సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన ఈ–గరుడ బస్సుల్లో టికెట్‌తోపాటు చిరుతిళ్లతో కూడిన ఓ డబ్బా (స్నాక్ బాక్స్) ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్–విజయవాడ మధ్య కొత్తగా ప్రారంభమైన 9 ఈ–గరుడ బస్సుల్లో శనివారం నుంచి సరఫరా చేస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తే దూరప్రాంతాలకు తిరిగే ఇతర సర్విసుల్లోనూ దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది.
టికెట్ ధరపై రూ.30 అదనం..
ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్‌తోపాటు అరలీటర్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌ను ఉచితంగా అందిస్తోంది. కానీ ఈ చిరు తిండి డబ్బాకు మాత్రం రూ.30 వసూలు చేయబోతోంది. దీన్ని తీసుకునే విషయంలో ప్రయాణికులకు చాయిస్ ఉండదు. చార్జీతోపాటు రూ.30 చేర్చి టికెట్ జారీ అవుతుంది. ఇష్టం ఉన్నా లేకున్నా ఈ బాక్సును తీసుకోవాల్సిందే.
డబ్బాలో ఏముంటాయి?
ఈ చిరుతిండి డబ్బాలో చిరుధాన్యాలతో చేసిన దాదాపు 25 గ్రాముల ఖాక్రా, 20 గ్రాముల చిక్కీ, 10 గ్రాముల మౌత్‌ఫ్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటుందని సమాచారం. ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్నదే. స్పందన బాగుంటే.. చిరుతిళ్ల రకాల్లో, పరిమాణంలోనూ మార్పులుంటాయని సమాచారం. ‘ప్రతి డబ్బాపై క్యూఆర్ కోడ్ ఉంటుంది.
ప్రయాణికులు చిరుతిండి గురించి ఫీడ్‌బ్యాక్‌ను ఈ క్యూఆర్‌కోడ్‌ను ఫోన్ ద్వారా స్కాన్ చేసి పంపవచ్చు. ఆ సూచనలను పరిగణలోకి తీసుకుని మార్పుచేర్పులు ఉంటాయి. ఈ డబ్బాను కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయమూ తీసుకుంటాం’అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment