
సాక్షి, అమరావతిబ్యూరో : విజయవాడ పోలీస్ బాస్‌గా సీహెచ్.ద్వారకా తిరుమలరావు నియమితులయ్యారు. సీఐడీ విభాగం అదనపు డీజీగా ఉన్న ఆయన్ని విజయవాడ పోలీస్ కమిషనర్‌గా ప్రభుత్వం నియమించింది. ఆయన 1989 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఆయనతోపాటు మరో ఇద్దరు ఐపీఎస్ అధికారులను విజయవాడ కమిషనరేట్‌కు బదిలీ చేసింది. అదనపు పోలీస్ కమిషనర్‌గా టి.యోగానంద్ నియమితులయ్యారు. ఆయన ప్రస్తుతం విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా ఉన్నారు. నగర డీసీపీ(క్రైం)గా బి.రాజకుమారిని నియమించారు. ఆమె ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఉన్నారు. ఈమేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు.
అనుకున్నట్లే ద్వారకా...
మొదటి నుంచీ అనుకున్నట్లుగానే ద్వారకా తిరుమల రావునే ప్రభుత్వం సీపీగా నియమించింది. ఆయన సీపీగా నియమితులవుతారని ఆరేడునెలలుగా పోలీసువర్గాలు భావిస్తున్నాయి. గౌతం సవాంగ్ బదిలీ అనంతరం ద్వారకా తిరుమలరావుతోపాటు నళీనీ ప్రభాత్, అమిత్ గార్గ్‌ల పేర్లు కూడా ప్రభుత్వం పరిశీలించింది. సీఎం చంద్రబాబు ఇటీవల ఆ ముగ్గురినీ విడివిడిగా పిలిపించి మాట్లాడారు కూడా. ఎన్నికల ఏడాది కావడంతో సీపీగా ఎవరు నియమితులవుతారన్నదానిపై ఆసక్తి నెలకొంది. అనుకున్నట్లుగానే ప్రభుత్వం ద్వారకా తిరుమలరావువైపే మొగ్గుచూపింది. కమిషరేట్‌లో ఖాళీగా ఉన్న రెండు ఐపీఎస్ అధికారుల పోస్టులను కూడా ప్రభుత్వం భర్తీ చేసింది. అదనపు సీపీగా టి.యోగానంద్‌ను నియమించింది. ఆయన 2016 నుంచి విశాఖపట్నం సీపీగా ఉన్నారు. ఇక డీసీపీ(క్రైం)గా బి.రాజకుమారిని నియమించింది. ఆమె ప్రస్తుతం రాజమండ్రి అర్బన్ ఎస్పీగా ఉన్నారు. దాంతో విజయవాడ కమిషరేట్‌లో ఐపీఎస్ అధికారుల సంఖ్య ఆరుకు చేరింది.
తుళ్లూరు ఏఎస్పీగా బి.కృష్ణారావు
తుళ్లూరురూరల్:తుళ్లూరు ఏఎస్పీగా బి.కృష్ణారావును నియమిస్తున్నట్టు మంగళవారం రాత్రి పోలీస్ శాఖ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. రాజధాని ప్రాం తంలో తొలుత శాంతి భద్రతల దృష్ట్యా ఏఎస్పీ స్థాయి అధికారిని నియమించినప్పటికి కొంతకాలం తర్వాత తుళ్లూరు సబ్‌డివిజన్‌కు డీఎస్పీ స్థాయి అధికారిని నియమించారు. తుళ్లూరు డీఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఆరునెలల వ్యవధిలోనే డీఎస్పీ పి.శ్రీనివాస్ కూడా ఏఎస్పీగా పదోన్నతి పొందారు. ఈ నేపథ్యంలో రానున్న శాసనసభా సమావేశాలను దృష్టిలో ఉంచుకున్న పోలీస్ శాఖ ఉన్నతాధికారులు తుళ్ళూరుకు తిరిగి డైరెక్ట్ ఐపీఎస్ అధికారిని నియమించారు. కృష్ణారావు ప్రస్తుతం కడప జిల్లా పులివెందులలో ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు ఏఎస్పీగా విధులు నిర్వహిస్తున్న శ్రీనివాస్‌కు పోస్టింగ్ ఇవ్వలేదు.