సాక్షి, అమరావతి: సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 6,970 ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు వీటిని నడుపుతామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 నుంచి 14 వరకు 3,755 సర్వీసులు, 15 నుంచి 18 వరకు మరో 3,215 సర్వీసులను నడుపుతామన్నారు.
గతేడాది కంటే 35శాతం అదనపు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ద్వారకా తిరుమలరావు సూచించారు. ప్రత్యేక సర్వీసు బస్సులన్నీ ఓ వైపు ఖాళీగా వెళ్లి మరోవైపునుంచి ప్రయాణికులతో వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాబట్టి ప్రత్యేక సర్వీసు బస్సులకే ఒకటిన్నర రెట్లు అధిక చార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని చెప్పారు. సాధారణ సర్వీసు బస్సులలో సాధారణ చార్జీలే వసూలు చేస్తామన్నారు. ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ 0866–2570005ను అందుబాటులో ఉంచామని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment