సాక్షి, విజయవాడ : విజయవాడలో మొత్తం 16 కరోనా కేసులు నమోదయ్యాయని నగర సీపీ ద్వారకా తిరుమల రావు తెలిపారు. అందులో 11 కేసులు ఢిల్లీ నిజాముద్దీన్ సమావేశంలో పాల్గొన్నవారేనని ఆయన పేర్కొన్నారు. శుక్రవారం కరోనా పాజిటివ్ సోకి మృతిచెందిన వ్యక్తి ప్రాంతాన్ని సీపీ పరిశీలించారు. విజయవాడ కుమ్మరిపాలెం సెంటర్‌లోని ప్రజల్లో ధైర్యం నింపేందుకు కమిషనర్ ఈ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో తొలి కరోనా మరణం విజయవాడలో జరగడం బాధాకరమన్నారు. ముందుగానే హెచ్చరించామని, అయినా వారు పట్టించుకోకపోవటం, అతనికి ఇతర వ్యాధులు ఉండటంతో మరణించాడని సీపీ పేర్కొన్నారు. (కరోనాతో హిందూపూర్ వాసి మృతి)
కరోనా పాజిటివ్ తేలిన వ్యక్తుల కుటుంబ సభ్యులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నామన్నారు. ఢిల్లీ సదస్సుకు వెళ్లి వచ్చిన కుమ‍్మరిపాలెం సెంటర్‌కు చెందిన వ్యక్తితోపాటు కుటుంబ సభ్యులకు పాజిటివ్ వచ్చిందని తెలిపారు. వ్యక్తి తండ్రి చనిపోయారన్నారు. తాను ఎవరిని తప్పు పట్టడం లేదని, ఢిల్లీ సదస్సుకు వెళ్లొచ్చిన వారిని కలిసిన వారు తప్పనిసరిగా వైద్య పరీక్షలు నిర్వహించుకోవాలని సూచించారు. చాలా మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటున్నారని, మిగతావారు కూడా ముదుకు రావాలని కోరారు. మీరు, మీ కుటుంబ సభ్యుల ఆరోగ్యమే తమకు ముఖ్యమని సీపీ తెలిపారు. విజయవాడ కొన్ని ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించామని, మరికొన్ని ప్రాంతాలను రెడ్‌జోన్‌గా ప్రకటించామని పేర్కొన్నారు. (కరోనా: పాజిటివ్ వ్యక్తి విందులో 1500 మంది!)
Comments
Please login to add a commentAdd a comment