శబరిమల, పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
Published Mon, Oct 3 2016 10:11 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
రాజమహేంద్రవరం సిటీ:
శబరిమల, పంచారామాలు, విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు డిప్యూటీ ఛీప్ ట్రాఫిక్ మేనేజర్ ఆర్‌వీఎస్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవానీభక్తుల కోసం విజయవాడ, కార్తీకమాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు, అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. 2015లో శబరిమలకు 22 బస్సులు నడిపామని, ఈ ఏడాది 31 బస్సులు నడుపుతామన్నారు. అలాగే పంచారామాలకు గత ఏడాది 140 బస్సులు,దసరా సందర్బంగా విజయవాడకు జిల్లాలోని అన్నిడిపోల నుండి గత ఏడాది 801 బస్సులు నడిపామని, ఈ ఏడాది 840 బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భక్తులు వారి నివాసప్రాంతాల నుంచి బస్సులు కావాల్సివస్తే జిల్లాలోని 9 డిపోలలో సంప్రదించవచ్చన్నారు. అయ్యప్పS భక్తుల సౌకర్యార్థం శబరిమలకు 4,5,7,8,10 రోజుల టూర్ కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. శబరిమలకు నాలుగు రోజులకు సూపర్ లగ్జరీ బస్‌లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. వాటిలో మనిషికి రూ.3,500 ఛార్జి వసూలు చేస్తామన్నారు. ఈ టూర్ విజయవాడ, తడ బైపాస్,తేనేగాటి, శబరిమల తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. 5రోజుల టూర్‌కు సూపర్ లగ్జరీ బస్సులో రూ.3,800 ఛార్జీ ఉంటుందన్నారు. ఈ టూర్‌లో కాణిపాకం, ఎరుమేలి, శబరిమల, తిరుపతి, విజయవాడ ఉంటుందన్నారు. అదేవిధంగా పంచారామాలను ఒకరోజులో దర్శించే విధంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈనెల 29,30, నవంబర్ 5, 6, 12, 13, 19, 20, 26, 27 తేదీల్లో బస్సులు నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ బస్సుల వివరాల కోసం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోలలో సంప్రదించవచ్చన్నారు. డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ విజయకుమార్, డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, అసిస్టెంట్ మేనేజర్ కుమార్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement