సాక్షి, హైదరాబాద్ : ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు టికెట్ ధర రూ.10 చొప్పున పెరిగింది. శుక్రవారం అర్ధరాత్రి దాటిన తర్వాత శనివారం (ఆగస్టు 12) తొలి సరీ్వసు నుంచి ఇది అమల్లోకి వస్తోంది. ఇంతకాలం ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు మంచినీటి సీసాలు అందించే పద్ధతిని ఇప్పుడు సూపర్ లగ్జరీ బస్సుల్లో కూడా ప్రవేశపెడుతున్నారు. ప్రతి ప్రయాణికుడికి అరలీటరు మంచినీటి సీసాను అందించనున్నారు.
ఈ నేపథ్యంలోనే ప్రతి టికెట్ ధరపై రూ.10 చొప్పున అదనంగా వసూలు చేయనున్నారు. దూరంతో ప్రమేయం లేకుండా ఈ అదనపు మొత్తం చార్జి చేస్తారు. టికెట్ ధరలోనే దాన్ని కలిపేస్తారు. దీంతో ప్రయాణికుడికి మంచినీటి సీసా అవసరం ఉన్నా లేకున్నా ఈ అదనపు చార్జీతో కూడిన టికెట్ తీసుకోవాల్సిందే. నిత్యం లక్ష మంది ప్రయాణికులపై ఈ తాజా నిర్ణయం ప్రభావం చూపనుంది.
టికెట్‌తో పాటే జీవా బాటిల్..
దూర ప్రాంతాలకు ప్రయాణం చేసేవారు సాధారణంగా వాటర్ బాటిళ్లు దగ్గర పెట్టుకుంటారు. చాలామంది బస్టాండ్లలో కొంటారు. బయటి నీటిని తాగేందుకు ఇష్టపడని వారు ఇంటి నుంచి తెచ్చుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకుని గరుడ ప్లస్, గరుడ, లహరి, రాజధాని ఏసీ బస్సుల్లో ప్రయాణికులకు అరలీటరు పరిమాణంలో ఉన్న నీటి సీసాలను అందించడం ప్రారంభించారు.
గతంలో బిస్లరీ సంస్థతో చేసుకున్న ఒప్పందం మేరకు ఆ బ్రాండు మంచినీళ్లు అందించేవారు. ఇటీవల జీవా పేరుతో ఆర్టీసీ సొంతంగా ప్యాకేజ్డ్ మంచినీటిని మార్కెట్‌లోకి తెచ్చింది. ఆర్టీసీ బస్టాండ్లలో ఈ నీటిని విక్రయిస్తున్నారు. ఏసీ బస్సుల్లో కూడా గతంలో ఇచ్చిన బిస్లరీ బాటిళ్లకు బదులు జీవా నీటినే ఇస్తున్నారు. ఇప్పుడు అదే నీటిని సూపర్ లగ్జరీ బస్సుల్లోనూ పంపిణీ చేయాలని నిర్ణయించారు.
ఆర్టీసీకి ఏం లాభం?
జీవా నీటికి ఇంకా ఆదరణ పెరగలేదు. దీన్ని మార్కెట్‌లోకి తెచ్చిన సమయంలో సీసా, అందులోని నీటి నాణ్యత విషయంలో ఫిర్యాదులొచ్చాయి. స్వయంగా సొంత సిబ్బందే నాణ్యతపై ప్రశ్నించటంతో, ఒప్పందం చేసుకున్న సంస్థను నాణ్యత విషయంలో సంస్థ హెచ్చరించింది. ఈ క్రమంలో కొంతకాలం నిలిపేసి దిద్దుబాటు తర్వాత ఇటీవలే మళ్లీ విడుదల చేశారు. అయితే ఇప్పటికీ అది ప్రయాణికులకు పూర్తిస్థాయిలో పరిచయం కాలేదు.
ఈ నేపథ్యంలోనే జీవా బ్రాండ్‌కు ప్రాచుర్యం కల్పించడమే లక్ష్యంగా ఆర్టీసీ తాజా నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. మరోవైపు దీని ద్వారా కొంత అదనపు ఆదాయం కూడా లభిస్తుందనేది ఆర్టీసీ ఆలోచనగా చెబుతున్నారు. ప్రతి అరలీటరు సీసాపై రూ.5.50 చొప్పున, దాన్ని తయారు చేస్తున్న ప్రైవేటు సంస్థకు చెల్లిస్తారు.
డ్రైవర్‌కు ఇన్సెంటివ్‌గా 50 పైసలు చెల్లిస్తుంది. మిగతా రూ.4ను తన ఆదాయంగా ఆర్టీసీ లెక్కలు వేస్తోంది. ప్రస్తుతం ఆర్టీసీలో దాదాపు 700 సూపర్ లగ్జరీ బస్సులున్నాయి. వీటిల్లో నిత్యం దాదాపు లక్ష మంది ప్రయాణిస్తున్నారు. ఈ లెక్కన వారిపై రోజుకు రూ.10 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment