12 ఏళ్ల వేదన.. 12 గంటల్లో సాంత్వన | Father And Child Met After 12 Years With Spandana Program | Sakshi
Sakshi News home page

12 ఏళ్ల వేదన.. 12 గంటల్లో సాంత్వన

Published Wed, Dec 11 2019 5:29 AM | Last Updated on Wed, Dec 11 2019 5:29 AM

Father And Child Met After 12 Years With Spandana Program - Sakshi

ఆదిలక్ష్మితో తల్లిదండ్రులు చెంచమ్మ, లక్ష్మీనారాయణ. చిత్రంలో విజయవాడ సీపీ ద్వారకా తిరుమలరావు

ఒక్కటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 12 ఏళ్ల నిరీక్షణ ఇది.. తప్పిపోయిన బిడ్డ కోసం ఆ తండ్రి వెతకని చోటు లేదు.. తిరగని ఊరు లేదు.. చివరికి ఉద్యోగాన్ని సైతం వదిలేసి వెతుకుతూనే ఉన్నాడు.. ఫలితం లేదు. అయినా ఆ తండ్రి కన్నీటి తెరలమాటున మిణుకు మిణుకుమంటున్న చిన్న ఆశ.. ఎప్పటికైనా తన బిడ్డ దొరుకుతుందని.. ఎక్కడున్నా తన గారాలపట్టీ తన చెంతకు చేరుతుందని. మంగళవారం అదే జరిగింది.. తమిళనాడు మధురైలో ఉన్న ఆ బిడ్డ విజయవాడ వచ్చి.. తన తల్లిదండ్రుల ఆచూకీ కనుక్కోవాలంటూ సోమవారం ‘స్పందన’లో విజ్ఞప్తి చేసింది..  12 గంటల వ్యవధిలోనే పోలీసులు ఆమె తల్లిదండ్రుల ఆచూకీ కనుగొన్నారు.. ఏళ్ల తరబడి నిరీక్షిస్తున్న ఆ తండ్రి చెంతకు ఆమెను చేర్చారు..

సాక్షి, అమరావతిబ్యూరో : మంగళగిరి లక్ష్మీనారాయణ.. గుడివాడ నియోజకవర్గంలోని గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డు. 2007 మార్చి 12న మతిస్థిమితం లేని ఆయన కుమార్తె ఆదిలక్ష్మి(13) తప్పిపోయింది. చుట్టుపక్కల వెతికినా, బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా ఫలితం లేకపోవడంతో మార్చి 19న గుడ్లవల్లేరు పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేశారు. విధులు నిర్వర్తిస్తూనే కుమార్తె కోసం వెతుకుతూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో విధులకు సరిగా రావడం లేదంటూ ఉన్నతాధికారుల మందలింపులు పెరగడం, తన బిడ్డ కేసును పోలీసులు సైతం సరిగా దర్యాప్తు చేయడం లేదన్న ఆవేదనతో ఉద్యోగాన్ని వదిలేశారు. అప్పటి నుంచి ఎప్పటికైనా తన కుమార్తె ఇంటికి రాకపోతుందా.. అనుకుంటూ నిరీక్షిస్తున్నారు. 

‘స్పందన’కు చేతులెత్తి మొక్కుతున్నా.. 
తప్పిపోయిన నన్ను ఓ మహిళ చెన్నైకు తీసుకెళ్లి రూ.500కు మధురిక అనే మహిళకు అప్పగించింది. ఆమె నన్ను కన్న కూతురులానే పెంచి పెళ్లి చేసింది. కొన్నాళ్లకు నా భర్త చనిపోయాడు. తర్వాత నన్ను కాంచీవనం పెళ్లి చేసుకున్నాడు. మేం ఇద్దరం మధురైలో ఉంటున్నాం. కొన్నాళ్లుగా నాకు నా తల్లిదండ్రులు గుర్తుకొస్తున్నారు. ఇదే విషయాన్ని నా భర్తకు చెప్పా. నా బాధను అర్థంచేసుకున్న ఆయన నన్ను విజయవాడ తీసుకొచ్చారు. సోమవారం ‘స్పందన’లో ఫిర్యాదు చేశా. ఇంత త్వరగా నా తల్లిదండ్రులను కలుస్తానని కలలో కూడా ఊహించలేదు. 12 ఏళ్ల తర్వాత అమ్మనాన్నలను నాతో కలిపిన ‘స్పందన’కు చేతులెత్తి మొక్కుతున్నా..     
– ఆదిలక్ష్మి 

నా తల్లిదండ్రులుఎక్కడ? 
ఇదిలా ఉండగా.. సోమవారం ఆదిలక్ష్మి.. తన తల్లిదండ్రుల ఆచూకీ కనిపెట్టాలంటూ ‘స్పందన’లో విజయవాడ నగర పోలీస్‌ కమిషనర్‌ ద్వారకా తిరుమలరావుకు విజ్ఞప్తిచేసింది. ఆమె విజ్ఞప్తిని మీడియా విస్తృత ప్రచారం చేసింది ఆ కథనాలు చూసిన లక్ష్మీనారాయణ, తల్లి చెంచమ్మ తమ కుమార్తెను గుర్తుపట్టారు. వెంటనే సోమవారం నగర పోలీసులకు సమాచారం అందజేశారు. ఆమె తన కూతురే అంటూ భావోద్వేగంతో కన్నీళ్లపర్యంతమయ్యారు.

వెంటనే తాను 2007లో ఫిర్యాదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ కాపీని, పత్రికల్లో వచ్చిన కథనాల క్లిప్పింగులను, తమ కుమార్తె గాయాలకు సంబంధించిన మచ్చలు తదితరాలను పోలీసులకు వివరించారు. ఆయన చెప్పిన గుర్తులు పోలి ఉండడంతో ఆదిలక్ష్మి అతని కుమార్తేనని పోలీసులు నిర్ధారణకొచ్చి.. ఉన్నతాధికారులకు వివరించారు. చట్టపరంగా అన్ని చర్యలూ పూర్తిచేసి కమిషనరేట్‌లోని సమావేశ మందిరంలో  మంగళవారం సీపీ ద్వారకా తిరుమలరావు ఆదిలక్ష్మిని ఆమె తల్లిదండ్రుల చెంతకు చేర్చారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement