Dwaraka tirumala rao
-
రెడ్ బుక్ కుట్రకు రెడ్ సిగ్నల్!
సాక్షి, అమరావతి: ‘మీకూ మీ రెడ్‌బుక్ రాజ్యాంగానికి ఓ దండం.. నిబంధనలకు విరుద్ధంగా పని చేయడం నా వల్ల కాదు.. అక్రమ కేసులు, వేధింపులకు నేను పాల్పడ లేను..’ అని సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్ తేల్చి చెప్పారు. అదంతా కాదు.. తాము చెప్పింది చేయాల్సిందేనని, నిబంధనలు జాన్తానై అంటూ డీజీపీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ హుకుం జారీ చేయడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ఆయన ఏకంగా రాజీనామా చేస్తానని చెప్పడంతో ఆ ఉన్నతాధికారులు హడలిపోయారు. దాంతో తమ పుట్టి మునుగుతుందని హడలిపోయిన డీజీపీ, సీఐడీ చీఫ్ చాలాసేపు సర్ది చెప్పడంతో అతి కష్టం మీద రాజీనామా విషయంలోబ్రిజ్లాల్ వెనక్కి తగ్గారు. రెడ్‌బుక్(Redbook) వేధింపులకు పాల్పడలేనని స్పష్టం చేస్తూ సెలవుపై వెళ్లిపోయారు. పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ ఉదంతం విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు ఇలా ఉంది. చంద్రబాబు ప్రభుత్వం తమ రెడ్‌బుక్ రాజ్యాంగ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం(Ration rice) అక్రమ రవాణా అవుతోందని గగ్గోలు పెట్టిన విషయం తెలిసిందే. ముందస్తు పన్నాగంతో మంత్రి నాదేండ్ల మనోహర్ (Nadendla Manohar) ద్వారా కుట్రకు తెరతీసి.. అనంతరం ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ద్వారా ‘సీజ్ ద షిప్’ డ్రామాను రక్తి కట్టించేందుకు యత్నించింది. కాగా, కేంద్ర కస్టమ్స్ అధికారులు నిబంధనలకు కట్టుబడటంతో టీడీపీ(TDP) కూటమి ప్రభుత్వం కుట్ర బెడిసికొట్టింది. దాంతో చంద్రబాబు (Chandrababu Naidu) ప్రభుత్వం కాకినాడ పోర్టు నుంచి రేషన్ బియ్యం అక్రమ రవాణాపై దర్యాప్తు కేసును తమ ఆధీనంలోని సీఐడీకి అప్పగించింది. అందుకోసం నియమించిన సిట్‌కు సీఐడీ ఐజీ వినీత్ బ్రిజ్‌లాల్‌ను చీఫ్‌గా నియమించింది. సిట్ సభ్యులుగా ముందు కొందరు పోలీసు అధికారులను నియమించింది. కానీ ఒక్క రోజులోనే వారిని మార్చి పూర్తిగా తమ మాట వినే అధికారులను నియమించింది. అనంతరం వినీత్ బ్రిజ్‌లాల్ కాకినాడలో పర్యటించిన పోర్టు, గోదాములు మొదలైన వాటిని పరిశీలించి వచ్చారు. తాను గుర్తించిన వాస్తవ విషయాలతో నివేదిక రూపొందించేందుకు ఉపక్రమించారు. పెద్దలు చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాలి తాము అనుకున్న రీతిలో నివేదిక సిద్ధం కావడం లేదని తెలుసుకున్న ప్రభుత్వ పెద్దలు.. పోలీసు పెద్దకు దిశా నిర్దేశం చేయడంతో అసలు కుట్రకు తెరలేచింది. ఈ నేపథ్యంలో సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్.. సిట్ చీఫ్ వినీత్ బ్రిజ్‌లాల్‌ను పిలిచి మాట్లాడారు. తాము చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలని ఆదేశించారు. ‘క్షేత్ర స్థాయిలో పరిశీలించిన విషయాలతో పని లేదు.. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగా నివేదిక రూపొందించాలి. రేషన్ బియ్యం స్మగ్లింగ్ జరిగిందా లేదా అన్నదానితో నిమిత్తం లేదు. జరిగినట్టు నివేదిక ఇవ్వాలి. ప్రభుత్వ పెద్దలు ఎవరెవరి పేర్లు చెబుతారో వారిని బాధ్యులుగా పేర్కొనాలి’ అని ఆదేశించినట్టు తెలుస్తోంది. సీఐడీ చీఫ్ ఆదేశాలను వినీత్ బ్రిజ్‌లాల్ నిర్ద్వందంగా తిరస్కరించారు. తాను క్షేత్ర స్థాయిలో కనుగొన్న వాస్తవ విషయాలతోనే నివేదిక రూపొందిస్తానని స్పష్టం చేశారు. అలా అయితే కుదరదని, ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టుగానే నివేదిక ఇచ్చి తీరాలని సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దీనిపై వినీత్ బ్రిజ్‌లాల్ తీవ్రంగానే స్పందించినట్టు తెలుస్తోంది. డీజీపీదీ అదే మాట.. బ్రిజ్‌లాల్ వైఖరిని సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ ద్వారకా తిరుమలరావు దృష్టికి తీసుకువెళ్లారు. దాంతో బ్రిజ్‌లాల్‌ను డీజీపీ తన చాంబర్‌కు పిలిపించారు. డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్ మరోసారి ఆయనపై తీవ్ర ఒత్తిడి తెచ్చారు. ప్రభుత్వ పెద్దలు చెప్పినట్టు చేయాల్సిందేనని ఆదేశించారు. బ్రిజ్‌లాల్ మరోసారి తన వైఖరిని పునరుద్ఘాటిస్తూ నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వనని తేల్చి చెప్పారు. అంతేకాదు తనకు పార్టీలతో సంబంధం లేదని, ఏ పార్టీ అధికారంలో ఉన్నా సరే నిబంధనల మేరకే పని చేస్తున్నానన్నారు. 2014–19 మధ్య టీడీపీ ప్రభుత్వ హయాంలో విశాఖపట్నంలో భూముల కుంభకోణంపై నియమించిన సిట్‌కు నేతృత్వం వహించానని, అనంతరం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏవోబీలో గంజాయి నిర్మూలనకు సెబ్ కమిషనర్‌గా పని చేశానని చెప్పారు. విశాఖపట్నంలో భూముల కుంభకోణంలో ప్రమేయం ఉన్న అప్పటి టీడీపీ మంత్రిపై చర్యలు తీసుకోని విషయాన్ని కూడా ఆయన ప్రస్తావించినట్టు సమాచారం. ఆయన వాదనను ఏమాత్రం వినిపించుకోకుండా తాము చెప్పినట్టుగా నివేదిక ఇవ్వాల్సిందేనని డీజీపీ, సీఐడీ చీఫ్ తేల్చి చెప్పారు. దాంతో తీవ్ర మనస్థాపానికి గురైన బ్రిజ్‌లాల్ ఇలా అయితే తాను ఏకంగా పోలీసు ఉద్యోగానికి రాజీనామా చేస్తానని చెప్పి బయటకు వచ్చేశారు. ఆయన రాజీనామా పత్రాన్ని కూడా డీజీపీకి సమర్పించినట్టు సమాచారం. దాంతో డీజీపీ, సీఐడీ చీఫ్ హడలిపోయారు. ఈ వ్యవహారం బయటకు పొక్కితే తాము ఇబ్బందికర పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుందని భావించారు. ఆ మర్నాడు మళ్లీ బ్రిజ్‌లాల్‌ను పిలిపించి రాజీనామా నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని ఒత్తిడి చేశారు. అతి కష్టం మీద అందుకు సమ్మతించిన ఆయన తాను మాత్రం నిబంధనలకు విరుద్ధంగా నివేదిక ఇవ్వలేనని స్పష్టం చేశారు. ఉన్నతాధికారుల ఒత్తిడి కొనసాగుతుందని స్పష్టం కావడంతో ఆయన సెలవుపై వెళ్లిపోయారు.త్వరలో సిట్ చీఫ్‌గా మరొకరు! తమ కుట్రలకు వినీత్ బ్రిజ్‌లాల్ ససేమిరా అనడంతో ఆయన స్థానంలో సిట్ చీఫ్‌గా మరొకర్ని నియమించాలని ప్రభుత్వం భావిస్తోంది. ఆయన్ని సీఐడీ విభాగం నుంచి తప్పించి గ్రేహౌండ్స్‌కు బదిలీ చేయాలని సూత్ర ప్రాయంగా నిర్ణయించినట్టు తెలుస్తోంది. సెలవు నుంచి వచ్చిన తర్వాత ఆయన్ను బదిలీ చేస్తారని సమాచారం. కాగా, వినీత్ బ్రిజ్‌లాల్ ఉదంతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. రాజకీయ పార్టీల కక్ష సాధింపు కుట్రలకు పోలీసు వ్యవస్థను భాగస్వామిని చేస్తున్న పోలీసు ఉన్నతాధికారుల తీరుపై యంత్రాంగం తీవ్రంగా మండిపడుతోంది. ఉన్నత పదవులు పొందేందుకు, రిటైరైన తర్వాత కూడా పదవులు పొందేందుకు యావత్ పోలీసు వ్యవస్థను ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసే వ్యవస్థగా మార్చి వేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పోలీసు అధికారులు బలవుతున్నా, వారికి పోస్టింగులు ఇవ్వకుండా వేధిస్తున్నా.. పట్టించుకోని ఉన్నతాధికారులు ప్రభుత్వ రెడ్ బుక్ కుట్రలకు మాత్రం వత్తాసు పలుకుతున్నారని పోలీసు వర్గాలు దుయ్యబడుతున్నాయి. చదవండి: చెప్పారంటే.. చేయరంతే!డీజీపీ కావాలనే లక్ష్యంతో సీఐడీ చీఫ్ రవిశంకర్ అయ్యన్నార్, డీజీపీగా పదవీ కాలం పొడిగింపు సాధ్యం కాకపోవడంతో రిటైరైన తర్వాత ఆర్టీసీ ఎండీగా పోస్టింగు లక్ష్యంగా ద్వారకా తిరుమలరావు పని చేశారన్నది స్పష్టమవుతోందని తేల్చి చెబుతున్నాయి. ప్రభుత్వ ఒత్తిళ్లకు తలొగ్గక బ్రిజ్‌లాల్ నిబద్ధతతో వ్యవహరించడాన్ని ప్రశంసిస్తున్నాయి. -
డీజీపీ పోస్టు కోసం మూడు ముక్కలాట!
సాక్షి, అమరావతి: పోలీసు శాఖలో ఆధిపత్య పోరు పతాకస్థాయికి చేరుకుంటోంది. డీజీపీ పోస్టే లక్ష్యంగా మూడు ముక్కలాటతో పోలీసు వ్యవస్థ పూర్తిగా గాడి తప్పుతోంది. రాజకీయ ప్రత్యర్థులపై అక్రమ కేసులు బనాయించడమే కొలమానంగా ప్రభుత్వ పెద్దలను ప్రసన్నం చేసుకునేందుకు డీజీ స్థాయి ఐపీఎస్‌లు పోటీ పడుతుండటం విభ్రాంతి కలిగిస్తోంది. డీజీపీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తన పదవీ కాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలు ముమ్మరం చేయగా... విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా, సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ పోలీస్ బాస్ పోస్టు కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. హరీశ్ కుమార్ గుప్తా, ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్‌కుమార్ లడ్హా, కేంద్ర సర్వీసులో ఉన్న అమిత్ గర్గ్‌లతో కూడిన ఉత్తరాది లాబీ మంత్రి నారా లోకేశ్ అండదండలతో పోలీసు శాఖపై దీర్ఘకాలిక ఆధిపత్యం చలాయించేందుకు పావులు కదుపుతోంది. పోలీసు ఉన్నతాధికారుల అధికారిక లాలసను ఆసరాగా చేసుకుని ప్రభుత్వ పెద్దలు వారిని తమ రాజకీయ కక్ష సాధింపు చర్యలకు వాడుకుంటున్నారు.దీర్ఘకాలిక పట్టుకు ఉత్తరాది లాబీ గూడుపుఠాణిచంద్రబాబు, లోకేశ్‌ను ‘అన్ని విధాలుగా’ ప్రసన్నం చేసుకుని ఆధిపత్యం చలాయిస్తున్న ఉత్తరాది ఐపీఎస్ లాబీ దీర్ఘకాలిక వ్యూహానికి తెర తీయడం పోలీసు శాఖలో చర్చనీయాంశంగా మారింది. సర్వం తానై రెడ్‌బుక్ వేధింపులు, పోలీసు వ్యవస్థను నడిపిస్తున్న ఇంటెలిజెన్స్ అదనపు డీజీ మహేశ్‌కుమార్ లడ్హా ఈ లాబీకి నేతృత్వం వహిస్తున్నారు. హరీశ్‌కుమార్ గుప్తాతోపాటు ప్రస్తుతం హైదరాబాద్‌లోని నేషనల్ పోలీసు అకాడమీ అదనపు డైరెక్టర్‌గా ఉన్న అమిత్ గర్గ్ ఇందులో కీలక సభ్యులు. రానున్న నాలుగేళ్లపాటు పోలీసు శాఖపై పూర్తిగా తమ పట్టే ఉండాలన్నది ఆ లాబీ ఉద్దేశం. ఈ క్రమంలో ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాత హరీశ్ కుమార్ గుప్తాను డీజీపీగా చేయాలని పట్టుబడుతోంది. ఆ దిశగా ఇప్పటికే చాలా వరకు సఫలీకృతమైంది. ఆగస్టులో హరీశ్ కుమార్ గుప్తాకు పొడిగింపు ఇవ్వాలని... ఆ తరువాత ఆయన రిటైరయ్యాక అమిత్ గర్గ్‌ను డీజీపీగా చేయాలన్నది ఉత్తరాది లాబీ వ్యూహం. అనంతరం వచ్చే ఎన్నికల నాటికి మహేశ్ కుమార్ లడ్హా డీజీపీ కావాలన్నది ఎత్తుగడ. తద్వారా 2029 వరకు పోలీసు శాఖ పూర్తిగా తమ ఆధిపత్యంలోనే ఉండాలని హరీశ్ కుమార్ గుప్తా, అమిత్ గర్గ్, మహేశ్ కుమార్ లడ్హా పట్టుదలతో ఉన్నారు. ఇప్పటికే మహేశ్ కుమార్ లడ్హా ఏం చెప్పినా చంద్రబాబు సరే అంటున్నారు. ఇక లోకేశ్ పూర్తిగా హరీశ్ కుమార్గుప్తాకు అనుకూలంగా ఉన్నారు. దీంతో తాము అనుకున్నది సాధిస్తామని ఆ ముగ్గురు ఐపీఎస్‌లు పూర్తి ధీమాతో ఉన్నారు. ఆ ముగ్గురి లాబీయింగ్ ప్రస్తుతం పోలీసు శాఖలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. డీజీపీ పోస్టు కోసం ఆధిపత్య పోరుతో రాష్ట్రంలో పోలీసు వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్నా అటు ప్రభుత్వ తీరులోగానీ ఇటు ఐపీఎస్ అధికారుల వైఖరిలోగానీ ఏమాత్రం మార్పు రావడం లేదు.ఏం చేయమన్నా చేసేస్తా...! లోకేష్ అండతో గుప్తా జోరుమంత్రి లోకేశ్ అండదండలే అర్హతగా విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ డీజీ హరీశ్ కుమార్ గుప్తా డీజీపీ పోస్టుకు గురి పెట్టారు. రెడ్‌బుక్ వేధింపులకు విజిలెన్స్–ఎన్ఫోర్స్మెంట్ విభాగాన్ని సాధనంగా మార్చారు. టీడీపీ కూటమి ప్రభుత్వం లక్ష్యంగా చేసుకున్న ప్రత్యర్థి పార్టీల నేతలు, ఇతరులపై విజిలెన్స్– ఎన్ఫోర్స్మెంట్ ద్వారా తప్పుడు నివేదికలు ఇప్పించుకోవడం.. వాటి ఆధారంగా ఏసీబీ, సీఐడీ కేసులు నమోదు చేస్తూ వేధిస్తుండటం అంతా పక్కా పన్నాగంతో సాగుతోంది. లోకేశ్ సహకారంతో హరీశ్ కుమార్ గుప్తాకు డీజీపీ పోస్టు దక్కే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని హోంశాఖ వర్గాలు చెబుతున్నాయి. 2014–19లో టీడీపీ హయాంలో గౌతం సవాంగ్‌ను డీజీపీగా నియమించాలని చంద్రబాబు భావించినప్పటికీ మంత్రి లోకేశ్‌ను ‘తనదైన శైలిలో ప్రసన్నం’ చేసుకుని ఆర్పీ ఠాకూర్ పోలీస్ బాస్ పోస్టును దక్కించుకున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. లోకేశ్ అండదండలు ఉన్నప్పటికీ హరీశ్ గుప్తా ఏమాత్రం ఉదాసీనతకు తావివ్వకుండా తన ప్రయత్నాలను కొనసాగిస్తున్నారు. తనకు డీజీపీగా అవకాశం ఇస్తే ప్రభుత్వ పెద్దలు ఏం చేయమన్నా సరే సంకోచించకుండా చేసేస్తానని హామీ ఇస్తున్నారు. మరోవైపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్‌లకు వ్యతిరేకంగా పలు ఆరోపణలు, ఇతర అంశాలను వివిధ మార్గాల్లో చంద్రబాబు, లోకేశ్‌కు చేరవేసేలా పావులు కదుపుతున్నారు. రెడ్‌బుక్‌కు రాచబాట వేశా.. డీజీపీ ద్వారకా చివరి యత్నాలురెడ్బుక్ రాజ్యాంగం పేరుతో చంద్రబాబు ప్రభుత్వం సృష్టిస్తున్న అరాచకానికి మౌన ప్రేక్షకుడిగా సహకరిస్తున్నప్పటికీ డీజీపీ ద్వారకా తిరుమలరావుకు పదవీ కాలం పొడిగింపుపై ఎలాంటి హామీ లభించలేదని తెలుస్తోంది. ఆయన ఈ నెలాఖరుకు రిటైర్ కానుండటంతో తన పదవీకాలం పొడిగింపు కోసం చివరి ప్రయత్నాలను ముమ్మరం చేశారు. చంద్రబాబు, లోకేశ్‌తో ఇటీవల విడివిడిగా సమావేశమై తన మనోగతాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. అయితే రెడ్‌బుక్ వేధింపులు, అక్రమ కేసులు తాము ఆశించినస్థాయిలో లేవని.. మరింత తీవ్రతరం చేయాలని ప్రభుత్వ పెద్దలు ఆయనకు స్పష్టం చేసినట్లు సమాచారం. ఎంతగా అక్రమ కేసులు బనాయిస్తున్నా మరింత బరి తెగించాలని ప్రభుత్వ పెద్దలు పట్టుబడుతుండటాన్ని ఆయన కొందరు సీనియర్ ఐపీఎస్‌ల వద్ద ప్రస్తావించినట్టు సమచారం. ఇప్పటికే నిబంధనలను పూర్తిగా ఉల్లంఘించి పోలీసు వ్యవస్థ వ్యవహరిస్తోందని... ఇంకా దిగజారితే పోలీసు అధికారులు న్యాయపరమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని ఆయన కొందరు డీజీ, అదనపు డీజీ స్థాయి అధికారుల వద్ద వ్యాఖ్యానించడం గమనార్హం. తద్వారా టీడీపీ ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యల కోసం పోలీసు వ్వవస్థను దుర్వినియోగం చేస్తోందని పరోక్షంగా వెల్లడించారు. అంతే కాదు.. పోలీసు అధికారులు ఇలాంటి వ్యవహారాల్లో జాగ్రత్తగా ఉండాలని సూచించినట్లైందని పోలీసు వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి.బాబుపై కేసులు నీరుగార్చడమే అర్హతగా.. రవిశంకర్ అయ్యన్నార్ సీఐడీ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టుపై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబుపై ఉన్న అవినీతి కేసులను నీరు గార్చాలని స్పష్టమైన ఆదేశాలతోనే ఆయన్ను సీఐడీ చీఫ్‌గా ప్రభుత్వ పెద్దలు నియమించారు. అందువల్లే గతంలో చంద్రబాబు అవినీతిని బట్టబయలు చేస్తూ సీఆర్సీపీ 164 వాంగ్మూలాలు ఇచ్చిన అధికారులను బెదిరించి తప్పుడు వాంగ్మూలాలు నమోదు చేసే ప్రక్రియను సీఐడీ వేగవంతం చేస్తోంది. గతంలో సిట్‌లో పని చేసిన కిందిస్థాయి అధికారులను బెదిరించి వారి ద్వారా చంద్రబాబుపై ఉన్న కేసులను నీరుగార్చే కార్యాచరణ చేపట్టింది. వీటిని ప్రస్తావిస్తూ రవిశంకర్ అయ్యన్నార్ డీజీపీ పోస్టు కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ద్వారకా తిరుమలరావు రిటైరైన తరువాతే తననే డీజీపీగా నియమించాలని కోరుతున్నారు. అయితే లోకేశ్ ఇప్పటికే గుప్తాను డీజీపీగా నియమించాలని నిర్ణయించినట్లు తెలియడంతో రవిశంకర్ అయ్యన్నార్ రెండో ఆప్షన్ కూడా రెడీ చేసుకున్నారు. హరీశ్‌కుమార్ గుప్తా ఆగస్టులో రిటైరైన తరువాత తనకు డీజీపీగా అవకాశం ఇస్తామనే హామీ తీసుకోవాలని భావిస్తున్నారు. కానీ అందుకు చంద్రబాబు, లోకేశ్ నుంచి ఎలాంటి సానుకూల సంకేతాలు లభించకపోవడంతో ఆయన కాస్త కలవరపడుతున్నట్టు తెలుస్తోంది. -
నేరాలు.. ఘోరాలు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో నేరాలు, ఘోరాలు అమాంతం పెరిగిపోయాయి. హత్యలు, దోపిడీలు, దాడులు, మహిళలపై దారుణాలు, సైబర్ నేరాలు విపరీతమయ్యాయి. శాంతిభద్రతలు పూర్తిగా దిగజారిపోయాయి. ఈ విషయం సాక్షాత్తూ పోలీసుల శాంతిభద్రతల వార్షిక నివేదికలో వెల్లడైంది. డీజీపీ ద్వారకా తిరుమలరావు శనివారం శాంతిభద్రతల వార్షిక నివేదిక–2024ను విడుదల చేశారు. శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాం.. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్లు, ఇతర పరిజ్ఞానం సహకారంతో శాంతిభద్రతల పరిరక్షణకు కఠిన చర్యలు తీసుకుంటున్నామని డీజీపీ చెప్పారు. దేశవ్యాప్తంగా సైబర్ నేరాలు పెరుగుతున్నట్టుగానే రాష్ట్రంలోనూ పెరిగాయన్నారు. జిల్లాకో సైబర్ పోలీస్ స్టేషన్‌ను ఏర్పాటు చేస్తామని చెప్పారు. హెల్మెట్ ధారణపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామన్నారు. గంజాయి, డ్రగ్స్ నిర్మూలనకు ఈగల్ ద్వారా పటిష్ట కార్యాచరణ చేపడతామని పేర్కొన్నారు. ఏపీ పోలీస్ అకాడమీ(అప్పా), గ్రేహౌండ్స్ ప్రధాన కేంద్రాలను త్వరలో నెలకొల్పుతామని డీజీపీ చెప్పారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పర్యటనలో ఐపీఎస్ అధికారిగా హడావుడి చేసిన రిటైర్డ్ సైనికోద్యోగిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. -
డీజీపీపై జగన్ సంచలన వ్యాఖ్యలు
-
తప్పు చేసిన పోలీసులను సప్తసముద్రాల అవతల ఉన్నా వదలం: వైఎస్ జగన్ వార్నింగ్
గుంటూరు, సాక్షి: సుప్రీంకోర్టు ఆదేశాలను పట్టించుకోకుండా.. నిబంధనలు పాటించకుండా పోలీసులు అరెస్టులు చేస్తున్నారని, వాళ్లు ఒకసారి తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. డీజీపీపై, కూటమి ప్రభుత్వం ఆదేశాలకు అనుగుణంగా పని చేస్తున్న పోలీస్ అధికారులకు హితబోధ చేశారు.‘‘పోలీసులు సెల్యూట్ చేయాల్సింది మూడు సింహాలకు. ఇల్లీగల్‌గా అరెస్టులు చేయడమేంటి?. రాజకీయ నాయకులు చెప్తున్నారని.. తప్పు చేస్తూ పోతే బాధితుల ఉసురు తగులుతుంది. పోలీసులు ఇప్పటికైనా తమ మనస్సాక్షిని ప్రశ్నించుకోవాలి. మీరు చేసే పనుల వల్ల పోలీసుల ప్రతిష్ట దెబ్బతింటోంది.పోలీస్ అధికారిలా కాకుండా.. అధికార పార్టీ కార్యకర్తలా డీజీపీ మాట్లాడుతున్నారు. ఈ ప్రభుత్వం ఎల్లకాలం ఉండదు. వన్‌సైడెడ్‌గా ఉండకండి. వ్యవస్థపై గౌరవంతో ఉండండి. మేం చూస్తూ ఊరుకోం. తప్పు చేసే పోలీసుల మీద ఫిర్యాదు (ప్రైవేట్ కంప్లయింట్) చేస్తాం. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ అందుకు న్యాయసహాయం అందిస్తుంది. జమిలి.. గిమిలి ఎన్నికలంటున్నారు. ఈ ప్రభుత్వం కూడా ఎన్నిరోజులు ఉండేలా కనిపించడం లేదు. ఆ తర్వాత రాబోయేది మా ప్రభుత్వమే. అప్పటికీ మేం ఇక్కడ ఉండం కదా అని కొందరు అనుకుంటున్నారేమో... ట్రాన్స్ఫర్ అయినవాళ్లనే కాదు.. రిటైర్ అయిన కూడా వదలం. సప్త సముద్రాల అవతల ఉన్నా కూడా పిలిపిస్తాం. చూస్తూ ఊరుకోం. చట్టం ముందు దోషులుగా నిలబెతాం. రెడ్ బుక్ ఇప్పుడు ఉన్నవాళ్లే కాదు. బాధితులు కూడా రెడ్‌బుక్‌లు పెట్టుకుంటారు. వాటి ఆధారంగా అలాంటి పోలీసులపై చర్యలు కచ్చితంగా తీసుకుంటాం అని జగన్ హెచ్చరించారు. -
పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై ఏపీ DGP రియాక్షన్..
-
సిట్ విచారణ నిలిపివేత
తిరుమల: తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ అంటూ అసత్య ఆరోపణలు చేసిన చంద్రబాబు.. ఆ ఆరోపణలపై విచారణ కోసం ఆయనే ఏర్పాటు చేసిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణ నిలిచిపోయింది. డీజీపీ ద్వారకా తిరుమలరావు తిరుమలలో మంగళవారం ప్రకటించారు. తిరుమల లడ్డూలో నెయ్యి కల్తీ ఆరోపణలపై సిట్ దర్యాప్తును నిలిపివేస్తున్నామని.. సుప్రీం కోర్టులో విచారణ జరుగుతుండటం వల్ల దర్యాప్తును ఆపుతున్నామని తెలిపారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై పోలీస్, టీటీడీ విజిలెన్స్ అధికారులతో తిరుమలలో మంగళవారం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. శ్రీవారి లడ్డులో కల్తీ నెయ్యి వాడిన కేసు తీవ్రత వల్లే సిట్ వేశామని.. మూడు రోజుల పాటు టీటీడీలో సిట్ దర్యాప్తు సాగిందన్నారు. ప్రస్తుతానికి సిట్ విచారణను తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఈ నెల 3వ తేదీన సుప్రీంకోర్టు ఇచ్చే ఆదేశాల ప్రకారం దర్యాప్తుపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. 3 రోజుల దర్యాప్తు వివరాలను సిట్ చీఫ్ తమకు అందజేశారని చెప్పారు.బ్రహ్మోత్సవాల్లో పటిష్ట భద్రత బ్రహ్మోత్సవాలకు సంబంధించి భద్రతా ఏర్పాట్లపై సమీక్ష నిర్వహించామని డీజీపీ తెలిపారు. 5,145 మంది పోలీస్ సిబ్బందిని బ్రహోత్సవాలకు వినియోగిస్తున్నామన్నారు. గరుడ వాహనం రోజున ప్రత్యేకంగా మరో 1,264 మందిని భద్రత కోసం నియమిస్తున్నట్టు చెప్పారు. తిరుమలలో 24 ప్రాంతాలలో పార్కింగ్ స్థలాలను గుర్తించామని, వీటిలో 8 వేల వాహనాలను పార్కింగ్ చేసుకోవచ్చన్నారు. దసరాకు 6,100 ప్రత్యేక బస్సులు భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా తిరుమలకు అదనంగా ఆర్టీసీ బస్సులు నడుపుతున్నట్టు ఆర్టీసీ ఇన్చార్జి ఎండీ ద్వారకా తిరుమలరావు చెప్పారు. దసరా నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా 6,100 ప్రత్యేక బస్సులు నడుపుతున్నామని.. వీటిలో అదనపు చార్జీలు వసూలు చేయడం లేదని చెప్పారు. -
Laddu Row: సిట్ బ్రేకులపై డీజీపీ రియాక్షన్
తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు నిలిపివేతపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. దర్యాప్తును తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారాయన.శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ అంశంపై.. కేసు తీవ్రత వల్లే సిట్ వేయాల్సి వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే దర్యాప్తును ఆపుతున్నాం. తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు విచారణ వుంటుంది’’ అని తెలిపారాయన.తిరుమల లడ్డూ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో.. సిట్ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సోలిసిటర్ జనరల్‌ను ద్విసభ్య ధర్మాసనం కోరింది. అక్టోబర్ 3వ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం. బ్రహోత్సవాల కోసం నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నాం. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం... మొబైల్ డివైజ్ ఫింగర్ ప్రింట్ ఏర్పాట్లతో అనుమానితుల్ని గుర్తిస్తాం. 2,700 సీసీ కెమరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో తప్పులు వార్తలు ప్రచారం కాకుండా నిఘా ఉంచుతాం. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైనులు ద్వారా అనుమతిస్తాం.మొత్తం.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తేనే సౌకర్యవంతంగా వుంటుంది అని అన్నారాయన. అలాగే.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు. -
డీజీపీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతల స్వీకరణ
సాక్షి, అమరావతి/ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): డీజీపీగా సీహెచ్.ద్వారకా తిరుమలరావు శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఆయన పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం డీజీపీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా డీజీపీకి పోలీసు ఉన్నతాధికారులు శుభాకాంక్షలు తెలిపారు. అదనపు డీజీలు, ఐజీలు, ఇతర పోలీసు ఉన్నతాధికారులతో ద్వారకా తిరుమలరావు కాసేపు సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలుడీజీపీగా బాధ్యతలు స్వీకరించిన ద్వారకా తిరుమలరావుకు రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం శుభాకాంక్షలు తెలిపింది. మంగళగిరిలోని రాష్ట్ర పోలీసు ప్రధాన కార్యాలయంలో డీజీపీతో పోలీసు అధికారుల సంఘం ప్రతినిధులు మర్యాదపూర్వకంగా సమావేశమయ్యారు. సమర్థుడైన పోలీసు అధికారిగా గుర్తింపు పొందిన ఆయన రాష్ట్రంలో డీజీపీగానూ విజయవంతమవుతారని ఆకాంక్షించారు. పోలీసుల సంక్షేమం కోసం కృషి చేయాలని ఆయన్ని కోరారు. కాగా, డీజీపీ ద్వారకా తిరుమలరావు దంపతులు విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మను దర్శించుకున్నారు. ఆయనకు ఆలయ అధికారులు సాదరంగా స్వాగతం పలికారు. -
APSRTC: మహిళలకు ఉచిత ప్రయాణంపై క్లారిటీ
ఎన్టీఆర్, సాక్షి: తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద.. మహిళలకు పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సులో ఉచిత ప్రయాణ సదుపాయం తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఆర్టీసీకి నష్టం రాకుండా ఆ భారమంతా తెలంగాణ ప్రభుత్వమే భరించనుంది. అయితే.. ఆంధ్రప్రదేశ్‌లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణమంటూ ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ నేపథ్యంలో APSRTC స్పందించింది. ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని ఏపీఎస్ ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇక.. సంక్రాంతికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు తెలిపిన ఆయన.. రాను పును బుక్ చేసుకుంటే పది శాతం రాయితీ వర్తిస్తుందని తెలిపారు. ఇక మరో నాలుగు నెలల్లో 1,500 కొత్త బస్సులు రాబోతున్నాయని, త్వరలో సరికొత్త హంగులతో సూపర్ లగ్జరీ బస్సులు వస్తాయని ఆయన అన్నారు. ఇక సంక్రాంతి సందర్భంగా గురువారం నుంచి డోర్ పిక్ అప్ అండ్ డోర్ డెలివరీ ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ. గతంలో డోర్ డెలివరీ ప్రైవేట్ సంస్థతో ఒప్పందం చేసుకుని నిర్వహించేదని.. ఇప్పుడు ఆర్టీసీనే స్వయంగా చేయనుందని చెప్పారాయన. రోజుకు డోర్ డెలివరీ సర్వీస్ లు 25వేలకు పైగా జరుగుతున్నాయని.. ప్రస్తుతానికి విజయవాడలో మాత్రమే పికప్ ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. త్వరలోనే ముఖ్యనగరాలకు ఆ సేవల్ని విస్తరిస్తామని తెలిపారు. -
మార్చి 2 నుంచి అఖిల భారత రవాణా సంస్థల కబడ్డీ పోటీలు
సాక్షి, హైదరాబాద్: ఆలిండియా పబ్లిక్ బస్ ట్రాన్స్ పోర్ట్ కబడ్డీ టోర్నమెంట్-2023 మార్చి 2 నుంచి ప్రారంభం కానుంది. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ అయిన అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్‌టేకింగ్స్(ఏఎస్ఆర్టీయూ) ఆధ్వర్యంలో నిర్వహిస్తోన్న ఈ టోర్నమెంట్‌కు తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) ఆతిథ్యం ఇస్తోంది. హైదరాబాద్ శివారు హకీంపేటలోని ట్రాన్స్పోర్ట్ అకాడమీలో గురువారం నుంచి మూడు రోజుల పాటు కబడ్డీ టోర్నమెంట్ జరుగుతుంది. ఆర్టీసీ ఉద్యోగులకు మానసిక ఉల్లాసంతో పాటు చక్కటి ఆరోగ్యం లభించేందుకు ఏఎస్ఆర్టీయూ ఈ టోర్నమెంట్‌ను నిర్వహిస్తోందని టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్దన్, ఎండీ వీసీ సజ్జన్నార్ తెలిపారు. ఈ టోర్నీలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, గుజరాత్ మహారాష్ట్ర, హర్యానా ఆర్టీసీలతో పాటు నవీ ముంబై, బృహణ్ ముంబై, పుణే మహానగర్ పరివాహన్, బెంగళూరు మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లు పాల్గొంటున్నాయని వివరించారు. కబడ్డీ పోటీలను గురువారం (మార్చి 2) ఉదయం 9.30 గంటలకు ఏపీఎస్ఆర్టీసీ ఎండీ సిహెచ్ ద్వారక తిరుమలరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభిస్తారు. -
APSRTC: పల్లె వెలుగు బస్సుల్లో న్యూమాటిక్ డోర్లు.. ఎలా పనిచేస్తాయంటే..
సాక్షి, అమరావతి: ప్రయాణికుల భద్రత కోసం ఏపీఆర్టీసీ మరిన్ని మెరుగైన చర్యలు తీసుకుంటున్నది. పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ‘న్యూమాటిక్ డోర్లు’ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ప్రయోగాత్మకంగా రెండు బస్సుల్లో ఏర్పాటు చేసిన న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఎండీ సీహెచ్. ద్వారకా తిరుమలరావు మంగళవారం పరిశీలించారు. ప్రయాణికులు తొందరపాటుతో కదులుతున్న బస్సుల్లోంచి దిగుతున్నప్పుడుగానీ ఎక్కుతున్నప్పుడుగానీ కాలుజారి పడడం వంటి ప్రమాదాలను నివారించేందుకు న్యూమాటిక్ డోర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఈ డోర్లు పూర్తిగా డ్రైవర్ నియంత్రణలో ఉంటాయి. బస్సు ఆగిన తరువాత డ్రైవర్ సీటు వద్ద ఉన్న బటన్‌ను నొక్కితేనే డోర్లు తెరుచుకుంటాయి. వర్షాలు, చలితో బస్సులోని ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా ఈ డోర్లు ఉపయోగపడతాయి. ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు డ్రైవర్లతో మాట్లాడుతూ.. ప్రయాణికుల భద్రతకు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. కాగా, త్వరలోనే అన్ని పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ న్యూమాటిక్ డోర్లను ఆర్టీసీ ఏర్పాటు చేయనుంది. (క్లిక్ చేయండి: ఇదీ.. అమరావతి రాజధాని అసలు కథ) -
నెరవేరిన చిరకాల స్వప్నం
ఇది 21వ శతాబ్దం. ఆధునికత, సాంకేతికతల సమ్మేళనంతో వాహన రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. విమాన, రైలు ప్రయాణాలు తప్పించి, రోడ్డు మీద తిరుగాడే అన్ని వాహనాలకు ఇప్పటివరకు పెట్రోలు / డీజిలు విని యోగమే అధికంగా జరుగుతున్నది. కాగా, ఇటీవలి కాలంలో ఈ పెట్రోలు / డీజిలు ధరలు గరిష్ఠంగా పెరిగి ప్రభుత్వాలకు, ప్రజలకు ఆర్థికంగా పెనుభారంగా మారాయి. వీటికి ప్రత్యామ్నాయ ఆలోచనే విద్యుత్ వాహనాలను ప్రవేశ పెట్టాలనుకోవడం. రాష్ట్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వెహికల్ (ఈవీ) పాలసీని రాష్ట్ర పురోభివృద్ధికి ఉపయోగపడేలా ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నది. దశల వారీగా రాష్ట్రంలో ‘ఈవీ’ల వినియోగాన్ని ప్రోత్సహించి, పర్యావరణ పరిరక్షణకు తన వంతు కర్తవ్యాన్ని పూర్తి స్థాయిలో చేపడుతున్నది. ఈ ఎలక్ట్రిక్ వాహనాలతో అనేక ప్రయోజనాలు సమకూరుతాయి. ఎలక్ట్రిక్ వాహనాలు అత్యంత సమర్థంగా పని చేస్తాయి. డీజిల్, పెట్రోలు వాహనాలతో పోలిస్తే, తక్కువ నిర్వహణ ఖర్చులు కలిగి ఉంటాయి. డీజిల్ / పెట్రోలుతో పోల్చినప్పుడు విద్యుత్ ఇంధన ఆదా గణనీయంగా ఉంటుంది. ఎలక్ట్రిక్ వాహనాలు సురక్షితమైనవి, నమ్మదగినవి. ఇతర సాంకేతికతలకు సమానమైన సమయ వ్యవధిని కలిగి ఉంటాయి. వాటి నిశ్శబ్ద, మృదువైన పయనం ప్రయాణికులు విశ్రాంతి తీసు కోవడానికి అనువుగా ఉంటుంది. డీజిల్ / పెట్రోలు ఇంజిన్ లేకపోవడం వల్ల శబ్ద కాలుష్యం తగ్గుతుంది. డీజిల్/ పెట్రోలు వాహనాల వల్ల గాలిలోకి హానికర ఉద్గారాలు విడుదలై ప్రజలకు... ముఖ్యంగా పిల్లలకు ఉబ్బసం, ఊపిరితిత్తుల సమస్యలు వంటివి తలñ త్తుతాయి. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం వల్ల ఈ సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. ఈవీలు ఇప్పటికీ వాటి సంప్రదాయ ప్రత్యర్థుల కంటే తక్కువ ఉద్గారాలు, తక్కువ గ్లోబల్ వార్మింగ్లతో వాతావరణ కాలుష్యాన్ని తగ్గిస్తాయి. ఈ విద్యుత్ వాహనాల వినియోగంతో ప్రజా రవాణా శక్తి పెరుగుతుంది. పర్యావరణాన్ని దెబ్బతీసే హానికరమైన కార్బన్ డయాక్సైడ్ గ్రీన్హౌస్ వాయు ఉద్గారాలు తగ్గుతాయి. ఎలక్ట్రిక్ డ్రైవింగ్ నుండి ఒక కిలో మీటరుకు వచ్చే ఉద్గారాలు పెట్రోల్ లేదా డీజిల్ డ్రైవింగ్ వల్ల విడుదలయ్యే ఉద్గారాల కంటే చాలా తక్కువ. అలాగే, పవర్ స్టేషన్ (ఛార్జింగ్ స్టేషన్) ఉద్గారాలను పరిగణనలోకి తీసుకున్నప్పుడు కూడా ఇది నిజం. ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి చాలా ఉత్సాహ పూరితమైన వాతావరణం ఉన్నప్పటికీ, అధిక కొనుగోలు ధరలు, కొత్త ఛార్జింగ్ స్టేషన్ల స్థాపన వంటి కొన్ని ఆర్థ్ధికపరమైన భారాలు ఇప్పటికీ ఉన్నాయి. అయితే, ఈ సవాళ్లు తొలిదశలోనే వుంటాయి. తదనంతరం ప్రత్యామ్నాయ మార్గాలూ వుంటాయి. ఎలక్ట్రిక్ వాహనాలకు ఆశాజనకమైన భవిష్యత్తు ఉంది. అందుకే రాష్ట్ర ప్రభుత్వ స్ఫూర్తితో ప్రజలకు, ప్రయా ణికులకు తన వంతు కర్తవ్యంగా ఈ విద్యుత్ బస్సుల వినియోగానికి ఏపీఎస్ఆర్టీసీ శ్రీకారం చుడుతున్నది. ఇటీవలి కాలంలో రవాణా రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. ఒక్కసారి గతంలోకి తొంగి చూస్తే, ప్రజా రవాణాలో ప్రయాణికుల సౌకర్యార్థం ఏపీఎస్ఆర్టీసీ ఎన్నో చర్యలు చేపట్టినది. సాధారణమైన ఎర్ర బస్సు స్థాయి నుంచి, క్రమేపీ పల్లెవెలుగు, ఎక్స్‌ప్రెస్, సూపర్ లగ్జరీ, ఏసీ, చివరగా అత్యున్నత స్థాయి ఏసీ స్లీపర్ బస్సుల స్థాయి వరకు ఎదిగి, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులలో కూడా వాసికెక్కి, ప్రయాణికుల మన్ననలు పొంది, జాతీయ స్థాయిలో ఎన్నో అవార్డులు, రివార్డులు పొందుతున్నది కూడా. ప్రస్తుతం తలపెట్టిన ఈవీల వాడకం ఈ సంస్థ కిరీటంలో మరో కలికి తురాయి కానున్నది. మొదటి దశలో 100 ఎలక్ట్రిక్ బస్సులను పవిత్ర నగరమైన తిరుపతి – తిరుమల, తిరుపతి పరిసర ప్రాంతాలలో నడపటానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. ఈ విద్యుత్ బస్సుల వల్ల ప్రయాణికులకు ఆహ్లాదకరమైన ప్రయాణం చేసే అవకాశం లభిస్తుంది. అంటే శబ్దం, కాలుష్యం లేని ప్రశాంత ప్రయాణమన్న మాట. ఈవీలకు చార్జింగ్ చేసే విద్యుత్ ఛార్జీల పెరుగుదలతో పోలిస్తే పెట్రోలు, డీజిల్ ధర పెరుగుదల ఎక్కువ. ఈవీ బ్యాటరీ ధర క్రమంగా తగ్గుతూ ఉండటం గమనించవచ్చు. అలాగే కాపెక్స్ మోడల్‌తో పోల్చి నప్పుడు ఈవీల ఆపరేషన్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఈవీలను సమకూర్చుకోవడానికి ఏపీఎస్ఆర్టీసీ అనేక సంవత్సరాలుగా యోచిస్తున్నది. పైన పేర్కొన్న విస్తృత ప్రయో జనాలు, ప్రస్తుత ప్రభుత్వ సహకారం వల్ల, ఇన్నాళ్ళకు ఈ చిరకాల స్వప్నం నెరవేరబోతున్నది. ఇందువల్ల ప్రభుత్వ ప్రతిష్ఠ పెరుగుతుంది. అలాగే ఏపీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు మరింత చేరువ అయ్యే అవకాశంగా దీన్ని భావిస్తున్నది. సీహెచ్ ద్వారకా తిరుమల రావు వ్యాసకర్త ఏపీఎస్ఆర్టీసీ మేనేజింగ్ డైరెక్టర్ -
AP: అదనపు చార్జీల్లేకుండానే దసరా స్పెషల్ బస్సులు
సాక్షి, అమరావతి: ప్రయాణికులపై అదనపు చార్జీల భారం లేకుండానే దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించాలని నిర్ణయించినట్టు ఆర్టీసీ ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు చెప్పారు. దశాబ్దకాలం తరువాత ఇలా అదనపు చార్జీలు లేకుండా ఆర్టీసీ దసరా ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహించడం ఇదే తొలిసారని తెలిపారు. విజయవాడలోని బస్‌భవన్‌లో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ ఏడాది దసరా రద్దీ దృష్ట్యా 4,500 ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. దసరా ఉత్సవాల ముందు ఈ నెల 29 నుంచి అక్టోబరు 4 వరకు 2,100 బస్సులు, దసరా తరువాత అక్టోబరు 5 నుంచి 9 వరకు 2,400 బస్సులు నడుపుతామని తెలిపారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని 21 నగరాలు, ముఖ్య పట్టణాలకు ప్రత్యేక బస్సులు నడుపుతామని చెప్పారు. అన్ని సర్వీసుల్లోను యూటీఎస్ విధానాన్ని అమలు చేస్తూ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు, యూపీఐ పేమెంట్లు, క్యూఆర్ కోడ్ ద్వారా కూడా టికెట్లు తీసుకోవచ్చని వివరించారు. అన్ని బస్సులను జీపీఎస్ ట్రాకింగ్ విధానంతో అనుసంధానించి కంట్రోల్ రూమ్ నుంచి 24/7 పర్యవేక్షిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నడిపే ప్రైవేటు బస్సులను నిరోధించేందుకు పోలీసు, రవాణా శాఖలతో కలసి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామన్నారు. శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఈ–బస్ సర్వీసులు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో ఆర్టీసీ ఈ–బస్ సర్వీసులను సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రారంభిస్తారని తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో 10 ఈ–బస్సులను నడుపుతామన్నారు. అనంతరం దశలవారీగా డిసెంబర్ నాటికి తిరుమల–తిరుపతి ఘాట్‌రోడ్డులో 100 ఈ–బస్ సర్వీసులను ప్రవేశపెడతామని చెప్పారు. తిరుమల ఘాట్రోడ్తోపాటు రాష్ట్రంలో దూరప్రాంత సర్వీసుల కోసం కొత్తగా 650 బస్సులను కొనుగోలు చేయాలని నిర్ణయించినట్టు తెలిపారు. గత ఏడాది 1,285 బస్సులను ఫేస్‌లిఫ్ట్ విధానంలో నవీకరించామని ఈ ఏడాది రూ.25 కోట్లతో మరో 1,100 బస్సులను నవీకరిస్తున్నామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగులకు అక్టోబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామన్నారు. ఇటీవల పదోన్నతులు పొందిన దాదాపు రెండువేల మందికి సాంకేతికపరమైన అంశాలను పూర్తిచేసి నవంబర్ 1 నుంచి కొత్త పేస్కేల్ ప్రకారం జీతాలు చెల్లిస్తామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో ఆర్టీసీ ఈడీ (కమర్షియల్) కె.ఎస్.బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ డీజిల్ సెస్ పెంపు
సాక్షి, అమరావతి: డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో నష్టాలను కొంతవరకు భర్తీ చేసుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం టికెట్లపై డీజిల్ సెస్సు పెంచింది. పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై రోజుకు రూ.2.50 కోట్ల మేర అదనపు భారం పడుతోంది. దీంతో అనివార్యంగా డీజిల్ సెస్సు పెంచుతున్నట్టు ఆర్టీసీ చైర్మన్ ఎ.మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్.ద్వారకా తిరుమలరావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పెరిగిన డీజిల్ సెస్సు శుక్రవారం నుంచి అమలులోకి రానుంది. కనీస దూరం ప్రయాణానికి డీజిల్ సెస్ పెంపుదల నుంచి మినహాయింపునిచ్చారు. అంతకంటే ఎక్కువ దూరం ప్రయాణాలపై ఏకమొత్తంగా కాకుండా కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. ప్రయాణికులపై తక్కువ భారం పడేలా జాగ్రత్తలు తీసుకున్నారు. సిటీ బస్సుల్లో డీజిల్ సెస్ పెంచలేదు. తెలంగాణతో పోలిస్తే ఏపీఎస్ ఆర్టీసీ డీజిల్ సెస్ తక్కువ పెంచింది. తెలంగాణలో అన్ని ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల బస్ పాస్‌లపై డీజిల్ సెస్‌ను రెండోసారి జూన్ 9న పెంచిన విషయం తెలిసిందే. బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131 2019 డిసెంబర్లో డీజిల్ ధర మార్కెట్లో లీటరు రూ.67 ఉండగా ఈ ఏడాది ఏప్రిల్ నాటికి రూ.107కి చేరుకుంది. అంటే లీటరుకు రూ.40 చొప్పున పెరిగింది. దీంతో నష్టాన్ని కొంతవరకు భర్తీ చేసుకునేందుకు అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్‌ను ఈ ఏడాది ఏప్రిల్ 13 నుంచి విధిస్తోంది. ప్రస్తుతం బల్క్ డీజిల్ ధర లీటర్ రూ.131కి చేరుకోవడంతో ఆర్టీసీ నిత్యం అదనంగా రూ.2.50 కోట్ల నష్టాన్ని భరించాల్సి వస్తోంది. బస్సుల నిర్వహణ, స్పేర్ పార్ట్‌ల ధరలు కూడా పెరగడంతో ఆర్థిక భారం అధికమైంది. దీన్ని కొంతవరకైనా భర్తీ చేసే ఉద్దేశంతో డీజిల్ సెస్‌ను పెంచుతూ నిర్ణయం తీసుకుంది. కనీస దూరానికి పెంపులేదు ప్రయాణించే దూరాన్ని బట్టి కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్ పెంచారు. కనీస దూరానికి డీజిల్ సెస్ పెంచలేదు. పల్లె వెలుగు బస్సుల్లో 30 కి.మీ, ఎక్స్‌ప్రెస్ సర్వీసుల్లో 30 కి.మీ, అల్ట్రా డీలక్స్ బస్సుల్లో 20 కి.మీ, సూపర్ లగ్జరీ సర్వీసుల్లో 55 కి.మీ, ఏసీ సర్వీసుల్లో 35 కి.మీ, అమరావతి సర్వీసుల్లో 55 కి.మీ వరకు ప్రస్తుతం డీజిల్ సెస్సు పెంచలేదు. అంతకుమించి ప్రయాణించే కి.మీ. ప్రాతిపదికన డీజిల్ సెస్సు పెంచారు. విద్యార్థుల బస్ పాస్ చార్జీలు కూడా స్వల్పంగా పెరుగుతాయి. సహృదయంతో సహకరించాలి డీజిల్ ధరలు అమాంతం పెరుగుతుండటంతో ఆర్టీసీపై నష్టాల భారం రోజురోజుకు పెరుగుతోంది. అనివార్యంగా ఆర్టీసీ డీజిల్ సెస్ పెంచాల్సి వచ్చింది. ప్రజలు సహృదయంతో అర్థం చేసుకొని సహకరించాలని కోరుతున్నాం. ఆర్టీసీలో సురక్షిత, సౌకర్యవంతమైన ప్రయాణ సేవలందిస్తాం. – ఎ.మల్లికార్జున రెడ్డి, (ఆర్టీసీ చైర్మన్), సీహెచ్.ద్వారకా తిరుమలరావు (ఆర్టీసీ ఎండీ) -
గుడ్‌న్యూస్: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్
తిరుపతి అర్బన్: ఆర్టీసీ ఉద్యోగులకు త్వరలోనే పేస్కేల్ ప్రకటించనున్నట్లు ప్రజా రవాణా సంస్థ(ఆర్టీసీ) ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. గురువారం ఆయన తిరుపతి, అలిపిరి, మంగళం, చంద్రగిరి బస్టాండ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా తిరుపతిలో ఆయన మీడియాతో మాట్లాడారు. సీఎం వైఎస్ జగన్ 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేసిన విషయం అందరికీ తెలిసిందేనన్నారు. అదేవిధంగా త్వరలోనే ఆర్టీసీ ఉద్యోగులకు నూతన పే స్కేల్స్ కూడా ప్రకటించనున్నారని చెప్పారు. ప్రయాణికులకు సౌకర్యవంతమైన ఎలక్ట్రిక్ బస్సులు ఏర్పాటు చేయాలని సీఎం జగన్ ఆదేశించినట్లు పేర్కొన్నారు. ఆ మేరకు చర్యలు చేపట్టామని.. అభివృద్ధి చెందిన దేశాల్లో ఎలాంటి బస్సులను వినియోగిస్తున్నారో అదే తరహాలో 100 ఏసీ ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నట్లు చెప్పారు. జూలై 1న తొలి బస్సు అలిపిరి డిపోకు చేరుకుంటుందన్నారు. ఆ తర్వాత కొద్ది రోజులకు మిగిలిన బస్సులను కూడా తిరుపతి జిల్లాకు తీసుకొస్తామన్నారు. తిరుమల ఘాట్ రోడ్డు కోసం 30–50 బస్సులు, రేణిగుంట ఎయిర్‌పోర్టు, నెల్లూరు, కడప, ప్రముఖ దేవాలయాలున్న పట్టణాలకు మరో 50 బస్సులు కేటాయిస్తామని చెప్పారు. బస్సులకు చార్జింగ్ పాయింట్లు, విద్యుత్ చార్జీలు, కండక్టర్లను ఆర్టీసీ ఏర్పాటు చేసుకుంటుందని.. డ్రైవర్లు, బస్సుల మరమ్మతులను మాత్రం యజమానులే చూసుకుంటారని వెల్లడించారు. రాష్ట్రంలో తొలి ఎలక్ట్రిక్ బస్సుల బస్టాండ్‌గా అలిపిరి నిలుస్తుందన్నారు. అలాగే ఆర్టీసీకి చెందిన డీజిల్ బస్సులను కన్వర్షన్ పద్ధతిలో ఎలక్ట్రిక్ బస్సులుగా మార్చేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే తిరుపతి డిపోకు చెందిన సప్తగిరి బస్సును ఎలక్ట్రిక్ బస్సుగా మార్పు చేయించామని పేర్కొన్నారు. అనంతరం ద్వారకా తిరుమలరావు అలిపిరి డిపోలో ఏర్పాటు చేసిన 48 చార్జింగ్ పాయింట్లను పరిశీలించారు. కార్యక్రమంలో అధికారులు కృష్ణమోహన్, గోపినాథ్‌రెడ్డి, రవివర్మ, బ్రహ్మానందయ్య, చెంగల్‌రెడ్డి పాల్గొన్నారు. -
ప్రగతి రథానికి ప్రభుత్వం దన్ను
దశాబ్దాల డిమాండ్.. 52 వేల మంది ఆర్టీసీ ఉద్యోగుల దీర్ఘకాలిక స్వప్నం.. ఎడతెగని సాగదీత... గందరగోళం.. వీటన్నింటికీ ఒక్క నిర్ణయం ముగింపు పలికింది. అదే.. ఆర్టీసీనీ ప్రభుత్వంలో విలీనం చేయాలన్న సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి విప్లవాత్మక నిర్ణయం. 2020 జనవరి నుంచి ఆర్టీసీ ప్రభుత్వంలో విలీనమైంది. దేశంలోనే ఏ రాష్ట్రంలోనూ లేని రీతిలో ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ రాష్ట్ర ప్రజా రవాణా విభాగం (పీటీడీ)ని ఏర్పాటు చేశారు. ఫలితం కళ్లముందు కనిపిస్తోంది. – సాక్షి, అమరావతి ఉద్యోగుల ప్రయోజనాలకు ప్రాధాన్యం ► పీఎఫ్ చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయి. ► ఆర్టీసీ ఉద్యోగుల పరపతి సహకార సొసైటీకి 2014 నుంచి ఉన్న బకాయిలు రూ.200 కోట్లను యాజమాన్యం చెల్లించింది. దాంతో సొసైటీ ద్వారా ఉద్యోగులు రుణాలు పొందుతున్నారు. ► ఆర్టీసీ ఉద్యోగులకు కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించారు. అందు కోసం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. ప్రమాదవశాత్తు మరణించే ఉద్యోగుల కుటుంబాలకు రూ.40 లక్షల చొప్పున, సహజ మరణానికి కూడా రూ.5 లక్షల పరిహారం ఇస్తామని ప్రకటించారు. ► 2020 జనవరి తరువాత రిటైరైన ఉద్యోగుల గ్రాట్యుటీ కోసం రూ.23.25 కోట్లు, ఉద్యోగ విరమణ ప్రయోజనాల కోసం రూ.271.89 కోట్లు ప్రభుత్వం కేటాయించింది. ► 2020–21, 2021–22లో ఉద్యోగుల సరెండర్ లీవుల ఎన్‌క్యాష్‌మెంట్ కోసం రూ.165 కోట్లు చెల్లించింది. ► ఏపీ గవర్నమెంట్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్ ద్వారా 55 ఏళ్ల కంటే ఎక్కువ వయసు ఉన్న 44,500 మందికి ప్రయోజనం కలుగుతుంది. ఏపీ గవర్నమెంట్ స్టేట్ ఎంప్లాయీస్ గ్రూప్ ఇన్సూ్యరెన్స్ స్కీమ్‌ను కూడా వర్తింపజేశారు. ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను కూడా ఉద్యోగులు పొందుతున్నారు. ► 2016 నుంచి పెండింగులో ఉన్న కారుణ్య నియామకాలను ప్రభుత్వం చేపట్టింది. ► 2020 జనవరి 1 తరువాత అనారోగ్య సమస్యలతో ఉద్యోగ విరమణ చేసిన 100 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు ఉద్యోగాలివ్వాలని ప్రభుత్వం ఆదేశించింది. ► 2016 జనవరి 1 నుంచి 2019 డిసెంబర్ 31 మధ్య మరణించిన 845 మంది ఉద్యోగుల కుటుంబ సభ్యుల్లో అర్హులకు, 2020 జనవరి 1 తరువాత మరణించిన 955 మంది ఉద్యోగుల కుటుంబాల్లో అర్హులకు కారుణ్య ఉద్యోగాలు కల్పిస్తున్నారు. ఉద్యోగుల జీతాల కోసం ఏటా రూ.3,600 కోట్లు దశాబ్దాల ఆర్టీసీ చరిత్ర మొత్తం ఉద్యోగుల జీతాల కోసం నెల నెలా అప్పులు చేయడం. నెలకు దాదాపు రూ.300 కోట్లు జీతాలకు చెల్లించాలి. ఆ అప్పుల మీద ఏడాదికి వడ్డీల భారమే దాదాపు రూ.350 కోట్లు. విలీనం తర్వాత ప్రభుత్వ ఉద్యోగుల మాదిరే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా ప్రభుత్వం నంబర్లు కేటాయించి సీఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు సక్రమంగా చెల్లిస్తోంది. ఇందుకోసం నెలకు ఏడాదికి రూ.3,600 కోట్ల భారాన్ని మోస్తోంది. కరోనా కారణంగా రెండేళ్లుగా బస్సు సర్వీసులు తగ్గించింది. టికెట్ల ద్వారా వచ్చే రాబడి గణనీయంగా పడిపోయింది. అటువంటి గడ్డు పరిస్థితుల్లోనూ ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వమే నెల నెలా జీతాలు చెల్లిస్తోంది. జీతాల భారం తప్పడంతో ఆర్టీసీ నష్టాల ఊబి నుంచి బయటపడుతోంది. 2020 జనవరి నాటికి ఆర్టీసీకి దాదాపు రూ.4 వేల కోట్ల అప్పులున్నాయి. ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండటంతో ఈ రెండేళ్లలో ఆర్టీసీ రూ.1,500 కోట్ల అప్పులు తీర్చింది. జీవితాల్లో వెలుగులు నింపారు ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయాలన్న గొప్ప నిర్ణయం 52 వేల మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపింది. నెల నెలా జీతాల కోసం పడిన ఇబ్బందులు తొలగిపోయాయి. ఉద్యోగ భద్రత కల్పించారు. ఆర్థిక ప్రయోజనాలు కల్పిస్తున్నారు.’. – బీఎస్ రాములు, డ్రైవర్, విజయనగరం రీజియన్ ఉద్యోగుల ప్రయోజనాలకు కట్టుబడ్డ ప్రభుత్వం ఆర్టీసీ ఉద్యోగుల ప్రయోజనాల కోసం ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోంది. ప్రభుత్వంలో విలీనం ద్వారా ఉద్యోగ భద్రత, ఆర్థిక భరోసా కల్పించింది. ఏ ప్రభుత్వ శాఖలో లేని రీతిలో కార్పొరేట్ శాలరీ ప్యాకేజీ ప్రకటించింది. త్వరలో పే స్కేళ్లను నిర్ధారించనుంది. దీంతో ఉద్యోగులకు మరింత ప్రయోజనం కలుగుతుంది. – ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు సీఎం జగన్ నిర్ణయం చరిత్రాత్మకం ఆర్టీసీ ఉద్యోగులను ఆదుకుంటామని ఎందరో చెప్పారు గానీ ఏమీ చేయలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మాత్రమే గొప్ప నిర్ణయం తీసుకుని ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేశారు. ఆర్టీసీ ఉద్యోగులు ఎన్నో ఏళ్లుగా ఎదుర్కొంటున్న సమస్యలు తీరాయి. ఉద్యోగ భద్రత, పని వేళలు వంటి ప్రభుత్వ విధానాలు అమల్లోకి రావడంతో మాకు ప్రయోజనం కలుగుతోంది.’ – పీహెచ్ వెంకటేశ్వర్లు, మెకానిక్, నెల్లూరు రీజియన్ ఒక్క కి.మీ. తిరగకపోయినా జీతాలు చెల్లించారు ‘కరోనా కారణంగా రాష్ట్రంలో ఆర్టీసీ బస్సులు ఒక్క కిలోమీటరు కూడా తిరగకపోయినా ఉద్యోగులకు జీతాలు సక్రమంగా అందాయి. ఇతర రాష్ట్రాల్లో ఆర్టీసీ ఉద్యోగుల జీతాల్లో కోత విధించారు. మన రాష్ట్రంలో మాత్రమే ఆర్టీసీ ఉద్యోగులకు సక్రమంగా జీతాలు చెల్లించడంతోపాటు ఇతర ప్రయోజనాలూ కల్పిస్తున్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసిన ముఖ్యమంత్రి సాహసోపేత నిర్ణయం ఫలితమే ఇది. ఆర్టీసీ ఉద్యోగులు సీఎంకు కృతజ్ఞతతో ఉంటారు.’ – కొండలు, ఆర్టీసీ సూపర్వైజర్, గుడివాడ -
అద్దె బస్సుల విధానం ఈనాటిది కాదు: ఆర్టీసీ ఎండీ
సాక్షి, విజయవాడ: ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల ప్రయోజనాలతో పాటు ప్రజా ప్రయోజనాలకు ప్రాధాన్యం ఇస్తూ పనిచేస్తోందని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఈ మేరకు విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆర్టీసీకి ప్రజలు ముఖ్యమైన వారు. ఇటీవల కొన్ని పత్రికలు ఆర్టీసీపై దుష్రచారం చేస్తున్నాయి. ఆర్టీసీలో అద్దె బస్సుల విధానం కొత్తది కాదు. అద్దె బస్సులు 1979 నుంచి నడుపుతున్నారు. ప్రజల సౌకర్యం కోసం ప్రస్తుతం 995 అద్దె బస్సులు నడుపుతున్నాం. కోవిడ్ కారణంగా ఆర్థిక పరిస్థితి బాగాలేదు. కొత్తవి కొనలేక అద్దెవి నడుపుతున్నాం. అద్దె బస్సులు కూడా పాతవి కాకుండా.. కొత్తవి, కండిషన్లో ఉన్నవి మాత్రమే వాడాలి. కొత్త బస్సులు ఉన్నవారు మాత్రమే టెండర్లలో పాల్గొనాలి. అద్దె బస్సులు కూడా ఆర్టీసీ సూచించిన విధంగానే నడుపుతారు. ప్రభుత్వంలో ఆర్టీసీ విలీనం అనేది అత్యంత అరుదైనది, చరిత్రాత్మకమైనది. కర్ణాటక, తెలంగాణలో ఆర్సీఈ ఉద్యోగులు ప్రభుత్వంలో విలీనం చేయాలని అనేకమార్లు ధర్మాలు చేశారు. అయినా అక్కడ ప్రభుత్వాలు స్పందించలేదు. అద్దె బస్సుల వల్ల ఆర్టీసీ ఉద్యోగులకు ఎలాంటి ఇబ్బంది లేదు. ఎవరినీ ఉద్యోగాల నుంచి తొలగించలేదు. ప్రభుత్వం ఉద్యోగులను తొలగిస్తూ అలాంటి నిర్ణయం తీసుకోలేదు. ఆయా పత్రికల్లో వచ్చిన దుష్రచారాలను నమ్మొద్దు. ఇతర రాష్ట్రాలలో రెండు, మూడు నెలలుగా జీతాలు ఇవ్వలేదు. ఉద్యోగుల సొమ్మును సైతం ఆయా రాష్ట్రాల్లో వాడుకుంటున్నారు. ప్రభుత్వంలో విలీనం తర్వాత 16,080 కోట్లు అప్పులు తీర్చాం. పీఎఫ్ బకాయిలు మొత్తం చెల్లించాం. సడెన్‌గా మెరుపు సమ్మెలు చేస్తారని కావాలనే హైయర్ బస్సుల పెనాల్టీలు పెంచాం. ప్రజలకు మంచి సేవలు అందాలనే ఇలా చేశాం. కోవిడ్ సమయంలో బస్సులు తిరగనప్పుడు ఇన్సూరెన్స్ ఎక్స్టెండ్ చేశాం. రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించటంతో వేగంగా కారుణ్య నియామకాలు చేపడుతున్నాం. 2,237 ఉద్యోగాల భర్తీ చేస్తున్నాం. కొన్ని ప్రాంతాల్లో దాతల సాయంతో చలువ పందిళ్లు, చలివేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని' ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు అన్నారు. -
ఆర్టీసీ బస్సు ప్రయాణం మరింత సుఖవంతం
సాక్షి, అమరావతి: ‘ఆర్టీసీ బస్సులో ప్రయాణం సుఖవంతం.. సురక్షితం’ అనే నినాదాన్ని మరింత నిజం చేసేందుకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) కార్యాచరణకు సిద్ధమవుతోంది. ప్రయాణికులకు ఆర్టీసీ బస్సు ప్రయాణాన్ని మరింత సౌకర్యవంతంగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. దశాబ్దంగా పాతబడిన బస్సులతోనే నెట్టుకొస్తున్న దుస్థితికి ఇక ముగింపు పలకనుంది. ఆర్టీసీలో ప్రస్తుతం 11,271 బస్సులు ఉన్నాయి. వాటిలో దాదాపు 3,800 బస్సులు బాగా పాతబడ్డాయని గుర్తించారు. ఏసీ బస్సులు 10 లక్షల కి.మీ., ఎక్స్‌ప్రెస్ బస్సులు 8 లక్షల కి.మీ., పల్లె వెలుగు బస్సులు 12 లక్షల కి.మీ. సర్వీసును పూర్తి చేశాయి. గత టీడీపీ ప్రభుత్వం వివిధ కారణాలతో కొత్త బస్సులను ప్రవేశపెట్టలేదు. దీంతో పలుచోట్ల ఆర్టీసీ బస్సులు బ్రేక్‌డౌన్ కావడం, ఇతరత్రా సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి ముగింపు పలుకుతూ కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని ఆర్టీసీ నిర్ణయించింది. అందుకోసం మూడంచెల విధానానికి ఆమోదం తెలిపింది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెట్టడం.. ప్రస్తుతం ఉన్న బస్సులను ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ ద్వారా ఆధునికీకరించడం.. పర్యావరణహితంగా దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మలచడం దిశగా కార్యాచరణను వేగవంతం చేసింది. జూలై చివరికి రోడ్డెక్కనున్న కొత్త బస్సులు త్వరలో కొత్తగా 998 బస్సులను అద్దె విధానంలో ఆర్టీసీ ప్రవేశపెట్టనుంది. దీనికోసం ఈ నెలాఖరులో టెండర్ల ప్రక్రియ చేపట్టి.. వచ్చే నెల రెండోవారం నాటికి పూర్తి చేయాలని భావిస్తోంది. జూలై చివరికి కొత్త బస్సులు రోడ్డెక్కనున్నాయి. దీంతో జిల్లా కేంద్రాల నుంచి గ్రామీణ ప్రాంతాలకు సర్వీసులు తిప్పడానికి కొత్త బస్సులు అందుబాటులోకి వస్తాయి. ఇక 1,150 బస్సులను ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ ద్వారా ఆధునికీకరిస్తున్నారు. కొత్త సీట్లు వేయడం, టైర్లు మార్చడం, ఇతర సాంకేతిక సమస్యలను పరిష్కరించడం ద్వారా నూతన రూపు తెస్తున్నారు. ఇప్పటికే ఆర్టీసీ గ్యారేజీలలో వెయ్యి బస్సులకు ఫేస్‌లిఫ్ట్ ప్రక్రియ పూర్తి చేశారు. దీంతో ప్రయాణికులకు ఆ బస్సులు సౌకర్యవంతంగా మారాయి. 150 ఇ–బస్సులకు టెండర్ల ప్రక్రియ పూర్తి పర్యావరణ పరిరక్షణకు ప్రాధాన్యమిస్తూ ఆర్టీసీ దశలవారీగా ఇ–బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తిరుమల–తిరుపతి ఘాట్ రోడ్డులో నడపడానికి 150 ఇ–బస్సుల కోసం టెండర్ల ప్రక్రియను పూర్తి చేసింది. ఇక రాష్ట్రవ్యాప్తంగా కూడా ఇ–బస్సులను ప్రవేశపెట్టేందుకు సన్నద్ధమవుతోంది. ఆర్టీసీలో ఉన్న దాదాపు 2 వేల డీజిల్ బస్సులను ఇ–బస్సులుగా మార్చేందుకు రెట్రోఫిట్మెంట్ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపింది. ఇప్పటికే ఒక డీజిల్ బస్సును రెట్రోఫిట్ చేసి ఇ–బస్సుగా మార్చారు. త్వరలో ఆ బస్సును పుణెలోని సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ (సీఐఆర్టీ) పరిశీలనకు పంపించనున్నారు. సీఐఆర్టీ ఆమోదించాక ఆ ప్రమాణాల మేరకు దాదాపు 2 వేల డీజిల్ బస్సులను దశలవారీగా ఇ–బస్సులుగా మారుస్తారు. ప్రయాణికులకు సుఖమయ ప్రయాణమే లక్ష్యం ప్రయాణికులకు సుఖమయ ప్రయాణాన్ని అందించడమే లక్ష్యంగా కొత్త బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించాం. దీర్ఘకాలంగా ఉన్న పాత బస్సుల సమస్య త్వరలో పరిష్కారం కానుంది. కొత్తగా అద్దె బస్సులను ప్రవేశపెడతాం. అలాగే దీర్ఘకాలిక అవసరాల దృష్ట్యా పర్యావరణ పరిరక్షణ కోసం ఇ–బస్సులు ప్రవేశపెట్టేందుకు ప్రణాళికను వేగవంతం చేస్తున్నాం. – సీహెచ్ ద్వారకా తిరుమలరావు, ఎండీ, ఆర్టీసీ -
అనివార్యమయ్యే ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్
సాక్షి, అమరావతి: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో ఇంధన సంస్థలు డీజిల్ ధరలను అమాంతం పెంచడంతో తప్పనిసరి పరిస్థితుల్లో ఆర్టీసీ టికెట్లపై డీజిల్ సెస్ విధించాల్సి వస్తోందని ఆర్టీసీ చైర్మన్ మల్లికార్జునరెడ్డి, ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. 2019లో లీటర్ డీజిల్ రూ.67 ఉండగా ప్రస్తు తం రూ.107కు పెరిగిన విషయాన్ని గుర్తు చేశారు. బుధవారం విజయవాడలోని బస్ భవన్లో విలేకరులతో మాట్లాడారు. అనివార్య పరిస్థితుల్లో పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో ఒక్కో టికెట్‌పై డీజిల్ సెస్ నిమిత్తం రూ.2 చొప్పున, ఎక్స్‌ప్రెస్, సిటీ మెట్రో ఎక్స్‌ప్రెస్, మెట్రో డీలక్స్ సర్వీసుల్లో రూ.5 చొప్పున, సూపర్ లగ్జరీ, ఏసీ సర్వీసుల్లో రూ.10 చొప్పున డీజిల్ సెస్ వసూలు చేయనున్నట్లు తెలి పారు. పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ సర్వీసుల్లో కనీస టికెట్ ధర రూ.10గా ఉంటుందన్నారు. పెరిగిన డీజిల్ సెస్ చార్జీలు గురువారం నుంచి అమలులోకి వస్తాయని ప్రకటించారు. అమాంతం పెరిగిన డీజిల్ ధరలతో ఆర్టీసీపై ఏటా రూ.1,100 కోట్లు అదనంగా ఆర్థికభారం పడుతోందని చెప్పారు. డీజిల్ సెస్ ద్వారా ఏడాదికి రూ.720 కోట్లు సమకూరినప్పటికీ అదనంగా దాదాపు రూ.400 కోట్ల భారాన్ని ఆర్టీసీ భరించాల్సి వస్తోందని వివరించారు. డీజిల్ ధరలు తగ్గితే సెస్ తొలగించే విషయాన్ని పరిశీలిస్తామన్నా రు. తెలంగాణలో కూడా డీజిల్ సెస్ విధించిన విషయాన్ని గుర్తు చేశారు. కోవిడ్ పరిస్థితుల్లో గత రెండేళ్లలో ఆర్టీసీ దాదాపు రూ.5,680 కోట్ల రాబడి కోల్పోయిందని తెలిపారు. అదనపు ఆదాయ వనరులను సమకూర్చుకునే దిశగా సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు. ఆర్టీసీ ఖాళీ స్థలాలను వాణిజ్య ప్రయోజనాల కోసం బీవోటీ ప్రాతిపదికన కేటాయించే ప్రక్రియ కొనసాగుతోందన్నారు. టెండర్లను త్వరలోనే ఖరారు చేస్తామన్నారు. కార్గో సేవల ద్వారా అదనపు ఆదాయాన్ని సాధించడానికి ప్రాధాన్యమిస్తున్నామన్నారు. దయచేసి అర్థం చేసుకోవాలి.. డీజిల్ ధరలు అమాంతం పెరగడంతో అనివార్యం గా సెస్ విధించాల్సి రావటాన్ని ప్రజలు సహృదయంతో అర్థం చేసుకోవాలని కోరారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడం వల్ల కోవిడ్ గడ్డు పరిస్థితుల్లో కూడా ఉద్యోగులకు జీతాలు చెల్లించగలిగామన్నారు. ప్రభుత్వం ప్రతి నెల రూ.300 కోట్ల వరకు జీతాల భారాన్ని భరిస్తోందని తెలిపారు. -
డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడింది: ఏపీఎస్ఆర్టీసీ ఎండి
-
APSRTC: తప్పట్లేదు.. డీజిల్ సెస్ పెంచుతున్నాం
సాక్షి, విజయవాడ: డీజిల్ ధరలు పెరగడంతో ఆర్టీసీపై భారం పడిందని ఏపీఎస్ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆయన బుధవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. డీజిల్ బల్క్ రేటు విపరీతంగా పెరిగిందని పేర్కొన్నారు. నిర్వహణ ఖర్చు కూడా రాకపోతే పూర్తి నష్టాల్లోకి వెళుతుందని తెలిపారు. తప్పనిసరి పరిస్థితుల్లో డిజీల్ సెస్ కింద పెంచాల్సి వస్తోందని పేర్కొన్నారు. డీజిల్ సెస్ కింద పెంపు.. ► పల్లెవెలుగు సర్వీసులపై రూ. 2 పెంపు.. ►ఇకపై పల్లె వెలుగు బస్సుల్లో మినిమమ్ ఛార్జీ 10రూ. గానిర్ధారణ ►ఎక్స్‌ప్రెస్ సర్వీసులపై రూ. 5 పెంపు ►ఏసీ బస్సుల్లో రూ. 10 పెంపు తప్పనిసరి పరిస్థితుల్లో పెంపుదల తప్పట్లేదన్న ఆయన.. ఇది ఛార్జీల పెంపు కాదని గుర్తించాలని ప్రయాణికులకు విజ్ఞప్తి చేశారు. పెంచిన ధరలు రేపటి(ఏప్రిల్ 14) నుంచే అమలులోకి రానున్నాయి. ప్రయాణికులు అర్థం చేసుకొని సహకరిస్తారని ఆశిస్తున్నామని తెలిపారు. పల్లెవెలుగు కనీస ఛార్జీ ఇకపై రూ.10గా నిర్ణయించామని తెలిపారు. కరోనా వల్ల ఆర్టీసీ ఆదాయానికి గండి పడిందని పేర్కొన్నారు. ఆర్టీసీపై రోజుకు రూ.3.5 కోట్ల భారం పడుతోందని తెలిపారు. రెండేళ్లుగా ఆర్టీసీ ఛార్జీలు పెంచలేదని పేర్కొన్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో మాత్రమే పెంపు నిర్ణయించామని తెలిపారు. డీజిల్ సెస్ మాత్రమే పెరుగుదల అని పేర్కొన్నారు. -
మరోసారి ఆర్టీసీలో ‘కారుణ్యం’
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆర్టీసీలో 1,852 కారుణ్య నియామకాలను చేపట్టేందుకు ఆదేశాలు ఇచ్చినట్లు రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య(నాని) వెల్లడించారు. బుధవారం సచివాలయంలోని మీడియా పాయింట్ వద్ద ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావుతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనం అనంతరం ఆర్టీసీలో అద్భుతమైన మార్పులు వచ్చాయని చెప్పారు. 2015కు ముందు సర్వీసులో ఉంటూ మరణించిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబాలలో 385 మందికి తాము అధికారంలోకి వచ్చిన వెంటనే కారుణ్య నియామకాలు కింద ఉద్యోగాలు ఇచ్చినట్లు గుర్తు చేశారు. వీరితోపాటు 2016 నుంచి మరణించిన ఉద్యోగుల కుటుంబాలలో మరో 896 మందికి, 2020 నుంచి మరణించిన వారిలో 956 మందికి మొత్తం 1,852 మందిని కారుణ్య నియామకాల కింద ఆర్టీసీతో పాటు, గ్రామ, వార్డు సచివాలయాల్లో, జిల్లా కలెక్టరేట్ పరిధిలోని 40 శాఖల్లో భర్తీ చేయనున్నామని, ఈ మేరకు కలెక్టర్లకు కూడా ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. బయట డీజిల్ కొనుగోలుతో రూ.65 కోట్లు ఆదా కేంద్ర ప్రభుత్వం ఆయిల్ కంపెనీల ద్వారా బల్క్ విధానంలో ఆర్టీసీకి సరఫరా చేసే డీజిల్ ధరలకు, బయట రేట్లలో చాలా వ్యత్యాసం ఉందని మంత్రి నాని తెలిపారు. బల్క్‌లో కొనుగోలు కంటే బయటే డీజిల్ ధరలు తక్కువగా ఉన్నాయని చెప్పారు. దీంతో సంస్థపై ఆర్థిక భారం పడకుండా ఆర్టీసీకి అవసరమైన డీజిల్‌ను బయట బంకుల్లో కొనుగోలు చేస్తున్నామన్నారు. బయట కొనడంతో ప్రస్తుతం పెరిగిన ధరలతో నెలకు సరాసరి రూ.33.83 కోట్లు ఆదా అవుతోందన్నారు. ఇప్పటిదాకా రూ.65 కోట్లు వరకు ఆదా అయిందన్నారు. బల్క్‌లో డీజిల్ ధర తగ్గినపుడు తిరిగి అక్కడే కొనుగోలు చేస్తామన్నారు. సంస్థ అవసరాలకు నెలకు సుమారు 8 లక్షల లీటర్ల డీజిల్‌ను వినియోగిస్తోందన్నారు. 1 నుంచి సీనియర్ సిటిజన్లకు రాయితీ కోవిడ్ కారణంగా నిలిపివేసిన సీనియర్ సిటిజన్ల రాయితీ టికెట్లను ఏప్రిల్ 1వ తేదీ నుంచి పునరుద్ధరిస్తున్నామని మంత్రి నాని వెల్లడించారు. 60 ఏళ్లు పైబడిన వారు గుర్తింపు కార్డులు చూపి టికెట్‌పై 25 శాతం రాయితీ పొందవచ్చని సూచించారు. దీనివల్ల సుమారు రెండు లక్షల మంది ప్రయోజనం పొందుతారన్నారు. ఆర్టీసీలో ఏసీ ఎలక్ట్రిక్ బస్సులకు ఇప్పటికే టెండర్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. ఏప్రిల్ 30న మొదటి బస్సును తిరుపతిలో సీఎం చేతుల మీదుగా ప్రారంభిస్తామన్నారు. తిరుపతి నుంచి తిరుమల, మదనపల్లె, కర్నూలు తదితర మార్గాల్లో మొత్తం 50 ఎలక్ట్రిక్ ఇంద్ర ఏసీ బస్సులను నడపనున్నట్లు చెప్పారు. విలీనంతో రూ.3,600 కోట్ల భారం ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో జీతభత్యాల కింద ప్రభుత్వంపై ఏటా రూ.3,600 కోట్ల భారం పడుతున్నా అప్పుల్లో ఉన్న సంస్థను బతికించాలనే లక్ష్యంతో సీఎం జగన్ సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నారని మంత్రి నాని చెప్పారు. 2020–21లో ఆర్టీసీకి రూ.2,691 కోట్ల రాబడి రాగా ఖర్చు రూ.2,049 కోట్లుగా ఉందన్నారు. కోవిడ్ లేకుంటే సంస్థకు రూ.2,800 కోట్ల ఆదాయం వచ్చేదన్నారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా ఉద్యోగుల పీఎఫ్, ఎస్బీటీ, సీసీఎస్ తదితరాల నుంచి వినియోగించుకున్న రూ.705 కోట్లను ప్రభుత్వం తిరిగి ఆయా ఖాతాల్లో జమ చేసినట్లు మంత్రి తెలిపారు. -
సంక్రాంతికి 6,970 ప్రత్యేక బస్సులు
సాక్షి, అమరావతి: సంక్రాంతి రద్దీకి తగ్గట్టుగా ప్రయాణికులకు మెరుగైన సేవలందించేందుకు 6,970 ప్రత్యేక బస్సులు నడపనున్నామని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ నెల 7 నుంచి 18 వరకు వీటిని నడుపుతామన్నారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. 7 నుంచి 14 వరకు 3,755 సర్వీసులు, 15 నుంచి 18 వరకు మరో 3,215 సర్వీసులను నడుపుతామన్నారు. గతేడాది కంటే 35శాతం అదనపు ప్రత్యేక బస్సులు నడుపుతామన్నారు. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులతోపాటు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాలు, ప్రధాన పట్టణాలకు ప్రత్యేక బస్సు సర్వీసులు నిర్వహిస్తామని చెప్పారు. ప్రయాణికులు తప్పనిసరిగా కోవిడ్ నిబంధనలను పాటించాలని ద్వారకా తిరుమలరావు సూచించారు. ప్రత్యేక సర్వీసు బస్సులన్నీ ఓ వైపు ఖాళీగా వెళ్లి మరోవైపునుంచి ప్రయాణికులతో వస్తాయనే విషయాన్ని గుర్తుంచుకోవాలని సూచించారు. కాబట్టి ప్రత్యేక సర్వీసు బస్సులకే ఒకటిన్నర రెట్లు అధిక చార్జీలు వసూలు చేయాల్సి వస్తోందని చెప్పారు. సాధారణ సర్వీసు బస్సులలో సాధారణ చార్జీలే వసూలు చేస్తామన్నారు. ప్రయాణికుల సమాచారం కోసం ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్ 0866–2570005ను అందుబాటులో ఉంచామని చెప్పారు. -
ప్రభుత్వం ఎంతో చేసింది
సాక్షి, అమరావతి: ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో కొత్త అధ్యాయం మొదలై ఖచ్చితంగా రెండేళ్లు పూర్తయ్యిందని, 2020 జనవరి 1న ప్రభుత్వంలో సంస్థ విలీనమైందని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ప్రభుత్వం మనకు ఎంతో చేసిందని, మన విశ్వసనీయతను చాటుకుందామని ఆయన ఆర్టీసీ ఉద్యోగులకు పిలుపునిచ్చారు. ఆర్టీసీ హౌస్‌లో శనివారం నిర్వహించిన నూతన సంవత్సర వేడుకల్లో కేక్ కట్ చేసిన ఆయన ఉద్యోగులనుద్దేశించి మాట్లాడారు. ప్రభుత్వంలో విలీనమైన మొదటి ఏడాదిలో అనేక రకాల అనుభవాలు, అపోహలు, అంతరాలు, అవగాహన లోపాలు కలిగాయని, రాను రాను కార్యకలాపాలు పుంజుకున్న కొద్ది అవి సమసిపోయాయని వివరించారు. కోవిడ్ సమయంలో అందరూ పలు రకాల ఇబ్బందులు పడుతున్నప్పుడు కూడా సంస్థ ఉద్యోగులకు ప్రభుత్వం ప్రతి నెలా క్రమం తప్పకుండా జీతాలు అందించిందని చెప్పారు. ప్రభుత్వ నెట్వర్క్ ఆస్పత్రుల్లో పొందిన వైద్య సేవలకు కూడా మెడికల్ రీయింబర్స్మెంట్ స్కీమ్‌కు ఆర్టీసీ ఉద్యోగులను అర్హులుగా చేరుస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. ఈడీలు ఎ.కోటేశ్వరరావు (అడ్మినిస్ట్రేషన్), పి.కృష్ణమోహన్ (ఇంజనీరింగ్), కేఎస్ బ్రహ్మనందరెడ్డి, ఆదం సాహెబ్, సి.రవికుమార్, విజయవాడ ఆర్ఎం ఎంవై దానం తదితరులు మాట్లాడారు. -
కారుణ్య నియామకాలు 30లోగా పూర్తి
సాక్షి, అమరావతి: కారుణ్య నియామకాల ప్రక్రియను ఈ నెల 30లోగా పూర్తి చేయాలని ఏపీఎస్ ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ఉత్తర్వులిచ్చారు. కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ సిబ్బంది కుటుంబసభ్యులకు ఉద్యోగాలిచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ఆర్టీసీ సంస్థ వేగంగా చర్యలు తీసుకుంటోంది. ఇందులో భాగంగా విధి విధానాలు, షెడ్యూల్‌ను నిర్దేశిస్తూ ఎండీ ద్వారకా తిరుమలరావు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. నియామక ప్రక్రియ ఇలా.. ► ఆర్టీసీ రీజనల్ మేనేజర్లు తమ పరిధిలోని అర్హుల దరఖాస్తుల పరిశీలనను ఈ నెల 20లోగా పూర్తి చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ స్థాయి ఉద్యోగుల ఎంపికను జోనల్ సెలక్షన్ కమిటీలు ఈ నెల 23లోగా పూర్తి చేస్తాయి. ► కండక్టర్, డ్రైవర్, శ్రామిక్ పోస్టులకు ఎంపికను రీజనల్ కమిటీలు ఈ నెల 25లోగా పూర్తి చేయాల్సి ఉంటుంది. ► ఎంపికైన వారికి ఈ నెల 27లోగా వైద్య పరీక్షలు చేస్తారు. ► జూనియర్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు.. డ్రైవర్, కండక్టర్, శ్రామిక్ ఉద్యోగాలకు రీజనల్ మేనేజర్లు ఈనెల 30లోగా నియామక ఉత్తర్వులు జారీ చేస్తారు. అనంతరం శిక్షణ తరగతులు నిర్వహిస్తారు. ► కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగుల కుటుంబాల్లో కారుణ్య నియామకాలకు అర్హులైనవారు లేకపోతే ఎక్స్‌గ్రేషియా అందిస్తారు. క్లాస్–4 ఉద్యోగి కుటుంబానికి రూ.5 లక్షలు, నాన్‌గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.8 లక్షలు, గెజిటెడ్ అధికారి స్థాయి కుటుంబానికి రూ.10 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేషియా ఇస్తారు. ఉద్యోగ సంఘాల హర్షం.. కారుణ్య నియామకాల ప్రక్రియ వేగంగా పూర్తయ్యేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవడంపై ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వై.వి.రావు, పి.దామోదరరావు, నేషనల్ మజ్దూర్ యూనియన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. -
పల్లె వెలుగు బస్సులకు కొత్త రూపు
చీరాల అర్బన్: రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పల్లె వెలుగు బస్సులను పూర్తి స్థాయిలో బాగు చేయించి కొత్త రూపు తీసుకొస్తామని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రకాశం జిల్లా చీరాల ఆర్టీసీ బస్టాండ్, గ్యారేజీలను బుధవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాత పల్లె వెలుగు బస్సులను కొంత హంగులతో రూపొందించి మూడు వేల బస్సులను అందుబాటులోకి తీసుకురానున్నట్లు చెప్పారు. స్వచ్ఛాంధ్రప్రదేశ్‌లో భాగంగా సుమారు రూ.25 కోట్ల వ్యయంతో అన్ని బస్స్టేషన్లలోని మరుగుదొడ్ల నిర్మాణాలు, మరమ్మతులు చేయించనున్నట్లు వెల్లడించారు. సాధారణ తనిఖీల్లో భాగంగా చీరాల ఆర్టీసీ బస్టాండ్‌ను పరిశీలించామన్నారు. డిపోలోని సర్వీసుల వివరాలు, కార్గో సర్వీసులపై వస్తున్న ఆదాయం గురించి అడిగి తెలుసుకున్నారు. అనంతరం బస్టాండ్ ఆవరణలోని గార్డెన్, పరిసరాలను ఆయన పరిశీలించి పలు సూచనలు చేశారు. ఆర్టీసీ ఎండీకి పలు యూనియన్ల నాయకులు కలిసి పుష్పగుచ్ఛాలను అందించారు. -
దసరాకు 4 వేల ఆర్టీసీ బస్సులు
సాక్షి, అమరావతి: దసరా పండుగ రద్దీ దృష్ట్యా ప్రయాణికుల కోసం రేపటి (శుక్రవారం) నుంచి ఈనెల 18వ తేదీ వరకు 4 వేల ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారకాతిరుమలరావు తెలిపారు. 14వ తేదీ వరకు 1,800 బస్సులు, 15 నుంచి 18వ తేదీ వరకు 2,200 బస్సులు తిప్పుతామని చెప్పారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయం బస్‌భవన్‌లో బుధవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దసరా సందర్భంగా ప్రయాణికులు తమ స్వస్థలాలకు సౌకర్యవంతంగా వచ్చి, పండుగ తరువాత మళ్లీ వెళ్లేందుకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందన్నారు. హైదరాబాద్ నుంచి 1,383 బస్సులు, బెంగళూరు నుంచి 277 బస్సులు, చెన్నై నుంచి 97 బస్సులు, ఇతర ప్రాంతాల నుంచి 2,243 బస్సులను రాష్ట్రంలో వివిధ ప్రాంతాలకు నడుపుతామని వివరించారు. దసరా ప్రత్యేక బస్సులను ఓ వైపు ఖాళీగా అంటే సున్నా రాబడితో నడపాల్సి ఉంటుందన్నారు. డీజిల్ ధరలు విపరీతంగా పెరుగుతున్నాయని చెప్పారు. అందువల్ల అనివార్య పరిస్థితులతో దసరా ప్రత్యేక బస్సుల్లో 50 శాతం అదనపు చార్జీలు నిర్ణయించినట్లు తెలిపారు. ప్రయాణికులు సహృదయంతో అర్థం చేసుకోవాలని ఆయన కోరారు. రెగ్యులర్ బస్ సర్వీసుల్లో అదనపు చార్జీలు ఉండవని చెప్పారు. కారుణ్య నియామకాలకు ఆమోదం గత సంవత్సరం జనవరి 1 తరువాత మృతిచెందిన ఆర్టీసీ ఉద్యోగుల వారసులకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని చెప్పారు. దీనిపై త్వరలోనే విధివిధానాలను విడుదల చేస్తామన్నారు. 2020 జనవరి 1 నుంచి ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేయడంతో ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగానే కారుణ్య నియామకాలకు మార్గం సుగమమైందని పేర్కొన్నారు. అంతకుముందు అంటే ఆర్టీసీ కార్పొరేషన్‌గా ఉన్నకాలంలో చనిపోయిన సంస్థ ఉద్యోగుల పిల్లలకు కూడా కారుణ్య నియామకాలపై త్వరలో ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని చెప్పారు. 2020–21కి సంబంధించి ఆర్టీసీ ఉద్యోగులకు లీవ్ ఎన్‌క్యాష్‌మెంట్ ఇస్తున్నామన్నారు. ఆర్టీసీ ఆదాయాన్ని పెంచేందుకు, ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యమిస్తున్నట్లు తెలిపారు. పల్లెవెలుగు బస్ డిజైన్ మారుస్తామన్నారు. అన్ని బస్సులకు లైవ్ ట్రాకింగ్ సౌలభ్యం కల్పిస్తామని చెప్పారు. నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సులపై చర్యలు తీసుకునేందుకు రవాణా, పోలీసు అధికారులతో కలిపి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తామని ఆయన తెలిపారు. -
అయ్యన్నపాత్రుడు వ్యాఖ్యలు ఆక్షేపణీయం
సాక్షి, అమరావతి: టీడీపీ నేత అయ్యన్నపాత్రుడు మాజీ మంత్రి అయి ఉండి కూడా ‘ఎస్పీ నా కొడుకులు’ అని సంబోధించడం ఆక్షేపణీయమని ఆంధ్రప్రదేశ్ ఐపీఎస్ అధికారుల సంఘం కార్యదర్శి సీహెచ్ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శుక్రవారం ఆయనొక ప్రకటన చేస్తూ.. వారి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఆయన వ్యాఖ్యలు సభ్య సమాజం సిగ్గుపడేలా ఉన్నాయని తెలిపారు. ప్రజా ప్రతినిధులు హుందాతనంతో, విలువలతో, స్థాయికి తగ్గట్టు వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రాజకీయ విశృంఖలత్వం మితిమీరక ముందే ఇటువంటి ప్రవర్తనను సభ్య సమాజం గర్హించాల్సిన అవసరం ఉందన్నారు. ఎన్నో సమస్యల మధ్య విధులు నిర్వర్తిస్తున్న ఐపీఎస్ అధికారుల పట్ల అనుచితంగా వ్యవహరించడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. ఒక పోలీసు ఉన్నతాధికారిని దూషించడమంటే రాజ్యాంగాన్ని అపహాస్యం చేయడమేనన్నారు. ఇష్టానుసారం మాట్లాడి వ్యవస్థలను అభాసుపాలు చేయొద్దని హితవు పలికారు. -
ద్వారకా తిరుమలరావు: ఆర్టీసీని లాభాల బాట పట్టిస్తా
విజయవాడ: రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (ఏపీఎస్ఆర్టీసీ) ఎండీగా ద్వారకా తిరుమలరావు బాధ్యతలు చేపట్టారు. విజయవాడలోని ఆర్టీసీ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఆయన బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఎండీకి అధికారులు, సిబ్బంది అభినందనలు తెలిపారు. ప్రజలకు ఆర్టీసీ ద్వారా మరింత మెరుగైన రవాణా సేవలు అందిస్తానని తెలిపారు. కోవిడ్ తో విపత్కర పరిస్థితిల్లోనూ ఆర్టీసీ సిబ్బంది సమర్థంగా విధులు నిర్వహిస్తున్నారని ద్వారకా తిరుమలరావు అభినందించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ద్వారకా తిరుమలరావు ఇలా మాట్లాడారు. ‘‘ఆర్టీసీ ఎండీగా ప్రభుత్వం నన్ను నియమించినందుకు చాలా సంతోషపడుతున్నా. ప్రభుత్వం నాపై గురుతర బాధ్యతలు అప్పగించింది. ఆర్టీసీ సిబ్బంది సంక్షేమానికి అన్ని విధాలా కృషి చేస్తా. ఆర్టీసీ ఆర్థిక స్థితిగతులను పూర్తిగా అధ్యయనం చేస్తా. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు నా వంతు ప్రయత్నాలు చేస్తా. దీనికోసం తగిన ప్రణాళికలు రూపొందించుకుని ముందుకు వెళ్తా. ఆర్టీసీని లాభాల బాటలో నడిపేందుకు ప్రయత్నిస్తా’ అని ద్వారకా తిరుమలరావు తెలిపారు. -
గ్యాంగ్‌వార్‌పై పోలీసుల కఠిన చర్యలు..
-
గ్యాంగ్‌వార్: వారిపై నగర బహిష్కరణ వేటు
సాక్షి, అమరావతి: బెజవాడ్ గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొందరిపై నగర బహిష్కరణ వేటు పడనుంది. అలాగే గ్యాంగ్‌వార్‌కు కారకులైన మాజీ రౌడీïÙటర్ సందీప్, మణికంఠ అలియాస్ కేటీఎం పండు గ్రూపులకు చెందిన సభ్యులందరిపైనా పీడీ యాక్ట్ పెట్టనున్నారు. ఘర్షణ జరిగిన రోజు నుంచి అజ్ఞాతంలోకి వెళ్లిపోయిన 10 మంది నిందితుల కోసం పోలీసుల వేట కొనసాగుతోంది. కన్నబిడ్డను నేరాలవైపు ప్రోత్సహించిన కారణంగా పండు తల్లి కోడూరి పద్మావతిపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి రౌడీïÙట్ ఓపెన్ చేశారు. గ్యాంగ్‌వార్‌పై పోలీసుల కఠిన చర్యలు.. విజయవాడలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌ను తీవ్రంగా పరిగణించిన పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు ఇరు గ్రూపులకు చెందిన సభ్యులపై కఠిన చర్యలకు ఉపక్రమించారు. ప్రశాంతంగా ఉన్న నగరంలో కొందరు రౌడీ మూకలు యువకులతో కలిసి అలజడి రేపడాన్ని క్షమించరాని నేరంగా భావించి గ్యాంగ్‌వార్‌లో పాల్గొన్న కొందరు యువకులపై నగర బహిష్కరణ వేటు వేయాలని నిర్ణయించారు. అలాగే నిందితులందరిపైనా పీడీ యాక్ట్‌ను ఉపయోగించబోతున్నారు. ►విజయవాడ నగర పోలీసు కమిషనరేట్ పరిధిలో 417 మంది రౌడీషీటర్లు ఉన్నారు. ►శాంతిభద్రతలకు విఘాతం కలిగించే నేరగాళ్లు 497 మంది ఉన్నారు. ►ఇప్పటికే 7 మందిపై నగర బహిష్కరణ వేటు వేయడం జరిగింది. ►తాజాగా సందీప్, పండుల మధ్య జరిగిన గ్యాంగ్‌వార్ నేపథ్యంలో మరికొందరిపై నగర బహిష్కరణ వేటు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నట్లు పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. చదవండి: యువతి కోసం గుంటూరులో గ్యాంగ్ వార్ పండు తల్లిపై రౌడీషీట్.. మాజీ రౌడీషీటర్ సందీప్‌పై మణికంఠ అలియాస్ పండును దాడికి ప్రోత్సహించిన కారణంగా అతని తల్లి కోడూరి పద్మావతిని సందీప్ హత్యా నేరం కేసులో నాల్గో ముద్దాయిగా చేరుస్తూ పటమట పోలీసులు కేసు నమోదు చేసి.. రౌడీషీట్ ఓపెన్ చేశారు. గతంలో పద్మావతిపై పెనమలూరు పరిధిలో రెండు కేసులు ఉన్నాయి. ఇప్పుడు పటమట 307 ఐపీసీ సెక్షన్ కింద కేసు నమోదు అయింది. మొత్తం మూడు కేసులు నమోదు కావడంతో ఈమెపై రౌడీషీట్ ఓపెన్ చేయనున్నారు. దీంతో పెనమలూరు పోలీసుస్టేషన్ పరిధిలోనే కాకుండా నగరంలోనే మొట్టమొదటి మహిళ రౌడీషీటర్‌గా ఈమె పోలీసు రికార్డుల్లోకెక్కనుంది. అలాగే పీడీ యాక్ట్ కూడా పద్మావతిపై పోలీసులు పెట్టనున్నారు. దీంతోపాటు పద్మావతి గత చరిత్ర, ఆమె వెనుక ఎవరైనా ఉన్నారా? అన్న వివరాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు. ఒకవేళ ఆమెకు నేరప్రవృత్తి ఉన్నట్లు రుజువైతే నగర బహిష్కరణ వేటు వేయాలనే యోచనలో పోలీసులు ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బెజవాడ గ్యాంగ్‌వార్ కేసు.. సీన్ రీకన్స్ట్రక్షన్ కొనసాగుతున్న జల్లెడ.. ఇక ఈ కేసుకు సంబంధించి పరారీలో ఉన్న 10 మంది నిందితులతోపాటు సెటిల్మెంట్ల వ్యవహారంలో తలదూర్చిన మరికొందరిని అదుపులోకి తీసుకునేందుకు పోలీసుల యత్నిస్తున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి అజ్ఞాతంలో ఉన్నవారిని గుర్తించే పనిలో పోలీసులు ఉన్నట్లు తెలిసింది. సందీప్ గ్యాంగ్ సభ్యుల అరెస్ట్ అమరావతి: మాజీ రౌడీషీటర్ తోట సందీప్ గ్యాంగ్ సభ్యులను పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. పదకొండు రోజుల కిందట విజయవాడలోని పటమట తోటవారివీధిని మైదానంలో రెండు గ్రూపులు మారణాయుధాలతో దాడి చేసుకున్న సంగతి విదితమే. ఈ గ్యాంగ్‌వార్‌లో తీవ్రంగా గాయపడ్డ తోట సందీప్ మృతి చెందగా.. మరో గ్రూపునకు లీడర్‌గా ఉన్న కోడూరి మణికంఠ అలియాస్ పండు గాయాలతో గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పండు వర్గంపై దాడికి పాల్పడ్డ తోట సందీప్ వర్గానికి చెందిన 11 మందిని పటమట పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. ఈ మేరకు కమాండ్ కంట్రోల్ రూమ్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో డీసీపీ హర్షవర్థన్‌రాజు ఆ వివరాలను వెల్లడించారు. ►గ్యాంగ్‌వార్‌లో సందీప్ తరఫు పాల్గొన్న 11 మందిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించామని డీసీపీ చెప్పారు. ►వారి నుంచి రెండు పట్టా కత్తులు, ఒక నేపాల్ కత్తి, రెండు రాడ్లు, కర్ర, బేడ్లు, ఆరు బైక్‌లు స్వాధీనం చేసుకున్నామన్నారు. ►నిందితుల్లో సందీప్ సోదరుడు తోట జగదీష్ అలియాస్ బాలు, మంగళగిరికి చెందిన మేకతోటి కిరణ్‌కుమార్, ఆకురాతి వెంకట శివరఘునాథ్, పంది విజయప్రసాద్‌లు ఉన్నారు. వీరిలో కిరణ్, రఘునాథ్‌లపై మంగళగిరి పోలీసుస్టేషన్లో రౌడీషీట్లు ఉన్నాయి. ►వీరితోపాటు యర్రంశెట్టి రాము, చింతా సాంబశివరావు, చందా రామ్ నితిన్, జక్కా రత్నసాయిలు, పెనమలూరుకు చెందిన కందెల శివరామకృష్ణ, యనమలకుదురుకు చెందిన బోడా శివ, తాడిగడపకు చెందిన కన్నా సునీల్‌లు ఉన్నారన్నారు. చిన్ననాటి స్నేహితులు.. వీరిలో చాలా మంది సందీప్‌కు చిన్ననాటి స్నేహితులు కావడం, ఒకే స్కూల్లో చదువుకోవడం వల్ల ఆ పరిచయంతో పిలవగానే వీరంతా సందీప్ వెంట వచ్చారని చెప్పారు. ఈ ఘటనకు సంబంధం ఉన్నవారందరిపైనా వేట కొనసాగుతోందన్నారు. సెంట్రల్ ఏసీపీ నాగరాజురెడ్డి, పటమట, పెనమలూరు సీఐలు సురేష్‌రెడ్డి, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
గ్యాంగ్‌వార్‌లో వారి ప్రమేయం లేదు
సాక్షి, అమరావతి: కృష్ణా జిల్లా పెనమలూరు మండలం యనమలకుదురు గ్రామంలోని ఏడు సెంట్ల స్థల వివాదం పటమటలో రెండు గ్రూపుల మధ్య గ్యాంగ్‌వార్‌కు దారి తీసిందని విజయవాడ నగర పోలీసు కమిషనర్ సీహెచ్ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ ఘర్షణకు సంబంధించి ఇప్పటి వరకు13 మందిని అరెస్టు చేసినట్లు పేర్కొన్నారు. విజయవాడ పటమటలో సంచలనం సృష్టించిన గ్యాంగ్‌వార్‌కు సంబంధించిన వివరాలను పోలీసు కమిషనర్ మీడియాకు వివరించారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. ఏం జరిగిందంటే.. ►యనమలకుదురుకు చెందిన ప్రదీప్‌రెడ్డి, కానూరుకు చెందిన ధనేకుల శ్రీధర్ ఇద్దరు కలిసి యనమలకుదురులోని 7 సెంట్ల స్థలంలో రూ.1.50 కోట్ల అంచనాతో 14 ఫ్లాట్ల గ్రూప్ హౌస్ నిర్మాణం 2018లో చేపట్టారు. ►ఇందుకుగానూ ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్ మొదట రూ.40 లక్షల చొప్పున రూ.80 లక్షలు పెట్టుబడి పెట్టారు. తర్వాత ప్రదీప్‌రెడ్డి నుంచి డబ్బు ఇవ్వకపోవడంతో శ్రీధర్ మిగతా రూ.70 లక్షలు వెచ్చించి 2019లో నిర్మాణాన్ని పూర్తిచేశారు. అయితే ఇద్దరి వాటా కింద రావాల్సిన ఫ్లాట్లన్నింటినీ శ్రీధరే తన పేరిట ఉంచుకోవడంతో వివాదం మొదలైంది. ►దీంతో బట్టు నాగబాబు అలియాస్ చిన్న నాగబాబును ప్రదీప్‌రెడ్డి ఆశ్రయించి తన వాటా తనకు ఇప్పించాలని కోరాడు. మే 29న ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌లను నాగబాబు పంచాయితీకి పిలిచాడు. ►ఈ పంచాయితీకి తోట సందీప్, కోడూరి మణికంఠ అలియాస్ పండులను కూడా నాగబాబు పిలిచాడు. ►ఆ తర్వాత తాను మధ్యవర్తిత్వం చేయడానికి వెళ్లిన చోటుకి నువ్వెందుకొచ్చావు అని పండును సందీప్ ఫోన్లో నిలదీశాడు. తీవ్రస్థాయిలో బెదిరించడంతో ఇరువురు ఒకరిని ఒకరు దూషించుకున్నారు. చదవండి: పండు.. మామూలోడు కాదు! ఇంటికెళ్లి గొడవ.. ►అదేరోజు అర్ధరాత్రి ఇదే విషయంపై పండును స్వయంగా అడగడానికి తోట సందీప్, అతని సోదరుడు జగదీష్‌తోపాటు మరికొంత మంది అనుచరులతో పండు ఇంటికెళ్లి అతని తల్లితో గొడవ పడి వెళ్లిపోయారు. ►సందీప్ ఇంటికొచ్చి తన తల్లితో గొడవపడిన విషయం తెలిసి పండు 30వ తేదీన ఉదయం పటమటలో సందీప్ నిర్వహిస్తున్న శివబాలాజీ స్టీల్స్ దుకాణం వద్దకు వెళ్లి.. ఆ సందీప్ లేకపోవడంతో షాపులో ఉన్న సాగర్, రాజేష్‌ను కొట్టి గాయపరిచాడు. ►ఈ విషయం తెలుసుకున్న సందీప్ పండుకు ఫోన్ చేసి తీవ్రస్థాయిలో హెచ్చరించడంతో చివరకు ఇరువురు నువ్వెంత అంటే నువ్వెంత అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు చేసుకున్నారు. ►ఆపై సాయంత్ర 4.30 గంటల సమయంలో పటమట తోటావారి వీధిలోని గ్రేస్ చర్చ్ వద్ద గల ఖాళీ ప్రదేశంలో సందీప్, పండులకు రెండు గ్రూపులు సమావేశమయ్యారు. ►ఇరు వర్గాల మధ్య మాటామాటా పెరగడంతో పథకం ప్రకారం వెంట తీసుకెళ్లిన కారం కళ్లలో చల్లి.. కత్తులు, రాడ్లు, బ్లేడ్లు విచక్షణరహితంగా ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ►ఈ గ్యాంగ్‌వార్‌లో తోట సందీప్, కోడూరి మణికంఠలు తీవ్రంగా గాయపడగా వారి అనుచరులు వారిని ఆస్పత్రులకు తరలించారు. ►తోట సందీప్ పటమటలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 31వ తేదీ సాయంత్రం 5.50 గంటల సమయంలో మృతి చెందాడు. పండు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. ►ప్రత్యక్ష సాక్ష్యులు, సీసీ టీవీ ఫుటేజీ, సెల్‌ఫోన్ వీడియో ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించాం. ►ఈ కేసులో కొట్లాటకు ఉపయోగించిన ఆయుధాలను స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్టు చేశాం. ఈ కేసులో ఉన్నవారందరిపై రౌడీషీట్స్ తెరిచామని సీపీ స్పష్టం చేశారు. చదవండి: గ్యాంగ్‌వార్‌కు స్కెచ్ వేసింది అక్కడే! రౌడీ కార్యకలాపాలపై నిఘా.. ►గ్యాంగ్‌వార్‌కు సంబంధించి వరుసగా రెండు రోజులపాటు ఇరువర్గాల మధ్య నెలకొన్న వివాదంపై పోలీసులకు సమాచారం లేదు. కోవిడ్ విధుల్లో ఉన్న కారణంగా రౌడీషీటర్లపై నిఘా పెట్టలేదు. కౌన్సెలింగ్ కూడా ఇవ్వలేదు. ఇకపై విజయవాడలోని రౌడీషీటర్లపై నిఘా మరింత కట్టుదిట్టం చేస్తాం. అయితే ఈ గ్యాంగ్‌వార్‌కు రాజకీయ నాయకులకు సంబంధం లేదు. అయితే కొంత మంది రాజకీయ నాయకులు వీళ్లను వాడుకున్నట్లు తెలుస్తోంది. కులం, వర్గం, పారీ్టలు అని చూడకుండా తప్పుచేస్తే ఎవరినైనా శిక్షిస్తాం. రౌడీ కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపుతాం. నిందితుల వివరాలు.. రేపల్లె శ్రీనివాస్(సనత్‌నగర్), ఆకుల రవితేజ(యనమలకుదురు), పందా ప్రేమకుమార్, పందా ప్రభుకుమార్ (పటమట), బాణావత్ శ్రీను నాయక్(రామలింగేశ్వర నగర్), ఎల్ వెంకటేశ్(పటమట), బూరి భాస్కరరావు(సనత్‌నగర్), పి.సాయిప్రవీణ్ కుమార్(తోటావారి వీధి), పొన్నాడ సాయి, సిర్రా సంతో‹Ù, యర్రా తిరుపతిరావు (పటమట), ఓరుగంటి దుర్గాప్రసాద్, ఓరుగంటి అజయ్(యనమలకుదురు). స్వాధీనం చేసుకున్న ఆయుధాలు.. కొబ్బరి బొండాల కత్తి, పొడవాటి కత్తి, స్నాప్ కట్టర్, కోడి పందేలకు వినియోగించే కత్తి, ఓ రాడ్డు, ఫోల్డింగ్ బ్లేడ్లు, నాలుడు బ్లేడ్లు, మూడు బైక్‌లు. -
గ్యాంగ్ దాడిలోనే సందీప్ చనిపోయాడు
-
‘సందీప్, పండూ గతంలో స్నేహితులు’
సాక్షి, విజయవాడ: బెజవాడ గ్యాంగ్ వార్ కేసులో విచారణ పూర్తయింది. గ్యాంగ్ లీడర్ పండుతో సహా 13 మంది స్ట్రీట్ ఫైటర్స్‌ని పోలీసులు అరెస్టు చేసి శుక్రవారం మీడియా ముందు ప్రవేశపెట్టారు. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితులను గుర్తించామని.. త్వరలోనే మిగిలినవారిని కూడా అరెస్ట్ చేస్తామని విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మీడియాకు తెలిపారు. ల్యాండ్ సెటిల్మెంట్ విషయంలోనే ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగిందని ఆయన వెల్లడించారు. (గ్యాంగ్ వార్; వెలుగులోకి కొత్త విషయాలు) సీపీ తిరుమలరావు మాట్లాడుతూ.. ‘పండు గ్యాంగ్ జరిపిన దాడిలో తీవ్రంగా గాయపడిన సందీప్ చనిపోయాడు. గతంలో పండు, సందీప్ మంచి స్నేహితులు. ల్యాండ్ సెటిల్మెంట్లోనే వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయి. యనమలకుదురు స్థల వివాదంలో పండు, సందీప్‌ల మధ్య ఘర్షణ తలెత్తింది. ప్రదీప్‌రెడ్డి, శ్రీధర్‌రెడ్డి మధ్య అపార్ట్మెంట్ నిర్మాణంలో వివాదం తలెత్తింది. శ్రీధర్‌రెడ్డి నుంచి రావాల్సిన వాటా కోసం ప్రదీప్‌రెడ్డి నాగబాబును ఆశ్రయించాడు. వివాదం పరిష్కారం కోసం గతనెల 29న సందీప్, పండును పిలిపించారు. నాగబాబు, సందీప్‌లు ఉండగా.. పండు రావడం ఇరువురికి నచ్చలేదు. (పండు.. మామూలోడు కాదు!) దీంతో పండుకు వార్నింగ్ ఇవ్వాలని నిర్ణయించుకుని సందీప్ ఫోన్లో బెదిరించే యత్నం చేశాడు. సెటిల్మెంట్కు నువ్వు ఎందుకొచ్చావంటూ నిలదీశాడు. 29న అర్థరాత్రి పండు ఇంటికెళ్లి సందీప్ బెదిరించాడు. ఆ తర్వాత 30న ఉదయం పండు అనుచరులు సందీప్ షాపుకు వెళ్లారు. సందీప్ షాపులో ఉన్న అనుచరుడిని పండు గ్యాంగ్ కొట్టింది. మాట్లాడుకుందాం అని పిలుచుకుని.. 30వ తేదీ సాయంత్రం ఇరువర్గాలు కొట్టుకున్నాయి. పోలీసులు వెళ్లేసరికి చాలామంది గాయపడి ఉన్నారు. నిందితుల కోసం 6 బృందాలుగా ఏర్పడి గాలించాం. గ్యాంగ్ వార్‌లో వాడిన ఆయుధాలను స్వాధీనం చేసుకున్నాం. విజయవాడలో ఘర్షణ వాతావరణానికి ప్రయత్నిస్తే కఠిన చర్యలు తప్పవు’అని కమిషనర్ హెచ్చరించారు. (చదవండి: గ్యాంగ్‌వార్ కేసు కొలిక్కి!) -
సీఎం జగన్ నిర్ణయం.. వాహనదారులు హర్షం
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇచ్చే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను సీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భౌతిక దూరం పాటించాలని వాహనదారులకు సీపీ సూచించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల వాహనదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పంపిణీ ప్రక్రియలో విధులు నిర్వహించే పోలీసులను పీపీఈ కిట్లు ధరించాలని ఆయన కోరారు. (సీఎం వైఎస్ జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు) అపరాధ రుసుము లేకుండానే వాహనాలను ఇస్తున్నామని చెప్పారు. తిరిగి తప్పు చేయకుండా వాహనదారుల నుంచి బాండ్స్ రూపంలో పూచీకత్తు తీసుకుంటున్నామని వెల్లడించారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద సీజ్ చేసిన వాహనాలకు చలానా ఇచ్చి పంపుతున్నామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కొనసాగుతాయని.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. -
ఫైన్ లేకుండా వాహనాలు విడుదల
సాక్షి, విజయవాడ: కరోనా కట్టడిలో భాగంగా విధించిన లాక్డౌన్లో నిబంధనలు ఉల్లఘించి పట్టుబడిన వాహనాలకు విముక్తి లభించింది. లాక్డౌన్లో సీజ్ చేసిన వాహనాలను వదిలేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన ఆదేశాలు శరవేగంగా అమలవుతున్నాయి. అపరాధ రుసుము లేకుండానే పోలీసులు వాహనాల యజమానులకు ఇచ్చేస్తున్నారు. ఇటువంటి తప్పు మళ్లీ చేయకుండా వాహనదారుల నుంచి బాండ్ రూపంలో పూచికత్తు తీసుకుంటున్నారు. అదే విధంగా మోటార్ వెహికిల్ యాక్టు కింద సీజ్ చేసిన వాహనాలకు నామమాత్రపు ఫైన్ వసూల్ చేస్తున్నారు. విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు ఆదేశాలతో ఆదివారం పలు వాహనాలను పోలీసులు విడుదల చేశారు. పోలీసు స్టేషన్ వద్ద భౌతిక దూరం పాటిస్తూ యజమానులు తమ వాహనాలను తీసుకుంటున్నారు. సీఎం వైఎస్ జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల సర్వత్రా హర్షం వ్యక్తం చేశారు. ఫైన్ లేకుండా వాహనాలను తిరిగి ఇవ్వటం ఆనందంగా ఉందంటూ వాహనాల యజమానులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు యధావిధిగా కొనసాగుతాయని తెలిపారు. సిటీలో కంటైన్మెంట్ జోన్లలో తప్ప మిగిలిన చోట్ల దుకాణాలు తెరుచుకోవచ్చుని ఆయన చెప్పారు. కంటైన్మెంట్ జోన్లు కాని చోట కొత్తగా కరోనా కేసులు వస్తే ఆంక్షలు విధిస్తామని ఆయన పేర్కొన్నారు. రాత్రి ఏడు గంటల నుంచి ఉదయం ఏడు గంటల వరకు కర్ఫ్యూ కొనసాగుతుందని సీపీ తెలిపారు. రంజాన్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు తమ ఇంటి వద్దనే పండగ జరుపుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. కరొనా వ్యాప్తిని అడ్డుకొనేందుకు సహకరించాలని సీపీ ద్వారకా తిరుమలరావు కోరారు. -
కరోనా కేసులు వస్తే ఆంక్షలు విధిస్తాం
-
'మేము లాఠీలు వాడలేదు, వాడటం లేదు'
సాక్షి, విజయవాడ: పటమటలో బెంగాల్‌కు చెందిన వలస కార్మికులపై పోలీసులు లాఠీ చార్జ్ చేశారన్న ఆరోపణలను నగర సీపీ ద్వారకా తిరుమలరావు తోసిపుచ్చారు. ఈ ఘటనపై ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వలస కూలీలకు పోలీసుల తరుపున బాసటగా నిలుస్తున్నాం. వారికి పోలీస్ శాఖ తరపున మాస్క్‌లు, శానిటైజర్లు, చెప్పులు, పౌష్టిక ఆహారాన్ని అందజేస్తున్నాం. కమిషనరేట్ పరిధిలో వలస కూలీల కోసం మూడు సహాయక శిబిరాలను ఏర్పాటు చేశాము. పటమటలో పశ్చిమబెంగాల్ రాష్ట్రానికి చెందిన వారు స్వస్థలాలకు వెళ్లడానికి రిజిష్టర్ చేసుకున్నారు. అక్కడ వారిని కొందరు కావాలనే రెచ్చగొట్టారు. వారికి తగిలిన దెబ్బలు కొట్టినవి కాదు. మేము లాఠీలు వాడలేదు, వాడటం లేదని' వివరణ ఇచ్చారు. కాగా రాజకీయ పక్షాలు లాక్డౌన్ టైమింగ్స్ పాటించాలని కోరారు. లేదంటే చట్టంద్వారా సమాధానం చెప్పడం మాకు తెలుసు. చట్ట పరంగానే ముందుకు వెళ్తాం. రెచ్చగొట్టే ప్రయత్నం చేసి అరెస్టయిన వారిని కోర్టులో హాజరుపరుస్తాం. కొత్త సడలింపుల ప్రకారం చట్టపరంగానే ముందుకు వెళ్తామని' విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమల రావు వివరణ ఇచ్చారు. చదవండి: 'ఆ విషయం కృష్ణా జిల్లాలో అందరికీ తెలుసు' -
డబ్బులు వసూలు చేసిన పోలీసుల సస్పెన్షన్
సాక్షి, విజయవాడ : వాహనదారుల వద్ద డబ్బులు వసూలు చేస్తున్న పోలీసులపై సీపీ ద్వారకాతిరుమల రావు కొరడా ఝలిపించారు. వైవీ రావు జంక్షన్ వద్ద చేతివాటం ప్రదర్శించిన వన్ టౌన్ ట్రాఫిక్, టు టౌన్ కానిస్టేబుళ్లపై సస్పెన్షన్ వేటు వేశారు. శాఖాపరమైన విచారణకు సీపీ ఆదేశించారు. డబ్బుల వసూలు వెనక ఎవరి ప్రోద్బలమున్నా చర్యలు తీసుకొంటామని సీపీ ద్వారకాతిరుమల రావు హెచ్చరించారు. -
కార్మిక నగర్లోనే అత్యధిక కరోనా కేసులు: సీపీ
సాక్షి, విజయవాడ: మీ భద్రత మా బాధ్యత దయచేసి మీరు ఇళ్లకు పరిమితం అవ్వండి అంటూ సిటీ పోలీసు కమిషనర్ ద్వారక తిరుమలరావు జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. విజయవాడలోని రెడ్జోన్లలో సీపీ బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... అనవసరంగా రోడ్లపై తిరిగితే కేసులు నమోదు చేసి క్వారంటైన్‌కు తరలిస్తామని హెచ్చారించారు. (‘వైరస్ అంటే దోమలపై యుద్ధం, ఎలుకలు పట్టడం కాదు’) కార్మిక నగర్లోనే అత్యధికంగా 35 కేసులు నమోదయ్యాయని చెప్పారు. రెడ్‌జోన్ ప్రాంతంలో లోపలి వారు బయటకు రాకుండా బయట వారు లోపలికి వెళ్లడం నిషేధమన్నారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లఘింగిస్తే కఠిన శిక్షలు తప్పవని, కేసులను ఆషామాషిగా తీసుకుంటే భవిష్యత్తులో ఇబ్బంది పడతారని హెచ్చిరించారు. కాగా ప్రతిరోజు నగరంలో రెడ్‌జోన్ ప్రాంతాల్లో కవాతు నిర్వహించి అవగాహన కల్పిస్తామని చెప్పారు. లాక్డౌన్లో అందరూ ఇంట్లొనే ఉండి కరోనా కట్టడికి ప్రతీ ఒక్కరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
ఒక్కో వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్: కృష్ణా కలెక్టర్
సాక్షి, విజయవాడ : నగరంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య బాగా పెరుగుతున్నాయని, ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని కృష్ణా జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ విజ్ఞప్తి చేశారు. ప్రజలు నిర్లక్ష్యంతో ఉంటే ప్రభుత్వం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్న వృధానే అవుతుందన్నారు. ఆదివారం ఆయన సీపీ ద్వారకా తిరుమలరావుతో కలిసి కృష్ణలంక ప్రాంతాలలో పర్యటించారు. అనంతరం కలెక్టర్ ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ.. కృష్ణలంక, కార్మిక నగర్, ఖుద్ధూస్ నగర్ ప్రాంతాలలో కరోనా పాజిటివ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయని తెలిపారు. ఈ ప్రాంతాలలో సామూహిక సమావేశాలు పెట్టడం వల్లే కరోనా వైరస్ వ్యాప్తి చెందినట్లు చెప్పారు. ఒక్కోక్క వ్యక్తి ద్వారా 20 మందికి వైరస్ సోకిందని విచారణలో తేలిందన్నారు. జిల్లా వ్యాప్తంగా 7,500 మందికి కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు నిర్వహిస్తే.. 170 మందికి పాజిటివ్ వచ్చిందన్నారు. తాము చర్యలు తీసుకున్నా.. ప్రజలు జాగ్రత్తలు పాటించడంలేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రజలు ఆలోచించి స్వీయ నియంత్రణ పాటించాలని విజ్ఞప్తి చేశారు. (ఏపీలో మరో 81 కరోనా పాజిటివ్ కేసులు) ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తే ఊరుకోం లాక్డౌన్ వేళ ఇష్టం వచ్చినట్లు బయటకు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ ద్వారాకా తిరుమలరావు హెచ్చరించారు. బాధ్యతరాహిత్యంగా వ్యవహరించిన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కృష్ణలంక ప్రాంతంలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి ప్రజల రాకపోకలపై పర్యవేక్షణ చేస్తున్నామని తెలిపారు. అంతర్గత మార్గాలలో ప్రజల రవాణాపై డ్రోన్ కెమెరాలతో నిఘా పెడతామని చెప్పారు. కరోనా పాజిటివ్ కేసులు పెరిగేకొద్దీ పోలీసులు చర్యలు తీవ్రంగా ఉంటాయన్నారు. లాక్డౌన్ నిబంధనలు అందరూ పాటించాలని, అతిక్రమిస్తే కఠిన శిక్షలు తప్పవని హెచ్చరించారు. (అవును.. మేము కరోనాపై గెలిచాం) -
బెజవాడ వాసులను బెంబేలెత్తిస్తున్న కరోనా
-
తాజా కేసులన్నీ హాట్ స్పాట్ల నుంచే వచ్చాయి
-
ఇల్లే రక్షణ కవచం
-
‘విజయవాడలో కొత్తగా 25 కరోనా పాజటివ్ కేసులు’
సాక్షి, విజయవాడ: జిల్లాలో కొత్తగా 25 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని పోలీసు కమీషనర్ ద్వారకా తిరుమల రావు తెలిపారు. శుక్రవారం జిల్లాలోని రెడ్‌జోన్ ప్రాంతాలలో పర్యటించి అక్కడి పరిస్థితులను పరిశీలించారు. పాత రాజరాజేశ్వరి పేటలో పాజిటివ్ కేసులు పెరగకుండా పటిష్టమైన నియంత్రణ చర్యలు చేపట్టాలని సబ్బందిని ఆదేశించారు. ఇక నమోదైన 25 కరోనా పాజిటివ్ కేసులలో నలుగురు విదేశాల నుంచి రాగా వారి ద్వారా మరొకరికి కరోనా సోకినట్లు వెల్లడించారు. మరో 17 కేసులు ఢిల్లీ సమావేశంలో పాల్గొన్న వారు కాగా.. మిగిలిన ముగ్గురు ఇతర మార్గాలతో పాజిటివ్ వచ్చిందని చెప్పారు. జిల్లాలో కేసులు ఎక్కువగా వచ్చిన ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. (మా చేతగాని తనంగా తీసుకోవద్దు: సీపీ) భవానీ పురం, సనత్ నగర్, బుద్దూస్ నగర్, రాణిగారి తోట, పాయకాపురం, పాత రాజరాజేశ్వరి పేట ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించి పూర్తిగా రాకపోకలు నిషేధించినట్లు ఆయన తెలిపారు. ఇక మిగతా ప్రాంతాలలో ఉదయం నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిత్యావసర వస్తువుల కొనుగోళ్లకు అనుమతించినట్లు సీపీ పేర్కొన్నారు. అయితే రెడ్‌జోన్ ప్రాంతాలలో భోజనం, ఇతర తినే పదార్థాలు పంపిణి చేసే వారు ముందస్తు అనుమతి తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. ఇందుకోసం ముందుగానే ఎంత ఫుడ్ అనేది కార్పొరేషన్ కార్యాలయంలో కంట్రోల్ రూంకి సమాచారం ఇస్తే.. ప్రాంతాల వారీగా పంపిణీకి అనుమతిస్తామన్నారు. రెడ్‌జోన్ పరిధిలో పెద్దలు అందరూ కలిసి కమిటీలు ఏర్పాటు చేసుకుని.. నిర్ణయాలు తీసుకోవచ్చని, వారి ద్వారా అధికారుల దృష్టి తీసుకు వస్తే రాకపోకలు నియంత్రణపై నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని తెలిపారు. ఇక కరోనా పాజిటివ్ కేసులు పెరగకుండా ప్రజలు కూడా ప్రభుత్వానికి సహకరించాలని పిలుపునిచ్చారు. -
మా చేతగాని తనంగా తీసుకోవద్దు: సీపీ
సాక్షి, విజయవాడ: అరగంటలో పరిస్థితిని అదుపులోకి తీసుకొనే శక్తిసామర్ద్యాలు పోలీసులకు ఉన్నాయని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. పోలీసుల శాంత స్వభావాన్ని చేతగానితనంగా భావిస్తే చర్యలు తీసుకోవగడం తప్పదని హెచ్చరించారు. ఆ పరిస్థితి తెచ్చుకోకుండా ఇంటిపట్టునే ఉండి ప్రజలు ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని సూచించారు. మొత్తం ఢిల్లీ వెళ్లిన వారు 35 మంది ఉండగా వారిలో ఏడుగురికి కరోనా వైరస్ పాజిటివ్, వారితో కాంటాక్ట్ అయిన 10 మందికి కరోనా సోకిందన్నారు. ఢిల్లీ వారితో ప్రైమరీ, సెకండరీ కంటాక్టు అయిన 830 మందిని గుర్తించామన్నారు. వీరందర్ని గృహ నిర్బంధంలో ఉంచి నిఘాపెట్టటం జరిగిందన్నారు. శాంతిభద్రతల పరిరక్షణ కంటే పెద్ద సవాల్‌ని ఎదుర్కొంటున్నామని చెప్పారు. సంయమనంతో ప్రజారోగ్యాన్ని కాపాడే పనిలో ఉన్నామని మాటవినకుండా మొండికేస్తే కన్నెర్ర చేయక తప్పదంటున్నారు. (ఏపీలో తగ్గుముఖం పట్టిన కరోనా కేసులు) సీపీ గురువారం బెజవాడ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో సేఫ్టీ టెన్నెల్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ... ‘ఈ టన్నెల్ మధ్య నుంచి నడవటం వల్ల వైరస్ పోతుంది. ఒక్కో టన్నెల్ లక్షన్నర వ్యయం అవుతుంది. అయితే అన్ని పోలీస్ స్టేషన్లలో ఇలా పెట్టడం కష్టం. అందుకే మా టెక్నీకల్ సిబ్బంది తయారు చేసిన మోడల్‌తో పాటు, ఫంక్షన్లలో పెర్ఫ్యూమ్ కొట్టే యంత్రాలను ఏర్పాటు చేస్తున్నాం. పోలీస్ సిబ్బందికి మాస్క్‌లు, శానిటైజర్స్‌తో కూడిన కిట్స్ ఇస్తున్నాం. బెజవాడ కమిషనరేట్ పరిధిలో ఉదయం 6 గంటల నుంచి 9 గంటల వరకూ మాత్రమే నిత్యావసర వస్తువులు కొనుగోలు చేసే సమయం. (ప్రతి తలుపూ తట్టండి: సీఎం జగన్) అలాగే నగరంలో ఆరు రెడ్ జోన్లుగా నిర్ణయించాం. భవనీపురం, పాత రాజరాజేశ్వరి పేట, రాణిగారితోట, ఖుద్దుస్ నగర్, పాయకాపురం, సనత్ నగర్లో రెడ్ జోన్లు అమలు చేస్తున్నాం. ఈ రెడ్జోన్లలో ఉదయం ఆరు నుంచి తొమ్మిది గంటల వరకూ కూడా ఎవరూ బయటకు రావడానికి అనుమతి లేదు. రెడ్ జోన్లలో మున్సిపల్ సిబ్బంది ద్వారా, వాహనాల ద్వారా నిత్యావసర వస్తువులు ఇంటింటికి పంపుతాం. ప్రజా ప్రతినిధులు, రాజకీయ నాయకులు కూడా నిత్యావసర వస్తువుల పంపిణీకి దూరంగా ఉండాలి. అనుమతి తీసుకుని మాత్రమే పంపిణీ చేయాలి. నిబంధనలు అతిక్రమిస్తే ఏ రాజకీయ పార్టీలో ఉన్నా వారిపై చర్యలు తప్పవు. కొందరు సామాజిక దూరం పాటించడం లేదని మా దృష్టికి వచ్చింది. నిత్యావసర వస్తువులను ఇప్పటికే ప్రభుత్వం పంపిణీ చేస్తోంది. (వేగంగా మూడో విడత సర్వే) ఢిల్లీలో ప్రార్థనలకు వెళ్లిన ఓ యువకుడు తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్ల ఆ కుటుంబంలో మొత్తం ఏడుగురికి కరోనా సోకింది.. ఆ తర్వాత యువకుడు తన తండ్రిని కూడా కోల్పోవాల్సి వచ్చింది. మరోవైపు ప్యారిస్ నుంచి విజయవాడకు వచ్చిన ఓ విద్యార్థి హోం ఐసోలేషన్‌లో ఉండగా.. అతడికి జ్వరం రావడంతో నేరుగా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. రక్త పరీక్షలు చేయగా పాజిటివ్ అని తేలింది. క్వారంటైన్లో చేరాడు. అతని తల్లిదండ్రులిద్దరికీ నెగటివ్ వచ్చింది. ఈ రెండు కేసుల్లో జాగ్రత్తలు తీసుకోవడం.. తీసుకోకపోవడం వల్ల జరిగిన లాభనష్టాలను ప్రజలందరూ గుర్తించాలి.’ ‘మీ భద్రత.. మా బాధ్యత కనుక చేతులెత్తి విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రజలందరూ లాక్డౌన్ నిబంధనల్ని పాటించండి. కాదంటే కఠిన చర్యలు తీసుకుంటాం..’ అని నగర పోలీసు కమిషనర్ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. (మానవత్వాన్ని చాటుకుంటున్న సామాన్యులు) -
బెజవాడలో జరగడం బాధాకరం: సీపీ
సాక్షి, విజయవాడ : విజయవాడలో మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయని నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. అందులో 11 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్నవారేనని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం కరోనా పాజిటివ్ సోకి మృతిచెందిన వ్యక్తి ప్రాంతాన్ని సీపీ పరిశీలించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్లోని ప్రజల్లో ధైర్యం నింపేందుకు కమిషనర్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి కరోనా మరణం విజయవాడలో జరగడం బాధాకరమన్నారు. ముందుగానే హెచ్చరించామని, అయినా వారు పట్టించుకోకపోవటం, అతనికి ఇతర వ్యాధులు ఉండటంతో మరణించాడని సీపీ పేర్కొన్నారు. (కరోనాతో హిందూపూర్ వాసి మృతి) కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన కుమ్మరిపాలెం సెంటర్‌కు చెందిన వ్యక్తితోపాటు కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వ్యక్తి తండ్రి చనిపోయారన్నారు. తాను ఎవరిని తప్పు పట్టడం లేదని, ఢిల్లీ సదస్సుకు వెళ్లొచ్చిన వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని, మిగతావారు కూడా ముదుకు రావాలని కోరారు. మీరు, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని సీపీ తెలిపారు. విజయవాడ కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించామని, మరికొన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించామని పేర్కొన్నారు. (కరోనా: పాజిటివ్ వ్యక్తి విందులో 1500 మంది!) -
‘లాక్‌డౌన్‌ను ఉల్లంఘిస్తే కఠిన చర్యలు’
సాక్షి, విజయవాడ: ప్రజారోగ్యం కోసమే లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేస్తున్నామని విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు అన్నారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. నగరంలో అనవసరంగా రోడ్లపై తిరిగే వారిపై 77 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. కరోనా నియంత్రణ కోసమే కఠినంగా వ్యవహరిస్తున్నామని చెప్పారు. లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని సీపీ హెచ్చరించారు. అందరూ ఇంట్లోనే ఉండి ఉగాది జరుపుకోవాలని సూచించారు. విజయవాడ నగరంలోకి ఇతర జిల్లాల వాహనాలు రాకుండా చెక్‌పోస్టులు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. అత్యవసరమయితే తప్ప వాహనాలు అనుమతించేది లేదని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. (కరోనా ఎఫెక్ట్: అనుకున్నట్లే వాయిదా పడింది..) -
అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు
సాక్షి, కృష్ణా: జిల్లాలోని ఉయ్యూరు మండలం కాటూరులో గత మంగళవారం ఓ ఇంట్లో చొరబడి బీభత్సం చేసిన అంతర్రాష్ట్ర దొంగలముఠా గుట్టురట్టు చేసినట్లు సీపీ ద్వారాకా తిరుమలరావు తెలిపారు. వారం రోజుల వ్యవధిలో ఆ దొంగల బ్యాచ్‌లోని నలుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని ఆయన తెలిపారు. పరారీలో ఉన్న మరో ఇద్దరు ముఠా సభ్యుల కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు. నిందితులను మీడియా ముందు ప్రవేశపెట్టి సీపీ ద్వారాకా తిరుమల రావు మాట్లాడుతూ.. దోపిడి సమయంలో దొంగలు ఒరియా భాషలలో మాట్లాడినట్లు తెలిసిందన్నారు. అదేవిధంగా పట్టుబడిన నిందితులు దోపిడి దొంగతనాల్లో ఆరితేరిన పెద్దింటి గొల్లలుగా పోలీసులు గుర్తించారు. గుంటూరు జిల్లా నుంచి ఏడాది క్రితం కృష్ణా జిల్లా బొడ్డుపాడుకి ఈ పెద్దింటి గొల్లలు మకాం మార్చారని తెలిపారు. అపహరించిన సొమ్మును ఆ ముఠా నుంచి పోలీసులు స్వాదీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ కేసును చాలెంజ్‌గా తీసుకొని రోజుల వ్యవధిలోనే చేధించిన సిబ్బందికి సీపీ ద్వారకా తిరుమలరావు అభినందనలు తెలిపారు. -
అంతరాష్ట్ర దొంగల ముఠా సంచలనం
సాక్షి, కృష్ణా: ఉయ్యూరు మండలంలో అంతర్ రాష్ట్ర దొంగల ముఠా కలకం సృష్టించింది. మంగళవారం ఓ ఇంట్లోకి చొరబడి మరణాయుధాలతో బెదించించి చోరీకి పాల్పడిన ఘటన కాటూరు గ్రామంలో చోటు చేసుకుంది. ఒక ఇంట్లో చోరికి ప్రణాళికతో వచ్చిన దొంగ మరో ఇంట్లోకి ప్రవేశించినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటన స్థలానికి చేరుకున్న సీపీ తిరుమలరావు బాధితుడు ఆరేపల్లి రజినిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ క్రమంలో దుండగులు ఒరిస్సా భాషలో మాట్లాడినట్లు బాధితుడు తెలిపాడు. కాగా క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌తో రంగంలోకి దిగి ఆధారాలు సేకరిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఇక ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్వాప్తు చేస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. -
సీఎం జగన్ నిర్ణయం చారిత్రాత్మకం
-
దేశంలోనే తొలిసారిగా..
సాక్షి, విజయవాడ: మహిళలు, చిన్నారులపై జరుగుతున్న అత్యాచారాలను అరికట్టేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చరిత్రాత్మకమైందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. శనివారం ‘దిశ చట్టం’పై సీఎం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ అనంతరం మీడియాతో సీపీ మాట్లాడుతూ.. దేశంలోనే తొలిసారిగా ఏపీ లో ‘దిశ’ చట్టం అమలుకాబోతోందని తెలిపారు. సీఎం ప్రారంభించిన దిశ పోలీస్ స్టేషన్ నూతన ఒరవడికి అద్దం పట్టేలా రూపొందించటం జరిగిందన్నారు. త్వరలోనే విజయవాడలో కూడా ఆధునిక హంగులతో దిశ పోలీస్‌స్టేషన్‌ను ప్రారంభిస్తామని వెల్లడించారు. దిశ పీఎస్‌లో డీఎస్పీ పర్యవేక్షణలో ఐదుగురు ఎస్ఐలతో సహా 47 మంది సిబ్బంది నిరంతరం అందుబాటులో ఉంటారని సీపీ పేర్కొన్నారు.(ల్యాబ్స్ కోసం రూ. 31 కోట్లు: సీఎం జగన్) -
బందరు రోడ్డులో ర్యాలీకి అనుమతి లేదు
-
అనుమతి లేని ర్యాలీలో ఎవరూ పాల్గొనవద్దు
సాక్షి, విజయవాడ: నేడు బందర్ రోడ్డులో జరగనున్న ర్యాలీకి ఎలాంటి అనుమతి లేదని పోలీసులు స్పష్టం చేశారు. చట్టాన్ని అతిక్రమించి సాధారణ జనానికి ఇబ్బందులు కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శుక్రవారం విజయవాడలో సిటీ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. బందర్ రోడ్డులో విద్య, వైద్య, వ్యాపార అవసరాల కోసం ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారన్నారు. పైగా బందర్ రోడ్డుకు ఆనుకుని ఫ్లైఓవర్ నిర్మాణ పనులు జరుగుతున్నందున ర్యాలీ తీస్తే మరింత ఇబ్బంది ఎదురవుతుందని పేర్కొన్నారు. జనజీవనానికి ఇబ్బంది కలగకుండా చేసే ప్రజా ఉద్యమాలకు పోలీసు శాఖ సహకరిస్తుందని సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ర్యాలీలకు అనుమతిచ్చిన రోడ్డులో నిరసనలు తెలిపితే ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే ప్రజలకు ఇబ్బంది కలిగించే నిరసనలకు మాత్రం ఎలాంటి అనుమతి ఉండదన్నారు. బందర్ రోడ్డులో జరిగే అనుమతి లేని ర్యాలీలో ఎవరూ పాల్గొనవద్దని హెచ్చరించారు. బెజవాడలో సెక్షన్ 144, పోలీస్ యాక్ట్ 30 అమలులో ఉన్నాయన్నారు. కాగా అమరావతి పరిరక్షణ సమితి, జాయింట్ యాక్షన్ కమిటీ శుక్రవారం బందర్ రోడ్డులో ర్యాలీ తలపెట్టిన విషయం తెలిసిందే. చదవండి: నీకెందుకు డబ్బులు వేయాలి? -
‘2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించాం’
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో తొలిసారి విజయవాడ రూరల్‌లో ఉన్న పోలీసు స్టేషన్‌కు టెక్నాలజీని సమర్థవంతంగా నిర్వహిస్తున్నందుకు ఐఎస్ఓ సర్టిఫికెట్ వచ్చిందని విజయవాడ పోలీసు కమిషనర్ ద్వారకాతిరులమరావు తెలిపారు. 2019 వార్షిక మీడియా సమావేశాన్ని సీపీ ద్వారకాతిరుమలరావు సోమవారం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. 2019లో శాంతి భద్రతలను సమర్థవంతంగా నిర్వర్తించామన్నారు. అదేవిధంగా ఎన్నికల నిర్వహణ సంతృప్తినిచ్చిందని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రితోపాటు ప్రముఖుల ప్రమాణస్వీకారాల నిర్వహణను సమర్థవంతంగా నిర్వహించామని సీపీ ద్వారకా తిరుమలరావు పేర్కొన్నారు. పదేళ్ల తరువాత కృష్ణానదికి వరద వచ్చిందని.. దాన్ని కూడా సమర్థవంతంగా ఎదుర్కొన్నామని ఆయన తెలిపారు. 2019లో ఎఫ్ఐఆర్ నమోదులు తగ్గాయని.. బైండోవర్ కేసులు పెరిగాయని వెల్లడించారు. కిడ్నాప్ కేసులు 25 శాతం, హత్యాయత్నం కేసులు 52 శాతం, దాడుల కేసులు 24 శాతం, ప్రాపర్టి అఫెన్స్ కేసులు 18 శాతం, వరకట్నం కేసులు 45 శాతం తగ్గాయన్నారు. దొంగతనం కేసులు 21 శాతం, మర్డర్ కేసులు 19 శాతం, గృహహింస కేసులు 11 శాతం పెరిగాయని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. వీటితోపాటు పోక్సో కేసులు 2018లో 95 కేసులు, 2019లో 67 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ కేసులు, ఘరానామోసాలు తగ్గాయన్నారు. కాగా, 2018లో 498 కేసులు, 2019లో 463 కేసులు నమోదయ్యాయని ఆయన తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులు పెరిగాయని.. 2018లో 191, 2019లో 242 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. సైబర్ క్రైమ్ కేసులో ప్రాపర్టీ రికవరీ గత ఏడాదితో పొలిస్తే ఈ ఏడాది ఎక్కవగా చేశామన్నారు. మిస్సింగ్ కేసులు తగ్గాయని 2018లో 788, 2019లో 624 కేసులు నమోదు చేశామన్నారు. ఆపరేషన్ ముస్కాన్‌లో భాగంగా 199 మంది మగపిల్లల్ని, ఐదుగురు ఆడపిల్లలను గుర్తించామని సీపీ వెల్లడించారు. రోడ్డు ప్రమాదాలు తగ్గంచగలిగామని.. 2018లో 1,483 కేసులు, 2019లో 1,376 కేసులు నమోదయ్యాయని సీపీ తెలిపారు. 2019 టాస్క్ ఫోర్స్ కేసుల్లో కీలకమైనవి.. క్రికెట్ బెట్టింగ్, నకిలీ బంగారం, విదేశి సిగిరెట్లు, డ్రగ్స్, నకిలి సర్టిఫికెట్స్ కేసులని ఆయన పేర్కొన్నారు. కిడ్నాప్‌తో పాటు అత్యాచారం, మిస్సింగ్ లాంటి చాలా కీలకమైన కేసులను 2019లో చేధించగలిగామని సీపీ ద్వారకాతిరుమల రావు పేర్కొన్నారు. క్రైమ్ స్పాట్ వాహనాలు ప్రారంభించామని.. సైబర్ మిత్ర పేరుతో పలు అవగాహన కార్యక్రమాలు చేపట్టామమని సీపీ తెలిపారు. గడిచిన ఆరునెలల్లో 2,968 స్పందన పిటిషన్లు వచ్చాయని.. 2,961 పిటిషన్లను పరిష్కరించామన్నారు. కేవలం 7 పిటిషన్లు మాత్రమే పెండింగ్‌లో ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. 379 పిటిషన్లపై ఎఫ్ఐఆర్లు నమొదు చేశామన్నారు. రూ.10 కోట్లతో మాచవరం, ఉయ్యూరు, కంకిపాడు పోలీసు స్టేషన్లను నిర్మించామని అయన పేర్కొన్నారు. రూ.2.75 కోట్లతో కృష్ణలంక, భవానిపురం, సత్యనారాయణపురంలో పోలీసుల స్టేషన్ల భవన నిర్మాణం జరగుతుందన్నారు. డయిల్ 100కు 3,06,036 కాల్స్ వచ్చాయని.. 72,889 కాల్స్ మాత్రమే నిజమైనవని, మిగిలిన 2,33,147 కాల్స్ ఆకతాయిలు చేసిన నకిలీవి వచ్చాయని సీపీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. -
‘విజయవాడలో తెల్లవారుజాము వరకు డ్రంక్ అండ్ డ్రైవ్’
సాక్షి, విజయవాడ : న్యూ ఇయర్ వేడుకల్లో ఎటువంటి అపశృతి జరగకుండా ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా కొన్ని అంక్షలు విధించారు. నగరంలో నూతన సంవత్సర వేడుకలకు రాత్రి 12.30 గంటల వరకే అనుమతి ఉంటుందని విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేటు ప్రోగ్రామ్స్‌కు తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలన్నారు. అశ్లీల నృత్యాలు, అసాంఘిక కార్యక్రమాలు నిర్వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. మహిళలు, యువతులపై వేధింపులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్లపై కేక్ కటింగ్స్ కార్యక్రమాలు చేయరాదని సూచించారు. అవాంఛనీయ ఘటనలు జరగకుండా చెక్కింగ్ పాయింట్స్ ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. జౌటర్ రింగ్ రోడ్స్ మూసివేస్తున్నట్టు ప్రకటించారు. 31వ తేదీ అర్ధరాత్రి నుంచి 1వ తేదీ తెల్లవారుజామున 4 గంటలకు వరకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్‌లు నిర్వహిస్తామని వెల్లడించారు. ప్రతి ఒక్కరు నిబంధనలు పాటించి న్యూ ఇయర్ వేడుకలను సంతోషంగా జరుపుకోవాలని కోరారు. -
12 ఏళ్ల వేదన.. 12 గంటల్లో సాంత్వన
ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణ ఇది.. తప్పిపోయిన బిడ్డ కోసం ఆ తండ్రి వెతకని చోటు లేదు.. తిరగని ఊరు లేదు.. చివరికి ఉద్యోగాన్ని సైతం వదిలేసి వెతుకుతూనే ఉన్నాడు.. ఫలితం లేదు. అయినా ఆ తండ్రి కన్నీటి తెరలమాటున మిణుకు మిణుకుమంటున్న చిన్న ఆశ.. ఎప్పటికైనా తన బిడ్డ దొరుకుతుందని.. ఎక్కడున్నా తన గారాలపట్టీ తన చెంతకు చేరుతుందని. మంగళవారం అదే జరిగింది.. తమిళనాడు మధురైలో ఉన్న ఆ బిడ్డ విజయవాడ వచ్చి.. తన తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కోవాలంటూ సోమవారం ‘స్పందన’లో విజ్ఞప్తి చేసింది.. 12 గంటల వ్యవధిలోనే పోలీసులు ఆమె తల్లిదండ్రుల ఆచూకీ కనుగొన్నారు.. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఆ తండ్రి చెంతకు ఆమెను చేర్చారు.. సాక్షి, అమరావతిబ్యూరో : మంగళగిరి లక్ష్మీనారాయణ.. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు. 2007 మార్చి 12న మతిస్థిమితం లేని ఆయన కుమార్తె ఆదిలక్ష్మి(13) తప్పిపోయింది. చుట్టుపక్కల వెతికినా, బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో మార్చి 19న గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. విధులు నిర్వర్తిస్తూనే కుమార్తె కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విధులకు సరిగా రావడం లేదంటూ ఉన్నతాధికారుల మందలింపులు పెరగడం, తన బిడ్డ కేసును పోలీసులు సైతం సరిగా దర్యాప్తు చేయడం లేదన్న ఆవేదనతో ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటి నుంచి ఎప్పటికైనా తన కుమార్తె ఇంటికి రాకపోతుందా.. అనుకుంటూ నిరీక్షిస్తున్నారు. ‘స్పందన’కు చేతులెత్తి మొక్కుతున్నా.. తప్పిపోయిన నన్ను ఓ మహిళ చెన్నైకు తీసుకెళ్లి రూ.500కు మధురిక అనే మహిళకు అప్పగించింది. ఆమె నన్ను కన్న కూతురులానే పెంచి పెళ్లి చేసింది. కొన్నాళ్లకు నా భర్త చనిపోయాడు. తర్వాత నన్ను కాంచీవనం పెళ్లి చేసుకున్నాడు. మేం ఇద్దరం మధురైలో ఉంటున్నాం. కొన్నాళ్లుగా నాకు నా తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు. ఇదే విషయాన్ని నా భర్తకు చెప్పా. నా బాధను అర్థంచేసుకున్న ఆయన నన్ను విజయవాడ తీసుకొచ్చారు. సోమవారం ‘స్పందన’లో ఫిర్యాదు చేశా. ఇంత త్వరగా నా తల్లిదండ్రులను కలుస్తానని కలలో కూడా ఊహించలేదు. 12 ఏళ్ల తర్వాత అమ్మనాన్నలను నాతో కలిపిన ‘స్పందన’కు చేతులెత్తి మొక్కుతున్నా.. – ఆదిలక్ష్మి నా తల్లిదండ్రులుఎక్కడ? ఇదిలా ఉండగా.. సోమవారం ఆదిలక్ష్మి.. తన తల్లిదండ్రుల ఆచూకీ కనిపెట్టాలంటూ ‘స్పందన’లో విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తిచేసింది. ఆమె విజ్ఞప్తిని మీడియా విస్తృత ప్రచారం చేసింది ఆ కథనాలు చూసిన లక్ష్మీనారాయణ, తల్లి చెంచమ్మ తమ కుమార్తెను గుర్తుపట్టారు. వెంటనే సోమవారం నగర పోలీసులకు సమాచారం అందజేశారు. ఆమె తన కూతురే అంటూ భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమయ్యారు. వెంటనే తాను 2007లో ఫిర్యాదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని, పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను, తమ కుమార్తె గాయాలకు సంబంధించిన మచ్చలు తదితరాలను పోలీసులకు వివరించారు. ఆయన చెప్పిన గుర్తులు పోలి ఉండడంతో ఆదిలక్ష్మి అతని కుమార్తేనని పోలీసులు నిర్ధారణకొచ్చి.. ఉన్నతాధికారులకు వివరించారు. చట్టపరంగా అన్ని చర్యలూ పూర్తిచేసి కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో మంగళవారం సీపీ ద్వారకా తిరుమలరావు ఆదిలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. -
నన్ను రూ. 500కు అమ్మేసింది: లత
సాక్షి, విజయవాడ: పన్నెండేళ్ల తర్వాత బిడ్డను కన్నవారి వద్దకు చేర్చడం ఆనందంగా ఉందని నగర సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్పందన కార్యక్రమంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రత్యేక దృష్టి సారించారని పేర్కొన్నారు. స్పందనలో వచ్చిన కేసుల్లో ఎక్కువ కేసులు త్వరితగతిన పరిష్కారం అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. వివరాలు.... 2007లో లత అలియాస్ ఆదిలక్ష్మి అనే అమ్మాయి తప్పిపోయింది. ఆమెను చేరదీసిన ఓ మహిళ తనను ఐదు వందల రూపాయలకు అమ్మేసింది. దీంతో తనను అక్కున చేర్చుకున్న మరో మహిళ లతను పెంచి పెద్ద చేసి పెళ్లి చేసింది. అయితే కొన్నిరోజుల క్రితం తనను పెంచిన తల్లి మరణించడంతో తల్లిదండ్రుల వద్దకు చేర్చాలంటూ ‘స్పందన’ ద్వారా లత విజయవాడ పోలీసులను ఆశ్రయించింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను సీపీ ద్వారకా తిరుమల రావు మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘లత తల్లిదండ్రుల ఆచూకీ కోసం మమ్మల్ని ఆశ్రయించింది. తన తల్లిదండ్రులు, సోదరుల వివరాలు చెప్పింది. ఈ అంశాలన్నింటినీ మీడియా ద్వారా ప్రచారం చేశాం. ఈ క్రమంలో గుడ్లవల్లేరులో నివాసం ఉంటున్న మంగళగిరి లక్ష్మీ నారాయణ కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. 2007లో 13యేళ్ల వయస్సులో లత తప్పిపోయింది. ఈ విషయం గురించి అదే ఏడాది మార్చిలో కేసు నమోదైంది. అప్పట్లో హోంగార్డుగా ఉన్న లక్ష్మీ నారాయణ .. పోలీసులు సరిగా స్పందించలేదని ఉద్యోగం వదిలేశారు. ఈ విషయం ఆమెకు పూర్తిగా గుర్తు లేకపోవడంతో సంవత్సరం తప్పుగా చెప్పింది. దీంతో రేషన్ కార్డు, ఇతర ఆధారాలు కూడా వెరిఫై చేశాం. లత.. అలియాస్ ఆదిలక్ష్మి వారి కుమార్తె అనేందుకు అన్ని ఆధారాలు ఉన్నాయి. అయితే శాస్త్రీయంగా నిర్దారణ కోసం పరీక్షలు చేయిస్తాం’ అని పేర్కొన్నారు. ఐదు వందలకు అమ్మేసింది: ఆదిలక్ష్మి సుదీర్ఘ నిరీక్షణ అనంతరం తల్లిదండ్రుల చెంతకు చేరుకోవడం పట్ల ఆదిలక్ష్మి హర్షం వ్యక్తం చేసింది. ఆమె మాట్లాడుతూ.. ‘నన్ను ఐదు వందలకు ఓ మహిళ అమ్మేసింది. నన్ను కొనుక్కున్న మధురిక అనే ఆమె చెన్నై తీసుకెళ్లి పెంచి పెళ్లి చేసింది. ఆమె చనిపోయాక నా కన్నవారిని కలవాలనిపించింది. అందుకు నా భర్త కూడా అంగీకరించి విజయవాడ తీసుకువచ్చారు. రామకృష్ణ అనే న్యాయవాదిని కలిసి విషయం వివరించాం. ఆయన సూచన మేరకు స్పందనలో ఫిర్యాదు చేశాం. ఇప్పుడు నా తల్లిదండ్రులను కలవడం ఆనందంగా ఉంది’ అని పేర్కొంది. ఉద్యోగం కూడా వదిలేశాను: లక్ష్మీ నారాయణ ‘నా కుమార్తె ఆదిలక్ష్మి గుడ్లవల్లేరులో 2007లో తప్పిపోయింది. పాపను వెతికేందుకు కుదరకపోవడంతో హోంగార్డు ఉద్యోగం కూడా వదిలేశాను. ఆ తర్వాత తిరుపతి, ఇతర ప్రాంతాలలో తిరిగినా పాప దొరకలేదు .ఇప్పుడు స్పందన ద్వారా నా కూతురు మా చెంతకు చేరడం ఆనందంగా ఉంది’ ఆదిలక్ష్మి తండ్రి లక్ష్మీనారాయణ హర్షం వ్యక్తం చేశాడు. -
ప్రైవేటు వాహనాల్లోనూ మహిళలకు 'అభయ'
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ఆటోలు, టాక్సీల్లో ప్రయాణించే మహిళల రక్షణకు ఉద్దేశించిన ‘అభయ’ ప్రాజెక్టును అమల్లోకి తెచ్చేందుకు పిలిచిన టెండర్లను పరిశీలించి ప్రభుత్వానికి నివేదించే బాధ్యతను పోలీసు శాఖకు అప్పగించారు. ఈ ప్రాజెక్టుపై ఏర్పాటైన కమిటీకి విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు నేతృత్వం వహించనున్నారు. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గతంలో నిర్వహించిన టెండర్ల ఎంపిక విధానం, అమలు అంశాల్ని ఈ కమిటీ పరిశీలించనుంది. అభయ ప్రాజెక్టు అమలు బాధ్యత రవాణా శాఖదే అయినప్పటికీ పోలీసు శాఖ సహకారం అవసరం ఉంటుంది. దీంతో పోలీస్ శాఖ దీనిపై దృష్టి సారించింది. మహిళల రక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం ఏపీకి కేటాయించిన నిధులతో గతంలోనే రవాణా శాఖ అభయ ప్రాజెక్టును రూపొందించింది. మొత్తం ప్రాజెక్టు వ్యయం రూ.138 కోట్లు కాగా, కేంద్ర ప్రభుత్వం 2015లో రాష్ట్రానికి రూ.80 కోట్లు కేటాయించింది. అయితే గత ప్రభుత్వం ఈ ప్రాజెక్టు అమలుపై నాన్చివేత ధోరణి అవలంభించింది. చివరకు ఈ ఏడాది జనవరిలో రవాణా శాఖ ఓ యాప్ రూపొందించింది. ఈ మొబైల్ యాప్‌తో గ్లోబల్ పొజిషనింగ్ సిస్టం (జీపీఎస్) ద్వారా ప్రయాణికుల్ని చేరవేసే వాహనాలు ఎక్కడెక్కడ ప్రయాణిస్తున్నాయో.. తెలుసుకునే వీలుంది. క్యాబ్‌లు, ట్యాక్సీలు, ఆటోల్లో ప్రయాణించే మహిళలకు ఏదైనా ఆపద, అవాంఛనీయ ఘటనలు ఎదురైతే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) ఆధారంగా పోలీస్, రవాణా శాఖలకు సమాచారం చేరవేసేందుకు అభయ యాప్ ఎంతగానో ఉపకరిస్తుంది. ‘అభయ’ అమలు ఇలా.. - రవాణా వాహనాల్లో ట్రాకింగ్ డివైస్‌లు ఏర్పాటు చేస్తారు. - పోలీసుల సహకారంతో రవాణా శాఖ ఐటీ అధికారులు ఈ ప్రాజెక్టును పర్యవేక్షిస్తారు. - రవాణా వాహనాలకు దశల వారీగా ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఓటీ) బాక్సులు అమర్చాలి. - ఈ బాక్సులు అమరిస్తే రవాణా, పోలీస్ శాఖ కాల్ సెంటర్లు, కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి పర్యవేక్షిస్తారు. - మహిళలు తమ ప్రయాణంలో ఏవైనా ఇబ్బందులు ఎదురైతే మొబైల్ యాప్ నుంచి సంబంధిత వాహనం నంబర్ పంపితే వాహనం ఎక్కడుందో జీపీఎస్ ద్వారా తెలుసుకుని పట్టుకునేందుకు వీలుంటుంది. - తొలుత విశాఖ, విజయవాడల్లో లక్ష ఆటోలకు ఈ ఐఓటీ బాక్సులు అమర్చాలని రవాణా శాఖ గతంలో నిర్ణయించింది. - ఇందుకు రూ.138 కోట్లు ఖర్చవుతుందని అంచనా. ఐఓటీ బాక్సుల్ని రవాణా శాఖ సమకూర్చనుంది. - ఈ బాక్సుల్ని ఆటోలు, క్యాబ్‌లకు అమర్చాక డ్రైవర్ల లైసెన్సులకు రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిటీ టెక్నాలజీ (ఆర్ఎఫ్ఐడీ) కార్డులు ఇస్తారు. - ఆటోలు స్టార్ట్ చేసేటప్పుడు ఈ ఆర్ఎఫ్ఐడీ లైసెన్సు కార్డులను ఇంజన్ల వద్ద అమర్చిన ఐఓటీ బాక్సుకు స్వైప్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. - ఆటోల్లో/క్యాబ్‌ల్లో ప్రయాణించే మహిళలకు ఏవైనా ఇబ్బందులు ఎదురైతే యాప్ ద్వారా కంట్రోల్ రూమ్‌కు సమాచారమిస్తే.. వాహనం ఎక్కడుందో తెలుసుకుని ఇట్టే పట్టుకుంటారు. - కమిటీ సిఫారసుల్ని పరిగణనలోకి తీసుకుని ఈ ప్రాజెక్ట్‌ను పట్టా లెక్కిస్తారు. -
దిశ వంటి ఘటనలు పునరావృతం కాకుండా..
సాక్షి, విజయవాడ: దిశకు న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ కోరారు. దిశ లాంటి ఘటనలు పునరావృతం కాకుండా చట్టాల దశను మార్చాలని అభిప్రాయపడ్డారు. విజయవాడలోని ఎస్ఎస్ కన్వెన్షన్ సెంటర్లో ‘ఉమెన్ సేఫ్టీ ఇన్ సైబర్ స్పేస్’ అనే అవగాహన కార్యక్రమంలో మహిళా మంత్రులు మేకతోటి సుచరిత, తానేటి వనిత, నగర సీపీ ద్వారకా తిరుమలరావు, కలెక్టర్ ఇంతియాజ్ అహ్మద్‌తో పాటు వాసిరెడ్డి పద్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... మహిళల రక్షణకు ఏపీ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని పేర్కొన్నారు. ‘పురుషులతో పాటు సమానంగా మహిళలు పోటీ పడుతున్నారు. మహిళలపై దాడులకు నివారణ చర్యలు తీసుకోవాలి. మీ కోసమే మేము ఉన్నామని అందరూ మహిళల కోసం నిలవాలి’అని సూచించారు. అదే విధంగా మహిళలు కూడా ధైర్యంగా ఉండాలని పేర్కొన్నారు. ఇక రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలుతో మహిళలకు ఉపశమనం చేకూరుతోందని వాసిరెడ్డి పద్మ వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళల కోసం 50 శాతం రిజర్వేషన్ల చట్టం తీసుకు రావడం హర్షించదగ్గ విషయం అన్నారు. అది ఉద్యమంలా విస్తరించింది: సీపీ కొత్త నేరాల పట్ల ఏపీ పోలీస్ శాఖ అప్రమత్తంగా ఉందని సీపీ ద్వారకా తిరుమల రావు అన్నారు. మహిళల రక్షణకై ప్రత్యేక దృష్టి సారించామని పేర్కొన్నారు. తమ ప్రాధాన్యత అంశాలలో ముందుగా మహిళ భద్రతే ఉంటుందన్నారు. ‘గౌతమ్ సవాంగ్ సీపీగా ఉన్న సమయంలో మహిళా మిత్ర ప్రారంభించారు. అది ఉద్యమంలా విస్తరించింది. సైబర్ నేరాల నియంత్రణకు సైబర్ మిత్రకు శ్రీకారం చుట్టాము. 47 సైబర్ మిత్ర గ్రూపులు ఏర్పాటు చేశాం. ఇందులో 1520 మంది వాలంటీర్స్ను ఎంపిక చేశాం. 734 కాలేజీల నుంచి విద్యార్థులను ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేశారు. వారంతా సైబర్ వారియర్స్‌గా పని చేస్తారు. బీ సేఫ్ ... అనే యాప్‌ను సైతం మహిళలు రక్షణ కోసం ఏర్పాటు చేశాం. దిశా లాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఇలాంటి కార్యక్రమాలు ఉపకరిస్తాయి’ అని ఆయన పేర్కొన్నారు. -
విజయవాడలో పెద్ద ఎత్తున 3కే రన్
-
14వేలమంది రక్తదానం చేశారు!
సాక్షి, విజయవాడ: పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని.. రామవరప్పాడులోని శుభమ్ కళ్యాణ మండపంలో ఆదివారం మెగా రక్తదాన శిబిరాన్ని డీజీపీ గౌతమ్ సవాంగ్ ప్రారంభించారు. రక్తదానం చేసేందుకు పోలీసు విభాగాల్లో సిబ్బంది పెద్ద ఎత్తున ముందుకొచ్చారు. రక్తదాతలను డీజీపీ గౌతం సవాంగ్ అభినందించారు. పోలీస్ అమరవీరుల వారోత్సవాల్లో రాష్ట్రవ్యాప్తంగా రక్తదాన శిబిరాలు నిర్వహించామని, మొత్తం 14వేలమంది రక్తదానం చేశారని డీజీపీ గౌతం సవాంగ్ తెలిపారు. తొమ్మిదివేల మంది ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేశారని చెప్పారు.ప్రజలకు ప్రశాంత జీవనాన్ని కల్పించేందుకు పోలీసులు ప్రాణత్యాగానికి కూడా వెనకాడరని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకు పోలీసులకు మధ్య స్నేహపూర్వక వాతావరణం ఉందన్నారు. జర్నలిస్టులపై ఎవరు దాడి చేసినా కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. అంతకుముందు విజయవాడ నగర పోలీస్ కమిషనర్ ఆధ్వర్యంలో ఉదయం 3కే రన్ నిర్వహించారు. విజయవాడ బీఆర్టీయస్ రోడ్డులో నిర్వహించిన ఈ రన్లో భారీగా చిన్నారులు, యువత పాల్గొన్నారు. విజేతలుగా నిలిచిన విద్యార్థులకు సీపీ ద్వారకా తిరుమలరావు నగదు బహుమతితోపాటు మెమెంటోలు అందజేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరిని అలరించాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా రేపు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో స్మృతి పరేడ్‌ను నిర్వహించనున్నట్లు సీపీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితోపాటు హోంమంత్రి, డీజీపీ పాల్గొంటారని స్పష్టం చేశారు. 1959లో అమరులైన సీఆర్పీఎఫ్ పోలీసులను స్మరించుకుంటూ అమరవీరుల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నామని, ఈ నెల 15 నుంచి 21 వరకు పోలీసు అమరవీరుల వారోత్సవాలను నిర్వహిస్తున్నన్నామని ద్వారకా తిరుమలరావు తెలిపారు. ఇందులో భాగంగా 15,16 తేదీల్లో ఓపెన్ హౌస్‌లు, వెపన్స్ ప్రదర్శన, డాగ్ షో వంటి కార్యక్రమాలు నిర్వహించామని, ప్రజల కోసం, వారి రక్షణ కోసమే మేము ఉన్నామని భరోసా ఇవ్వాలని ఈ వారోత్సవాలకు శ్రీకారం చుట్టామని తెలిపారు. ఈ నెల 17,18 తేదీల్లో రక్త దాన శిబిరాన్ని నిర్వహించామని చెప్పారు. పోలీసులపై ఉన్న అపోహలను పోగొట్టాలన్నదే తమ ఉద్దేశమని చెప్పారు. -
కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం..
సాక్షి, విజయవాడ : పోలీసులు సమాజాన్ని కాపాడుతూ.. శాంతి భద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. రక్తదాన శిబిరంలో సీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పోలీసుల సంక్షేమం కోసం తొలిసారిగా వారాంతపు సెలవును ప్రకటించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన నక్సల్స్ దాడుల్లో అనేకమంది పోలీసు వీరులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 600 మది అధికారులు, పోలీసులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం శుభపరిణామమన్నారు. వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వారోత్సవాల కార్యక్రమాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు చక్కగా ప్రణాళికా చేసుకుంటూ నిర్వహిస్తున్నారని అభినందించారు. దసరా ఉత్సవాలు విజయవంతం కావడంలో పోలీసు శాఖ ముఖ్యపాత్ర పోషించిందని, వారి కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే శాఖ పోలీసు శాఖ అని గుర్తు చేశారు. నగర సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. ఆక్టోబర్ 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాల గురించి తెలియజేసినట్లు, పోలీసుశాఖపై ఉన్న అపోహలను పొగొట్టాలన్నదే తమ లక్ష్యని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా కళాళాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు. -
వరద ప్రభావిత ప్రాంతాల్లో సీపీ పర్యటన
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కృష్ణా జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో విజయవాడ పోలీస్ కమిషనర్ ద్వారకా తిరుమలరావు శనివారం సుడిగాలి పర్యటన చేశారు. కృష్ణలంక నుంచి తోట్లవల్లూరు వరకు వరద ప్రభావిత ప్రాంతాలను సీపీ స్వయంగా పరిశీలించారు. రెస్క్యూ ఆపరేషన్ ల వివరాలు అడిగి తెలుసుకున్నారు. వరద ప్రభావంతో రోడ్లు జలమయమై సంబంధాలు తెగిపోయిన ప్రాంతాలకు బోటులో వెళ్లి సహాయక చర్యలపై ఆరా తీశారు. వరద పరిస్థితిని లంక గ్రామ వాసులకు వివరించి అందరూ పునరావాసాలకి తరలి రావాలని విజ్ఞప్తి చేసారు. అవసరమైతే అదనపు సిబ్బందిని ఏర్పాటుచేసి ముంపు బాధితులను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తామన్నారు. పునరావాస కేంద్రాలను సందర్శించి ముంపు బాధితులకు అందుతున్న సదుపాయాలు అడిగి తెలుసుకకున్నారు. -
విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు
-
కిలోల కొద్దీ వెండి, బంగారు ఆభరణాలు..!
సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమిషన్ రేట్ పరిధిలో వరస చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగల ముఠా పట్టుబడింది. ముఠా నాయకుడు భూక్యా నాయక్‌ను, అతని గ్యాంగ్‌ను అరెస్టు చేసి పోలీసులు శుక్రవారం మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. గత కొన్ని సంవత్సరాలుగా ఎన్నో దొంగతనాలకు పాల్పడి సవాల్ విసురుతున్న భుక్యా నాయక్ ముఠాను ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయటం ద్వారా క్రైం బ్రాంచ్ పోలీసులు పట్టుకోగలిగారని విజయవాడ సీపీ ద్వారాకా తిరుమలరావు చెప్పారు. వందల ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన భుక్యా నాయక్ ముఠా నుంచి 54లక్షలు విలు చేసే 1258 గ్రాముల బంగారు ఆభరణాలు, 17.2 కేజీల వెండి ఆభరణాలు, 9లక్షల 65వేల నగదు, ఒక ల్యాప్ ట్యాప్, రెండు కార్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భూక్యనాయక్ తోపాటు పుల్లేటికుర్తి ఉమామహేశ్వరరావు, బాణావత్ రాజా, నల్లమోతు సురేష్, గుత్తికొండ పవన్ కూమార్ మరో మైనర్.. గ్యాంగ్‌గా ఏర్పడి దొంగతనాలకు పాల్పడుతున్నారని సీపీ చెప్పారు. ఈ గ్యాంగ్‌పై రాష్ట్రవ్యాప్తంగా 200 కేసులున్నాయని తెలిపారు. ముఠాలోని ఇద్దరు సభ్యులు సురేష్, పవన్ కూమార్ ఇప్పటికే జైళ్లలో ఉన్నారని వెల్లడించారు. ఇంజనీరింగ్ చదివిన ఓ వ్యక్తి కూడా ఈ గ్యాంగ్‌లో సభ్యుడిగా ఉన్నారని సీపీ పేర్కొన్నారు. భుక్యా నాయక్ ముఠా అరెస్టుతో అనేక దొంగతనాలు బయటపడ్డాయని అన్నారు. సంబంధిత వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి : విజయవాడలో అంతర్రాష్ట్ర దొంగల ముఠా అరెస్టు -
‘వారిపై ఉక్కుపాదం మోపుతాం’
సాక్షి, విజయవాడ : ఓటర్లు ప్రలోభాలకు గురి కాకుండా ప్రశాంత వాతావరణంలో ఓటు వేయాలని.. అసాంఘిక శక్తులపై ఉక్కుపాదం మోపుతామని సీపీ ద్వారక తిరమల రావు హెచ్చరించారు. నేటి సాయంత్రం ఆరుగంటలకు ఎన్నికల ప్రచార గడువు ముగియడంతో.. ఎక్కడా అవాంఛనీయ ఘటనలు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు. ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మొదటి ఫేజ్‌లో జరుగనున్న ఎన్నికలకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లను పూర్తి చేసిందన్నారు. 1588 పోలింగ్ స్టేషన్లలో 530 పోలింగ్ కేంద్రాల మీద ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. 332 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించామన్నారు. 198 మొబైల్ పార్టీలు, 5 స్టేకింగ్ ఫోర్స్, 5 నైట్ ఫోర్స్, పది చెక్‌పోస్ట్‌లు అందుబాటులో ఉన్నాయని పేర్కొన్నారు. ఇప్పటివరకు 2 కోట్ల 43 లక్షల రూపాయలు స్వాధీనం చేసుకున్నట్లు ప్రకటించారు. వాటిలో 70 లక్షలు ఆధారాలు చూపిన వారికి తిరిగి ఇవ్వడం జరిగిందన్నారు. మూడు వేల లీటర్ల మద్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘనకు సంబంధించి 391 కేసులు నమోదయ్యాయన్నారు. మరికొందరి నుంచి లైసెన్స్డ్ వెపన్లు స్వాధీనం చేసుకున్నామని, ఎన్నికల్లో అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 1449 రౌడీషీటర్లను బైండోవర్ చేశామన్నారు. ఆరుకిలోల బంగారం, నాలుగు కిలోల వెండిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 1231 మంది ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ వాలంటీర్స్ ఎన్నికల విధుల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. ఓటర్లు మై ఓట్ క్యూ యాప్ ద్వారా వెసులు బాటు చూసుకుని ఓటు వేయవచ్చన్నారు. ఏవైనా ఫిర్యాదులుంటే.. 7328909090కి వాట్సాప్ లేదా 100కి డయల్ చేయవలసిందిగా సూచించారు. ప్రతి ఒక్కరూ ఎన్నికల నియమావళిని పాటించాలని కోరారు. ఈ ఎన్నికల్లో బాడీ కెమెరాలు, ఈ బందోబస్తు, యాప్ వంటి టెక్నాలజీని వినియోగిస్తున్నట్లు తెలిపారు. పెనమలూరు, విజయవాడ సెంట్రల్, మైలవరం, గన్నవరం నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు తెలిపారు. -
వాటిపై దృష్టి పెడతాం : విజయవాడ సీపీ
సాక్షి, విజయవాడ : నగర పోలీస్ కమీషర్‌గా ద్వారకా తిరుమల రావు గురువారం బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిటీలో ఎటువంటి సవాళ్లనైనా స్వీకరిస్తామని చెప్పారు. నగరంలో ప్రాధాన్య అంశాలపై దృష్టి పెడతామని, ఆర్థిక నేరాలు, సైబర్ క్రైమ్‌పై దృష్టి సారించినున్నట్లు తెలిపారు. ప్రజలను అప్రమత్తం చేసి అవగాహన కల్పిస్తామని, జనరల్ క్రైమ్‌ను కూడా అరికట్టడానికి కృషి చేస్తానని చెప్పారు. రాజధాని నగరంలో వీఐపీల తాకిడి పెరుగుతోందని, తద్వారా ట్రాఫిక్ సమస్య ఎక్కువగా ఉందని అన్నారు. మహిళలు, పిల్లల రక్షణకు ప్రత్యేక చర్యలు చేపడతామని చెప్పారు. మహిళా మిత్రలను మరింత మలోపేతం చేస్తామని, నగర ప్రజల్లో భద్రతా భావం పెంచుతామని పేర్కొన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటానని చెప్పిన ఆయన ప్రజలనుంచి సలహాలు తీసుకుంటామని అన్నారు. బాధ్యతలను స్వీకరించడానికి ముందు కమీషనర్ ద్వారకా తిరుమల రావు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈసందర్భంగా ఆలయ సిబ్బంది ఆయనకు సాదర స్వాగతం పలికారు. ఆ తరువాత మల్లికార్జున స్వామిని దర్శించుకొని ఆశీర్వాదం తీసుకున్నారు. ఈ సందర్భంగా సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. బాధ్యతలు చేపట్టే ముందు అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చానని అన్నారు. నగరంలో ప్రజలు అందరు సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు. విధి నిర్వహణలో సమర్ధవంతంగా పని చేసే శక్తి ఇవ్వాలని అమ్మవారిని వేడుకున్నట్లు చెప్పారు. -
బెజవాడ పోలీస్ బాస్ ద్వారకా
సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ బాస్‌గా సీహెచ్.ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. సీఐడీ విభాగం అదనపు డీజీగా ఉన్న ఆయన్ని విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనతోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను విజయవాడ కమిషనరేట్‌కు బదిలీ చేసింది. అదనపు పోలీస్ కమిషనర్‌గా టి.యోగానంద్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. నగర డీసీపీ(క్రైం)గా బి.రాజకుమారిని నియమించారు. ఆమె ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. అనుకున్నట్లే ద్వారకా... మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ద్వారకా తిరుమల రావునే ప్రభుత్వం సీపీగా నియమించింది. ఆయన సీపీగా నియమితులవుతారని ఆరేడునెలలుగా పోలీసువర్గాలు భావిస్తున్నాయి. గౌతం సవాంగ్ బదిలీ అనంతరం ద్వారకా తిరుమలరావుతోపాటు నళీనీ ప్రభాత్, అమిత్ గార్గ్‌ల పేర్లు కూడా ప్రభుత్వం పరిశీలించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఆ ముగ్గురినీ విడివిడిగా పిలిపించి మాట్లాడారు కూడా. ఎన్నికల ఏడాది కావడంతో సీపీగా ఎవరు నియమితులవుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అనుకున్నట్లుగానే ప్రభుత్వం ద్వారకా తిరుమలరావువైపే మొగ్గుచూపింది. కమిషరేట్‌లో ఖాళీగా ఉన్న రెండు ఐపీఎస్ అధికారుల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేసింది. అదనపు సీపీగా టి.యోగానంద్ను నియమించింది. ఆయన 2016 నుంచి విశాఖపట్నం సీపీగా ఉన్నారు. ఇక డీసీపీ(క్రైం)గా బి.రాజకుమారిని నియమించింది. ఆమె ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఉన్నారు. దాంతో విజయవాడ కమిషరేట్‌లో ఐపీఎస్ అధికారుల సంఖ్య ఆరుకు చేరింది. తుళ్లూరు ఏఎస్పీగా బి.కృష్ణారావు తుళ్లూరురూరల్:తుళ్లూరు ఏఎస్పీగా బి.కృష్ణారావును నియమిస్తున్నట్టు మంగళవారం రాత్రి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాం తంలో తొలుత శాంతి భద్రతల దృష్ట్యా ఏఎస్పీ స్థాయి అధికారిని నియమించినప్పటికి కొంతకాలం తర్వాత తుళ్లూరు సబ్‌డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. తుళ్లూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలల వ్యవధిలోనే డీఎస్పీ పి.శ్రీనివాస్ కూడా ఏఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో రానున్న శాసనసభా సమావేశాలను దృష్టిలో ఉంచుకున్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తుళ్ళూరుకు తిరిగి డైరెక్ట్ ఐపీఎస్ అధికారిని నియమించారు. కృష్ణారావు ప్రస్తుతం కడప జిల్లా పులివెందులలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు. -
విజయవాడకు కొత్త పోలీస్ కమిషనర్
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో ఐపీఎస్ అధికారుల బదిలీలు జరిగాయి. ఏపీ ప్రభుత్వం 9 మంది ఐపీఎస్‌లను ట్రాన్స్ఫర్ చేస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. విజయవాడ నగర పోలీస్ కమిషనర్‌గా సీఐడీ చీఫ్ ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. దీంతో గౌతమ్ సవాంగ్ బదిలీతో విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ఎవరు నియమితులవుతారనే ఉత్కంఠకు ప్రభుత్వం మంగళవారం తెరదించింది. కొంత కాలంగా ఐపీఎస్ అధికారుల బదిలీలపై చర్చ జరుగుతున్న విషయం తెలిసిందే. డీజీపీగా ఆర్పీ ఠాకూర్ నియామకంతో బదిలీల్లో ఎట్టకేలకు కదలిక వచ్చింది. విజయవాడ కమిషనర్ - ద్వారకా తిరుమలరావు విశాఖపట్నం కమిషనర్- మహేశ్ చంద్రా లడ్డా విజయవాడ అడిషనల్ సీపీ- యోగానంద్ ఏలూరు రేంజ్ డీఐజీ - రవికుమార్ మూర్తి తుళ్లూరు ఏఎస్పీగ- బి.కృష్ణారావు రంపచోడవరం ఏఎస్పీ- రాహుల్ దేవ్ సింగ్ రాజమహేంద్రవరం అర్బన్ ఎస్పీ షేమూషి విజయవాడ క్రైమ్ డీసీపీ- రాజకుమారి రాజమహేంద్రవరం అర్బన్ ఏఎస్పీగా అజితలు బదిలీ అయ్యారు. -
బాబు సీఎం అయ్యాకే అగ్రిగోల్డ్ సమస్య
అగ్రిగోల్డ్ సదస్సులో బాధితుల ఆగ్రహం విజయవాడ : చంద్రబాబు అధికారంలోకి వచ్చాకే అగ్రిగోల్డ్ సమస్య వచ్చిందని పలువురు బాధితులు ధ్వజమెత్తారు. స్థానిక అమ్మ కల్యాణమండపంలో శనివారం సీఐడీ ఏర్పాటుచేసిన అగ్రిగోల్డ్ ఖాతాదారుల అవగాహన సదస్సులో పలువురు సీఎంపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పలువురు బాధితులు సీఐడీ వారిని నిలదీయడంతో సదస్సు గందరగోళంగా మారింది. లక్షలాది మంది ఖాతాదారుల సమస్యను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని కొంతమంది ఖాతాదారులు పేర్కొన్నారు. డబ్బు చెల్లించిన ఖాతాదారులు తమ ఇళ్లపైకి వచ్చి దాడులకు తెగబడుతున్నారని ఏజెంట్లు చెప్పారు. ఇప్పటివరకు దాదాపు వందమంది అగ్రిగోల్డ్ బాధితులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని తెలిపారు. ఈ సమస్య వెంటనే పరిష్కరించకపోతే మరెందరో ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం ఉందని హెచ్చరించారు. సీఐడీ చీఫ్ ద్వారకాతిరుమలరావు మాట్లాడుతూ ఆవేశం, ఉద్రేకంతో సమస్యలు పరిష్కారం కావని చెప్పారు. స్పెషల్ కోర్టు నుంచి ఈ కేసు హైకోర్టుకు వెళ్లిందన్నారు. సీఐడీ స్వాధీనం చేసుకున్న ఆస్తుల్లో హాయ్‌ల్యాండ్ కూడా ఉందని చెప్పారు. అగ్రిగోల్డ్ ఖాతాదారులు, ఏజెంట్లు ఇంకా ఏమైనా సమ్యలు ఉంటే సీఐడీ అధికారులకు ఫిర్యాదు చేయాలన్నారు. ఒక దశలో పలువురు బాధితులు సంయమనం కోల్పోవడంతో సీఐడీ చీఫ్ జోక్యం చేసుకుని ఈ కేసులో తమది దర్యాప్తు సంస్థ మాత్రమేనన్నారు. తాము ఖాతాదారులకు న్యాయం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, సహకరించాలన్నారు. ఎన్నాళ్లు ఆగాలి ఎన్నాళ్లు ఆగాలి. మా డబ్బు ఎప్పటికి వస్తుంది. అగ్రిగోల్డ్ కేసు విషయంలో ప్రభుత్వం అలక్ష్యం వహిస్తోంది. ఆస్తులు వేలం ఎప్పుడు వేస్తారు. ఆస్తులు స్వాధీనం చేసుకున్నందున ప్రభుత్వ ప్యాకేజీ ఇవ్వాలి. ముందుగా కొంత డబ్బు విడుదల చేసి ఖాతాదారులకు చెల్లించాలి. చిల్లిగవ్వలేక నానా అగచాట్లు పడుతున్నాం. వెంటనే ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది. - లక్ష్మి, రాయగడ, ఒడిశా మా సొమ్ము ఇప్పించండి.. అగ్రిగోల్డ్ ఎప్పటినుంచో నష్టాల్లో ఉంది. టీడీపీ అధికారంలోకి రాక ముందు నుంచే చెక్కులు ఆలస్యంగా చెల్లుబాటు అవుతున్నాయి. ఆనాడు ప్రతిపక్షంలో ఉన్న ఇప్పటి పాలపక్షం నేతలు ఎందరో అగ్రిగోల్డ్ యాజమాన్యంతో మాట్లాడుకుని తమ చెక్కులు క్లియర్ అయ్యేలా చూసుకున్నారు. చంద్రబాబు సీఎం అయ్యాకే ఈ సమస్య వచ్చింది. వెంటనే హాయ్‌ల్యాండ్‌ను విక్రయించి బాధితులకు సొమ్ము చెల్లించాలి. - యువరాజు, గుంటూరు -
అగ్రిగోల్డ్ బాధితులకు రెండు నెలల్లో చెల్లింపులు
సాక్షి, విజయవాడ బ్యూరో: అగ్రిగోల్డ్ బాధితులకు రెండు నెలల్లోగా డిపాజిట్లకు సంబంధించిన నగదు చెల్లించేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కోర్టు నుంచి న్యాయపరమైన సలహాలు తీసుకుని అగ్రిగోల్డ్ ఆస్తులను ‘ఈ వేలం’లో విక్రయించి వచ్చిన సొమ్మును బాధితులకు దశల వారీగా చెల్లించాలని భావిస్తోంది. ఆర్థిక నేరాలకు పాల్పడే సంస్థలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన నిపుణుల కమిటీ సభ్యులు నర్సింహమూర్తి, కుటుంబరావు, సీఐడీ అదనపు డీజీపీ ద్వారకా తిరుమలరావు, సీబీఐ అడ్వైజర్ శరత్‌కుమార్, ఆహ్లాదరావు మంగళవారం ఉదయం విజయవాడ సీఎం క్యాంప్ ఆఫీస్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. అనంతరం కమిటీ ఛైర్మన్ నర్సింహమూర్తి, రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక సలహాదారు కుటుంబరావు మీడియాకు వివరాలను వెల్లడించారు. దాదాపు 32 లక్షల మంది అగ్రిగోల్డ్‌లో డిపాజిటర్లుగా ఉన్నట్లు తేలిందని, ఇందులో ఏపీలో 19 లక్షల మంది ఉన్నారని నర్సింహమూర్తి తెలిపారు. వీరందరికీ చెల్లించాల్సిన మొత్తం రూ.6800 కోట్లుగా తేలిందన్నారు. డిపాజిటర్లకు చెల్లించాల్సిన దానికంటే అగ్రిగోల్డ్ ఆస్తులు ఎక్కువగానే ఉన్నాయని, రిజిస్టర్డ్ ఆస్తులే రూ.7 వేల కోట్లకు పైగా ఉన్నాయన్నారు. ఈ నేపథ్యంలో డిపాజిటర్లకు న్యాయం చేయాలన్న ఆలోచనతో ప్రభుత్వం ‘ఈ వేలం’లో సంస్థ ఆస్తులను వేలం వేయడానికి నిర్ణయం తీసుకుందన్నారు. -
విజయనగరం వీధుల్లో పోలీసు కవాతు
విజయనగరం : విజయనగరంలో శుక్రవారం పోలీస్ కవాతు నిర్వహించారు. డాగ్ స్వ్కాడ్‌తో తనిఖీలు నిర్వహించారు. ఈరోజు ఉదయం ఏడుగంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకూ కర్ఫ్యూను సడలించారు. గత నాలుగు రోజులుగా పట్టణంలో పరిస్థితులు పూర్తిగా పోలీసుల అదుపులోకి రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. అయితే 144 సెక్షన్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా కోస్టల్ ఐజీ ద్వారకా తిరుమలరావు తెలిపారు. ప్రయివేట్, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, పోలీసులపై దాడి కేసులో అరెస్టులు పారదర్శకంగా జరుగుతున్నాయన్నారు. ఇప్పటివరకూ 150మందిపై ప్రధాన కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. అరెస్ట్‌ల్లో రాజకీయ జోక్యం లేదని ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు. కర్ఫ్యూ సడలింపు సమయంలో ర్యాలీలు, ధర్నాలు, ఆందోళన లు చేపట్టడానికి అంగీకరించబోమని అటువంటి కార్యక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. శాంతి భద్రతలు అదుపులోనే ఉన్నాయని.... పరిస్థితిని బట్టి కర్ఫ్యూ ఎత్తివేస్తామన్నారు.