విజయవాడ కనకదుర్గ వారథి బస్టాప్ వద్ద ఎండలోనే వేచి ఉన్న ప్రయాణికులు
ఓ వైపు మండే ఎండ.. మరోవైపు దుమ్ము.. ఎటువెళ్లాలో తెలీదు.. ఎక్కడ నిలబడాలో అర్థం కాదు.. నీడ కోసం.. విజయవాడలో ఆర్టీసీ ప్రయాణికుల పాట్లు అన్నీఇన్నీ కావు. నగరంలో చాలా ప్రాంతాల్లో బస్ షెల్టర్లు లేక ప్రయాణికులు అల్లాడుతున్నారు. పోనీ ఏదైనా షాపు నీడన నిల్చుంటే తమవ్యాపారానికి అడ్డుగా ఉన్నారంటూ చీత్కరింపులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి. మహిళలు చీర కొంగులను, యువతులు చున్నీలు, స్కార్ఫ్‌లను.. విద్యార్థులు పుస్తకాలు, బ్యాగులను నెత్తిన పెట్టుకుని ఎండ నుంచి కాస్త రక్షణ పొందుతున్నారు.
సాక్షి, విజయవాడ: విజయవాడ నగరంలో ప్రయాణికులకు కావాల్సిన బస్ షెల్టర్స్ నిర్మించడంలో నగరపాలకసంస్థ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీంతో ఎండలోనే బస్సులు కోసం గంటలు తరబడి వేచిచూడాల్సిన పరిస్థితి ఆర్టీసీ ప్రయాణికులకు ఏర్పడుతోంది.
55 బస్ షెల్టర్లు అవసరం..
బస్సులు నడిపేది ఆర్టీసీ అయినా బస్ షెల్టర్స్ మాత్రం కార్పొరేషన్ నిర్మిస్తుంది. విజయవాడ నగరంలో ఇప్పటి వరకూ 128 బస్ షెల్టర్స్ ఉండగా.. మరో 55 చోట్ల బస్ షెల్టర్స్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. బందరురోడ్డు, ఏలూరు రోడ్డు, వన్‌టౌన్, సింగ్‌నగర్, కనకదుర్గ వారధి తదితర ప్రాంతాల్లో ఈ బస్ షెల్టర్స్ అవసరం అవుతాయని ఆర్టీసీ అధికారులు చెబుతున్నారు. కాగా 25 వరకు బస్‌షెల్టర్స్ ఇప్పటికే ధ్వంసమయ్యాయి. వీటిని తిరిగి నిర్మించాల్సి ఉంది. ముఖ్యంగా సాంబమూర్తి రోడ్డు, ఏలూరు రోడ్డులో చుట్టుగుంట ప్రాంతంలో బస్‌షెల్టర్స్ పాడైపోయాయి. అయినా అధికారులు పట్టించుకోవడం లేదు. అలాగే నగరంలో గుంటూరు వైపు వెళ్లే బస్సులన్నీ కనకదుర్గ వారథి నుంచి వెళ్లాల్సి ఉంది. అయితే ఇక్కడ బస్ షెల్టర్ లేదు. అలాగే ఏలూరు వైపు వెళ్లే బస్సుల కోసం వేచి ఉండేందుకు వారథి వద్ద షెల్టర్ లేదు.
షెల్టర్‌ల నుంచి ఆదాయం..
వాస్తవంగా బస్ షెల్టర్స్ నిర్మిస్తే దాన్ని వ్యాపార ప్రకటనలకు కార్పొరేషన్ ఇచ్చి ఆదాయాన్ని సంపాదించుకుంటుంది. అలాగే కొన్ని వ్యాపార సంస్థలు బస్ షెల్టర్లను నిర్మించి ఇచ్చేందుకు ముందుకు వస్తున్నాయి. అయితే నగరపాలకసంస్థ అధికారులు దీనిపై శ్రద్ధ తీసుకోకపోవడం వల్ల వీటి నిర్మాణం ముందుకుసాగడం లేదు.
ఏసీ బస్ షెల్టర్ అంటూ..
ఇక స్వరాజ్యమైదానం వద్ద ఏసీ బస్ షెల్టర్ నిర్మిస్తామంటూ గతంలో ఉన్న బస్‌షెల్టర్స్‌ను కార్పొరేషన్ అధికారులు తొలగించారు. అయితే తిరిగి మాములు బస్ షెల్టరే నిర్మించడం పై ప్రయాణికులు పెదవి విరిస్తున్నారు. దాతలు సహకారంతో ఏసీ బస్ షెల్టర్స్ నిర్మిస్తే ఉపయుక్తంగా ఉంటుందని చెబుతున్నారు.
బీఆర్‌టీఎస్ రోడ్డులో వృథాగా షెల్టర్స్..
బీఆర్‌టీఎస్ రోడ్డు నిర్మించే సమయంలోనే అక్కడ బస్‌షెల్టర్స్ నిర్మించారు. తొలుత ఏసీ బస్‌షెల్టర్స్ నిర్మించాలని భావించినా తర్వాత గ్లాస్ నాన్ ఏసీ బస్ షెల్టర్స్‌ను ఏర్పాటు చేశారు. అయితే ప్రస్తుతం ఈ మార్గంలో బస్సులు నడవడం లేదు. దీంతో ఈ బస్సు షెల్టర్స్ ఎందుకు పనికిరాకుండా పోయాయి. లక్షలు ఖర్చు చేసి ఇక్కడ నిర్మించిన బస్‌షెల్టర్స్ నిరుపయోగంగా మారడం.. అవసరమైన చోట బస్‌షెల్టర్స్ లేకపోవడంపై ప్రయాణికులు పెదవి విరుస్తున్నారు.
బస్ షెల్టర్స్‌లో ఆగని బస్సులు..
ఇక బందరురోడ్డు, ఏలూరు రోడ్డులలో బస్ షెల్టర్స్ కొన్ని ఉన్నాయి. అయితే వాటి వద్ద మాత్రం బస్సులు ఆగడం లేదు. బస్ షెల్టర్స్‌కు ముందో, వెనుకో బస్సులను ఆపేస్తున్నారు. దీంతో బస్సు వచ్చిన తర్వాత పరిగెత్తుకు వచ్చి బస్సులు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. దీంతో మహిళా ప్రయాణికులు బస్‌స్టాప్‌లలో కాకుండా బస్సులు ఆగేచోట నిలబడుతున్నారు. ఒక ఒకదాని తర్వాత మరొక బస్సు వస్తుంటే చివర బస్సు బస్ షెల్టర్స్‌కు చాలా దూరంలో ఉంటుంది. ముందు బస్సులు వెళ్లిన తర్వాత తిరిగి బస్‌షెల్టర్ వద్దకు తీసుకు వచ్చి ఆ బస్సులను ఆపడం లేదు.
ఇబ్బంది పడుతున్నాం
కళాశాలకు ఆర్టీసీ బస్సుల్లోనే వెళ్తున్నాం. పటమట లంకలో బస్టాప్‌లో షెల్టర్ లేదు. దీంతో ఎండకు ఎండి వానకు తడవాల్సిన పరిస్థితి ఏర్పడింది. బస్సుల కోసం వేచి ఉండటం కష్టతరమవుతోంది. గతంలో ఉన్న షెల్టర్‌లను తొలగించి వాటిస్థానంలో కొత్తవి నిరిస్తామంటున్నారు. నిర్మాణం విషయంలో అధికారులు చొరవ తీసుకుని త్వరితగతిన పూర్తి చేస్తే బాగుంటుంది.– ఎం.సత్యనారాయణ, విద్యార్థి
బస్టాప్‌లలో ఆగడం లేదు
బస్సులు బస్ షెల్టర్ వద్ద కాకుండా ముందో వెనుకో ఆపుతున్నారు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ఒక్కోసారి బస్సులు ఒకదాని వెనుక ఒకేసారి వస్తుంటాయి. ఆ సమయంలో మాకు కావాల్సిన బస్సు దగ్గరకు వేళ్లే లోపు బస్సు వెళ్లిపోతోంది. అందువల్ల బస్ షెల్టర్స్ ఉన్నా.. కూర్చుకుండా రోడ్డుమీదే నిలబడాల్సి వస్తోంది. బస్సులు కచ్చితంగా బస్ షెల్టర్ వద్ద ఆపేటట్లు అధికారులు చర్యలు తీసుకోవాలి. – ఎం.ప్రీతి, ఉద్యోగి, వన్‌టౌన్
Comments
Please login to add a commentAdd a comment