26 మందికి గాయాలు
కోదాడ రూరల్: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్ వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రయాణికులతో రాజమహేంద్రవరానికి బయల్దేరింది.
శనివారం తెల్లవారుజామున కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్ వద్ద హైవే పక్కన బస్సును నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లి ఆగింది. రెండు బస్సుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నవ్య, ఆదిత్య, తేజ, డేవిడ్‌లను కోదాడలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు, కె.మణి, దానియేలు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment