
సాక్షి, విజయవాడ: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాలతో లాక్‌డౌన్‌లో సీజ్ చేసిన వాహనాలను తిరిగి ఇచ్చే ప్రక్రియను పోలీసులు ప్రారంభించారు. ఈ ప్రక్రియను సీపీ ద్వారకా తిరుమలరావు ఆదివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. భౌతిక దూరం పాటించాలని వాహనదారులకు సీపీ సూచించారు. సీఎం వైఎస్ జగన్ నిర్ణయం పట్ల వాహనదారుల హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. పంపిణీ ప్రక్రియలో విధులు నిర్వహించే పోలీసులను పీపీఈ కిట్లు ధరించాలని ఆయన కోరారు.
(సీఎం వైఎస్ జగన్‌కు చిరంజీవి కృతజ్ఞతలు)
అపరాధ రుసుము లేకుండానే వాహనాలను ఇస్తున్నామని చెప్పారు. తిరిగి తప్పు చేయకుండా వాహనదారుల నుంచి బాండ్స్ రూపంలో పూచీకత్తు తీసుకుంటున్నామని వెల్లడించారు. మోటార్ వెహికల్ యాక్ట్ కింద సీజ్ చేసిన వాహనాలకు చలానా ఇచ్చి పంపుతున్నామని పేర్కొన్నారు. కంటైన్మెంట్ జోన్లలో నిబంధనలు కొనసాగుతాయని.. రాత్రి 7 గంటల నుంచి ఉదయం 7 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని సీపీ ద్వారకా తిరుమలరావు స్పష్టం చేశారు.