Water facilities
-
వలలే ఉరితాళ్లు!
సాక్షి, హైదరాబాద్: వేసవి విడిది కోసం వచ్చిన విదేశీ అతిథులకు వలలకు చిక్కి అల్లాడుతున్నాయి. జాలరులు చేపల కోసం వేసుకున్న వలలు తెలియకుండానే విదేశీ విహంగాలకు ఉరితాళ్లుగా మారుతున్నాయి. గుడ్లు పెట్టి పిల్లలను పొదిగి కొత్తగా ఏర్పడ్డ కుటుంబంతో తిరిగి సొంత ప్రాంతాలకు వెళ్లాలని సంబరపడే విదేశీ వలస పక్షులు వేటలో భాగంగా అనుకోకుండా వలలకు చిక్కి మృతి చెందుతున్నాయి. నగరంలోని ప్రధాన జలాశయం గండిపేటలో ఓ స్వచ్ఛంద సంస్థ కొద్ది రోజుల పాటు పరిశీలించి ఈ విషయాన్ని గుర్తించింది. జాలరుల అవగాహన లేమితోనే ఇది జరుగుతుందని గుర్తించింది. అక్కడి పరిస్థితులు వలస పక్షులకు మృత్యుకౌగిలిగా మారుతోన్న తీరును అటవీశాఖ అధికారుల దృష్టికి తెచ్చింది. వలస పక్షులను రక్షించేందుకు జాలరులకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించేందుకు సిద్ధమైంది. ఇదీ సంగతి: వేసవి సమీపించిందంటే చాలు సైబీరియా మొదలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాల నుంచి పక్షులు మన దగ్గరకు వలస రావడం తెలిసిందే. నీటి వనరులు ఎక్కువగా ఉండే ప్రాంతాలను ఆవాసాలుగా చేసుకుని గూళ్లు ఏర్పాటు చేసుకుని గుడ్లు పెట్టి పొదిగి, ఆ పిల్లలు ఎగిరే నేర్పును పొందే వరకు ఎదురు చూసి ఆ తర్వాత సొంత ప్రాంతాలకు ఎగిరిపోతాయి. ఇలా తెలంగాణలోని వివిధ ప్రాంతాలు విదేశీ పక్షులకు విడిదిగా ఉంటున్నాయి. అందులో నగరంలోని గండిపేట (ఉస్మాన్ సాగర్) కూడా ఒకటి. ప్రస్తుతం గండిపేట జలాశయం విదేశీ విహంగాలతో సందడిగా ఉంది. కానీ కొన్నిరోజులుగా క్రమం తప్పకుండా ఇక్కడ ఆ పక్షులు చనిపోతున్నాయి. విషయం తెలిసి ‘యానిమల్ వారియర్స్’సంస్థ ప్రతినిధులు జలాశయం వద్ద కొద్ది రోజులుగా పరిశీలిస్తుండటంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గండిపేట జలాశయం ఆది నుంచి జాలరులకు ప్రధాన కేంద్రంగా ఉంది. ఇందులో చేప విత్తనాలు వేసి అవి పెరిగాక వాటిని పట్టి విక్రయించి ఆదాయం పొందుతున్నారు. చేపలు పట్టేందుకు వీలుగా వలలను జలశయంలోని ముళ్ల పొదలను ఆసరాగా చేసుకుని ఏర్పాటు చేసుకుంటున్నారు. వాటికి చిక్కే చేపలను తీసి అమ్ముకుంటారు. ఈ క్రమంలో గాలి ఉధృతి పెరిగినప్పుడు కొన్ని వలలు ఆ ముళ్లపొదలకు చిక్కుకుపోతున్నాయి. వాటిని తీయటం సాధ్యం కాక అలాగే వదిలేసి కొత్త వలలు ఏర్పాటు చేసుకుంటున్నట్లు తేలిందని యానిమల్ వారియర్స్ సంస్థ ప్రతినిధులు గుర్తించారు. అలా ఇరుక్కుపోయిన వలలు నీటిలో ఉండిపోతున్నాయి. వాటిని గుర్తించని పక్షులు ముళ్లపొదలపై వాలే సమయంలో వాటిల్లో చిక్కుకుపోతున్నాయి. కొన్ని పక్షులు చేపలను ముక్కుతో వేటాడే సమయంలో వాటి ముక్కు వలలకు ఇరుక్కుపోతోంది. పెనుగులాడితే వలల వైరు భాగం ముక్కుకు గట్టిగా చుట్టుకుపోతోంది. దీంతో ముక్కు తెరుచుకునే పరిస్థితి లేక ఆహారం తీసుకోలేక నీరసించి పక్షులు చనిపోతున్నాయని తేలింది. చేపలు పట్టే ప్రక్రియతో పక్షులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు, కానీ వదిలేసిన పాత వలలే ప్రమాదంగా మారాయి. ఆదివారం హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ అనే మరో సంస్థ ప్రతినిధులు కొందరు పక్షి ప్రేమికులు కలిసి దాదాపు 60 మంది ఉదయం నుంచి సాయంత్రం వరకు జలశయంలోని తుప్పలకు ఇరుక్కుని ఉన్న వలల భాగాలను పెద్ద మొత్తంలో వెలికి తీశారు. జలాశయానికి చిలుకూరు వైపు వలస పక్షులు ఎక్కువగా ఉండటంతో అటువైపు ఈ ఆపరేషన్ నిర్వహించారు. కొన్ని టన్నుల బరువున్న వ్యర్థాలను వెలికి తీశారు. ఇంకా అంతకు కొన్ని రెట్ల మేర వ్యర్థాలు నీటిలో ఉన్నాయని, వాటన్నింటినీ తొలగిస్తేనే పక్షులకు సురక్షిత వాతావరణం ఏర్పడుతుందని వారు పేర్కొంటున్నారు. జాలరులకు అవగాహన కల్పిస్తాం ‘‘నీటిలో వదిలేసిన పాత వలలు వలస పక్షులకు ప్రమాదంగా మారాయి. వాటిని తొలగించి భవిష్యత్తులో మళ్లీ అవి రాకుండా ఉండాలి. అందుకోసం ఈ జలాశయంలో చేపలు పట్టే జాలరులకు అవగాహన కల్పించాల్సి ఉంది. వలలు ఏర్పాటు చేయటంలో అంతర్జాతీయ పద్ధతులేంటో గుర్తిస్తున్నాం. వాటిని జాలరుల దృష్టికి తీసుకెళ్లి భవిష్యత్తులో అలా వలలు తుప్పలకు ఇరుక్కుపోకుండా చేస్తాం. దానివల్ల జాలరులు వలలు కోల్పోయి నష్టపోకుండా ఉండటమే కాకుండా పక్షులకు ప్రమాదం లేకుండా ఉంటుంది. ఇప్పటికే ఈ విషయాన్ని అటవీ శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లాం. వారితో కలిసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తాం. ముందు జలాశయంలో పెద్ద మొత్తంలో ఉన్న వలల భాగాలను అధికారులు వెలికి తీయించాల్సి ఉంది. మాతో కలిసి వచ్చిన హైదరాబాద్ బర్డింగ్ పాల్స్ సభ్యులు, ఇతర పక్షి ప్రేమికులకు ధన్యవాదాలు’’ –ప్రదీప్ నాయర్, సంజీవరావు, ‘యానిమల్ వారియర్స్’సభ్యులు -
కాలువ పనులను పర్యవేక్షించిన హరీష్‌రావు
భూదాన్‌పోచంపల్లి: నల్గొండ జిల్లా భూదాన్‌పోచంపల్లి మండలంలోని చిల్లాయపల్లి కాలువను తెలంగాణ నీటిపారుదల శాఖా మంత్రి హరీష్ రావు పరిశీలించారు. జగత్పల్లి, నారాయణగిరి, జలాల్పూర్ గ్రామాలను సందర్శించి దిగువ భూములకు నీరు సరఫరా అయ్యే మార్గాల గురించి ఆరా తీశారు. చౌటుప్పల్ మండలంలోని గ్రామాలకు నీటి సౌకర్యం కల్పించడానికి చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో మంత్రి చర్చించారు. పనులు నత్తనడకన సాగడంపై సిబ్బందిని మంత్రి మందలించారు. అవసరమైతే లిఫ్ట్ ద్వారా లేదా, కాలువ ద్వారా గాని నీటిని కింది గ్రామాలకు అందిస్తామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రితో పాటు భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, ఆలేరు ఎమ్మెల్యే గొంగిడి సునిత, టీఆర్ఎస్ నాయకులు, ఇరిగేషన్ అధికారులు తదితరులు ఉన్నారు. -
విద్యుత్ సమస్యను రాజకీయం చేయొద్దు
‘విద్యుత్ సంక్షోభం’ సదస్సులో వక్తలు సుందరయ్య విజ్ఞాన కేంద్రం: దేశంలో హరిత విప్లవం రావాలంటే సమృద్ధిగా నీటి వసతులు కల్పించాల్సిన అవసరం ఉందని కాన్ఫెడరేషన్ ఆఫ్ పబ్లిక్ సెక్టార్ ఆఫీసర్స్ అసోసియేషన్ కన్వీనర్ డాక్టర్ అశోక్‌రావు అన్నారు. సోమవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో ‘తెలంగాణ అభివృద్ధి-విద్యుత్ సంక్షోభం’ అనే అంశంపై సదస్సు జరిగింది. ముఖ్యఅతిథిగా పాల్గొన్న అశోక్‌రావు మాట్లాడుతూ ఎలక్ట్రిసిటీ బోర్డులు గ్రీన్ రెవల్యూషన్కోసం చేసిన కృషిని ఎవరూ గుర్తించలేదని అన్నారు. దేశవ్యాప్తంగా విద్యుత్ సమస్య తీవ్రంగా ఉందని, ఈ సమస్యను రాజకీయం చేస్తున్నారేగానీ పరిష్కరించడంలేదన్నారు. ప్రైవేటీకరణ వల్ల పెద్ద మొత్తంలో నష్టాలు జరిగాయని అన్నారు. కొత్త చట్టాల వల్ల ప్రజలకు నష్టమే ఏర్పడుతుందని చెప్పారు. తెలంగాణ విద్యుత్ జేఏసీ కన్వీనర్ రఘు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సమస్యలు ప్రధానంగా మూడు రకాలుగా ఉన్నాయన్నారు. విద్యుత్‌కు విపరీతమైన డిమాండ్ పెరిగిందని, దీనికి ప్రధాన కారణం ఖరీఫ్ పంట ఆలస్యంగా రావడం, ఎయిర్ కండీషన్ల వినియోగం తీవ్రంగా పెరగడమని అన్నారు. రాష్ట్రంలో వనరులు ఉన్నప్పటికీ విద్యుత్ ప్రాజెక్టులు సకాలంలో పూర్తి చేయలేదని, ఎక్కువ భాగం ఆంధ్రాకు తరలి వెళ్లాయని స్పష్టం చేశారు. ప్రస్తుతం విద్యుత్ కొనుగోలు ఒప్పందాల రద్దు వల్ల తెలంగాణకు రావాల్సిన 54 శాతం వాటా రావడం లేదన్నారు. అలాగే 500 మెగావాట్ల గాలిమరల విద్యుత్ ఆగిపోయిందని, కృష్ణపట్నం నుంచి 400 మెగావాట్లు, విజయవాడ, రాయలసీమ థర్మల్ పవర్ కేంద్రాల నుంచి రావాల్సిన విద్యుత్ తక్కువగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తంగా తెలంగాణ రాష్ట్రంలో 15 నుంచి 20 మిలియన్ల యూనిట్ల వరకు నష్టపోతున్నామని చెప్పారు. రెండు రాష్ట్రాలకు విద్యుత్ పంచుతామన్న కేంద్ర ప్రభుత్వం ఆదేశాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెడచెవిన పెడుతుందన్నారు. కేంద్రం చొరవ చూపి విద్యుత్ సమస్యను పరిష్కరించాలని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వం 6 నెలల వ్యవధిలో 3 వేల సామర్థ్యం కలిగిన సోలార్ విద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలని ఆయన కోరారు. భూపాల్పల్లి, సింగరేణి ప్రాజెక్టులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సెంటర్ ఫర్ పవర్ స్టడీస్ కన్వీనర్ వేణుగోపాల్‌రావు, సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు సారంపల్లి మల్లారెడ్డి, టి.జ్యోతి తదితరులు పాల్గొన్నారు. -
వీళ్లకు నీళ్లు లేవు!
సాక్షి, హైదరాబాద్: పంచవర్ష ప్రణాళికలెన్ని వచ్చిపోయినా.. పథకాలెన్ని దిగివచ్చినా... పాలకులెందరు మారినా వేల కోట్లు వెచ్చించినా.. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసినా... ఎన్ని పనులు చేపట్టినా.. రాష్ట్రంలోని గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. గిరి పుత్రుల అభివృద్ధి కోసం ఎన్ని కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినా వారికి మౌలిక సౌకర్యాల కల్పన ఎండమావిగానే మిగిలిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉంది. రక్షిత మంచినీరు తాగే గిరిజనుల సంఖ్యను పరిశీలిస్తేనే వారి దుస్థితి కళ్లకు కడుతుంది. గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధుల ప్రతిపాదనను 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన ప్రభుత్వం అందులో ఈ గణాంకాలను ప్రతిపాదించింది. ఈ పరిస్థితి మార్చడానికి తాజాగా రూ. 11.153 కోట్లు మంజూరు చేయాలని అర్థించింది. ప్రభుత్వం సమర్పించిన ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 49.4 మందికి రక్షిత మంచినీరు అందుతుండగా, ప్రతి 100 మంది గిరిజనుల్లో 8.4 శాతం మందికి మాత్రమే రక్షిత మంచినీరు అందుతోంది. ఇక ఫోన్కనెక్షన్ వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని ఇతర జనాభాలో ప్రతి 100 మందిలో 48.4 మందికి ఫోన్ అందుబాటులో ఉంది. కానీ 100 మంది గిరిజనుల్లో మాత్రం 8.5 శాతం మందికే ఫోన్ అందుబాటులో ఉంది. ఇక సమాచార వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పోస్టాఫీసులు కూడా గిరిజనులకు అందుబాటులో లేవని గణాంకాలు చెపుతున్నాయి. ప్రతి 100 మందిలో 51.9 శాతం మందికి పోస్టాఫీసు అందుబాటులో ఉంటే 100 మంది ఎస్టీల్లో కేవలం 14.5 మందికే పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి. ఇక రవాణా సౌకర్యం విషయానికి వస్తే ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్న గిరిజనులు 100 మందిలో కేవలం 26.3 శాతం మందే. ఇక వైద్యం, విద్య సదుపాయాల్లో గిరిజనుల పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపించినా, ఇతర వర్గాలతో పోలిస్తే బాగా వెనుకబడ్డారు. రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 60.6 మందికి వైద్యసౌకర్యం లభిస్తుంటే, గిరిజనుల్లో మాత్రం 51.9 శాతం మందికి మాత్రమే లభిస్తోంది. ఇక విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజన విద్యార్థులకు అందరికీ విద్యాసౌకర్యాలు అందుబాటులోనికి రాలేదని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలో మిగతా జనాభాలో ప్రతి 100 మందికిగాను 94.4 శాతం మందికి విద్యాసౌకర్యాలు అందుబాటులో ఉంటే ప్రతి 100 మంది ఎస్టీల్లో 20.5 శాతం మందికి మాత్రమే విద్యాసౌకర్యాలున్నాయని ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీరి అభివృద్ధికి గాను వచ్చే ఐదేళ్లలో రూ.11,153 కోట్లు ఇవ్వాలని కోరారు.