Special Busses
-
సంక్రాంతికి 4,233 ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతికి టీఎస్ఆర్టీసీ 4,233 ప్రత్యేక బస్సులను నడుపుతోందని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ వెల్లడించారు. జేబీఎస్ నుంచి 1184, ఎల్బీనగర్ నుంచి 1133, అరాంఘర్ నుంచి 814, ఉప్పల్ నుంచి 683, కేపీహెచ్‌బీ/బీహెచ్ఈఎల్ నుంచి 419 ప్రత్యేక బస్సులను నడుపుతున్నామని తెలిపారు. పండగ రద్దీ దష్ట్యా నడిపే ప్రత్యేక బస్సుల్లో సాధారణ చార్జీలే ఉంటాయని, స్పెషల్ చార్జీ ఉండదని ఆయన స్పష్టం చేశారు. ఈ నెల 10 నుంచి 14 వరకు ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండే అవకాశం ఉన్నందున ఆయా రోజుల్లో పోలీస్, రవాణా శాఖ అధికారులు ఆర్టీసీకి సహకరించాలని కోరారు. సొంత వాహనాల్లో ఇతర ప్రయాణికులను తరలించే వారిపై నిఘా పెట్టాలని సూచించారు. అలాంటి వారిపై చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. బస్ భవన్లో పోలీసు, రవాణా శాఖ అధికారులతో శుక్రవారం సజ్జనార్ సమన్వయ సమావేశం నిర్వహించారు. సంక్రాంతి ప్రత్యేక బస్సులు, రద్దీ ప్రాంతాల్లో తీసుకోవాల్సిన చర్యల గురించి టీఎస్ఆర్టీసీ అధికారులు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. నిజామాబాద్, కరీంనగర్, మెదక్ వెళ్లే బస్సులు జేబీఎస్ నుంచి, ఖమ్మం, నల్లగొండ, విజయవాడ వైపు వెళ్లే బస్సులు ఎల్బీనగర్ నుంచి, మహబూబ్‌నగర్, కర్నూలు వైపు వెళ్లే బస్సులు అరాంఘర్ నుంచి, వరంగల్, హనుమకొండ, తొర్రూర్ వైపు వెళ్లే బస్సులు ఉప్పల్ నుంచి, సత్తుపల్లి, భద్రాచలం, విజయవాడ వైపు వెళ్లే బస్సులు కేపీహెచ్‌బీ/బీహెచ్ఈఎల్ నుంచి బయలుదేరుతాయని పేర్కొన్నారు. 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ ఈ సంక్రాంతికి 585 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సదుపాయం కల్పించామని సజ్జనార్ తెలిపారు. www.tsrtconline.in వెబ్సైట్లోకి వెళ్లి ముందస్తు రిజర్వేష¯Œన్ చేసుకోవాలని కోరారు. పండగకు సొంతూళ్లకు వెళ్లే జనం ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించటం ద్వారా భద్రంగా గమ్యం చేరేందుకు వీలుంటుందన్నారు. రోడ్లపై రద్దీ అధికంగా ఉండే సమయం అయినందున, ప్రైవేటు వాహనాల్లో ప్రయాణం సురక్షితం కాదన్నారు. ఈ విషయాన్ని అధికారులు, సిబ్బంది ప్రజలకు తెలపాలని కోరారు. సమావేశానికి హాజరైన హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ ట్రాఫిక్ డీసీపీలు ప్రకాశ్‌రెడ్డి, కరుణాకర్, టి.శ్రీనివాస రావు, డి.శ్రీనివాస్‌లతో పాటు రవాణా శాఖ రంగారెడ్డి డీటీసీ ప్రవీణ్ రావు, ఆర్టీవోలు శ్రీనివాస్‌రెడ్డి, రామచందర్‌లను ఆయన సన్మానించారు. -
సంక్రాంతికి 6,970 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 6,970 ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు వీటిని నడుపుతామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 నుంచి 14 వరకు 3,755 సర్వీసులు, 15 నుంచి 18 వరకు మరో 3,215 సర్వీసులను నడుపుతామన్నారు. గతేడాది కంటే 35శాతం అదనపు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ద్వారకా తిరుమలరావు సూచించారు. ప్రత్యేక సర్వీసు బస్సులన్నీ ఓ వైపు ఖాళీగా వెళ్లి మరోవైపునుంచి ప్రయాణికులతో వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాబట్టి ప్రత్యేక సర్వీసు బస్సులకే ఒకటిన్నర రెట్లు అధిక చార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని చెప్పారు. సాధారణ సర్వీసు బస్సులలో సాధారణ చార్జీలే వసూలు చేస్తామన్నారు. ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ 0866–2570005ను అందుబాటులో ఉంచామని చెప్పారు. -
మేడారం మహా జాతర.. భక్తులకు టీఎస్ ఆర్టీసీ తీపికబురు
సాక్షి, వరంగల్: సమ్మక్క , సారలమ్మ మేడారం మహా జాతర - 2022 దేవతల దర్శనార్థం వెళ్లే భక్తుల సౌకర్యార్థం బస్సు సౌకర్యం కల్పించినట్లు ఆర్టీసీ వరంగల్ -2 డిపో మేనేజర్ బి.మహేష్ కుమార్ తెలిపారు. 2022 సంవత్సరం ఫిబ్రవరి 16 నుంచి 18 వరకు మహ జాతర జరుగనుందని, జాతర సమయం లో భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే నేపథ్యంలో కొంత మంది భక్తులు ముందుగానే దర్శనానికి వెళ్లి వస్తుంటారని వారి కోసం ఈ నెల 5 నుంచి ప్రతీ రోజు మేడారానికి బస్సు నడుపనున్నట్లు మహేష్ కుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. భక్తుల రద్దీని బట్టి అదనంగా బస్సులు నడుపుతామని ఆర్టీసీ అధికారులు తెలిపారు. ప్రతి రోజు.. హన్మకొండ జిల్లా బస్ స్టేషన్ నుంచి ఉదయం 7 గంటలకు, 8 గంటలకు, మధ్యాహ్నం 01.15 , 02.15 గంటలకు బస్సు బయలు దేరుతుందన్నారు. మేడారం నుంచి హనుమకొండకు ఉదయం 10 గంటలకు, 11 గంటలకు, మధ్యాహ్నం 02.30 గంటలకు, 03.30 గంటలకు బయలు దేరుతుందని వివరించారు. ములుగు నుంచి మేడారానికి ఉదయం 08.15 , 09.15 , మధ్యాహ్నం 2.30, 3.30 గంటలకు, మేడారం నుంచి ములుగుకు ఉదయం 10, 11 గంటలకు , సాయంత్రం 04.15, 05.15 గంటలకు బస్సు బయలుదేరుతుందని తెలిపారు. హనుమకొండ నుంచి మేడారానికి పెద్దలకు చార్జీ రూ .120 , పిల్లలకు రూ. 60 గా ఉంటుదని తెలిపారు. ములుగు నుంచి మేడారానికి పెద్దలకు రూ. 65, పిల్లలకు రూ. 35 గా నిర్ణయించినట్లు వివరించారు. భక్తులు ఈ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు . -
హైదరాబాద్: దసరాకు ప్రత్యేక బస్సులు
-
సంక్రాంతి స్పెషల్ @ 4940
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా నగరం నుంచి వివిధ ప్రాంతాలకు తెలంగాణ ఆర్టీసీ ప్రత్యేకంగా 4,940 బస్సులను నడపాలని నిర్ణయించింది. జనవరి 10 నుంచి 13 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. తెలంగాణ పరిధిలో 3,414 బస్సులు, ఆంధ్రప్రదేశ్ పరిధిలోని ప్రాంతాలకు 1,526 బస్సులు ప్రత్యేక సర్వీసులుగా తిరగనున్నాయి. రోజువారి నడిచే రెగ్యులర్ సర్వీసులకు ఇవి అదనం. మహాత్మాగాంధీ బస్‌స్టేషన్, సీబీఎస్, జూబ్లీబస్ స్టేషన్, దిల్సుఖ్నగర్, లింగంపల్లి, చందానగర్, కేపీహెచ్‌బీ, ఎస్ఆర్నగర్, అమీర్‌పేట, టెలీఫోన్ భవన్, ఈసీఐఎల్, ఉప్పల్ క్రాస్ రోడ్డు, ఎల్‌బీనగర్‌లతోపాటు నగరంలోని కొన్ని ముఖ్యమైన కాలనీల నుంచి ఈ సర్వీసులు బయల్దేరనున్నాయి. తెలంగాణలోని అన్ని జిల్లా కేంద్రాలతోపాటు, ముఖ్యమైన పట్టణాలు, ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, విజయనగరం, తెనాలి, గుంటూరు, గుడివాడ, రాజమండ్రి, కాకినాడ, రాజోలు, పోలవరం, మచిలీపట్నం, ఏలూరు, తాడేపల్లిగూడెం, తణుకు, విశాఖపట్నం, శ్రీకాకుళం, భీమవరం, నర్సాపురం, కర్నూలు, అనంతపురం, కడప, చిత్తూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, ఉదయగిరి, కనిగిరి, కందుకూరు, పొదిలి తదితర ప్రాంతాలకు ఈ ప్రత్యేక బస్సులు తిరుగుతాయి. పదో తేదీన 965 బస్సులు, 11న 1,463, 12న 1,181 బస్సులు 13న మిగతావి నడుపుతారు. ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఈ అదనపు బస్సులకు అడ్వాన్స్ రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఎక్కడ్నుంచి ఎక్కడకు.. సీబీఎస్: కర్నూలు, తిరుపతి, మాచర్ల, ఒంగోలు, నెల్లూరు, అనంతపురం, గుత్తి, మదనపల్లి తదితర ప్రాంతాల వైపు వెళ్లేందుకు ఏర్పాటు. ఎంజీబీఎస్: ప్లాట్‌ఫామ్ 1–5: గరుడప్లస్, గరుడ, అంతర్రాష్ట్ర షెడ్యూల్ బస్సులు. 6–7: బెంగళూరు వైపు, 10–13: ఖమ్మం వైపు, 14–15:దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్కు ప్రతి 10 నిమిషాలకో సిటీ బస్సు. 18–19: ఉప్పల్ క్రాస్‌రోడ్డుకు ప్రతి 10 ని.కు సిటీ బస్సు. 23–25: శ్రీశైలం, కల్వకుర్తి వైపు, 26–31: రాయచూర్, మహబూబ్‌నగర్ వైపు, 32–34 నాగర్‌కర్నూలు, షాద్‌నగర్ వైపు, 35–36, 39: విజయవాడ, విజయనగరం, విశాఖపట్నం, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, గుంటూరు వైపు, 37–38, 40: ఏపీ బస్సులు. రూ.6 కోట్ల ఆదాయం లక్ష్యం గత సంక్రాంతి సమయంలో 4,600 బస్సులు తిప్పగా దాదాపు రూ.5 కోట్ల ఆదాయం సమకూరింది. ఈసారి ఛార్జీల పెంపు, బస్సుల సంఖ్య ఎక్కువ కావటంతో దాదాపు రూ.6 కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. సాధారణంగా ఇలాంటి ప్రత్యేక సర్వీసులకు 50% అదనపు రుసుము వసూలు చేసుకునే వెసులుబాటు ఉంది. ఈసారి అంతర్రాష్ట్ర సర్వీసులకు అంతమేర వసూలు చేస్తూ, రాష్ట్రం పరిధిలో తిరిగే వాటి విషయంలో రీజినల్ మేనేజర్లకు స్వేచ్ఛనిచ్చారు. ఇటీవలే చార్జీలు పెంచినందున, 50 అదనపు మొత్తం వసూలు చేస్తే ప్రయాణికుల నుంచి వ్యతిరేకత వస్తుందని అధికారులు భావిస్తున్నారు. పరిస్థితిని బట్టి స్థానిక ఆర్ఎంలు అదనపు చార్జీల విషయంలో నిర్ణయం తీసుకోనున్నారు. ఈమేరకు ఈడీ ఆపరేషన్స్ యాదగిరి గురువారం సీటీఎం మునిశేఖర్, రీజినల్ మేనేజర్లతో భేటీ అయి ఈ అదనపు సర్వీసుల గురించి చర్చించారు. ఆర్టీసీ సిబ్బందికి మొబైల్ టాయిలెట్లు సాక్షి, హైదరాబాద్: ఆర్టీసీ సిబ్బంది కోసం ఆ సంస్థ సంచార బయోటాయిలెట్లను ఏర్పాటు చేయనుంది. కండీషన్ తప్పిన బస్సులను బయోటాయిలెట్లుగా రూపొందించారు. సిబ్బంది డ్రెస్ మార్చుకోవటం, విశ్రాంతిగా కూర్చోవటం, మూత్రశాల, మరుగు దొడ్డి వినియోగం.. వంటి అవసరాలకు ఆర్టీసీ ప్రత్యేకంగా వీటిని రూపొందించింది. స్థలాభావం ఉన్న చోట నిర్మాణాలు చేపట్టే అవకాశం లేకపోవటంతో, పాత బస్సులనే చేంజ్ ఓవర్ గదులుగా మార్చేశారు. ప్రస్తుతానికి 9 పాయింట్ల వద్ద వీటిని ఉంచనున్నారు. పురుషులు, మహిళలకు వేర్వేరుగా టాయిలెట్లు ఉన్నాయి. ఉదయం షిఫ్ట్ సమయానికి వాహనాలు అక్కడికి వచ్చి సెకండ్ ఫిఫ్ట్ పూర్తయ్యే వరకు ఉండి.. తర్వాత డిపోకి వెళ్లిపోతాయి. -
ఆర్టీసీ స్పెషల్ బాదుడు!
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్ ఆర్టీసీ మహాశివరాత్రి వేడుకలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. నాలుగు రోజుల్లో రూ.3.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేందుకు జిల్లాలోని 13 శైశక్షేత్రాలకు బస్సులను నడిపేందుకు రంగం సిద్ధంచేసింది. నేటి నుంచి 14వ తేదీ వరకు 393 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల టిక్కెట్‌పై 50 శాతం అధికంగా వసూలు చేయనున్నారు. కర్నూలు నుంచి ప్రతి పది నిమిషాలకు శ్రీశైలానికి బస్సు.. ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైల మహాక్షేత్రం ప్రధానమైంది. మహాశిరాత్రి రోజుల్లో మల్లికార్జునుడు, భ్రమరాంబదేవిలను దర్శించుకుంటే పుణ్యమొస్తుందనే నమ్మకంతో జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు ఇబ్బంది పడకుండా కర్నూలు నుంచి 106 స్పెషల్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అందులో ప్రతి పది నిమిషాలకు ఒక్క బస్సు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీశైలానికి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 6 న బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచే శ్రీగిరికి భక్తుల తాకిడి అధికం కానుండడంతో 11, 12, 13, 14 తేదీల్లో స్పెషల్ బస్సులను అధికంగా నడుపుతారు. శ్రీశైలంతోపాటు మరో 12 శైవక్షేత్రాలకు మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది. ఇతర రీజియన్ల నుంచి 200 బస్సుల రాక.. కర్నూలు–శ్రీశైలం రహదారి ఘాట్ కావడంతో ఫిట్నెస్ ఉన్న బస్సులనే నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఘాట్ ఎలిజిబుల్ ఫిట్నెస్ పాసైన కర్నూలు రీజియన్‌లోని 193 బస్సులకు ఎంపికచేశారు. మిగిలిన బస్సులను నెల్లూరు నుంచి 60, తిరుపతి నుంచి 40, అనంతపురం నుంచి 100 ఘాట్ ఎలిజిబుల్ ఉన్న వాటిని తెప్పించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక మార్గమధ్యలో బస్సులు మరమ్మతులకు గురైతే బాగు చేసేందుకు శ్రీశైలం, దోర్నాలలో వెహికల్ మెయింటెనెన్స్ క్యాంపులను ఏర్పాటు చేశారు. ఆర్టీసీకి కాసులుకురిపిస్తున్న శివరాత్రి రెండు, మూడేళ్ల నుంచి కూడా శివరాత్రి ఉత్సవాలు ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 2016లో 329 ప్రత్యేక బస్సులు 6.90లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.2.84 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక 2017లో 372 ప్రత్కేక బస్సులు 7.30 లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.311.16 కోట్ల ఆదాయం సమకూర్చాయి. ఈ యేడాది ఏకంగా రూ.3.50కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు. ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితం మహాశివరాత్రి ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం 393 ప్రత్యేక బస్సులను వివిధ శైవ క్షేత్రాలకు నడుపుతాం. అత్యధికంగా శ్రీశైలానికి ఎక్కువ బస్సులు వెళ్తాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచిస్తున్నాం. ప్రమాదాలకు గురికాకుండా సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులే మేలు. – పైడి చంద్రశేఖర్, ఆర్ఎం -
శబరిమల, పంచారామాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
రాజమహేంద్రవరం సిటీ: శబరిమల, పంచారామాలు, విజయవాడ కనకదుర్గ గుడికి వెళ్లే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడుపుతున్నట్టు డిప్యూటీ ఛీప్ ట్రాఫిక్ మేనేజర్ ఆర్వీఎస్ నాగేశ్వరరావు పేర్కొన్నారు. రాజమహేంద్రవరం రీజనల్ మేనేజర్ కార్యాలయంలో సోమవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భవానీభక్తుల కోసం విజయవాడ, కార్తీకమాసం సందర్భంగా పంచారామ క్షేత్రాలు, అయ్యప్ప భక్తుల కోసం శబరిమలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు అన్ని చర్యలు చేపట్టామన్నారు. 2015లో శబరిమలకు 22 బస్సులు నడిపామని, ఈ ఏడాది 31 బస్సులు నడుపుతామన్నారు. అలాగే పంచారామాలకు గత ఏడాది 140 బస్సులు,దసరా సందర్బంగా విజయవాడకు జిల్లాలోని అన్నిడిపోల నుండి గత ఏడాది 801 బస్సులు నడిపామని, ఈ ఏడాది 840 బస్సులు నడిపేందుకు సన్నాహాలు చేస్తున్నామన్నారు. భక్తులు వారి నివాసప్రాంతాల నుంచి బస్సులు కావాల్సివస్తే జిల్లాలోని 9 డిపోలలో సంప్రదించవచ్చన్నారు. అయ్యప్పS భక్తుల సౌకర్యార్థం శబరిమలకు 4,5,7,8,10 రోజుల టూర్ కోసం ప్రణాళిక సిద్ధం చేశామన్నారు. శబరిమలకు నాలుగు రోజులకు సూపర్ లగ్జరీ బస్‌లు ఏర్పాటు చేసినట్టు ఆయన తెలిపారు. వాటిలో మనిషికి రూ.3,500 ఛార్జి వసూలు చేస్తామన్నారు. ఈ టూర్ విజయవాడ, తడ బైపాస్,తేనేగాటి, శబరిమల తిరిగి రాజమహేంద్రవరం చేరుకుంటుందన్నారు. 5రోజుల టూర్‌కు సూపర్ లగ్జరీ బస్సులో రూ.3,800 ఛార్జీ ఉంటుందన్నారు. ఈ టూర్లో కాణిపాకం, ఎరుమేలి, శబరిమల, తిరుపతి, విజయవాడ ఉంటుందన్నారు. అదేవిధంగా పంచారామాలను ఒకరోజులో దర్శించే విధంగా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. కార్తీక మాసం సందర్భంగా ఈనెల 29,30, నవంబర్ 5, 6, 12, 13, 19, 20, 26, 27 తేదీల్లో బస్సులు నడుపుతున్నట్టు ఆయన తెలిపారు. ఈ బస్సుల వివరాల కోసం జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోలలో సంప్రదించవచ్చన్నారు. డిప్యూటీ చీఫ్ మెకానికల్ ఇంజనీర్ విజయకుమార్, డిపో మేనేజర్ టి.పెద్దిరాజు, అసిస్టెంట్ మేనేజర్ కుమార్ పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ పరీక్షకు స్పెషల్ బస్సులు
సాక్షి, హైదరాబాద్: కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదివారం నిర్వహించే రాత పరీక్షకు హాజరుకానున్న అభ్యర్థుల కోసం 1,000 ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ పురుషోత్తమ్ ఒక ప్రకటనలో తెలిపారు. సుమారు 5.36 లక్షల మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు నిర్వాహకుల నుంచి అందిన సమాచారం మేరకు ప్రత్యేక బస్సుల ఏర్పాటుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. -
శివరాత్రికి జంట నగరాల నుంచి ప్రత్యేక బస్సులు
హైదరాబాద్ : మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా హైదరాబాద్, సికింద్రాబాద్‌ల నుంచి శ్రీశైలం, ఏడుపాయల జాతరలకు ప్రత్యేక బస్సులు నడిపేందుకు గ్రేటర్ ఆర్టీసీ చర్యలు చేపట్టింది. ఈ నెల 6 వ తేదీ నుంచి 10వ తేదీ వరకు ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. శ్రీశైలం వెళ్లే భక్తుల సంఖ్యను దృష్టిలో ఉంచుకొని 274 బస్సులు, ఏడుపాయల జాతరకు 50 ప్రత్యేక బస్సులు నడిపేందుకు ప్రణాళికలను రూపొందించినట్లు ఆర్టీసీ సికింద్రాబాద్ రీజినల్ మేనేజర్ కొమురయ్య తెలిపారు. రద్దీకి అనుగుణంగా బస్సుల సంఖ్యను పెంచుతామన్నారు. నగరంలోని జూబ్లీ, ఎంజీబీఎస్, దిల్సుఖ్నగర్ బస్స్టేషన్లతో పాటు, ఈసీఐఎల్, సికింద్రాబాద్ బ్లూ సీ హోటల్ ఎదురుగా, ఆఫ్జల్‌గంజ్, ఘట్కేసర్, లోతుకుంట, ఉప్పల్, తార్నాక, తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంటాయన్నారు. -
సంక్రాంతికి ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ వద్ద నుంచి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఈడీ రవీందర్ తెలిపారు. వెన్నెల ఏసీ బస్సులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి జనవరి 10, 11 తేదీలలో కాకినాడ, నెల్లూరు, విజయవాడకు బయలుదేరతాయి. కాకినాడ బస్సు 10వ తేదీన సాయంత్రం ఆరు గంటలకు, విజయవాడ బస్సు రాత్రి 11 గంటలకు బయలు దేరుతుంది. నెల్లూరుకు 10, 11 తేదీల్లో సాయంత్రం ఆరు గంటలకు ఒక్కో బస్సు ఉంటుంది. తిరుగు ప్రయాణంలో.. కాకినాడ రైల్వేస్టేషన్ నుంచి 15వ తేదీన, నెల్లూరు, విజయవాడ రైల్వే స్టేషన్ల నుంచి 15, 16 తేదీల్లో సాయంత్రం ఆరు గంటలకు ఈ బస్సులు హైదరాబాద్‌కు బయలుదేరుతాయి. డిసెంబర్ 27న రాత్రి 9 గంటలకు ఒక వెన్నెల బస్సు విజయవాడ నుంచి శ్రీకాకుళం బయలుదేరుతుంది.