బస్‌షెల్టర్లు ఇక హైఫై
గ్రేటర్‌లో త్వరలో ఏర్పాటు
హైటెక్ వసతులతో నయా రూపం..
నాలుగు కేటగిరీలుగా 430 చోట్ల..
సిటీబ్యూరో: సిటీలో బస్ షెల్టర్లు..ఇక హైటెక్ హంగులతో ఏర్పాటు కానున్నాయి. ఇప్పుడున్న అధ్వానపు షెల్టర్ల స్థానంలో ‘హై ఫై’ షెల్టర్లు కొలువుదీరనున్నాయి. మీరు షెల్టర్‌కు వెళితే..అత్యాధునిక సౌకర్యాలు మీ చెంతకు వస్తాయి. అరచేతిలో టెక్ వ్యవస్థ ఆర్‌ఎఫ్‌పీలను నాలుగు ప్యాకేజీలుగా ఆహ్వానించనున్నారు. ప్రతి ప్యాకేజీలోనూ ఏ,బీ,సీ,డీ గ్రేడ్లు ఉంటాయి అలవోకగా ఇముడుతుంది. వీటితోపాటు సామాన్య సదుపాయాలు కలిగిన బస్‌షెల్టర్లను సైతం ఏర్పాటు చేయనున్నారు. ఢిల్లీ , తదితర నగరాల్లోని బస్‌షెల్టర్లను చూసి వచ్చిన జీహెచ్‌ఎంసీ, అస్కీ ప్రతినిధుల బృందం దేశంలోని ఏ నగరానికీ తీసిపోని విధంగా హైదరాబాద్‌లోనూ ఉత్తమ సదుపాయాలతో కూడిన బస్‌షెల్టర్లను ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
పబ్లిక్, ప్రైవేట్ పార్టనర్‌షిప్(పీపీపీ) పద్ధతిలో వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలను ఆహ్వానిస్తూ త్వరలోనే రిక్వెస్ట్ ఫర్ ప్రపోజల్(ఆర్‌ఎఫ్‌పీ) జారీ చేయనున్నారు. కనీసం పది సంవత్సరాల కాలవ్యవధితో పేర్కొన్న సదుపాయాలను కల్పించడంతోపాటు, నిర్వహణ బాధ్యతల్ని సైతం కాంట్రాక్టు సంస్థ చేపట్టాల్సి ఉంటుంది. అత్యున్నత సదుపాయాలు కలిగిన బస్‌షెల్టర్లతో సహా మొత్తం నాలుగు గ్రేడ్లుగా వీటిని ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. అత్యున్నత ప్రమాణాలు, సదుపాయాలు కలిగిన వాటిని ఏ గ్రేడ్‌గా పేర్కొంటుండగా, సదుపాయాలు తగ్గే కొద్దీ బీ, సీ,డీ గ్రేడ్‌లుగా మరో మూడు కేటగిరీలు వెరసి మొత్తం నాలుగు గ్రేడ్లలో బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. బస్ షెల్టర్‌ను సూచించే సైనేజీ, లైటింగ్, ఫుట్‌పాత్, సీటింగ్, బస్‌రూట్లు, బస్‌నెంబర్లు, ఎక్కడినుంచి ఎక్కడకు వెళ్లేది, బస్సు వేళలు, తదితర ప్రయాణికులకు అవసరమైన సమాచారం అన్ని గ్రేడ్లలోనూ ఉండనున్నప్పటికీ, ‘ఏ’ గ్రేడ్‌లో వైఫై, మొబైల్ చార్జింగ్, ఏటీఎం, కాఫీ మిషన్, ఏసీ, పే ఫోన్, ఐవీఆర్‌ఎస్, మంచినీరు తదితర అదనపు సదుపాయాలుంటాయి. వీటిని ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చే సంస్థలు బస్‌షెల్టర్ పైన, సైడ్ ప్యానెల్స్, సీటింగ్‌కు వెనుకవైపు వాణిజ్య ప్రకటనలకు స్థలాన్ని అద్దెకిచ్చుకునే అవకాశం ఉంటుంది. అన్ని గ్రేడ్లలో వెరసి గ్రేటర్ వ్యాప్తంగా 430 బస్‌షెల్టర్లు ఏర్పాటు చేయనున్నారు. నిజంగా ఇవి అందుబాటులోకి వస్తే నగరంలో మురికి కూపాలుగా మారిన షెల్టర్లకు మోక్షం లభిస్తుంది.