నయా ట్రెండ్‌...విలేజ్‌గ్రౌండ్‌ | Demand for portable cabins has increased | Sakshi
Sakshi News home page

నయా ట్రెండ్‌...విలేజ్‌గ్రౌండ్‌

Published Fri, Mar 11 2022 4:59 AM | Last Updated on Fri, Mar 11 2022 1:16 PM

Demand for portable cabins has increased - Sakshi

పోర్టబుల్‌ క్యాబిన్‌లలో అందమైన అలంకరణలు, ఇళ్ళు, ఆఫీసు

రోజులు మారాయి. యువత కొత్త ట్రెండ్‌ సృష్టిస్తున్నారు. వ్యాపారంలో అయితే వినియోగదారుడి ఆకర్షణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నారు. అధునాతన వసతులు కోరుకుంటున్నారు. అందులో భాగంగా పోర్టబుల్‌ క్యాబిన్‌ల డిమాండ్‌ పెరిగింది. తొలుత పెద్ద నగరాలకు పరిమితమైన ధోరణి ప్రస్తుతం గ్రామీణ ప్రాంతాలకు తరలివచ్చింది. కొందరు పెదకాకానిలో తయారు చేస్తూ ఆకర్షిస్తున్నారు. 

పెదకాకాని/యడ్లపాడు: పోర్టబుల్‌ క్యాబిన్‌లు చకచకా రెడీ అవుతున్నాయి. చిన్న చిన్న ఇళ్లు, ఫామ్‌హౌస్, సెక్యూరిటీ క్యాపిన్స్, పర్సనల్‌ ఆఫీసు, రియల్‌ ఎస్టేట్‌ ఆఫీసులు, టాయిలెట్స్, స్లోరేజ్‌ క్యాబిన్స్‌ స్థలాన్ని బట్టి సైజులు, ఆకారాలు, అందమైన డిజైన్‌లలో తయారవుతున్నాయి. గుంటూరు జిల్లా పెదకాకాని గ్రామ శివారులోని ఆటోనగర్, వెంగళరావునగర్‌ సమీపంలో సర్వీసు రోడ్డు పక్కనే గత కొంతకాలంగా రెడీమేడ్‌ గదులు తయారవుతున్నాయి. విదేశాలలో ఇళ్లను ఒక చోట నుంచి మరొక చోటకు మర్చడం, అవసరాన్ని బట్టి ఎత్తు పెంచుకోవడం, తగ్గించుకోవడాన్ని దృష్టిలో పెట్టుకుని ఉత్తరప్రదేశ్‌కు చెందిన మహమ్మద్‌ తయ్యబ్‌ సోదరులు బెంగళూరు కేంద్రంగా పోర్టబుల్‌ క్యాబిన్‌లు నిర్మాణం పనులు ప్రారంభించారు.  

స్థానికంగా తయారీ... 
ఆ తరువాత దేశవ్యాప్తంగా అక్కడక్కడా ఈ తరహా పరిశ్రమ ఏర్పాటు చేసి తయారు చేస్తున్నారు. పెదకాకాని వై జంక్షన్‌ సమీపంలో పరిశ్రమ ఏర్పాటు చేసుకుని అవసరాన్ని బట్టి క్యాబిన్‌లు సరఫరా చేస్తున్నారు. వర్కర్లను కూడా ఉత్తరప్రదేశ్‌ నుంచి పిలిపించి నిర్మాణానికి వినియోగించుకుంటున్నారు. వారి వద్ద పనులు నేర్చుకుని ఈ ప్రాంతానికి చెందిన వారే పెదకాకానిలో మూడో క్యాబిన్‌ల తయారీ పరిశ్రమ ఏర్పాటు చేసుకున్నారు. ఈ పోర్టబుల్‌ క్యాబిన్‌లలో ఇంటీరియల్‌ డెకరేషన్‌ ప్రత్యేక ఆకర్షణగా, అందమైన ఇళ్లను తలపిస్తున్నాయి. లక్షరూపాయల నుంచి ఐదు లక్షల రూపాయల వరకూ ప్రజల అవసరాలకు అనుగుణంగా అందంగా ఆకర్షణీయంగా డిజైన్‌లు చేసి ఇవ్వడం ద్వారా ఆర్డర్‌లు పెరుగుతున్నాయని వారు చెబుతున్నారు.  ఇతర జిల్లాల నుంచి ఆర్డర్‌లు వస్తున్నాయని, 25 సంవత్సరాల పాటు మన్నిక ఉంటుందని, వారంటీ బిల్లు ఒక సంవత్సరం పాటు ఫీ సర్వీసు ఉంటుందని, సర్వీసు ఎప్పుడూ అందుబాటులోనే ఉంటుందని నిర్వాహకులు పేర్కొన్నారు. 

రూపులు మార్చుకుంటున్న కాకా హోటళ్లు... 
కాకా హోటళ్లు...చాయ్‌ దుకాణాలు అంటే పురాతన కాలంలో పూరి గుడిసెల్లోనూ..ఆ తర్వాత పెంకుటిళ్లు..పక్కా గదుల్లోనూ దర్శనమిచ్చేవి. ఇప్పుడది పూర్తిగా తనషేప్‌ను మార్చుకుంటుంది. నయాజమానా నయాట్రెండ్‌ చందానా.. పెద్దపెద్ద సిటీల్లోని కార్పొరేట్‌ తరహాతో కనిపిస్తున్నాయి. ఒకప్పుడు కంటైనర్లను వివిధ రకాల వస్తువుల్ని తరలించేందుకు వాడుతుంటారు. సిమెంట్, ఇటుకలు, ఐరన్‌ అనే మాటేలేకుండా ఎంచక్కా ట్రెండీగా వీటిని తయారు చేస్తున్నారు. కంటైనర్‌లను కేవలం రవాణాకే కాకుండా ఇల్లు.. వ్యాపార దుకాణాలుగా మార్చి వినియోగిస్తున్నారు. పట్టణాల్లోనే కాకుండా వాటిని మారుమూల పల్లెల్లోనూ ఏర్పాటు చేయడంతో అవి అందర్ని అకర్షిస్తున్నాయి. విదేశాల్లో నడిచే ఈ కొత్త ట్రెండ్‌ మన దేశంలోనూ వేగంగా విస్తరించడం విశేషం. పల్లె, పట్టణం అనే తేడా లేకుండా ఇప్పుడిప్పుడే వీటికి విశేష ఆదరణ లభిస్తోంది.  

గతంలో.. సాధారణంగా చాయ్‌ లేదా ఫాస్ట్‌ఫుడ్‌ ఇతర వ్యాపార దుకాణాలను ఏర్పాటు చేయాలంటే ఎక్కడైనా కూడళ్లలో నిర్మించిన షాపింగ్‌ కాంపెక్లŠస్‌ల్లోని గదుల్ని అద్దెకు తీసుకోవాలి. అడ్వాన్స్‌లు, అవి నిర్మించిన గదులు మనకు అనుకూలంగా లేకుండా మార్పులు చేర్పులకు నిర్మాణాలు, డెకరేషన్లకు అదనంగా డబ్బు ఖర్చు పెట్టాల్సి వచ్చేది. తీరా మనం ఏర్పాటు చేసిన షాపు ‘క్లిక్‌’ కాకున్నా మనకు ‘లక్‌’ లేకున్నా..అప్పటి వరకు చేసిందంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుంది.  

రీ యూజ్‌ ఇలా.. 
కంటైనర్‌లకు 50 ఏళ్ల తర్వాత వాటి జీవిత పరిమితకాలం అయిపోతుంది.వాటిని షిప్పింగ్‌కు వాడకూడదు. అలాంటి వాటిని వేస్ట్‌గా పోనివ్వకుండా తిరిగి ఉపయోగంలోకి తెస్తున్నారు.  వాటిని స్క్రాబ్‌ కింద కొని వీటికి నిపుణులు అందమైన రూపునిస్తూ అద్భుతంగా మలుస్తున్నారు. షిప్పింగ్‌ కోసం వినియోగించే మెటల్‌ కంటైనర్లను పోర్టబుల్‌ హౌసెస్, ఆఫీస్‌ క్యాబిన్, హోటల్స్, టీస్పాట్, ఫ్యాన్సీ, కిరణా వంటి బిజినెస్‌ షాప్స్, మెటల్‌ క్వారీల వద్ద సేఫ్టీరూమ్స్, ఫాంహౌస్‌ల వద్ద మినిగెస్ట్‌హౌస్‌లు, భవన నిర్మాణాల సమయంలో స్టాక్‌గోడవున్‌ వంటి వాటికి ఈకంటైనర్లను వినియోగిస్తున్నారు.  

లోపల ఏమేమీ ఉంటాయంటే... 
లోపల అంతా బైసన్, ఎంటీఎ బోర్డులు, సీలింగ్, వాల్‌పేపర్లు, డోర్స్, యూపీవీసీ విండోస్, వినైల్‌ఫ్లోర్స్, టైల్స్, ఎల్‌ఈడీ లైట్లు, ఫ్యాన్లు, స్విచ్‌బోర్డులు, కబోర్డ్స్, అడ్జస్ట్‌ఫ్యాన్, ఏసీ, టీవీ పాయింట్స్, కంప్యూటర్స్, హాలు, కిచెన్, వాష్‌రూం, 1000లీటర్ల పైన ట్యాంక్, లోహం కావడంతో వేడి రాకుండా రాక్‌వోల్‌ వినియోగించి ప్రీమియం లుక్‌ తీసుకువస్తున్నాం.

అన్నింటికీ అనుకూలత... 
తక్కువ ఖర్చుతో అన్ని సదుపాయాలతో కొద్దిపాటి స్థలంలోనే ఏర్పాటు చేసుకునే వీలుంది. ఒకచోట నుంచి మరోచోటకు సులభంగా తరలించుకోవచ్చు. మన అవసరం తీరాక కొన్నధరకు పెద్దగా నష్టం రాకుండా తిరిగి వీటిని విక్రయించుకోవచ్చు. జీఏసిస్టం, ఎంఎస్‌సిస్టం అనే రెండు రకాలుగా సెమీ, ఫుల్లీ ఫర్నిచర్‌ సౌకర్యాలతో వీటిని తయారు చేస్తున్నారు. ముందుగానే రెడీమెడ్‌గా తయారు చేసి ఉన్నందున ఎప్పుడు కావాలంటే అప్పుడే తెచ్చుకోవచ్చు. రోజురోజుకు వీటికి మంచి ఆదరణ పెరగడంతో ఇప్పుడు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోనూ, ప్రధాన పట్టణాల్లోనూ వీటి తయారీ కార్ఖానాలు వెలిశాయి.

మోబుల్‌ హౌస్, షాపు ఏదైనా... 
పక్కాగృహ నిర్మాణాల మాదిరిగానే వీటి ధర అడుగుల చొప్పున ఉంటుంది. ఒక్కొక్క అడుగు సుమారు రూ.900 నుంచి రూ.1200 వరకు వారు అందించే నాణ్యతను బట్టి అందిస్తున్నారు. షిప్పింగ్‌ కంటైనర్‌..8గీ40 లేదా 8గీ20 మాత్రమే దొరుకుతాయి. పోర్టక్యాబిన్స్‌తో పోల్చుకుంటే ఇవి స్టాండెండ్‌గా ఉండడంతో పాటు ధరలోనూ సుమారు రూ.లక్ష వ్యత్యాసం ఉండోచ్చు. ఎందుకంటే ఇది స్టాండెడ్‌గా ఉంటాయి. ఒక్కొక్క షాపు ధర రూ.లక్ష నుంచి రూ.6.50 లక్షలు పడుతుంది. సింగిల్‌ బెడ్‌రూం కలిగిన ఇల్లు రూ.30 లక్షలు పలికే ఈరోజుల్లో కంటైనర్‌ పోర్ట్‌బుల్‌ హౌస్‌ 20గీ8 సైజు ఇల్లు రూ.4.50 లక్షలు, అదే పుల్లీ ఫర్నిచర్‌తో రూ.6.50 లక్షలు, 40గీ8 ఇల్లు రూ.8 లక్షలు, ఫుల్లీ ఫర్నిచర్‌ హౌస్‌ రూ.8.50 లక్షలకు రావడంతో అంతా ఇటువైపు దృష్టిని సారిస్తున్నారు. కార్ఖానా నుంచి కావల్సిన చోటుకు తరలించే సమయంలో ఎలాంటి డ్యామేజ్‌ జరిగే అవకాశం లేదు.  

నిర్మాణం కంటే ప్రత్నామ్యాయంతోనే మేలు... 
పెరిగిన నిర్మాణ సామాగ్రి ధరలతో ప్రస్తుతం శాశ్వత భవనం లేదా గదుల నిర్మాణాలు చేయాలంటే  తలకుమించిన భారం అవుతుంది. దీనికి తోడు కూలీల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయి. ఇన్ని ఇబ్బందులు పడేకంటే వ్యాపారాలకు కంటైనర్‌ దుకాణాల్ని కొనుగోలు చేసుకుంటే సమయం, డబ్బు ఆదా కావడంతో పాటు వద్దనుకున్నప్పుడు తిరిగి అమ్ముకోవచ్చు. వీటిని వీధుల్లో పొలాల్లో ఇళ్లమధ్య ఎక్కడైనా పెట్టుకోవచ్చు. అందుకే ఆధార్‌సెంటర్‌కు రెడీమెడ్‌గా కంటైనర్‌ను తీసుకురావడం జరిగింది. 
– వెంకటనర్సు, యడ్లపాడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement