సాక్షి, హైదరాబాద్: పంచవర్ష ప్రణాళికలెన్ని వచ్చిపోయినా.. పథకాలెన్ని దిగివచ్చినా... పాలకులెందరు మారినా వేల కోట్లు వెచ్చించినా.. ఏళ్లకు ఏళ్లు ఎదురు చూసినా... ఎన్ని పనులు చేపట్టినా.. రాష్ట్రంలోని గిరిజనుల తలరాతలు మాత్రం మారడం లేదు. గిరి పుత్రుల అభివృద్ధి కోసం ఎన్ని కార్యక్రమాలు, పథకాలు అమలు చేసినా వారికి మౌలిక సౌకర్యాల కల్పన ఎండమావిగానే మిగిలిపోతోంది. రాష్ట్ర ప్రభుత్వం సేకరించిన తాజా గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని గిరిజనుల పరిస్థితి దయనీయంగా ఉంది. రక్షిత మంచినీరు తాగే గిరిజనుల సంఖ్యను పరిశీలిస్తేనే వారి దుస్థితి కళ్లకు కడుతుంది. గిరిజనుల అభివృద్ధి కోసం కేటాయించాల్సిన నిధుల ప్రతిపాదనను 14వ ఆర్థిక సంఘానికి సమర్పించిన ప్రభుత్వం అందులో ఈ గణాంకాలను ప్రతిపాదించింది.
ఈ పరిస్థితి మార్చడానికి తాజాగా రూ. 11.153 కోట్లు మంజూరు చేయాలని అర్థించింది. ప్రభుత్వం సమర్పించిన ఈ గణాంకాల ప్రకారం రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 49.4 మందికి రక్షిత మంచినీరు అందుతుండగా, ప్రతి 100 మంది గిరిజనుల్లో 8.4 శాతం మందికి మాత్రమే రక్షిత మంచినీరు అందుతోంది. ఇక ఫోన్‌కనెక్షన్ వివరాలను పరిశీలిస్తే రాష్ట్రంలోని ఇతర జనాభాలో ప్రతి 100 మందిలో 48.4 మందికి ఫోన్ అందుబాటులో ఉంది. కానీ 100 మంది గిరిజనుల్లో మాత్రం 8.5 శాతం మందికే ఫోన్ అందుబాటులో ఉంది. ఇక సమాచార వ్యవస్థలో కీలకపాత్ర పోషించే పోస్టాఫీసులు కూడా గిరిజనులకు అందుబాటులో లేవని గణాంకాలు చెపుతున్నాయి. ప్రతి 100 మందిలో 51.9 శాతం మందికి పోస్టాఫీసు అందుబాటులో ఉంటే 100 మంది ఎస్టీల్లో కేవలం 14.5 మందికే పోస్టాఫీసులు అందుబాటులో ఉన్నాయి. ఇక రవాణా సౌకర్యం విషయానికి వస్తే ట్రాన్స్‌పోర్టేషన్ ఉన్న గిరిజనులు 100 మందిలో కేవలం 26.3 శాతం మందే. ఇక వైద్యం, విద్య సదుపాయాల్లో గిరిజనుల పరిస్థితి కొంత మెరుగ్గానే కనిపించినా, ఇతర వర్గాలతో పోలిస్తే బాగా వెనుకబడ్డారు. రాష్ట్రంలోని ప్రతి 100 మందిలో 60.6 మందికి వైద్యసౌకర్యం లభిస్తుంటే, గిరిజనుల్లో మాత్రం 51.9 శాతం మందికి మాత్రమే లభిస్తోంది. ఇక విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కూడా గిరిజన విద్యార్థులకు అందరికీ విద్యాసౌకర్యాలు అందుబాటులోనికి రాలేదని లెక్కలు చూస్తే అర్థమవుతోంది. రాష్ట్రంలో మిగతా జనాభాలో ప్రతి 100 మందికిగాను 94.4 శాతం మందికి విద్యాసౌకర్యాలు అందుబాటులో ఉంటే ప్రతి 100 మంది ఎస్టీల్లో 20.5 శాతం మందికి మాత్రమే విద్యాసౌకర్యాలున్నాయని ఆర్థిక సంఘానికి ఇచ్చిన నివేదికలో గిరిజన సంక్షేమ శాఖ అధికారులు పేర్కొన్నారు. వీరి అభివృద్ధికి గాను వచ్చే ఐదేళ్లలో రూ.11,153 కోట్లు ఇవ్వాలని కోరారు.