బస్సు లోపలి భాగం
సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ 2015 తర్వాత పెద్దఎత్తున కొత్త బస్సులను కొనుగోలు చేస్తోంది. మొత్తం వెయ్యి బస్సులను కొనేందుకు ఇటీవలే టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. అశోక్ లేలాండ్ కంపెనీ సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సుల టెండర్లు దక్కించుకుంది. బస్సుల తయారీ పూర్తి కావస్తుండటంతో దశలవారీగా వాటిని ఆర్టీసీకి సరఫరా చేస్తోంది. ఇందులో భాగంగా ఆదివారం నాలుగు సూపర్ లగ్జరీబస్సులు ఆర్టీసీకి చేరాయి. మొత్తం 630 సూపర్ లగ్జరీ బస్సులను ఆర్టీసీకి సరఫరా చేయబోతోంది.
తొలిసారి కంపెనీలోనే బస్సు తయారీ
గరుడ లాంటి ఏసీ కేటగిరీ బస్సులు మినహా మిగతావాటికి సంబంధించిన చాసీస్‌ను మాత్రమే ఆర్టీసీ కొనుగోలు చేస్తుంది. ఆర్టీసీకి ముందు నుంచి సొంతంగా బస్‌బాడీ యూనిట్ ఉండటమే దీనికి కారణం. దాదాపు 250 మంది సిబ్బందితో మియాపూర్‌లో ఆర్టీసీకి పెద్ద బస్‌బాడీ బిల్డింగ్ యూనిట్ ఉంది. చాసీస్‌లను కొనుగోలు చేసి ఇందులో బాడీలను సొంతంగా కట్టించుకునేది.
కానీ, ఆర్థిక ఇబ్బందులతో బస్‌బాడీ నిర్వహణను భారంగా భావించి దాన్ని క్రమంగా పక్కనపెట్టేస్తూ వచ్చింది. దీంతో గతంలోనే సూపర్ లగ్జరీ బస్సులను కొన్నప్పుడు, కంపెనీ నుంచి చాసీస్ కొని ప్రైవేటు సంస్థతో బాడీ కట్టించింది. కానీ, ఈసారి బాడీతో కలిపే బస్సులు కొనాలని నిర్ణయించి ఆ మేరకే టెండర్లు పిలిచింది. ఫలితంగా ఆదివారం సరఫరా అయిన 4 బస్సులు పూర్తి బాడీతో అశోక్ లేలాండ్ కంపెనీ నుంచి ఆర్టీసీకి చేరాయి.
బాడీలకు కొత్త లుక్
ఇప్పుడు అశోక్‌లేలాండ్ తయారీ చేసిన బస్సుల బాడీలు కొత్త లుక్ సంతరించుకున్నాయి. ముందుభాగం ఓల్వో బస్సును పోలినట్టుగా ఉంది. గతంలో కొన్న సూపర్ లగ్జరీ బస్సులు ఇప్పుడు గులాబీ రంగుతో రోడ్డుపై తిరుగుతున్నాయి. ఈ కొత్త బస్సులు తెలుపు రంగుపై నీలం, క్రీమ్ రంగు స్ట్రైప్‌లతో కనిపిస్తున్నాయి. ముందుభాగంలో తెలుపు, క్రీమ్ కలర్ స్ట్రైప్స్ ఏర్పాటు చేశారు. లైట్లు ఉన్న భాగాన్ని నలుపు రంగులో ఉంచారు.
సామగ్రి పెట్టేందుకు గతంతో పోలిస్తే చాలా విశాలమైన స్థలాన్ని కేటాయించారు. ప్రస్తుతం నడుస్తున్న సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 450 బస్సులు దాదాపు ఆరు లక్షల కి.మీ. మేర తిరిగాయి. దీంతో వాటిల్లో కొన్నింటిని ఆర్డినరీ బస్సులుగా, కొన్నింటిని పల్లెవెలుగు సర్వీసులుగా అధికారులు మార్చనున్నారు. ఆ 450 బస్సుల స్థానంలో కొత్త సూపర్‌లగ్జరీ బస్సులను ప్రవేశపెట్టనున్నారు.
మంచి లాభాలతో తిరుగుతున్న ఎక్స్‌ప్రెస్ రూట్లను అప్‌గ్రేడ్ చేసి దాదాపు 150 సూపర్ లగ్జరీ బస్సులను ప్రారంభించబోతున్నారు. ప్రస్తుతం ఉన్న 130 డీలక్స్ బస్సులన్నీ 12 లక్షల కి.మీ.కుపైగా తిరిగి ఉన్నందున వీటిని తుక్కుగా మార్చాలని నిర్ణయించారు. వాటి స్థానంలో కొత్త డీలక్స్ బస్సులు రానున్నాయి. 370 ఇతర కేటగిరీ బస్సుల్లో అన్ని డీలక్స్ బస్సులనే తీసుకోవాలా, కొన్ని ఎక్స్‌ప్రెస్ బస్సులు తీసుకోవాలా అన్న విషయంలో ఇంకా స్పష్టత రాలేదు. తొలుత 130 డీలక్స్ బస్సులను సరఫరా చేయాలని అశోక్ లేలాండ్ కంపెనీకి ఆర్డర్ ఇచ్చారు. తెలంగాణ ఆర్టీసీ ఏర్పడ్డాక తొలిసారి స్లీపర్ బస్సులను ఆర్టీసీ ప్రవేశపెట్టబోతోంది. ఇప్పటికే 16 కొత్త బస్సులకు టెండర్లు పిలిచింది. త్వరలో అవి ఆర్టీసీకి అందనున్నాయి. వాటిని దూరప్రాంత నగరాలు, పట్టణాలకు తిప్పనుంది.
Comments
Please login to add a commentAdd a comment