సాక్షి, హైదరాబాద్: వేసవి విడిది కోసం వచ్చిన విదేశీ అతిథులకు వలలకు చిక్కి అల్లాడుతున్నాయి. జాలరులు చేపల కోసం వేసుకున్న వలలు తెలియకుండానే విదేశీ విహంగాలకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి కొత్తగా ఏర్పడ్డ కుటుంబంతో తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లాలని సంబరపడే విదేశీ వలస పక్షులు వేటలో భాగంగా అనుకోకుండా వలలకు చిక్కి మృతి చెందుతున్నాయి. నగరంలోని ప్రధాన జలాశయం గండిపేటలో ఓ స్వచ్ఛంద సంస్థ కొద్ది రోజుల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించింది. జాలరుల అవగాహన లేమితోనే ఇది జరుగుతుందని గుర్తించింది. అక్కడి పరిస్థితులు వలస పక్షులకు మృత్యుకౌగిలిగా మారుతోన్న తీరును అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చింది. వలస పక్షులను రక్షించేందుకు జాలరులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది.
ఇదీ సంగతి: వేసవి సమీపించిందంటే చాలు సైబీరియా మొదలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షులు మన దగ్గరకు వలస రావడం తెలిసిందే. నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదిగి, ఆ పిల్లలు ఎగిరే నేర్పును పొందే వరకు ఎదురు చూసి ఆ తర్వాత సొంత ప్రాంతాలకు ఎగిరిపోతాయి. ఇలా తెలంగాణలోని వివిధ ప్రాంతాలు విదేశీ పక్షులకు విడిదిగా ఉంటున్నాయి. అందులో నగరంలోని గండిపేట (ఉస్మాన్ సాగర్) కూడా ఒకటి. ప్రస్తుతం గండిపేట జలాశయం విదేశీ విహంగాలతో సందడిగా ఉంది. కానీ కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా ఇక్కడ ఆ పక్షులు చనిపోతున్నాయి. విషయం తెలిసి ‘యానిమల్ వారియర్స్’సంస్థ ప్రతినిధులు జలాశయం వద్ద కొద్ది రోజులుగా పరిశీలిస్తుండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గండిపేట జలాశయం ఆది నుంచి జాలరులకు ప్రధాన కేంద్రంగా ఉంది.
ఇందులో చేప విత్తనాలు వేసి అవి పెరిగాక వాటిని పట్టి విక్రయించి ఆదాయం పొందుతున్నారు. చేపలు పట్టేందుకు వీలుగా వలలను జలశయంలోని ముళ్ల పొదలను ఆసరాగా చేసుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటికి చిక్కే చేపలను తీసి అమ్ముకుంటారు. ఈ క్రమంలో గాలి ఉధృతి పెరిగినప్పుడు కొన్ని వలలు ఆ ముళ్లపొదలకు చిక్కుకుపోతున్నాయి. వాటిని తీయటం సాధ్యం కాక అలాగే వదిలేసి కొత్త వలలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తేలిందని యానిమల్ వారియర్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అలా ఇరుక్కుపోయిన వలలు నీటిలో ఉండిపోతున్నాయి. వాటిని గుర్తించని పక్షులు ముళ్లపొదలపై వాలే సమయంలో వాటిల్లో చిక్కుకుపోతున్నాయి. కొన్ని పక్షులు చేపలను ముక్కుతో వేటాడే సమయంలో వాటి ముక్కు వలలకు ఇరుక్కుపోతోంది. పెనుగులాడితే వలల వైరు భాగం ముక్కుకు గట్టిగా చుట్టుకుపోతోంది. దీంతో ముక్కు తెరుచుకునే పరిస్థితి లేక ఆహారం తీసుకోలేక నీరసించి పక్షులు చనిపోతున్నాయని తేలింది.
చేపలు పట్టే ప్రక్రియతో పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ వదిలేసిన పాత వలలే ప్రమాదంగా మారాయి. ఆదివారం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అనే మరో సంస్థ ప్రతినిధులు కొందరు పక్షి ప్రేమికులు కలిసి దాదాపు 60 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు జలశయంలోని తుప్పలకు ఇరుక్కుని ఉన్న వలల భాగాలను పెద్ద మొత్తంలో వెలికి తీశారు. జలాశయానికి చిలుకూరు వైపు వలస పక్షులు ఎక్కువగా ఉండటంతో అటువైపు ఈ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని టన్నుల బరువున్న వ్యర్థాలను వెలికి తీశారు. ఇంకా అంతకు కొన్ని రెట్ల మేర వ్యర్థాలు నీటిలో ఉన్నాయని, వాటన్నింటినీ తొలగిస్తేనే పక్షులకు సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు.
జాలరులకు అవగాహన కల్పిస్తాం
‘‘నీటిలో వదిలేసిన పాత వలలు వలస పక్షులకు ప్రమాదంగా మారాయి. వాటిని తొలగించి భవిష్యత్తులో మళ్లీ అవి రాకుండా ఉండాలి. అందుకోసం ఈ జలాశయంలో చేపలు పట్టే జాలరులకు అవగాహన కల్పించాల్సి ఉంది. వలలు ఏర్పాటు చేయటంలో అంతర్జాతీయ పద్ధతులేంటో గుర్తిస్తున్నాం. వాటిని జాలరుల దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో అలా వలలు తుప్పలకు ఇరుక్కుపోకుండా చేస్తాం. దానివల్ల జాలరులు వలలు కోల్పోయి నష్టపోకుండా ఉండటమే కాకుండా పక్షులకు ప్రమాదం లేకుండా ఉంటుంది.
ఇప్పటికే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారితో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ముందు జలాశయంలో పెద్ద మొత్తంలో ఉన్న వలల భాగాలను అధికారులు వెలికి తీయించాల్సి ఉంది. మాతో కలిసి వచ్చిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు, ఇతర పక్షి ప్రేమికులకు ధన్యవాదాలు’’
–ప్రదీప్ నాయర్, సంజీవరావు, ‘యానిమల్ వారియర్స్’సభ్యులు
Comments
Please login to add a commentAdd a comment