Bus shelters
-
హైదరాబాద్‌లో ప్రకటనలకేనా షెల్టర్లు? ప్రయాణికులు తలదాచుకోవడానికి కాదా!
సాక్షి, సిటీబ్యూరో: ఒకవైపు వరుస వర్షాలు.. మరోవైపు బస్సుల కోసం నిరీక్షిస్తూ తలదాచుకుందామంటే ఉన్న బస్షెల్టర్లు ప్రయాణికులకు రక్షణనివ్వడం లేదు. ఎండాకాలంలో మండుటెండల్లో నీడనివ్వగలిగేవి వీటిలో కొన్ని మాత్రమే. ఇక ఏసీ బస్షెల్టర్లన్నది ప్రచారార్భాటంగా మిగిలింది. అటు ఆర్టీసీ.. ఇటు జీహెచ్ఎంసీ బస్ షెల్టర్లను ఎందుకోసం ఏర్పాటు చేస్తున్నాయి? ఎవరి కోసం ఏర్పాటు చేస్తున్నాయి? అంటే.. కేవలం వాటిని ఏర్పాటు చేసే ఏజెన్సీలకు ప్రకటనల ద్వారా ఆదాయం సమకూర్చేందుకేనని చెప్పక తప్పదు. అలంకారప్రాయంగా.. ►జీహెచ్ఎంసీ పరిధిలో దాదాపు 1200 బస్ షెల్టర్లున్నాయి. వివిధ ఏజెన్సీలు వాటిని ఏర్పాటు చేశాయి. ఒప్పందం మేరకైతే ప్రజలకు సదుపాయంగా ఉండాలి. కానీ.. అవి అలా ఉన్నాయా.. లేదా అన్నది అందుకు స్థలాలు కేటాయించిన జీహెచ్ఎంసీ గాని.. ప్రజలకు సదుపాయంగా ఉంచాల్సిన ఆర్టీసీ గాని పట్టించుకోలేదు. దీంతో బస్షెల్టర్లు ప్రజావసరాలకు కాకుండా అలంకారప్రాయంగా మారాయి. బస్సుల కోసం ప్రజలెక్కువగా ఎదురు చూసే ప్రాంతాల్లో బస్ షెల్టర్లుండవు. ►ఈ నేపథ్యంలో నగరవ్యాప్తంగా ఉన్న బస్సు షెల్టర్లు.. వాటి స్థితిగతులు.. ప్రజలకుపయోపడుతున్న తీరు వంటివి తనిఖీలు చేసి తగిన చర్యలు తీసుకోవాల్సిన యంత్రాంగాలు ఆపనిచేయలేదు. పైపెచ్చు కొత్తగా మరో 78 బస్షెల్టర్లు మూడునెలల్లో ఏర్పాటు చేసేందుకు ఇప్పటికే పలు బస్షెల్టర్లను ప్రకటనల ఆదాయ వనరుగా మార్చుకున్న ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించాయి. ►పేరుకు మాత్రం సకల సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సిందిగా నిబంధనల్లో పొందుపరుస్తున్నప్పటికీ, ఆ తర్వాత పట్టించుకోవడం లేరు. ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) కింద బిల్డ్, ఆపరేట్, ట్రాన్స్ఫర్ (బీఓటీ) పద్ధతిలో ఏర్పాటుకు అనుమతించారు. అందంగా, ప్రయాణికుల.. పర్యావరణహితంగా వీటిని ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొన్నప్పటికీ, ఏమేరకు వాస్తవ రూపం దాలుస్తాయో వేచి చూడాల్సిందే. ఈ ప్రాంతాల్లో ఏర్పాటు.. బస్షెల్టర్లు ఏర్పాటు కానున్న ప్రాంతాల్లో రాజేంద్రనగర్ ఆర్చి (ఏజీ యూనివర్సిటీ), çపురానాపూల్ గాంధీ విగ్రహం, చౌమహల్లా ప్యాలెస్ ఎదుట, జియాగూడ, వివేకానందనగర్, ఉప్పల్ క్రాస్‌రోడ్స్, హయత్‌నగర్(కెప్టెన్కుక్ ఎదుట), బైరామల్‌గూడ, పనామా క్రాస్‌రోడ్స్, విక్టోరియా మెమోరియల్–సరూర్‌నగర్, కామినేని హాస్పిటల్, హెచ్‌బీకాలనీ, కొత్తపేట ప్రభుత్వ పాఠశాల, నాగోల్ క్రాస్‌రోడ్స్, నాగార్జునసాగర్ రింగ్‌రోడ్(ఒవైసీ ఆస్పతి వైపు), నందనవనం భూపేశ్‌నగర్ , తాళ్లూరి థియేటర్ కమాన్, ఓయూ క్యాంపస్, పద్మారావునగర్ ఎస్పీ కాలేజ్, సెయింట్ ఆన్స్ స్కూల్, చిలకలగూడ (ఉప్పల్వైపు) తదితరమైనవి ఉన్నాయి. నిబంధనల మేరకు.. ►జీపీఎస్ ద్వారా ఆర్టీసీ బస్సులు బస్‌షెల్టర్లకు చేరుకోనున్న రియల్‌టైమ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. ►బస్సుల నంబర్లు, రూట్‌మ్యాప్ వంటి వివరాలు సైతం ఉంచాలి. ►రాత్రి వేళల్లో విద్యుత్ ఉండాలి. షెల్టర్లలోని బెంచీలు బలంగా, ఎలాంటి వాతావరణ పరిస్థితులనైనా తట్టుకునేలా ఉండాలి. ►మొబైల్ చార్జింగ్ పాయింట్, డస్ట్‌బిన్ వంటివి ఉండాలి. ►వీటి అంచనా వ్యయం దాదాపు రూ.1.09 కోట్లు. -
పెరుగుతున్న విమాన ప్రయాణికులు.. వారి కోసం స్పెషల్‌గా..
సాక్షి, హైదరాబాద్: విమాన ప్రయాణాలు చేసేవారి సంఖ్య పెరుగుతుండటంతో అందుకనుగుణంగా నగరంలో అదనంగా పుష్పక్ బస్ షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు జీహెచ్ఎంసీ సిద్ధమైంది. సాధారణ బస్షెల్టర్ల మాదిరిగా కాకుండా ప్రయాణికులకు తగిన సదుపాయాలతో వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే వారికి పీపీపీ విధానంలో అవకాశం కల్పిస్తూ ఏర్పాట్లు చేసేందుకు టెండరు దక్కించుకునే ఏజెన్సీతో జీహెచ్ఎంసీ ఒప్పందం కుదుర్చుకోనుంది. డిజైన్, బిల్డ్, ఫైనాన్స్, ఆపరేట్ అండ్ ట్రాన్స్ఫర్ (డీబీఎఫ్ఓటీ) పద్ధతిలో వీటిని అందుబాటులోకి తేనున్నారు. జీహెచ్ఎంసీ పేర్కొన్న నిబంధనలకనుగుణంగా బస్షెల్టర్లను తగిన సదుపాయాలతో ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. షెల్టర్ల ప్యానెల్స్‌పై ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయాన్ని ఎంపికైన ఏజెన్సీ పొందుతుంది. ఈ ఒప్పందం పదేళ్ల వరకు అమలులో ఉంటుందని సంబంధిత అధికారి తెలిపారు. షెల్టర్ ఏర్పాటు ఇలా.. షెల్టర్‌ను 25్ఠ8 అడుగుల విస్తీర్ణంతో తగిన వెంటిలేషన్ ఉండేలా అల్యూమినియం గ్రిల్స్, పీవీసీ స్లైడింగ్ గ్లాస్ విండోస్ తదితరమైన వాటితో ఏర్పాటు చేయాలి. షెల్టర్‌లో మొబైల్‌ఫోన్, ల్యాప్‌టాప్‌లు చార్జింగ్ చేసుకునే సదుపాయంతోపాటు లైటు, ఫ్యాను, కూర్చునేందుకు సదుపాయాలుండాలి. జీహెచ్ఎంసీ సూచించిన డిజైన్ కనుగుణంగా వీటిని ఏర్పాటు చేయాలి. జీహెచ్ఎంసీ ఆమోదంతో స్వల్ప మార్పులు చేయవచ్చు. తగిన పెట్టుబడి ధనాన్ని కలిగి ఉండటంతోపాటు బస్షెల్టర్ల ఏర్పా టు, నిర్వహణలో గతంలో అనుభవమున్నవారే వీటిని ఏర్పాటు చేసేందుకు అర్హులని పేర్కొన్నారు. నిర్వహణ ఇలా.. ► నిబంధనల మేరకు టెండరు పొందే ఏజెన్సీ ఆపరేషన్‌లో భాగంగా దిగువ పేర్కొన్న అంశాలు పాటించాలి. అన్ని బస్షెల్టర్లు, వాటి పరిసరాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలి. చెత్తడబ్బాలు పూర్తిగా నిండకముందే చెత్త ఖాళీ చేయాలి. ప్రకటనల ప్యానెల్స్ దుమ్ము, మరకలు లేకుండా ఎల్లవేళలా శుభ్రంగా ఉండాలి. పోస్టర్ల వంటివి అతికించరాదు. ► పైకప్పు నుంచి లీకేజీలు ఉండరాదు. నీరు, ద్రవాల వంటివి నిల్వ ఉండరాదు. తగిన డ్రైనేజీ ఏర్పాట్లుండాలి. లైటింగ్ ఏర్పాట్లు ఎల్లవేళలా ఉండాలి. ఎలక్ట్రికల్ సేఫ్టీ ఏర్పాట్లుండాలి. ఫ్లోర్ టైల్స్ పగిలిపోతే, మూడు రోజుల్లోగా తిరిగి ఏర్పాటు చేయాలి. షెల్టర్లలో ఉండే సిబ్బంది చదువుకున్నవారై ఉండి,ప్రయాణికులతో మర్యాదగా వ్యవహరించాలి. వృద్ధులు, శారీరక వికలాంగులకు అవసరమైన సహాయం చేయాలి. వీటితోపాటు మరికొన్ని నిబంధనలు పాటించాలి. విఫలమైతే ఒక్కో బస్‌షెల్టర్‌కు రోజుకు రూ.2వేల వంతున పెనాల్టీ విధించేందుకు జీహెచ్ఎంసీకి అధికారం ఉంటుంది. కొత్తగా పుష్పక్ బస్షెల్టర్లు ఏర్పాటు కానున్న ప్రదేశాలివే: నాగోల్ క్రాస్‌రోడ్, ప్యాట్నీ, రాణిగంజ్, లక్డీకాపూల్, ఎన్ఎండీసీ, మెహిదీపట్నం, ఆరాంఘర్, యాత్రినివాస్, బేగంపేట్, నిమ్స్, కేర్ హాస్పిటల్, నిజాంపేట్ క్రాస్‌రోడ్, ఫోరమ్‌మాల్, మలేషియన్ టౌన్‌సిప్, బయో డైవర్సిటీ, గచ్చిబౌలి ఓఆర్ఆర్, మదీనగూడ, కొండాపూర్, కొత్తగూడ, ర్యాడిసన్ హోటల్. (వీటిలో ఎన్ఎండీసీ, మెహిదీపట్నం, గచ్చిబౌలి ఓఆర్ఆర్, ఆరామ్‌ఘర్‌ల వద్ద రెండేసి బస్షెల్టర్ల చొప్పున మొత్తం 24 బస్షెల్టర్లను ఎంపికయ్యే ఏజెన్సీ ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.) చదవండి: జూబ్లీహిల్స్ సామూహిక అత్యాచారం: దారుణాలకు ఆ వాహనాలే కారణమా? -
ఆర్భాటంగా ఆరంభం.. రెండేళ్లు గడుస్తున్న అలంకారప్రాయం
సాక్షి, సిటీబ్యూరో: ఆర్భాటంగా ఆరంభించిన ఏసీ బస్షెల్టర్లు మౌలిక వసతులు కొరవడి వెలవెలబోతున్నాయి. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా నిర్మించిన ఇవి మేడిపండు చందంగా మారాయి. వీటిలో ఇప్పటి వరకు తాగునీటి సదుపాయం కల్పించలేదు. రెండేళ్లుగా అలంకారప్రాయంగానే ఉన్నాయి. గ్రేటర్‌లోని కూకట్పల్లి హౌసింగ్ బోర్డు, శిల్పారామం, ఖైరతాబాద్‌లతో పాటు ఇటీవల దిల్సుఖ్నగర్, తార్నాక తదితర ప్రాంతాల్లో ఏసీ బస్ షెల్టర్లను ఏర్పాటు చేశారు. మహిళా ప్రయాణికులకు పూర్తి భద్రత, 24 గంటల పాటు ఏసీ సదుపాయం. తాగునీటి వసతి, ఆధునిక టాయిలెట్లు, ఏటీఎం సదుపాయం, బస్‌పాస్ కౌంటర్లు, బస్సుల రాకపోకలపై ఎప్పటికప్పుడు ముందస్తు సమాచారం వంటి సదుపాయాలతో ఆధునిక బస్షెల్టర్లను ఏర్పాటు చేయనున్నట్లు అప్పట్లో చెప్పినా.. ఇప్పటికీ అరకొర సదుపాయాలే తప్ప ఎక్కడా ప్రయాణికులకు ఇవి పూర్తిగా అందుబాటులోకి రాలేదు. ఆ బోర్డులేవీ.. ► బస్సుల రాకపోకలను తెలిపే ఎల్ఈడీ బోర్డులను ఏర్పాటు చేయలేదు. ప్రయాణికుల డిమాండ్ ఉన్న కూకట్పల్లి, ఖైరతాబాద్, శిల్పారామం మార్గాల్లో ప్రతి రోజు వేలాది బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏ బస్సు ఎప్పుడొస్తుందో తెలిపే సమాచారం లేకపోవడంతో ప్రయాణికులు బస్ షెల్టర్లలో వేచి ఉండలేకపోతున్నారు. బస్సుల కోసం ఎదురుచూస్తూ రోడ్డుపైనే పడిగాపులు కాయాల్సి వస్తోంది. ► బస్సుల టైం టేబుల్, అనౌన్స్మెంట్ వ్యవస్థ అమలుకు నోచుకోలేదు. బస్సుల టైం టేబుల్, రాకపోకల సమాచారం డిస్ప్లే ఏర్పాటుపై అటు గ్రేటర్ ఆరీ్టసీ, ఇటు జీహెచ్ఎంసీ ఏ మాత్రం పట్టనట్లుగానే వ్యవహరిస్తున్నాయి. ‘ఆయా మార్గాల్లో రాకపోకలు సాగించే బస్సుల వివరాలన్నింటినీ జీహెచ్ఎంసీకి అందజేశాం. వాటిని ఏర్పాటు చేయాల్సిన బాధ్యత ఆ సంస్థపైనే ఉంది’ అని ఆర్టీసీ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. దాహమేస్తే దిక్కులేదు.. ► చక్కటి డిజైనింగ్, గ్లాస్ డోర్లు, చూడగానే ఇట్టే ఆకట్టుకొనే ఈ బస్òÙల్టర్లలో కనీసం తాగునీటి సదుపాయం లేదు. వీటిని అందుబాటులోకి తెచ్చినప్పుడు సురక్షితమైన తాగునీళ్లు మాత్రమే కాదు. క్యాంటిన్ కూడా ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. టీ, కాఫీ, స్నాక్స్ వంటివి అందుబాటులో ఉంటాయన్నారు. కానీ ఇప్పటికీ తాగునీటి సదుపాయం కల్పించలేదు. ► ఏ ఒక్క బస్ షెల్టర్‌లో ఏసీ పని చేయడం లేదు. ఫ్యాన్లు తిరగడం లేదు. దీంతో బస్షెల్టర్లలో దుర్గంధం వ్యాపిస్తోందని, వేచి ఉండలేకపోతున్నామని ప్రయాణికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ► టాయిలెట్లను ఏర్పాటు చేశారు. కానీ వినియోగానికి ఏ మాత్రం అనుకూలంగా లేవు. మహిళా ప్రయాణికుల భద్రత దృష్ట్యా సీసీ టీవీలను ఏర్పాటు చేశారు. కానీ అవి ఇప్పుడు అలంకారప్రాయంగానే ఉన్నాయి. నిర్వహణ కొరవడింది. -
స్క్రాప్ బస్సులను బస్ షెల్టర్స్ గా ఉపయోగిస్తున్న టీఎస్ ఆర్టీసీ
-
సాక్షి విజిట్ : నిలువ నీడ కరువు..
సిటీలో ఆర్టీసీ ప్రయాణికులకు నిలువ నీడ కరువవుతోంది. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ రోడ్లపైనే వారు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. చాలా బస్టాప్‌లలో షెల్టర్లే లేవు. ఉన్నచోట నిర్వహణ అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్న చోట్ల బస్టాప్‌లలో బస్సులు ఆపక..రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది. మొత్తంగా నగరంలో ఆర్టీసీ ప్రయాణం సిటీజనులకు చుక్కలు చూపుతోంది. అసలే వచ్చేది ఎండాకాలం. ఎండల తీవ్రతకు తలదాచుకునే షెల్టర్లు లేక ఎలా ప్రయాణించాలని వారు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సాక్షి పరిశీలన జరపగా...బస్ షెల్టర్ల దుస్థితి వెలుగుచూసింది. ఈ ఫొటోల్లో ఉన్నది ఏదో దుకాణమో..మరేదైనా నిల్వ కేంద్రమో..పునరావాస కేంద్రమో అనుకుంటున్నారా...కానే కాదు. ఇది అచ్చంగా బస్ షెల్టరే. నమ్మండి.సనత్‌నగర్ పీసీబీ కార్యాలయం వద్ద ఉన్న ఈ ఆర్టీసీ బస్‌షెల్టర్‌లో చాలా కాలంగా ఎవరో అపరిచిత వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వారే మొత్తంసామాన్లతో ఆ ప్రాంతాన్ని నింపేసి జీవనం సాగిస్తున్నారు. ప్రయాణికులు మాత్రం బయట ఎండలో నిల్చుంటున్నారు. ఈ షెల్టర్ పరిస్థితి అధికారుల దృష్టికిఎందుకు రాలేదో మరి వారికే తెలియాలి. ఇలా సిటీలో చాలా ప్రాంతాల్లో బస్షెల్టర్లు ఆక్రమణలకు గురయ్యాయి. ఉన్నా లేనట్టే... ఎంజేఎం కేన్సర్ ఆస్పత్రి ప్రాంతంలో బస్‌స్టాప్ అలంకార ప్రాయంగా మారింది. బస్ షెల్టర్ ఏర్పాటు చేసినా ఈ రూట్లో బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులకు ఉపయోగం లేకుండా పోయింది. అల్లంతదూరంలో.. కూకట్పల్లి(జోన్‌బృందం): కూకట్పల్లి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో బస్‌బేలు ప్రయాణికులకు పనికి రాకుండా పోతున్నాయి. మరికొన్ని ప్రాంతాల్లో చిరువ్యాపారులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. మరి కొన్ని చోట్ల బస్సులు ఆగని ప్రాంతాల్లో బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు లేక వెలవెల పోతున్నాయి. నడిరోడ్డుపై నరకయాతన సనత్‌నగర్: బస్షెల్టర్లు అన్యాక్రాంతం కావడంతో ప్రయాణికులు నడి రోడ్డుపై నరకయాతన పడాల్సి వస్తోంది. పలువురు బస్షెల్టర్లను కబ్జా చేసి తమకు తోచిన రీతిలో వినియోగించుకుంటుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్షెల్టర్లు వ్యాపార కేంద్రాలను తలపిస్తున్నాయి. సనత్‌నగర్ ప్రధాన రహదారిలోని పీసీబీ కార్యాలయం సమీపంలోని బస్‌షెల్టర్ చిరువ్యాపారులకు నిలయంగా మారడంతో ప్రయాణికులు రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది. పార్కింగ్ అడ్డాగా బస్‌బేలు కుత్బుల్లాపూర్: నియోజకవర్గ పరిధిలో మొత్తం 86 బస్ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో కొని నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరికొన్ని పార్కింగ్‌లకు అడ్డాగా మారాయి. ఆర్భాటంగా మొదలు పెట్టిన మోడ్రన్ బస్ షెల్టర్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాన్ షాప్‌లు..టిఫిన్ సెంటర్లు ఉప్పల్: నియోజకవర్గ పరిధిలో కొన్ని బస్ షెల్టర్లలో టిఫిన్ సెంటర్లు, పాన్ షాపులు ఏర్పాటు కాగా మరికొన్ని ప్రాంతాల్లో బస్టాపులు ఉన్నా షెల్టర్లు లేవు. షెల్టర్లు ఉన్న చోట బస్సులు ఆగవు. ఉప్పల్ కేంద్రీయ విద్యాలయ–1 వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాప్ తొలగించి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు మార్చారు. ఇక్కడ ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్టు బస్ షెల్టర్‌గా చెలామణి అవుతుంది. కూర్చునేందుకు లేదు.. అడ్డగుట్ట: మండుతున్న అడ్డగుట్ట డివిజన్లో బస్ షెల్టర్లు లేక, కూర్చునేందుకు బెంచీలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్ పరిధిలో చంద్రయ్య హోటల్ నుంచి తుకారాంగేట్ వరకు, న్యూ బ్రిడ్జి నుంచి శాంతినగర్ చౌరస్తా వరకు ఎక్కడా బస్ షెల్టర్ లేదు. గతంలో లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్మించిన లాలాగూడ రైల్వే బాయ్స్, నూరీ పాన్ షాపుల సమీపంలోని రెండు బస్టాప్‌లు కుక్కలు, పందులు, మేకలకు నివాసం మారాయి. మిల్క్బూత్గా బస్‌షెల్టర్.. సుల్తాన్‌బజార్ : సుల్తాన్ బజార్ ప్రాంతంలో ఆర్టీసీ బస్టాప్‌లు అధ్వానంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామ్‌కోఠి ప్రాంతంలో తాత్కాలిక పాత రేకులతో తాత్కాలిక బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేశారు. పాల వ్యాపారులు బస్టాప్‌ను కబ్జాచేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో ప్రయాణికులు రామ్‌కోఠి చౌరస్తాలోని రోడ్డుపై బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కోఠి ట్రూప్‌బజార్‌లో సూచికబోర్డు తప్పబస్షెల్టర్ జాడ కనిపించడం లేదు. రోడ్డుపైనే పడిగాపులు జియాగూడలోని భీమ్‌నగర్ చౌరస్తా వద్ద ఉన్న బస్టాప్‌లో ఆటోవాలాలు తిష్ట వేశారు. దీంతో ప్రయాణికులు ఎండలో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు. కుల్సుంపురా పోలీస్ క్వార్టర్స్ వద్ద బస్సు షెల్టర్ ఉన్నా నిరూపయోగంగా మారింది. గోడెకబర్ 137 బస్టాప్ వద్ద షెల్టర్ లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు పార్కు చేస్తున్నారు. అఫ్జల్‌గంజ్‌లో.. అఫ్జల్‌గంజ్: అఫ్జల్‌గంజ్‌లోని పలు ప్రాంతాల్లో బస్టాప్‌లు నిరుపయోగంగా మారాయి. బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నవాటిలో అటోలు, ఇతర వాహనాలు పార్కింగ్ చేయడంతో ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను నడిరోడ్డుపైనే నిలుపుతున్నారు. పాతబస్తీలో పత్తాలేనిబస్టాప్లు చార్మినార్ జోన్: పాతబస్తీలోని ప్రధాన కూడళ్లల్లో అవసరమైన మేరకు ఆర్టీసీ బస్టాప్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడక్కడ బస్టాప్‌లు ఉన్నప్పటికీ... ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. కూర్చోడానికి కుర్చీలు లేకపోవడమే కాకుండా బస్టాప్‌ల చుట్టు అపరిశుభ్ర వాతావరణం నెలకొంది. బస్ షెల్టర్లు లేక అవస్థలు మల్కాజిగిరి/నేరేడ్మెట్/గౌతంనగర్/యాప్రాల్: గౌతంనగర్ డివిజన్లోని పలు ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేక ఆర్టీసి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు. మిర్జాల్‌గూడ, సాయిరాం టాకీస్, సాయినగర్ చౌరస్తా, వాణీనగర్, భవానీనగర్ ప్రాంతాల్లో ప్రయాణికులు నిత్యం బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. మల్లికార్జునగర్, జ్యోతినగర్, గౌతంనగర్ ప్రాంతాల్లో షెల్టర్లు లేకపోవడంతో వ్యాపార సముదాయాలు, దుకాణాల ఎదుట బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. యాప్రాల్‌లో..... యాప్రాల్ ప్రధాన రోడ్డు, బాపూజినగర్ చౌరస్తా, జేజేనగర్ తదితర ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సమీపిస్తుండడంతో ప్రయాణికుల నిలువ నీడలేక దుకాణ సముదాయాల వద్ద వేసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. బస్టాప్‌లోనే బైక్‌ల పార్కింగ్ కాచిగూడ: బస్టాపుల్లో షెల్టర్లులేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కాచిగూడలోని సీసీ షరాఫ్ ఆసుపత్రి బిల్డింగ్ నిర్మాణం జరగడంతో బస్‌షెల్టర్‌ను తొలగించారు. బస్ షెల్టర్ స్థలంలో ద్విచక్రవాహనాలను పార్కింగ్ చేస్తున్నారు. దీంతో ప్రయాణీకులు నిలవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. కాచిగూడ రైల్వే స్టేషన్ ఎదురుగా ఏర్పాటు చేసిన బస్ షెల్టర్ పూర్తిగా నిరుపయోగంగా మారింది. -
విజయవాడలో ఆర్టీసీ ప్రయాణికుల పాట్లు
ఓ వైపు మండే ఎండ.. మరోవైపు దుమ్ము.. ఎటువెళ్లాలో తెలీదు.. ఎక్కడ నిలబడాలో అర్థం కాదు.. నీడ కోసం.. విజయవాడలో ఆర్టీసీ ప్రయాణికుల పాట్లు అన్నీఇన్నీ కావు. నగరంలో చాలా ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు అల్లాడుతున్నారు. పోనీ ఏదైనా షాపు నీడన నిల్చుంటే తమవ్యాపారానికి అడ్డుగా ఉన్నారంటూ చీత్కరింపులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మహిళలు చీర కొంగులను, యువతులు చున్నీలు, స్కార్ఫ్‌లను.. విద్యార్థులు పుస్తకాలు, బ్యాగులను నెత్తిన పెట్టుకుని ఎండ నుంచి కాస్త రక్షణ పొందుతున్నారు. సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో ప్రయాణికులకు కావాల్సిన బస్ షెల్టర్స్ నిర్మించడంలో నగరపాలకసంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఎండలోనే బస్సులు కోసం గంటలు తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఆర్టీసీ ప్రయాణికులకు ఏర్పడుతోంది. 55 బస్ షెల్టర్లు అవసరం.. బస్సులు నడిపేది ఆర్టీసీ అయినా బస్ షెల్టర్స్ మాత్రం కార్పొరేషన్ నిర్మిస్తుంది. విజయవాడ నగరంలో ఇప్పటి వరకూ 128 బస్ షెల్టర్స్ ఉండగా.. మరో 55 చోట్ల బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, వన్‌టౌన్, సింగ్‌నగర్, కనకదుర్గ వారధి తదితర ప్రాంతాల్లో ఈ బస్ షెల్టర్స్ అవసరం అవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కాగా 25 వరకు బస్‌షెల్టర్స్ ఇప్పటికే ధ్వంసమయ్యాయి. వీటిని తిరిగి నిర్మించాల్సి ఉంది. ముఖ్యంగా సాంబమూర్తి రోడ్డు, ఏలూరు రోడ్డులో చుట్టుగుంట ప్రాంతంలో బస్‌షెల్టర్స్ పాడైపోయాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే నగరంలో గుంటూరు వైపు వెళ్లే బస్సులన్నీ కనకదుర్గ వారథి నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే ఇక్కడ బస్ షెల్టర్ లేదు. అలాగే ఏలూరు వైపు వెళ్లే బస్సుల కోసం వేచి ఉండేందుకు వారథి వద్ద షెల్టర్ లేదు. షెల్టర్ల నుంచి ఆదాయం.. వాస్తవంగా బస్ షెల్టర్స్ నిర్మిస్తే దాన్ని వ్యాపార ప్రకటనలకు కార్పొరేషన్ ఇచ్చి ఆదాయాన్ని సంపాదించుకుంటుంది. అలాగే కొన్ని వ్యాపార సంస్థలు బస్ షెల్టర్లను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే నగరపాలకసంస్థ అధికారులు దీనిపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వీటి నిర్మాణం ముందుకుసాగడం లేదు. ఏసీ బస్ షెల్టర్ అంటూ.. ఇక స్వరాజ్యమైదానం వద్ద ఏసీ బస్ షెల్టర్ నిర్మిస్తామంటూ గతంలో ఉన్న బస్షెల్టర్స్ను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అయితే తిరిగి మాములు బస్ షెల్టరే నిర్మించడం పై ప్రయాణికులు పెదవి విరిస్తున్నారు. దాతలు సహకారంతో ఏసీ బస్ షెల్టర్స్ నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు. బీఆర్టీఎస్ రోడ్డులో వృథాగా షెల్టర్స్.. బీఆర్టీఎస్ రోడ్డు నిర్మించే సమయంలోనే అక్కడ బస్‌షెల్టర్స్ నిర్మించారు. తొలుత ఏసీ బస్‌షెల్టర్స్ నిర్మించాలని భావించినా తర్వాత గ్లాస్ నాన్ ఏసీ బస్ షెల్టర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో బస్సులు నడవడం లేదు. దీంతో ఈ బస్సు షెల్టర్స్ ఎందుకు పనికిరాకుండా పోయాయి. లక్షలు ఖర్చు చేసి ఇక్కడ నిర్మించిన బస్‌షెల్టర్స్ నిరుపయోగంగా మారడం.. అవసరమైన చోట బస్‌షెల్టర్స్ లేకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు. బస్ షెల్టర్స్‌లో ఆగని బస్సులు.. ఇక బందరురోడ్డు, ఏలూరు రోడ్డులలో బస్ షెల్టర్స్ కొన్ని ఉన్నాయి. అయితే వాటి వద్ద మాత్రం బస్సులు ఆగడం లేదు. బస్ షెల్టర్స్‌కు ముందో, వెనుకో బస్సులను ఆపేస్తున్నారు. దీంతో బస్సు వచ్చిన తర్వాత పరిగెత్తుకు వచ్చి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మహిళా ప్రయాణికులు బస్‌స్టాప్‌లలో కాకుండా బస్సులు ఆగేచోట నిలబడుతున్నారు. ఒక ఒకదాని తర్వాత మరొక బస్సు వస్తుంటే చివర బస్సు బస్ షెల్టర్స్‌కు చాలా దూరంలో ఉంటుంది. ముందు బస్సులు వెళ్లిన తర్వాత తిరిగి బస్‌షెల్టర్ వద్దకు తీసుకు వచ్చి ఆ బస్సులను ఆపడం లేదు. ఇబ్బంది పడుతున్నాం కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నాం. పటమట లంకలో బస్టాప్‌లో షెల్టర్ లేదు. దీంతో ఎండకు ఎండి వానకు తడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల కోసం వేచి ఉండటం కష్టతరమవుతోంది. గతంలో ఉన్న షెల్టర్లను తొలగించి వాటిస్థానంలో కొత్తవి నిరిస్తామంటున్నారు. నిర్మాణం విషయంలో అధికారులు చొరవ తీసుకుని త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది.– ఎం.సత్యనారాయణ, విద్యార్థి బస్టాప్‌లలో ఆగడం లేదు బస్సులు బస్ షెల్టర్ వద్ద కాకుండా ముందో వెనుకో ఆపుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కోసారి బస్సులు ఒకదాని వెనుక ఒకేసారి వస్తుంటాయి. ఆ సమయంలో మాకు కావాల్సిన బస్సు దగ్గరకు వేళ్లే లోపు బస్సు వెళ్లిపోతోంది. అందువల్ల బస్ షెల్టర్స్ ఉన్నా.. కూర్చుకుండా రోడ్డుమీదే నిలబడాల్సి వస్తోంది. బస్సులు కచ్చితంగా బస్ షెల్టర్ వద్ద ఆపేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఎం.ప్రీతి, ఉద్యోగి, వన్‌టౌన్ -
ఆ బస్టాండ్లలో వైఫై, మొబైల్ చార్జింగ్ సౌకర్యం
సాక్షి, హైదరాబాద్ : నగరంలోని బస్షెల్టర్లు ఆధునికతను సంతరించుకుంటున్నాయి. హైటెక్ హంగులతో ఆకట్టుకుంటున్నాయి. ప్రయాణికులకు పూర్తి రక్షణ.. 24 గంటలూ విధులు నిర్వహించే భద్రతా సిబ్బంది.. నిరంతర ఏసీ సదుపాయం.. మహిళల రక్షణకు ప్రత్యేక ఏర్పాట్లు వీటి ప్రత్యేకత. గురువారం ఖైరతాబాద్‌లో అధునాత బస్‌షెల్టర్ ప్రారంభమైంది. దేశంలోనే మొట్టమొదటిసారి సకల సదుపాయాలతో నిర్మించిన సరికొత్త బస్‌షెల్టర్ ఇది. శిల్పారామం, కూకట్పల్లి హౌసింగ్‌బోర్డు, ఖైరతాబాద్‌లో ప్రయోగాత్మకంగా వీటిని నిర్మించారు. శిల్పారామం బస్‌షెల్టర్ వారం కిందట ప్రారంభించగా, కేపీహెచ్‌బీ, ఖైరతాబాద్ ఆర్టీఏ బస్షెల్టర్లు ప్రయాణికులకు గురువారం అందుబాటులోకి వచ్చాయి. ఖైరతాబాద్‌లో మొత్తం 4 షెల్టర్లను ఏసీ సదుపాయంతో కట్టించారు. ఈ షెల్టర్‌లో 24 గంటలపాటు వైఫై సదుపాయం ఉంటుంది. మొబైల్ చార్జింగ్ చేసుకోవచ్చు. మహిళలకు, పురుషులకు ప్రత్యేక టాయిలెట్లు నిర్మించారు. తడి, పొడి చెత్త డబ్బాలు ఏర్పాటు చేశారు. అన్ని షెల్టర్లలోనూ సీసీటీవీలున్నాయి. వీటిల్లో నమోదయ్యే దృశ్యాలు నెలరోజుల బ్యాక్అప్తో లభిస్తాయి. రాత్రింబవళ్లు విధులు నిర్వహించే విధంగా 3 షిఫ్టుల్లో సెక్యూరిటీ అందుబాటులో ఉంటుంది. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా భద్రతా సిబ్బంది రాత్రి, పగలు విధులు నిర్వహిస్తారు. మహిళల భద్రత కోసం ప్యానిక్ బటన్... బస్షెల్టర్లలో, మహిళా టాయిలెట్ల వద్ద ఎఫ్ఓఎఫ్ ప్యానిక్ బటన్లను ఏర్పాటు చేశారు. అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకున్నప్పుడు ఈ బటన్ మోగిస్తే గట్టిగా అలారం వినిస్తుంది. వెంటనే సెక్యూరిటీ అప్రమత్తమవుతారు. పోలీసులకు సమాచారం అందించేవిధంగా బస్షెల్టర్ల నిర్వాహకుల కార్యాలయంలోనూ అలారం వినిపించే విధంగా ఏర్పాటు చేశారు. దీనిని త్వరలో పోలీస్స్టేషన్లకు కూడా అను సంధానించనున్నట్లు యూనియాడ్స్ ప్రతినిధి రాజు ‘సాక్షి’తో చెప్పారు. బస్‌షెల్టర్‌ను పరిశుభ్రంగా ఉం చేందుకు హౌస్‌కీపింగ్ సిబ్బంది కూడా అందుబాటులో ఉంటారు. ఖైరతాబాద్‌లో మొత్తం 4 షెల్టర్లు ఉ న్నాయి. వీటిలో ప్రయాణికులు ఎక్కడ ఉంటే అక్కడ ఏసీ ఆన్ చేస్తారు. మిగతా చోట్ల నిలిపివేస్తారు. మరిన్ని షెల్టర్లు... గ్రేటర్ హైదరాబాద్‌లో మొత్తం 826 బస్షెల్టర్లను ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం(పీపీపీ) పద్ధతిలో నిర్మించేందుకు జీహెచ్ఎంసీ కార్యాచరణ చేపట్టిన సంగతి తెలిసిందే. పైలట్ ప్రాజెక్టులో భాగంగా ఈ మూడింటిని నిర్మించారు. త్వరలో దిల్సుఖ్నగర్, కోఠీ, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ల వద్ద బస్షెల్టర్లను నిర్మించనున్నారు. దశలవారీగా నగరంలోని అన్ని ప్రాంతాల్లో ఆధునిక బస్షెల్టర్ల నిర్మాణం పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలిపారు. మొదటి కేటగిరీకి చెందిన వాటిని ఏసీ సదుపాయంతో ఏర్పాటు చేస్తుండగా, మిగతా 2 కేటగిరీలకు చెందిన షెల్టర్లను నాన్ ఏసీ షెల్టర్లుగా నిర్మించనున్నారు. -
నిలువ నీడ కరువు
► ప్రధాన జంక్షన్లలో కానరాని బస్షెల్టర్లు ► మండుటెండలో ప్రయాణికులకు తప్పని అవస్థలు ► చెట్ల నీడన, దుకాణాల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి ► రహదారుల విస్తరణ నేపథ్యంలో బస్ షెల్టర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ విజయనగరం మున్సిపాలిటీ: జిల్లా కేంద్రంలో ప్రయాణికులకు నిలువనీడ కరువైంది. పట్టణం నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే వారితో పాటు వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే ప్రయాణికుల సంఖ్య ప్రతి రోజూ వేలల్లో ఉన్నప్పటికీ వారికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం పాలకులు, అధికారులు నిర్లక్ష్యం కనబరుస్తున్నారు. ఎండలో ఎండుతూ, వర్షంలో తడుస్తూ బస్సులు, ఇతర వాహనాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాన జంక్షన్లలో బస్ షెల్టర్లు లేకపోవడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణం. ప్రస్తుతం ప్రతి రోజూ 41 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతోంది. దీంతో రోడ్లపైన బస్సులు, ఆటోల కోసం వేచి ఉండడం కూడా ఒక విధంగా సాహసమనే చెప్పాలి. దగ్గర్లో ఉన్న చెట్ల నీడన, దుకాణాల వద్ద నిరీక్షించాల్సిన దుస్థితి నెలకొంది. ఇబ్బందుల నడుమ నిరీక్షణ మున్సిపాలిటీ పరిధిలో సుమారు మూడు లక్షలకు పైగా ప్రజలు నివసిస్తున్నారు. వీరిలో కొంతమంది ప్రతి రోజూ ఉద్యోగం, వ్యాపారం నిమిత్తం వివిధ ప్రాంతాలకు వెళ్తుంటారు. అలాగే వివిధ ప్రాంతాల నుంచి పట్టణానికి వచ్చే వారి సంఖ్య కూడా వేలల్లోనే ఉంటుంది. అయితే సేదతీరేందుకు అవసరమైన బస్షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. గతంలో ఉన్న బస్షెల్టర్లు కూడా రోడ్ల విస్తరణ పేరుతో తొలగించడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రధానంగా పరిశీలిస్తే జిల్లా పరిపాలన కేంద్రమైన కలెక్టరేట్ జంక్షన్, మయూరి జంక్షన్, ఆర్టీసీ కాంప్లెక్స్ జంక్షన్, బాలాజీ జంక్షన్, దాసన్నపేట రింగ్‌రోడ్ జంక్షన్, మూడు లాంతర్ల జంక్షన్, రింగ్‌రోడ్ ఐస్‌ఫ్యాక్టరీ జంక్షన్, మున్సిపాలిటీ కార్యాలయం జంక్షన్ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజలు వివిధ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఈ ప్రాంతాల్లో ఎటువంటి బస్షెల్టర్లు లేకపోగా.. అవసరం లేని కొత్తపేట జంక్షన్, పూల్‌బాగ్‌కాలనీ ప్రాంతాల్లో గతంలో ఏర్పాటు చేసిన రెండు షెల్టర్లు శిథిలావస్థకు చేరుకున్నాయి. గతంలో ఎమ్మెల్యే, ఎంపీల నిధులతో విచ్చలవిడిగా బస్షెల్టర్లు ఏర్పాటు చేసే సంస్కృతి ఉండగా.. ప్రస్తుతం అటువంటి సౌకర్యాల కల్పనపై ప్రజాప్రతినిధులు దృష్టి సారించకపోవడం ఇబ్బందికరంగా మారుతోంది. అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ఇటువంటి సౌకర్యాలు సమకూర్చే విధంగా అధికారులు దృష్టి సారించాలని పలువురు ప్రయాణికులు కోరుతున్నారు. పక్కనే ఉన్న విశాఖ జిల్లాలో ప్రతి 100 మీటర్ల దూరంలో అధునాత సౌకర్యాలతో బస్ షెల్టర్లు ఏర్పాటు చేస్తుంటే అభివృద్ధి పేరు చెప్పి కాలం గడుపుతున్న జిల్లా ప్రజాప్రతినిధులు, అధికారులు ఆ దిశగా ఆలోచించాల్సిన అవసరం ఉందన్న వాదనలు వ్యక్తమవుతున్నాయి. రహదారుల విస్తరణ నేపథ్యంలోనైనా స్పందించేనా...? ప్రస్తుతం విజయనగరం పట్టణంలో రహదారి విస్తరణ పనులు పేరిట అధికార యంత్రాంగం హడావుడి చేస్తోంది. మున్సిపాలిటీ, ఆర్అండ్బీ, ఉడా ఆధ్వర్యంలో రూ. కోట్లు వెచ్చించి అభివృద్ధి, రహదారి విస్తరణ పనుల పేరిట చేపడుతున్న పనుల్లో భాగంగానైనా ప్రధాన జంక్షన్లలో బస్షెల్టర్లు నిర్మించాలన్న డిమాండ్ వ్యక్తమవుతోంది. పట్టించుకునే వారేరి..? అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతున్న పట్టణంలో ప్రయాణికుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ఈ నేపథ్యంలో ప్రధాన జంక్షన్లో బస్ షెల్టర్లు లేకపోవడం దురదృష్టకరం. షెల్టర్ల ఏర్పాటుకు పాలకులు, స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలి. – కె. అనిల్‌రాజు ,ప్రైవేటు ఉద్యోగి, విజయనగరం. -
బస్ షెల్టర్ల నిర్వహణ సక్రమంగా లేదు: కేటీఆర్
హైదరాబాద్: హైదరాబాద్ నగరపాలక సంస్థ(జీహెచ్ఎంసీ) పరిధిలో బస్సు షెల్టర్ల నిర్వహణ సక్రమంగా జరగడం లేదని మున్సిపల్, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. ఆయన శుక్రవారం శాసనమండలిలో మాట్లాడారు. హైదరాబాద్‌లో మొత్తం 1183 బస్ షెల్టర్లు ఉండగా 430 బస్ షెల్టర్ల ఆధునీకరణకు టెండర్లు పిలిచామని వివరించారు. ఈసారి బడ్జెట్లో జీహెచ్ఎంసీకి రూ.వెయ్యి కోట్లు కేటాయించామన్నారు. రవాణా వ్యవస్థను జీహెచ్ఎంసీ పరిధిలోకి తీసుకునే ఆలోచన చేస్తామన్నారు. ప్రజల జీవన ప్రమాణాల్లో దేశంలోనే హైదరాబాద్ మొదటి స్థానంలో ఉందన్నారు.. కల్వకుర్తి, జడ్చర్ల, షాద్‌నగర్‌లలో వర్షాలు తక్కువగా కురయడం వల్ల ఈ ఏడాది కూడా నీటి ఎద్దడిని దృష్టిలో పెట్టుకుని నిధులు కేటాయించామన్నారు. జడ్చర్లకు రూ.2.40 లక్షలు, కల్వకుర్తికి రూ. 6.70 లక్షలు, షాద్‌నగర్‌కు రూ. 6.90 లక్షలు కేటాయించామన్నారు. -
బస్షెల్టర్లు ఇక హైఫై
గ్రేటర్లో త్వరలో ఏర్పాటు హైటెక్ వసతులతో నయా రూపం.. నాలుగు కేటగిరీలుగా 430 చోట్ల.. సిటీబ్యూరో: సిటీలో బస్ షెల్టర్లు..ఇక హైటెక్ హంగులతో ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న అధ్వానపు షెల్టర్ల స్థానంలో ‘హై ఫై’ షెల్టర్లు కొలువుదీరనున్నాయి. మీరు షెల్టర్‌కు వెళితే..అత్యాధునిక సౌకర్యాలు మీ చెంతకు వస్తాయి. అరచేతిలో టెక్ వ్యవస్థ ఆర్ఎఫ్పీలను నాలుగు ప్యాకేజీలుగా ఆహ్వానించనున్నారు. ప్రతి ప్యాకేజీలోనూ ఏ,బీ,సీ,డీ గ్రేడ్లు ఉంటాయి అలవోకగా ఇముడుతుంది. వీటితోపాటు సామాన్య సదుపాయాలు కలిగిన బస్షెల్టర్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ , తదితర నగరాల్లోని బస్షెల్టర్లను చూసి వచ్చిన జీహెచ్ఎంసీ, అస్కీ ప్రతినిధుల బృందం దేశంలోని ఏ నగరానికీ తీసిపోని విధంగా హైదరాబాద్‌లోనూ ఉత్తమ సదుపాయాలతో కూడిన బస్షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్షిప్(పీపీపీ) పద్ధతిలో వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్ఎఫ్పీ) జారీ చేయనున్నారు. కనీసం పది సంవత్సరాల కాలవ్యవధితో పేర్కొన్న సదుపాయాలను కల్పించడంతోపాటు, నిర్వహణ బాధ్యతల్ని సైతం కాంట్రాక్టు సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. అత్యున్నత సదుపాయాలు కలిగిన బస్షెల్టర్లతో సహా మొత్తం నాలుగు గ్రేడ్లుగా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, సదుపాయాలు కలిగిన వాటిని ఏ గ్రేడ్‌గా పేర్కొంటుండగా, సదుపాయాలు తగ్గే కొద్దీ బీ, సీ,డీ గ్రేడ్లుగా మరో మూడు కేటగిరీలు వెరసి మొత్తం నాలుగు గ్రేడ్లలో బస్షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. బస్ షెల్టర్‌ను సూచించే సైనేజీ, లైటింగ్, ఫుట్‌పాత్, సీటింగ్, బస్రూట్లు, బస్నెంబర్లు, ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లేది, బస్సు వేళలు, తదితర ప్రయాణికులకు అవసరమైన సమాచారం అన్ని గ్రేడ్లలోనూ ఉండనున్నప్పటికీ, ‘ఏ’ గ్రేడ్‌లో వైఫై, మొబైల్ చార్జింగ్, ఏటీఎం, కాఫీ మిషన్, ఏసీ, పే ఫోన్, ఐవీఆర్ఎస్, మంచినీరు తదితర అదనపు సదుపాయాలుంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలు బస్‌షెల్టర్ పైన, సైడ్ ప్యానెల్స్, సీటింగ్‌కు వెనుకవైపు వాణిజ్య ప్రకటనలకు స్థలాన్ని అద్దెకిచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని గ్రేడ్లలో వెరసి గ్రేటర్ వ్యాప్తంగా 430 బస్షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. నిజంగా ఇవి అందుబాటులోకి వస్తే నగరంలో మురికి కూపాలుగా మారిన షెల్టర్లకు మోక్షం లభిస్తుంది. -
బస్సు ఆగని షెల్టర్లు
-
ఇక బస్సు షెల్టర్లపై సౌర విద్యుత్..
న్యూఢిల్లీ: దేశ రాజధాని నగరంలో రోజురోజుకూ కరెంట్ సమస్య ఉత్పన్నమవుతుండటంతో దాన్ని అధిగమించే దిశగా ఢిల్లీ ఆమ్ఆద్మీ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. అందులోభాగంగానే సౌర విద్యుత్‌ను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది. ప్రత్యేకించి ఢిల్లీ రవాణా సంస్థ (డీటీసీ) బస్సు షెల్టర్లపైభాగంలో సోలార్ ప్యానెల్‌ను నిర్మించి సౌరవిద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని భావిస్తోంది. ప్రతి సంవత్సరం సాంప్రదాయ విద్యుత్ ఉత్పత్తికి అయ్యే ఖర్చు పెరిగిపోతుండటంతో భవిష్యత్త్‌లో విద్యుత్ ఉత్పత్తి సమస్యను నివారించాలంటే ఈ సౌర విద్యుత్ ఉత్పత్తి ఒక్కటే మార్గమని ఢిల్లీ ప్రభుత్వం యోచిస్తోందని విద్యుత్ శాఖ మంత్రి సత్యేందర్ జైన్ చెప్పారు. సోలార్ ప్యానెల్స్‌ను సిటీ బస్సు షెల్టర్ల పైకప్పు భాగంలో అమర్చడం వల్ల ఎక్కువమొత్తంలో సౌరవిద్యుత్ ఉత్పత్తి చేసుకోవచ్చనని మంత్రి సత్యేందర్ జైన్ పిటీఐతో చెప్పారు. ఈ సోలార్ ప్రాజెక్టుపై ప్రభుత్వం చర్చలు జరుపుతోందని, త్వరలో దీనిపై తుది నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని ఆయన అన్నారు. బస్సు షెల్టర్ల పైభాగంలో సోలార్ ప్యానెల్స్ నిర్మించడం వల్ల సౌరవిద్యుత్ ఉత్పత్తి చేయడానికి ప్రభుత్వానికి సులభంగా ఉంటుందని చెప్పారు. అంతేకాకుండా సోలార్ ప్యానెల్ కలిగిన షెడ్లను కూడా నిర్మించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు జైన్ తెలిపారు. వీటి నిర్మాణం ఆధునిక సాంకేతికతో తీర్చిదిద్దాలని భావిస్తున్నట్టు చెప్పారు. వచ్చే ఐదు సంవత్సరాల్లో 1000 మెగావాట్ల సోలార్ విద్యుత్‌ను ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్టు మంత్రి జైన్ పేర్కొన్నారు. కాగా, సోలార్ విద్యుత్ ధరలు సాంప్రదాయ విద్యుత్ ఒకేలా ఉంటాయనీ, కానీ రానున్న సంవత్సరాల్లో సోలార్ విద్యుత్ ధరలు చాలా తక్కువ ఉంటాయని సత్యేందర్ జైన్ ఆశాభావం వ్యక్తం చేశారు. -
ఉన్నత చదువులకు ఎన్ని కష్టాలో...
అరకొర బస్సులతో అవస్థలు {పమాదమని తెలిసినా తప్పని ప్రయాణం ఇబ్బందుల్లో విద్యార్థులు మునగపాక: విద్యారంగం అభివృద్ధికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నామంటూ ప్రకటనలు చేయడమే తప్పా విద్యార్థులకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో శ్రద్ధ వహించడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ విద్యార్థులు ఉన్నత చదువుల నిమిత్తం ఇతర ప్రాంతాలకు వెళ్లి చుదువుకోవాలంటే పడరాని పాట్లు పడాల్సి వస్తోంది. వారు పడుతున్న కష్టాలు చెప్పలేనివి. మునగపాకతో పాటు పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థినీ, విద్యార్థులు అనకాపల్లి, గాజువాక, కశింకోటలోని ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్‌లో చదువుకుంటున్నారు. అటు అచ్యుతాపురం, విశాఖపట్నంలోని పలు ఐటీఐలో విద్యను అభ్యసిస్తున్నారు. వీరు వేచి ఉండేందుకు కనీసం బస్షెల్టర్లు లేవు. ఉదయం నుంచి బస్సుల కోసం ఎదురు చూడడం తీరా బస్సులు వస్తే ర ద్దీగా ఉండడంతో కొంతమంది విద్యార్థులు ఆటోలను ఆశ్రయిస్తున్నారు. వీరు సకాలంలో కళాశాలలకు చేరుకోలేకపోతున్నారు. మరి కొందరు విద్యార్థులు ప్రమాదమని తెలిసినా తప్పని స్థితిలో పుట్‌పాత్‌పై నిలబడి గ్రిల్స్‌ను పట్టుకుని రాకపోకలు సాగిస్తున్నారు. వేలాడుతూ వెళ్లడం వల్ల పొరపాటున పట్టుతప్పితే ప్రమాదం బారినపడక తప్పదు. ఆయా ప్రాంతాలకు వెళ్లాలం టే బస్సు ప్రయాణం ఒక్కటే మార్గం. దీంతో ఉదయం 8 గంటల నుంచి విద్యార్థులు మునగపాకలోని మెయిన్ రోడ్డుకు చేరుకుంటారు. ఆ సమయం లో ఉన్న ఒకటి, రెండు బస్సులు కూడా కిక్కిరిసిన ప్రయాణికులతో వస్తుండడంతో బస్సులు ఆపకపోవడంతో ఆర్థికభారమైనా ఆటోలను ఆశ్రయిస్తున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా బస్సులను నడపాలని వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రమాదమైనా తప్పడం లేదు నేను ఆర్ఈసీఎస్ పాలిటెక్నిక్‌లో చదువుకునేందుకు బస్సుపై వెళ్తున్నాను. ఉదయం సమయంలో పై గ్రామాల నుంచి వచ్చే బస్సు అసలు ఖాళీ ఉండడం లేదు. కళాశాలకు హాజరుకావాలన్న ఆత్రుతతో ప్రమాదమని తెలిసినా పుట్‌పాత్‌పై నిలబడి రాకపోకలు సాగిస్తున్నాను. అయినా సకాలంలో కళాశాలకు వెళ్లలేకపోతున్నాం. -దాడి తులసీరామ్, పాలిటెక్నిక్ విద్యార్థి హాజరు కోల్పోతున్నాం అరకొర బస్సుల కారణంగా కళాశాలలకు అనుకున్న సమయాలకు హాజరుకాలేకపోతున్నాం. కొన్నిసార్లు ప్రయాణికులు ఎక్కువ మంది ఉన్నారనే నెపంతో బస్సులు ఆపడం లేదు. దీంతో ఆటోలను ఆశ్రయించి వెళ్తున్నాం. ఆటోలో ప్రయాణికులంతా ఎక్కుతే గానీ తీసుకువెళ్లడం లేదు. ఫలితంగా హాజరు కోల్పోతున్నాం. -ప్రదీప్, ఇంటర్ విద్యార్థి, మునగపాక