సాక్షి, సిటీబ్యూరో: ఆర్భాటంగా ఆరంభించిన ఏసీ బస్‌షెల్టర్లు మౌలిక వసతులు కొరవడి వెలవెలబోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఇవి మేడిపండు చందంగా మారాయి. వీటిలో ఇప్పటి వరకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. రెండేళ్లుగా అలంకారప్రాయంగానే ఉన్నాయి. గ్రేటర్‌లోని కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్‌లతో పాటు ఇటీవల దిల్‌సుఖ్‌నగర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. మహిళా ప్రయాణికులకు పూర్తి భద్రత, 24 గంటల పాటు ఏసీ సదుపాయం. తాగునీటి వసతి, ఆధునిక టాయిలెట్లు, ఏటీఎం సదుపాయం, బస్‌పాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపై ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో ఆధునిక బస్‌షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ అరకొర సదుపాయాలే తప్ప ఎక్కడా ప్రయాణికులకు ఇవి పూర్తిగా అందుబాటులోకి రాలేదు.
ఆ బోర్డులేవీ..
► బస్సుల రాకపోకలను తెలిపే ఎల్‌ఈడీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న కూకట్‌పల్లి, ఖైరతాబాద్, శిల్పారామం మార్గాల్లో ప్రతి రోజు వేలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలిపే సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు బస్ షెల్టర్లలో వేచి ఉండలేకపోతున్నారు. బస్సుల కోసం ఎదురుచూస్తూ రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది.
► బస్సుల టైం టేబుల్, అనౌన్స్‌మెంట్ వ్యవస్థ అమలుకు నోచుకోలేదు. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారం డిస్‌ప్లే ఏర్పాటుపై అటు గ్రేటర్ ఆరీ్టసీ, ఇటు జీహెచ్‌ఎంసీ ఏ మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ‘ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలన్నింటినీ జీహెచ్‌ఎంసీకి అందజేశాం. వాటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ సంస్థపైనే ఉంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు.
దాహమేస్తే దిక్కులేదు..
► చక్కటి డిజైనింగ్, గ్లాస్ డోర్‌లు, చూడగానే ఇట్టే ఆకట్టుకొనే ఈ బస్òÙల్టర్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదు. వీటిని అందుబాటులోకి
తెచ్చినప్పుడు సురక్షితమైన తాగునీళ్లు మాత్రమే కాదు. క్యాంటిన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీ, కాఫీ, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. కానీ ఇప్పటికీ తాగునీటి సదుపాయం కల్పించలేదు.
► ఏ ఒక్క బస్ షెల్టర్‌లో ఏసీ పని చేయడం లేదు. ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో బస్‌షెల్టర్లలో దుర్గంధం వ్యాపిస్తోందని, వేచి ఉండలేకపోతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
► టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కానీ వినియోగానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. కానీ అవి ఇప్పుడు అలంకారప్రాయంగానే ఉన్నాయి. నిర్వహణ కొరవడింది.
Comments
Please login to add a commentAdd a comment