super luxury bus
-
టావెల్స్ బస్సును ఢీకొట్టిన సూపర్ లగ్జరీ బస్సు
కోదాడ రూరల్: జాతీయ రహదారి పక్కన ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రెండు బస్సుల్లో ప్రయాణిస్తున్న 26 మంది ప్రయాణికులకు గాయాలు కాగా, వారిలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పరిధిలోని కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్ వద్ద హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై శనివారం తెల్లవారుజామున జరిగింది. హైదరాబాద్ నుంచి ప్రైవేట్ ట్రావెల్ బస్సు శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల తర్వాత ప్రయాణికులతో రాజమహేంద్రవరానికి బయల్దేరింది.శనివారం తెల్లవారుజామున కట్టకమ్ముగూడెం క్రాస్‌రోడ్ వద్ద హైవే పక్కన బస్సును నిలిపాడు. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వెళ్తున్న టీజీఎస్ ఆర్టీసీకి చెందిన సూపర్ లగ్జరీ బస్సు ఆగి ఉన్న ట్రావెల్స్ బస్సును వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రావెల్స్ బస్సు రోడ్డు కిందకు దూసుకెళ్లి ఆగింది. రెండు బస్సుల్లో గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని కోదాడ ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన నవ్య, ఆదిత్య, తేజ, డేవిడ్‌లను కోదాడలోనే ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వెంకటేశ్వరరావు, కె.మణి, దానియేలు పరిస్థితి విషమంగా ఉండటంతో వారిని మెరుగైన వైద్యం కోసం హైదరాబాద్‌కు తరలించారు. -
సూపర్ లగ్జరీ ప్రయాణికులపై ‘వాటర్ చార్జ్’
సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.10 చొప్పున పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం (ఆగస్టు 12) తొలి సరీ్వసు నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇంతకాలం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు మంచినీటి సీసాలు అందించే పద్ధతిని ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి అరలీటరు మంచినీటి సీసాను అందించనున్నారు. ఈ నేపథ్యంలోనే ప్రతి టికెట్ ధరపై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. దూరంతో ప్రమేయం లేకుండా ఈ అదనపు మొత్తం చార్జి చేస్తారు. టికెట్ ధరలోనే దాన్ని కలిపేస్తారు. దీంతో ప్రయాణికుడికి మంచినీటి సీసా అవసరం ఉన్నా లేకున్నా ఈ అదనపు చార్జీతో కూడిన టికెట్ తీసుకోవాల్సిందే. నిత్యం లక్ష మంది ప్రయాణికులపై ఈ తాజా నిర్ణయం ప్రభావం చూపనుంది. టికెట్‌తో పాటే జీవా బాటిల్.. దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు సాధారణంగా వాటర్ బాటిళ్లు దగ్గర పెట్టుకుంటారు. చాలామంది బస్టాండ్లలో కొంటారు. బయటి నీటిని తాగేందుకు ఇష్టపడని వారు ఇంటి నుంచి తెచ్చుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గరుడ ప్లస్, గరుడ, లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అరలీటరు పరిమాణంలో ఉన్న నీటి సీసాలను అందించడం ప్రారంభించారు. గతంలో బిస్లరీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ బ్రాండు మంచినీళ్లు అందించేవారు. ఇటీవల జీవా పేరుతో ఆర్టీసీ సొంతంగా ప్యాకేజ్డ్ మంచినీటిని మార్కెట్లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్టాండ్లలో ఈ నీటిని విక్రయిస్తున్నారు. ఏసీ బస్సుల్లో కూడా గతంలో ఇచ్చిన బిస్లరీ బాటిళ్లకు బదులు జీవా నీటినే ఇస్తున్నారు. ఇప్పుడు అదే నీటిని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఆర్టీసీకి ఏం లాభం? జీవా నీటికి ఇంకా ఆదరణ పెరగలేదు. దీన్ని మార్కెట్లోకి తెచ్చిన సమయంలో సీసా, అందులోని నీటి నాణ్యత విషయంలో ఫిర్యాదులొచ్చాయి. స్వయంగా సొంత సిబ్బందే నాణ్యతపై ప్రశ్నించటంతో, ఒప్పందం చేసుకున్న సంస్థను నాణ్యత విషయంలో సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో కొంతకాలం నిలిపేసి దిద్దుబాటు తర్వాత ఇటీవలే మళ్లీ విడుదల చేశారు. అయితే ఇప్పటికీ అది ప్రయాణికులకు పూర్తిస్థాయిలో పరిచయం కాలేదు. ఈ నేపథ్యంలోనే జీవా బ్రాండ్‌కు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీని ద్వారా కొంత అదనపు ఆదాయం కూడా లభిస్తుందనేది ఆర్టీసీ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతి అరలీటరు సీసాపై రూ.5.50 చొప్పున, దాన్ని తయారు చేస్తున్న ప్రైవేటు సంస్థకు చెల్లిస్తారు. డ్రైవర్‌కు ఇన్సెంటివ్‌గా 50 పైసలు చెల్లిస్తుంది. మిగతా రూ.4ను తన ఆదాయంగా ఆర్టీసీ లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 700 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. వీటిల్లో నిత్యం దాదాపు లక్ష మంది ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన వారిపై రోజుకు రూ.10 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు. -
దావణగెరెకు టీఎస్ఆర్టీసీ కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్
హైదరాబాద్: ప్రయాణికుల సౌకర్యార్థం కర్ణాటకలోని దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్‌ను తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఏర్పాటు చేసింది. హైదరాబాద్‌లోని మియాపూర్ నుంచి దావణగెరెకు ప్రతి రోజు సాయంత్రం 06.40 గంటలకు ఈ బస్సును నడుపుతోంది. ఈ కొత్త సర్వీస్ కేపీహెచ్‌బీ, ఎస్ఆర్ నగర్, అమీర్‌పేట్ , ఎంజీబీఎస్, మహబూబ్ నగర్, రాయచూరు, సిందనూరు, గంగావతి, హోస్పేట్ మీదుగా వెళ్తుంది. దావణగెరె నుంచి ప్రతి రోజు సాయంత్రం 06.00 గంటలకు హైదరాబాద్‌కు బయలుదేరుతుంది. మియాపూర్ నుంచి దావణగెరెకు రూ.872, ఎంజీబీఎస్ నుంచి రూ. 840 చార్జీగా సంస్థ నిర్ణయించింది. హైదరాబాద్‌లోని బస్‌భవన్‌లో శుక్రవారం ఈ కొత్త సర్వీస్‌ను టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ''మధ్య కర్ణాటకలోని దావణగెరెకు తెలంగాణ నుంచి రాకపోకలు ఎక్కువగా జరుగుతుంటాయి. డిమాండ్ దృష్ట్యా దావణగెరెకు కొత్త సూపర్ లగ్జరీ సర్వీస్‌ను ఏర్పాటు చేశాం. ఈ సర్వీస్‌ను ఉపయోగించుకుని ప్రయాణికులు క్షేమంగా గమ్యస్థానాలకు చేరుకోవాలి." అని సూచించారు. ప్రస్తుతం కర్నాటకలోని బెంగళూరు, రాయచూర్, తదితర ప్రాంతాలకు బస్సులను నడుపుతున్నామని తెలిపారు. అంతరాష్ట్ర సర్వీసులకు ప్రయాణీకుల ఆదరణ పెరుగుతుండటం శుభసూచికమన్నారు. దావణగెరె సర్వీస్ శుక్రవారం నుంచే ప్రారంభమవుతుందని, టికెట్ బుకింగ్ కోసం www.tsrtconline.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ప్రయాణికులకు సూచించారు. ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించేందుకు సంస్థ అన్ని ప్రయత్నాలు చేస్తోందన్నారు. ఈ సర్వీస్ ప్రారంభోత్సవంలో టీఎస్ఆర్టీసీ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్(సీవోవో) డాక్టర్ వి.రవిందర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్ కుమార్, మునిశేఖర్, సీపీఎం కృష్ణకాంత్, సీఎంఈ రఘునాథ రావు, సీటీఎం జీవన ప్రసాద్, సీటీఎం (ఎం అండ్ సీ) విజయ్ కుమార్, రంగారెడ్డి ఆర్ఎం శ్రీధర్, డీవీఎం రాజు, మియాపూర్-1 డీఎం రామయ్య, సీఐ సుధ, డ్రైవర్లు రవీందర్, కర్ణాకర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
TSRTC: ప్యానిక్ బటన్.. సీసీ కెమెరాలు.. అందుబాటులోకి ఆధునిక బస్సులు!
సాక్షి, హైదరాబాద్: ప్యానిక్ బటన్.. ప్రయాణ సమయాల్లో మహిళలు తాము ప్రమాదంలో ఉన్నామని.. తమను కాపాడాలని పోలీసులకు తెలిపేందుకు వినియోగించే సాంకేతిక సాధనం. అలాగే రోడ్డు ప్రమాదాలు, అగ్నిప్రమాదాలు, వరదల వంటి ప్రకృతి విపత్తుల్లో వాహనాలు చిక్కుకున్నప్పుడు సహాయం కోరేందుకు దోహదపడే పరికరం. కేవలం ఒక్క బటన్‌ను నొక్కడం ద్వారా వాహన లైవ్ లొకేషన్‌ను నేరుగా పోలీసులు లేదా సహాయ బృందాలకు తెలియజేయగలగడం దీని ప్రత్యేకత. ఢిల్లీ నిర్భయ ఘటన తర్వాత విస్తృతంగా వ్యాప్తిలోకి వచ్చిన ఈ సాధనం ఇప్పుడు టీఎస్ఆర్టీసీ బస్సుల్లో కూడా అందుబాటులోకి రాబోతోంది. కేంద్ర ప్రభుత్వం నిర్భయ పథకంలో భాగంగా మహిళా భద్రత కోసం అన్ని ప్రజారవాణా వాహనాల్లో ప్యానిక్ బటన్లు, వాహన లొకేషన్ ట్రాకింగ్ పరికరాల ఏర్పాటును తప్పనిసరి చేసింది. ఈ నేపథ్యంలో ఆర్టీసీ ఇప్పుడు కొత్తగా కొంటున్న బస్సుల్లో వీటిని ఏర్పాటు చేస్తున్నారు. తాజాగా ఆర్టీసీకి చేరిన 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను సంస్థ శనివారం వినియోగంలోకి తెస్తోంది. ఈ బస్సులను అశోక్ లేలాండ్ కంపెనీ రూపొందించింది. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సుల ఆర్డర్ పొందిన ఆ కంపెనీ తాజాగా 50 బస్సులను అందించింది. మిగతావి రోజుకు కొన్ని చొప్పున జనవరి నాటికి పూర్తిగా సరఫరా చేయనుంది. ఈ బటన్ నొక్కడం ద్వారా సమాచారాన్ని పొందే కమాండ్ కంట్రోల్ రూమ్ బస్‌భవన్‌లో ఏర్పాటు చేస్తున్నారు. అయితే అది ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి రాగానే బస్సుల్లోని ప్యానిక్ బటన్‌తో ఆ వ్యవస్థ అనుసంధానమై పనిచేయడం ప్రారంభిస్తుంది. ప్రతి బస్సులో రెండు వీడియో కెమెరాలు.. బస్సుల్లో అవాంఛిత ఘటనలు చోటుచేసుకున్నప్పుడు కారణాలను గుర్తించే వీలు ప్రస్తుతం లేదు. కొత్తగా వచ్చే బస్సుల్లో సెక్యూరిటీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నారు. డ్రైవర్ కేబిన్ వద్ద ఉండే ఓ సీసీ కెమెరా.. బస్సులోకి ఎక్కే ప్రయాణికులను గుర్తిస్తుంది. డ్రైవర్ వెనుక భాగంలో ఉండే మరో కెమెరా బస్సు చివరి వరకు లోపలి భాగాన్ని చిత్రిస్తుంది. ఈ రెండు కెమెరాలు చిత్రించిన వీడియో ఫీడ్ 15 రోజుల వరకు నిక్షిప్తమవుతుంది. ఇక బస్సును రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు ఎన్నో ఇబ్బందులు తలెత్తుతుంటాయి. కొత్త బస్సుల్లో రివర్స్ కెమెరాలను బిగించారు. బస్సు వెనుకవైపు ఉండే కెమెరా రివర్స్ చేసేటప్పుడు డ్రైవర్‌కు వెనుక ప్రాంతాన్ని చూపుతుంది. త్వరలో బస్సు ట్రాకింగ్ వ్యవస్థ కూడా అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా బస్సులో ఉండనున్నాయి. ఫైర్ డిటెక్షన్ అండ్ అలారం సిస్టం కూడా ఏర్పాటు చేశారు. మోతాదుకు మించి వేడి ఉత్పన్నమైనా లేక పొగ వచ్చినా ఈ వ్యవస్థ గుర్తించి అలారం మోగిస్తుంది. దీంతో డ్రైవర్ అప్రమత్తమై బస్సును ఆపేసి ప్రయాణికులను కిందకు దించేందుకు వీలవుతుంది. షార్ట్ సర్క్యూట్ వల్ల తరచూ బస్సుల్లో చోటు చేసుకొనే అగ్రిప్రమాదాలను ముందే గుర్తించి ప్రయాణికులకు ప్రాణాపాయాన్ని తప్పించేందుకు ఈ అలారంతో అవకాశం కలుగుతుంది. అలాగే ఈ బస్సుల్లో సెల్‌ఫోన్ చార్జింగ్ కోసం ఏర్పాట్లు చేయడంతోపాటు వినోదం కోసం టీవీలను ఏర్పాటు చేశారు. 50 కొత్త సూపర్ లగ్జరీ బస్సులను రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ శనివారం ట్యాంక్‌బండ్‌పై ప్రారంభించనున్నారు. సీఎం కేసీఆర్ ప్రారంభిస్తారని రెండ్రోజుల క్రితం ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి ప్రకటించినప్పటికీ సీఎం ఇతర కార్యక్రమాల్లో బిజీగా ఉండటంతో రవాణాశాఖ మంత్రి ప్రారంభించనున్నట్లు ఆర్టీసీ ప్రకటించింది. మొత్తం 1,016 కొత్త బస్సులకు ఆర్టీసీ ఏర్పాట్లు చేసుకుంటోంది. ఇందులో 630 సూపర్ లగ్జరీ బస్సులు, 370 డీలక్స్/ఎక్స్‌ప్రెస్ బస్సులు, 16 ఏసీ స్లీపర్ బస్సులున్నాయి. త్వరలో 130 డీలక్స్ బస్సులు కూడా అందనున్నాయి. శబరిమల.. సంక్రాంతి స్పెషల్‌గా సేవలు.. ప్రస్తుతం శబరిమల అయ్యప్ప భక్తుల కోసం దాదాపు 200 బస్సులు బుక్ అయ్యాయి. మరిన్ని బుక్ కానున్నాయి. శబరిమల దూర ప్రాంతమైనందున వీలైనంత వరకు కొత్త బస్సులు కేటాయించనున్నారు. ఇప్పుడు అందుతున్న సూపర్ లగ్జరీ బస్సుల్లో కొన్నింటిని అందుకు వినియోగించనున్నారు. సంక్రాంతి రద్దీ దృష్ట్యా దూర ప్రాంతాలకు స్పెషల్ బస్సులు నడుపుతున్నారు. కొత్త బస్సుల్లో కొన్నింటిని అందుకు కేటాయించనున్నారు. (క్లిక్ చేయండి: తెలంగాణ భవన్ ముందు ట్రాఫిక్ నరకం) -
ఆర్టీసీకి కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ 2015 తర్వాత పెద్దఎత్తున కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. మొత్తం వెయ్యి బస్సులను కొనేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. అశోక్ లేలాండ్ కంపెనీ సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల టెండర్లు దక్కించుకుంది. బస్సుల తయారీ పూర్తి కావస్తుండటంతో దశలవారీగా వాటిని ఆర్టీసీకి సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాలుగు సూపర్ లగ్జరీబస్సులు ఆర్టీసీకి చేరాయి. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీకి సరఫరా చేయబోతోంది. తొలిసారి కంపెనీలోనే బస్సు తయారీ గరుడ లాంటి ఏసీ కేటగిరీ బస్సులు మినహా మిగతావాటికి సంబంధించిన చాసీస్‌ను మాత్రమే ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. ఆర్టీసీకి ముందు నుంచి సొంతంగా బస్‌బాడీ యూనిట్ ఉండటమే దీనికి కారణం. దాదాపు 250 మంది సిబ్బందితో మియాపూర్‌లో ఆర్టీసీకి పెద్ద బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. చాసీస్లను కొనుగోలు చేసి ఇందులో బాడీలను సొంతంగా కట్టించుకునేది. కానీ, ఆర్థిక ఇబ్బందులతో బస్‌బాడీ నిర్వహణను భారంగా భావించి దాన్ని క్రమంగా పక్కనపెట్టేస్తూ వచ్చింది. దీంతో గతంలోనే సూపర్ లగ్జరీ బస్సులను కొన్నప్పుడు, కంపెనీ నుంచి చాసీస్ కొని ప్రైవేటు సంస్థతో బాడీ కట్టించింది. కానీ, ఈసారి బాడీతో కలిపే బస్సులు కొనాలని నిర్ణయించి ఆ మేరకే టెండర్లు పిలిచింది. ఫలితంగా ఆదివారం సరఫరా అయిన 4 బస్సులు పూర్తి బాడీతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఆర్టీసీకి చేరాయి. బాడీలకు కొత్త లుక్ ఇప్పుడు అశోక్‌లేలాండ్ తయారీ చేసిన బస్సుల బాడీలు కొత్త లుక్ సంతరించుకున్నాయి. ముందుభాగం ఓల్వో బస్సును పోలినట్టుగా ఉంది. గతంలో కొన్న సూపర్ లగ్జరీ బస్సులు ఇప్పుడు గులాబీ రంగుతో రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ కొత్త బస్సులు తెలుపు రంగుపై నీలం, క్రీమ్ రంగు స్ట్రైప్లతో కనిపిస్తున్నాయి. ముందుభాగంలో తెలుపు, క్రీమ్ కలర్ స్ట్రైప్స్ ఏర్పాటు చేశారు. లైట్లు ఉన్న భాగాన్ని నలుపు రంగులో ఉంచారు. సామగ్రి పెట్టేందుకు గతంతో పోలిస్తే చాలా విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం నడుస్తున్న సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 450 బస్సులు దాదాపు ఆరు లక్షల కి.మీ. మేర తిరిగాయి. దీంతో వాటిల్లో కొన్నింటిని ఆర్డినరీ బస్సులుగా, కొన్నింటిని పల్లెవెలుగు సర్వీసులుగా అధికారులు మార్చనున్నారు. ఆ 450 బస్సుల స్థానంలో కొత్త సూపర్‌లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు. మంచి లాభాలతో తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రూట్లను అప్‌గ్రేడ్ చేసి దాదాపు 150 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 130 డీలక్స్ బస్సులన్నీ 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగి ఉన్నందున వీటిని తుక్కుగా మార్చాలని నిర్ణయించారు. వాటి స్థానంలో కొత్త డీలక్స్ బస్సులు రానున్నాయి. 370 ఇతర కేటగిరీ బస్సుల్లో అన్ని డీలక్స్ బస్సులనే తీసుకోవాలా, కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులు తీసుకోవాలా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తొలుత 130 డీలక్స్ బస్సులను సరఫరా చేయాలని అశోక్ లేలాండ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడ్డాక తొలిసారి స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే 16 కొత్త బస్సులకు టెండర్లు పిలిచింది. త్వరలో అవి ఆర్టీసీకి అందనున్నాయి. వాటిని దూరప్రాంత నగరాలు, పట్టణాలకు తిప్పనుంది. -
ఆ రూట్లు.. ఇక ‘సూపర్’.. టీఎస్ఆర్టీసీకి భారీ ఆదాయం.. కారణం ఇదే..
సాక్షి, హైదరాబాద్: లాభదాయక మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులకు బదులు సూపర్ లగ్జరీలను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. రూట్ అప్‌గ్రెడేషన్‌లో భాగంగా ఈ మార్పు జరగనుంది. ఈ నేపథ్యంలో సుమారు ఆరు వందల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ఇవి డిసెంబర్ నుంచి దశలవారీగా ఆర్టీసీకి చేరనున్నాయి. ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సర్వీసుల్లో ఎక్స్‌ప్రెస్‌లు ముఖ్యమైనవి. ఇవి పట్టణాల మధ్య తిరుగుతున్నాయి. కొన్ని రూట్లలో వీటి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం వరకు ఉంటోంది. చదవండి: తెలంగాణ కేసీఆర్- యూపీ ఆదిత్యనాథ్: ఎవరి మోడల్ బెటర్? ఇలాంటి సర్వీసుల ద్వారా టికెట్ రూపంలో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇలాంటివి దాదాపు 150 రూట్లు ఉన్నట్టు గుర్తించింది. ఆదాయాన్ని పెంచుకునే దిశలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఆర్టీసీ దృష్టి వీటిపై పడింది. ప్రయాణికుల డిమాండ్ విపరీతంగా ఉన్న ఈ రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సుల స్థానంలో సూపర్ లగ్జరీ బస్సులను ప్రవేశపెడితే టికెట్ ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర కంటే సూపర్ లగ్జరీ కేటగిరీ టికెట్ ధర చాలా ఎక్కువ. రద్దీ మార్గాలైనందున సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతోనే నడుస్తాయని ఆర్టీసీ తేల్చింది. ప్రయోగాత్మకంగా నడిపిన బస్సులతో ఇవి రూడీ కావటంతో, అలాంటి మార్గాల్లో బస్సు కేటగిరీని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది. ప్రయాణం హాయి.. జేబుకు భారం ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. బస్సు నిర్మాణంలో పుష్బ్యాక్ సీట్లు, కనిష్టస్థాయి కుదుపులకు ఆస్కారం ఉండటం వల్ల ప్రయాణం హాయిగా సాగుతుంది. ఈ రూపంలో ఆర్టీసీ నిర్ణయం ప్రయాణికులకు మేలు చేసినా, టికెట్చార్జీ ఎక్కువ కావటంతో ఆర్థికభారం పెరుగుతుంది. మెరుగైన ప్రయాణ వసతి కల్పిస్తున్నామనే పేరుతో ఆర్టీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది. ఫలితంగా ఆదాయాన్ని ఆమాంతం పెంచుకోబోతోంది. వీటికి దాదాపు కొత్త బస్సులనే వినియోగించనుంది. మరోవైపు కొన్ని పాత సూపర్ లగ్జరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తోంది. గరిష్ట పరిమితి మేర తిరిగిన వాటిని బాడీ మార్చి ఎక్స్‌ప్రెస్ బాడీలు కట్టించి ఎక్స్‌ప్రెస్‌లుగా తిప్పనుంది. అలా ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన పాత సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్త సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించనుంది. -
ఆర్టీసీ చార్జీల మోత.. డీజిల్ సెస్ పేరిట మళ్లీ టికెట్ ధరల పెంపు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీలో మరోసారి బస్సు చార్జీలు భగ్గుమన్నాయి. డీజిల్ భారాన్ని, నష్టాలను తగ్గించుకునేందుకు ఆర్టీసీ మళ్లీ ‘డీజిల్ సెస్’మోత మోగించింది. 2 నెలల క్రితం అమల్లోకి తెచ్చిన సెస్‌ను కొనసాగిసూ్తనే.. కొత్తగా అదనపు సెస్‌తో ప్రయాణికులపై పెద్ద భారాన్నే మోపింది. ప్రస్తుత చార్జీలకు అదనంగా ప్రతి టికెట్‌పై రూ.5 నుంచి రూ.170 వరకు ‘సెస్’విధించింది. కొత్త ధరలను గురువారం తెల్లవారుజామున తొలి సర్వీసు నుంచే అమల్లోకి తెచ్చింది. దీనితో ఆర్టీసీకి ఏటా రూ.150 కోట్లకుపైగా అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా. నేరుగా చార్జీలు పెంచకుండా.. డీజిల్ ధరలు, ఇతర ఖర్చులు పెరగడంతో.. బస్సుచార్జీలు పెంచాలన్న ప్రతిపాదన కొద్దినెలలుగా ప్రభుత్వ పరిశీలనలో ఉంది. ప్రతి కిలోమీటర్‌కు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో 25 పైసలు, ఆపై కేటగిరీ బస్సుల్లో 30 పైసల చొప్పున పెంచాలని ఆర్టీసీ కోరింది. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో.. తన విచక్షణాధికారం పరిధిలో ఉన్న సెస్‌లకు పదునుపెట్టింది. ఈ ఏడాది మార్చి, ఏప్రిల్ నెలల్లో ఎమినిటీస్ సెస్, డీజిల్ సెస్‌ల పేరుతో ప్రతి టికెట్‌పై రూ.2 నుంచి రూ.10 వరకు పెంచింది. చిల్లర సమ స్య లేకుండా చార్జీలను రౌండాఫ్ చేయడంతో మరింతగా పెంపు నమోదైంది. రెండు నెలల్లోనే మరోసారి ‘అదనపు సెస్’ పేరిట భారం వేసింది. కొత్త పెంపు ఇలా.. ఆర్టీసీ తాజా అదనపు సెస్‌ను దూరాన్ని బట్టి మారేలా శ్లాబులుగా విధించింది. తక్కువ దూరానికి తక్కువగా.. ఎక్కువ దూరానికి ఎక్కువగా భారం పడనుంది. పల్లె వెలుగు: ఈ కేటగిరీ బస్సులపై 250 కిలోమీటర్ల గరిష్ట దూర ప్రయాణాన్ని పరిగణనలోకి తీసుకుని.. రూ.5 నుంచి రూ.45 వరకు అదనపు సెస్ విధించారు. తొలి స్టాపు వరకు రూ.10 కనీస చార్జీ అలాగే ఉంటుంది. రెండో స్టాప్ చార్జీ రూ.15ను రూ.20కి పెంచారు. మూడో స్టాప్ ధర స్థిరంగా ఉంచగా.. నాలుగో స్టాప్ ధరను రూ.25 నుంచి రూ.30కి, ఏడో స్టాప్ వరకు చార్జీని రూ.30 నుంచి రూ.35కు.. ఇలా పెంచుతూ పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో గరిష్టంగా 150 కిలోమీటర్ల దూరం వరకు మాత్రమే పల్లె వెలుగు సర్వీసులు నడుస్తున్నాయి. అంటే వీటిల్లో గరిష్టంగా రూ.30 వరకు మాత్రమే పెరుగుతుంది. ఎక్స్‌ప్రెస్: ఈ బస్సుల్లో 500 కిలోమీటర్ల దూరాన్ని పరిగణనలోకి తీసుకుని కనిష్టంగా రూ.5, గరిష్టంగా రూ.90 మేర సెస్ విధించారు. అయితే తొలి 25 కిలోమీటర్ల వరకు అదనపు సెస్ విధించలేదు. 26వ కిలోమీటర్ నుంచి 40 కిలోమీటర్ల వరకు రూ.5.. 46వ కి.మీ. నుంచి 70 కి.మీ. వరకు రూ.10.. 71 కి.మీ. నుంచి 100 కి.మీ. వరకు రూ.15 ఇలా పెంచుతూ పోయారు. గరిష్టంగా రూ.90 పెరుగుతుంది. డీలక్స్: ఈ బస్సుల్లో కూడా 500 కిలోమీటర్ల వరకు దూరానికి కనీసం రూ.5.. గరిష్టంగా రూ.125 వరకు పెంచారు. సూపర్ లగ్జరీ: 500 కి.మీ. వరకు దూరానికి సంబంధించి రూ.10 నుంచి రూ.130 వరకు పెంచారు. ఈ కేటగిరీలో కూడా తొలి 25 కిలోమీటర్లకు సెస్ వేయలేదు.ఆ తర్వాత 20 కి.మీ.కు రూ.5 చొప్పున విధిస్తూ వచ్చారు. సర్వీసుల వారీగా ఇందులో తేడాలుంటాయి. ఏసీ సర్వీసులు: 500 కి.మీ. దూరానికి కనీసం రూ.10, గరిష్టంగా రూ.170 వరకు అదనపు సెస్ విధించారు. భగ్గుమన్న బస్ పాసులు నగరాల్లో బస్‌పాస్‌ల ధరలను ఆర్టీసీ భారీగా పెంచింది. గ్రేటర్ హైదరాబాద్‌లో సిటీ బస్సులను అదనపు సెస్ నుంచి మినహాయించినా.. బస్‌పాస్‌ల ధరలను అసాధారణంగా మూడింతలకు వరకు పెంచారు. పాస్‌లపై ఇప్పటివరకు నిర్ధారిత శాతంగా చార్జీలు పెంచుతూ వచ్చేవారు. కానీ రెండున్నర దశాబ్దాల తర్వాత ఇప్పుడే పాస్‌లపై రాయితీని తగ్గించటం ద్వారా ధరలను సవరించారు. ఆర్టీసీ ఇంతకాలం జిల్లాల్లో బస్‌పాస్‌లపై ఆర్టీసీ 72 శాతం, నగరాల్లో 89శాతం రాయితీ ఇస్తూ వచ్చింది. అంటే జిల్లాల్లో ప్రయాణికులు 28 శాతం, గనరాల్లో 11 శాతం చార్జీని మాత్రమే చెల్లించారు. నిజానికి ఈ పాస్‌ల రాయితీ మొత్తాన్ని ప్రభుత్వమే ఆర్టీసీకి రీయింబర్స్ చేయాలి. కానీ ఈ సొమ్ము సరిగా అందక ఆర్టీసీ నష్టపోతోందని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే పాసులపై రాయితీని ఆర్టీసీ తగ్గించుకుంది. జిల్లాలో ప్రయాణికుల వాటాను 28శాతం నుంచి 30శాతానికి పెంచింది. నగరాల్లో 11 శాతం నుంచి 25 శాతానికి పెంచింది. దీనితో జిల్లాల్లో పాస్‌ల ధరలు ఓ మోస్తరుగా పెరగ్గా.. నగరాల్లో మాత్రం మూడు రేట్ల వరకు పెరగడం గమనార్హం. 15 శాతం భారం అదనపు సెస్‌తో ఆర్టీసీ బస్‌చార్జీలు సగటున 15 శాతం వరకు పెరిగాయి. బుధవారం అర్ధరాత్రి తర్వాత బయలుదేరే బస్సుల్లో చార్జీల వివరాలు వెల్లడయ్యాయి. హైదరాబాద్– నిజామాబాద్ సూపర్ లగ్జరీ చార్జీ రూ. 290 నుంచి రూ.350కి.. రాజధాని బస్సులో రూ.380 నుంచి రూ. 440కి పెరిగాయి. హైదరాబాద్– కర్నూల్ సూపర్ లగ్జరీ చార్జీ రూ.340 నుంచి రూ.390కి పెరిగింది. హైదరాబాద్– నంద్యాల సూపర్ లగ్జరీ చార్జీ రూ. 450 నుంచి రూ.520కి పెరిగింది. హైదరాబాద్– విజయవాడ సూపర్ లగ్జరీ చార్జీ రూ. 420 నుంచి రూ.490కి.. రాజధాని చార్జీ రూ.540 నుంచి రూ.630కి పెరిగింది. స్టూడెంట్ బస్సు పాసుల్లో మోత ఇలా (రూ.లలో) జిల్లాల్లో (మూడు నెలల పాస్‌లు) దూరం ప్రస్తుత చార్జీ కొత్త చార్జీ 5 కి.మీ వరకు 310 400 10 కి.మీ వరకు 415 680 15 కి.మీ వరకు 510 900 20 కి.మీ వరకు 675 1,150 25 కి.మీ వరకు 850 1,350 30 కి.మీ వరకు 930 1,500 35 కి.మీ వరకు 1,025 1,600 జిల్లాల్లో (నెలవారీ పాస్‌లు) 5 కి.మీ వరకు 115 150 10 కి.మీ వరకు 140 250 15 కి.మీ వరకు 180 300 20 కి.మీ వరకు 240 400 25 కి.మీ వరకు 300 450 30 కి.మీ వరకు 330 500 35 కి.మీ వరకు 355 550 హైదరాబాద్, వరంగల్‌లో స్టూడెంట్ జనరల్ బస్‌పాస్ నెలవారీ పాస్ 165 400 మూడు నెలల పాస్ 495 1,200 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో (హైదరాబాద్ నగరం అవతల వివిధ పట్టణాలు, పల్లెలకు వెళ్లే సబర్బన్ సర్వీసుల్లో) నెలవారీ పాస్‌కు ఇంతకుముందు రూ.165తో పాటు ప్రతి 2 కి.మీ.కి రూ.50 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.400తోపాటు ప్రతి 2కి.మీ.కి రూ.70 చొప్పున వసూలు చేయ నున్నారు. Ü మూడు నెలల పాస్‌కు ఇంతకు ముందు రూ.495తోపాటు ప్రతి 2 కి.మీ.కి రూ.150 చొప్పున వసూలు చేసేవారు. ఇప్పుడు రూ.1,200తోపాటు ప్రతి 2కి.మీ.కి రూ.210 చొప్పున వసూలు చేయనున్నారు. -
ఆర్టీసీకి కొత్త బస్సులు
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీకి త్వరలో కొత్త బస్సులు రాబోతున్నాయి. ఇప్పటికే చాలా బస్సులు పాతబడి ప్రయాణాలకు ఇబ్బందిగా మారడంతో.. వెంటనే కొన్ని కొత్త బస్సులు కొనాలని ఆర్టీసీ నిర్ణయించింది. ఈ మేరకు రూ.100 కోట్లు ఖర్చు చేయనుంది. ఈ నిధులతో సుమారు 280 బస్సులు వస్తాయని అంచనా. ఆర్టీసీ ఆదాయం పెరగాలంటే.. దూరప్రాంత బస్సుల సంఖ్య పెంచాలని ఇటీవల ఆర్టీసీ సమీక్షలో సీఎం కేసీఆర్ సూచించారని అధికారవర్గాలు తెలిపాయి. పల్లె వెలుగు, సిటీ సర్వీసులతో భారీగా నష్టాలు వస్తున్న నేపథ్యంలో.. దూరప్రాంతాలకు నడిచే బస్సులపై దృష్టి సారించాలని ఆదేశించారని పేర్కొన్నాయి. ఈ మేరకు కొత్త బస్సులు కొనాలని నిర్ణయించినట్టు వెల్లడించాయి. బ్యాంకుల నుంచి ఆర్టీసీ రూ.వెయ్యి కోట్లు రుణం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల పూచీకత్తు ఇచ్చింది. అందులో ఇప్పటికే రూ.500 కోట్లు ఆర్టీసీకి అందాయి. వాటిని వివిధ అవసరాలకు కేటాయించారు. మరో రూ.500 కోట్లు రానున్నాయి. అందులో రూ.400 కోట్లను ఆర్టీసీ సహకార పరపతి సంఘానికి బకాయిల కింద చెల్లించాలని.. మిగతా రూ.100 కోట్లతో కొత్త బస్సులు కొనాలని నిర్ణయించారు. (చదవండి: లొంగుబాటలో అన్నలు) సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులే.. ఆర్టీసీలో దూర ప్రాంతాల మధ్య నడిచే సూపర్ లగ్జరీ బస్సులకు డిమాండ్ ఎక్కువ. గరుడ, గరుడ ప్లస్, ఇంద్ర వంటి ఏసీ కేటగిరీ బస్సుల్లో చార్జీలు ఎక్కువ. నాన్ ఏసీ కేటగిరీలో సౌకర్యవంతంగా ఉండే సూపర్ లగ్జరీ బస్సు చార్జీలు వాటితో పోలిస్తే బాగా తక్కువ. దీనితో వాటికి ప్రయాణికుల తాకిడి ఎక్కువ. కొత్తగా కొననున్న బస్సుల్లో ఈ కేటగిరీవే వందకుపైగా తీసుకోవాలని అధికారులు నిర్ణయించారు. మరో 80 వరకు డీలక్స్ బస్సులు కొననున్నారు. ప్రస్తుతమున్న డీలక్స్ బస్సుల్లో 80 బస్సులను సూపర్ లగ్జరీ సర్వీసులుగా అప్‌గ్రేడ్ చేయాలని భావిస్తున్నారు. దీనితో సూపర్ లగ్జరీ బస్సులు మరిన్ని పెరుగుతాయి. ఒక్కో కొత్త బస్సు ధర సగటున రూ.35 లక్షల వరకు ఉంటుందని.. రూ.100 కోట్లతో 280 నుంచి 285 వరకు కొత్త బస్సులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అవసరం భారీగా.. కొనేవి తక్కువ.. ప్రస్తుతం ఆర్టీసీ 9 వేల బస్సులను తిప్పుతుండగా.. అందులో ఆర్టీసీ సొంత బస్సులు ఆరు వేలే. మిగతావి అద్దె బస్సులు. ఆర్టీసీలో అవసరానికి, డిమాండ్‌కు తగ్గట్టుగా కొత్త బస్సులు కొనడం లేదు. ఏటా 250 వరకు బస్సుల కాలపరిమితి తీరిపోతుంది. వాటి స్థానంలో కొత్తవి తేవడంతోపాటు పెరిగే డిమాండ్‌కు తగినట్టుగా సర్వీసులు పెంచాల్సి ఉంటుంది. అంటే.. కాలం తీరే బస్సుల కంటే ఎక్కువగా అవసరం అవుతాయి. కానీ గత మూడేళ్లలో ఆర్టీసీలో కొత్తగా వచ్చిన బస్సులు కేవలం 270 మాత్రమే. ఇదే సమయంలో వెయ్యికిపైగా బస్సులు తుక్కు కిందికి వెళ్లిపోయాయి. ఇప్పుడు కేవలం 280 బస్సులు కొననున్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆర్టీసీ ఆదాయం పెరుగుతోందని, టికెట్ ధరలను కూడా సవరించే యోచనలో ఉన్నందున.. భవిష్యత్తులో పెద్ద సంఖ్యలో కొత్త బస్సులు కొనే అవకాశం ఉందని అధికార వర్గాలు చెప్తున్నాయి. -
సూపర్ లగ్జరీ బస్సు దగ్ధం
స్టేషన్ ఘన్పూర్: హన్మకొండ నుంచి ఉప్పల్‌కు వెళ్తున్న వరంగల్–1 డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సులో మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. అదృష్టవశాత్తు ప్రయాణికులందరూ క్షేమంగా బయటపడ్డారు. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ బస్టాండ్ సమీపంలో జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం ఈ ఘటన చోటు చేసుకుంది. సూపర్ లగ్జరీ బస్సు హన్మకొండ నుంచి ఉప్పల్‌కు మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరింది. స్టేషన్‌ఘన్‌పూర్ ఫ్లైఓవర్ ఎక్కిన బస్సు నెమ్మదిగా వెళ్తుంటే డ్రైవర్‌కు అనుమానం వచ్చింది. అప్పటికే బస్సు వెనుక వైపు ఉండే ఇంజన్లో షార్ట్ సర్క్యూట్ వల్ల పొగలు వస్తున్నాయి. వెనుక సీట్లలో కూర్చున్న ప్రయాణికులకు పొగ వాసన రావడంతో డ్రైవర్‌కు ఈ విషయాన్ని చెప్పారు. వెంటనే డ్రైవర్ బస్సును పక్కకు ఆపి ప్రయాణికులందరినీ కిందికి దించాడు. అప్పటికే బస్సులో మంటలు వ్యాపించాయి. అందరూ చూస్తుండగానే బస్సు పూర్తిగా కాలిపోయింది. వాటర్ ట్యాంకర్ తెప్పించి స్థానికులు మంటలు ఆర్పే ప్రయత్నం చేసినా అప్పటికే క్యాబిన్, సీట్లు, ఇంజన్ పూర్తిగా కాలిపోయాయి. అదే సమయంలో రాఘవాపూర్‌కు చెందిన తోట శ్రీకాంత్ బైక్ బస్సు పక్కనే ఉండటంతో పాక్షికంగా దగ్ధమైంది. కాగా, అగ్ని ప్రమాదం జరిగిన దాదాపు గంట తర్వాత పాలకుర్తి ఫైర్ ఇంజన్ ప్రమాదస్థలానికి చేరుకుంది. అనంతరం జనగామ నుంచి మరో ఫైర్ ఇంజన్ వచ్చింది. ఫైర్ ఇంజన్లు, వాటర్ ట్యాంకర్ల సహాయంతో మంటలను పూర్తిగా ఆర్పివేశారు. -
డీలక్స్ బస్సుకు సెలవు!
సాక్షి, హైదరాబాద్ : డీలక్స్ బస్సు.. పుష్ బ్యాక్ సీట్లు, నల్ల అద్దాలు, ప్రత్యేక రంగు, ఎక్స్‌ప్రెస్ కంటే వేగం, నాన్‌స్టాప్ సర్వీసు.. ఆర్టీసీలో ఈ కేటగిరీ బస్సులకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే త్వరలో ఈ కేటగిరీ బస్సులు అదృశ్యం కాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వీసుల్లో ఆ కేటగిరీ బస్సులను తొలగించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్తగా కొనే బస్సుల్లో ఇకపై డీలక్స్ కేటగిరీవి ఉండబోవు. ఇప్పటికే ఉన్న బస్సులను ఇతర కేటగిరీలకు మార్పు చేయబోతున్నారు. సూపర్ లగ్జరీలకు ప్రాధాన్యం.. ఆర్టీసీలో సూపర్ లగ్జరీ బస్సులకు మంచి డిమాండ్ ఉంది. ముఖ్యమైన పట్టణాలను హైదరాబాద్‌తో అనుసంధానించేవాటిలో ఇవి ప్రధానమైనవి. హైదరాబాద్‌లో బయలుదేరిన తర్వాత నేరుగా గమ్యం చేరే నాన్‌స్టాప్‌లు ఇవి. అతి ముఖ్యమైన చోట్ల తప్ప దాదాపు అన్ని మార్గాల్లో ఇవి నాన్‌స్టాప్‌లుగా తిరుగుతున్నాయి. వీటి వేగం కూడా ఎక్కువే. దీంతో ప్రయాణికులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో కొన్ని నాన్‌స్టాప్‌లుగా ఉండగా, మిగతావి ముఖ్యమైన స్టాప్ (స్టేజీ)లలో ఆగుతాయి. వీటి చార్జీ కొంచెం తక్కువగా ఉంటుంది. మొత్తం ఆర్టీసీ బస్సుల్లో పల్లెవెలుగు తర్వాత ఎక్కువగా ఉండేవి ఈ ఎక్స్‌ప్రెస్ సర్సీసులే. ఇక సూపర్ లగ్జరీ– ఎక్స్‌ప్రెస్ సర్వీసుల మధ్య ఉన్న కేటగిరీనే డీలక్స్ బస్సులు. వీటిల్లో సూపర్ లగ్జరీ తరహాలో పుష్ బ్యాక్ సీట్లు ఉంటాయి. అలాగే వీటి వేగం ఇంచుమించు సూపర్ లగ్జరీతో సమానం. అయితే టికెట్ చార్జీ దానికంటే కొంచెం తక్కువ. ఇవన్నీ నాన్‌స్టాప్ సర్వీసులే. ఇవి కూడా కండక్టర్ ఉండని సర్వీసులు. వెరసి సూపర్ లగ్జరీకి దీనికి పెద్దగా తేడా లేదు. దీంతో ఈ కేటగిరీని ఇక తొలగించాలని ఆర్టీసీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రయాణికుల్లో కన్ఫ్యూజన్ లేకుండా ఇకపై సూపర్ లగ్జరీ – ఆ తర్వాత దానితో పోలికల్లో తేడా ఉండే ఎక్స్‌ప్రెస్ కేటగిరీనే ఉంటుంది. ప్రస్తుతం చూసేందుకు ఎక్స్‌ప్రెస్‌కు డీలక్స్‌కు మధ్య తేడా అతి స్వల్పం. ఎక్స్‌ప్రెస్ సర్వీసుగా భావించి ఎక్కి టికెట్ తీసుకునేప్పుడు చార్జీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో డీలక్స్ వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం లేదని భావిస్తున్న ఆరీ్టసీ, ఈ కేటగిరీకి సెలవు చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనివల్ల ప్రయాణికుల్లో అయోమయం తొలగిపోవటంతోపాటు ఆరీ్టసీకి ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. నాన్‌స్టాప్, బ్యాక్ పుష్ సీట్లు కోరుకునే డీలక్స్ ప్రయాణికులు సూపర్ లగ్జరీకి మళ్లుతారనేది ఆర్టీసీ ఆలోచన. గతంలో సెమీ లగ్జరీ.. ఆ తర్వాత డీలక్స్.. రెండు దశాబ్దాల క్రితం ఆర్టీసులో సెమీ లగ్జరీ కేటగిరీ ఉండేది. అప్పట్లో అదే టాప్ కేటగిరీ బస్సు. ఆ తర్వాత దాన్ని హైటెక్ సర్వీసుగా మార్చారు. ఆ సమయంలోనే డీలక్స్ సర్వీసును చేర్చారు. తర్వాత హైటెక్ సర్వీసు పేరును సూపర్ లగ్జరీగా మార్చారు. అంతకుముందు సూపర్ డీలక్స్ పేరుతో కొంతకాలం నడిచి మధ్యలో ఆగిపోయి.. తిరిగి డీలక్స్ పేరుతో అది కొనసాగింది. ఇప్పుడు దానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆర్టీసులో వెన్నెల స్లీపర్ సర్వీసు తర్వాత గరుడ ప్లస్, గరుడ.. పేరుతో ప్రీమియర్ కేటగిరీలున్నాయి. వీటిల్లో వోల్వో, స్కానియా, బెంజ్‌లాంటి బహుళజాతి కంపెనీల బస్సులు ఉంటాయి. ఇందులో గరుడ ప్లస్ మల్టీ యాక్సల్ మోడల్ బస్సులతో నడుస్తుంది. కుదుపులు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత రా«జధాని ఏసీ, సూపర్ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, పల్లెవెలుగు మినీ ఉన్నాయి. దీంతో కేటగిరీలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారని ఆర్టీసీ అధికారులంటున్నారు. ఈ క్రమంలో డీలక్స్ సర్వీసులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. -
‘సినిమా’ బంద్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్టీసీలో ప్రయాణికులకు వినోదం కరువైంది. రాష్ట్రంలోని పలు సుదూరప్రాంతాలకు ప్రయాణించేందుకు గతంలో సూపర్‌లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టింది ఆర్టీసీ. దూర మార్గాలు కావడంతో ప్రయాణికులకు అలసట తెలియకుండా పుష్ బ్యాక్ సీట్లతోపాటు వినోదం అందించేందుకు టీవీలు ఏర్పాటు చేసింది. వీటిలో వివిధ సినిమాలు వేసేవాళ్లు. సినిమాలతోపాటు పలు ప్రకటనలూ వచ్చేవి. గత కొంతకాలంగా వీటి నిర్వహణ సరిగా ఉండటం లేదని ప్రయాణికులు విమర్శిస్తున్నారు. నిర్వహణపేరుతో అన్ని సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీల కనెక్షన్ పీకి పారేసారు. కొత్తగా వచ్చిన బస్సుల్లో టీవీల స్థానంలో ఖాళీ అరలు దర్శనమిస్తున్నాయి. కొన్నింటిలో టీవీలు ఉన్నా.. ఎలాంటి ప్రయోజనం లేక ఉత్సవిగ్రహాలుగా మారాయి. మౌనమే సమాధానం.. రాష్ట్ర ఆర్టీసీలో మొత్తం 1748 సూపర్ లగ్జరీ బస్సులు ఉన్నాయి. దాదాపు అన్ని బస్సుల్లోనూ ఇదే దయనీయ పరిస్థితి నెలకొంది. దీంతో రాజధాని నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రధాన నగరాలకు , పొరుగురాష్ట్రాలకు ఈ బస్సుల్లో వెళ్లే ప్రయాణికులకు వినోదం అందడం లేదు. టీవీలు ఎందుకు పెట్టడం లేదని ప్రశ్నించిన ప్రయాణికులకు .. డ్రైవర్ల నుంచి మౌనమే సమాధానంగా వస్తోంది. ఇంతకాలంగా టీవీలు నిద్రపోతున్నా.. ఆర్టీసీ తమ వెబ్సైట్లలో మాత్రం వీటిని వీడియో కోచ్‌లనే ప్రచారం చేసుకోవడం గమనార్హం. నిర్వహణ సమస్య... సూపర్ లగ్జరీ బస్సుల్లో టీవీలున్నా నిర్వహణ సమస్యలు తలెత్తడంతోనే కొన్ని నెలలుగా వీటిని పక్కనబెట్టినట్లు అధికారులు చెబుతున్నారు. బస్సు డ్రై వర్లే వీటిని నియంత్రించాల్సి రావడం, టీవీల్లో తరచుగా రిపేర్ల సమస్యలు తలెత్తడంతో మొత్తానికి వాటిని అటకెక్కించారు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సుల్లో టీవీలను నియంత్రణ, నిర్వహణలకు ప్రత్యేకంగా మనుషులు ఉంటారు. ఆర్టీసీలో అలాంటి అవకాశం లేదని, అదీ ఒక కారణంగా చెబుతున్నారు. కానీ, ఏపీకి చెందిన బస్సుల్లో టీవీల నియంత్రణకు ఎలాంటి అదనపు సిబ్బంది లేకపోయినా బాగానే పనిచేస్తున్నాయి. దీంతో ప్రయాణికులు ఆ బస్సులను ఎక్కేందుకే ఆసక్తి చేపిస్తున్నారు. త్వరలోనే ఏర్పాటు చేస్తాం ఒక్కో టీవీ ధర దాదాపుగా రూ.20,000లకు అటుఇటూగా ఉంది. ఇంతటి ఖరీదైన టీవీల నిర్వహణ సవాలుతో కూడినది. పైగా కొన్ని టీవీలు పదే పదే రిపేర్లు వస్తున్నాయి. అందుకే, కొత్త బస్సుల్లోనూ టీవీలు పెట్టించలేదు. బస్సుల్లో ప్రేక్షకుల ఇబ్బంది మా దృష్టికి వచ్చింది. త్వరలోనే ప్రయాణికులకు తిరిగి టీవీలు అందించే ఏర్పాటు చేస్తాం. – వెంకటేశ్వర్లు ఆర్టీసీ ఈడీ (రెవెన్యూ) సెక్రటరీ కార్పొరేషన్ -
ఆధునిక సౌకర్యం..సురక్షిత ప్రయాణం..
కడప అర్బన్ : ఏపీఎస్ ఆర్టీసీవారు ఆధునిక సౌకర్యాలతో కూడిన అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను నడుపుతూ ప్రయాణికుల మన్ననలు పొందుతున్నారు. కడప డిపో నుంచి బెంగుళూరుకు విజయవంతంగా ‘అమరావతి’ బస్సు సర్వీస్‌ను 2016 జనవరి నుంచి నడుపుతున్నారు. అమరావతి బస్సు సర్వీస్ కడప – బెంగళూరు అమరావతి బస్సు సర్వీస్‌లో ఆధునిక సౌకర్యాలున్నాయి.సెమీస్లీపర్ సీట్ల అమరిక, ప్రయాణికులు సౌకర్యవంతంగా ప్రయాణించే విధంగా వుంది. ♦ ప్రతి రోజూ కడప నుంచి అమరావతి సర్వీస్ మధ్యాహ్నం 1:30 గంటలకు బయలుదేరుతుం ది. అలాగే మధ్యాహ్నం 2 గంటలకు బెంగళూరు నుంచి కడపకు మరో బస్సు బయలుదేరుతుంది. ♦ ప్రతి రోజూ రాత్రి కడప నుంచి బెంగళూరుకు 11:45 గంటలకు బయలుదేరుతుంది. బెంగుళూరు నుంచి కడపకు రాత్రి 11:30 గంటలకు బయలుదేరుతుంది. ♦ ఈ సర్వీస్‌లో ఛార్జి రూ.638గా చెల్లించాలి. ఆన్లైన్ రిజర్వేషన్ సౌకర్యం వుంది. రిజర్వేషన్ చేయించుకున్న వెంటనే సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా మెసేజ్ వస్తుంది. సర్వీస్ బయలు దేరు సమయానికి అరగంట నుంచి గంటలోపు కండక్టర్/డ్రైవర్ సెల్ నెంబర్లు సెల్‌ఫోన్‌కు ఎస్ఎంఎస్ ద్వారా వస్తాయి. ఏదైనా సమస్యలు తలెత్తినా, ఆయా సెల్ఫోన్లకు సమాచారం ఇవ్వవచ్చును. ఇంద్ర బస్సు సర్వీస్‌లు ♦ ఏపీఎస్ ఆర్టీసీ వారు ఆధునిక సౌకర్యాలతో కడప నుంచి ఇంద్ర బస్సులను 2012 నుంచి ప్రారంభించారు. ♦ కడప– విజయవాడకు రాత్రి 9:00 గంటలకు బయలుదేరుతుంది. ఛార్జి రూ. 685గా చెల్లించాలి. ♦ కడప– బెంగళూరుకు ఉదయం 10:30, రాత్రి 11:00 గంటలకు బయలుదేరుతుంది. ఈ బస్సులో ఛార్జి రూ. 460గా వసూలు చేస్తున్నారు. ♦ కడప –చెన్నైకి రాత్రి 11:45 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 387గా చెల్లించాలి. ♦ కడప– హైదరాబాద్ (మియాపూర్)– రాత్రి 10:30 గంటలకు వెళుతుంది. ఛార్జి రూ. 741గా చెల్లించాలి. ప్రయాణికుల సురక్షితమే ధ్యేయంగా సర్వీస్‌లు : ప్రైవేట్ బస్సు సర్వీస్‌లకు ధీటుగా ఆధునిక సౌకర్యాలతో అమరావతి, ఇంద్ర సర్వీస్‌లను విజయవంతంగా నడుపుతున్నాం. పుష్ఆప్ బ్యాక్ సెమీస్లీపర్ సీట్లు విశ్రాంతి తీసుకునేందుకు వీలుగా వున్నాయి. ప్రయాణికుల ఆహ్లాదం కోసం, ఎల్ఈడీ టీవీల్లో చలనచిత్రాల ప్రదర్శన రెగ్యులర్‌గా ఉంటుంది. ఏసీ సౌకర్యం ఉంటుంది. ప్రయాణికుల్లో ఆదరణ పెరుగుతోంది. ప్రతీ రోజూ ఈ రెండు బస్సులలో ఉన్న సీట్లన్నీ నిండుతాయన్నారు. ఏవైనా అసౌకర్యాలు కలిగినచో వెంటనే కడప ఆర్టీసీ బస్టాండ్ విచారణ కేంద్రం ఫోన్ నెంబర్: 08562– 244160కు సమాచారం ఇవ్వాలి. – గిరిధర్ రెడ్డి, కడప డిపోమేనేజర్ -
సూపర్ లగ్జరీ బస్సు బోల్తా: డ్రైవర్ మృతి
సదాశివనగర్: వేగంగా వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు అదుపుతప్పి బోల్తాకొట్టిన ఘటనలో డ్రైవర్ మృతిచెందాడు. ఈ సంఘటన కరీంనగర్ జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి గ్రామ శివారులో గురువారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. హైదరాబాద్ నుంచి నిజామాబాద్ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు దగ్గి వద్దకు రాగానే అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొని ఆ వెంటనే పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ శ్రీనివాస్‌రెడ్డి(40) అక్కడికక్కడే మృతిచెందాడు. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
ముద్దనూరు : వైఎస్ఆర్ జిల్లా ప్రొద్దుటూరు నుంచి బెంగళూరు వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు సోమవారం అర్ధరాత్రి ముద్దనూరు సమీపంలోని నల్లబల్లె వద్ద వంకలో ఒరిగిపోయింది. భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎదురుగా వస్తున్న లారీని తప్పించబోయిన డ్రైవర్ ఎం.పి.రావు బస్సును రోడ్డు పక్కకు తీసుకెళ్లాడు. పక్కనే వంక ఉధృతంగా ప్రవహిస్తుండటంతో బస్సు ఒరిగిపోయింది. ప్రయాణీకులు వెంటనే కిటికీలోంచి బయటకు దూకారు. వారిలో ఓ ఇద్దరికి గాయాలయ్యాయి. ప్రొద్దుటూరు నుంచి రాత్రి 10.30 గంటలకు బయలుదేరిన 9288 సర్వీసు నెంబర్ బస్సులో 31 మంది ప్రయాణీకులున్నారు. ప్రమాదం రాత్రి 12 గంటల తర్వాత జరిగింది. సంఘటన స్థలానికి ప్రొద్దుటూరు డిపో మేనేజర్ గిరిధర్ రెడ్డి, ముద్దనూరు పోలీసులు, స్థానికులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణీకులను వేరే బస్సులో బెంగళూరుకు వెళ్లే ఏర్పాటు చేశారు. -
ఆర్టీసీ బస్సు, లారీ ఢీ...
ఒంగోలు : మేదరమెట్ల మండలంలోని మేదరమెట్ల-తమ్మవరం జంక్షన్ జాతీయరహదారి పై ఆర్టీసీ సూపర్‌లగ్జరీ బస్సును లారీ ఢీ కొన్నసంఘటన శనివారం చోటుచేసుకుంది. వివరాలు...నెల్లూరు నుంచి విజయవాడకు 35 మంది ప్రయాణికులతో వెళుతున్న సూపర్‌లగ్జరీ బస్సును జాతీయరహదారి తమ్మవరం జంక్షన్ మలుపు నుంచి మేదరమెట్ల గ్రామంలోకి తిరిగేందుకు డ్రైవర్ బస్సును తిప్పాడు. అదే సమయంలో ఒంగోలు వైపుకు వెళ్తున్న సిమెంటు లారీ వేగంగా వచ్చి బస్సును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బస్సులో ప్రయాణిస్తున్న రాజారత్నం మేదరమెట్లలో దిగేందుకు బస్సు క్యాబిన్ వద్దకు రావడంతో రాజారత్నం తలకు త్రీవ గాయం అయ్యింది. క్షతగాత్రుడు తూర్పుగోదావరి జిల్లా రాజోలు గ్రామానికి చెందిన వ్యక్తి. క్షతగాత్రుని 108 వాహనంలో అద్దంకి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 35 మంది ప్రయాణీకులు ఉన్నారు. లారీ బస్సు మధ్యలో ఢీ కొని ఉంటే పెను ప్రమాదం సంభవించి ఉండేది. ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడు. మేదరమెట్ల పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. (మేదరమెట్ల) -
ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు: ఒకరి మృతి
నల్గొండ: జిల్లాలోని నార్కట్‌పల్లి మండలం ఏపీలింగోటం వద్ద తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఒకరు మృతిచెందగా, 14మందికి గాయాలయ్యాయి. ఆగిఉన్న లారీని సూపర్ లగ్జరీ బస్సు ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్టు తెలుస్తోంది. ఏలూరు నుంచి హైదరాబాద్‌కు వస్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. బస్సు అతివేగమే ఈ ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. -
‘టిమ్స్’ పరేషాన్
కామారెడ్డి, న్యూస్‌లైన్ : డ్రైవర్లకు ‘టిమ్స్’ విధానాన్ని తొలగించాలని ఇటీవల హైకోర్టు ఆర్టీసీని ఆదేశించింది. అయినా యాజమాన్యం దీనిని పట్టించుకోవడం లేదని కార్మికులు విమర్శిస్తున్నారు. 2000 సంవత్సరంలో ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, గరుడ వంటి బస్సులలో కండక్టర్లను తొలగించి డ్రైవర్లే టికెట్లు జారీ చేసే విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రయాణికుడికి ఒక రూపాయి చొప్పు న డ్రైవర్లకు కమీషన్ ఇస్తామని యాజమాన్యం ఆశ చూపింది. దీంతో సహజంగానే వారు డ్యూటీలు చేయడానికి ఆసక్తి చూపారు. కండక్టర్ల అవసరం తగ్గిపోవడంతో నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలూ కోల్పోయారు. రాష్ర్టవ్యాప్తంగా టికెట్టు ఇష్యూ మిషన్స్ (టిమ్స్) వాడే బస్సులు 3,500 వరకు ఉన్నట్టు తెలుస్తోంది. టిమ్స్ వాడకంతో 4,550 మందికి ఉపాధి లేకుండాపోయిందని సమాచారం. ఒక్క నిజామాబాద్ రీజియన్‌లోనే వందకు పైగా టిమ్స్ సర్వీసులున్నట్టు తెలిసింది. ఈ జిల్లాలో 130 మందికిపైగా నిరుద్యోగులు కండక్టర్ ఉద్యోగం పొందలేని పరిస్థితి ఏర్పడింది. హైకోర్టు తీర్పునూ పట్టించుకోని ఆర్టీసీ డ్రైవర్లు బస్సులు నడుపుతూ ప్రయాణికులకు టికెట్లు ఇచ్చే సందర్భంలో డ్రైవర్ దృష్టి స్టీరింగు నుంచి పక్కకు తప్పుకోవడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయి. ప్రయాణికులు అభద్రతకు లోను కావాల్సి వస్తోంది. ఈ విషయంలో చర్యలు తీసుకోవాలని పలు సంఘాలు కోర్టును ఆశ్రయించాయి. దీంతో హైకోర్టు సింగిల్ బెంచ్ ‘ప్రయాణికుల ప్రాణాలు ముఖ్యం కాబట్టి కండక్టరు విధులు డ్రైవర్‌కు ఇవ్వరాదు’ అని తీర్పునిచ్చింది. ఈ తీర్పుపై ఆర్టీసీ యాజమాన్యం హైకోర్టు ఫుల్ బెంచ్‌కు అప్పీలు చేసింది. సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు న్యాయమైనదేనని పేర్కొంటూ ఇటీవల హైకోర్టు ఫుల్ బెంచ్ ఆర్టీసీ అప్పీల్‌ను తిరస్కరించింది. యాజమాన్యం మాత్రం కోర్టు తీర్పును బేఖాతర్ చేస్తూ డ్రైవర్లతో కండక్టర్ డ్యూటీలు చేయిస్తోంది. ఇప్పటికే కండిషన్ లేని బస్సులతో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. దానికి ‘టిమ్స్’ విధానమూ తోడుకావడంతో వారు మరింత పని ఒత్తిడికి గురవుతున్నారు. కండక్టర్లను తగ్గించుకోవడం ద్వారా ఖర్చు తగ్గుతుందని సంస్థ భావించడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. కార్మిక సంఘాలు టిమ్స్ ఇబ్బందుల విషయాన్ని పట్టించుకోకపోవడం కార్మికులను ఇబ్బంది పెడుతోంది.