
సాక్షి, విజయవాడ : పోలీసులు సమాజాన్ని కాపాడుతూ.. శాంతి భద్రతలను అనుక్షణం పర్యవేక్షిస్తుంటారని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు తెలిపారు. పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన స్వచ్ఛంద రక్తదాన శిబిరాన్ని మంత్రులు కురసాల కన్నబాబు, వెల్లంపల్లి శ్రీనివాస్ సందర్శించారు. రక్తదాన శిబిరంలో సీపీ ద్వారకా తిరుమలరావు, ఇతర పోలీసు సిబ్బంది రక్తదానం చేశారు. అనంతరం మంత్రి కన్నబాబు మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి పోలీసుల సంక్షేమం కోసం తొలిసారిగా వారాంతపు సెలవును ప్రకటించారని పేర్కొన్నారు. రాష్ట్రంలో జరిగిన నక్సల్స్ దాడుల్లో అనేకమంది పోలీసు వీరులు అమరులయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. 600 మది అధికారులు, పోలీసులు, సిబ్బంది, విద్యార్థులు స్వచ్ఛందంగా రక్తదానం చేయడం శుభపరిణామమన్నారు.
వెల్లంపల్లి శ్రీనివాస్ మాట్లాడుతూ.. వారోత్సవాల కార్యక్రమాన్ని సీపీ ద్వారకా తిరుమలరావు చక్కగా ప్రణాళికా చేసుకుంటూ నిర్వహిస్తున్నారని అభినందించారు. దసరా ఉత్సవాలు విజయవంతం కావడంలో పోలీసు శాఖ ముఖ్యపాత్ర పోషించిందని, వారి కుటుంబాలను వదిలి సమాజ శ్రేయస్సు కోసం పనిచేసే శాఖ పోలీసు శాఖ అని గుర్తు చేశారు.
నగర సీపీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ.. ఆక్టోబర్ 15 నుంచి 21 వరకు వారం రోజుల పాటు పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. వివిధ పాఠశాలల విద్యార్థులకు పోలీసు శాఖ ఉపయోగించే ఆయుధాల గురించి తెలియజేసినట్లు, పోలీసుశాఖపై ఉన్న అపోహలను పొగొట్టాలన్నదే తమ లక్ష్యని పేర్కొన్నారు. యువత చెడు వ్యసనాలకు బానిసలు కాకుండా కళాళాలలో అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment