డీలక్స్‌ బస్సుకు సెలవు! | TS RTC Has Decided To Remove Deluxe Services | Sakshi
Sakshi News home page

డీలక్స్‌ బస్సుకు సెలవు!

Published Wed, Dec 23 2020 8:37 AM | Last Updated on Wed, Dec 23 2020 8:37 AM

TS RTC Has Decided To Remove Deluxe Services  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : డీలక్స్‌ బస్సు.. పుష్‌ బ్యాక్‌ సీట్లు, నల్ల అద్దాలు, ప్రత్యేక రంగు, ఎక్స్‌ప్రెస్‌ కంటే వేగం, నాన్‌స్టాప్‌ సర్వీసు.. ఆర్టీసీలో ఈ కేటగిరీ బస్సులకు ఓ ప్రత్యేకత ఉంది. అయితే త్వరలో ఈ కేటగిరీ బస్సులు అదృశ్యం కాబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న సర్వీసుల్లో  ఆ కేటగిరీ బస్సులను తొలగించాలని ఆర్టీసీ భావిస్తోంది. కొత్తగా కొనే బస్సుల్లో ఇకపై డీలక్స్‌ కేటగిరీవి ఉండబోవు. ఇప్పటికే ఉన్న బస్సులను ఇతర కేటగిరీలకు మార్పు చేయబోతున్నారు.       

 సూపర్‌ లగ్జరీలకు ప్రాధాన్యం.. 
ఆర్టీసీలో సూపర్‌ లగ్జరీ బస్సులకు మంచి డిమాండ్‌ ఉంది. ముఖ్యమైన పట్టణాలను హైదరాబాద్‌తో అనుసంధానించేవాటిలో ఇవి ప్రధానమైనవి. హైదరాబాద్‌లో బయలుదేరిన తర్వాత నేరుగా గమ్యం చేరే నాన్‌స్టాప్‌లు ఇవి. అతి ముఖ్యమైన చోట్ల తప్ప దాదాపు అన్ని మార్గాల్లో ఇవి నాన్‌స్టాప్‌లుగా తిరుగుతున్నాయి. వీటి వేగం కూడా ఎక్కువే. దీంతో ప్రయాణికులు వీటికి ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇక ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల్లో కొన్ని నాన్‌స్టాప్‌లుగా ఉండగా, మిగతావి ముఖ్యమైన స్టాప్‌ (స్టేజీ)లలో ఆగుతాయి. వీటి చార్జీ కొంచెం తక్కువగా ఉంటుంది. మొత్తం ఆర్టీసీ బస్సుల్లో పల్లెవెలుగు తర్వాత ఎక్కువగా ఉండేవి ఈ ఎక్స్‌ప్రెస్‌ సర్సీసులే. ఇక సూపర్‌ లగ్జరీ– ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుల మధ్య ఉన్న కేటగిరీనే డీలక్స్‌ బస్సులు. వీటిల్లో సూపర్‌ లగ్జరీ తరహాలో పుష్‌ బ్యాక్‌ సీట్లు ఉంటాయి. అలాగే వీటి వేగం ఇంచుమించు సూపర్‌ లగ్జరీతో సమానం.

అయితే టికెట్‌ చార్జీ దానికంటే కొంచెం తక్కువ. ఇవన్నీ నాన్‌స్టాప్‌ సర్వీసులే. ఇవి కూడా కండక్టర్‌ ఉండని సర్వీసులు. వెరసి సూపర్‌ లగ్జరీకి దీనికి పెద్దగా తేడా లేదు. దీంతో ఈ కేటగిరీని ఇక తొలగించాలని ఆర్టీసీ దాదాపు ఒక నిర్ణయానికి వచ్చింది. ప్రయాణికుల్లో కన్ఫ్యూజన్‌ లేకుండా ఇకపై సూపర్‌ లగ్జరీ – ఆ తర్వాత దానితో పోలికల్లో తేడా ఉండే ఎక్స్‌ప్రెస్‌ కేటగిరీనే ఉంటుంది. ప్రస్తుతం చూసేందుకు ఎక్స్‌ప్రెస్‌కు డీలక్స్‌కు మధ్య తేడా అతి స్వల్పం. ఎక్స్‌ప్రెస్‌ సర్వీసుగా భావించి ఎక్కి టికెట్‌ తీసుకునేప్పుడు చార్జీ ఎక్కువగా ఉందని ప్రయాణికులు గొడవ పెట్టుకుంటున్న సందర్భాలు ఎక్కువ. ఈ నేపథ్యంలో డీలక్స్‌ వల్ల ప్రత్యేకంగా ప్రయోజనం లేదని భావిస్తున్న ఆరీ్టసీ, ఈ కేటగిరీకి సెలవు చెప్పాలని నిర్ణయించినట్టు సమాచారం. దీనివల్ల ప్రయాణికుల్లో అయోమయం తొలగిపోవటంతోపాటు ఆరీ్టసీకి ఆదాయం కూడా పెరుగుతుందని భావిస్తున్నారు. నాన్‌స్టాప్, బ్యాక్‌ పుష్‌ సీట్లు కోరుకునే డీలక్స్‌ ప్రయాణికులు సూపర్‌ లగ్జరీకి మళ్లుతారనేది ఆర్టీసీ ఆలోచన.  

గతంలో సెమీ లగ్జరీ.. ఆ తర్వాత డీలక్స్‌.. 
రెండు దశాబ్దాల క్రితం ఆర్టీసులో సెమీ లగ్జరీ కేటగిరీ ఉండేది. అప్పట్లో అదే టాప్‌ కేటగిరీ బస్సు. ఆ తర్వాత దాన్ని హైటెక్‌ సర్వీసుగా మార్చారు. ఆ సమయంలోనే డీలక్స్‌ సర్వీసును చేర్చారు. తర్వాత హైటెక్‌ సర్వీసు పేరును సూపర్‌ లగ్జరీగా మార్చారు. అంతకుముందు సూపర్‌ డీలక్స్‌ పేరుతో కొంతకాలం నడిచి మధ్యలో ఆగిపోయి.. తిరిగి డీలక్స్‌ పేరుతో అది కొనసాగింది. ఇప్పుడు దానికి మళ్లీ బ్రేకులు పడ్డాయి. ప్రస్తుతం ఆర్టీసులో వెన్నెల స్లీపర్‌ సర్వీసు తర్వాత గరుడ ప్లస్, గరుడ.. పేరుతో ప్రీమియర్‌ కేటగిరీలున్నాయి. వీటిల్లో వోల్వో, స్కానియా, బెంజ్‌లాంటి బహుళజాతి కంపెనీల బస్సులు ఉంటాయి. ఇందులో గరుడ ప్లస్‌ మల్టీ యాక్సల్‌ మోడల్‌ బస్సులతో నడుస్తుంది. కుదుపులు తక్కువగా ఉంటాయి. ఆ తర్వాత రా«జధాని ఏసీ, సూపర్‌ లగ్జరీ, డీలక్స్, ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు, పల్లెవెలుగు మినీ ఉన్నాయి. దీంతో కేటగిరీలు ఎక్కువ కావడంతో ప్రయాణికులు అయోమయానికి గురవుతున్నారని ఆర్టీసీ అధికారులంటున్నారు. ఈ క్రమంలో డీలక్స్‌ సర్వీసులను తొలగించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement