స్పెషల్ బస్సు
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఏపీఎస్ ఆర్టీసీ మహాశివరాత్రి వేడుకలను అందిపుచ్చుకోవడానికి ప్రణాళికలను సిద్ధం చేసింది. నాలుగు రోజుల్లో రూ.3.50 కోట్ల ఆదాయాన్ని ఆర్జించేందుకు జిల్లాలోని 13 శైశక్షేత్రాలకు బస్సులను నడిపేందుకు రంగం సిద్ధంచేసింది. నేటి నుంచి 14వ తేదీ వరకు 393 ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. ఈ స్పెషల్ బస్సుల్లో ప్రయాణికుల టిక్కెట్‌పై 50 శాతం అధికంగా వసూలు చేయనున్నారు.
కర్నూలు నుంచి ప్రతి పది నిమిషాలకు శ్రీశైలానికి బస్సు..
ద్వాదశ జ్యోతిర్లింగాల్లో శ్రీశైల మహాక్షేత్రం ప్రధానమైంది. మహాశిరాత్రి రోజుల్లో మల్లికార్జునుడు, భ్రమరాంబదేవిలను దర్శించుకుంటే పుణ్యమొస్తుందనే నమ్మకంతో జిల్లా నుంచే కాక రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు భారీగా వస్తారు. శ్రీశైలానికి వెళ్లే భక్తులు ఇబ్బంది పడకుండా కర్నూలు నుంచి 106 స్పెషల్ బస్సులను నడిపేందుకు ఆర్టీసీ రంగం సిద్ధం చేసింది. అందులో ప్రతి పది నిమిషాలకు ఒక్క బస్సు కర్నూలు ఆర్టీసీ బస్టాండ్ నుంచి శ్రీశైలానికి వెళ్లేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నెల 6 న బ్రహ్మోత్సవాలు ప్రారంభమైన నేటి నుంచే శ్రీగిరికి భక్తుల తాకిడి అధికం కానుండడంతో 11, 12, 13, 14 తేదీల్లో స్పెషల్ బస్సులను అధికంగా నడుపుతారు. శ్రీశైలంతోపాటు మరో 12 శైవక్షేత్రాలకు మహా శివరాత్రి వేడుకలను పురస్కరించుకొని ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంటోంది.
ఇతర రీజియన్ల నుంచి 200 బస్సుల రాక..
కర్నూలు–శ్రీశైలం రహదారి ఘాట్ కావడంతో ఫిట్‌నెస్ ఉన్న బస్సులనే నడిపేందుకు ఆర్టీసీ అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇందుకోసం ఘాట్ ఎలిజిబుల్ ఫిట్‌నెస్ పాసైన కర్నూలు రీజియన్‌లోని 193 బస్సులకు ఎంపికచేశారు. మిగిలిన బస్సులను నెల్లూరు నుంచి 60, తిరుపతి నుంచి 40, అనంతపురం నుంచి 100 ఘాట్ ఎలిజిబుల్ ఉన్న వాటిని తెప్పించుకునేందుకు చర్యలు తీసుకున్నారు. ఇక మార్గమధ్యలో బస్సులు మరమ్మతులకు గురైతే బాగు చేసేందుకు శ్రీశైలం, దోర్నాలలో వెహికల్ మెయింటెనెన్స్ క్యాంపులను ఏర్పాటు చేశారు.
ఆర్టీసీకి కాసులుకురిపిస్తున్న శివరాత్రి
రెండు, మూడేళ్ల నుంచి కూడా శివరాత్రి ఉత్సవాలు ఆర్టీసీకి కాసుల వర్షం కురిపిస్తున్నాయి. 2016లో 329 ప్రత్యేక బస్సులు 6.90లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.2.84 కోట్ల ఆదాయాన్ని తెచ్చిపెట్టాయి. ఇక 2017లో 372 ప్రత్కేక బస్సులు 7.30 లక్షల కిలోమీటర్లు తిరిగి రూ.311.16 కోట్ల ఆదాయం సమకూర్చాయి. ఈ యేడాది ఏకంగా రూ.3.50కోట్ల ఆదాయమే లక్ష్యంగా ఆర్టీసీ అధికారులు ప్రణాళికలు రూపొందించారు.
ప్రయాణం ఆర్టీసీ బస్సుల్లోనే సురక్షితం
మహాశివరాత్రి ఉత్సవాలకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులను నడిపేందుకు చర్యలు తీసుకుంది. మొత్తం 393 ప్రత్యేక బస్సులను వివిధ శైవ క్షేత్రాలకు నడుపుతాం. అత్యధికంగా శ్రీశైలానికి ఎక్కువ బస్సులు వెళ్తాయి. ఆర్టీసీ బస్సుల్లో వెళ్లే మల్లన్న స్వామి దర్శనం చేసుకోవాలని భక్తులకు సూచిస్తున్నాం. ప్రమాదాలకు గురికాకుండా సురక్షిత ప్రయాణం కోసం ఆర్టీసీ బస్సులే మేలు. – పైడి చంద్రశేఖర్, ఆర్‌ఎం
Comments
Please login to add a commentAdd a comment