సాక్షి విజిట్‌ : నిలువ నీడ కరువు.. | Sakshi Visit on Hamara Hyderabad Bus Shelters | Sakshi
Sakshi News home page

నిలువ నీడ కరువు..

Published Wed, Feb 26 2020 10:54 AM | Last Updated on Wed, Feb 26 2020 11:05 AM

Sakshi Visit on Hamara Hyderabad Bus Shelters

సిటీలో ఆర్టీసీ ప్రయాణికులకు నిలువ నీడ కరువవుతోంది. ఎండకు ఎండుతూ..వానకు తడుస్తూ రోడ్లపైనే వారు బస్సుల కోసం పడిగాపులు కాయాల్సి వస్తోంది. చాలా బస్టాప్‌లలో షెల్టర్లే లేవు. ఉన్నచోట నిర్వహణ అధ్వానంగా మారి శిథిలావస్థకు చేరుకున్నాయి. కొన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయి. మరికొన్న చోట్ల బస్టాప్‌లలో బస్సులు ఆపక..రోడ్లపై పరుగులు తీయాల్సి వస్తోంది. మొత్తంగా నగరంలో ఆర్టీసీ ప్రయాణం సిటీజనులకు చుక్కలు చూపుతోంది. అసలే వచ్చేది ఎండాకాలం. ఎండల తీవ్రతకు తలదాచుకునే షెల్టర్లు లేక ఎలా ప్రయాణించాలని వారు ప్రశ్నిస్తున్నారు. నగరంలోని పలు ప్రాంతాల్లో సాక్షి పరిశీలన జరపగా...బస్‌ షెల్టర్ల దుస్థితి వెలుగుచూసింది. 

ఈ ఫొటోల్లో ఉన్నది ఏదో దుకాణమో..మరేదైనా నిల్వ కేంద్రమో..పునరావాస కేంద్రమో అనుకుంటున్నారా...కానే కాదు. ఇది అచ్చంగా బస్‌ షెల్టరే. నమ్మండి.సనత్‌నగర్‌ పీసీబీ కార్యాలయం వద్ద ఉన్న ఈ ఆర్టీసీ బస్‌షెల్టర్‌లో చాలా కాలంగా ఎవరో అపరిచిత వ్యక్తులు నివాసం ఉంటున్నారు. వారే మొత్తంసామాన్లతో ఆ ప్రాంతాన్ని నింపేసి జీవనం సాగిస్తున్నారు. ప్రయాణికులు మాత్రం బయట ఎండలో నిల్చుంటున్నారు. ఈ షెల్టర్‌ పరిస్థితి అధికారుల దృష్టికిఎందుకు రాలేదో మరి వారికే తెలియాలి. ఇలా సిటీలో చాలా ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు ఆక్రమణలకు గురయ్యాయి.  


ఉన్నా లేనట్టే...
ఎంజేఎం కేన్సర్‌ ఆస్పత్రి ప్రాంతంలో బస్‌స్టాప్‌ అలంకార ప్రాయంగా మారింది. బస్‌ షెల్టర్‌ ఏర్పాటు చేసినా ఈ రూట్‌లో బస్సులు తిరగక పోవడంతో ప్రయాణికులకు ఉపయోగం లేకుండా పోయింది.  

అల్లంతదూరంలో..
కూకట్‌పల్లి(జోన్‌బృందం): కూకట్‌పల్లి నియోజకవర్గ పరిధిలో పలు ప్రాంతాల్లో బస్‌బేలు ప్రయాణికులకు పనికి రాకుండా పోతున్నాయి.  మరికొన్ని ప్రాంతాల్లో చిరువ్యాపారులు స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు.  మరి కొన్ని చోట్ల బస్సులు ఆగని ప్రాంతాల్లో బస్‌స్టాప్‌లను ఏర్పాటు చేయడంతో ప్రయాణికులు లేక వెలవెల పోతున్నాయి.  

నడిరోడ్డుపై నరకయాతన
సనత్‌నగర్‌: బస్‌షెల్టర్లు అన్యాక్రాంతం కావడంతో  ప్రయాణికులు నడి రోడ్డుపై నరకయాతన పడాల్సి వస్తోంది. పలువురు బస్‌షెల్టర్లను కబ్జా చేసి తమకు తోచిన రీతిలో   వినియోగించుకుంటుండడంతో ప్రయాణికులు అవస్థలు పడుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో బస్‌షెల్టర్లు వ్యాపార కేంద్రాలను తలపిస్తున్నాయి. సనత్‌నగర్‌ ప్రధాన రహదారిలోని పీసీబీ కార్యాలయం సమీపంలోని బస్‌షెల్టర్‌ చిరువ్యాపారులకు నిలయంగా మారడంతో ప్రయాణికులు  రోడ్డుపైనే వేచి ఉండాల్సి వస్తోంది.  

పార్కింగ్‌ అడ్డాగా బస్‌బేలు
కుత్బుల్లాపూర్‌: నియోజకవర్గ పరిధిలో మొత్తం 86 బస్‌ షెల్టర్లు ఉన్నాయి. వీటిలో కొని నిర్వహణ, పర్యవేక్షణ లేకపోవడంతో నిరుపయోగంగా మారాయి. మరికొన్ని పార్కింగ్‌లకు అడ్డాగా మారాయి. ఆర్భాటంగా మొదలు పెట్టిన మోడ్రన్‌ బస్‌ షెల్టర్ల నిర్మాణం మధ్యలోనే ఆగిపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.  

పాన్‌ షాప్‌లు..టిఫిన్‌ సెంటర్లు
ఉప్పల్‌: నియోజకవర్గ పరిధిలో కొన్ని బస్‌ షెల్టర్లలో టిఫిన్‌ సెంటర్లు, పాన్‌ షాపులు ఏర్పాటు కాగా మరికొన్ని ప్రాంతాల్లో బస్టాపులు ఉన్నా షెల్టర్లు లేవు. షెల్టర్లు ఉన్న చోట బస్సులు ఆగవు. ఉప్పల్‌ కేంద్రీయ విద్యాలయ–1 వద్ద ఉన్న ఆర్టీసీ బస్టాప్‌ తొలగించి సమీపంలోని ఆంజనేయ స్వామి ఆలయం వద్దకు మార్చారు. ఇక్కడ ఫుట్‌పాత్‌పై ఉన్న చెట్టు బస్‌ షెల్టర్‌గా చెలామణి అవుతుంది.  

కూర్చునేందుకు లేదు..
అడ్డగుట్ట:  మండుతున్న అడ్డగుట్ట డివిజన్‌లో బస్‌ షెల్టర్లు లేక, కూర్చునేందుకు బెంచీలు లేక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. డివిజన్‌ పరిధిలో చంద్రయ్య హోటల్‌ నుంచి  తుకారాంగేట్‌ వరకు, న్యూ బ్రిడ్జి నుంచి శాంతినగర్‌ చౌరస్తా వరకు ఎక్కడా బస్‌ షెల్టర్‌ లేదు. గతంలో లయన్స్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్మించిన లాలాగూడ రైల్వే బాయ్స్, నూరీ పాన్‌ షాపుల సమీపంలోని రెండు బస్టాప్‌లు కుక్కలు, పందులు, మేకలకు నివాసం మారాయి.
 
మిల్క్‌బూత్‌గా బస్‌షెల్టర్‌..
సుల్తాన్‌బజార్‌ :  సుల్తాన్‌ బజార్‌ ప్రాంతంలో ఆర్టీసీ బస్టాప్‌లు అధ్వానంగా మారాయి. కొన్ని ప్రాంతాల్లో బస్సు షెల్టర్లు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రామ్‌కోఠి ప్రాంతంలో తాత్కాలిక   పాత రేకులతో తాత్కాలిక బస్‌స్టాప్‌ను ఏర్పాటు చేశారు.  పాల వ్యాపారులు బస్టాప్‌ను కబ్జాచేసి వ్యాపారం కొనసాగిస్తున్నారు. దీంతో ప్రయాణికులు రామ్‌కోఠి చౌరస్తాలోని రోడ్డుపై బస్సుల కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. కోఠి ట్రూప్‌బజార్‌లో సూచికబోర్డు తప్పబస్‌షెల్టర్‌ జాడ కనిపించడం లేదు.


రోడ్డుపైనే పడిగాపులు
జియాగూడలోని భీమ్‌నగర్‌ చౌరస్తా వద్ద ఉన్న బస్టాప్‌లో ఆటోవాలాలు తిష్ట వేశారు. దీంతో ప్రయాణికులు ఎండలో నిల్చోలేక ఇబ్బందులు పడుతున్నారు. కుల్సుంపురా పోలీస్‌ క్వార్టర్స్‌ వద్ద బస్సు షెల్టర్‌ ఉన్నా నిరూపయోగంగా మారింది. గోడెకబర్‌ 137 బస్టాప్‌ వద్ద షెల్టర్‌ లేకపోవడంతో ద్విచక్ర వాహనాలు పార్కు చేస్తున్నారు.
అఫ్జల్‌గంజ్‌లో..
అఫ్జల్‌గంజ్‌: అఫ్జల్‌గంజ్‌లోని పలు ప్రాంతాల్లో బస్టాప్‌లు నిరుపయోగంగా మారాయి. బస్‌ షెల్టర్లు లేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. ఉన్నవాటిలో అటోలు, ఇతర వాహనాలు పార్కింగ్‌ చేయడంతో ఆర్టీసీ డ్రైవర్లు బస్సులను నడిరోడ్డుపైనే నిలుపుతున్నారు.

పాతబస్తీలో పత్తాలేనిబస్టాప్‌లు
చార్మినార్‌ జోన్‌: పాతబస్తీలోని ప్రధాన కూడళ్లల్లో అవసరమైన మేరకు ఆర్టీసీ బస్టాప్‌లు అందుబాటులో లేకపోవడంతో ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. అక్కడక్కడ బస్టాప్‌లు ఉన్నప్పటికీ...  ప్రయాణికులకు ఎలాంటి సౌకర్యాలు లేవు. కూర్చోడానికి కుర్చీలు లేకపోవడమే కాకుండా బస్టాప్‌ల చుట్టు అపరిశుభ్ర వాతావరణం నెలకొంది.

బస్‌ షెల్టర్లు లేక అవస్థలు 
మల్కాజిగిరి/నేరేడ్‌మెట్‌/గౌతంనగర్‌/యాప్రాల్‌: గౌతంనగర్‌ డివిజన్‌లోని పలు ప్రాంతాల్లో బస్‌ షెల్టర్లు లేక ఆర్టీసి ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులకు గురువుతున్నారు.  మిర్జాల్‌గూడ, సాయిరాం టాకీస్, సాయినగర్‌ చౌరస్తా, వాణీనగర్, భవానీనగర్‌ ప్రాంతాల్లో ప్రయాణికులు నిత్యం  బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. మల్లికార్జునగర్, జ్యోతినగర్, గౌతంనగర్‌ ప్రాంతాల్లో షెల్టర్లు లేకపోవడంతో వ్యాపార సముదాయాలు, దుకాణాల ఎదుట బస్సుల కోసం నిరీక్షించాల్సి వస్తోంది. 
యాప్రాల్‌లో.....
యాప్రాల్‌ ప్రధాన రోడ్డు, బాపూజినగర్‌ చౌరస్తా, జేజేనగర్‌ తదితర ప్రాంతాల్లో బస్‌ షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి సమీపిస్తుండడంతో ప్రయాణికుల నిలువ నీడలేక దుకాణ సముదాయాల వద్ద వేసి ఉండాల్సిన పరిస్థితి నెలకొంది.  

బస్టాప్‌లోనే బైక్‌ల పార్కింగ్‌
కాచిగూడ: బస్టాపుల్లో షెల్టర్లులేక ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. కాచిగూడలోని సీసీ షరాఫ్‌ ఆసుపత్రి బిల్డింగ్‌ నిర్మాణం జరగడంతో బస్‌షెల్టర్‌ను తొలగించారు. బస్‌ షెల్టర్‌ స్థలంలో ద్విచక్రవాహనాలను పార్కింగ్‌ చేస్తున్నారు. దీంతో ప్రయాణీకులు నిలవడానికి కూడా స్థలం లేకుండా పోయింది. కాచిగూడ రైల్వే స్టేషన్‌ ఎదురుగా ఏర్పాటు చేసిన బస్‌ షెల్టర్‌ పూర్తిగా నిరుపయోగంగా మారింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement