సాక్షి, హైదరాబాద్: లాభదాయక మార్గాల్లో ఎక్స్‌ప్రెస్ బస్సులకు బదులు సూపర్ లగ్జరీలను తిప్పాలని ఆర్టీసీ నిర్ణయించింది. రూట్ అప్‌గ్రెడేషన్‌లో భాగంగా ఈ మార్పు జరగనుంది. ఈ నేపథ్యంలో సుమారు ఆరు వందల కొత్త సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేస్తోంది. ఇవి డిసెంబర్ నుంచి దశలవారీగా ఆర్టీసీకి చేరనున్నాయి. ఆర్టీసీకి ఎక్కువ ఆదాయాన్ని తెచ్చిపెడుతున్న సర్వీసుల్లో ఎక్స్‌ప్రెస్‌లు ముఖ్యమైనవి. ఇవి పట్టణాల మధ్య తిరుగుతున్నాయి. కొన్ని రూట్లలో వీటి ఆక్యుపెన్సీ రేషియో 80 శాతం వరకు ఉంటోంది.
చదవండి: తెలంగాణ కేసీఆర్- యూపీ ఆదిత్యనాథ్: ఎవరి మోడల్ బెటర్?
ఇలాంటి సర్వీసుల ద్వారా టికెట్ రూపంలో ఆర్టీసీ భారీగా ఆదాయాన్ని సమకూర్చుకుంటోంది. ఇలాంటివి దాదాపు 150 రూట్లు ఉన్నట్టు గుర్తించింది. ఆదాయాన్ని పెంచుకునే దిశలో ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటున్న ఆర్టీసీ దృష్టి వీటిపై పడింది. ప్రయాణికుల డిమాండ్ విపరీతంగా ఉన్న ఈ రూట్లలో ఎక్స్‌ప్రెస్ బస్సుల స్థానంలో సూపర్ లగ్జరీ బస్సులను ప్రవేశపెడితే టికెట్ ఆదాయం భారీగా పెరుగుతుందని అంచనా వేస్తోంది. ఎక్స్‌ప్రెస్ టికెట్ ధర కంటే సూపర్ లగ్జరీ కేటగిరీ టికెట్ ధర చాలా ఎక్కువ. రద్దీ మార్గాలైనందున సూపర్ లగ్జరీ బస్సులు కూడా ఎక్కువ ఆక్యుపెన్సీ రేషియోతోనే నడుస్తాయని ఆర్టీసీ తేల్చింది. ప్రయోగాత్మకంగా నడిపిన బస్సులతో ఇవి రూడీ కావటంతో, అలాంటి మార్గాల్లో బస్సు కేటగిరీని అప్‌గ్రేడ్ చేయాలని నిర్ణయించింది.
ప్రయాణం హాయి.. జేబుకు భారం
ఎక్స్‌ప్రెస్ బస్సులతో పోలిస్తే సూపర్ లగ్జరీ బస్సుల్లో ప్రయాణం సుఖవంతంగా ఉంటుంది. బస్సు నిర్మాణంలో పుష్‌బ్యాక్ సీట్లు, కనిష్టస్థాయి కుదుపులకు ఆస్కారం ఉండటం వల్ల ప్రయాణం హాయిగా సాగుతుంది. ఈ రూపంలో ఆర్టీసీ నిర్ణయం ప్రయాణికులకు మేలు చేసినా, టికెట్‌చార్జీ ఎక్కువ కావటంతో ఆర్థికభారం పెరుగుతుంది. మెరుగైన ప్రయాణ వసతి కల్పిస్తున్నామనే పేరుతో ఆర్టీసీ ఈ నిర్ణయాన్ని ప్రకటించనుంది.
ఫలితంగా ఆదాయాన్ని ఆమాంతం పెంచుకోబోతోంది. వీటికి దాదాపు కొత్త బస్సులనే వినియోగించనుంది. మరోవైపు కొన్ని పాత సూపర్ లగ్జరీ బస్సులను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తోంది. గరిష్ట పరిమితి మేర తిరిగిన వాటిని బాడీ మార్చి ఎక్స్‌ప్రెస్ బాడీలు కట్టించి ఎక్స్‌ప్రెస్‌లుగా తిప్పనుంది. అలా ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన పాత సూపర్ లగ్జరీ బస్సుల స్థానంలో కొత్త సూపర్ లగ్జరీ బస్సులను వినియోగించనుంది.
Comments
Please login to add a commentAdd a comment