తిరుపతి, సాక్షి: తిరుమల లడ్డూ అంశంపై సిట్ దర్యాప్తు నిలిపివేతపై డీజీపీ ద్వారకా తిరుమలరావు స్పందించారు. దర్యాప్తును తాత్కాలికంగా మాత్రమే నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేశారాయన.
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించిన ఆయన.. మంగళవారం మీడియాతో మాట్లాడారు. ‘‘తిరుమల లడ్డూ అంశంపై.. కేసు తీవ్రత వల్లే సిట్ వేయాల్సి వచ్చింది. అయితే సుప్రీం కోర్టులో తిరుమల లడ్డూ అంశంపై దర్యాప్తు జరుగుతోంది. అందుకే దర్యాప్తును ఆపుతున్నాం. తదుపరి సుప్రీం కోర్టు ఆదేశాలు మేరకు విచారణ వుంటుంది’’ అని తెలిపారాయన.
తిరుమల లడ్డూ అంశంపై సుప్రీం కోర్టులో దాఖలైన పిటిషన్లపై నిన్న విచారణ జరిగింది. ఆ టైంలో.. సిట్ లేదంటే స్వతంత్ర దర్యాప్తు సంస్థ దర్యాప్తు చేయించే అంశంపై అభిప్రాయం తెలియజేయాలని సోలిసిటర్ జనరల్‌ను ద్విసభ్య ధర్మాసనం కోరింది. అక్టోబర్ 3వ తేదీన తదుపరి విచారణ టైంలో ఈ అంశంపై ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంది.
బ్రహ్మోత్సవాల సందర్భంగా మొదటి రోజు ముఖ్యమంత్రి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. అలాగే ఐదోవ రోజు గరుడ వాహన సేవ రోజున అదనంగా భద్రతా ఏర్పాట్లు చేస్తాం. బ్రహోత్సవాల కోసం నాలుగు వేల మంది పోలీస్ సిబ్బందిని మోహరిస్తున్నాం. సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తాం.
.. మొబైల్ డివైజ్ ఫింగర్ ప్రింట్ ఏర్పాట్లతో అనుమానితుల్ని గుర్తిస్తాం. 2,700 సీసీ కెమరాలతో పాటు అదనంగా బాడీ కెమెరాలు ఏర్పాటు చేస్తాం. సోషల్ మీడియాలో తప్పులు వార్తలు ప్రచారం కాకుండా నిఘా ఉంచుతాం. గ్యాలరీలో 2 లక్షల మంది భక్తులు వీక్షించే అవకాశం వుండగా.. అదనంగా 80 వేల మంది భక్తులను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన క్యూ లైనులు ద్వారా అనుమతిస్తాం.
మొత్తం.. 2.5 లక్షల మంది ప్రయాణించేలా గరుడ సేవ రోజున ఆర్టిసి బస్సులు ఏర్పాటు చేస్తున్నాం. భక్తులు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తేనే సౌకర్యవంతంగా వుంటుంది అని అన్నారాయన. అలాగే.. దసరా సందర్భంగా ఆర్టీసీ బస్సుల్లో అదనపు ఛార్జీలు ఉండబోవనే విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment