Garuda bus
-
వందేభారత్ X గరుడ ప్లస్!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రైల్వే విస్తరణతో ఆర్టీసీకి పోటీ ఎదురైంది. ఇటీవలే ప్రారంభమైన కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌కు ఆదరణ లభించడం.. ప్రతి ట్రిప్పులో దాదాపు 500 మంది ప్రయాణికులు ఈ రైల్లో ప్రయాణిస్తుండటంతో ఇది హైదరాబాద్–బెంగళూరు మధ్య పగటిపూట తిరిగే ఆర్టీసీ గరుడ బస్సులపై కొంత ప్రభావం చూపుతోంది. వందేభారత్ సైతం పగలే పరుగులు తీస్తున్నా కేవలం ఎనిమిదిన్నర గంటల్లోనే గమ్యం చేరుతుండటం ప్రజాదరణకు కారణమవుతోంది. దీంతో రానున్న రోజుల్లో మరింత ఎక్కువ మంది ఈ రైలు వైపు మళ్లితే గరుడ ప్లస్ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో తగ్గే అవకాశం ఉందని గుర్తించిన ఆర్టీసీ యాజమాన్యం అప్రమత్తమైంది. ప్రయాణికులను ఆకర్షించే చర్యలు చేపట్టింది. పక్కాగా డైనమిక్ ఫేర్ సిస్టం... కాచిగూడ–బెంగళూరు వందేభారత్ ఎనిమిదన్నర గంటల్లో గమ్యం చేరుకుంటుంటే హైదరాబాద్–బెంగళూరు గరుడ ప్లస్ బస్సు 11 గంటలు తీసుకుంటోంది. దీంతో ప్రయాణికులు పెద్ద సంఖ్యలో అటు మళ్లుతున్నారు. ఈ నేపథ్యంలో బస్సులపై ప్రభావం పెద్దగా లేకుండా ఉండేందుకు డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా నిర్వహించాలని ఆర్టీసీ నిర్ణయించింది. వందేభారత్ రైలు టికెట్ చార్జీ (భోజనం చార్జీ లేకుండా) రూ. 1,255గా ఉండగా ఆర్టీసీ గరుడ ప్లస్ బస్సు టికెట్ చార్జీ 1,200గా ఉంది. అందువల్ల డైనమిక్ ఫేర్ విధానాన్ని పక్కాగా అమలు చేయడం ద్వారా వారాంతాల్లో కాకుండా డిమాండ్ తక్కువగా ఉండే సాధారణ రోజుల్లో టికెట్ ధర రూ. 880గా మారుతోంది. మంగళ, బుధ, గురువారాల్లో తక్కువ ధర, మిగతా రోజుల్లో కాస్త ఎక్కువ ధర ఉంటోంది. సాధారణ రోజులు, ప్రయాణ సమయం వంటి మొత్తం 44 అంశాలను పరిగణనలోకి తీసుకొని టికెట్ ధరలను రకరకాల మొత్తాలకు తగ్గించి ఆర్టీసీ ఖరారు చేస్తోంది. ఇది ఆటోమేటిక్‌గా ఖరారయ్యేలా సాంకేతికను వినియోగిస్తోంది. టికెట్ చార్జీ భారీగా తగ్గడంతో బస్సుల వైపు ప్రయాణికులు మొగ్గు చూపుతున్నారు. సిద్దిపేట, ఇతర ప్రాంతాలకు రైలు సర్వీసులతో.. ఇక ప్రస్తుతం సిద్దిపేటకు ఆర్టీసీ నిత్యం 15 నిమిషాలకో బస్సు నడుపుతోంది. ఇవి ఆర్టీసీకి కాసులు కురిపిస్తున్నాయి. కానీ మరో మూడు రోజుల్లో సిద్దిపేట నుంచి కాచిగూడకు రైలు సర్వీసు ప్రారంభం అవుతోంది. ఒక ట్రిప్పులో వెయ్యి మందిని తరలించే అవకాశం ఉండటంతో ఇది కూడా ప్రభావం చూపుతుందని ఆర్టీసీ భావిస్తోంది. ఇక మహబూబ్‌నగర్ సమీపంలోని జక్లేర్, మక్తల్, మాగనూరు, కృష్ణా లాంటి ప్రాంతాల నుంచి ప్రయాణికులు ఎక్కువగా ఆర్టీసీ బస్సులపైనే ఆధారపడి ప్రయాణిస్తుంటారు. అయితే దేవరకద్ర–కృష్ణా మధ్య ఆదివారం నుంచి రైలు సర్విసు ప్రారంభం కానుంది. దీంతో కృష్ణా–కాచిగూడ, సిద్దిపేట–కాచిగూడ రైళ్లు ప్రారంభమయ్యాక వాటిల్లో ప్రయాణికుల సంఖ్య ఏ మేరకు ఉంటోంది? ఏయే ప్రాంతాల్లో ఎక్కువ మంది ఎక్కి దిగుతున్నారు లాంటి అంశాలను పరిశీలించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు కొందరు సిబ్బందిని నియమించారు. వారు ఈ వివరాలు పరిశీలించి సమాచారం ఇచ్చాక తదనుగుణంగా బస్సుల విషయంలో మార్పుచేర్పులు చేయాలని ఆర్టీసీ నిర్ణయించింది. -
టికెట్‌తోపాటు చిరుతిళ్లు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ కొత్తగా ప్రారంభించిన ఈ–గరుడ బస్సుల్లో టికెట్‌తోపాటు చిరుతిళ్లతో కూడిన ఓ డబ్బా (స్నాక్ బాక్స్) ఇవ్వాలని ఆర్టీసీ నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా హైదరాబాద్–విజయవాడ మధ్య కొత్తగా ప్రారంభమైన 9 ఈ–గరుడ బస్సుల్లో శనివారం నుంచి సరఫరా చేస్తోంది. ప్రయాణికుల నుంచి మంచి స్పందన లభిస్తే దూరప్రాంతాలకు తిరిగే ఇతర సర్విసుల్లోనూ దీన్ని ప్రారంభించాలని నిర్ణయించింది. టికెట్ ధరపై రూ.30 అదనం.. ఆర్టీసీ ఏసీ బస్సుల్లో టికెట్‌తోపాటు అరలీటర్ ప్యాకేజ్డ్ వాటర్ బాటిల్‌ను ఉచితంగా అందిస్తోంది. కానీ ఈ చిరు తిండి డబ్బాకు మాత్రం రూ.30 వసూలు చేయబోతోంది. దీన్ని తీసుకునే విషయంలో ప్రయాణికులకు చాయిస్ ఉండదు. చార్జీతోపాటు రూ.30 చేర్చి టికెట్ జారీ అవుతుంది. ఇష్టం ఉన్నా లేకున్నా ఈ బాక్సును తీసుకోవాల్సిందే. డబ్బాలో ఏముంటాయి? ఈ చిరుతిండి డబ్బాలో చిరుధాన్యాలతో చేసిన దాదాపు 25 గ్రాముల ఖాక్రా, 20 గ్రాముల చిక్కీ, 10 గ్రాముల మౌత్‌ఫ్రెషనర్, టిష్యూ పేపర్ ఉంటుందని సమాచారం. ఇది ప్రయోగాత్మకంగా చేపడుతున్నదే. స్పందన బాగుంటే.. చిరుతిళ్ల రకాల్లో, పరిమాణంలోనూ మార్పులుంటాయని సమాచారం. ‘ప్రతి డబ్బాపై క్యూఆర్ కోడ్ ఉంటుంది. ప్రయాణికులు చిరుతిండి గురించి ఫీడ్‌బ్యాక్‌ను ఈ క్యూఆర్‌కోడ్‌ను ఫోన్ ద్వారా స్కాన్ చేసి పంపవచ్చు. ఆ సూచనలను పరిగణలోకి తీసుకుని మార్పుచేర్పులు ఉంటాయి. ఈ డబ్బాను కొనసాగించాలా, వద్దా అనే నిర్ణయమూ తీసుకుంటాం’అని ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్, ఎండీ సజ్జనార్‌లు తెలిపారు. -
TSRTC గరుడ బస్సు లో మంటలు
-
రిపోర్టర్ బ్యాగులో రూ.50 లక్షలు
సాక్షి, విజయవాడ : గరుడ బస్సులో శుక్రవారం పెద్ద మొత్తంలో నగదు పట్టుబడింది. ఓ ప్రయాణికుడి బ్యాగులో 50 లక్షల రూపాయల్ని పోలీసులు కనుగొన్నారు. సరైన పత్రాలు లేకుండా పట్టుబడ్డ నగదును ఐటీ అధికారులకు అప్పగించారు. సదరు ప్రయాణికుడ్ని విశాఖ పెందుర్తి మహాన్యూస్ రిపోర్టర్ సూర్యనారాయణగా గుర్తించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. హవాలా మనీ అన్న కోణంలో విచారణ చేస్తున్నారు. చదవండి : దుర్గ గుడి ‘దొంగ’ దొరికాడు -
మత్తు తినుబండారాలు ఇచ్చి..
విజయవాడ: రాజమండ్రి నుంచి కడప వెళ్తున్న ఆర్టీసీ బస్సులో ఓ ప్రయాణికుడి ఒంటిపై ఉన్న బంగారు ఆభరణాలు దోచుకెళ్లిన సంఘటన జరిగింది. వివరాలు..ప్రకాశం జిల్లా దర్శికి చెందిన ఏలూరు శ్రీనివాసులు అనే ప్రయాణికుడిని గుర్తుతెలియని వ్యక్తి దోచుకున్నాడు. ఏలూరు శ్రీనివాస్ రాజమండ్రిలో గరుడ బస్సు ఎక్కాడు. మరో వ్యక్తి ప్రయాణంలో శ్రీనివాస్‌తో పరిచయం పెంచుకున్నాడు. తనను నమ్మాడని ధృవీకరించుకున్న తర్వాత తన వెంట తెచ్చుకున్న బాదం పాలు, తినుబండారాలను తోటి ప్రయాణికుడికి ఇచ్చాడు. వాటిని తిని తాగిన తర్వాత కొద్దిసేపటికే ఏలూరు శ్రీనివాస్ స్పృహ కోల్పోయాడు. విజయవాడకు దగ్గరలోకి రాగానే అపస్మారక స్థితిలో ఉన్న శ్రీనివాస్‌ను ఆర్టీసీ సిబ్బంది గమనించారు. జేబులోని ఐడీ కార్డు ద్వారా ప్రకాశం జిల్లా దర్శి వాసిగా గుర్తించారు. ఈ విషయం గురించి కృష్ణలంక పోలీసులకు ఆర్టీసీ అధికారులు సమాచారం అందించారు. పోలీసుల దర్యాప్తులో తోటి ప్రయాణికుడు మత్తు ఇచ్చి దోచుకున్నట్లు శ్రీనివాస్ తెలిపాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ.. విజయవాడ.. విజయవాడ..
ఇక స్టేజీల్లో అరిచి ప్రయాణికులను పిలవనున్న ఆర్టీసీ సిబ్బంది దూర ప్రాంత బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచే చర్యలు సాక్షి, హైదరాబాద్: ‘కూకట్పల్లి.. కూకట్పల్లి.. మియాపూర్.. మియాపూర్..’ అంటూ హైదరాబాద్ నగరంలో సెట్విన్ సర్వీసు బస్సు కండక్టర్లు అరు స్తుంటారు. ప్రయాణికులను బస్సులో ఎక్కించు కునేందుకు వారు అలా చేస్తుంటారు. ఇప్పుడు దూర ప్రాంతాలకు తిరిగే గరుడ, సూపర్ లగ్జరీ బస్సుల డ్రైవర్లు కూడా అలాగే అరుస్తూ ప్రయాణికులను ఎక్కించుకోనున్నారు. తీవ్ర నష్టాల్లో ఉన్న ఆర్టీసీని గట్టున పడేసేందుకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా గరుడ, సూపర్ లగ్జరీ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో పెంచాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఇందు కోసం కొత్త లక్ష్యాలను నిర్దేశించింది. ప్రస్తుతం హైదరాబాద్ నుంచి దూర ప్రాంతాలకు తిరుగుతున్న గరుడ బస్సుల ఆక్యుపెన్సీ రేషియో సగటు 65 శాతంగా నమోదవుతోంది. ఈ లెక్క ప్రకారం 35 శాతం సీట్లు ఖాళీగా ఉంటున్నాయన్నమాట. అలాగే సూపర్ లగ్జరీ సగటు 70 శాతంగా ఉంది. దీన్ని కనీసం ఐదు శాతానికి పెంచితే ఆదాయం గణ నీయంగా నమోదవుతుందని భావిస్తున్న ఆర్టీసీ యాజమాన్యం.. ఆమేరకు డిపో స్థాయి అధికారు లకు కొత్త టార్గెట్లు నిర్దేశిస్తోంది. గరుడ బస్సులకు 70 శాతం, సూపర్‌లగ్జరీ బస్సులకు 75 శాతంగా లక్ష్యాన్ని ఖరారు చేసింది. ప్రయోగాత్మకంగా బీహె చ్‌ఈఎస్, మియాపూర్ డిపోలలో ప్రారంభించింది. డ్రైవర్లలో చైతన్యం.. ఆర్టీసీ కోసం గట్టిగా పనిచేస్తేనే లాభాల రుచి చూసే అవకాశం ఉంటుందని యాజమాన్యం కొన్ని రోజు లుగా సిబ్బందిలో చైతన్యం నింపే ప్రయత్నం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రైవేటు బస్సుల తరహాలో.. స్టాపుల్లో ఆగినప్పుడు బస్సు ఏ ప్రాంతా నికి వెళ్తుందో ఆ ప్రాంతం పేరును గట్టిగా ఉచ్చ రిస్తూ ప్రయాణికులను పిలవాలని సూచించింది. బస్సుల్లో సీట్లు ఖాళీగా ఉన్న విషయం తెలియక ప్రయాణికులు ఎక్కటం లేదని ప్రత్యక్ష పరిశీలనలో అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలో దూర ప్రాంత బస్సుల్లో ఉండే రెండో డ్రైవర్ స్టాపులో ఆగగానే గట్టిగా అరిచి ప్రయాణికుల దృష్టిని ఆకర్షిం చాలని ఆదేశించారు. బస్సులను శుభ్రంగా ఉంచటంతోపాటు, సమయపాలన పాటించటం ద్వారా ఆర్టీసీపై సదాభిప్రాయం పెరిగి ప్రయాణికులను ఆకర్షించాలని ఆదేశించారు. ఒకేసారి రెండు బస్సులు వస్తే, ఒక బస్సును పది నిమిషాలపాటు ఆపి రెంటి మధ్య సమయంలో తేడా ఉండేలా చూడాలని ఆదేశించారు. ఇలా ఆదేశాలను పాటించి సత్ఫలితాలు సాధించే సిబ్బందికి ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్టు ప్రకటించారు. త్వరలో దీన్ని అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు. -
గరుడ బస్సు బోల్తా: ఎస్పీ మృతి!
-
గరుడ బస్సు బోల్తా: ఎస్పీ మృతి!
నల్గొండ : ఆర్టీసీ గరుడ బస్సు బోల్తా పడిన ఘటనలో ఒకరు మృతి చెందారు. మరో తొమ్మిదిమంది గాయపడ్డారు. మంగళవారం తెల్లవారుజామున నల్గొండ జిల్లా మునగాల మండలం తాడ్వాయి వద్ద జరిగింది. రోడ్డుకు అడ్డంగా వచ్చిన గేదెలను తప్పించబోయి బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో విజయవాడ కమ్యూనికేషన్స్ ఎస్పీ దుర్మరం చెందినట్లు తెలుస్తోంది. గాయపడినవారిని చికిత్స నిమిత్తం కోదాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
‘టిమ్స్’ పరేషాన్
కామారెడ్డి, న్యూస్‌లైన్ : డ్రైవర్లకు ‘టిమ్స్’ విధానాన్ని తొలగించాలని ఇటీవల హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. అయినా యాజమాన్యం దీనిని పట్టించుకోవడం లేదని కార్మికులు విమర్శిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, గరుడ వంటి బస్సులలో కండక్టర్లను తొలగించి డ్రైవర్లే టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రయాణికుడికి ఒక రూపాయి చొప్పు న డ్రైవర్లకు కమీషన్ ఇస్తామని యాజమాన్యం ఆశ చూపింది. దీంతో సహజంగానే వారు డ్యూటీలు చేయడానికి ఆసక్తి చూపారు. కండక్టర్ల అవసరం తగ్గిపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలూ కోల్పోయారు. రాష్ర్టవ్యాప్తంగా టికెట్టు ఇష్యూ మిషన్స్ (టిమ్స్) వాడే బస్సులు 3,500 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. టిమ్స్ వాడకంతో 4,550 మందికి ఉపాధి లేకుండాపోయిందని సమాచారం. ఒక్క నిజామాబాద్ రీజియన్‌లోనే వందకు పైగా టిమ్స్ సర్వీసులున్నట్టు తెలిసింది. ఈ జిల్లాలో 130 మందికిపైగా నిరుద్యోగులు కండక్టర్ ఉద్యోగం పొందలేని పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పునూ పట్టించుకోని ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు నడుపుతూ ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే సందర్భంలో డ్రైవర్ దృష్టి స్టీరింగు నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు అభద్రతకు లోను కావాల్సి వస్తోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ‘ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కండక్టరు విధులు డ్రైవర్‌కు ఇవ్వరాదు’ అని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టు ఫుల్ బెంచ్‌కు అప్పీలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు న్యాయమైనదేనని పేర్కొంటూ ఇటీవల హైకోర్టు ఫుల్ బెంచ్ ఆర్టీసీ అప్పీల్‌ను తిరస్కరించింది. యాజమాన్యం మాత్రం కోర్టు తీర్పును బేఖాతర్ చేస్తూ డ్రైవర్లతో కండక్టర్ డ్యూటీలు చేయిస్తోంది. ఇప్పటికే కండిషన్ లేని బస్సులతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. దానికి ‘టిమ్స్’ విధానమూ తోడుకావడంతో వారు మరింత పని ఒత్తిడికి గురవుతున్నారు. కండక్టర్లను తగ్గించుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుందని సంస్థ భావించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాలు టిమ్స్ ఇబ్బందుల విషయాన్ని పట్టించుకోకపోవడం కార్మికులను ఇబ్బంది పెడుతోంది.