకున్నాడు. బంజారాహిల్స్‌కు చెందిన ఓ వ్యక్తి ఇప్పటికే బెంగళూరులో రెండు క్లబ్‌లను లీజ్‌కు తీసుకొని నడిపిస్తున్నాడు. ఇది తెలిసిన బోయినిపల్లికి చెందిన క్లబ్ నిర్వాహకుడు ఆ నగరాన్ని ఎంచుకున్నాడు. బేగంబజార్‌కు చెందిన ఓ అగర్వాల్ ఏకంగా ముంబైలోని థానే పరిధిలో మూడు క్లబ్‌లు, బీదర్‌లో మరో రెండు క్లబ్‌లు ఏర్పాటుచేసి దందా సాగిస్తున్నాడు. రాకపోకల ఖర్చు వాళ్లదే... పేకాట కోసం వెళ్లేవారి విమాన టికెట్లు, గెస్ట్‌హౌస్, ఏసీ వెహికల్ అన్ని నిమిషాల్లో క్లబ్ నిర్వాహకులు ఏర్పాటు చేస్తారు. దీని కోసం రూ.2 లక్షలు వసూలు చేస్తున్నట్లు బేగంబజార్‌కు చెందిన ఓ వ్యాపారి ‘సాక్షి’ తెలిపారు. ప్రతీ రోజూ ఈ ముగ్గురు వ్యక్తులు నడిపిస్తున్న క్లబ్‌లకు 350 మంది వివిధ మార్గాల ద్వారా వెళ్తున్నారని, శని, ఆదివారాలు వస్తే బెంగళూరు, బీదర్‌కు ఏసీ బస్సులు, ముంబైకి విమానాల్లో 500 మంది కస్టమర్లు వెళ్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు. ఒక్క హైదరాబాద్ నుంచే ఇంత మంది వెళ్తున్నారని, ఇప్పుడు వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ ప్రాంతాల నుంచీ రద్దీ పెరిగిందని వివరించారు. ఇలా నిత్యం ఈ ముగ్గురు రూ.2.5 కోట్ల వరకు దందా సాగిస్తున్నారని తెలిపారు. లక్షల్లో గోవిందా... పేకాట కోసం వెళ్తున్న వారి సంఖ్య పెరగడంతో వ్యాపారులే ఏసీ బస్సులను కొనుగోలు చేస్తున్నారు. బోయినిపల్లికి చెందిన నిర్వాహకుడు ఏకంగా నాలుగు ఏసీ బస్సులు కొన్నాడు. లక్షల్లో డబ్బు పోగొట్టుకున్న కొందరు ఇక్కడికి వచ్చి ఆత్మహత్యకు పాల్పడుతున్నారని, అయితే డబ్బు పోగొట్టుకుంది వేరే రాష్ట్రం కావడంతో తాము ఎలాంటి చర్యలు చేపట్టలేకపోతున్నామని పోలీస్ అధికారులు చెబుతున్నారు. -
ఏసీ బోగీలే లక్ష్యంగా..
సికింద్రాబాద్: ఏసీ బోగిలే లక్ష్యంగా చేసుకొని చోరీలకు పాల్పడుతున్న ఓ దొంగను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి 530 గ్రాముల బంగారు అభరణాలతో పాటు రూ. 3 లక్షల విలువైన 7 ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్‌లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. వస్తవ్యాపారం నిర్వహిస్తున్న హరీష్ కుమార్ జైన్ ఈజీ మనీకి అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు గుర్తించిన రైల్వే పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. ఈ మేరకు రైల్వే పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు తెలిపారు. -
రైల్వే ప్రయాణికులకు ‘చల్లని’ కబురు!
న్యూఢిల్లీ: ఏసీ ప్రయాణాన్ని అందరికీ చేరువ చేసేందుకు త్వరలో ఎకానమీ ఏసీ కోచ్‌లను ప్రవేశపెట్టాలని రైల్వే శాఖ యోచిస్తోంది. ప్రస్తుతం ఉన్న స్లీపర్, టైర్–1, టైర్–2, టైర్–3 ఏసీ కోచ్‌లకు అదనంగా వీటిని ఏర్పాటు చేయనున్నారు. ఈ కోచ్‌లో టికెట్ ధర టైర్–3 ఏసీ కంటే తక్కువ. రైల్వే సౌకర్యాల అభివృద్ధిలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నామని ఓ సీనియర్ అధికారి వెల్లడించారు. ఎకానమీ ఏసీ కోచ్‌లో ఉష్ణోగ్రత 24–25 మధ్య ఉంటుందని, కాబట్టి ప్రయాణికులకు దుప్పట్లు అవసరం ఉండదన్నారు. ఇటీవల ప్రవేశపెట్టిన హమ్‌సఫర్ రైళ్లలోనూ టైర్–3 ఏసీ కోచ్‌లు మాత్రమే ఉన్నాయి. ఎకానమీ ఏసీ కోచ్‌లు ప్రవేశపెడితే ప్రయాణికులు పెరుగుతారని రైల్వే శాఖ అంచనా వేస్తోంది. -
ఏసీ బస్టాప్.. ఇక్కడి నుంచి వెళ్తారా?
ఎండలు మండిపోతున్నాయి. బస్సు కోసం వేచి ఉండాలంటే ఒకవైపు తల, మరోవైపు పాదాలు కూడా విపరీతంగా మండుతున్న సెన్సేషన్. పది నిమిషాలు ఉంటే చాలు.. కళ్లు మంటలు, తలనొప్పి వచ్చేస్తున్నాయి. ఈ బాధలన్నింటి నుంచి విముక్తి కల్పించేందుకు ఏసీ బస్టాపులు వచ్చేస్తున్నాయి. అయితే ప్రస్తుతానికి అవి మన దగ్గర కాదు.. కేవలం దేశ రాజధానిలోనే వచ్చాయి. డైకిన్ కంపెనీ తమ ప్రచారం కోసం ఢిల్లీలోని లాజ్‌పత్ నగర్ బస్టాపు మొత్తాన్ని ఏసీ చేసి పారేసింది. ఈ సంవత్సరం అసలే ఎండలు 40 డిగ్రీలకు పైబడి ఉంటున్నాయని, ఇలాంటి సమయంలో ఇది మంచి నిర్ణయమేనని జనం ఈ ప్రయోగాన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. పారదర్శకంగా ఉండే ప్లాస్టిక్ కర్టెన్లను ఈ బస్టాపులో ఏర్పాటు చేశారు. అవన్నీ దగ్గరదగ్గరగా ఉండటంతో లోపలి గాలి బయటకు, బయటి గాలి లోపలకు వెళ్లే అవకాశం ఉండదు. అలాగే, ఏ బస్సులు వస్తున్నాయో కూడా తెలుస్తుంది. పనిలో పనిగా లోపల పెట్టిన ఏసీ యూనిట్‌ను గొలుసులతో బంధించారు. లేకపోతే ఏ అర్ధరాత్రో ఎవరో ఒకరు వచ్చి ఆ ఏసీని కాస్తా పట్టుకెళ్లిపోయే ప్రమాదం ఉంటుందని ఇలా ముందుజాగ్రత్త తీసుకున్నారు. ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ (డీటీసీ) ప్రకటనల హక్కులు కలిగి ఉన్న డైకిన్ కంపెనీ తమ కంపెనీ ప్రచారంతో పాటు ప్రజలకు కూడా కాస్తంత మేలు జరుగుతుందని ఇలా పెట్టింది. అయితే ఇది ఎన్నాళ్లు కొనసాగుతుందో మాత్రం ఇంకా తెలియదు. గత డిసెంబర్ నెలలో ఒక టెలికం సర్వీస్ ప్రొవైడర్ పలు బస్టాపులలో ఎయిర్ ప్యూరిఫయర్లను ఏర్పాటుచేసింది. ఢిల్లీలో వాయు కాలుష్యం చాలా ఎక్కువగా ఉండటంతో అప్పట్లో గాలిని శుభ్రం చేయడానికి వీటిని ఏర్పాటుచేశారు. -
ఒక బస్సు.. ఇద్దరే ప్రయాణికులు!
ఖాళీగా పరుగులెడుతున్న ఏసీ ‘వజ్ర’ ఉప్పల్ కూడలి.. రాత్రి ఏడు దాటింది.. ఆర్టీసీ కొత్తగా ప్రవేశపెట్టిన వజ్ర ఏసీ బస్సొచ్చి ఆగింది. వరంగల్ వెళ్లాల్సిన ఆ బస్సులో ఇద్దరే ఉన్నారు. ఒక్కసారిగా ప్రయాణికులు ఎగబడ్డారు. కానీ.. డ్రైవర్ అనుమతించలేదు. ఇద్దరు ప్రయాణికులతోనే బస్సు ముందుకు కదిలింది. ఇది ఈ ఒక్క బస్సు కథ కాదు. హైదరాబాద్–వరంగల్, హైదరాబాద్–నిజామాబాద్ మార్గంలో ఆర్టీసీ ప్రారంభించిన వజ్ర బస్సులన్నింటిదీ ఇదే వ్యథ. ఏమిటీ వజ్ర? బస్సు ఎక్కేందుకు బస్టాండుకు వెళ్లే పాత పద్ధతికి స్వస్తి పలికి, బస్సులే కాలనీలకు వచ్చే విధంగా ఏసీ మినీ బస్సులు ప్రారంభించాలన్న ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు ఆదేశంతో ఆర్టీసీ ఇటీవల ‘వజ్ర’ బస్సులు ప్రారంభించింది. హైదరాబాద్ నుంచి ప్రధాన పట్టణాలకు మినీ ఏసీ బస్సులు ప్రారంభించాలని గతేడాది జూన్‌లో జరిగిన ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్ ఆదేశించారు. దీంతో ఈ నెల ఆరంభంలో తొలివిడతగా 48 మినీ ఏసీ బస్సులను ఆర్టీసీ ప్రారంభించింది. వీటిలో 30 బస్సులను హైదరాబాద్–వరంగల్ మధ్య, 18 బస్సులను హైదరాబాద్–నిజామాబాద్ మధ్య నడుపుతున్నారు. ఇమ్లీబన్, జూబ్లీ బస్టాండ్లకు కాకుండా నిర్ధారించిన కాలనీల మీదుగా ఈ బస్సులు ప్రయాణిస్తాయి. మరేంటి సమస్య? టికెట్ కొని బస్సు ఎక్కే విధానం లేకపోవటమే ప్రధాన సమస్యగా మారింది. బస్సులో టికెట్ ఇచ్చే వీలు లేదు. ఆర్టీసీ కౌంటర్లలో ఇవ్వరు. కేవలం ప్రత్యేకంగా రూపొందించిన మొబైల్ యాప్ ద్వారానే సీటు బుక్ చేసుకోవాలి. అలాగే వరంగల్ మార్గంలో ఉప్పల్ కూడలి, నిజామాబాద్ మార్గంలో సుచిత్ర కూడలిలోని ప్రైవేట్ ఆన్లైన్ రిజర్వేషన్ కేంద్రాల్లో అడ్వాన్స్ రిజర్వేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో ప్రయాణికులకు అవగాహన లేక బుకింగ్స్ తక్కువగా ఉన్నాయి. రూట్ మ్యాపేంటి? మెహిదీపట్నం, మియాపూర్, కుషాయిగూడ, హైదరాబాద్–2ల నుంచి ఈ బస్సులు ఉదయం 4 గంటల నుంచే బయలుదేరుతున్నాయి. ఆయా డిపోల నుంచి ప్రధాన కాలనీల మీదుగా ముందుకు సాగుతాయి. ఉదాహరణకు మెహిదీపట్నం డిపో బస్సు వరంగల్ వెళ్లాలంటే.. మెహిదీపట్నం, ఆసిఫ్‌నగర్, విజయనగర్ కాలనీ, మాసబ్‌ట్యాంక్, లక్డీకాపూల్, లిబర్టీ, గగన్‌మహల్, హిమాయత్‌నగర్, నారాయణగూడ, నల్లకుంట, డీడీ కాలనీ, అంబర్‌పేట, రామంతాపూర్, ఉప్పల్ మీదుగా వెళ్తుంది. వరంగల్‌కు రూ.300, నిజామాబాద్‌కు రూ.350 టికెట్ ధరగా నిర్ణయించారు. యాప్ ద్వారా టికెట్ బుక్ చేసుకుంటే ఆ వివరాలు డ్రైవర్ వద్ద ఉండే ట్యాబ్‌లో కనిపిస్తాయి. ఏ కాలనీలో ఎవరు బుక్ చేసుకున్నారో, ఏ సమయంలో ఎక్కుతారో తెలుస్తుంది. డ్రైవర్ ఫోన్ నెంబరు ఇతర వివరాలు ప్రయాణికుడి మొబైల్‌కు మెసేజ్ ద్వారా అందుతాయి. ప్రస్తుత పరిస్థితి.. ప్రస్తుతం ఆక్యుపెన్సీ రేషియో 15 నుంచి 18 శాతం ఉంది. 21 సీట్లుండే ఈ బస్సులో నలుగురైదుగురు, ఒక్కోసారి ఒక్కరు మాత్రమే ఉంటున్నారు. బుకింగ్స్‌పై అవగాహనలేని ప్రయాణికులు ఖాళీగా ఉన్న బస్సులను చూసి మార్గ మధ్యలో ఎక్కేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రయాణికులను డ్రైవర్ అనుమతించకపోవడంతో.. బస్సు ఖాళీగా ఉన్నా ఎందుకు ఎక్కనీయరంటూ డ్రైవర్లతో వాదనకు దిగుతున్నారు. వెరసి అటు వరంగల్, ఇటు నిజామాబాద్ మార్గంలో బస్సులు ఖాళీగా పరుగుపెడుతున్నాయి. వరంగల్, నిజామాబాద్‌లలోనూ ఇవే సమస్యలు ఉండటంతో ఖాళీగా హైదరాబాద్ వస్తున్నాయి. ఇలా చేస్తే బెటరేమో.. ► ఆర్టీసీ కౌంటర్లలో టికెట్లు జారీ చేసేలా ఏర్పాటు చేస్తే ప్రయాణికులకు టికెట్ తీసుకోడానికి ఉపయోగం. ► ఇమ్లీబన్, జూబ్లీబస్టాండ్ల మీదుగా బస్సులను నడపొద్దని నిర్ణయించినందున వరంగల్ మార్గంలో తార్నాక, రామంతాపూర్, ఉప్పల్, ఘట్కేసర్ లాంటి చోట్ల, నిజామాబాద్ మార్గంలో ప్యారడైజ్, బోయిన్పల్లి, సుచిత్ర, కొంపల్లి లాంటి చోట్ల టికెట్లు జారీ చేసే ఏర్పాట్లు చేయాలి. లేదంటే డ్రైవర్ వద్దనే టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ (టిమ్) ఉంచి టికెట్లు జారీ చేసే ఏర్పాటు చేయాలి. ► బస్సులు తిరిగే కాలనీల్లో వజ్ర బస్సులపై ప్రచారం చేపట్టాలి. – సాక్షి, హైదరాబాద్ -
ఎండల్లో హాయ్ హాయ్..!!
►వేసవిలో ఏసీ బస్సులకు డిమాండ్ ►నగరంలో 10 శాతం పెరిగిన ఆక్యుపెన్సీ సిటీబ్యూరో: కూల్ జర్నీ.. వేసవి తాపం నుంచి ఊరట. ఒకవైపు నిప్పులు చెరుగుతున్న ఎండలు, మరోవైపు వేడిగాలులు, ఉక్కపోత. అయినా సిటీలో తప్పని ప్రయాణం. దీంతో నగరవాసులు సాధారణ బస్సుల కంటే ఏసీ బస్సుల వైపే ఎక్కువగా మొగ్గుచూపుతున్నారు. ఆర్డినరీ, ఎక్స్‌ప్రెస్, డీలక్స్ వంటి బస్సుల కోసం ఎదురు చూడకుండా ఏసీ బస్సు కనిపిస్తే చాలు వాలిపోతున్నారు. నిన్న మొన్నటి వరకు పెద్దగా ఆదరణ లేకుండా తిరిగిన ఏసీ బస్సులు కొంతకాలంగా పరుగులు పెడుతున్నాయి. ఠారెత్తిస్తున్న ఎండలు ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. సాధారణ, మెట్రో బస్సుల కంటే ఏసీ బస్సుల్లో చార్జీలు కొద్దిగా ఎక్కువే అయినా ఎండల నుంచి ఉపశమనం కోసం నగరవాసులు ఏసీ బస్సులనే ఆశ్రయిస్తున్నారు. క్రమంగా ప్రయాణికుల ఆదరణ పెరగడంతో ఆక్యుపెన్సీ రేషియో కూడా ఒక్కసారిగా 10 శాతానికి పెరిగింది. అసలే ఆర్థికంగా దివాలా తీసి పీకల్లోతు నష్టాల్లో నడుస్తున్న గ్రేటర్ ఆర్టీసీకి ఇది కొంతమేరకు శుభపరిణామం. వివిధ రూట్లలో ఏసీ సర్వీసులు గ్రేటర్ ఆర్టీసీలో ప్రస్తుతం 80 మెట్రో లగ్జరీ బస్సులు. ఇవి హైటెక్‌సిటీ, మాధాపూర్, తదితర ప్రాంతాలతో పాటు అన్ని వైపుల నుంచి ప్రయాణికులకు ఐటీ కారిడార్లకు రాకపోకలు సాగించే విధంగా తిరుగుతున్నాయి. ఇవి కాకుండా మరో 20 పుష్పక్ ఏసీ బస్సులు నగరం నుంచి మూడు మార్గాల్లో ప్రత్యేకంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ బస్సుల్లో చార్జీలు కొద్దిగా ఎక్కువ కావడంతో ప్రయాణికులు వెనుకడుగు వేశారు. ఇతర బస్సుల కంటే వీటి నిర్వహణ ఖర్చు భారీగా ఉండడంతో వరుస నష్టాలే ఎదురయ్యాయి. గత నాలుగేళ్లలో ఒక్క ఏసీ బస్సులపైనే సిటీ ఆర్టీసీ రూ.117.36 కోట్ల నష్టాలకు గురైనట్లు అంచనా. మొత్తం నష్టం రూ.289 కోట్ల వరకు ఉంటే అందులో ఏసీ బస్సుల నష్టాలే సగం మేరకు ఉన్నాయి. గత రెండు నెలలుగా ఏసీ బస్సులకు పెరిగిన ఆదరణ వల్ల నష్టాలు తగ్గుముఖం పట్టాయని, ప్రస్తుతం వీటిపైన ఎలాంటి లాభాలు లేకపోయినా నష్టాలు తగ్గడమే తమకు పెద్ద ఊరట అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’ తో పేర్కొన్నారు. టీ–24 టిక్కెట్లతో పెరిగిన ఆదరణ... కేవలం రూ.160 తో 24 గంటల పాటు నగరంలో ఎక్కడి నుంచి ఎక్కడి వరకైనా అన్ని రకాల బస్సుల్లో పయాణించేందుకు ఆర్టీసీ ఇటీవల టీ–24 ( ట్రావెల్ 24 గంటలు) అనే ప్రత్యేక పథకాన్ని ప్రవేశపెట్టింది. మొదట్లో ప్రతి రోజు 500 నుంచి 600 వరకు విక్రయించిన ఈ టిక్కెట్లు 2 నెలలుగా ప్రతి రోజు 2000 వరకు పెరిగాయి. ఈ టిక్కెట్లపైన ఏసీ బస్సుల్లో కూడా పయనించేందుకు అవకాశం ఉండడంతో ఆక్యుపెన్సీ అనూహ్యంగా పెరిగింది. ఏసీ బస్సుల్లో మార్చి నెలలో 53 శాతం ఆక్యుపెన్సీ నమోదు కాగా ప్రస్తుతం అది 63 శాతానికి పెరిగింది. ఆదాయం కూడా పెరిగింది. మార్చిలో మెట్రో లగ్జరీ బస్సుల్లో ఒక్కో బస్సుపైన సగటున రూ.12000 వరకు లభించగా, ఇప్పుడు ఏకంగా రూ.15000 ఆదాయం లభిస్తోంది. ఇలా మొత్తం 80 ఏసీ బస్సులపైన ఈ నెల రోజుల్లో సుమారు రూ.3.6 కోట్ల వరకు లభించినట్లు అంచనా. ఈ ఆదరణ ఇలాగే ఉంటే ఏసీ బస్సులపైన నష్టాలను పూర్తిస్థాయిలో అధిగమించేందుకు ఎంతో కాలం పట్టకపోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ బస్సులు నగరంలోని పలు ప్రధాన ప్రాంతాల నుంచి ఐటీకారిడార్‌లకు రాకపోకలు సాగిస్తున్నాయి. దిల్సుఖ్నగర్–పటాన్చెరు, ఈసీఐఎల్–వేవ్‌రాక్ (17హెచ్/10 డబ్ల్యూ), ఉప్పల్–వేవ్‌రాక్ (113ఎం/డబ్ల్యూ), కోఠీ–పటాన్చెరు (222,తదితర రూట్లలో ఈ బస్సులు అందుబాటులో ఉన్నాయి. -
ఏసీ బస్సు.. గిరాకీ తుస్సు!
►ఏసీ బస్సులకు ఆదరణ అంతంతే.. ►సగటు ఆక్యూపెన్సీ 38–40 మాత్రమే ►నష్టాల్లో నడుస్తున్న పుష్పక్ ►మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులదీ అదే పరిస్థితి సిటీబ్యూరో: ఎండలు మండుతున్నా ఏసీ బస్సులు మాత్రం ప్రయాణికుల ఆదరణకు నోచుకోవడం లేదు. నగరంలోని వివిధ ప్రాంతాల మధ్య నడుస్తున్న ఏసీ బస్సులు, ఎయిర్‌పోర్టుకు తిరిగే పుష్పక్ బస్సుల్లో సైతం ఆక్యూపెన్సీ అంతంత మాత్రంగానే ఉంది. సాధారణంగా వేసవిలో ప్రయాణికులు మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ బస్సుల నుంచి ఏసీ బస్సుల వైపు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పటి వరకు అలాంటి ఆదరణ కనిపించడం లేదు. అన్ని బస్సుల్లోనూ సగటు ఆక్యూపెన్సీ శాతం 38–40 వరకే నమోదవుతోంది. వివిధ ప్రాంతాల నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సులు, హైటెక్ సిటీ, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ప్రాంతాల్లోని సాఫ్ట్వేర్ ఉద్యోగుల సౌకర్యార్థం ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ ఓల్వో బస్సులు సైతం అదే బాటలో నడుస్తున్నాయి. ఈ బస్సులను ప్రవేశపెట్టినప్పటి నుంచీ వరుస నష్టాలే చవిచూస్తున్నాయి. మరోవైపు వేసవి అవసరాలకు అనుగుణంగా ప్రయాణికుల రద్దీ, అభిరుచి మేరకు బస్సుల నిర్వహణలో తగిన మార్పులు చేర్పులు చేయకపోవడం లాంటి అంశాలు నిరాదరణకు కారణమవుతున్నాయి. ప్రారంభం నుంచీ నష్టాలే.. అంతర్జాతీయ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సులపై మొదటి నుంచి నష్టాలే వస్తున్నాయి. వీటి నిర్వహణకు కిలోమీటర్‌కు రూ.68 చొప్పున ఖర్చు చేస్తున్నారు. కానీ ఆదాయం మాత్రం రూ.44.62 – రూ. రూ.52 మధ్య మాత్రమే ఉంది. గతంలో దారుణమైన నష్టాలను చవిచూసిన ఎయిరో ఎక్స్‌ప్రెస్ బస్సుల నుంచి ఎలాంటి పాఠాలు నేర్వకుండానే ప్రవేశపెట్టిన 36 పుష్పక్ బస్సులు ఆర్టీసీ పాలిట గుదిబండగా మారాయి. హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ను పెంచే లక్ష్యంతో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మెట్రో లగ్జరీ బస్సులు కూడా పెద్దగా ఆదరణ పొందడం లేదు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం, అన్ని సదుపాయాలతో రూపొందించిన ఈ బస్సులు సాఫ్ట్వేర్ వర్గాలను సైతం ఆకట్టుకోలేకపోతున్నాయి. ఎలాంటి లాభనష్టాలు లేకుండా ఈ బస్సులను నడపాలంటే కిలోమీటర్‌కు కనీసం రూ.64 లభించాలి. కానీ ప్రస్తుతం వీటిపైనా రూ.43 కంటే ఎక్కువ రావడం లేదు. నగరంలో రద్దీ ఎక్కువగా ఉండే దిల్సుఖ్నగర్ – పటాన్చెరు, ఈసీఐఎల్ – వేవ్‌రాక్, ఉప్పల్ – వేవ్‌రాక్, కోఠి – పటాన్చెరు తదితర మార్గాల్లో ఈ బస్సులు నడుస్తున్నాయి. ప్రణాళిక లోపం... నగరంలో ఏసీ బస్సులకు ఆదరణ లభించకపోవడంతో కొన్నింటిని జూబ్లీ బస్‌స్టేషన్ నుంచి యాదాద్రి వరకు నడుపుతున్నారు. ముఖ్యంగా వారాంతాల్లో ఈ బస్సులు తిరుగుతున్నాయి. కానీ ఈ మార్గంలోనూ ప్రయాణికులు ఎక్కువగా జిల్లా బస్సుల్లోనే రాకపోకలు సాగిస్తున్నారు. ఏసీ బస్సుల్లో చార్జీలు చాలా ఎక్కువగా ఉండడం వల్లే ప్రయాణికులు వాటిలో ప్రయాణించేందుకు వెనకడుగు వేస్తున్నారు. కనిష్టంగా రూ.15 నుంచి గరిష్టంగా రూ.120 వరకు చార్జీలున్నాయి. ఇవి ఆర్డినరీ, మెట్రో బస్సుల చార్జీలతో పోల్చుకుంటే రెట్టింపు కన్నా ఎక్కువ. కొన్ని సాఫ్ట్వేర్ జోన్లలో తప్ప సాధారణ ప్రయాణికులు మాత్రం పెద్దగా వీటి జోలికి వెళ్లడం లేదు. మరోవైపు వేసవి రద్దీకి అనుగుణంగా ఎప్పటికప్పుడు ప్రణాళికలను రూపొందించుకొని బస్సులు నడపడంలో ఆర్టీసీ అధికారులు శ్రద్ధ చూపడం లేదు. ప్రణాళిక లోపంతోనే ఏళ్లు గడిచినా ఈ బస్సులు నష్టాల్లో నడుస్తున్నాయి. -
పాతబస్తీకి ఏసీ బస్సులు నడపాలి: అసదుద్దీన్
హైదరాబాద్: హైదరాబాద్ పాత బస్తీకి ఏసీ బస్సులను నడపాలని ఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ టీఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్‌కు లేఖ రాశారు. పాతబస్తీలోని చార్మినార్, మక్కామసీదు, ఖిల్వత్, చౌ మొహల్లా ప్యాలెస్, ఫలక్‌నుమా ప్యాలెస్, సాలార్ జంగ్ మ్యూజియం, హైకోర్టు , మదీనా, అఫ్జల్‌గంజ్ తదితర ప్రాంతాల్లో అనేక చారిత్రక కట్టడాలను సందర్శించేందుకు దేశ, విదేశాల నుంచి సందర్శకులు పెద్ద ఎత్తున వస్తుంటారని గుర్తు చేశారు. స్ధానికులతో పాటు పర్యాటకులకు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారని లేఖలో పేర్కొన్నారు. రాబోవు వేసవిని దృష్టిలో పెట్టుకొని ఏసీ బస్సులను నడపాలని అసదుద్దీన్ ఒవైసీ విజ్ఞప్తి చేశారు. -
వెంకన్న సన్నిధికి ఇంకో రైలు
తాడేపల్లిగూడెం : తిరుమలేశుడిని దర్శించుకునే భక్తుల కోసం ప్రధాన రైలు మార్గంలో నూతన సంవత్సర కానుకగా మరో కొత్త రైలు అందుబాటులోకి రాబోతోంది. ఇక నుంచి డబుల్ డెక్కర్ రైలులో ఏసీ బోగీల్లో తిరుపతి వెళ్లే అవకాశం కలగనుంది. తిరుపతి–విశాఖపట్నం మ ధ్య శుక్రవారం నుంచి ఈ రైలు నడుస్తుంది. శుక్రవారం అర్ధరాత్రి 12.10 గంటలకు విశాఖపట్నం చేరుతుంది. ఇదే రైలు 31వ తేదీన అర్ధరాత్రి 10.25 గంటలకు విశాఖ నుంచి బయలుదేరి జనవరి 1న మధ్యాహ్నం తిరుపతి చేరుకుంటుంది. ప్రస్తుతానికి తాత్కాలిక నంబర్ కేటాయించారు. తిరుపతి నుంచి విశాఖ బయలుదేరే రైలుకు 02708, విశాఖ నుంచి తిరుపతి బయలుదేరే రైలుకు 02707 నంబరు ఇచ్చారు. జిల్లాలోని ఏలూరు, తాడేపల్లిగూడెం స్టేషన్లలో దీనికి హాల్ట్ కల్పించారు. న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ మీదుగా ఈ రైలు వెళుతుంది. వారానికి మూడుసార్లు జనవరి 1వ తేదీ నుంచి వారానికి మూడుసార్లు తిరుపతి నుంచి విశాఖకు ఆది, బుధ, శుక్ర వారాలలో బయలుదేరుతుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరే ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు. నెల్లూరు, ఒంగోలు, తెనాలి మీదుగా 3.50కు న్యూ గుంటూరు రైల్వే స్టేషన్ కు చేరుకుంటుంది. అక్కడి నుంచి విజయవాడ, ఏలూరు. తాడేపల్లిగూడెం. రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ మీదుగా విశాఖపట్టణానికి చేరుకుంటుంది. విశాఖ వైపు వెళ్లే రైలు తాడేపల్లిగూడెం స్టేషన్ కు ఉదయం 6.30కు వస్తుంది. తిరుపతి వెళ్లడానికి రాత్రి 10.25కు విశాఖ నుంచి బయలుదేరుతుంది. సోమ, గురు, శనివారాలలో తిరుపతి వెళుతుంది. తాడేపల్లిగూడెం స్టేషన్ కు అర్ధరాత్రి 2.03 గంటలకు చేరుకుంటుంది. ఇక్కడ 2 నిమిషాలు ఆగుతుంది. మరుసటి రోజున ఉదయం 11.35 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. అన్నీ ఏసీ బోగీలే.. ఈ డబుల్ డెక్కర్ రైలులో మొత్తం 10 బోగీలుం టాయి. అన్నీ ఏసీ బోగీలే. 8 చైర్‌కార్ కోచ్‌లు, రెండు పవర్ కార్ కోచ్‌లు ఉంటాయి. స్లీపర్ సదుపాయం ఉండదు. కూర్చుని మాత్రమే ప్రయాణం చేయాలి. తాడేపల్లిగూడెం నుంచి తిరుపతి వెళ్లాలంటే రూ.700 చెల్లించాలి. తిరుమల ఎక్స్‌ప్రెస్‌లో ఇక్కడి నుంచి స్లీపర్‌లో కోచ్‌లో ప్రయాణించడానికి రూ.350 మాత్రమే. తిరుగు ప్రయాణానికి మేలు జిల్లా వాసులు తిరుపతి నుంచి తిరుగు ప్రయాణం చేసేందుకు మాత్రమే ఈ రైలు ఉపయుక్తంగా ఉంటుంది. తిరుపతిలో రాత్రి 9.50కు బయలుదేరి.. మరునాడు ఉదయం 6.30 గంటలకు తాడేపల్లిగూడెం చేరుకుంటుంది. తిరుపతికి వెళ్లిన వారు కొండపైనుంచి కిందకు రావడానికి ఆలస్యమైతే.. తిరుమల ఎక్స్‌ప్రెస్ అప్పటికే బయలుదేరిపోతే ఈ రైలు ఉపయోగపడుతుంది. ఇది వేగంగా తిరుపతి చేరుకునే అవకాశం లేదు. గుంటూరు మీదుగా వెళ్లాల్సి ఉండటంతో ప్రయాణ సమయం ఎక్కువ. తెల్లారి 11గంటలు దాటాక తిరుపతి వెళుతుంది. భక్తులు ఈ రైలులో వెళ్లి వెంకన్నను దర్శించుకోవాలంటే ఒక రోజు ఇబ్బంది పడాల్సి వస్తుంది. సిఫార్సు లేఖలతో వెళ్లే వారు ఆ లేఖలను దర్శనానికి ముందురోజు మధ్యాహ్నం 12 గంటలలోగా ఎంబీసీ–34లో ఇవ్వాలి. రైలు ఉదయం 11 గంటలు దాటాక తిరుపతి చేరుకుంటే అక్కడి నుంచి బస్సులో తిరుమలకు వెళ్లి లేఖలు ఇవ్వాలంటే కుదరని పని. రైలు సేవలు ప్రారంభమయ్యాక ఇలాంటి సమస్యలను, రైలు వేళల్లో మార్పులు చేసే అవకాశాలు ఉండొచ్చు. -
హైదరాబాద్ సిటీ ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై
-
75 ఏసీ బస్సుల్లో వైఫై
సాక్షి , హైదరాబాద్: సిటీ ఏసీ బస్సుల్లో 4జీ ఎరుుర్‌టెల్ వైఫై సదుపాయం అందుబాటులోకి వచ్చింది. కొంతకాలంగా ప్రయోగాలకే పరిమితమైన ఈ సదుపాయాన్ని ఎట్టకేలకు 75 బస్సుల్లో ఏర్పాటు చేశారు. బుధవారం బస్‌భవన్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, ఎండీ రమణారావు లాంఛనంగా ఈ సదుపాయాన్ని ప్రారంభించారు. ప్రయాణికుల స్పందన, డిమాండ్‌కు అనుగుణంగా దశల వారీగా రాష్ట్రవ్యాప్తంగా అన్ని ఏసీ, సూపర్ లగ్జరీ, ఎక్స్‌ప్రెస్ బస్సులకు సైతం వైఫై సదుపాయాన్ని విస్తరించనున్నట్లు సోమారపు తెలిపారు. మొదటి దశలో 75 సిటీ మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లో ప్రారంభించగా, రెండో దశలో 115 ఏసీ బస్సులకు అందుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. నోట్ల రద్దు వల్ల ఆర్టీసీ తీవ్ర నష్టానికి గురైందన్నారు. మొదట రోజుకు రూ.కోటి చొప్పున నష్టం వచ్చిందని, ఆ తరువాత క్రమంగా పరిస్థితి కొంత మేరకు మెరుగుపడిందని చెప్పారు. గో రూరల్ ఇండియా సంస్థ సహకారంతో ఫోర్ జీ వైఫై సదుపాయాన్ని ప్రవేశపెట్టినట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తం, ఆర్ఎం కొంరయ్య తదితరులు పాల్గొన్నారు. ఈ రూట్లలో వైఫై... ► ఎల్బీనగర్ - లింగంపల్లి (222ఎల్) రూట్లో 20 బస్సులు ► దిల్సుఖ్నగర్-లింగంపల్లి (218డి) రూట్లో 23 బస్సులు ► ఉప్పల్-లింగంపల్లి (113 కె/ఎల్) 10 బస్సులు ► ఉప్పల్-వేవ్‌రాక్ (113 ఎం/డబ్ల్యూ) 8 బస్సులు ► ఈసీఐఎల్-వేవ్‌రాక్ (17హెచ్) 14 బస్సులు వినియోగం ఇలా... ► బస్సులోకి ప్రవేశించగానే వైఫై సిగ్నళ్లు అందుతారుు. వినియోగదారులు వైఫై సేవలను పొందేందుకు మొబైల్లో ఎంపిక చేసుకున్న వెంటనే ఒక పాస్వర్డ్ వస్తుంది. ► ఈ పాస్వర్డ్ ఆధారంగా ఎరుుర్‌టెల్ ఫోర్ జీ వైఫై సేవలను పొందవచ్చు. ► మొదటి 20 నిమిషాలు ఉచితం. ఎలాంటి రుసుము చెల్లించవలసిన అవసరం లేదు. ఆ సమయంలో తమకు కావలసిన డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ► ఆ తరువాత ఆన్లైన్ పేమెంట్ ద్వారా రూ.25 చెల్లించి 100 ఎంబీ డాటా పొందవచ్చు. దీనిని 24 గంటల పాటు వినియోగించుకొనే సదుపాయం ఉంటుంది. -
ఏసీ బస్సుల్లో వైఫై ప్రారంభం
హైదరాబాద్: గ్రేటర్ పరిధిలో ఆర్టీసీ ప్రయాణికులకు శుభవార్త. ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై అందుబాటులోకి వచ్చింది. నగరంలో తిరిగే ఏసీ బస్సుల్లో ఇక నుంచి అరగంటపాటు ఉచిత వైఫై వాడుకునే అవకాశం కల్పించారు. ఏసీ బస్సుల్లో 4జీ వైఫై సౌకర్యాన్ని సంస్థ చైర్మన్ సోమవారపు సత్యనారాయణ, ఎండీ రమణారావులు బుధవారం ప్రారంభించారు. ఈ బస్సుల్లో మొదటి 20 నిమిషాలు ఉచితంగా వైఫై వినియోగించుకోవచ్చని, ఆ తరువాత అరగంటకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. దశల వారీగా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని బస్సుల్లో ప్రవేశపెడతామని చైర్మన్ తెలిపారు. మొదటి విడతలో 115 ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై సౌకర్యం కల్పించారు. కాగా, పెద్ద నోట్ల రద్దుతో చిల్లర లేక ప్రజలు బస్సులు ఎక్కడం తగ్గిందని, దాంతో ఆర్టీసీ రోజుకు రూ. 60 లక్షల ఆదాయం కోల్పోతున్నట్లు ఆయన తెలిపారు. -
జిల్లాకు ఏసీ బస్సులు
బనగానపల్లె : జిల్లా నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రధాన రూట్లల్లో ప్రయాణీకుల సౌకర్యార్థం ఏసీ బస్సు సర్వీసులు నడుపుతామని ఆర్టీసీ రీజనల్ మేనేజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. బనగానపల్లె డిపో ప్రాంగణంలో గురువారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. హైదరాబాద్–బెంగళూరు, కర్నూలు– బెంగళూరు, నంద్యాల– బెంగళూరు, డోన్– విజయవాడ, శ్రీశైలం– బెంగళూరు సర్వీసులకు ప్రతిపాదనలు పంపినట్లు తెలిపారు. ఉన్నతాధికారుల నుంచి అనుమతిరాగానే ఏసీ బస్సులు నడుపుతామన్నారు. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ చివరి వరకు జిల్లాలో ఆర్టీసీకి రూ.45కోట్ల నష్టం వచ్చిందన్నారు. ఇందులో బనగానపల్లె డిపో నష్టం రూ.4.5కోట్ల వరకు ఉందన్నారు. స్థానిక ఆర్టీసీ డిపోకు 3 కొత్త బస్సులు పంపామని, మరిన్ని బస్సులను కూడా పంపుతామని తెలిపారు. అంతకుముందు ఆర్ఎం డిపో మేనేజర్ శశిభూషణ్‌తో కలిసి బస్టాండ్ ప్రాంగణంలో నిర్మిస్తున్న దుకాణాల సముదాయం, బస్టాండ్‌లో వసతులను పరిశీలించారు. గ్యారేజి ప్రాంగణంలో మొక్కలు నాటారు. -
ఏసీ బస్సుల్లో వైఫై..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలోని 5 మార్గాల్లో తిరిగే 115 ఏసీ బస్సుల్లో వైఫై సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ పురుషోత్తమ్ తెలిపారు. ఈ సౌకర్యం అక్టోబర్ 1 నుంచి అందుబాటులోకి వస్తుందన్నారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. గో గ్రీన్ అనే స్వచ్ఛంద సంస్థ ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తేనుందన్నారు. దిల్సుఖ్నగర్–లింగంపల్లి, కుషాయిగూడ–వేవ్‌రాక్, ఉప్పల్–వేవ్‌రాక్, ఎల్బీనగర్–పటాన్చెరు, ఉప్పల్–లింగంపల్లి మార్గాల్లో నడిచే ఏసీ బస్సుల్లో వైఫై అమల్లోకి రానుందన్నారు. ఈ బస్సుల్లో మొదటి 20 నిమిషాలు ఉచితంగా వైఫై వినియోగించుకోవచ్చని, ఆ తరువాత అరగంటకు చార్జీ చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఒకవేళ ప్రయాణికులు తమ ఇంట్లో వైఫై సదుపాయం ఉంటే ఆ పాస్‌వర్డ్‌పై బస్సుల్లో ఎంతసేపైనా ఉచితంగా వినియోగించుకునే వెసులుబాటు ఉందని వివరిచారు. కొత్త రూట్లకు బస్సుల విస్తరణ సిటీ బస్సులను కొత్త రూట్లలో విస్తరించేందుకు ఆర్టీసీ చర్యలు చేపట్టింది. గత ఏడాది కాలంగా నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఆర్టీసీ ఆఫీసర్’ కార్యక్రమంలోప్రయాణికుల నుంచి అందిన సలహాలు, సూచనల ఆధారంగా రిసాలాబజార్–గచ్చిబౌలి (5ఆర్జీ) రూట్లో నాలుగు మెట్రో డీలక్స్ బస్సులను నడుపుతారు. వనస్థలిపురం ఎన్జీవోస్ కాలనీ నుంచి కేపీహెచ్‌బీ (186 రూట్) వరకు మరో 8 బస్సులు తిరుగుతాయి. ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్ నుంచి గచ్చిబౌలి (6ఎల్జీ) రూట్‌ను కొత్తగా పరిచయం చేయనున్నారు. ఈ రూట్లో కొన్ని లాలాపేట్ మీదుగా, మరికొన్ని నాచారం మీదుగా గచ్చిబౌలికి రాకపోకలు సాగిస్తాయి. ఇవి కాకుండా మరో 21 సిటీ ఆర్డినరీ బస్సులను పలు మార్గాల్లో నడిపేందుకు అధికారులు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. -
తిరుపతి - హౌరా ఏసీ ప్రత్యేక రైలు
- అక్టోబర్ 5 నుంచి ప్రారంభం తిరుపతి : దసరా పండుగను పురస్కరించుకుని తిరుపతి నుంచి విజయవాడ మీదుగా హౌరా(కోల్‌కతా) వరకు పూర్తిస్థాయి ఏసీ ప్రత్యేక వారాంతపు రైలును నడపనున్నట్లు తిరుపతి చీఫ్ రిజర్వేషన్ ఇన్స్పెక్టర్(సీఆర్ఐ) ఎ.ఏలియా ఆదివారం 'సాక్షి' కి తెలిపారు. 02858 నెంబరు గల ఈ రైలు అక్టోబర్-5 నుంచి ప్రారంభమై నవంబర్-16వ తేదీ వరకు నడుస్తుందన్నారు. ప్రయాణికుల రద్దీని పరిగణనలోకి తీసుకుని ఈ రైలును కొనసాగించే అవకాశం ఉంటుందని తెలిపారు. సెలవులు, తిరుమల బ్రహ్మోత్సవాల నేపథ్యంలో రాష్ట్రంలోని విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం తదితర ప్రాంతాల నుంచి తిరుపతికి రావడానికి ఏర్పడే విపరీతమైన రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ ఏసీ రైలును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ రైలు రేణిగుంట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, విజయవాడల మీదుగా హౌరా వరకు నడుస్తుందన్నారు. ప్రతి బుధవారం మధ్యాహ్నం 3:55 గంటలకు తిరుపతిలో బయల్దేరి అదేరోజు రాత్రి 10:05 గంటలకు విజయవాడ, మరుసటి రోజు ఉదయం 6:30 గంటలకు హౌరాకు చేరుకుంటుందన్నారు. రైలులో మొత్తం 14 థర్డ్‌క్లాస్ ఏసీ బోగీలుంటాయన్నారు. తిరుపతి నుంచి విజయవాడ వరకు టికెట్ ధర రూ.1,070 గా అధికారులు నిర్ణయించారని పేర్కొన్నారు. కాగా తిరుగు ప్రయాణంలో 02855 నెంబరుతో అక్టోబర్ 4వ తేదీ నుంచి నవంబర్ 15వ తేదీ వరకు ప్రతి మంగళవారం మధ్యాహ్నం 12:40 గంటలకు హౌరాలో బయల్దేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2:30 గంటలకు తిరుపతికి చేరుకుంటుందన్నారు. ఈ రైలుకు సోమవారం నుంచి రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని చెప్పారు. -
ఆర్టీసీ డ్రైవర్.. ‘ది గైడ్’..!
- కొత్త ఏసీ మినీ బస్సుల్లో టీఎస్ఆర్టీసీ వినూత్న ప్రయోగం - బస్సు వెళ్లే ప్రాంతాల ప్రత్యేకతలను స్పీకర్ ద్వారా వివరించనున్న డ్రైవర్లు - హైదరాబాద్-వరంగల్ -నిజామాబాద్ మధ్య మినీ బస్సుల సంచారం - విషయ పరిజ్ఞానం ఉన్న డ్రైవర్లను గుర్తించి శిక్షణ ఇస్తున్న ఆర్టీసీ సాక్షి, హైదరాబాద్: ‘ఇది హుస్సేన్‌సాగర్.. భాగ్యనగర నిర్మాణంతోనే రూపుదిద్దుకున్న ఈ చెరువు నగరానికి తొలి మంచినీటి వనరు.. ఆ తర్వాత సాగునీటికీ వినియోగించారు.. ప్రస్తుతం ఇలా ఉంది..’ ‘ఇది ఏకశిలా నగరం.. ఇప్పుడు మనం వరంగల్ అంటున్నాం. కాకతీయుల పరాక్రమానికి నిలువుటద్దమిది. తెలంగాణలో రాజధాని తర్వాత పెద్ద నగరం’ ఇవన్నీ ఆర్టీసీ బస్సులో ప్రయాణికులకు స్పీకర్ల ద్వారా వినిపిస్తున్న విశేషాలు. ఆయా ప్రాం తాల చారిత్రక, ప్రస్తుత అంశాల సమాహారం. ఇది రికార్డు చేసింది కాదు, బస్సు నడుపుతున్న డ్రైవర్ స్వయంగా స్పీకర్లో అప్పటికప్పుడు చెప్పే మాటలవి. బస్సు ఏయే ప్రాంతాల మీదుగా సాగుతుందో, ఆయా ప్రాంతాల ప్రత్యేకతలను ఇలా వినిపిస్తుంటాడు. అంటే.. ఇదేదో టూరిస్టు బస్సు ప్రత్యేకత అనుకోకండి. తెలంగాణ ఆర్టీసీ చేస్తున్న వినూత్న ప్రయోగం. ప్రయోగాత్మక పరిశీలన.. తెలంగాణ ఆర్టీసీ కొత్తగా మినీ బస్సులను రోడ్లపైకి తెస్తోంది. ఇందులో ప్రయోగాత్మకంగా వంద ఏసీ బస్సులు నడపబోతోంది. ఇవి హైదరాబాద్-వరంగల్, హైదరాబాద్-నిజామాబాద్ మధ్య నడుస్తాయి. ప్రయాణికులు మొబైల్ యాప్ ద్వారా అప్పటికప్పుడు కూడా వీటిల్లో సీట్లు బుక్ చేసుకునే వెసులుబాటు ఉంది. వీటికి సాధారణ బస్సుల్లాగా నిర్ణీత మార్గం అంటూ ఉండవు. ప్రయాణికులు ఏయే ప్రాంతాల్లో ఎక్కుతారో బస్సు ఆయా ప్రాం తాల మీదుగా నడుస్తుంది. ఎక్కువ మంది ప్రయాణికులు ఒకేచోట ఉంటే నేరుగా వారి ఇళ్లకు చేరువగా కూడా వెళ్తుంది. ఇది ఇప్పటికి మదిలో ఉన్న ఆలోచన. ట్రాఫిక్ చిక్కులు, ప్రయాణ సమయం, ఇతర ప్రయాణికుల నుంచి వచ్చే వ్యతిరేకత.. తదితరాల ఆధారంగా దీన్ని యథాతథంగా అమలు చేయటం అసాధ్యమనే భావన అధికారుల్లో ఉన్నప్పటికీ, ముఖ్యమంత్రి స్వయంగా ఈ ఆలోచనను ఆర్టీసీ దృష్టికి తేవడంతో దాన్ని ఎలాగైనా ఆచరణలోకి తెచ్చి ప్రయోగాత్మకంగా పరిశీలించాలని ఆర్టీసీ నిర్ణయించింది. మారుమూల గ్రామాలకు మినీ బస్సులు ఇక మరో వంద నాన్ ఏసీ మినీ బస్సులను మారుమూల గ్రామాలకు నడపనున్నారు. రోడ్డు వసతి సరిగ్గా లేకపోవటం, ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండటం, ఇతర కారణాలతో చాలా గ్రామాలకు బస్సులు వెళ్లటం లేదు. దీంతో వాటికి మినీ బస్సులు నడపాలని నిర్ణయించారు. ఈ ప్రయోగం అనుకూల ఫలితాలనిస్తే క్రమంగా బస్సుల సంఖ్యను పెంచుతారు. డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ.. ఈ బస్సు డ్రైవర్లకు ‘గైడ్’ తరహా శిక్షణ ఇవ్వాలని నిర్ణయించారు. హైదరాబాద్, నిజామాబాద్, వరంగల్ నగరాలకు సంబంధించిన ప్రత్యేకతలపై వారికి అవగాహన కల్పించనున్నారు. బస్సు బయలుదేరిన తర్వాత ఆయా ప్రాంతాల మీదుగా వెళ్తున్నప్పుడు డ్రైవర్లు వాటి ప్రత్యేకతలను వివరిస్తారు. ఆ మాటలు బస్సులోని స్పీకర్ల ద్వారా ప్రయాణికుల చెవినపడతాయి. తెలుగు, ఇంగ్లిష్, హిందీల్లో వాటిని వివరించేలా డ్రైవర్లకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. ఇందుకోసం కనీసం పదో తరగతి ఉత్తీర్ణులై, కాస్త భాషా పటుత్వం, విషయ పరిజ్ఞానం ఉన్న డ్రైవర్లను గుర్తించారు. దసరా నుంచి ఈ బస్సులను అందుబాటులోకి తేవాలని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ఇప్పటికే కొత్త బస్సులకు ఆర్డర్ ఇచ్చారు. -
చార్జీల మోత
♦ జిల్లా ప్రజలపై నెలవారీ భారం 3.25 కోట్లు! ♦ ‘పల్లె వెలుగు’లో 30 కి.మీ.లకు రూ.1 పెంపు ♦ డీలక్స్, ఏసీ బస్సుల్లో 10 శాతం పెరుగుదల ♦ బస్సు పాసులపైనా పడనున్న ప్రభావం జిల్లాలో పట్టణ ప్రాంత డిపోలు 11. వీటి పరిధిలో 1,250పైగా సర్వీసులున్నాయి. ప్రస్తుతం ఈ డిపోల నుంచి రోజువారీ ఆదాయం సగటున రూ.2.5 లక్షలు. గ్రామీణ ప్రాంతంలో ఆరు డిపోలున్నాయి. ఈ డిపోలకు అనుసంధానంగా 750 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. వీటి పరిధిలో రోజువారీ ఆదాయం రూ.75లక్షలు. మొత్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రయాణికులపై నెలకు రూ.3.25 కోట్ల భారం పడనుంది. అదేవిధంగా చార్జీల పెంపు ఆధారంగా నెలవారీ బస్పాసుల రుసుము సైతం పెరగనుంది. ప్రగతి రథంలో ప్రయాణం మరింత భారంకానుంది. రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ చార్జీల మోత మోగించింది. నష్టాలను సాకుగా చూపుతూ సగటు ప్రయాణికుడిపై ఆర్థిక భారాన్ని మోపింది. దాదాపు రెండున్నరేళ్ల విరామం తర్వాత ఆర్టీసీ ప్రయాణ చార్జీలు పెంచింది. పెరిగిన బస్ చార్జీలు ఈనెల 27నుంచి అమలు చేయనున్నట్లు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి గురువారం ప్రకటించారు. డీలక్స్, ఏసీ బస్సు చార్జీలపై పది శాతం, పల్లెవెలుగు బస్సుల్లో ప్రతి 30 కి.మీ.కు రూ.1 చార్జీ పెరుగుతుందన్నారు. సిటీ బస్సుల్లో మాత్రం స్టేజీల వారీగా చార్జీలు పెరుగుతాయి. ప్రతి టిక్కెట్ల్లపైనా ధరలను హెచ్చించడంతో ఈ ప్రభావం అన్నివర్గాలపైనా పడనుంది. - సాక్షి, రంగారెడ్డి జిల్లా సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో ఆరు గ్రామీణ బస్ డిపోలున్నాయి. తాండూరు, వికారాబాద్, పరిగి, హైదరాబాద్ 1, హైదరాబాద్ 2, పికెట్ డిపోల పరిధిలో 750 బస్సులు ప్రయాణికులకు సేవలందిస్తున్నాయి. రైల్వే లైన్లు అన్ని ప్రాంతాలకు లేకపోవడం.. సమయానుకూలంగా రైళ్లు లేనందున బస్సు ప్రయాణాన్నే నమ్ముకునే వారు ఎక్కువ. కేవలం హైదరాబాద్ నగరంవైపు కాకుండా అటు పూణే, ముంబై ప్రాంతాలకు వెళ్లే బస్సులు సైతం గ్రామీణ డిపోల్లో ఉన్నాయి. ఈ క్రమంలో ఆరు డిపోల పరిధిలో రోజువారీ ఆదాయం రూ.75లక్షలకు పైమాటే. తాజాగా చార్జీలను పది శాతం వరకు పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో నెలకు సగటున రూ.2.25 కోట్ల భారం(కేవలం రూరల్ పరిధిలో) ప్రయాణికులపై పడనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి. అయితే క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటివరకు సమాచారం అందలేదు. దీంతో పెంపుపై ఆర్టీసీ వర్గాల్లో ఉత్కంఠ కొనసాగుతోంది. పట్టణ డిపోల్లో ‘ప్రత్యేకం’ గ్రామీణ ప్రాంతానికి సంబంధించి ఆరు గ్రామీణ డిపోలు మినహాయిస్తే మిగతా 11 డిపోలు పట్టణ ప్రాంతానికి చెందినవే. ఇబ్రహీంపట్నం, మహేశ్వరం, హయత్‌నగర్ 1, హయత్‌నగర్ 2, ఉప్పల్, చెంగిచెర్ల, మేడ్చల్, హకీంపేట్, జీడిమెట్ల, కూకట్పల్లి, రాజేంద్రనగర్ డిపోల పరిధిలో 1,250పైగా సర్వీసులున్నాయి. వీటిద్వారా నిత్యం రెండు లక్షల మంది గమ్యస్థానాలకు చేరుతున్నారు. ఈ డిపోల్లో రోజువారీ ఆదాయం సగటున రూ.2.5 లక్షలు. ప్రభుత్వం ప్రకటించిన చార్జీలకు భిన్నంగా సిటీబస్ చార్జీలు పెరిగే అవకాశం ఉంది. స్టేజీల సంఖ్యను బట్టి వీటి చార్జీలు పెరగనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొత్తంగా శుక్రవారం సాయంత్రానికి సిటీ బస్సు చార్జీల పెంపుపై స్పష్టత రానుంది. మొత్తంగా సిటీ డిపోల పరిధిలో నెలవారీగా ప్రయాణికులపై రూ.కోటి వరకు భారం పడనుంది. మొత్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ప్రయాణికులపై నెలకు రూ.3.25 కోట్ల భారం పడనుంది. అదేవిధంగా చార్జీల పెంపు ఆధారంగా నెలవారీ బస్పాసుల రుసుము సైతం పెరగనుంది. -
ఏసీ బస్సుల్లో ఫ్రీ వైఫై
- నెలాఖరుకు గ్రేటర్‌లోని 115 బస్సుల్లో అందుబాటులోకి - అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ 4జీ నెట్వర్క్ - రెండు విడతలుగా గంట పాటు ఉచిత ఇంటర్నెట్ - రెండు రూట్లలో ఆర్టీసీ పైలట్ ప్రాజెక్ట్ విజయవంతం సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(ఆర్టీసీ)కి చెందిన ఏసీ బస్సుల్లో పయనిస్తున్నారా.. అయితే ఇకపై మీరు వైఫై ద్వారా ఉచితంగా ఇంటర్నెట్ను పొందవచ్చు. గంట పాటు ఉచితంగా ఇంటర్నెట్ను వినియోగించుకునే అద్భుతమైన అవకాశాన్ని ఆర్టీసీ మీకు కల్పించనుంది. అత్యధిక సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ 4జీ నెట్‌వర్క్‌తో కావలసిన డాటా డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇప్పటి వరకు మహాత్మాగాంధీ, జూబ్లీ బస్ స్టేషన్లలో మాత్రమే ఉచిత వైఫై సదుపాయాన్ని కల్పించిన ఆర్టీసీ.. నగరంలో తిరుగుతున్న 115 ఏసీ బస్సులకు సైతం ఆ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించేందుకు చర్యలు చేపట్టింది. ఇప్పటికే జూబ్లీ బస్ స్టేషన్ నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టు వరకు, ఈసీఐఎల్ నుంచి వేవ్‌రాక్ వరకు నడిచే రెండు ఏసీ బస్సుల్లో దీనిని పైలట్ ప్రాజెక్టుగా చేపట్టగా విజయవంతమైంది. ఈ నేపథ్యంలో నగరంలోని ఏసీ బస్సులన్నింటికీ ఈ నెలాఖరు నాటికి ఉచిత వైఫై సదుపాయాన్ని అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. స్మార్ట్ఫోన్లు వినియోగించే ప్రయాణికులు ఏసీ బస్సులో ప్రయాణించే సమయంలో అరగంట చొప్పున రెండు విడతలుగా 4జీ నెట్వర్క్ సామర్థ్యం ఉన్న ఎయిర్టెల్ ఇంటర్నెట్ను ఉచితంగా వినియోగించుకోవచ్చు. ఇందుకోసం బస్సుల్లో వైఫై రూటర్లను అమర్చనున్నారు. ప్రయాణికులు బస్సులోకి ప్రవేశించిన వెంటనే తమ స్మార్ట్‌ఫోన్‌లో వైఫై సిగ్నల్స్‌ను అందుకుంటారు. వైఫై సేవలను వినియోగించుకునేందుకు సిద్ధపడిన వారికి పాస్వర్డ్ డిస్ప్లే అవుతుంది. మొదటి అరగంట ఉచితంగా నెట్వర్క్ అందుబాటులోకి వస్తుంది. ఆ తర్వాత ఇంటర్నెట్ సేవలు ఆగిపోతాయి. మరో అరగంట కావాలనుకుంటే మరోసారి వైఫై నెట్వర్క్ ఓపెన్ చేయాలి లేదా తిరుగు ప్రయాణంలో మిగతా అరగంట వినియోగించుకోవచ్చు. ఐటీ వర్గాలకు ప్రయోజనం.. నగరంలోని ఉప్పల్, మెహదీపట్నం, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, కోఠి, పటాన్చెరు, లింగంపల్లి, ఈసీఐఎల్, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల నుంచి హైటెక్‌సిటీ, వేవ్‌రాక్, గచ్చిబౌలి, మాదాపూర్, కొండాపూర్ తదితర ఐటీ కారిడార్లకు మెట్రో లగ్జరీ ఏసీ బస్సులు నిత్యం రాకపోకలు సాగిస్తున్నాయి. అలాగే సికింద్రాబాద్, జూబ్లీ బస్ స్టేషన్, జేఎన్టీయూ, పర్యాటక భవన్ల నుంచి శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు పుష్పక్ ఏసీ బస్సులు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ రెండు కేటగిరీల్లోని 115 ఏసీ బస్సులకు ఈ ఉచిత వైఫైను అమలు చేస్తారు. దీనివల్ల నిత్యం బస్సుల్లో రాకపోకలు సాగించే ఐటీ నిపుణులకు ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. -
బస్సుల కొనుగోలులో అక్రమాలు జరగలేదు
సాక్షి, హైదరాబాద్: ఏసీ వోల్వో బస్సుల కొనుగోలులో ఎలాంటి అక్రమాలు జరగలేదని ఆర్టీసీ ప్రకటించింది. ఏసీ బస్సుల కొనుగోలు ఒప్పందంలో అక్రమాలు జరిగాయంటూ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఆరోపించిన విషయం తెలిసిందే. టీఎస్ఆర్టీసీ ఒక్కో బస్సుకు దాదాపు రూ.5 లక్షల వరకు అదనంగా చెల్లించినట్టు ఆయన ఆరోపించారు. ఈ నేపథ్యంలో దీన్ని ఖండిస్తూ ఆర్టీసీ ఈడీ రవీందర్ ఓ ప్రకటన జారీ చేశారు. గత జనవరిలో 10 ఏసీ బస్సుల కోసం టెండర్లు పిలవగా వోల్వో, స్కానియా కంపెనీలు స్పందించాయని, స్కానియా కంపెనీ రూ.1,08,85,481, వోల్వో రూ.1,06,85,000 చొప్పున కోట్ చేశాయని తెలిపారు. చర్చల తర్వాత రెండు కంపెనీలు రూ.1,05,10,000, రూ.1,04,85,000 చొప్పున ఖరారు చేశాయని, దీంతో వోల్వో బస్సులు కొనేందుకు ఆర్డర్ ఇచ్చామని తెలిపారు. అంతకు ఆరు నెలల ముందు వోల్వో కంపెనీ ఏపీఎస్ ఆర్టీసీకి ఇంతకంటే తక్కువ ధరకే ఇచ్చినప్పటికీ, ఉత్పత్తి వ్యయం, ముడి సరుకుల ధరలు పెరిగాయంటూ ఆ ధరకు ఇచ్చేందుకు అంగీకరించలేదని తెలిపారు. స్కానియా కొత్త కంపెనీ అయినందున ఆ కంపెనీ బస్సుల పనితీరుపై ఇంకా స్పష్టత రాలేదని, వోల్వో బస్సుల పనితీరుపై చాలాకాలంగా అవగాహన ఉన్నందున దానివైపు మొగ్గుచూపామని తెలిపారు. -
ఆ ట్రైన్ టికెట్ ధర రూ. 3300
న్యూఢిల్లీ: అహ్మదాబాద్- ముంబై మధ్య ప్రవేశపెట్టనున్న బుల్లెట్ ట్రైన్ టికెట్ ధరలు, ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధరలతో పొల్చితే అరశాతం మాత్రమే ఎక్కువగా ఉండనున్నట్టు తమ ప్రతిపాదనలను రైల్వే మంత్రిత్వశాఖ పార్లమెంట్‌కు తెలిపింది. రైల్వే సహాయ మంత్రి మనోజ్ సిన్హా రాతపూర్వకంగా బుల్లెట్ ట్రైన్ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్‌కు బుధవారం తెలిపారు. 'మొదటి దశ బుల్లెట్ ట్రైన్ల గరిష్ట వేగాన్ని గంటకు 350 కిలో మీటర్లుగా, ఆపరేటింగ్ వేగాన్ని గంటకు 320 కిలో మీటర్లుగా నిర్ధారించారు. ఈ బుల్లెట్ ట్రైన్ ప్రయాణానికి 2.07 గంటల సమయం పడుతోంది. ప్రతి స్టేషన్లో స్టాప్ ఉంటే 2.58 గంటల సమయం పడుతుంది. ఢిల్లీ-నాగ్‌పూర్, న్యూ ఢిల్లీ- చెన్నై కారిడార్ల నిర్మాణ సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతుంది' అని తమ ప్రతిపాదనల వివరాలను పార్లమెంట్ కు రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపింది. దురంతో ఎక్స్‌ప్రెస్‌లో ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర అహ్మదాబాద్- ముంబైకి ప్రయాణించడానికి 2200 రూపాయలు ఖర్చు అవుతుంది. హై స్పీడ్ కారిడార్ గుండా బుల్లెట్ ట్రైన్లో ప్రయాణిస్తే రైల్వే మంత్రిత్వ శాఖనిర్ధారించిన టారిఫ్ ప్రకారం టికెట్ ధర రూ.3300 అవుతుంది. -
ఏసీ బస్సుల్లో వైఫై ఫ్రీ....
* దశలవారీగా మెట్రో ఎక్స్‌ప్రెస్‌లకు విస్తరణ * మొదటి అరగంట ఉచితం * రెండు రూట్లలో ప్రయోగాత్మకంగా అమలు సాక్షి, సిటీబ్యూరో: ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు త్వరలో వైఫై సదుపాయం అందుబాటులోకి రానుంది. గ్రేటర్ హైదరాబాద్‌లోని వివిధ రూట్లలో నడిచే 80 మెట్రో లగ్జరీ, శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి రాకపోకలు సాగించే 29 పుష్పక్ లతో కలిపి వందకు పైగా ఏసీ బస్సుల్లో వైఫై ఏర్పాటు చేయనున్నారు. ఇందుకోసం సికింద్రాబాద్ జూబ్లీబస్‌స్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు వరకు, ఉప్పల్ నుంచి వేవ్‌రాక్ వరకు 2 మార్గాల్లో త్వరలో ప్రయోగాత్మకంగా వైఫై సదుపాయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటీవ్ డెరైక్టర్ పురుషోత్తమ్ బుధవారం విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ రెండు మార్గాల్లోని ఫలితాలను పరిశీలించిన అనంతరం అన్ని ఏసీ బస్సులకు వైఫై సేవలను విస్తరిస్తారు. భవిష్యత్తులో మెట్రో డీలక్స్, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో కూడా ఈ సదుపాయాన్ని అం దుబాటులోకి తేనున్నట్లు చెప్పారు. మొదటి 30 నిమిషాలు ఉచితంగా ఉంటుంది. ఆ తరువాత చార్జీ చేస్తారు. ఈ మేరకు ‘గో రూరల్ ఇండియా’ అనే సంస్థతో ఆర్టీసీ తాజాగా ఒప్పందం ఏర్పాటు చేసుకుంది. ప్రస్తుతానికి మాత్రం ఏసీ బస్సుల్లోనే వైఫై సేవలు అందుబాటులోకి వస్తాయి. మహా త్మాగాంధీ, జూబ్లీబస్స్టేషన్లలో ఇప్పటికే వైఫై సేవలను ఏర్పాటు చేసిన ఆర్టీసీ అదే తరహాలో ప్రయాణికులను ఆకట్టుకొనే చర్యల్లో భాగంగా ఏసీ బస్సులకు సైతం విస్తరిం చేందుకు సన్నాహాలు చేపట్టింది. నగరంలోని వివిధ మార్గాల నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి నడుస్తున్న పుష్పక్ బస్సుల్లోనూ, మెట్రో లగ్జరీ ఏసీ బస్సుల్లోనూ ప్రయాణికుల ఆదరణ తక్కువగా ఉన్న దృష్ట్యా ప్రయాణికులను పెంచుకొనేందుకు గ్రేటర్ ఆర్టీసీ ఈ సరికొత్త పథకానికి శ్రీకారం చుట్టింది. పుష్పక్ బస్సుల్లో వెహికల్ ట్రాకింగ్... వైఫై సదుపాయంతో పాటు పుష్పక్ బస్సులన్నింటిలో ‘వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ’ ను అమ లు చేస్తారు. దీంతో పుష్పక్ బస్సుల కోసం ఎదురు చూసే ప్రయాణికులకు ముందస్తుగానే సమాచారం లభిస్తుంది. బస్టాపుల్లో ఏర్పాటు చేసిన డిస్‌ప్లేబోర్డులపై ఏ బస్సు ఎక్కడ ఉందనే సమాచారం ప్రద ర్శిస్తారు. అలాగే బస్సుల్లోనూ రాబోయే స్టేషన్ల ప్రదర్శనతో పాటు, అనౌన్స్మెంట్ కూడా ఉంటుంది.ప్రస్తుతం నగరంలోని 1200 మెట్రో డీలక్స్, ఏసీ బస్సుల్లో ఈ వెహికల్ ట్రాకింగ్, ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థ అమలవుతుంది. జాతీయ,అంతర్జాతీయ స్థాయి ప్రయాణికులను ఆకట్టుకోవడంతో పాటు, ఆదరణ పెంచుకొనే చర్యల్లో భాగంగా పుష్పక్ బస్సులన్నింటికీ ఈ వ్యవస్థను విస్తరించనున్నారు. అలాగే రూ.2.20 కోట్ల వ్య యంతో పుష్పక్ బస్సుల్లో సమూలమైన మార్పులు చేయనున్నట్లు ఈడీ తెలిపారు. బస్సు బాడీలను కొత్తగా ఏర్పాటు చేస్తారు. కలర్‌కోడ్ కూడా మారుతుంది. జూబ్లీబస్‌స్టేషన్, బీహెచ్ఈఎల్, జేఎన్టీయూ నుంచి 29 బస్సులు ప్రతిరోజు ఉదయం 3.30 గంటల నుంచి రాత్రి ఒంటిగంట వరకు రాకపోకలు సాగిస్తున్నాయి. ప్రయాణికులకు చేరువయ్యేందుకు.... * వెహికల్ ట్రాకింగ్,ప్యాసింజర్ ఇన్ఫర్మేషన్ వ్యవస్థలో భాగంగా ‘హైదరాబాద్ మెట్రో బస్’ మొబైల్ యాప్ ద్వారా * ఏ బస్సు ఎక్కడ ఉందో తెలుసుకొనే సదుపాయాన్ని ప్రవేశపెట్టనున్నారు. * హైదరాబాద్-బెంగళూర్ రూట్లో ‘ఫైండ్ టీఎస్ఆర్టీసీ’ పేరుతో ఈ యాప్ అందుబాటులోకి రానుంది. * 2010-2015 మధ్య కాలంలో జెఎన్ఎన్యూఆర్ఎం పథకంలో భాగంగా కొనుగోలు చేసిన 650 బస్సులను సమూలంగా మార్చేందుకు చర్యలు చేపట్టారు. ఈ ఏడాది 300 బస్సులు, వచ్చే ఏడాది 350 బస్సుల్లో ఇంజన్, చాసీస్ మినహాయించి బస్సు బాడీలను, సీట్లను, అన్నింటిని కొత్తగా ఏర్పాటు చేస్తారు. ఇప్పటి వరకు 20 బస్సులను ఈ తరహాలో అభివృద్ధి చేశారు. * త్వరలో ప్రారంభం కానున్న మియాపూర్-ఎస్సార్‌నగర్ మెట్రో రైలుకు అనుసంధానంగా జీడిమెట్ల-గచ్చిబౌలి రూట్లో 4 కొత్త బస్సులను ప్రవేశపెట్టనున్నారు. ప్రతి అరగంటకు ఒక బస్సు అందుబాటులో ఉంటుంది. * మెట్రో పనుల కారణంగా నిలిపివేసిన వనస్థలిపురం-కేపీహెచ్‌బీ (186) రూట్ బస్సును త్వరలో ప్రారంభిస్తారు. ఈ మార్గంలో ప్రతి 25 నిమిషాలకు ఒకటి చొప్పున 8 బస్సులు రాకపోకలు సాగిస్తాయి. -
ముంబై వీధుల్లో మొదటి ఏసీ సబర్బన్!
ముంబై: త్వరలో ముంబై నగర వీధుల్లో మొదటి సబర్బన్ ఏసీ రైలు పరుగులు పెట్టనుంది. మార్చి 31న చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ నుంచి బయలుదేరిన ఈ రైలు మంగళవారం ముంబై చేరుకుంది. ప్రస్తుతం కుర్లా కార్ షెడ్లో ఉన్న ఈ కోచ్‌ను రైల్వే టెక్నికల్ ఇంజనీర్లు రెండు మార్లు పరిశీలించిన తర్వాత వారం పాటు సీఆర్లోని ట్రాన్స్ హార్బర్ లైన్లో ట్రయల్ రన్‌ను నిర్వహించనున్నారు. ఒక్క రైలు నిర్మణానికి రూ.54 కోట్లు ఖర్చవుతుంది. సిల్వర్-బ్లూ రంగుల్లో ఉండే ఈ లోకల్ రైలు గంటకు 50-60 కిలోమీటర్ల వేగంతో నడుస్తుంది. ఇది రంగ ప్రవేశం చేస్తే 2012-13 బడ్జెట్లో ప్రవేశపెట్టిన లోకల్ ఏసీ ట్రెయిన్ సర్వీసుల అంశం త్వరలో అమలుకానుంది. మొత్తం 12 కొత్త సబర్బన్ లోకల్ రైళ్లు మంజూరు కాగా, రెండింటిని మహిళల కోసం ప్రత్యేకంగా నడపనున్నారు. ఆర్డీఎస్ఓకు చెందిన జాయింట్ టీమ్ ఏసీ లోకల్ ట్రెయిన్‌ను పరీక్షించనున్నారని సమాచారం. -
టీ తాగేందుకు పెళ్లి బస్సు దిగడంతో..
చిలకలగూడ: పెళ్లి బస్సులో మంటలు చెలరేగిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. అయితే, అక్కడున్న వారు అప్రమత్తమై వధువు సహా బస్సులో ఉన్న 20 మందిని సురక్షితంగా బయటకు తీసుకురావటంతో పెనుప్రమాదం తప్పింది. ఈ ఘటన వివరాలివీ.. సికింద్రాబాద్ సీతాఫల్మండి జోషి కాంపౌండ్‌లోని రీజెన్సీ అపార్ట్మెంట్లో నివసిస్తున్న ఎ.గీతారావు కుమార్తె వివాహం కర్నూలు జిల్లా ఆళ్లగడ్డలో ఆదివారం జరగాల్సి ఉంది. ఈ పెళ్లికి హాజరయ్యేందుకు న్యూదక్కన్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ బస్సును అద్దెకు తీసుకున్నారు. బస్సును డ్రైవర్ ఆంజనేయులు శనివారం ఉదయం 10 గంటలకు పెళ్లివారింటి ప్రాంగణంలోకి తీసుకువచ్చాడు. బస్సును స్టార్ట్ చేసి ఉంచి ఏసీని ఆన్ చేసి బస్సు దిగి టీ తాగేందుకు వెళ్లాడు. పెళ్లి కుమార్తెతో పాటు సుమారు 20 మంది చిన్నారులు, వృద్ధులు బస్సులో కూర్చున్నారు. ఏసీ బయటకు పోతుందని బస్సు డోర్‌ను వేశారు. ఈ క్రమంలో బస్సు ముందుభాగంలోని ఇంజన్ నుంచి ఒక్కసారిగా దట్టమైన పొగతోపాటు మంటలు వ్యాపించాయి. ఒకరికొకరు కనిపించలేనంత పొగ క్షణాల్లో బస్సు మొత్తం వ్యాపించింది, భయాందోళనలతో బస్సులోని వారంతా గట్టిగా కేకలు వేయసాగారు. అదే సమయంలో అటుగా వెళ్తున్న చిలకలగూడ ఏఎస్ఐ జగన్మోహనరావుతోపాటు స్థానికులు, బంధువులు బస్సు అద్ధాలు పగులగొట్టి పెళ్లికుమార్తెతోపాటు లోపలున్న అందరినీ రక్షించారు. సమాచారం అందుకున్న చిలకలగూడ పోలీసులు, తార్నాక అగ్నిమాపక సిబ్బంది వచ్చి మంటలను ఆర్పివేశారు. కొద్దిసేపటి తర్వాత మరో బస్సులో పెళ్లికి తరలివెల్లారు. ఈ ప్రమాదానికి డీజిల్ లీకేజీ కావడమేనని పోలీసులు భావిస్తున్నారు. ఏసీ ఆన్ చేయడంతోపాటు ఎండలు మండిపోతుండడంతో ఇంజన్ వేడెక్కిపోయి ఉంటుందని, డీజిల్ లీక్ కావడంతో ఒక్కసారిగా ఇంజన్ నుంచి మంటలతోపాటు దట్టమైన పొగ వ్యాపించిందని తెలిపారు. బస్సు డ్రైవర్ ఆంజనేయులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ శ్రీనివాసులు తెలిపారు. -
మియాపూర్-శంషాబాద్ మార్గంలో ఏసీ బస్సులు
మియాపూర్ (హైదరాబాద్) : మియాపూర్ నుంచి శంషాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు పుష్పక్ ఏసీ బస్సులను నడుపుతున్నట్లు మియాపూర్ డిపో -2 మేనేజర్ బి.వెంకారెడ్డి సోమవారం తెలిపారు. గంటకు ఒకటి చొప్పున ప్రతిరోజూ 48 ట్రిప్పులు నడిపిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ బస్సు సర్వీసులు పటాన్చెరువు, రాంచంద్రాపురం, చందానగర్, మియాపూర్ ఆల్విన్ కాలనీ, కొండాపూర్, గచ్చిబౌలి మీదుగా రాకపోకలు సాగిస్తాయని తెలిపారు. మియాపూర్ నుంచి శంషాబాద్‌కు బస్సు చార్జీ రూ.250 గా ఉంటుందని వివరించారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
హౌరా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లో దొంగల హల్చల్
శ్రీకాకుళం: హౌరా-చెన్నై ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ ఫస్ట్‌క్లాస్ బోగీలో గురువారం దొంగలు హల్చల్ సృష్టించారు. రైల్లో ప్రయాణిస్తున్న శ్రీకిషన్ సింగ్, రాజ్ కుమారి దంపతులకు మత్తుమందు ఇచ్చి బంగారు నగలను దుండగులు ఎత్తుకెళ్లారు. దాంతో తోటి ప్రయాణికులు పలాస రైల్వేస్టేషన్లో రైల్వేసిబ్బందికి బాధితులను అప్పగించారు. దంపతులను ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. -
ప్చ్..టైం బాగాలేదు
ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలపై ప్రయాణికుల పెదవి విరుపు ఏసీ బెర్తులకు టికెట్ ఛార్జీల సెగ విశాఖపట్నం సిటీ: విశాఖ-ఢిల్లీ ఏసీ సూపర్‌ఫాస్ట్ ఏపీ ఎక్స్‌ప్రెస్ వేళలపై ప్రయాణికుల్లో నిరసన వ్యక్తమవుతోంది. రెండు పగటి సమయాలు రైల్లోనే గడిచిపోతున్నాయని, ఒక రాత్రి రైల్లోనూ, రైలు దిగిన ఒక రాత్రి ఢిల్లీలో గడిచిపోతుందని వీరంటున్నారు. రెండు రోజులు పూర్తిగా వృధా అవుతోంది. రాత్రి వేళ విశాఖలోబయల్దేరి మరసటి రోజు తెల్లవారు జామున ఢిల్లీకి చేరుకునేలా వేళలను సవరిస్తే ఢిల్లీకి వెళ్లే వారికి ఉపయోగపడుతుందనే భావన వెలిబుచ్చుతున్నారు. ఢిల్లీలో కూడా రాత్రి రైలు బయల్దేరి తిరిగి విశాఖకు పగటి పూట చేరుకునేలా ప్రయత్నిస్తే బాగుంటుందని సూచిస్తున్నారు. ఢిల్లీకి వెళ్లే వారిలో వ్యాపారస్తులతో పాటు కోర్టు కేసుల నిమిత్తం వెళ్లే న్యాయవాదులు, కక్షిదారులుంటారు. వివిధ పరిశ్రమలకు అనుమతుల కోసం వెళ్లే పారిశ్రామిక వేత్తలు, రాజకీయ అనుచరులు భారీగా ఉంటారు. వీరంతా దక్షిణ్ లింక్ ఎక్స్‌ప్రెస్, స్వర్ణ జయంతి, అమృతసర్ ఎక్స్‌ప్రెస్‌లపైనే ఆశ పెట్టుకున్నారు. ఆ రైళ్లకు చాంతాడంత క్యూ ఉండడంతో తాజాగా ఏపీ ఎక్స్‌ప్రెస్‌పై ఆధారపడతారు. బెర్తులు ఖాళీ : వారానికి మూడు రోజుల పాటు అందుబాటులో ఉండే ఈ ఎక్స్‌ప్రెస్‌కు వచ్చే నాలుగు మాసాలకు బెర్తులు ఖాళీగా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి ఆన్లైన్లో బుకింగ్ తెరిచారు. రెండు వైపులా ప్రయాణానికి అనుకూలంగా కావ ల్సినన్ని బెర్తులు ఉండడంతో ప్రయాణికులు ఉత్సాహంగా ఎగబడ్డారు. అన్నీ ఏసీ బెర్తులే కావడంతో ధరలు కాస్త వణుకు పుట్టిస్తున్నాయి. ఏపీ ఎక్స్‌ప్రెస్ ఏసీ ఛార్జీలు భారీగా ఉన్నాయి. సాధారణ రైళ్లతో పోల్చుకుంటే రూ. 200 నుంచి రూ.500 వరకూ వ్యత్యాసం కనిపిస్తోంది. లింక్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌లతో పోల్చుకుంటే ఏపీ ఎక్స్‌ప్రెస్‌కు స్వల్పంగానే ధరలు పెంచినట్టు రైల్వే వర్గాలు చెబుతున్నాయి. మిగిలిన రైళ్లతో పోల్చుకుంటే ఈ రైలు నేరుగా న్యూ ఢిల్లీకి వెళుతుందనే కారణం చెబుతున్నాయి. థర్డ్ ఏసీ బెర్తు రూ. 2 వేలు, సెకండ్ ఏసీ బెర్తు-రూ.2935, ఫస్టు ఏసీ బెర్తు రూ. 5070గా ఉంది. అంటే ఫస్టు ఏసీ ఛార్జీతో విమానంలోనే హాయిగా వెళ్లిపోవచ్చని ప్రయాణికులు అంటున్నారు. -
చెన్నై ఎక్స్‌ప్రెస్ ఏసీ బోగీ మిస్..
విశాఖపట్నం సిటీ: విశాఖ నుంచి సోమవారం చెన్నైకు బయల్దేరాల్సిన వీక్లీ ఎక్స్‌ప్రెస్ (22869)లో ఒక థర్డ్ ఏసీ బోగీ కనిపించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రైల్వే అధికారులు సరిగా స్పందించకపోవడంతో వారిపై దాడికి దిగారు. దీంతో రైలు రెండు గంటల ఆలస్యంగా రాత్రి 9.15 గంటలకు బయల్దేరింది. -
హాయిగా వెళ్లొచ్చు
భీమవరం నుంచి విజయవాడకు ఏసీ బస్ సర్వీస్ భీమవరం : భీమవరం నుంచి విజయవాడ నగరానికి ఆర్టీసీ ఏసీ బస్ సర్వీస్ అందుబాటులోకి వచ్చింది. స్థానిక ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ప్రతి గంటంపావుకు ఒక బస్సు చొప్పున నడుపుతున్నారు. ఈ బస్సులు ఆకివీడు, కలిదిండి, గుడివాడ మీదుగా విజయవాడ వెళతాయి. మెట్రో లగ్జరీ ఏసీ సర్వీస్‌గా నడుస్తున్న వీటిలో విజయవాడకు రూ.177 చొప్పున చార్జీ వసూలు చేస్తారు. భీమవ రం ఆర్టీసీ కాంప్లెక్స్ నుంచి ఉదయం 9.15, 10.30, 11.45, మధ్యాహ్నం ఒంటిగంట, 02.15, 03.45 సాయంత్రం 5, 6.15, రాత్రి 7.30, 8.45 గంటలకు బస్సు బయలుదేరుతుందని డిపో మేనేజర్ సాయిచరణ్‌తేజ తెలిపారు. విజయవాడ నుంచి ఉదయం 6గంటలు, 7.15, 9.45, 11, 12.30, మధ్యాహ్నం 1.45, 3 గంటలు, 04.15, 5.30 గంటలకు బస్సు బయలుదేరుతుందని వివరించారు. -
భువనేశ్వర్ - రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
-
భువనేశ్వర్ - రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
న్యూఢిల్లీ: ఢిల్లీ రైల్వే స్టేషన్లో ఆగి ఉన్న భువనేశ్వర్ - రాజధాని ఎక్స్‌ప్రెస్ ఏసీ కోచ్‌లో మంగళవారం అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఏసీ కోచ్‌లో చెలరేగిన ఈ మంటలు ఇతర బోగీలకు వ్యాపించాయి. సుమారు ఆరు బోగీలు అగ్నికి ఆహుతి అయ్యాయి. అలాగే పక్కనే నిలిచి ఉన్న మరో రైలుకు కూడా మంటలు వ్యాపించాయి. రైల్వే అధికారులు వెంటనే అప్రమత్తమైన అగ్నిమాపక శాఖ సిబ్బందికి సమాచారం అందించారు. ఫైరింజన్లతో అక్కడి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలార్పుతున్నారు. స్టేషన్ మొత్తం దట్టమైన పొగలు అలుముకున్నాయి. అయితే ప్రమాదం జరిగిన సమయంలో ఏసీ కోచ్‌లో ప్రయాణీకులు ఎవరు లేకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. సుమారు 16 ఫైర్ ఇంజన్లతో మంటలను అదుపు చేస్తున్నారు. ఈ ఘటనతో పలు రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. -
బెస్ట్ నష్ట నివారణ చర్యలు
* కలెక్షన్లు లేని బస్సులను అద్దెకు ఇచ్చేందుకు సిద్ధం * మోనో ప్రయాణికులతో నెలకోసారి చర్చ * పాఠశాలల్లోనే పాస్‌ల పంపిణీకి ప్రయత్నం సాక్షి, ముంబై: బృహన్ముంబై ఎలక్ట్రిక్ సప్లయి అండ్ ట్రాన్స్‌పోర్టు (బెస్ట్) సంస్థను లాభాల బాటలో నడిపించేందుకు అధికారులు నడుం బిగించారు. ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ప్రవేశపెట్టాల్సిన పథకాలపై స్థాయి సమితిలో చర్చలు జరిపారు. ముఖ్యంగా కలెక్షన్లు లేని ఏసీ బస్సులను పెళ్లిళ్లకు, ఇతర శుభకార్యాలకు, విహార యాత్రలకు అద్దెకు ఇవ్వాలని ప్రతిపాదించారు. గత కొంత కాలంగా బెస్ట్ నష్టాల్లో నడుస్తోంది. రోజురోజుకు ప్రయాణికుల సంఖ్య తగ్గిపోవడంతో అనుకున్నంత మేర ఆదాయం రావడం లేదు. దీంతో కలెక్షన్లు లేని కొన్ని రూట్లలో బస్సులు రద్దు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలో ఆదాయంతోపాటు ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే ప్రయత్నాలు అధికారుల చేపడుతున్నారు. ఇందుకోసం మెట్రో, మోనో రైలు ప్రయాణికులతో నెలకు ఒకసారి భేటీ కావాలని నిర్ణయించారు. వారిచ్చే సలహాలు, సూచనలను విని ఆ తరువాత బస్సు రాకపోకల్లో మార్పులు చేయాలని యోచిస్తున్నారు. మెట్రో, మోనో రైలు ప్రయాణికులు అధిక శాతం బెస్ట్ బస్సుల కోసం వేచిచూడడం లేదు. స్టేషన్ బయట అందులో బాటులో ఉన్న షేర్ ఆటోలు, ట్యాక్సీలలో వెళుతున్నారు. దీనికి బస్ చార్జీల పెంపు కారణంగా కనిపిస్తోంది. పెంచిన చార్జీల వల్ల బెస్ట్ బస్సుల్లో ప్రయాణికుల సంఖ్య సగానికి తగ్గిపోగా.. లోకల్ రైళ్లలో ఏడాది కాలంలో మూడు కోట్లకు మందికిపైగా పెరిగిపోయారు. సీజన్ పాస్ చార్జీలు కూడా దాదాపు రెట్టింపు పెంచడంతో విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో పాఠశాల ప్రాంగణంలోకి వెళ్లి అక్కడే విద్యార్థులకు పాస్‌లు జారీచేయాలని నిర్ణయించారు. అందుకు 10 పాఠశాలల యాజమాన్యాలు సానుకూలంగా వ్యవహరించినట్లు బెస్ట్ జనరల్ మేనేజరు జగదీశ్ పాటిల్ చెప్పారు. వృథాగా పడి ఉన్న బెస్ట్ డిపో స్థలాలను లీజుకిచ్చే అంశంపై కూడా చర్చలు జరిపారు. అందులో హోటల్, టూరిస్టు ఏజంట్లకు, క్రూజ్ సఫారీ తదితర వ్యాపారాలకు అద్దెకు ఇవ్వాలని చర్చలు జరిపారు. -
దురంతోకు అదనపు బోగీ ఏర్పాటు
సాక్షి, హైదరాబాద్: ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా సికింద్రాబాద్-విశాఖపట్టణం మధ్య నడిచే దురంతో (22204/22203) ఎక్స్‌ప్రెస్‌కు శాశ్వత ప్రాతిపదికన ఒక సెకండ్ ఏసీ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు తెలిపారు. పలు ఎక్స్‌ప్రెస్‌లలో అదనపు బోగీలు... ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని గుంటూరు-వికారాబాద్ పల్నాడు ఎక్స్‌ప్రెస్, నాందేడ్-ముంబై సీఎస్టీ తపోవన్ ఎక్స్‌ప్రెస్, ధర్మాబాద్-మన్మాడ్ ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఈ నెల 15 వరకు అందుబాటులో ఉండేలా తాత్కాలికంగా ఏసీ చైర్‌కార్ బోగీని అదనంగా ఏర్పాటు చేసినట్లు సీపీఆర్వో తెలిపారు. నేడు ఆలస్యంగా ఏపీ ఎక్స్‌ప్రెస్ సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్ నుంచి న్యూఢిల్లీ వెళ్లే ఏపీ ఎక్స్‌ప్రెస్ శుక్రవారం (2వ తేదీ) నాలుగు గంటలు ఆలస్యంగా బయలుదేరనున్నట్లు దక్షిణమధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నాంపల్లి రైల్వేస్టేషన్ నుంచి ఉదయం 6.25 గంటలకు బయలుదేరాల్సిన ఈ ట్రైన్ ఉదయం 10.25 గంటలకు బయలుదేరనున్నట్లు పేర్కొన్నారు. అలాగే, నాందేడ్ నుంచి అమృత్సర్ వెళ్లే సచ్‌ఖండ్ ఎక్స్‌ప్రెస్.. నాందేడ్ నుంచి ఉదయం 9.30 గంటలకు బదులు సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరుతుందని తెలిపారు. -
పనిచేయని ‘నిఘా నేత్రం’!
సాక్షి, ముంబై: నగరంలోని బెస్ట్ బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాలు చాలావరకు పనిచేయడం లేదు. దీంతో ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. అయినా సదరు కాంట్రాక్టర్ గాని, బెస్ట్ అధికారులు గాని పట్టించుకోవడంలేదు. గతంలో బెస్ట్ బస్సుల్లో ప్రయాణించేవారి భద్రత దృష్ట్యా బస్సులన్నింటిలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటుచేశారు. ఎవరైనా బస్సు ఎక్కినప్పుడు పర్సులు పోగొట్టుకున్నా లేదా మహిళలను ఆక తాయిలెవరైనా ఇబ్బంది పెట్టినట్లు ఫిర్యాదులందినా ఆయా బస్సుల్లో అమర్చిన సీసీటీవీ కెమెరాల ఫుటేజ్‌లను చూసి నిందితులను గుర్తించేవారు. సాధారణంగా ఈ కెమెరాలలో 72 గంటల వరకు ఫుటేజ్ రికార్డు ఉంటుంది. వాటినే బ్యాగ్ లిఫ్టింగ్, ఉగ్రవాద కేసులకు సంబంధించిన విషయాలలో పోలీసులు సాక్ష్యాలుగా ఉపయోగిస్తారు. కాగా, కొంత కాలంగా బెస్ట్ బస్సుల్లో ఈ కెమెరాలు పనిచేయడం మానేశాయి. దీంతో దొంగతనాలు జరిగినప్పుడు నిందితులను గుర్తించడం వీలుకావడంలేదు. ఇటీవల కాలంలో బెస్ట్ బస్సుల్లో దొంగల బెడద ఎక్కువగా మారింది. లక్షలాది మంది ప్రజలు తమ కార్యాలయాలకు వెళ్లేందుకు, ఇతర కార్యకలాపాలకు ఈ బస్సులనే ఆశ్రయిస్తుండటంతో జేబుదొంగలకు అది వరంగా మారింది. రద్దీ సమయంలో వీరు తమ చేతివాటాన్ని ప్రదర్శిస్తుండటంతో రోజూ వేలాదిమంది తమ వస్తువులను పోగొట్టుకుంటున్నారు. ఇటీవల ఓ మిహ ళా బస్సులో చోరీ చేసింది. కానీ ఆ సంఘటన సీసీటీవీ కెమెరాలో రికార్డు కాలేదు. సదరు మహిళ ఫిర్యాదు చేసినా నిందితుడిని గుర్తించడంలో బెస్ట్ అధికారులు విఫలమయ్యారు. ప్రస్తుతం 2,300 బస్సుల్లో మాత్రమే సీసీటీవీ కెమెరాలు పనిచేస్తుండగా, మిగిలిన బస్సుల్లో అవి ఉత్సవ విగ్రహాలుగా మారిపోయాయని పలువురు ప్రయాణికులు ఆరోపిస్తున్నారు. కాగా, డిసెంబర్ 31లోగా బెస్ట్‌కు సంబంధించిన అన్ని బస్సుల్లోనూ సీసీటీవీ కెమెరాలు పనిచేసేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు నోటీసులు జారీచేసినట్లు సంస్థ అధికారులు తెలిపారు. సంస్థ నిబంధనలను పాటించకపోతే కాంట్రాక్టు రద్దు చేస్తామని హెచ్చరించినట్లు వారు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, ఏసీ బస్సులు సహా పలు ఇతర బస్సుల్లో ఏర్పాటుచేసిన సుమారు 1,700 కెమెరాలు బాగానే పనిచేస్తున్నాయని ఒక అధికారి తెలిపారు. మిగిలిన బస్సుల్లో కూడా ఈ కెమెరాలు సక్రమంగా పనిచేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. బస్సుల్లో కెమెరాలను అమర్చడం వల్ల మహిళలకు భద్రత ఏర్పడుతుందని, అందుకే ఈ విషయమై పోరాటం చేస్తున్నానని బెస్ట్కమిటీ సభ్యుడు కేదార్ హంబల్కర్ తెలిపారు. -
కొంకణ్‌కు డబుల్ డెక్కర్ రైలు
సాక్షి, ముంబై: కొంకణ్ ప్రయాణికులకు గణేష్ ఉత్సవాల సమయంలో డబుల్ డెక్కర్ ఏసీ రైలు అందుబాటులోకి రానుంది. ఈ రైలు నడపాలా... వద్దా... అనే దానిపై కొద్ది రోజులుగా సెంట్రల్ రైల్వే, చీఫ్ సేఫ్టీ కమిషనర్ల మధ్య జరుగుతున్న వాగ్వాదానికి ఎట్టకేలకు తెరపడింది. దీంతో గణేశ్ ఉత్సవాల సమయంలో స్పెషల్ ట్రెయిన్‌గా నడిపేందుకు రైల్వే సేఫ్టీ కమిషనర్ అనుమతినిచ్చారు. వారానికి మూడు సార్లు మాత్రమే ఈ రైలు నడపనున్నారు. ఈ రైలు లోకమాన్య తిలక్ (కుర్లా) టెర్మినస్ నుంచి బయలుదేరి కొంకణ్ రీజియన్‌లోని కర్మాళి వరకు పరుగులు తీయనుంది. ప్రతీ బోగీలో 120 మంది వరకు కూర్చోవచ్చు. ఇందులో బెర్తులు ఉండవు. ఉదయం ఐదు గంటలకు కుర్లా టెర్మినస్ నుంచి బయలుదేరి సాయంత్రం ఐదు గంటలకు కర్మాళి చేరుకుంటుంది. ఇదిలాఉండగా, ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలును కొంకణ్ రైల్వే మార్గంపై నడిపే విషయంపై చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం డబుల్ డెక్కర్ ఏసీ రైలు భోపాల్-నవీ ఢిల్లీల మధ్య నడుస్తోంది. అందులోని 10 బోగీలను సెంట్రల్ రైల్వే తీసుకుంది. ఇందులో స్వల్ప మార్పులు చేసి కొంకణ్ రైల్వే మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ మార్గం అత్యధిక శాతం కొండ ప్రాంతం మీదుగా ఉంది. అనేక సొరంగాలు, ఎత్తై వంతెనలు చాలా ఉన్నాయి. ఎట్టకేలకు ఇది సఫలీకృతం కావడంతో రైల్వే సేఫ్టీ కమిషనర్ జారీచేసే సర్టిఫికెట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇదిలాఉండగా, గణేష్ ఉత్సవాలకు ముంబై నుంచి స్వగ్రామాలకు వెళ్లే వారి సంఖ్య భారీగా ఉంటుంది. అందుకు రైల్వే శాఖ అదనంగా రైళ్లు నడుపుతుంది. ఎమ్మెస్సార్టీసీ కూడా తమవంతుగా అదనపు బస్సులు నడుపుతుంది. అయినప్పటికీ అవి ఎటూ సరిపోవు. ఉత్సవాల సమయంలో రెగ్యూలర్‌గా నడిచే రైళ్లతోపాటు స్పెషల్ ట్రెయిన్లకు కూడా రిజర్వేషన్ బుకింగ్ రెండు నెలల ముందే పూర్తయిపోయాయి. దీన్నిబట్టి ఈ మార్గంలో ప్రయాణికుల సంఖ్య ఏ స్థాయిలో ఉంటుందో ఊహించుకోవచ్చు. ఉత్సవాల సమయంలో నడిపే ఈ డబుల్ డెక్కర్ ఏసీ రైలుకు మంచి స్పందన లభిస్తుందని రైల్వే సేఫ్టీ కమిషనర్ చేతన్ బక్షి ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఏసీ బస్సులు కొనాల్సిందే!
సాక్షి, హైదరాబాద్: ‘దేశవ్యాప్తంగా ప్రీమియం నమూనా ఏసీ సిటీ బస్సులు నష్టాలను తెచ్చిపెడుతున్నాయి. అయినా... మెట్రోపాలిటన్ నగరాల్లో వాటిని తిప్పాల్సిందే. ఇప్పటి వరకు ఆ మోడల్ బస్సులు హైదరాబాద్‌లో తిప్పలేదు. ఈసారి కొనాల్సిందే..’’ అని తాజాగా జేఎన్ఎన్యూఆర్ఎం హుకుం జారీ చేసింది. దాంతో ఆర్టీసీ హడావుడిగా రూ.80 కోట్ల విలువైన వోల్వో ఏసీ బస్సులను కొంటోంది. దేశవ్యాప్తంగా ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ తదితర నగరాల్లో వీటిని తిప్పుతున్నారు. ఇందులో ఒక్క ఢిల్లీలో మాత్రమే ఈ బస్సులు ఆర్థికంగా విజయవంతమయ్యాయి. మిగతా చోట్ల నష్టాలనే మిగిల్చాయి. ఇప్పటికే హైదరాబాద్‌లో సాధారణ ఏసీ బస్సులతో తీవ్ర నష్టం వాటిల్లుతున్న తరుణంలో జేఎన్ఎన్యూఆర్ఎం ఒత్తిడితో ఆర్టీసీ వాటిని కొంటోంది. వ్యాట్.. ఎంవీ ట్యాక్స్ నుంచి మినహాయింపు... ఈ బస్సులు కొంటే వ్యాట్.. మోటార్ వెహికల్ ట్యాక్స్ నుంచి మినహాయింపు ఇస్తామని జే ఎన్‌ఎన్‌యూఆర్‌ఎం తాయిలం ప్రకటించటంతో ఆర్టీసీ కూడా దానికి సరేననేసింది. జేఎన్ఎన్యూఆర్ఎం పథకం నిబంధనల ప్రకారం వ్యాట్ రూపంలో బస్సు ధర పై 14.5 శాతం, ఎంవీ ట్యాక్స్ రూపంలో బస్సు రాబడిపై 5 శాతం చొప్పున రాష్ట్ర ప్రభుత్వం మినహాయింపు ఇవ్వాల్సి ఉంటుంది. ఇది మినహా ఈ ప్రీమియం మోడల్ బస్సులతో ఆర్థికంగా ఎలాంటి వెసులుబాటు ఉండదని ఆర్టీసీ నిర్ధారించుకుంది. ఒక్కోటి రూ.95 లక్షల విలువైన బస్సులు కొనేందుకు అవుతున్న రూ.80 కోట్ల మొత్తంలో జేఎన్ఎన్యూఆర్ఎం 35 శాతాన్ని గ్రాంటుగా ఇస్తుంది. హైదరాబాద్‌కు ప్రస్తుతం ప్రీమియం మోడల్ ఏసీ బస్సులను మాత్రమే కేటాయిస్తామనే కొర్రీ పెట్టడంతో ఆర్టీసీకి గత్యంతరం లేకుండాపోయింది. ఇదే పథకం కింద ఇప్పుడు కరీంనగర్‌కు 70, మహబూబ్‌నగర్, ఖమ్మం జిల్లాలకు 40 చొప్పున సాధారణ బస్సులు ఇచ్చేందుకు జేఎన్ఎన్యూఆర్ఎం సమ్మతించింది. అలాగే వరంగల్ నగరాన్ని ఈ పథకం కిందకు తెచ్చే ప్రతిపాదనను పరిశీలించేందుకు ఒప్పుకొంది. ఫలితంగా హైదరాబాద్ కోసం 80 ఏసీ బస్సులు కొనాల్సిందేనని తేల్చి చెప్పింది. దీంతో తెల్ల ఏనుగుల్లా మారతాయని తెలిసి కూడా ఆర్టీసీ వోల్వో ఏసీ బస్సులను కొనేందుకు సిద్ధపడింది. ఈ మొత్తం వ్యవహారంలో ఆర్టీసీ రూ.32 కోట్లను ఖర్చు చేయనుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు భరిస్తుంది. -
స్లీపర్ కోచ్‌లు మాయం.. ఇక ఏసీల యుగం!!
రైళ్లలో స్లీపర్ కోచ్ అంటే.. సామాన్యులు చాలామంది ఎంచుకునే బోగీ. ఏసీ తరగతి అంటే కాస్తంత ఎగువ మధ్యతరగతి నుంచి ఆ పైవాళ్లు మాత్రమే ప్రయాణిస్తారు. కానీ ఆదాయంపై కన్నేసిన రైల్వేశాఖ క్రమంగా చాలావరకు సూపర్‌ఫాస్ట్, ఎక్స్‌ప్రెస్ రైళ్లలో ఉన్న స్లీపర్ క్లాస్ బోగీలన్నింటినీ క్రమంగా ఏసీ బోగీలుగా మార్చేయాలని తలపెడుతోంది. ముందుగా ఈ ప్రయోగం దక్షిణ రైల్వేలో మొదలయ్యింది. ఇప్పటికే అక్కడ కొన్ని రైళ్లలో ఒక్కో స్లీపర్ బోగీని తీసేసి.. వాటి స్థానంలో ఏసీ బోగీలు అమరుస్తున్నారు. ఇది గనక విజయవంతం అయితే రాబోయే ఐదారేళ్లలో చాలావరకు స్లీపర్ క్లాస్ బోగీలు ఏసీలుగా మారిపోతాయి. ముందుగా ఎర్నాకులం-నిజాముద్దీన్ మంగళా ఎక్స్‌ప్రెస్ (రైలు నెం. 12617)లోని ఎస్-2 బోగీని ఏసీ బోగీగా మార్చేసి దాని పేరును కూడా బి-4గా మార్చారు. ప్రస్తుతం ఈ రైల్లో 11 స్లీపర్ బోగీలు, మూడు త్రీటైర్ ఏసీ బోగీలు, రెండు టూటైర్ ఏసీ బోగీలు ఉన్నాయి. తాజా మార్పుతో స్లీపర్ బోగీల సంఖ్య 10కి తగ్గి, త్రీటైర్ ఏసీ బోగీలు నాలుగు అవుతాయి. ఎర్నాకులం నుంచి నిజాముద్దీన్ (ఢిల్లీ)కి స్లీపర్ క్లాస్ టికెట్ 925 రూపాయలు కాగా, త్రీటైర్ ఏసీ టికెట్ 2,370 రూపాయలు. అంటే, ఒక్కో ప్రయాణికుడి మీద అదనంగా 1445 రూపాయల చొప్పున భారం పెరుగుతుంది. మొత్తం ఒక బోగీలో ఉండే 72 సీట్లకు కలిపి దాదాపు లక్ష రూపాయల అదనపు ఆదాయం రైల్వే శాఖకు వస్తుంది. -
చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లో మంటలు
చెన్నై: చెన్నై నుంచి హైదరాబాద్ వస్తున్న చార్మినార్ ఎక్స్‌ప్రెస్‌లోని ఏసీ బోగీలో స్వల్పంగా మంటలు రేగాయి. ప్రయాణికులకు ఎటువంటి గాయాలు కాలేదు. చెన్నై సెంట్రల్ స్టేషన్ నుంచి మంగళవారం సాయంత్రం 6 గంటలకు బయలు దేరిన చార్మినార్ ఎక్స్‌ప్రెస్ చెన్నైకి 45 కిలోమీటర్ల దూరం ప్రయాణించింది. రాత్రి 7.10 గంటలకు గుమ్మిడిపూండి- ఎలావూరు మధ్య వెళుతుండగా ఏ1 ఏసీ బోగీలో ముందుగా పొగలు వ్యాపించి తర్వాత మంటలు రేగాయి. ప్రయాణికులు కేకలు పెడుతూ చైన్‌లాగడంతో రైలు ఆగింది. రైల్వే సిబ్బంది అక్కడికి చేరుకుని మంటలు ఆర్పారు. ప్రయాణికులను ఏ2 బోగీలోకి మార్చారు. రైలును గుమ్మిడిపూండి వరకు వెనక్కు నడిపి మంటలు రేగిన బోగీని తనిఖీ చేశారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల మంటలు రేగినట్లు గుర్తించారు. రాత్రి 9.15 గంటలకు రైలును హైదరాబాద్ పంపారు. -
ఏసీ బస్సులో మంటలు: 5గురు సజీవదహనం
మహారాష్ట్ర నాగపూర్ వద్ద ఏసీ బస్సులో అగ్నిప్రమాదం సంభవించింది. ఆ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు సజీవ దహనమైయ్యారు. మరో 15 మంది ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. అదే రహదారిపై వెళ్తున్న వాహనదారులు వెంటనే స్పందించి పోలీసులు సమాచారం అందించారు. పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రులను తలేగాం ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రులలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు వెల్లడించారు. నాగ్‌పూర్ నుంచి అమరావతి జాతీయ రహదారిపై గురువారం తెల్లవారుజామున ఆ ప్రమాదం చోటు చేసుకుంది. నాగపూర్ సమీపంలోని తలేగాం వద్దకు చేరుకోగానే ఆ బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. షార్ట్ సర్క్యూట్ కారణంగా ఆ ప్రమాదం చోటు చేసుకుని ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తిరుపతికి డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం
హైదరాబాద్‌లోని కాచిగూడ స్టేషన్ నుంచి తిరుపతి వెళ్లే డబుల్ డెక్కర్ రైలు బుధవారం ఉదయం ప్రారంభమైంది. ఈ రైలు కాచిగూడ స్టేషన్ నుంచి ఉదయం 6.45 గంటలకు బయల్దేరింది. తిరుపతికి సాయంత్రం 6.15 గంటలకు చేరుకుంటుంది. ప్రతి బుధ, శనివారాల్లో ఈ రైలు కాచిగూడ - తిరుపతి మధ్య తిరుగుతుంది. ఇప్పటికే గుంటూరు - హైదరాబాద్ మధ్య ఒక డబుల్ డెక్కర్ రైలు ప్రారంభం కాగా, ఇది మన రాష్ట్రానికి సంబంధించి రెండో రైలు అవుతుంది. ఇది పూర్తిగా ఏసీ రైలు. ఈ రైల్లో ఎక్కడా బెర్తులు ఉండవు. చైర్ కార్ మాదిరిగా కూర్చుని మాత్రమే వీటిలో వెళ్లాల్సి వస్తుంది. మొత్తం పది బోగీలు ఉండే ఈ రైల్లో కింద, పైన కూడా సీట్లు ఉండటంతో ఒక్కో బోగీకి 120 మంది వరకు ప్రయాణికులు పడతారు. ఇవి చాలా సౌకర్యవంతంగా ఉన్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు. -
అమ్మో ఏసీ బస్సా..!!
ఏసీ బస్సులను చూస్తే చాలు.. జనం భయపడిపోతున్నారు. ఏ క్షణంలో ఏ ప్రమాదం జరుగుతుందోనని వీలైనంత వరకు ఏసీ బస్సులు కాకుండా మామూలు హైటెక్ బస్సుల్లోనే బుక్ చేసుకుంటున్నారు. సాధారణంగా వేసవి కాలం వస్తూనే రైళ్లలో ఏసీ టికెట్లకు, బస్సుల్లో వోల్వో, ఏసీ బస్సులకు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. కానీ ఈసారి వరుసపెట్టి ఏసీ బస్సుల్లో ప్రమాదాలు జరుగుతుండటంతో జనం భయపడుతున్నారు. తాజాగా సోమవారం తెల్లవారుజామున మరో బస్సులో ప్రమాదం జరిగింది. హన్మకొండ నుంచి హైదరాబాద్ వస్తున్న ఏసీ బస్సులోంచి పొగలు వచ్చాయి. వరంగల్ జిల్లా రఘునాథపల్లె మండలం గోవర్ధనగిరి వద్ద ఈ సంఘటన జరిగింది. దాంతో ప్రయాణికులు ఒక్కసారిగా ఆందోళనకు గురయ్యారు. ఇటీవలే కర్ణాటక పరిధిలో జరిగిన బస్సు ప్రమాదంలో ఆరుగురు అక్కడికక్కడే మరణించారు. మరికొందరు తీవ్రంగా గాయపడ్డారు. వరుసపెట్టి జరుగుతున్న ఈ సంఘటనల వల్ల తమ ఏసీ బస్సులకు డిమాండు బాగా తగ్గిందని, వాటికంటే హైటెక్ బస్సుల్లోనే రద్దీ ఎక్కువగా ఉంటోందని ప్రైవేటు ట్రావెల్స్ యజమానులు చెబుతున్నారు. -
ఏసీ బస్సులో మంటలు, ఆరుగురు సజీవ దహనం
-
ఏసీ బస్సులో మంటలు, ఆరుగురు సజీవ దహనం
బెంగళూరు : మహబూబ్‌నగర్ పాలెం వోల్వో బస్సు దుర్ఘటన మరవక ముందే కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. దావణగెరె నుంచి బెంగళూరు వెళుతున్న ఎస్పీఆర్ ప్రయివేట్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో మంటలు చెలరేగి ఆరుగురు సజీవ దహనం అయ్యారు. మరో 20 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. అర్థరాత్రి ఒకటిన్నర సమయంలో చిత్రదుర్గ్ వద్ద ఈ దుర్ఘటన జరిగింది. ప్రయాణికులు గాఢనిద్రలో ఉన్న సమయంలో బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగినట్లు సమాచారం. బస్సు డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. క్షతగాత్రులను సమీప ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కాగా ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. -
అత్యాధునికంగా గోదావరి ఎక్స్‌ప్రెస్
హైదరాబాద్, న్యూస్‌లైన్: వేసవి సెలవుల్లో రైలు ప్రయాణికులను ఆకట్టుకునేందుకు దక్షిణ మధ్య రైల్వే ఎక్స్‌ప్రెస్ రైళ్లలోని ఏసీ బోగీలను అత్యాధునికంగా తీర్చిదిద్దుతోంది. ముందుగా హైదరాబాద్ నుంచి విశాఖపట్నం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో మార్పులు చేశారు. ఈ ప్రయోగం ఫలిస్తే మరో 14 ఎక్స్‌ప్రెస్ రైళ్లనూ ఇదే విధంగా రూపొందించనున్నారు. గోదావరి ఎక్స్‌ప్రెస్‌కు ఉన్న ఏసీ బోగీలను అత్యంత ఖరీదైనవిగా, స్టార్ హోటళ్ల తరహాలో తీర్చిదిద్దారు. వీటిలో ఏపీ టూరిజం సీనరిస్ ఆకట్టుకుంటున్నాయి. టాయిలెట్, మిర్రర్ లైటింగ్, ఎమర్జన్సీ విండో, కోచ్ నెంబరు, నెంబర్ ఇండికేషన్ బోర్డు, రైళ్ల రాకపోకల వివరాలను అమర్చారు. టాయిలెట్లలో కంట్రోల్ డిశ్చార్జ్ టాయిలెట్ వ్యవస్థను ప్రవేశపెట్టారు. దీనివల్ల టాయిలెట్ ద్వారా బయటకు రావాల్సిన వ్యర్థం రైల్వే స్టేషన్‌కు 30 కిలోమీటర్ల దూరంలో బయటకు వస్తుంది. ఫలితంగా రైల్వే స్టేషన్లు అపరిశుభ్రం కాకుండా ఉంటాయి. హైదరాబాద్ నుంచి విశాఖకు వెళ్లే వారికి ఫస్ట్ ఏసీ చార్జి రూ.2,205, సెకండ్ ఏసీ రూ.1,310, థర్డ్ ఏసీ రూ.925గా నిర్ణయించారు. -
హాయిహాయిగా ప్రయాణం
సాక్షి, ముంబై: లోకల్ రైలు ప్రయాణికులకు శుభవార్త. పశ్చిమ రైల్వే మార్గంలో జూన్ నెల నుంచి ఏసీ లోకల్ రైలును ప్రారంభించేందుకు సంబంధిత అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. ఈ రైలును చర్చిగేట్-బోరివలి మధ్య నడపాలని తొలుత నిర్ణయించారు. అయితే ఏ సమయంలో నడపాలి? చార్జీ ఎంత వసూలు చేయాలి? తదితర అంశాలపై అధికారులు చర్చిస్తున్నారు. చర్చిగేట్ నుంచి బోరివలి వరకు చార్జీ కింద రూ.400 వసూలు చేయాలని ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే ఈ మొత్తం కేవలం శ్రీమంతులుు, బడా ఉద్యోగులు మాత్రమే భరించగలుగుతారనే అభిప్రాయాలు వ్యక్తమైంది, అంతేకాకుండా ఈ రైలుకు సీజన్ పాసులను జారీ చేయడం లేదు. టికెట్ కొనుగోలు చేసి ప్రయాణించాల్సి ఉంటుంది. చర్చిగేట్-బోరివలి స్టేషన్ల మధ్య దూరం 33 కిలోమీటర్లు. సాధారణంగా లోకల్ రైళ్లలో మొదటి తరగతి టికెట్‌కు రూ.120 చొప్పున చార్జీ వసూలు చేస్తున్నారు. దీనినిబట్టి ఏసీ లోకల్ రైలుకు రూ.196 చార్జీలు కేటాయించాలని అధికారులు నిర్ణయానికి వచ్చారు. అయితే ఏసీ రైలుకు నెల, త్రైమాసిక పాసులు లేకపోవడంతో వారం లేదా పక్షం రోజుల పాసులను జారీచేయాలనే కోణంలో అధికారులు ఆలోచిస్తున్నారు. అయితే ప్రయాణికులు ఏసీ రైలు టికెట్ల కోసం స్టేషన్లలో విండోల వద్ద క్యూలో నిలబడకుండా ‘ఈ-టికెట్’ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చే దిశగా ప్రయత్నిస్తున్నారు. కాగా ఏసీ లోకల్ రైలు చార్జీలు పేదలకు ముచ్చెమటలు పట్టించే విధంగా ఉన్నాయి. దీని కంటే నిత్యం ప్రయాణించే లోకల్ రైళ్లే నయమని సామాన్యులు భావిస్తున్నారు. -
ఈసారింతే..
రాయగడకు ప్యాసింజరు రాజధానికి ఏసీరైలు కొత్త ప్రాజెక్టులు శూన్యం నిరాశ మిగిల్చిన రైల్వే బడ్జెట్ 1- విశాఖ-సికింద్రాబాద్ మధ్య మరో ఏసీ సూపర్‌ఫాస్ట్ వీక్లీ ఎక్స్‌ప్రెస్‌కు గ్రీన్ సిగ్నల్ పడింది. విశాఖ-సికింద్రాబాద్ మధ్య కొత్త రైలు వస్తాదని బడ్జెట్‌కు ముందు ఊహించిందే 2- రాయగడ మీదుగావిశాఖ-గుణుపూర్ మధ్య కొత్త ప్యాసింజర్ మంజూరైంది. గుణుపూరువాసుల ఆందోళన ఫలితంగా..అక్కడ ఎంపీల కృషి వల్ల ఈ రైలు సాధ్యపడింది. విశాఖపట్నం, న్యూస్‌లైన్: మధ్యంతర రైల్వే బడ్జెట్ నిరాశ మిగిల్చింది. నాలుగు నెలల పరిమితికే అయినా మహా నగర వాసుల ఆశలపై నీళ్లు చల్లింది. బుధవారం రైల్వే మంత్రి మల్లిఖార్జున్ ఖర్గే ప్రవేశపెట్టిన ఓటాన్ రైల్వే బడ్జెట్ కొద్ది నిమిషాల్లోనే ముగిసింది. రైల్వే సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి కోరిక మేరకు దక్షిణ మధ్య రైల్వేకి రెండు డబుల్ డెక్కర్ రైళ్లు మంజూరయ్యాయి. తూర్పు కోస్తా రైల్వేలోని విశాఖ నుంచి రెండు కొత్త రైళ్లకు బడ్జెట్లో ఆమోదం లభించింది. దీర్ఘకాలిక డిమాండ్లు పక్కనబెట్టి గుణుపూర్‌కు ప్యాసింజర్ వేస్తున్నట్లు ప్రకటన వెలువడింది. సికింద్రాబాద్‌కు మరో ఎక్స్‌ప్రెస్‌ను మంజూరు చేశారు. ఈ రెండు కొత్త రైళ్లు వెనుక ఉత్తరాంధ్ర ప్రజాప్రతినిధుల హస్తం లేదని ప్రయాణిక సంఘం నేతలు పెదవి విరిచారు. గుణుపూరు ప్యాసింజర్ ఒఢిశా కోటాలోనూ, సికింద్రాబాద్-విశాఖ ఏసీ ఎక్స్‌ప్రెస్ మంజూరు వెనక దక్షిణ మధ్య రైల్వే అధికారుల ప్రతిపాదనలుగా చెబుతున్నారు. ఈ రెండూ మినహా మన నగరానికి ఒరిగిందేమీ లేదు. కొత్త జోన్ ప్రస్తావన లేదు. ఆశించిన రైళ్లేమీ మంజూరు కాలేదు. -
విశాఖ-సికింద్రాబాద్ ప్రత్యేక రైళ్లు
విశాఖపట్నం, న్యూస్‌లైన్ : విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య పలు ప్రత్యేక రైళ్లను వాల్తేరు రైల్వే నడపనుంది. ఏసీ రైలు మినహా రెండు ప్రత్యేక రైళ్లను ఏడు ట్రిప్పులు నడపనున్నట్టు వాల్తేరు సీనియర్ డివిజనల్ కమర్షియల్ మేనేజర్ ఎం.ఎల్వేందర్ యాదవ్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 08503 నంబరు గల విశాఖ-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 10 నుంచి మార్చి 24వ తేదీ వరకు ప్రతీ సోమవారం రాత్రి 7.05 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08504 నంబరుతో ఈనెల 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు ప్రతీ మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 6.30 గంటలకు విశాఖకు చేరుతుంది. 08501 నంబరు గల విశాఖపట్నం-సికింద్రాబాద్ ఎక్స్‌ప్రెస్ ఈనెల 11 నుంచి మార్చి 25వ తేదీ వరకు ప్రతీ మంగళవారం రాత్రి 11 గంటలకు విశాఖలో బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 11.45 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 08502 నంబరుతో ఈ నెల 12 నుంచి మార్చి 26వ తేదీ వరకు ప్రతీ బుధవారం సాయంత్రం 4.30 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.45 గంటలకు విశాఖకు చేరుతుంది. 02727 నంబరు గల విశాఖపట్నం-సికింద్రాబాద్ ఏసీ స్పెషల్ సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ ఈ నెల 8, 15 తేదీల్లో(శనివారం) విశాఖలో రాత్రి 7.05 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 7.50 గంటలకు సికింద్రాబాద్ చేరుతుంది. తిరుగు ప్రయాణంలో 02728 నంబరుతో ఈ నెల 7, 14 తే దీల్లో(శుక్రవారం) సికింద్రాబాద్‌లో రాత్రి 10.10 గంటలకు బయల్దేరి ఆ మరుసటి రోజు ఉదయం 10.35 గంటలకు విశాఖకు చేరుతుంది. -
రైల్వే కంపుగొడుతోంది!
న్యూఢిల్లీ: ఏసీ బోగీల్లో బొద్దింకలు.. కంపుగొట్టే టాయిలెట్లు.. దుర్గంధం వెదజల్లే రైల్వే స్టేషన్లు.. ఒక్క మాటలో చెప్పాలంటే మన రైల్వే వ్యవస్థ కంపుగొడుతోందంటూ కాగ్ ఉతికిపారేసింది! రైళ్లు, రైల్వే స్టేషన్లలో పారిశుధ్యం మచ్చుకైనా కనిపించడం లేదని ఆక్షేపించింది. రైల్వేలో భోజనం కూడా రుచీపచీ లేకుండా ఉందని, ఆహారంలో నాణ్యత లేదని పేర్కొంది. రైల్వేలో పారిశుధ్యంతోపాటు, ఖర్చులు,, నిధుల వినియోగం తదితర అంశాలపై కంప్ట్రోలర్ అండ్ ఆడిట్ జనరల్ (కాగ్) ఒక నివేదిక రూపొందించింది. దీన్ని మంగళవారం ప్రభుత్వం పార్లమెంటుకు సమర్పించింది. రైల్వేలో ముఖ్యంగా పారిశుధ్యం లోపిస్తోందని కాగ్ నివేదికలో తెలిపింది. చాలాచోట్ల యంత్రాల ద్వారా పారిశుధ్య చర్యలు చేపట్టడం లేదని వివరించింది. 17 రైల్వే జోన్ల పరిధిలోని 123 మేజర్ స్టేషన్లను పరిశీలించగా.. కేవలం 65 స్టేషన్లలో మాత్రమే యంత్రాల ద్వారా పారిశుధ్య పనులు చేపడుతున్నట్లు తేలిందని నివేదికలో తెలిపింది. ముఖ్యాంశాలివీ.. పారిశుధ్యానికి పెద్దపీట వేస్తామంటూ ప్రజా పద్దుల కమిటీకి ప్రణాళిక ఇచ్చిన రైల్వే శాఖ.. క్షేత్రస్థాయిలో మాత్రం చర్యలు చేపట్టలేదు. ఎంపిక చేసుకున్న 88 రైళ్లను కాగ్ బృందాలు పరిశీలించగా.. చాలా రైళ్లలోని ఏసీ, నాన్ ఏసీ బోగీల్లో బొద్దింకలు కనిపించాయి 212 రైల్వే స్టేషన్లలో ఆహార నాణ్యతను పరిశీలించగా.. అందులో 41 స్టేషన్లలో ఁకల్తీ ఆహార పదార్థాల నిరోధక చట్టం* కింద నమూనాలను పరీక్షించలేదు. హౌరా, సెల్దా లాంటి పెద్ద స్టేషన్లలో కూడా ఆహార నాణ్యతను పరీక్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు బహిరంగంగానే మలమూత్రాలు విసర్జించడంతో స్టేషన్లు దుర్గంధం వెద జల్లుతున్నాయి ప్రయాణికులకు అందించే దుప్పట్లలో నాణ్యత ఉండడం లేదు. చాలాచోట్ల దుప్పట్లను లాండ్రీ చేసే సదుపాయం లేదు. చెత్తడబ్బాలపై మూతలు ఉండడం లేదు. ఉన్నా నిండిపోయి చెత్త అంతా బయటకు వస్తోంది.