ట్రాఫిక్ సమస్యతో నగరం విలవిలలాడుతోంది. రోడ్లపై లేస్తున్న దుమ్ము, దూళితో పాటు చెవులు చిల్లులు పడేలా వినిపించే శబ్దాల మధ్య సగటు ప్రయాణికుడి బాధ అంతా ఇంత కాదు. కిక్కిరిసిన నగరంలో మనిషి నిల్చోవడానికి సైతం ఇబ్బంది పడాల్సి వస్తోంది. ముఖ్యంగా బస్టాప్‌ల పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఇంటికో..ఆఫీసుకో వెళ్లేందుకు బస్టాప్‌కు వచ్చిన వారు నిలుచునేందుకు కూడా స్థలం ఉండటం లేదు. బస్సొస్తే అది ఎంత దూరంలో ఆగుతుందో తెలియని అయోమయ పరిస్థితి. ఎక్కడ ఆపాలో తెలియని గందరగోళంలో బస్సు డ్రైవర్. బస్సు స్టాప్‌ల్లో వెలిసిన తోపుడు బండ్లు, నిలిపిన ఆటోలు, ఇతర వాహనాలు... వెరసి సగటు ప్రయాణికుడికి స్టాపుల్లోనూ నరకమే. దీంతో బస్టాపుల్లో కాకుండా అటుపక్కో ఇటుపక్కో వెళ్లి ఊసూరుమని నిలుచోవాల్సి వస్తోంది. తీరా బస్సు వస్తే అదెక్కడ ఆగుతుందో తెలియదు. ప్రయాణికుడు ముందుకో లేదా వెనక్కో అన్నట్టు పరుగులు పెట్టాల్సిందే. ప్రతినిత్యం ప్రతి స్టాపు వద్ద కనిపించే దృశ్యాలివీ.
నగరంలో ఇప్పుడు అనేక చోట్ల బస్టాపులే మాయమైపోతున్నాయి. షెల్టర్లు కబ్జాలకు గురికావడంతో జనం రోడ్లపైనే నిలుచోవాల్సి వస్తోంది. ప్రయోగాత్మకంగా నగరంలో కొన్నిచోట్ల ఏసీ బస్టాపులు నిర్మించినా అనేక చోట్ల షెల్టర్లు లేకపోవడం, లేదా ఆ స్థలాలు కబ్జాలకు గురికావడం, ప్రైవేటు పార్కింగ్ కోసం ఉపయోగించడం, తోపుడు బండ్లతో నిండిపోవడం... రకరకాల కారణాలతో వాటి రూపురేఖలు మారిపోయాయి. ఈ రకమైన పరిస్థితిని మీరు నిత్యం ఎక్కడో ఒకచోట చూస్తూనే ఉంటారు. అలాంటి వాటి విషయమై స్పందిద్దాం. కబ్జాకు గురైనా, బస్టాపును పార్కింగ్ స్థలంగా వినియోగిస్తున్నా, వ్యాపారానికి వాడుకుంటున్నా, షెల్టర్ లేకుండా రోడ్డుపైనే బస్టాప్ నిర్వహిస్తున్నా...ఫొటోలు లేదా చిన్న వీడియో తీసి ‘సాక్షి’కి పంపించండి. వాటిని ప్రచురించడంతో పాటు సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళతాం. మీరు చేయాల్సింది బస్టాపునకు సంబంధించిన ఫొటోలు లేదా చిన్న నిడివి కలిగిన వీడియోను 90100 77759 నంబర్‌కు వాట్సాప్ చేయండి. లేదా Info@sakshi.com కు మెయిల్ ద్వారా పంపించండి. వాటితో పాటు ఏ ప్రాంత బస్టాపు, మీ పేరు మొబైల్ నంబర్ తదితర వివరాలను పొందుపరిస్తే వాటిని ‘సాక్షి’ (sakshi.com) లో ప్రచురిస్తాం.
Comments
Please login to add a commentAdd a comment