కామారెడ్డి, న్యూస్‌లైన్ : డ్రైవర్లకు ‘టిమ్స్’ విధానాన్ని తొలగించాలని ఇటీవల హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. అయినా యాజమాన్యం దీనిని పట్టించుకోవడం లేదని కార్మికులు విమర్శిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, గరుడ వంటి బస్సులలో కండక్టర్లను తొలగించి డ్రైవర్లే టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రయాణికుడికి ఒక రూపాయి చొప్పు న డ్రైవర్లకు కమీషన్ ఇస్తామని యాజమాన్యం ఆశ చూపింది.
దీంతో సహజంగానే వారు డ్యూటీలు చేయడానికి ఆసక్తి చూపారు. కండక్టర్ల అవసరం తగ్గిపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలూ కోల్పోయారు. రాష్ర్టవ్యాప్తంగా టికెట్టు ఇష్యూ మిషన్స్ (టిమ్స్) వాడే బస్సులు 3,500 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. టిమ్స్ వాడకంతో 4,550 మందికి ఉపాధి లేకుండాపోయిందని సమాచారం. ఒక్క నిజామాబాద్ రీజియన్‌లోనే వందకు పైగా టిమ్స్ సర్వీసులున్నట్టు తెలిసింది. ఈ జిల్లాలో 130 మందికిపైగా నిరుద్యోగులు కండక్టర్ ఉద్యోగం పొందలేని పరిస్థితి ఏర్పడింది.
హైకోర్టు తీర్పునూ పట్టించుకోని ఆర్టీసీ
డ్రైవర్లు బస్సులు నడుపుతూ ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే సందర్భంలో డ్రైవర్ దృష్టి స్టీరింగు నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు అభద్రతకు లోను కావాల్సి వస్తోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ‘ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కండక్టరు విధులు డ్రైవర్‌కు ఇవ్వరాదు’ అని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టు ఫుల్ బెంచ్‌కు అప్పీలు చేసింది.
సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు న్యాయమైనదేనని పేర్కొంటూ ఇటీవల హైకోర్టు ఫుల్ బెంచ్ ఆర్టీసీ అప్పీల్‌ను తిరస్కరించింది. యాజమాన్యం మాత్రం కోర్టు తీర్పును బేఖాతర్ చేస్తూ డ్రైవర్లతో కండక్టర్ డ్యూటీలు చేయిస్తోంది. ఇప్పటికే కండిషన్ లేని బస్సులతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. దానికి ‘టిమ్స్’ విధానమూ తోడుకావడంతో వారు మరింత పని ఒత్తిడికి గురవుతున్నారు. కండక్టర్లను తగ్గించుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుందని సంస్థ భావించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాలు టిమ్స్ ఇబ్బందుల విషయాన్ని పట్టించుకోకపోవడం కార్మికులను ఇబ్బంది పెడుతోంది.
‘టిమ్స్’ పరేషాన్
Published Mon, Jan 20 2014 3:24 AM | Last Updated on Fri, Aug 31 2018 8:24 PM
Advertisement
Advertisement