అందంగా కనిపించాలని కొందరు
చలువ, నైట్ విజన్, యాంటీ రిఫ్లెక్టింగ్
అద్దాల కోసం మరికొందరు
కంటి చూపు భలే.. తలనొప్పికి విరుగుడు
కళ్ల జోడు కొత్త మోడల్స్ అనునిత్యం నయా పుంతలు తొక్కుతున్నాయి. నలుగురిలో భిన్నంగా ఉండాలనుకునే యువత మార్కెట్‌లోకి కొత్త మోడల్ వచి్చందంటే దాన్ని మనం ధరించాల్సిందే అంటున్నారు. ఈ తరహా ట్రెండ్ ప్రధానంగా కళాశాలలకు వెళ్లే విద్యార్థులు, సాఫ్ట్‌వేర్, ఇతర ఉద్యోగుల్లో కనిపిస్తోంది. ఇందులో అత్యధిక శాతం మంది మాత్రం ఎప్పటికప్పుడు తమ కళ్లజోడు మారుస్తున్నారు. నగరవాసులు కొత్త మోడల్స్‌కు మారిపోతున్నారు. అందం, అభినయానికి అనుగుణంగా తమ కళ్లజోడు ఉండేలా సెట్ చేసుకుంటున్నారు.
కళ్ల జోడు వల్ల చాలా లాభాలు ఉన్నాయి. నగరంలో ట్రాఫిక్ సమస్యలు, కాలుష్యం సమస్య వేధిస్తోంది. మోటారు సైకిల్‌పై, ప్రజారవాణా వ్యవస్థలో ప్రయాణాలు చేసేవారికి గాలిలోని ధూళి కణాలు కంట్లో పడి ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఇటువంటి సమయంలో కంటికి రక్షణ, స్టైలిష్ కళ్ల జోడు కోసం నిత్యం వివిధ వెబ్‌సైట్లలో, ఆప్టికల్ దుఖాణాల్లో కొత్త మోడల్స్‌పై ఆరా తీస్తున్నారు. ఎండలో ప్రయాణాలు చేసేవారు ప్రమాదకరమైన సూర్య కిరణాల నుంచి రక్షణ కల్పించడం కోసం, రాత్రి వేళ డ్రైవింగ్ చేసే సమయంలో ఎదుటి వాహనాల వెలుతురు ప్రభావం మన కళ్లపై పడకుండా ఉండేందుకు యాంటీ గ్లేర్ గ్లాసెస్, కంప్యూటర్ ముందు కూర్చుని ఉద్యోగాలు చేసే యువత కంప్యూటర్ కిరణాల నుంచి రక్షణ కసం బ్లూలైట్ యాంటీ గ్లేర్ వంటి వివిధ రకాల ప్రత్యేకతలున్న గ్లాసెస్ వినియోగిస్తున్నారు. మరికొంత మంది మాత్రం కంటి సమస్యలతో కళ్లజోడు వినియోగిస్తున్నారు. చూపు మందగించడం, రీడింగ్ గ్లాసెస్, కళ్లు ఒత్తిడికి గురైనప్పుడు వచ్చే తలనొప్పిని తగ్గించడం కోసం కొన్ని రకాల లెన్స్ అందుబాటులో ఉన్నాయి.
బ్రాండ్స్‌పై మోజు..
ప్రపంచంలో పేరెన్నిక కలిగిన పలు బ్రాండెడ్ గాగుల్స్ కంపెనీలు తమ ఉత్పత్తులను హైదరాబాద్ నగర ప్రజలకు అందుబాటులో ఉంచుతున్నాయి. అనునిత్యం కొత్త కొత్త మోడల్స్, ఆఫర్లతో ఆకట్టుకుంటున్నాయి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, మాదాపూర్, కేపీహెచ్‌బీ, హైటెక్‌సిటీ, రాయదుర్గం, శేరిలింగంపల్లి తదతర ప్రాంతాల్లో బ్రాండెడ్ గాగుల్స్ దుకాణాలు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే అచ్చం అలాగే కనిపించే లోకల్ బ్రాండ్స్ సైతం లభిస్తున్నాయి. ఈ రెండింటి మధ్య ధరల్లో మాత్రం భారీ వ్యత్యాసం కనిపిస్తోంది. చిన్న చిన్న దుకాణాల్లో గాగుల్స్ అడిగితే రూ.100కే లభిస్తున్నాయి. అదే మల్టీనేషన్ కంపెనీ బ్రాండ్ అయితే కనీసం రూ.5 వేలు ఆపైనే ఉంటాయి. వీటి మన్నికలోనూ స్పష్టమైన వ్యత్యాసం కనిపిస్తోందని కొనుగోలుదారులు పేర్కొంటున్నారు.
సమస్య ఎక్కడ మొదలవుతోంది?
నగరంలో యువత జీవన శైలి మారిపోతోంది. రాత్రి వేళ ఆలస్యంగా నిద్రపోవడం, మొబైల్ ఫోన్ స్క్రీన్ ఎక్కువ సమయం చూడటం, ఉద్యోగం, వ్యాపార లావాదేవీల్లో అవసరాల రీత్యా కంప్యూటర్, ల్యాప్‌టాప్, ట్యాబ్స్‌పై పనిచేయాల్సి రావడంతో కంటి సమస్యలు ఉత్పన్నమవుతున్నాయి. దీంతో చాలామందిలో చూపు మందగించడం, కళ్లు ఎక్కువగా ఒత్తిడిగి గురై తలనొప్పి రావడం వంటి సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నపిల్లల్లో సైతం ఈ తరహా లక్షణాలతో ఆస్పత్రులకు వస్తున్న బాధితులు ఉన్నారంటే ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు.
బ్రాండ్స్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి
కాలుష్యం నుంచి కంటిని రక్షించుకోవడానికి గాగుల్స్ అవసరం. అయితే వాటిని నిపుణులైన వైద్యుల సూచనల మేరకు వినియోగిస్తే మంచిది. కంటి సమస్యలతో వచ్చేవారికి కళ్లజోడు రాయాల్సి వచి్చనప్పుడు కొత్త మోడల్స్ కావాలని కోరడం సహజంగా మారిపోయింది. కంటిపై ఒత్తిడి పెరగడం వల్ల దగ్గర, దూరం దృష్టి సమస్యలు, కళ్లు పొడిబారిపోవడం, తలనొప్పి రావడం, ఇంట్రాక్రీనియల్ ప్రెజర్ పెరగడం వల్ల ఇబ్బందులు తలెత్తుతాయి. బయటకు వెళ్లే సమయంలో సన్ ప్రొటెక్షన్, కంప్యూటర్‌పై పనిచేసేటప్పుడు నిపుణుల ఆదేశానుసారంగా లెన్స్ గ్లాసెస్ వాడుకోవాలి. ప్రతి 45 నిమిషాలకు ఒక 10 నిమిషాలైనా కంప్యూటర్, మొబైల్‌కు దూరంగా ఉండాలి. ఎక్కువ సార్లు కనురెప్పలను బ్లింక్ చేయాలి. కంట్లో ధూళి కణాలు పడితే నల్లగుడ్డుకు ప్రమాదం వాటిల్లుతుంది. కళ్లజోడు వినియోగించడంతో కంటి లైఫ్ టైం పెంచుకోవచ్చు. బ్రాండ్ విషయంలో కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ఏదో ఒకటి కళ్లజోడే కదా చాలు అనుకుంటేనే ఇబ్బంది.
– డా.పి.మురళీధర్ రావు, వైరియో రెటినల్ సర్జన్, మ్యాక్స్ విజన్, సోమాజిగూడ
Comments
Please login to add a commentAdd a comment