సాక్షి, హైదరాబాద్: విజయదశమి కానుకగా ప్రయాణికుల ముందుకు ఆర్టీసీ కొత్త బస్సులు తీసుకురానుంది. 1,016 కొత్త బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది. మూడు రకాల కేటగిరీలకు సంబంధించి రెండింటికి అశోక్ లేల్యాండ్, మరో రకానికి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేశాయి. ఆ ధరలను మరికాస్త తగ్గించేందుకు ఆర్టీసీ ఉన్నతాధికారులు సోమవారం ఆయా సంస్థల ప్రతినిధులతో బేరం కోసం భేటీ కానున్నారు. కనీసం ఒక్కో బస్సుపై రూ. లక్ష చొప్పున తగ్గించేలా ఒప్పిం చాలని ఆర్టీసీ యత్నిస్తోంది. ఈ బస్సులను ఆయా కంపెనీలు దసరా నాటికి ఆర్టీసీకి అందించనున్నాయి.
తొలిసారి స్లీపర్ బస్సులు..
తెలంగాణ ఆర్టీసీ తొలిసారి స్లీపర్ బస్సులు కొనుగోలు చేస్తోంది. ప్రస్తుతం ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు 90 శాతం స్లీపర్ బస్సులే నడుపుతుండటంతో వాటికి ప్రయాణికుల ఆదరణ మెరుగ్గా ఉంది. ప్రైవేటు ట్రావెల్స్ పోటీని తట్టుకోవాలంటే స్లీపర్ బస్సులు సమకూర్చుకోవాలని ఆర్టీసీ ఇటీవల నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా 16 స్లీపర్ బస్సులు కొనేందుకు టెండర్లు పిలిచింది.
30 బెర్తులతో కూడిన ఒక్కో ఏసీ బస్సుకు రూ. 50 లక్షల వరకు అశోక్ లేల్యాండ్ కోట్ చేసి ఎల్1గా నిలిచింది. సోమవారం జరిగే చర్చల తర్వాత కొనుగోలు ఆర్డర్ ఇవ్వనుంది. ప్రస్తుతం ఆర్టీసీకి సొంత బస్సులు 6,200 వరకు ఉండగా వీటిలో దాదాపు వెయ్యి బస్సులు కాలంచెల్లి తుక్కుగా మారేందుకు సిద్ధంగా ఉన్నాయి. దీంతో తగినన్ని బస్సులు లేక చాలా ప్రాంతా లకు ప్రజారవాణా దూరమైంది. ఆ సంఖ్య మరింత తగ్గకుండా ఇప్పుడు 1,016 బస్సులు అందుబాటులోకి రానున్నాయి. వాటి తర్వాత హైదరాబాద్ సిటీ రీజియన్ కోసం 300 ఎలక్ట్రిక్ బస్సులు రాబోతున్నాయి.
రూ. 340 కోట్ల ఖర్చుతో..
గతంలో ఇంజన్ ఛాసిస్‌లను మాత్రమే ఆర్టీసీ వివిధ కంపెనీల నుంచి కొనుగోలు చేసి బాడీలను మాత్రం సొంతంగా ఏర్పాటు చేసుకొనేది. ప్రస్తుతం ఆర్టీసీ బస్ బాడీ బిల్డింగ్ యూనిట్ బలహీనపడినందున బాడీలతో కలిపే బస్సులు కొనే యోచనలో ఉంది. ఇందుకోసం టెండర్లలో ఛాసిస్‌లు, బాడీతో కలుపుకొని అనే రెండు రకాల ధరలను ఆహ్వానించింది. ధరల తగ్గింపుపై కంపెనీలతో చర్చల తర్వాత ఏది కొనాలనే విషయమై నిర్ణయం తీసుకోనుంది. బస్సుల కొనుగోలుకు సుమారు రూ. 340 కోట్లు ఖర్చయ్యే అవకాశం ఉంది.
సూపర్ లగ్జరీ బస్సులే ఎక్కువ..
ఆర్టీసీ కొననున్న బస్సుల్లో 630 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. ఈ కేటగిరీలో అశోక్ లేల్యాండ్ కంపెనీ తక్కువ కోట్ చేసింది. ఛాసిస్ అయితే ఒక్కో బస్సు ధరను రూ. 20 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 35 లక్షల వరకు కోట్ చేసింది. ఈ బస్సు 12 మీటర్ల పొడవు ఉండనుంది. ఇక 370 ఎక్స్‌ప్రెస్ బస్సులకు సంబంధించి టాటా కంపెనీ తక్కువ మొత్తాన్ని కోట్ చేసింది.
11 మీటర్ల పొడవుండే ఈ బస్సులకు ఒక్కో దానికి ఛాసిస్ అయితే రూ. 15 లక్షల వరకు, బాడీతో కలుపుకొంటే రూ. 25 లక్షల వరకు కోట్ చేసినట్లు తెలిసింది. ఈ బస్సులకు సంబంధించి ఛాసిస్‌లే కొనుగోలు చేసి బాడీని విడిగా తయారు చేయించుకోవాలని ఆర్టీసీ భావిస్తోంది. సూపర్ లగ్జరీ వరకు బాడీతో కలుపుకొనే కొంటే బాగుంటుందనే యోచనలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment